ఖమ్మం, నవంబర్ 21: తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్ర జనవరి 1న ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో పర్యిటిస్తున్న ఆయన పర్యటన కరీంనగర్ జిల్లాలో పర్యటన వరకు ఖరారైంది. కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ 12న అడుగుపెట్టి తొమ్మిది రోజుల పాటు 152కిలోమీటర్లు పాదయాత్ర జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న వరంగల్ జిల్లాలో అడుగుపెట్టే ఆయన అక్కడ పర్యటించనున్నారు. అనంతరం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీకి చెందిన ప్రధాన నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, నామ నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో రూట్‌మ్యాప్ కూడా సిద్ధమైంది. పాలేరు, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా ఆయన కృష్ణాజిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ మేరకు త్వరలో పార్టీ రాష్ట్ర నాయకుడు కంభంపాటి రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో సెక్యూరిటీ కమిటీతో పాటు సర్వే కమిటీ జిల్లాలో పర్యటించనున్నది. ఇదిలా ఉండగా జిల్లాలో పర్యటించే ప్రాంతాల పరిశీలన కోసం జిల్లాలోని ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో త్వరలో సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఎక్కువ నియోజకవర్గాలు, మండలాలు కలిసి వచ్చేలా పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను తయారు చేయనున్నారు. ఈ పాదయాత్ర జరిగే సమయంలో ఆయా నియోజకవర్గాల ప్రధాన నాయకులంతా పాల్గొనే అవకాశం ఉంది. అంతేగాకుండా నూతన సంవత్సర వేడుకలను కూడా ఆయన ఖమ్మం జిల్లాలోనే జరుపుకునే అవకాశం ఉండటంతో అందుకు కూడా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
23 కోట్లతో
100 చెరువుల అభివృద్ధి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, నవంబర్ 21: జిల్లాలోని 100 చెరువులను 23 కోట్లతో అభివృద్ధి పరిచి, చేపల ఉత్పత్తి ఉత్పాదకతను పెంచనున్నామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. బుధవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించకొని వర్షాధారిత చిన్న నీటి వనరుల్లో చేపల ఉత్పాదకతను పెంపొందించటానికి ఉద్దేశించిన పథకాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకార సొసైటీ సంఘాల సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో అధికంగా చెరువులు, కుంటలు ఉన్నాయని, ప్రస్తుతం వీటి ద్వారా ఆశించిన మేరకు చేపల ఉత్పత్తి జరగటం లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన లేమి దీనికి ప్రధాన కారణంగా ఉందన్నారు. దీనిని అధిగమించేందుకు మత్స్యకార సొసైటీ సంఘాల సభ్యులకు వృత్తిపర శిక్షణను ఇచ్చి అధిక ఉత్పత్తిని సాధించేందుకు ఈ పథకం ఉపకరిస్తుందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ చెరువుల్లో విడిచిన చేప పిల్లలు నిర్దేశించిన మేర బరువు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. చేప పిల్లలకు మక్ తినే ప్రత్యేక ఆహారం అందించేందుకు నిధులను వెచ్చించామని, అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఫామాయిల్ ఫ్యాక్టరీ నుంచి మక్‌ను కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లా మహిళా సమాఖ్యకు లక్ష రూపాయల చెక్కును అందించి ఆ దిశగా సత్వర చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. మార్చి తర్వాత జిల్లాలో గుర్తించిన 100చెరువులను అభివృద్ధి చేయటంతో పాటు ఆక్రమణకు గురైన చెరువులను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసకుంటామన్నారు. మత్స్య సహకార సంఘాల సొసైటీలు సమన్వయంతో వ్యవహరించి, పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక చేయూతను పొందాలన్నారు. పట్టణాల్లో చేపలకు అధిక ధర పలికే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపలను కొంత మేరకు పట్టణ మార్కెట్‌ల్లో విక్రయించాలన్నారు. అందుకు అవసరమైన రవాణా సౌకర్యం, ఐస్‌బాక్స్‌లు కూడా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాధార చిన్ననీటి వనరుల్లో చేపల ఉత్పత్తి ఉత్పాదకతను పెంచేందుకు ఉద్దేశించిన పథకంలో 2012-13లో మొదటి దశ, 2013-14లో రెండవ దశ విడతలుగా ఈ పథకం అమలవుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా పథకం అమలవుతుందన్నారు. అనంతరం మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు, సాంకేతిక అధికారులతో మాట్లాడారు. అధికారులకు త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన షెడ్యుల్‌ను అందిస్తామని, దాని ప్రకారం నిర్దేశించిన చెరువులను సందర్శించి వౌళిక వసతులను గుర్తించి నివేదికలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బాలరాజు, లీడ్ బ్యాంక్ అధికారి ప్రసాద్, బిసి కార్పొరేషన్ కార్వనిర్వాహక సంచాలకులు నర్సింహాస్వామి, కినె్నర జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.
