కర్నూలు, నవంబర్ 22: ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అంటూ వేలాది గొంతులు తెలుగు తల్లికి లక్షస్వరార్చన నిర్వహించారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహకం గా కర్నూలు నగరంలోని పోలీసు మైదానంలో ‘కందనవోలు సంబరాలు’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లిని కీర్తిస్తూ వేలాది మంది విద్యార్థులు, నేతలు, అధికారులు గొంతు కలిపి ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అంటూ పాడి తెలుగు తల్లిని కీర్తించారు. వేలాది గొంతులు ఒక్క సారిగా పాడటంతో మైదానం చుట్టుపక్కల రహదారుల్లో వెళ్తున్న ప్రజలు సైతం నిల్చుని చిన్నారులు వీనుల విందుగా పాడిన వైనాన్ని ఆస్వాదించారు. అలాగే తెలుగు కవులు, కథకులు, చరిత్రకారులు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో కళాకారులు, కళాశాల విద్యార్థులు అలరించారు. వారు ఒక్కొక్కరు వేదికనెక్కిన సమయంలో ఆ మహానుభావుడి గురించి మాటలు, పద్య రూపంలో వివరిస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి హాజరైన న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, కలెక్టర్ సుదర్శన్ రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు సైతం ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమంలో వీలైనంత వరకూ తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించారు. విద్యార్థులను కూడా ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలని కోరారు. సుమారు 37 సంవత్సరాల తరువాత రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయని మంత్రి ఏరాసు తెలిపారు. ఇక ముందు ప్రతి మూడేళ్లకోసారి మన రాష్ట్రంలో ఈ సభలు నిర్వహించేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎపుడో ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగు తల్లిని కీర్తిస్తే విన్న జనం, ఒక్కసారిగా వేలాది గొంతులు కలిసి లక్ష స్వరార్చనలో భాగంగా తెలుగు తల్లిని కీర్తిస్తూ పాడటం అందరినీ ఆనందింపజేసింది.
హంద్రీనీవాతో సీమ సస్యశ్యామలం
* మంత్రి కన్నా లక్ష్మినారాయణ
క్రిష్ణగిరి, నవంబర్ 22: అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవం తి కాలువ పథకంతో రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని తొగర్చేడు వద్ద వున్న 4వ ఎత్తిపోతలను, కృష్ణగిరి రిజర్వాయర్‌లో కం బాలపాడు వద్ద వున్న 5వ ఎత్తిపోతల ను గురువారం రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, అహ్మదుల్లా, పార్థసారధి, వట్టి వసంతకుమార్, ఏరాసు ప్రతాపరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీమ జిల్లాల రైతుల కోసం అప్పటి సిఎం కోట్ల రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసి హంద్రీనీవా ప్రాజెక్టు కోసం సర్వే చేయించారన్నారు. ఆ తర్వాత కూడా వైఎస్ కాలం నుంచి నేటి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకూ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన చంద్రబాబు, జగన్ వేర్వేరు పార్టీలు పెట్టి పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. నీలం తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాడనికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలోనే మైనారిటీలకు మేలు జరిగిందన్నారు. పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టుకు ఆంటకం కల్గిస్తున్నారని ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుందని అనంతపురం ఎంపి అనంతవెంకట్రామిరెడ్డి తెలిపారు. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ప్రజల కోసం చెరువులు తవ్విస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు వెనుక ముఖ్యమంత్రులు కోట్ల, వైఎస్, కిరణ్‌ల పాత్ర వుందని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నా. గత టిడిపి హయాంలో ప్రాజెక్టుల నిర్మాణానికి పలుమార్లు శంకుస్థాపన చేశారే కానీ వాటిని పూర్తి చేయలేదన్నారు. నాడు వైఎస్ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని పాదయాత్ర చేపడితే, నేడు ఆయన కుమార్తె షర్మిల రాజన్న రాజ్యం తెస్తామని పాదయాత్ర చేపట్టిందని మాధ్యమిక విద్యశాఖ మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు రైతుల రుణాలు, వడ్డీలు మాఫీ చేయని చంద్రబాబు నేడు పదవి కోసం రైతుల జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా హిందుపురం పట్టణానికి చెందిన కురుబ సంఘం నాయకులు మంత్రి రఘువీరాకి గొర్రెపిల్ల, మంత్రి పార్థసారధికి కంబలిని బహూకరించారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు మధుసూదన్‌గుప్తా, సుధాకర్, వెంకట్రామిరెడ్డి, మురళీకృష్ణ, విష్ణు, ఎల్లంపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జోరుగా జీరో వ్యాపారం!
