Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమష్టి కృషితో ‘మార్పు’ విజయవంతం

$
0
0

చిత్తూరు, నవంబర్ 22: మాతాశిశు సంరక్షణ కోసం నూతనంగా రూపొందించిన మార్పు కార్యక్రమం విజయవంతానికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో జరిగిన సమావేశంలో అంగన్‌వాడీ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, డిఆర్‌డిఎతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు మరణాలను అరికట్టేందుకు, వారి ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం 20 సూత్రాలతో ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేసిందని, ఈ సూత్రాలలోని అంశాలను ఈనెల 26వతేదీన మండల స్థాయిలో జరుగు సమావేశంలో పై మూడు శాఖలకు చెందిన సిబ్బందితో సమావేశమై అవగాహన కల్పించాలన్నారు. మండల స్థాయిలో గల ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, ఇందిరక్రాంతి పథం ఫీల్డ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి శాఖ నుండి రిసోర్స్ పర్శన్స్‌ను గుర్తించాలని, వారి జాబితాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపాలన్నారు. మండల స్థాయి సమావేశంలో మాతాశిశు ఆరోగ్యంపై శాఖల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. రిసోర్స్ పర్శన్లకు జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి వారు చేయాల్సిన పనులను వివరిస్తామన్నారు. మూడు శాఖల సమన్వయంతో జిల్లాలో మార్పు కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తే పేద ప్రజలకు పూర్తి ఆరోగ్యాన్ని అందించడంతోపాటు వారి పేదరికాన్ని కూడా నిర్మూలించిన వారవుతారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 43శాతం మాత్రమే కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయని, జనవరి లోపు కనీసం 70శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ సిబ్బందిదేనని స్పష్టం చేశారు. డివిజన్ స్థాయిలో జరిగిన అవగాహన సదస్సులోని అంశాలను మండల స్థాయిలో జరిగే సమావేశంలో వివరించాలని, గ్రామ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్పు కార్యక్రమంలోని 20సూత్రాల అంశాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. 2015నాటికి జిల్లాలో కాన్పులు చేసుకునే ప్రతి మహిళా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేసుకునేటట్లు ప్రోత్సహించాలన్నారు. ఈకార్యక్రమానికి అదనపు జెసి వెంకటసుబ్బారెడ్డి, డిఆర్‌డిఎ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, ఐసిడిఎఎస్ పిడి శారద తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చే అతిథులకు అన్ని వసతులు కల్పించాలి
* కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశం
తిరుపతి, నవంబర్ 22: ప్రపంచ తెలుగుమహాసభల్లో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చే అతిథుల మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా, ముఖ్యంగా వసతులకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వసతుల కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశించారు. గురువారం స్థానిక శ్రీపద్మావతి అతిథిగృహంలో ఆయన వసతుల కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వసతులకు సంబంధించి ప్రభుత్వ, టిటిడి అతిథిగృహాల వివరాలు ఎంత వరకు సేకరించారని ఆయన ఆరా తీశారు. ఏన్ని నాన్ ఏసిలు, ఎసిలు, సాధారణ గదులున్నాయో కూడా చెప్పాలని సూచించారు. దీంతో ఆర్‌డిఓ రామచంద్రారెడ్డి కలెక్టర్‌కు వసతుల గురించి