అక్క కొడుకును రక్షించుకునే యత్నంలో
అన్నను కొట్టిచంపిన చెల్లి
కూనవరం, నవంబర్ 21: మండల పరిధిలోని పెదార్కూరు గ్రామంలో నకిరికంటి నారాయణ (55) అనే వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. భద్రాచలం సిఐ రామోజీ రమేష్ కథనం ప్రకారం.....నారాయణ బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చి ఆ మద్యం మత్తులో అతడి భార్యను చితకబాదుతుండగా ఈ తరుణంలో పక్క ఇంట్లో ఉన్న అతడి చెల్లెలు సావిత్రి అన్నను వారించేందుకు వెళ్లింది. దీంతో ఆమెను సైతం చితకబాదుతుండటంతో అదే సమయంలో అక్కడికి వచ్చిన నారాయణ మేనల్లుడు పుల్లారావు అతడిని ఆపేందుకు ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉన్న నారాయణ మేనల్లుడిపై కత్తితో దాడి చేసి రెండు పోట్లు పొడిచాడు. ఈ క్రమంలో అక్క కొడుకు అయిన పుల్లారావును కాపాడేందుకు సావిత్రి పక్కనే ఉన్న రోకలిబండతో నారాయణ తలపై మోదింది. దీంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే పుల్లారావును కూనవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం పుల్లారావు పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం నారాయణ మృతదేహాన్ని పోలీసులు కూనవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
సింగరేణి ఆర్‌సిహెచ్‌పిలో ఘోర అగ్నిప్రమాదం
రుద్రంపూర్, నవంబర్ 21: కొత్తగూడెం ఏరియా పరిధిలోని సింగరేణి ఆర్‌సిహెచ్‌పిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భూగర్భగని నుండి ఆర్‌సిహెచ్‌పికి బొగ్గురవాణ చేసే 110మీటర్ల కనే్వయర్ బెల్ట్‌తో పాటు కొన్ని పరికరాలు దగ్ధమయ్యాయి.కనే్వయర్ బెల్ట్ రోలర్స్ నిలిచిపోవడంతో రోలర్స్‌కు, బెల్ట్‌కు మధ్య రాపిడి జరిగి మంటలు వచ్చాయి. వీటిని అదుపుచేయని కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో షిఫ్ట్ మారుతున్న కారణంగా ఆస్థలంలో సిబ్బంది ఏవరూ లేకపోవడం వలన ప్రాణనష్టం సంభవించలేదు. అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండుగంటలు మంటలను ఆర్పేందుకు కృషిచేసి సఫలీకృతమయ్యారు. దగ్ధమైన కనే్వయర్‌బెల్ట్, పరికరాలు విలువ సుమారు రూ 50లక్షల వరకు ఉంటుందని అంచనా. కనే్వయర్ బెల్ట్ దగ్ధమవ్వడంతో లారీల ద్వారా రవాణ కావాల్సిన వేలాది టన్నుల బొగ్గురవాణకు అంతరాయం ఏర్పడింది. ఇంతప్రమాదం జరిగినప్పటికి అధికారులు మాత్రం నష్టం విలువను గోప్యంగా ఉంచడం విశేషం.
ఆ అమ్మకు పెన్షన్ 60 రూపాయలే...!