* ఆదోని మార్కెట్ యార్డ్ ఆదాయానికి రూ. కోట్ల గండి!
ఆదోని, నవంబర్ 22: రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో అధికారులు, నేతల అండదండలతో వేరుశెనగ జీరో వ్యాపారం పెద్దఎత్తున సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. మార్కెట్ ఆదాయానికి కోట్ల రూపాయ లు గండి కొడుతున్నా, పట్టించుకునే నాథుడే కరువైయ్యారు. ఆదోని మార్కెట్‌యార్డులో కొనుగోలు చేస్తు న్న 50శాతం వేరుశెనగకు ఏలాంటి లెక్కలు చూపకుండానే వ్యాపారులు జీరో వ్యాపారంతో మహారాష్టక్రు పెద్దఎత్తున తరలిస్తున్నారు. రోజుకు కనీసం 20లారీలు వేరుశెనగ తరలిస్తూ నిబంధనల మేరకు మార్కెట్‌యార్డుకు రెండుశాతం, అమ్మకంపన్ను చెల్లించకుండానే అధికారుల నేతల లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర సరిహద్దు లు దాటుతున్నాయి. ఆదోని మార్కెట్‌యార్డులో నాలుగువైపుల చెక్‌పోస్టులున్నా, వీటితోపాటు శిరుగుప్ప క్రాస్‌లో చెక్‌పోస్టు ఉన్న వ్యాపారులు మామూళ్లు అందజేసి వేరుశెనగను పెద్దఎత్తున తరలిస్తున్నారు. అధికారులకు, నేతలకు నెల మామూళ్లు అందజేస్తున్నట్లు సమాచారం. జీరోలో బిజినెస్ సాగుతున్న విషయం నేతలకు తెలిసిన చేతులు తడపడంతో చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదాయ పన్ను అధికారులకు కూడ పెద్దఎత్తున నెలసరి మామూళ్లు ముట్టచేబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు రాత్రి వ్యాపారులు లారీల్లో వేరుశెనగ సరుకును మహారాష్ట్ర, గుజరాత్‌కు తరలిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుని జీరో వ్యాపారాన్ని అడ్డుకుంటే మార్కెట్ ఆదాయానికి మరో ఒకటిన్నర కోటి ఆదాయం సమకూరుతుంది. లేదంటే మార్కెట్ ఆదాయానికి కోటిన్నర ఆదాయం గండిపడుతుంది. ఇప్పటికైనా అధికారులు, నేతలు తగు చర్యలు తీసుకొని మార్కెట్ ఆదాయానికి గండిపడకుండా చూడాల్సి ఉంది.
హంద్రీనీవా రిజర్వాయర్‌కు నీళ్లొదులుతాం..
ఆందోళన చెందవద్దు..
