ప్రొద్దుటూరు, నవంబర్ 22 : ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో అమలు పరుస్తున్న పథకాల తీరు చాల దయనీయంగా తయారు అవుతోంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో పేద విద్యార్థులకు చదువుతో పాటు పోషక విలువలు అందించే విధంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ దుర్భరంగా మారింది. తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ వారికి కట్టబెట్టి అందించాల్సిన పోషక పదార్థాలను సైతం నల్లబజారుకు అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్న వైనాలతో పేద పిల్లల పరిస్థితి దీనంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
ప్రొద్దుటూరు రూరల్ ఐసిడి ఎస్ కార్యాలయ పరిధిలో దాదాపు 150కి పైగా అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. దీనికి సంబంధించి కార్యాలయం ప్రొద్దుటూరులోనే ఉంది. 2004 సంవత్సరములో పనిచేసిన అధికారుల తీరువలన దాదాపు లక్షల రూపాయల పిండి పదార్థాలను పిల్లలకు చేరవేయకుండా నల్లబజారుకు అమ్ముకొవడం జరిగినట్టు జిల్లాస్థాయి అధికారుల విచారణలో వెల్లడయ్యాయి. దీనికి సంబంధించి గత జూలై నెలలో ఐసిడిఎస్ పిడి లీలావతి ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. అయితే ఈవిచారణలో లోపాలు పూర్తిస్థాయిలో బయటిపడతాయనే ఉద్దేశ్యంతో కొన్ని కీలక రికార్ఢులను తారుమారు చేయడంతో పాటు అసలైన రికార్డులను కార్యాలయంలో లేకుండా చేసినట్లు విచారణలో వెల్లడి అయినట్లు పిడి పేర్కొన్నారు. గతంలో పని చేసిన కింది స్థాయి అధికారులతో పాటు జిల్లాస్థాయి అదికారులు జరిగిన అవినీతిని కప్పి ఉంచడముతో కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పూర్తిస్థాయి విచారణ చేపట్టడం జరిగింది. అయితే విచారణ సమయం, అవినీతి జరిగిన సమయంలో విధులు నిర్వహించిన అధికారులు ఉండవలసినప్పటికీ ఆ అధికారి ప్రొద్దుటూరు కార్యాలయంకు వచ్చేందుకు నిరాకరించడం జరిగింది. అయినప్పటికి జిల్లస్థాయి అధికారులు ఉదాసీనత ప్రదరిస్తూ విచారణ కొనసాగించడమైనది. దాదాపు ఏడు నెలల తరువాత అవినీతి భాగోతం పూర్తిగా తేల్చని అధికారులు గురువారం నుంచి కమిటీని వేసి గతంలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణను మళ్ళీ ప్రారంభించారు. గతంలో చేసిన విచారణకు కొన్ని లోపాలు తెలియడంతో పాటు కీలక రికార్డులు మాయం చేసిన విషయం తెలిసినా కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్న అధికారులు మళ్ళీ విచారణ పేరుతో కాలయాపనతో పరిమితమవుతారా లేక పేద పిల్లల నోటికాడి పిండి పదార్థాలను దూరం చేసిన అధికారులకు, వారికి సహకరించిన ఇతర వారిపై చర్యలు ఏ మేర తీసుకుంటారో వేచి చూడాలి.