వివరించారు. టిటిడి ఆధ్వర్యంలో వున్న విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం వసతిగృహాలు, శ్రీపద్మావతి, ఎస్వీ అతిథిగృహాలు, యూనివర్శిటీ, ఆర్ అండ్ బి, మున్సిపాల్టీ అతిథిగృహాలను పరిశీలించామని ఆర్‌డిఓ తెలిపారు. త్వరలోనే వాటి వివరాలను సేకరించి సిద్ధం చేస్తామని కలెక్టర్‌కు చెప్పారు. ప్రైవేటు హోటల్స్‌లోని గదుల వివరాలను కూడా సేకరించి ప్రత్యేక నివేదికలను తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. సభలు జరిగే రెండురోజుల ముందే టిటిడి కల్యాణమండపాలను స్వాధీనం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నీటి కొరత రాకుండా జాగ్రత్తపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జెఇఓ వెంకట్రామిరెడ్డి, పాఠశాల విద్యా ప్రాంతీయ సంచాలకులు జి భవనమూర్తి, ఇంటర్ ఎడ్యుకేషన్ ఎడి జనార్ధన్, ఎస్వీయూ జాయింట్ రిజిస్ట్రార్ ఎం కేశవులు, జిల్లా టూరిజం అధికారి చంద్రవౌళిరెడ్డి, శిల్పారామం ఎఇ శ్రీరాములు, కార్పొరేషన్ ఎస్‌ఇ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రలు మాని నీటి సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టండి
* డిసెంబర్ 3న జరిగే విద్యుత్ రెగ్యులేటరీ సమావేశాన్ని అడ్డుకుంటాం
* సిపిఐ నారాయణ హెచ్చరిక
తిరుపతి, నవంబర్ 22: ఓ వైపు సీమ ప్రజలు నీటి సమస్యతో సతమతమవుతుంటే ఆ సమస్యను పరిష్కరించకుండా పాదయాత్రలతో మంత్రులు కాలయాపన చేస్తూ సమస్యను జటిలం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ ఆరోపించారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటికి, సాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇది కంటిముందు కనిపిస్తున్న సత్యమన్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి రఘువీరారెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై పాదయాత్రలు చేయడం హాస్యాస్పందంగా ఉందన్నారు. వెంటనే ప్రభుత్వంలోని మంత్రులు పాదయాత్రలు మాని నీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ యాత్రలు చేయవద్దన్నారు. చిత్తశుద్దితో నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు రావాల్సిన వాటాను ఇవ్వాలన్నారు. లేని ఫక్షంలో తాము డిసెంబర్ 2వ వారంలో ఆనాటి పోరాట యోధులను స్మరించుకుంటూ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమిస్తామన్నారు. ఇక మద్యం కుంభకోణంలో చిరుద్యోగులను బలి చేస్తూ రాజకీయ దొంగలు మాత్రం తప్పించుకుంటున్నారన్నారు. రాజకీయ అవినీతి పరులను వదిలిపెట్టి ఎసిబి ఇచ్చిన నివేదిక సరికాదన్నారు. సిబిఐ చేత విచారణ జరిపిస్తే అసలు నిందితులు బయటకు వస్తారన్నారు. మద్యం మాఫియా పట్ల కఠినంగా వ్యవహరించకపోతే సమాంతర పాలన చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక విద్యుత్ ఛార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ను శిఖండిలా అడ్డుపెట్టుకుని దారిదోపిడీ దొంగలకన్నా అధ్వానంగా ప్రభుత్వం తయారైందని నిప్పులు చెరిగారు. డిసెంబర్ 3న జరుగనున్న విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సమావేశాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. డిసెంబర్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణకు రానుందని, దీన్ని నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతిలో ప్రపంచ తెలుగుమహాసభలు నిర్వహించడం శుభపరిణామన్నారు. తెలుగుభాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

ముక్కంటీశ్వరా..... జేబులు ఖాళీ ఆయెరా!