* రైతులకు కలెక్టర్ భరోసా
పత్తికొండ, నవంబర్ 22: రైతుల ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసిందని కొత్తపల్లె వద్ద నిర్మించిన రిజర్వాయర్‌కు నీళ్లు వదులుతామని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రిజర్వాయర్, హంద్రీనీవా కాల్వ నీటిప్రవాహం క్యాంప్ కార్యాలయం పరిశీలించారు. అనంతరం రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ రైతులు అపోహలు పడొద్దని, రైతులకు నీళ్లు అందించేందుకే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీళ్లు అందివ్వలేకపోయారని, అయితే తప్పకుండా రిజర్వాయర్‌కు నీళ్లు తరలిస్తామని కలెక్టర్ రైతులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి, తహశీల్దార్ రామకృష్ణ, పందికోన, కొత్తపల్లె గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
గ్రామాల్లో రాత్రి బస చేయండి
* చోరీలు అరికట్టి, సొమ్ము రికవరీ చేయండి..
* అధికారులకు ఎస్పీ ఆదేశం
కర్నూలు, నవంబర్ 22: జిల్లాలో దొంగతనాలను అరికట్టడంతో పాటు చోరీకి గురైన సొత్తును తిరిగి రాబట్టేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని కెఎస్ వ్యాస్ ఆడిటోరియంలో గురువారం జిల్లా శాంత్రి భద్రతలపై నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో చోరీలు, హత్యలు అరికట్టాలంటే ప్రతి గ్రామం లో డీఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ ఐ వరకూ రాత్రి బస చేయాలన్నారు. జిల్లాలో రౌడీషీటర్ల జాబితా తయారు చేసి ఆ వ్యక్తి ఉన్నాడా.. లేక చనిపోయాడా అనే విషయమై సమగ్ర విచారణ చేసి కౌనె్సలింగ్ చేయాలన్నారు. 2009 నుంచి కేసులు పెండింగ్ వున్నాయని వాటిని ఈ ఏడాదిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నా రు. కోర్టు వారెంట్లను వెంటనే అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. మత ఘర్ఘణలు జరగకుండా శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజలను చైతన్యం చేయాలన్నారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న మట్కా, పేకాట, వ్యాభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఆదోని ఎఎస్పీ శిమోషి, కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ డీఎస్పీలు లతామాధురి, పిఎన్‌బాబు, అమర్‌నాథ్‌నాయుడు, బిఆర్ శ్రీనివాసులు, జిల్లాలోని సిఐలు పాల్గొన్నారు.
మంత్రాలయం రాఘవేంద్రుడికి
విశేష పంచామృతాభిషేకం
* అలరించిన కార్తీక జ్యోతులు
మంత్రాలయం, నవంబర్ 22: గురువారం రాఘవేంద్రస్వామి బృందావనానికి విశేష పంచామృతాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి రాఘవరాయుడి బృందావనానికి విశేష పూజల్లో భాగంగా నిర్మల్య విసర్జన, సుప్రభాతసేవ, అలంకరణ, పట్టువస్త్ర సమర్పణ సేవలు చేసి రాఘవేంద్రస్వామి బృందావనాన్ని విశేషంగా అలంకరించారు. కార్తీకమాసం సందర్భంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రహ్లాదరాయల వారికి ఉంజలసేవ నిర్వహించి కార్తీక జ్యోతులను వెలిగించారు. ఈ కార్తీక జ్యోతులు భక్తులను విశేషంగా అలరించాయి. మఠం ప్రాంగణంలో గురువారం హైద్రాబాదుకు చెందిన రాధీక బృందంచే సంగీత కచ్ఛేరి నిర్వహించారు. సంగీత కచ్చేరి భక్తులను విశేషంగా అలరించాయి.
మమీ, డాడీ వద్దు.. అమ్మ, నానే్న ముద్దు..
* తెలుగు భాషను గౌరవించండి..
* మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి
కర్నూలు, నవంబర్ 22: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మమీ, డాడీ అని కాకుండా అమ్మ, నాన్న అని పిలవడం నేర్పించాలని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సూచించారు. తెలుగు భాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రపంచ తెలుగు సాంస్కృతిక సంబరా ల కార్యక్రమాల్లో పాల్గొని విజయవం తం చేయాలని మంత్రి పిలుపునిచ్చా రు. నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో గురువారం తెలుగు తల్లికి లక్ష స్వరార్చన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఏరాసు మాట్లాడుతూ 37 ఏళ్ల తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం హర్షణీయమని, ప్రతి ఒక్కరూ తెలుగు భాషను స్వచ్ఛంగా మాట్లాడేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఉత్సవాలు 3 సంవత్సరాలకోసారి నిర్వహించేలా కేబినెట్ సమావేశంలో ప్రస్తావిస్తానని తెలిపారు. డిసెంబర్ 27, 28, 29 తేదీ ల్లో తిరుపతిలో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు గ్రామీణ ప్రాంతాల నుంచి సమయాత్తమై కర్నూలు జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయా ల్లో ఉత్తర ప్ర త్త్యుత్తరాలు తెలుగులోనే జరపాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడు తూ తెలుగు భాష ఎంతో గొప్పదని, నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ తెలుగు భాషను గౌరవించి ఎన్నో గ్రంథాలు రచించారన్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్ర తి ఒక్కరు తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలను అలవర్చుకోవాలన్నారు. అ నంతరం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన పోటీ ల విజేతలకు, పాఠశాలల యాజమాన్యాలకు జ్ఞాపికలు అందజేశారు. కా ర్యక్రమంలో డిఇఓ బుచ్చన్న, డిపిఆర్ ఓ తిమ్మప్ప, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు కల్కూర చంద్రశేఖర్, తెలుగు భాష వికాస సమితి అధ్యక్షులు శర్మ, ప్రైవేట్ పాఠశాలల అసోషియేషన్ అధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎఓ సంపత్‌కుమార్, ఆర్‌విఎం పిఓ పద్మకుమారి, డిప్యూటీ డిఇ ఓ శైలజ, సిపిఓ ఆనంద్‌నాయక్, డిఎంహెచ్‌ఓ డా.నరసింహులు పాల్గొన్నారు.
జిల్లాలో ముగిసిన షర్మిల పాదయాత్ర
* తుంగభద్ర బ్రిడ్జి వద్ద ఘనంగా వీడ్కోలు
కల్లూరు, నవంబర్ 22: వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టిన పాదయాత్ర గురవారం జిల్లాలో ముగిసి మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రను ఘనంగా సాగనంపారు. షర్మిల పాదయాత్ర ఈ నెల 8వ తేదీ అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. అందులో భాగంగా మంగళవారం రాత్రి నగరంలోకి ప్రవేశించగా అశేష జనవాహినితో పాదయాత్ర సాగింది. కోడుమూరు రోడ్డులో నగరంలోకి ప్రవేశించిన షర్మిలకు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ రోజు రాత్రి నగర శివారులో వున్న క్లారెంటు పాఠశాలలో బస చేసిన షర్మిల బుధవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించింది. అదే రోజు సాయంత్రం స్థానిక పాతబస్టాండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ కళాశాలలో రాత్రి బస చేసిన షర్మిల, విజయమ్మ గురువారం ఉదయం జిల్లాను దాటి మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లా ముఖద్వారమైన తుంగభద్ర బ్రిడ్జిపై ఇటు వీడ్కోలు పలకడానికి కర్నూలు జిల్లా ప్రజలు అటు తమ జిల్లాలోకి షర్మిలను ఆహ్వానించడానికి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఒకేసారి కలవడంతో తుంగభద్ర బ్రిడ్జి ప్రజలతో నిండిపోయింది. 3 గంటలుగా ట్రాఫిక్ స్తంభించడంతో హైదరాబాద్ వైపు, కర్నూలు వైపు వెళ్లే బస్సులు, లారీలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. జిల్లాలో పాదయాత్రకు వీడ్కోలు పలికిన వారిలో మాజీ ఎంపి భూమానాగిరెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నాయకులు నిడ్డూరు రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి ఉన్నారు.