సీడ్ విలేజ్‌లపై సీమ రైతుల ఆశలు
కడప, నవంబర్ 22: రాయలసీమ జిల్లాలకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సరఫరా అవుతున్న అన్ని రకాల విత్తనాలు నాసిరకంగా ఉండడంతో రైతులు నట్టే మునిగిపోయా రు. ఇక నుంచైనా నాణ్యమైన విత్తనా లు అందుబాటులోకి తెచ్చి ఆదుకునే ప్రయత్నం చేయాలని అధికారులు నడుంకట్టారు. ఇందులోభాగంగా మండలానికో సీడు విలేజ్ ఏర్పాటు చేయనున్నారు. 25 మంది రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి విత్తనాల పెంపకం బాధ్యత అప్పగిస్తారు. ప్రతి మండలంలో 25 ఎకరాలను ఇందుకు ఎంపిక చేస్తారు. ఇందులో సాగు చేసి న పంటలు, వాటి ద్వారా లభ్యమైన విత్తనాలను వ్యవసాయాధికారులు పరిక్షించి వాటిని శుద్ధి చేసి తిరిగి రైతులకు పంపిణీ చేస్తారు. కడప వైఎస్సార్ జిల్లాలో జాయింట్ డైరెక్టర్ జోనాధన్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తం గా సీడు విలేజ్ ఎంపికకు సంబంధిత వ్యవసాయాధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం, కర్నూ లు, చిత్తూరు జిల్లాల్లో ఎంపిక చేసిన సీడు విలేజ్‌లలో సత్ఫలితాలు సాధించారు. అరకొర నీరు లభ్యమయ్యే ప్రా ంతాల్లో సీడ్ విలేజ్‌ల నిర్వహణకు రైతులతోపాటు ఆదర్శ రైతులకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ నిమిత్తం వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులను, భూ సారం తనిఖీ చేసే అధికారులను రప్పిస్తున్నారు. వారు ఎంపిక చేసిన భూ ముల్లో వేరుశెనగ, కంది, శెనగ, పత్తి, పసుపు, ప్రొద్దుతిరుగుడు విత్తనాల నిమిత్తం సీడు విలేజ్‌ల్లో పంటలు సాగు చేస్తారు. విత్తనాలను శుద్ధి చేసి ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు సరసమైన ధరల్లో అందజేస్తారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ ఎసి సీడ్స్, డిసిఎంఎస్, ప్రైవేటు సంస్థలైన శ్రీ లక్ష్మి, డి ఎన్‌ఆర్ కంపెనీల నుంచి నాసి రక విత్తనాలు పంపిణీ జరిగినట్లు తేలడం తో వ్యవసాయ శాఖ జెడి జోనాథన్ వాటిని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సిఫారసులు చేశారు. ఈ నేపథ్యంలో సీడు విలేజ్‌ల నుంచే విత్తనాలు తయారు చేసి రైతులకు అందించడానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయి. జిల్లా వ్యవసాయాధికారులు ముందు చూపు వల్ల ప్రభుత్వం కూడా సీడు విలేజ్‌ల ద్వారా విత్తనాలను తయారీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో నాసిరకం విత్తనాలకు అడ్డుకట్ట పడి సీమ రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించనున్నాయి.
సుస్థిర వ్యవసాయంలో
రైతులకు భాగస్వామ్యం
* జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి జి.గోపాల్
రాజంపేట, నవంబర్ 22:గ్రామీణ పేదరిక నిర్మూలనకు సుస్థిర వ్యవసాయంలో రైతులకు భాగస్వామ్యం కల్పించి వారికి అవగాహన కల్పించడానికి సమిష్టిగా సంబంధిత శాఖాధికారులందరూ కృషి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి జి.గోపాల్ అన్నారు. స్థానిక మండల మహిళా సమాఖ్య మండలంలోని న్యూబోయనపల్లెలో సొంత గదులలో నిర్వహించిన రైతు సేవా కేంద్రాలను పిడి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో సుస్థిర వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనకు నాన్ పెస్టిస్టైడ్ మేనేజ్‌మెంట్ పథకం ద్వారా రైతులకు అవగాహన కల్పించడానికి డిఆర్‌డిఎ అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఆదేశించారు. జిల్లాలోని 32 మండలాల్లో 375 గ్రామాల్లో 70,000 మంది