* దళారుల భోజ్యం.. పర్యవేక్షణ శూన్యం
* భక్తులు నిలువు దోపిడీ
ఏర్పేడు, నవంబర్ 22: ముక్తి కోసం ముక్కంటి ఆలయానికి వచ్చే భక్తులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. ఆలయం బయట దళారులు రాజ్యం, ఆలయం లోపల అనధికారిక వసూళ్లతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఇద్దరు దళారులు రెండు నెలల క్రితం 300 రూపాయల రాహు, కేతు పూజా టిక్కెట్టును తమిళనాడు రాష్ట్రం ఏలూరుకు చెందిన విజయకుమార్‌కు 600 రూపాయలకు విక్రయిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుపడ్డారు. ఆ తర్వాత రోజున స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ లాడ్జీకి చెందిన ఇద్దరు దళారులు ఇదే తరహాలో టిక్కెట్లు అమ్ముతూ దొరికిపోయారు. అంతే కాదు ఇక్కడ అవసరం లేకపోయిన అధిక ధరలకు పూజా సామాగ్రి అంటగడుతూ భక్తులను దోచుకుంటున్నారు. ఇలా అక్రమాలపర్వం సాగుతూ ఉన్నా అధికారులు అధికారులు శాశ్వత చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కారణం సరైన నిఘా లేకపోవడం. భద్రతా సిబ్బంది ఉన్నా వాళ్ల మాటకు చెల్లుబాటు లేకపోవడం. దళారులకు రాజకీయ అండదండలు ఉండటమే. భూతల కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి అక్రమార్కుల అడ్డాగా మారుతోంది. ఇక్కడ దళారులతో పాటు వస్తువుల ధరల బెడద ఉంది. పూజలకోసం ఉపయోగించే రెండు రోజాపూలు మహా అంటే 5 రూపాయలు ఉంటాయి. అదే శ్రీకాళహస్తీశ్వరాలయంలో 50రూపాయలు, అలాగే గరికమాల 50రూపాయలు, తుమ్మిపూలు 100రూపాయలు, నేతిదీపాలు 200రూపాయలు, జిల్లేడుమాల 50రూపాయలు, బిల్వం 50రూపాయలు, రెండు తామరపూలు 100రూపాయల లెక్కన విక్రయిస్తున్నారు. ఇవ్వన్నీ తీసుకోకుంటే దుకాణ యజమానులు భక్తులను వదలిపెట్టడం లేదు. సాధారణ భక్తుడు 300రూపాయల టిక్కెట్టుతో పూజ చేయించుకోవాలని వస్తే అదనంగా 600రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇదంతా పూజా స్థలిలోకి వెళ్లేంత వరకే మరి.
లోపలా అదే తంతు
ఇప్పటి వరకు అనధికారిక బాదుడు భరిస్తూ, లయ ఆవరణలోకి అడుగు పెట్టే భక్తులు అక్కడ జరిగే అధికారిక వసూళ్లతో మరింత దోపిడీకి గురవుతున్నారు. ఒక్కోపూజకు ఒక్కోవిధంగా డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో యాత్రికులు విస్తుపోతున్నారు. రాహు, కేతు పూజల్లో ఒకొక్కరివద్ద 30రూపాయల నుంచి అధికమొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. అంతేకాదు పలు దేవతా విగ్రహాల వద్ద కూడా డిమాండ్‌చేసి వసూళ్లు చేస్తున్నారు. పూజా, దర్శనం పూర్తయి బయటకు వచ్చే యాత్రికులు బలైపోతున్నారు.
ఇలా చేస్తే
నిలువు దోపిడీని నియంత్రించకుంటే రానున్న రోజుల్లో అనర్థం తప్పదు. బలవంతంగా ఏపూజా సామాగ్రి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆలయంతో పాటు ఆలయ ఆవరణలో ఉన్న దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి దుకాణం ముందు నిర్దేశిత సూచికబోర్డులు పెట్టడం. ఆలయం పోలీస్‌శాఖ నిర్దేశించిన ధరలకే పూజా సామగ్రిని విక్రయించే రీతిన సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఫిర్యాదు చేయాల్సిన నంబర్లను భక్తులకు అందుబాటులో ఉంచడం ద్వారా కొంత మేరకు అక్రమార్జన తగ్గించే అవకాశముంది. దళారులుగా పట్టుబడినవాళ్ల ఫొటోలు సూచికబోర్డుల రూపంలో వేయడం. అలా అదుపులోనికి తీసుకున్న వాళ్లపై చర్యలు కఠినంగా వ్యవహరిస్తే మళ్లీ దోపిడీకి అవకాశం ఉండదు. అందుకు ఆలయ అధికారులు, పోలీసు సంయుక్త పర్యవేక్షణ అవసరం.