ఇల్లెందు, నవంబర్ 21: వయస్సు 70ఏళ్ళు... ఆమెపేరు బాణోతు జినీ భర్త సింగరేణిలో పని చేసి అనారోగ్యంతో కాలం చేశాడు. ఆమెకు ప్రస్తుతం వస్తున్న నెలవారి పెన్షన్ 60రూపాయలే... భర్త లేక కోడలుతో పాటు కుటుంబ సభ్యులు ఆదరణ కరవు కావటంతో వచ్చేపెన్షనే ఆమెకు దిక్కుగా మారింది. ఇలాంటి బాధిత అమ్మలు సింగరేణి వ్యాప్తంగా ఎందరో ఉన్నారు... దక్షిణ భారతదేశంలోనే ఖ్యాతిగడించిన సింగరేణి కాలరీస్ సంస్థలో పని చేసి పదవీ విరమణ అనంతరం కాలం చేసిన మాజీ కార్మికుల భార్యలకు యజమాన్యం ఇస్తున్న పెన్షన్ నామమాత్రం కావటంతో ఆయా మహిళలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించిన సింగరేణి బొగ్గుగనుల్లో 1970-80వ సంవత్సరాల మధ్యకాలంలో శ్రమశక్తిని ధారపోసి మాజీ కార్మికులు మృతి చెందిన అనంతరం వారి భార్యలకు ఆనాటి వేతనాల మేరకు యజమాన్యం చెల్లిస్తున్న పెన్షన్ 60నుంచి 350రూపాయలు కావటం గమనార్హం. గత ఐదేళ్ల నుంచి పదవీ విరమణ చేసిన అనంతరం మరణించిన కార్మికుల భార్యలకు 400నుంచి 700రూపాయల వరకు పెన్షన్ చెల్లిస్తున్నారు. సంస్థలో విధులు ప్రారంభించిన కాలానికి అనుగుణంగా వేతనాలకు సంబంధించి పెన్షన్లు అందుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అనేక మంది వితంతు మహిళలకు నెలవారిగా 60రూపాయలు పెన్షన్ చెల్లిస్తున్నారు. ఆ డబ్బులను పోస్ట్ఫాస్ ద్వారా తీసుకునేందుకు వారికి రానుబోను ఆటోచార్జీలు 30రూపాయలు ఖర్చవుతుంటాయి. మిగిలేది 30రూపాయలే కావటంతో వారి వేదన అంతా ఇంతా కాదు. 60నుంచి 350రూపాయల వరకుపెన్షన్లు తీసుకుంటున్న మహిళలు 75శాతం వరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్నారు. పెన్షన్లు 750 తీసుకునే వారు 25శాతం ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా 3వేల మందికిపైగా నామమాత్రపు పెన్షన్‌ను యజమాన్యం అందిస్తోంది. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో 800మందికిపైగా మహిళలు పెన్షన్లు తీసుకుంటున్నారు. 40ఏళ్ళ పాటు సింగరేణి సంస్థకు సేవలు అందించటంతో పాటు బొగ్గు ఉత్పత్తికి తమ భర్తలు చేసినకృషిని సైతం యజమాన్యం గుర్తించలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో తమ పెన్షన్లు పెంచాలని మొరపెట్టుకోవటంతో పాటు గతంలో పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. 60రూపాయల పెన్షన్‌తో తాము ఏలా బ్రతకగలమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా పెన్షన్లు బ్యాంక్ ద్వారా ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టిందని, తాము బ్రతికి ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాలను సింగరేణి సిఎంపిఎఫ్ కార్యాలయంలో అందించాలని ఆదేశించినప్పటికీ అనేక మందికి పెన్షన్లు అందటం లేదన్నారు. అధికారులు ధృవీకరణ పత్రాలను చూడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల పెన్షన్లు అందటం లేదన్నారు. పెన్షన్లు పెంపుదల చేయటంతో పాటు నెల నెలా అందించాలని, లేనిపక్షంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లుగా బాధిత మహిళలు పేర్కొంటున్నారు. సిరులు పండించిన సింగరేణి సంస్థకు సేవలు అందించిన చీకటి సూర్యులైన కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని యజమాన్యం పేర్కొంటున్నప్పటికీ ఆచరణలో లేకపోవటం పట్ల ఆయా కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా
196 స్పెషల్ హెల్త్
క్యాంపులు
ఖానాపురం హవేలి, నవంబర్ 21: ఈ నెల 23 నుండి 27 వరకు జిల్లా వ్యాప్తంగా 17వైద్య ఆరోగ్య శాఖ క్లస్టర్లలో 196 స్పెషల్ హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులను అరికట్టేందుకు 17 క్లస్టర్లలో ప్రతి రోజు ఒక్కొక్క గ్రామంలో క్యాంపులు జరపనున్నట్లు తెలిపారు. క్లస్టర్లుగా వారిగా గ్రామాల సంఖ్యను బట్టి ప్రతిరోజు 17 క్యాంపులు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా మలేరియా విభాగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, ఐసిడిఎస్, మున్సిపాలిటీలను ఈ ప్రత్యేక క్యాంపుల్లో భాగస్వాములు కావాలన్నారు. 2011, 12వ సంవత్సరాల్లో మలేరియా, డెంగ్యూ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇతర విషజ్వరాల వ్యాప్తికి గల కారణాలు, నివారణ మార్గాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిభిరాలలో స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక యూనిట్ల యజమానలు పాల్గొనాలని సూచించారు. పేద ప్రజలు స్పెషల్ హెల్త్ క్యాంపులను సద్వినియోగపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. హెల్త్ క్యాంపుల విజయవంతం చేయటానికి మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ సిబ్బంది భాగస్వాములు కావాలని ఆదేశించారు.