గ్రామీణ రైతులను గుర్తించి వారికి సుస్థిర వ్యవసాయ పథకం ద్వారా 96000 ఎకరాలలో సుస్థిర వ్యవసాయంనందు భాగస్వామ్యం కల్పించి వారి అభివృద్ధికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నదన్నారు. వ్యవసాయంలోని రసాయనిక పురుగు మందుల వినియోగం తగ్గించి సేంద్రీయ పద్ధతుల ద్వరా రైతులకి అవగాహన కల్పించుటకు మనమందరం కృషి చేయాలని ఆయన తెలిపారు. సుస్థిరమైన వ్యవసాయానికి అవసరమైన వనరులను అందించడానికి ఇటువంటి ఎన్‌పిఎం షాప్ ద్వారా రైతులకు అవగాహన కల్పించుట ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి గ్రామానికి ఒక ఎన్‌పిఎం షాపులో ఇరవై రకాల వస్తువులు అందుబాటులో ఉండేటట్లు చూడవలసిన బాధ్యత ఎసి, ఎపియం అధికారులపై ఉందన్నారు. ఈ సేవా కేంద్రంలో బయోమాస్ విత్తనాలు, ఎరపంట, పలు పంటల విత్తనాలు, ఆవుపేట, మూత్ర ద్రావణం, తయారైన ఎరువులు, కషాయాలు, పసుపు, తెలుపు పళ్ళాలు, పక్షి స్థావరాలు, సంబంధితములు, రైతు సేవా కేంద్రాల ఏర్పాటు మార్కర్లు, స్ప్రేప్లేయర్లు, దంతులు, నాగళ్ళు, ఎడ్లు, ఎడ్లబండ్లు, పొట్టు, వేరుచేయు గాలిమరలు సంబంధితాలు, క్లసర్‌కు ఒక సేవా కేంద్రం, రతై సేవా కేంద్రం, విజయవంతంగా నిర్వహించాలని గోపాల్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం నాగరాజు, డిఆర్‌డిఎ అధికారులు, ఏరియా కో-ఆర్టినేటర్ మాధవి, మండల ఎపిఎం రామచంద్రయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భూ కబ్జాదారులపై కేసులు నమోదు
* రెవెన్యూ డివిజనల్ అధికారి వీరబ్రహ్మం
గాలివీడు, నవంబర్ 22 : మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల కబ్జాదారులపై కేసులు నమోదు చేస్తామని కడప రెవెన్యూ డివిజనల్ అధికారి వీరబ్రహ్మం హెచ్చరించారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 6వవిడత భూ పంపిణీ రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప రెవెన్యూ డివిజనల్ పరిధిలో 6వ విడతలో 17 వందల మంది నిరుపేద రైతులకు 3వేల ఎకరాల ప్రభుత్వ భూములను పంపిణీ చేశామన్నారు. తూముకుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 542లో అటవీశాఖకు కేటాయించిన ప్రభుత్వ భూమి 520 ఎకరాల రికార్డులను పరిశీలిస్తున్నామన్నారు.
సిబ్బందిపై మండిపడ్డ ఆర్డీఓ
6వ విడత భూ పంపిణీ సంబంధించిన డికేటీ నమూనాలను, పట్టాదారు పాసుపుస్తకాలను 42 మంది రైతులకు అందజేయకపోవడంపై సంబంధిత వీఆర్‌ఓలపై ఆర్డీఓ మండిపడ్డారు. వెంటనే ఆయా రైతులకు డిఫారాలు అందజేయాల్సిందిగా తహశీల్దార్ ఎల్‌వి ప్రసాద్‌ను ఆదేశించారు. మండల కేంద్రంలోవ్యవసాయ భూములను, వ్యవసాయేతర భూములుగా మార్చి రెవెన్యూ అనుమతులు లేకుండా సర్వే నెంబర్ 928లో వేసిన ప్లాట్లను నిలిపివేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. అలాగే పావనీ సినిమా థియేటర్ సమీపంలోని కాలువ పొరంబోగుకు సర్వే నెంబర్ 1328/2లో 0.43 సెంట్ల ప్రభుత్వ భూమి హద్దు చూపి దురాక్రమణ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
చెరువు ఆక్రమణ పరిశీలన
మండల కేంద్రానికి సమీపంలో పెద్దచెరువు ఆక్రమణ స్థలాన్ని ఆర్డీఓ పరిశీలించారు. భూ కబ్జాదారులు సుమారు 15 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, వెంటనే సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలాన్ని హద్దులు గుర్తించాలన్నారు. 180 చట్టంప్రకారం ప్రభుత్వ చెరువులు, కుంటలు, వంకలు,వాగులు పంచాయతీల పరిధిలోకి వస్తాయని ఎంపీడీ ఓలు ప్రభుత్వ ఆస్తులు దురాక్రమణ కాకుండాచర్యలు చేపట్టాలన్నారు.
