ఒంగోలు, నవంబర్ 21: ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేసులో ప్రముఖ నేపథ్యగాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో శ్రీనివాస్ మంతనాలు సాగించినట్లు సమాచారం. ఈసందర్భంగా జిల్లా పార్టీ నేతలతో మాట్లాడాలని చంద్రబాబు శ్రీనివాస్‌కు సూచించినట్లు తెలిసింది. దీంతో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో శ్రీనివాస్ మాట్లాడినట్లు సమాచారం. శ్రీనివాస్ ఖమ్మం జిల్లాకు చెందిన వారైనప్పటికీ జిల్లా నేతలతో సంబంధాలు ఉన్నాయి. శ్రీనివాస్ ఒక బలమైన బిసి సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో ఆ వర్గం ఓట్లను రాబట్టేందుకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సిపిఐతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన ఓట్లు కూడా ఆయనకు వచ్చే అవకాశాలు ఉండటంతో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా ఆయన ప్రభావం పడే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. పుట్టింది ఖమ్మం జిల్లా అయినప్పటికి బాల్యం, విద్యాభ్యాసం మొత్తం ఒంగోలులోనే సాగింది. విద్యార్థి దశలో ఆయన ఎఐఎస్‌ఎఫ్ తరపున ఉద్యమాలు నిర్వహించారు. అదేవిధంగా పాటలతో ఆయన అందరిని ఆకట్టుకున్నారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూనే సినిమా రంగం వైపు మొగ్గు చూపారు. సినిమా రంగంలో స్థిరపడటంతో ఆయనకు వందేమాతరం శ్రీనివాస్‌గా పేరు వచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఆయన పేరుప్రఖ్యాతలు గడించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన మీ కోసం పాదయాత్రకు పాటలు మొత్తం ఆయన రచించి పాడినట్లు పార్టీవర్గాల సమాచారం. ఆయన పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ప్రధానంగా మీకోసం యాత్ర, చంద్రబాబుతో వందేమాతరం శ్రీనివాస్ మమేకమయ్యారు. ఇదిలాఉండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డికి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి రంగంలో ఉండనున్నారు. మొత్తంమీద ఈసారి జరిగే పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇదిలాఉండగా పార్లమెంటుకు ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయని స్వయానా చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో వెల్లడించటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
స్వగృహ - నిస్పృహ!
కందుకూరు, నవంబర్ 21: మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కలగానే మిగిలింది. ఆశలు కల్పించిన స్వగృహపథకం నిరాశపరిచింది. ఆరంభంలో హడావుడి చేస్తున్న ప్రభుత్వం ఆ తరువాత పట్టించుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యం ఇందుకు కారణం అయింది. ఒకవైపు పెరుగుతున్న ఇంటి అద్దెల నుంచి తమకు విముక్తి కలుగుతుందని భావించిన మధ్యతరగతి వర్గాల ప్రజల ఆశలు అడియాశలైయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో నాలుగేళ్ల క్రితం ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2010 ఆగస్టు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా, నేటికి ఒంగోలు, మార్కాపురంలలో స్థల సేకరణ ఒక కొలిక్కి రాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. 2008లో చీరాలలో మాత్రం నిర్మాణ పనులు ప్రారంభం అయినప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. కందుకూరులో స్వగృహపథకానికి పెద్దగా స్పందన లేదు. లబ్ధిదారులు మాత్రం తాము చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వమని అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. సంక్రాంతి నాటికి కొన్ని ఇళ్లు నిర్మించి ఇస్తామని అధికారులు భరోసా ఇవ్వడం విశేషం. ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రాజీవ్ స్వగృహ ఆచరణలో చతికిలపడింది. మధ్యతరగతి ప్రజల కలలను కల్లలు చేసింది. డిపాజిట్లు చెల్లించి ఏళ్లు గడిచిన నేటికి పట్టించుకోకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల కోసం 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వారికి అతి తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రచారం చేసింది. అందుకోసం లబ్ధిదారుల నుంచి ధరఖాస్తులు ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల పరిధిలో నుంచి 5,243 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఒంగోలు నుంచి 4500 మంది, కందుకూరు నుంచి 98 మంది, చీరాల నుంచి 427 మంది, మార్కాపురం నుంచి 218 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో ప్రభుత్వం ఒక్కొక్కరి నుంచి మూడు వేల రూపాయలు డిపాజిట్ కట్టించుకుంది. అయితే ఆ తరువాత ఆ పథకం చతికిలపడింది. 2010 ఆగస్టు 5లోపు ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క చీరాల మినహా ఎక్కడా నిర్మాణాలు జరుగుతున్న దాఖలాలు లేవు. లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి 1.50 లక్షల రూపాయాల ఆదాయం వచ్చింది. ఈ పథకంలో ఎవరి స్థాయిలో తగ్గట్లు వారు 6లక్షల రూపాయల నుంచి 21.9 లక్షల రూపాయల ఖరీదైన ఇంటి కోసం అడ్వాన్సులు చెల్లించారు. 6లక్షల రూపాయల లోపు ఇళ్లు కావాలనుకునే వారికి 2సెంట్లు స్థలంలో సింగిల్ బెడ్‌రూమ్‌తో నివాసం, 10.35లక్షల రూపాయల ఇళ్లు కావాలనుకునే వారికి 3సెంట్లులో డబుల్‌రూమ్, 17.15లక్షల రూపాయల ఇళ్లు కావాలనుకునేవారికి నాలుగు సెంట్ల స్థలంలో డబుల్‌రూమ్ నివాసాన్ని, 21.90లక్షల రూపాయల ఇళ్లు కావాలనుకునేవారికి 6 సెంట్లలో 3బెడ్‌రూమ్‌లతో ఇళ్లు నిర్మించి ఇస్తారు. ఇలా విభజించి పధకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అయినా ఇంత వరకు ఎక్కడ అమలు జరిగిన దాఖలాలు లేవు. చీరాల మున్సిపాలిటీ పరిధిలో 427మంది ధరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఇళ్లను నిర్మించడానికి చీరాల-వేటపాలెం బైపాస్‌రోడ్డు సమీపంలో స్థలం కేటాయించారు. దీనికి లబ్థిదారులు విముఖత వ్యక్తం చేశారు. అయినా కొన్ని గృహాలను నిర్మించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
అసైన్‌మెంటు భూములు అమ్మడం..కొనడం నేరం
* రైతులకు కలెక్టర్ సూచన
మార్కాపురం/ అర్ధవీడు, నవంబర్ 21: పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్‌మెంటు భూములు అమ్మడం, కొనడం నేరమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనితా రాజేంధర్ రైతులకు సూచించారు. బుధవారం పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపులను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కాకర్ల గ్యాప్ పరిధిలోని 340 ఎకరాల అసైన్‌మెంటు భూమికి నష్టపరిహారం చెల్లించలేదని గ్రామమాజీ సర్పంచ్ ఏరువ వెంకటేశ్వరరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. పేదలకు ఇచ్చిన భూములు మీకెలా వచ్చాయంటూ కలెక్టర్ ప్రశ్నించడంతో సుమారు 50సంవత్సరాల కిందట మా పూర్వీకులు కొనుగోలు చేశారని చెప్పడంతో భూచట్టం 1970 ప్రకారం అసైన్‌మెంటు భూములు కొనుగోలు చేయడం నేరమని తెలియదా అంటూ ప్రశ్నించారు. మా తాత తండ్రులు ఎప్పుడో కొనుగోలు చేశారని, ఈ విషయంపై ప్రాజెక్టు ప్రారంభ సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఉదయలక్ష్మీ దృష్టికి తీసుకువెళ్ళగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, నేటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదని చెప్పడంతో త్వరలో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయులు కుందురు రామిరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే వచ్చే నీటి వలన నివాసగృహాలు దెబ్బతినే అవకాశం ఉందని, తమకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్‌ను కోరారు. పరిశీలించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కాకర్ల గ్రామానికి చెందిన రాజమ్మ అనే వికలాంగురాలు తాను పదవ తరగతి వరకు చదువుకున్నానని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రాజీవ్ యువకిరణం పథకంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పిక్కిలి తిరుపతమ్మ అనే వితంతువు తనకు ప్రభుత్వపరంగా పెన్షన్ ఇప్పించాలని కోరగా మంజూరు చేయాలని మార్కాపురం ఆర్డీఓ రాఘవరావును కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట మార్కాపురం, అర్ధవీడు తహశీల్దార్లు నాగూర్‌షరీఫ్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
-ళనఆ
అంతర్ రాష్ట్ర థొంగ అరెస్టు
