Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి ఎమ్మెల్యే జోగి పరామర్శ

$
0
0

బంటుమిల్లి, నవంబర్ 21: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరం ఎన్‌ఆర్‌ఐ కుటుంబ సభ్యులను బుధవారం పెడన శాసనసభ్యులు జోగి రమేష్ పరామర్శించారు. మల్లేశ్వరం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ గొర్ల వీరాంజనేయులు, భార్య, ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బుధవారం ఎమ్మెల్యే జోగి రమేష్ మల్లేశ్వరంలోని వీరాంజనేయులు తండ్రి వెంకటేశ్వరరావును పరామర్శించి ఓదార్చారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వీరాంజనేయులు స్వశక్తితో ఎదిగి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళడం బాధాకరమన్నారు. ఆయన భార్య లలితాదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తపర్చారు. లలితాదేవి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. తానా అధ్యక్షునితో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా ఇక్కడకు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ దాసరి రవిసుందర్, మాజీ సర్పంచ్ ఆకునూరి శ్యాంసన్, సాయిరామ్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

మిర్చి వేలాన్ని అడ్డుకున్న రైతులు
వత్సవాయి, నవంబర్ 21: స్థానిక ఒక ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్‌లో చిల్లకల్లు ఎస్‌బిఐ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్న వేలంపాటలను రైతులు అడ్డుకోవడంతో దాదాపు నాలుగైదు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ఏడాది దాదాపు 160మంది రైతులు కోల్డ్‌స్టోరేజ్‌లలో మిర్చి నిల్వలు ఉంచి రూ.2కోట్ల 50లక్షలు రుణాలుగా పొందారు. కాగా ఈ రుణాలు చెల్లించకపోవడంతో చిల్లకల్లు ఎస్‌బిఐ శాఖ అధికారులు బుధవారం వేలం నిర్వహించేందుకు కోల్డ్‌స్టోరేజ్ వద్దకు వచ్చారు. దాంతో రైతులు అక్కడకు చేరుకొని వేలం నిలుపుదల చేయాలని కోరారు. కాగా పోలీస్ బందోబస్తు నడుమ సాయంత్రం వరకూ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి, పొదిలి లక్ష్మీనారాయణ, చిరుమామిళ్ల హనుమంతరావు, వడ్లమూడి రాంబాబు, పెద్ది రామారావు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి కబాడీ విజేత కూడూరు జట్టు
పెడన, నవంబర్ 21: మండల పరిధిలోని కొంకేపూడి గ్రామంలో నిర్వహించిన రాష్టస్థ్రాయి కబాడీ పోటీలు బుధవారంతో ముగిశాయి. సుమారు 50జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రథమ స్థానాన్ని కూడూరు జట్టు, ద్వితీయ స్థానాన్ని దక్షిణ తెలుగుపాలెం, తృతీయ స్థానాన్ని నందిగామ, చతుర్థ స్థానాన్ని లంకలకలవగుంట జట్లు సాధించాయి. ప్రథమ బహుమతిగా 12వేలు, ద్వితీయ బహుమతిగా 8వేలు, తృతీయ బహుమతిగా 6వేలు, చతుర్థ బహుమతిగా 4వేల రూపాయల నగదును టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు చేతుల మీదుగా విజేతలకు అందచేశారు. ఈసందర్భంగా విజేతలు ట్రాక్టర్లపై ఊరేగుతూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రాజరాజేశ్వరి కబాడీ పోటీల నిర్వాహకులు శలపాటి ప్రసాద్, దావు భైరవలింగం, తదితరులు పాల్గొన్నారు.