నాటుసారా స్థావరంపై మహిళల దాడులు
మణుగూరు, నవంబర్ 21: మణుగూరులోని ఎగ్గడిగూడెం అటవీ ప్రాంతంలో అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం నాటుసారా స్థావరాన్ని ధ్వంసం చేశారు. అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఈ మహిళా మండలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాటుసారా స్థావరంపై దాడి చేశారు. మణుగూరు మండలంలో ఇక నాటుసారా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడా నాటుసారా అమ్మకాలు జరగకుండా నిలువరిస్తామన్నారు.
ఇద్దరు నకిలీ నక్సలైట్ల అరెస్ట్
బయ్యారం, నవంబర్ 21: నక్సలైట్ల పేరుతో నకిలీలఅవతారం ఎత్తి వ్యాపారస్తుల వద్ద చందాల వసూళ్ళకు పాల్పడుతున్న నకిలీలను బయ్యారం ఎస్‌ఐ శ్రీనివాస్ బుధవారం అరెస్ట్ చేశారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మూతి ముత్తక్క, అమె కుమారుడు శేఖర్‌లు కలిసి గత కొద్దిరోజుల నుండి మండలంలో వ్యాపారస్థులను చందాల కోసం బెదిరిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు
చర్లలో మావోయిస్టు అరెస్టు
చర్ల, నవంబర్ 21: చర్ల మండలంలో ఓ మావోయిస్టును అరెస్టు చేసినట్లు వెంకటాపురం సిఐ కెఆర్‌కె ప్రసాదరావు బుధవారం తెలిపారు. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడుకు చెందిన కుంజా నాగయ్య శబరి ఏరియా కమిటీలో మావోయిస్టుగా పని చేస్తున్నాడని చెప్పారు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా దుమ్ముగూడెం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కన్పించిన నాగయ్యను పట్టుకుని విచారించగా మావోయిస్టుగా తేలిందన్నారు. దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
పాము కాటుకు గిరిజన మహిళ మృతి
చింతూరు, నవంబర్ 21: మండల పరిధిలోని వంకగూడెం గ్రామంలో బుధవారం ఓ గిరిజన మహిళ పాము కాటుకు గురై మృతి చెందింది. వంకగూడెంకు చెందిన సోడె కన్నమ్మ (32) తన ఇంటి పక్కనే ఉన్న పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైంది. దీంతో కన్నమ్మ కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకుని 108కి సమాచారం అందించారు. 108 సంఘటనా స్థలానికి చేరుకునేలోపే కన్నమ్మ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. అకస్మాత్తుగా పాము కాటుతో కన్నమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు నెలకొన్నాయి.
వాటర్‌ట్యాంకు కిందపడి
బాలుడి మృతి
రుద్రంపూర్, నవంబర్ 21: వాటర్‌ట్యాంక్ కింద పడి బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం జికెఓసి కార్మికుల కాలనీలో చోటుచేసుకుంది. స్థానిక జికెఓసిలో దాసరి భీంరావు వలస కార్మికునిగా పనిచేస్తున్నాడు. విధి నిర్వాహణలో భాగంగా ఆయన బుధవారం జికెఓసికి వెళ్ళాడు. అయితే ఈకాలనీకి వాటర్‌ట్యాంక్ ద్వారా మంచినీటిని అందజేస్తున్నారు. ఈక్రమంలో కాలనీలో నీళ్ళను పంపిణీ చేసేందుకు వచ్చిన వాటర్ ట్యాంక్ కిందకు భీంరావుకుమారుడు చింటు (15మాసాలు) ఆడుకుంటూ వచ్చాడు. ఇది గమనించని డ్రైవర్ ట్యాంకర్‌ను వెనక్కి మళ్ళించడంతో బాలుడికి తీవ్రగాయాలై మృతిచెందాడు.