ట్రాక్టర్ బోల్తా
ఇద్దరు దుర్మరణం
కలికిరి, నవంబర్ 22: వ్యవసాయ భూములను దున్నుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి కలికిరి మండలంలో జరిగింది. ఎస్‌ఐ సోమశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం మేడికుర్తి పంచాయతీ ఆసాదివారిపల్లె సమీపంలో గురువారం వ్యవసాయ భూములను దునే్నందుకు ట్రాక్టర్ వచ్చింది. దున్నుతున్న ట్రాక్టర్ వెనక్కివస్తూ అదుపుతప్పి పక్కనే ఉన్న పెద్దకాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్‌లు మేడికుర్తికి చెందిన షాన్‌వాజ్(19), పారపట్లకు చెందిన రవి(26) అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

-- నగదు బదిలీ కోసం --
బ్యాంక్ ఖాతాలు ప్రారంభించండి
* ఆంధ్రాబ్యాంకు డిజిఎం కిషన్ ప్రసాద్ వెల్లడి
తిరుపతి, నవంబర్ 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు, రైతులకు ఇతర వర్గాలకు పలు రూపాల్లో ఇస్తున్న రాయితీలు, నగదు రూపంలో ఇస్తున్న పెన్షన్లు వంటి పథకాలను మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేసేందుకు ఆంధ్రాబ్యాంకు తన పరిధిలో వున్న 72 సర్వీసు ఏరియాల్లో జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ చేపట్టిందని ఆ బ్యాంకు డిజిఎం డి కిషన్ ప్రసాద్ వెల్లడించారు. గురువారం ఎస్వీయూలోని ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని బ్యాంకులు ప్రతి ఇంటికి కనీసం ఒక ఖాతాను తెరవాలని ఆదేశించిందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో నగదు బదిలీ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఐదు జిల్లాలలను ఎంపిక చేసిందన్నారు. ఇందులో చిత్తూరు జిల్లాతో పాటు అనంతపురం, రంగారెడ్డి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, హైదరాబాద్ సిటిలున్నాయన్నారు. చిత్తూరు జిల్లాలో జనవరి నుండి ఈ ఖాతాలు పూర్తిగా అమలు చేయడానికి తాము ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు. ఈ నేపధ్యంలో డిసెంబర్ రెండవ వారానికి ఖాతాలన్నింటిని తెరిపించనున్నామన్నారు. జిల్లాలో ఆంధ్రాబ్యాంకుకు 72 బ్రాంచిలున్నాయన్నారు. తమ సర్వీస్ ఏరియాల్లో ప్రతి ఇంటికి కనీసం ఒక ఖాతాను తెరవాలని యోచిస్తున్నామన్నారు. ఒక ఇంటికి రెండుమూడు ఖాతాలు కావాలన్నా ఇచ్చేందుకు తాము సిద్ధంగా వున్నామన్నారు. ఖాతా తెరిచేందుకు ఒక ఫొటో, ఆధార్‌కార్డుకాని, ఓటరు కార్డుకాని, రేషన్‌కార్డు కాని ఏ ఒక్కటి వున్నా ఖాతాలో ఒక్కరూపాయి కూడా లేనప్పటికి ఖాతా తెరిపించి ఇస్తామన్నారు. ఆధార్‌కార్డు అయితే మరీ మంచిదన్నారు. ఇక ఫొటోలు లేని పక్షంలో ఆ ఫొటోలను తమ బ్యాంకు ఉద్యోగులు తీసి ఖాతాలు తెరిపించేందుకు సహకారం అందిస్తామన్నారు. ఈ వ్యవహారంపై గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు దండోరాలు వేస్తామని, గోడపత్రికలు వేయిస్తామని ఆయన తెలిపారు. ఇతర బ్యాంకుల్లో ఖాతాలున్నప్పటికి తమ బ్యాంకులో ఖాతాలు తెరిచేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. డిసెంబర్ రెండవ వారం నాటికి నూరు శాతం పూర్తి చేయాలన్నలక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అర్బన్ ఏరియాల్లో కూడా ఈ ఖాతాలు తెరవచ్చునన్నారు. ఈ సమావేశంలో ఏజిఎం సాయి ప్రసాద్, చీఫ్ మేనేజర్స్ పి చంద్రశేఖర్‌రెడ్డి, డివికెఎన్ రావు తదితరులు పాల్గొన్నారు.