కడపలో భారీ వర్షం
* లోతట్టు ప్రాంతాలు జలమయం
కడప, నవంబర్ 22: కడపలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి మేఘాలు కమ్ముకుని చీకట్లుకమ్ముకున్నాయి. సాయంత్రం నుండి చిరు జల్లులు మొదలై కుండపోతగా మారింది. దీనితో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మురికివాడల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై నీరు ప్రవహించడంతో జలశయాలుగా మారాయి. ఇదిలావుండగా నగర పరిసరాల్లో కురిసిన వర్షం రైతులకు ఉపశమనం కలిగించింది. ఈ వర్షంతో భూగర్భ జలమట్టాలు పెరిగి తమకు ప్రయోజనం కలిగిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా వర్షానికి పెన్నా, పాపాఘ్ని సవర్ణముఖి, కుందూ నదులు ఉధృతంగా ప్రవహించాయి. ఒక్కసారిగా కురిసిన వర్షం నగర వాసులను ఉక్కిరి బిక్కిరి చేయగా గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా రైతులకు ఉపశమనం కలిగించింది.
యువతకు ఉపాధి కల్పించాలి
* కలెక్టర్ అనిల్‌కుమార్
కడప, నవంబర్ 22 : రాజీవ్ యువ కిరణాలు పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనిల్‌కుమార్ కోరారు. గురువారం రాజీవ్ యువ కిరణాల పథకం కింద ఏర్పాటు చేసిన శిక్షణా సంస్థలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంస్థలు అభ్యర్థులకు ఏ రీతిలో శిక్షణ ఇస్తోంది, అక్కడ కల్పిస్తున్న వౌలిక సదుపాయాలను పరిశీలించారు. అలాగే శిక్షణ పొందతున్న అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిక్షణా సంస్థలు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడంతోనే బాధ్యత తీరదని, ఉపాధి కల్పించడం కూడా బాధ్యత ఉందన్నారు. ఉపాధి కల్పించినప్పుడే రాజీవ్ యువ కిరణాలు పథకానికి సార్థకత చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెస్మా పిడి వెంకటసుబ్బయ్య, వారి సిబ్బంది పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
* స్వామి గౌతమానందజీ
కడప (కల్చరల్), నవంబర్ 22 : భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి, సంస్కృతీ, సంప్రదాయాలకు శ్రీ రామకృష్ణులు కేంద్రంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని స్వామి గౌతమానందజీ అన్నారు. గురువారం శ్రీరామకృష్ణ విశ్వజనీన దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటలకు వేదమంత్ర పఠనం, శ్రీ రామకృష్ణ సుప్రభాతం జరిగింది. రాజమండ్రి శ్రీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి అక్షరానందజీ వారి ఆధ్వర్యంలో భక్తిగీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కుల, మత, జాతి వివక్షత లేకుండా అందరికీ నిస్వార్థంగా సేవ చేయుటయే శివపూజ అన్నారు. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ మహిళలను విశ్వసించకుండా, భక్తి, జ్ఞానాలను కలిగి ఉండటమే శ్రీ రామకృష్ణుల భక్తుల లక్ష్యమన్నారు. మాతాజీ ప్రతిభాపురం మాట్లాడుతూ నిశ్శబ్ధంగా సేవా కార్యక్రమాలు చేయుట ఒక్క రామకృష్ణ మిషన్‌కే సాధ్యమన్నారు. అనంతరం ఆలయ నిర్మాణానిక కృషి చేసిన వారిని స్వామీజీ శాలువ, జ్ఞాపికతో సన్మానించారు.