రైతన్నలను వణికిస్తున్న వరుణుడు
తోట్లవల్లూరు/ కూచిపూడి, నవంబర్ 21: వరికోతల ఆరంభలోనే వరుణుడు రైతన్నలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. బుధవారం ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నం వానజల్లులు కురవటంతో కోతలు కోసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మేఘాలు కమ్ముకొచ్చి పెద్ద వాన కురిసేలా వాతావరణం ఏర్పడటంతో కోత కోసిన వరిపనలను వడివడిగా కుప్పలు వేయించారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో మబ్బులు బాగా పట్టి ఒక మోస్తారు వర్షం పడింది. ఆరుగాలం వ్యవప్రయాసలకోర్చి పండించిన వరిపంట ఎక్కడ వర్షార్పణం అవుతుందోనని రైతులు కలవరం చెందారు. మూడురోజుల నుంచి వేసిన వరికుప్పలు వానకు తడవకుండా పరదాలను కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం వరికోతలను రైతులు నిలిపివేశారు. అల్పపీడనం ప్రభావంతో వచ్చే రెండురోజుల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేయటంతో వరికోతలు కోయటానికి భయపడుతున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ముప్పు తప్పిందని ఊపిరిపీల్చుకున్న అన్నదాతలకు అల్పపీడనం ఆందోళన కలిగిస్తోంది. 20రోజులు వాతావరణం అనుకూలిస్తే వరికోతలను పూర్తిచేసి కుప్పలు వేయవచ్చని రైతులు చెపుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి విశాఖపట్నం సమీపంలో కేంద్రీకృతమైందన్న వాతావరణ శాస్తవ్రేత్తల హెచ్చరికలు రైతన్నలకు వణుకు పుట్టించాయి. నీలం తుఫాన్ ప్రభావం నుండి కోలుకున్న వరిపంట కోతలు కోసేందుకు సిద్ధపడిన నేపథ్యంలో మళ్లీ తుఫాన్ హెచ్చరికలతో వరిపంటపై ఆశలు వదులుకుని బిక్కుబిక్కుమంటున్న నేపథ్యంలో తుఫాన్ ప్రభావం తగ్గిందన్న సమాచారం వెలువడటంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఉత్సాహంతో వరికోతలు తిరిగి ప్రారంభించారు. తుఫాన్ హెచ్చరికలు వెలువడక ముందే కోసిన వరిపనలు రక్షించుకునేందుకు బుధవారం రైతులు కుప్పలు వేశారు. మండలంలోని మొవ్వ, భట్లపెనుమర్రు, కాజ తదితర గ్రామాల్లో ఆకాశం మేఘావృతమవటం, అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న శాస్తవ్రేత్తల హెచ్చరికలను గుర్తించి కుప్పలు వేశారు. దేవునిపై భారం వేసి కోతలు మాత్రం కోస్తున్నారు.