ఒంగోలు, నవంబర్ 21: అంతర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసి 3 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ సిఐ ఐ శ్రీనివాసన్ తెలిపారు. బుధవారం స్థానిక తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిఐ శ్రీనివాసన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం దాసరిపల్లి గ్రామానికి చెందిన వడ్డే మునిరాజ్ అలియాస్ గోవర్ధనరెడ్డి, అలియాస్ విక్రమరెడ్డి అనే దొంగ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ను అని, పోలీస్ అధికారిణి అని చెబుతూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో ప్రజల వద్ద బంగారు ఆభరణాలు తనిఖీ చేయాలని మోసం చేస్తూ బంగారు ఆభరణాలను దొంగిలించాడని తెలిపారు. అదే విధంగా ఒంగోలులోని ఎన్‌జిఓ కాలనీలో ఉండే మంచా వెంకటసుబ్బమ్మ అనే వృద్ధురాలి వద్ద దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్తని ఒంటిపై ఉన్న బంగారు గాజులను దాచిపెట్టుకో అని చెప్పి వృద్ధురాలి వద్ద నాలుగు బంగారు గాజులు దొంగిలించి పారిపోయాడన్నారు. అదేవిధంగా ఒంగోలు రాజీవ్‌నగర్‌లో పోరూరి మాధవరావుకు తాను పోలీస్‌ను అని చెప్పి ఇప్పుడే ఇక్కడ దొంగతనం జరిగిందని, దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్తని ఒంటిపై ఉన్న రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్‌ను మాయం చేసి పారిపోయాడని తెలిపారు. వడ్డే మునిరాజ్ అనే దొంగను బుధవారం అరెస్టు చేసి నాలుగు బంగారు గాజులు, రెండు బంగారు గొలుసు, ఒక బ్రాస్‌లెట్‌ను స్వాధీనం చేసుకోని రిమాండ్‌కు పంపించినట్లు సిఐ శ్రీనివాసన్ తెలిపారు.
కెజిబివిల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
సిఎస్‌పురం, నవంబర్ 21: రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఉపకార్యదర్శి జివి వసంతరావు పేర్కొన్నారు. సిఎస్‌పురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. గురుకుల విద్యాలయాల సొసైటీ కింద రాష్ట్రంలో 200కెజిబివిలు ఉన్నాయని, వీటిలో దాదాపు 190విద్యాలయాలకు శాశ్వత భవనాలు ఉన్నట్లు తెలిపారు. కెజిబివిలకు ప్రస్తుతం మొదటి అంతస్తులో కూడా అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నారని తెలిపారు. ఇవి పూర్తి అయిన తరువాత అవసరం ఉన్నచోట రెండవ అంతస్తులోనూ తరగతి గదుల నిర్మాణం చేపడతారని అన్నారు. కెజిబివిలకు ప్రహరీగోడల నిర్మాణానికి కూడా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. కెజిబివిలలో విద్యార్థినులకు ఒకేషనల్ విద్య, కంప్యూటర్ విద్యను నేర్పించేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించినట్లు చెప్పారు. 10వ తరగతి విద్యార్థినులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను త్వరలో విద్యాలయాలకు పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. 10వ తరగతిలో మంచి ఫలితాలను సాధించేందుకు ప్రత్యేక స్టడీ అవర్స్ తరగతులకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒక్కొక్క విద్యార్థినికి రోజుకు 25రూపాయల చొప్పున మెస్ చార్జీలు చెల్లిస్తున్నామని, గ్యాస్ సిలిండర్ ధర పెరగడం వల్ల మెస్‌చార్జీలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. కెజిబివిలో రికార్డులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థినులతో మాట్లాడి వారి భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో కెజిబివి స్పెషల్ ఆఫీసర్ కెసి మాలకొండ్రాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
చిల్లచెట్లలో రెండురోజుల పసికందు
కనిగిరి, నవంబర్ 21: కళ్లుకూడా తెరవని రెండురోజుల పసికందు స్థానిక పెద్దచెరువు సమీపంలోని చెట్లపొదలలో బుధవారం స్థానికులు కనుగొన్నారు. పొదలలో ఏడుస్తున్న పసికందు అరుపులు విని స్థానికులు కండా రాజేష్, సిహెచ్ జాన్, గురవయ్యలు పాపవద్దకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశారు. పాపవీపుకు గాయాలు ఉండడంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా వైద్యులు సుబ్బారెడ్డి చికిత్స నిర్వహించారు. అనంతరం పాపను మాతాశిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు.