కాంగ్రెస్ హయాంలోనే దళితుల అభివృద్ధి
* డిసిసి అధ్యక్షులు మాకం
కడప (టౌన్), నవంబర్ 22 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోనే దళితులు అభివృద్ధి చెందారని డిసిసి అధ్యక్షులు మాకం అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం ఇందిరా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా జ్యోతిరాయప్ప, కార్యదర్శిగా రాయప్పలకు నియామక పత్రాలను మాకం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షోమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దళితులకు సబ్సిడీ రుణాలు, వారి పిల్లల విద్యాభివృద్ధి కోసం స్కాలర్ షిప్‌లు, ఇళ్లస్థలాలు, పంట భూములు అందించినట్లు తెలిపారు. రెండవ మారు డిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మాకం అశోక్‌కుమార్‌ను కాంగ్రెస్‌లోని 8 విభాగాల అధ్యక్షులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహిద్దీన్ సత్తార్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినులు చదువుల్లో రాణించాలి
* రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ బాలికల అభివృద్ధి అధికారిణి జి. అనిత
చెన్నూరు, నవంబర్ 22 : విద్యార్థినులు ఉన్నత చదువులతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ బాలికల అభివృద్ధి అధికారి జి. అనిత పిలుపునిచ్చారు. జిల్లాలో పాఠశాలలో తనిఖీలో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకే చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రార్థన సమయంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నత చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల చదువుల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వైద్య, ఇంజనీరింగ్ ఉన్నత చదువుల కోసం ప్రత్యేక కళాశాలలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల హాజరు పట్టికలు, వౌలిక వసతులపై రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాల గదులను పరిశీలించి విద్యార్థులకు విద్యాభ్యాసంపై స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం పథకం అమలుపై అక్కడ ఉన్న వంట ఏజెన్సిని తనిఖీ చేశారు. పాఠశాలలో బడి ఈడు పిల్లలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ వెంకటలక్షుమ్మ, హెచ్‌ఎం జయలక్ష్మి, ఐఆర్‌టి ఉపాధ్యాయురాలు సుభద్రమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థుల ర్యాలీ.. ధర్నా
రైల్వేకోడూరు, నవంబర్ 22: పట్టణంలో ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ గురువారం నిర్వహించారు. స్తానిక జూనియర్ కళాశాల నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యా లీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మీ సేవ నుండి విద్యార్థులకు సరిపడ సర్ట్ఫికెట్లు సక్రమంగా రావడం లేదని, ఈ కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, విద్యార్థులు తహశీల్దార్ వద్ద వాపోయారు. ఇన్‌కమ్ సర్ట్ఫికెట్, నేటివిటీ సర్ట్ఫికెట్, కుల సర్ట్ఫికెట్‌లు మీ సేవ నుండి సక్రమంగా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం పూర్వం లాగా అధికారుల నుండే అందివ్వాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఎఐఎస్‌ఎఫ్ నాయకులు చైతన్య, కిషోర్, రాజశేఖర్ నాయకత్వంలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా అనంతరం స్తానిక తహసిల్డార్‌కు వారు ఒక వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తహశీల్దార్ రామచంద్రయ్య విద్యార్థులకు హామీ ఇచ్చారు.