అవిశ్వాసంపై మాకు నీతులు చెప్పడం మానండి
* కాంగ్రెస్‌తో వ్యాపారం చేయడమే వైఎస్‌ఆర్‌సిపి యోచన
* ముద్దు, బొజ్జల, చదలవాడ ధ్వజం
తిరుపతి, నవంబర్ 22: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బలం లేదని ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి అవిశ్వాసం పెట్టాలని మాకు నీతులు చెప్పడం మాని, మీకు చేతనైతే గవర్నర్‌కు అవిశ్వాసంపై లేఖ ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టిడిపి తిరుపతి ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తిలు వైఎస్‌ఆర్‌సిపికి సూచించారు. గురువారం తిరుపతిలోని హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్లో వారు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి పన్నాగాలు ప్రపంచానికి తెలియవని భావిస్తోందన్నారు. తాము అవిశ్వాస తీర్మానం పెడితే రాజకీయ వ్యాపారం చేసుకోవడమే వైఎస్‌ఆర్‌సిపి నేతల ఆలోచన అని ఎద్దేవా చేశారు. అంటే మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం.. జగన్‌ను వదిలేయాలని చెప్పడమే ఇందులోని ఆంతర్యమన్నారు. ఇలాంటి పన్నాగాలతోనే రాష్ట్రంలో, కేంద్రంలోని కాంగ్రెస్ పాలకులపై ఎలాంటి విమర్శలు చేయకుండా నోటికి తాళం వేసుకుని ఉన్నారన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి పాత్రయాత్రకు విశేష స్పందన లభిస్తున్న నేపధ్యంలో విజయమ్మ, షర్మిలను విమర్శలు చేస్తున్నారన్నారు. తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంటే జగన్‌కు బెయిల్ ఇవ్వాలని ఆ పార్టీతో కుమ్మకైన వైఎస్‌ఆర్‌సిపి నేతలు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా వుందన్నారు. ఎన్‌టిఆర్‌కు అధికారం పోయి చంద్రబాబుకు అధికారం ఇచ్చిన సందర్భంలో ఆయనకు అండగా ఎన్‌టిఆర్ వెంట తాను నిలిచానని ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఎన్‌టిఆర్ మరణానికి లక్ష్మీపార్వతే కారణమని ఆయన ఆరోపించారు. ఇక ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలువుటద్దం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డి అన్నారు. అలాంటివారిని లక్ష్మీపార్వతి సమర్థిస్తుంటే ఆమె ధోరణి ఏమిటో ప్రజలకు ఇట్టే అర్థమవుతుందన్నారు. లక్ష్మీపార్వతి ప్రవర్తనతో ఎన్‌టిఆర్ ఆత్మక్షోభిస్తుందన్నారు. జగన్ అవినీతిలో విజయమ్మ, షర్మిలకు కూడా వాటా ఉందని వెంటనే వీరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల ఏవిధంగాను ప్రజాప్రతినిధి కాదని, అయితే ఆమె పాదయాత్రకు భారీ ఎత్తున భద్రత కల్పించడం చూస్తుంటే కాంగ్రెస్ ఏ స్థాయిలో కుమ్మక్కు అయిందో స్పష్టం అవుతోందన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు శ్రీనివాసులు, నేసనూరు భాస్కర్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

కత్తులతో దాడి
* ఇద్దరి పరిస్థితి విషమం
రామకుప్పం, నవంబర్ 22: పాతకక్షల నేపథ్యంలో వెంటాడి ముచ్చు కత్తులతో దాడి చేసిన సంఘటన మండలంలోని అత్తికుప్పం పులిమేరల్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈసంఘటనలో ఇద్దరికి బలమైన గాయాలు తగిలి కుప్పం పిఇఎస్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వెంకటరామయ్య(40) కర్ణాటక సరిహద్దు ప్రాంతం అటవీ ప్రాంతంలో కాపలా ఉంటున్నాడు. నెలరోజుల కిందట అత్తికుప్పం గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా కలపను నరికి ఆటోలో తరలిస్తుంటే వెంకటరామయ్య అడ్డుకొని అటవీశాఖ అధికారులకు పట్టించాడు. దీంతో వారు నిందితులకు భారీగా జరిమానా విధించారు. దీంతో వారు వెంకటరామయ్యపై కక్ష కట్టారు. బుధవారం రాత్రి వెంకటరామయ్య కాపలా కాయడానికి వెళ్తు మార్గమధ్యలో పొలాల వద్ద ఉన్న చౌడప్ప అనే రైతుతో కొంతసేపుకూర్చుని మాట్లాడారు. ఇదే సందర్భంలో అత్తికుప్పం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మచ్చుకత్తులు తీసుకొని గుర్తు పట్టకుండా ఉండేందుకు కరెంటు వైర్లను కట్‌చేసి చీకటిలోనే వెంకటరామయ్యపై దాడి చేశారు. అడ్డం వచ్చిన చౌడప్పను కూడా నరికారు. బాధితులు కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు పరుగున వచ్చారు. దీంతో నిందితులు పరారయ్యారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వెంకటరామయ్య, చౌడప్పలను 108అంబులెన్సు ద్వారా కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బంధువులు తెలిపారు. గురువారం ఉదయం బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. వెంకటరామయ్యను విచక్షణ రహితంగా నరకడం భాదాకరమన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేటి నుండి మహతిలో ‘యువలయం’