మద్యం సిండికేట్లపై
చర్యలకు ఎసిబి సిపార్సు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, నవంబర్ 21: మద్యం సిండికేట్లు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వ్యవహారంపై ఎసిబి అధికారులు సుదీర్ఘ విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. మద్యం సిండికేట్ల వ్యవహారం రాష్టస్థ్రాయిలో చర్చనీయాంశంగా మారటంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎసిబి అధికారులు పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేశారు. సిండికేట్లగా మారి వ్యాపారులు అధిక ధరలకు మద్యాన్ని విక్రయించి కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం వ్యాపారులకు కొంతమంది ఎక్సైజ్‌శాఖ సిఐలు, మండల ఎస్‌లకు అండ ఉన్నట్లు ఎసిబి అధికారులు తమ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. గతంలో మద్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయించటం, సందు, సందుకి బెల్టుషాపులను నిర్వహించి అధిక లాభాలను వ్యాపారులు పొందారు. తెల్లరేషన్ కార్డుదారులతో కూడా కొంతమంది వ్యాపారులు బినామీ వ్యాపారం సాగించినట్లు సమాచారం. అందులో చీరాలకు చెందిన ఒక సిండికేట్ వ్యాపారి, ఒంగోలుకు చెందిన మరో వ్యాపారి ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లరేషన్ కార్డుదారులతో బినామీ వ్యాపారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎసిబి అధికారులు నివేదిక సమర్పించినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలోని కొంతమంది ఎక్సైజ్ సిఐలు, మండల ఎస్‌ఐలు కూడా మద్యం వ్యాపారులకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఎసిబి అధికారులు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా గతంలో మద్యం వ్యాపారిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. ఎసిబి అధికారుల నివేదికతో కొంతమంది మద్యం సిండికేట్లు, ఎక్సైజ్ శాఖాధికారులు, మండల ఎస్‌ఐలు ఆందోళన చెందుతున్నారు. కాగా ఎసిబి అధికారుల దాడులతో ఇటీవల జరిగిన మద్యం షాపుల వేలంలో ఎక్కువశాతం మంది షాపులను పాడుకునేందుకు వెనకంజ వేశారు. దీంతో కొన్ని షాపులకు టెండర్లు దాఖలుకాని పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఎంఆర్‌పికే మద్యాన్ని విక్రయిస్తున్నారు. కాని నూతన ఎక్సైజ్ విధానంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కొంతమంది మద్యంషాపుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మామూళ్ళ మత్తులో జోగిన ఎక్సైజ్ శాఖాధికారులకు ప్రస్తుతం ఉన్న విధానం ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. మొత్తంమీద ఎసిబి అధికారుల నివేదికతో కొంతమంది బినామీ మద్యం వ్యాపారులు, తెల్లరేషన్‌కార్డుదారులు, ఎక్సైజ్ శాఖాధికారులు, ఎస్‌ఐ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.
మనగుడి కార్యక్రమంలో గోమాతలకు పూజలు
మార్కాపురం, నవంబర్ 21: మనగుడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శ్రీ భూదేవి శ్రీదేవి సహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో, మార్కండేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో చెన్నకేశవస్వామి ట్రస్టుబోర్డు చైర్మన్ రామడుగు కోటేశ్వరరావు, ఆలయ మేనేజర్ ఎవి నారాయణరెడ్డి, టిటిడి నిర్వాహకులు విశ్వనాథరెడ్డి, ఆలయ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొనగా ఆలయ ప్రధానపూజారి శ్రీపతి కేశవచార్యులు ఆధ్వర్యంలో ఆలయం చుట్టు గోమాతను ప్రదక్షణలు చేయించి పూజలు నిర్వహించారు.
వైభవంగా గోపూజ
మార్కాపురం, నవంబర్ 21: గోపాష్టమి సందర్భంగా మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులోగల శ్రీ లక్ష్మీపద్మావతి సహిత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం వారు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా ఈకార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి కనకచార్యులు, శ్రీనివాస ఆనందచార్యులు తెలిపారు. ఈకార్యక్రమంలో దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆర్ బాలకోటేశ్వరరావు, అధ్యక్షులు చక్కా మాలకొండనరసింహారావు, కార్యదర్శి గ్రంథిశిల రామలక్ష్మయ్య, కార్యనిర్వాహణ కార్యదర్శి ఆర్‌కెజె నరసింహం, కోశాధికారి ఆర్ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు కె చిన్నవెంకటేశ్వర్లు పాల్గొనగా టిటిడి డివిజన్ నిర్వాహకులు దశరథరామిరెడ్డి, విశ్వనాథ, మేనేజర్ బి నరసింహులు, మహిళ మండలి గౌరవ అధ్యక్షులు డి కమలాదేవితోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
మంత్రి మోపిదేవిని వెంటనే విడుదల చేయాలి
బిసి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
ఒంగోలు, నవంబర్ 21: మత్స్యకార వర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను వెంటనే విడుదల చేయాలని బిసి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మోపిదేవిని జైలులో ఉంచడాన్ని నిరసిస్తూ మత్స్యకార సంఘాలు, బిసి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మత్స్యకార, బిసి సంఘాల నాయకులు మాట్లాడుతూ మోపిదేవిపై కొందరు కుట్ర పన్ని జైలుకు పంపించారని, ఇది అన్యాయమని అన్నారు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులపై విచారణ జరుగుతున్న సమయంలో కేవలం మోపిదేవిని మాత్రమే అరెస్టు చేయడం అన్యాయమన్నారు. వాన్‌పిక్ భూముల విషయంలో నిర్ణయాలన్ని మంత్రివర్గం ఆమోదించనవి కావని ఏ మంత్రి ఆయినా చెప్పారా అని నిలదీశారు. మంత్రివర్గ నిర్ణయాలకు మంత్రి మండలి సమష్టి బాధ్యత వహించాలని రాజ్యాంగం చెబుతోందని వారు పేర్కొన్నారు. అగ్రకుల రాజకీయ కుబేరులను వదిలి మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవిని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మంత్రి మోపిదేవిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మత్స్యకార చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ గొల్లపోతు ఏడుకొండలు, మత్స్యకార సంఘం సీనియర్ నాయకుల కొన్నపూడి రామలింగం, వాయల మోహన్‌రావు, మత్స్యకార హక్కుల రక్షణ కమిటి జిల్లా అధ్యక్షులు సింగోతు రాములు, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దన్నారపు మస్తాన్‌రావు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బొర్రా పూర్ణచంద్రరావు, రజకాభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు గుర్రం సుబ్బన్న, పట్టణ బిజెపి అధ్యక్షుల యానం చినయోగయ్య యాదవ్, పట్టణ బిసి అధ్యక్షులు మిరియం అంజిబాబు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ధరణికోట లక్ష్మీనారాయణ, ముస్లీం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆయూబ్ తదితర నాయకులు పాల్గొని మాట్లాడారు.
విదేశీ పెట్టుబడులకు నిరసనగా బిజెపి ధర్నా
ఒంగోలు, నవంబర్ 21: చిరు వ్యాపారుల పొట్టకొట్టే విదేశీ పెట్టుబడులకు నిరసనగా బిజెపి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గోలి నాగేశ్వరరావు, బిజెవైఎం రాష్ట్ర సహాయ కార్యవర్గ సభ్యులు ఎస్ చంద్రశేఖర్, బిజెపి ఒంగోలు నగర అధ్యక్షులు యానం చినయోగయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ సామాన్య కుటుంబానికి పూట గడవడమే గగనమయ్యే ఈరోజుల్లో అమెరికా మార్కెట్ దుకాణాలలో సరుకులు కొనుగోలు చేయడం బాధాకరమన్నారు. విదేశీ మల్టీబ్రాండ్ సంస్థలు రిటైల్ రంగంలో పాదం మోపితే ఇక్కడి చిల్లర దుకాణ వ్యాపారులు నష్టపోతారన్నారు. చిన్న వ్యాపార రంగం మీద ఆధారపడే పేద బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా విదేశీ పెట్టుబడులను తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా నాయకులు రావి వెంకటేశ్వర్లు, నాయకులు పావులూరి వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.