ఎలుకల మందు తిని మహిళ ఆత్మహత్య
కడప (క్రైం), నవంబర్ 22 : వీరపునాయునిపల్లె మండలం అనిమల గ్రామానికి చెందిన నోకబోయిన రాములమ్మ (68) ఎలుకల మందు తినడంతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఔట్ పోస్టు పోలీసుల వివరాల మేరకు కొంత కాలంగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతూ అనారోగ్యంతో ఉండడంతో జీవితంపై విరక్తి చెందిన 20వ తేదీ ఎలుకల మందు తినింది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
ఈనెల 20వ తేదీన కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్న మహిళ గురువారం తెల్లవారుజామున తిరుపతి రూయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రిమ్స్ పోలీసుల వివరాల మేరకు స్థానిక కేంద్ర కారాగారం వద్ద నున్న వికలాంగుల కాలనీకి చెందిన షేక్ షాదుకున్నీసా (20) కు ఐదేళ్ల క్రితం వివాహం అయింది. భర్త చనిపోయి రెండు సంవత్సరాలు కావడంతో తన తల్లిదగ్గర ఉంటూ తల్లికి భారం కాకూడదని ఉద్దేశ్యంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రూయకు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామను మృతి చెందినట్లు తెలిపారు.
బాలికపై అత్యాచారం - కేసు నమోదు
సంబేపల్లె, నవంబర్ 22 : మండల పరిధిలోని శెట్టిపల్లె గ్రామం బలిజపల్లెకు చెందిన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన రామాంజులు, అశోక్ కలిసి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక గ్రామ సరిహద్దుల్లో గొర్రెలు మేపుకుంటుండగా రామాంజులు, అతని స్నేహితుడు, అశోక్ కలిసి అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహబూబ్‌బాషా తెలిపారు.
గుర్తు తెలియని శవం లభ్యం
సుండుపల్లె, నవంబర్ 22 : మండలంలోని ముడుంపాడు ఏరియా పరిధిలోని రెడ్డెప్పరెడ్డి మామిడి తోటలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి శవం బయట పడింది. సమాచారం అందుకున్న సుండుపల్లె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. వెంటనే పులివెందుల డిఎస్పీ జయచంద్రుడు, రాయచోటి రూరల్ సిఐ రాజేంద్రప్రసాద్, సుండుపల్లె ఎస్‌ఐ రామచంద్ర ఆధ్వర్యంలో శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శవానికి రాయచోటి ప్రభుత్వ వైద్యులు రెడ్డిమహేశ్వరరాజు, నిస్సార్ అహ్మద్ పోస్టుమార్టం నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలను, స్థానికులను పోలీసులు విచారించారు. చనిపోయిన వ్యక్తికి దాదాపు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి రూరల్ సిఐ తెలిపారు.
ఆటో బోల్తా.. ఇరువురికి గాయాలు
సంబేపల్లె, నవంబర్ 22 : మండల పరిధిలోని శెట్టిపల్లె గ్రామం కొత్తవడ్డెపల్లె సమీపంలో ఆటో బోల్తా పడి ఇరువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే గురువారం దేవపట్లకు చెందిన ఆటో శెట్టిపల్లె నుండి ప్రయాణికులను ఎక్కించుకుని దేవపట్లకు వస్తుండగా కొత్తవడ్డెపల్లెకు సమీపంలోకి రాగానే ఎదురుగా పాము రావడంతో బ్రేక్ వేయగా ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సాదిక్‌వలి, వెంకటరమణకు గాయాలయ్యాయి. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహబూబ్‌బాషా తెలిపారు.
కామసముద్ర వాసికి జీవిత ఖైదు
అట్లూరు, నవంబర్ 22 : మండలంలోని పెద్దకామసముద్రం కొర్లకుంట నరసింహులు అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించినట్లు ఎస్సై బొజ్జప్ప తెలిపారు. నరసింహులు అదే గ్రామానికి చెందిన గొల్లముత్తరాజు బాలయ్య అనే వ్యక్తిని 2008 జూలై 15న చంపాడు. దీంతో విచారణ తర్వాత ఇప్పుడు కడప ప్రిన్సిపల్ సెషన్ జడ్జి కోర్టులో గురువారం మధ్యాహ్నం జీవిత ఖైదు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు. అలాగే 5వేల జరిమానా కూడా విధించినట్లు తెలిపారు.