సకల దేవతా స్వరూపిణి గోవు
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 21: గోవు సకల దేవతా స్వరూపిణి అని బందరు డివిజన్ ‘మనగుడి’ ఇన్‌చార్జ్, టిటిడి సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు. గోపాష్ఠమి పర్వదినం సందర్భంగా స్థానిక వాసుదేవా గోశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. గోవులో 33కోట్ల దేవతలు ఉంటారని, గోవును పూజిస్తే 33కోట్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుందన్నారు. టిటిడి ధర్మప్రచార పరిషత్ సభ్యులు నరసింహాచార్యులు మాట్లాడుతూ కామధేనువు కోరికలు తీర్చే కల్పవల్లి అన్నారు. గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కృష్ణ భగవానుడు గోవులను రక్షించిన రోజే గోపాష్ఠమి అని తెలిపారు. ఇంద్రుడిపై రాళ్ళవర్షం కురిపించినప్పుడు చిటికెన వేలుపై గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోవులను కాపాడిన రోజన్నారు. ఈసందర్భంగా గోవులను అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణ చేశారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు చేవూరి రమేష్, ఎబివిపి నాయకులు బూరగడ్డ సుజయ్, ఉడత్తు శ్రీనివాసరావు, బిజెపి నాయకులు సత్యనారాయణ సింగ్, పరింకాయల విజయ్, టిడిపి నాయకులు వాలిశెట్టి వెంకటేశ్వరరావు, గంజాల శ్రీనివాస్, శరాబంది రాజు, మల్లవోలు శ్రీనివాస్ పాల్గొన్నారు.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
అవనిగడ్డ, నవంబర్ 21: దివిసీమలో భూగర్భ వనరులు అక్రమార్కులకు సిరులు కురిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగిపోతున్నాయి. కోర్టు ఆదేశాలు నిలువునా అపహాస్యం పాలవుతున్నాయి. రెవెన్యూ, మైనింగ్, కరకట్ట విభాగం అధికారుల జేబులు నిండుతున్నాయి. రాజకీయ అండదండలతో కొందరు ప్రజాప్రతినిధులను లక్షాధికారులను చేస్తున్నాయి. కాగా పులిగడ్డ వద్ద కృష్ణానది తీరంలో బుధవారం అక్రమంగా తరలిపోతున్న ఇసుక ట్రాక్టర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు ట్రాక్టర్ యజమానికి అనధికారికంగా ఇచ్చిన అనుమతి కారణంగానే ఇసుకను తరలిస్తుండగా గుర్తుతెలియని కొందరు బందరు ఆర్డీవోకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆయన స్పందించి మోపిదేవి తహశీల్దార్ నాయిక్‌ను విచారణ నిమిత్తం పంపారు. అప్పటికే రెండు ట్రక్కుల్లో అక్రమంగా ఇసుక తరలి వెళ్ళగా మూడో ట్రక్కు తరలిస్తుండగా నాయిక్ పట్టుకున్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో అధికారికంగా ఇసుక తరలింపు లేకపోయినా తెరచాటున యథేచ్ఛగా సాగిపోతోంది. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ అధికారుల అండదండలతో దళారులు ఇసుక రవాణా చేస్తున్నారనడానికి ఈ సంఘటనను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అవినీతి మత్తులోని అధికారులు ఈ దందాను గుడ్లప్పగించి చోద్యంగా చూస్తున్నారు. మొక్కుబడిగా కేసులు నమోదు చేయటం తప్పితే ఏవిధమైన ప్రయోజనం ఉండటం లేదు. తప్పదన్నట్లు వారం రోజులకు ఒకసారి ఒకటి రెండు ట్రాక్టర్లను పట్టుకొచ్చి తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ముక్కోటి దేవతలకు ప్రతిరూపం గోమాత
కూచిపూడి, నవంబర్ 21: ముక్కోటి దేవతల ప్రతిరూపమైన గోమాత సేవ ద్వారా ముక్తిని పొందాలని ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ సూచన మేరకు నిర్వహిస్తున్న గోపాష్టమి కార్యక్రమం సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఇంటా గోవును పెంచి గోసంపదను అభివృద్ధి చేయాలని చెప్పారు. నిత్యం దేవతార్చనతో పాటు గోపూజను కూడా నిర్వహించాలన్నారు. ఈసందర్భంగా మొవ్వ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ట్రస్టీ మండవ రవీంద్రబాబు పర్యవేక్షణలో అర్చకులు దీవి సీతారామ హనుమాన్, వంశీమోహన్ భక్తుల చేత గోపూజలు నిర్వహించారు. శ్రీకృష్ణాశ్రమంలో వందలాది గోవులకు గురుదేవుల పర్యవేక్షణలో భక్తులు గోపూజ నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిగింది.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో గోపాష్టమి
మోపిదేవి, నవంబర్ 21: నందననామ సంవత్సర కార్తీక శుక్ల అష్టమి, గోపాష్టమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ, ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసి ఎవివి సత్యనారాయణ, దేవస్థానం అర్చకులు, వేదపండితులు నౌడూరి విశ్వనాథ శర్మ, బద్దు పవన్‌కుమార్ శర్మ, బాలకృష్ణ శర్మ పూజలు నిర్వహించారు.

ఎన్‌టిఆర్ విగ్రహంపై రాతలతో కలకలం
జగ్గయ్యపేట, నవంబర్ 21: పట్టణంలోని ప్రధాన రహదారిలో మున్సిపల్ సెంటర్‌లో నిత్యం వేలాది మంది అనుక్షణం తిరుగుతూ ఉండే ప్రదేశంలో ఉన్న టిడిపి వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని పేర్లు రాసి ఆయనకు మీసాలు, కళ్ల వద్ద రంగులు దిద్దారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం ప్రాంతంలో కొందరు గమనించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్‌టి సెల్ అధ్యక్షుడు సిమ్మసర్తి వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకున్నారు. జనాలు కూడా గుమిగూడటంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే టిడిపి నేతలు విగ్రహాన్ని శుభ్రం చేయించి నూతన రంగులు దిద్దారు. సమీపంలో గల సిసి కెమెరాలను గమనించగా ఒక మతి స్థిమితం లేని వ్యక్తి రంగులు వేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరం ఎన్‌ఆర్‌ఐ కుటుంబ సభ్యులను బుధవారం పెడన శాసనసభ్యులు జోగి రమేష్ పరామర్శించారు.
english title: 
nri

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>