తిరుపతి, నవంబర్ 23: సంగీత విద్యాబోధన, అభ్యాసన విధానాల్లో నాణ్యత పెంచాలన్న లక్ష్యంతో ‘యువలయం’ పేరుతో తలపెట్టిన దక్షణ భారత సంగీత, యువజోత్సవాలు శుక్రవారం నుండి ఐదు రోజుల పాటు తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. గురువారం తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథిగృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, వైజాగ్ ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. ఆంధ్రా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి 32 బృందాల్లో 250 మంది సంగీత విద్యార్ధులు, వారి గురువులు పాల్గొంటున్నారన్నారు. ప్రతి రోజు యువకళాకారులకు సంగీత పోటీలు, వాగ్గేయ కారుల రచనలు, అందులోని ఆధ్యాత్మికత, వారి జీవిత విశేషాలపై సంగీత సదస్సులు నిర్వహించనున్నామన్నారు. అలాగే సాయంత్రం వేళల్లో బాల కళాకారులకు సంగీతకచ్చేరిలు, ప్రతిభగల సీనియర్ కళాకారులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చివరి రోజున విజేతలుగా నిలిచే బృందాలకు బహుమతులను అందజేస్తామన్నారు. కర్ణాటక సంగీతంలో వున్న కీర్తనలు చాలా వరకూ తెలుగుబాషలో వుండటం మనకు గర్వకారణమన్నారు. ఈ ఉత్సవాల ద్వారా కీర్తనల్లో నిక్షిప్తమై వున్న తెలుగుబాష తియ్యదనాన్ని ఇతర భాషాకళాకారులకు అందించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తిరుమలలోని నాదనీరాజన వేదికపై ప్రదర్శనలను ఇచ్చేవిధంగా కళాకారులను తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు ఒక వేదికగా దోహదపడతాయన్నది తన ప్రగాఢ విశ్వాసమన్నారు. గతంలో తిరుపతిలో జరిగిన యువలయం ప్రాథమిక పోటీలకు విశేష స్పందన లభించిందని, ఈ యువజనోత్సవాలకు కూడా అంతే స్ఫూర్తితో కళాప్రియులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 28వతేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా 15,847 ఆలయాల్లో టిటిడి, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ సంయుక్తంగా రెండవ విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే 400 ఆలయాల్లో గోపూజను కూడా నిర్వహించడం జరిగిందన్నారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్త సంగీత పోటీలు
టిటిడి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సంగీత పోటీలను నిర్వహించనున్నట్లు టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో 300 అన్నమయ్య కీర్తనలకు బాణీలు కట్టి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కీర్తనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి సంగీత పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అష్టోత్తర శతకుంఠాత్మక మహాశాంతియాగం పోస్టర్స్ ఆవిష్కరణ
శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 25న అష్టోత్తర శతకుంఠాత్మక మహాశాంతియాగం నిర్వహించనున్నట్లు ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం పద్మావతి అతిథిగృహంలో ఇందుకు సంబందించి పోస్టర్స్‌ను ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జెఇఓ వై వెంకట్రామిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 150 మంది అర్చకులు 108 హోమగుండాలతో యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఆంద్రా మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకులు ప్రభాకర్, హిందూ దర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి ఎస్ రఘునాద్, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ చల్లా ప్రభావతి, అధ్యాపకులు శబరగిరి తదితరులు పాల్గొన్నారు.

* అధికారులకు కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశం
english title: 
maarpu

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles