Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దేశంలో మధ్యంతరం ఖాయం

$
0
0

కావలి, నవంబర్ 22: ప్రస్తుత అస్తవ్యస్త రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో దేశంలో ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని రైతు బజారును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం సవ్యంగా లేవని చెప్పారు. ఈనేపధ్యంలో తమ పార్టీ అధినేత ముందస్తు వ్యూహంతో ఎన్నికల పోరాటానికి సర్వం సిద్ధం చేస్తున్నారని, ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో తనను నెల్లూరు నుండి పార్లమెంట్‌కు పోటీ చేయించాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు కొంతమంది నాయకులు చెపుతున్నారని అన్నారు. కాగా, తాను అధిష్ఠాన వర్గానికి పూర్తి విధేయుడిగా వుంటానని, తాను మాత్రం కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎప్పుడైనా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గత ఎన్నికలలో తాను ప్రజలకు అనేక హామీలు ఇవ్వగా, ప్రతిపక్ష పార్టీలో వుండి అవన్నీ పూర్తిచేయలేకపోయానని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇచ్చిన హామీలన్నీ పూర్తిచేయాల్సి వుందన్నారు. ఈనేపధ్యంలో తమ పార్టీ అధినేతలకు ఈపరిస్థితిని వివరించి తాను నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేలా చూసుకుంటానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్‌కు పోటీచేయబోనని వివరించారు. అభివృద్ధి పనుల కోసం జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో సఖ్యతగా వుంటూ నిధులు మంజూరు చేయించుకుంటున్నానని, కానీ కొంతమంది తానేదో తప్పు చేస్తున్నట్లు, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌పార్టీలోకి వెళ్ళే ఉద్దేశ్యం వున్నట్లు చెపుతున్నారని, ఇది సరికాదని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, మిగిలిన కాలమంతా నాయకులంతా అభివృద్ధిపైనే దృష్టిపెట్టాలని ఆయన చెప్పారు. తాను తుదిశ్వాస విడిచేవరకు తెలుగుదేశం పార్టీలో వుంటానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రైతు బజారును రైతుల కోసమే వినియోగించాలి
అంతకుముందు రైతు బజారు ఎమ్మెల్యే బీదా తనిఖీ చేయగా, వివిధ స్టాల్స్‌లో వున్న రైతులను వాకబు చేసి ఎదుర్కొంటున్న సమస్యలను, కావాల్సిన సౌకర్యాలపై వాకబు చేశారు. మొత్తం 62షాపులు వుండగా, పలువురు స్థలా భావంతో వెలుపల ఎండకు, వానకు తడుస్తూ వ్యాపారాలు చేసుకుంటున్న విషయాన్ని గమనించారు. అనంతరం ఎస్టేట్ అధికారి కార్యాలయంలో రికార్డులను పరిశీలించి విధి నిర్వహణలో వున్న అధికారి మధును వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 27న రైతు బజారులో సమావేశం నిర్వహించి చేయవల్సిన అభివృద్ధి పనులు నిర్వహణపర విషయాలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు విలేఖరులకు వివరించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు రైతులకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో దీనిని ప్రారంభించగా, కావలిలో సక్రమంగానే జరుగుతున్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, రైతుల ముసుగులో కొంతమంది వ్యాపారులు వున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పూనూరు రవికుమార్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి గాదంశెట్టి వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షులు పాలడుగు రంగారావు, మైనార్టీ నాయకులు ఖలీల్, ఖమర్‌బాబు, ఆత్మకూరి బ్రహ్మయ్య, మొగిలి కల్లయ్య, కోటేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు.
రొట్టెల పండుగకు
విస్తృత ఏర్పాట్లు

నెల్లూరుసిటీ, నవంబర్ 22: నెల్లూరు దర్గామిట్టలోని బారాషాహిద్ దర్గాలో మొహరం పండుగ సందర్భంగా జరిగే రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి సమిక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రొట్టెల పండుగకు 5లక్షలపైన భక్తులు దర్గాను సందర్శించే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఇప్పటి నుంచే పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 24నుంచి 28వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుందన్నారు. భక్తులు 23వ తేదీ సాయంత్ర నుంచే దర్గాకు వస్తుంటారన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ రొట్టెల పండుగకు విదేశాలనుంచి
భక్తులు వస్తుంటారన్నారు. దర్గాను సందర్శించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు 300 మందితో జంబో దర్గా కమిటీని నియమించినట్లు తెలిపారు. ముందుగా పోలీసు అధికారులతో రొట్టెల పండుగ సందర్భంగా దర్గా ఆవరణలో ఏర్పాటు చేస్తున్న బందోబస్తును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగర డిఎస్పీ వెంకటనాధ్‌రెడ్డి మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు మొత్తం 1675 మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గంధమహోత్సవం రోజున మరో 200 మంది పోలీసులను బందోబస్తు కింద అదనంగా నియమిస్తున్నట్టు తెలిపారు. వారితో డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు కూడా ఉంటారని పేర్కొన్నారు. రొట్టెల పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 86 పాయింట్ల దగ్గర పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రొట్టెల మార్పిడి దగ్గర బోట్‌లు, గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామన్నారు. వాహనాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేసే విధంగా ట్రాఫిక్ పోలీసులను పార్కింగ్ స్థలాలో నియమిస్తామన్నారు. దర్గా ఆవరణలో దొంగతనాలు జరగకుండా మఫ్టీలో క్రైం పోలీసులు సంచరిస్తుంటారన్నారు. దర్గా ఆవరణలో పోలీసు ఔట్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దర్గాలో ఆవరణలో సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా వైద్యాధికారులతో చర్చించి దర్గా ఆవరణలో వైద్యశిబిరం ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. 24గంటల పాటు డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా అవసరమైన ఎమర్జెన్సీ మందులను కూడా సిద్ధంగా ఉంచుకుంటామన్నారు. ఇనుమడుగు సెంటర్, అయ్యప్పగుడి సెంటర్‌లో రెండు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. దర్గా ఆవరణలో 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా 108 వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుతామని చెప్పారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం లోపల చెరువులో నీరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ అంతరాయం కలగకుండా దర్గా ఆవరణలో అదనంగా మూడు ట్రాన్స్‌పార్మ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా రెండు జనరేటర్లను సిద్ధంచేస్తున్నట్టు చెప్పారు. ఆర్‌టిఓ అధికారులతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచే భక్తులకు దర్గాకు వచ్చేందుకు రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ నుంచి ఉచితంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా బొల్లినేని హాస్పిటల్ దగ్గర ఒక ఆర్టీసీ పాయింట్, వెంకటాచలం దగ్గర ఒక పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కడప, విజయవాడకు రొట్టెల పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ టిఎస్‌ఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు ఇబ్బంది లేకుండా మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 3షిఫ్ట్‌లలో పారిశుద్ధ్య కార్మికులు దర్గా ఆవరణంలో ఉంటారని తెలిపారు. దర్గా ఆవరణ కాంతి వంతంగా ఉండే విధంగా 1000 లైట్లను వేస్తున్నట్లు పేర్కొన్నారు.
దర్గాకమిటీ చైర్మన్‌గా జాకీర్
రొట్టెల పండుగ సందర్భంగా నూతనంగా ఎన్నికైన దర్గా కమిటీ చైర్మన్ జాకీర్‌ను ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, మునిసిపల్ కమిషనర్ టిఎస్‌ఆర్ ఆంజనేయులు సన్మానించారు. ఈ కమిటీ ఏడాది పాటు ఉంటుంది.
జాయింట్ కలెక్టర్ సన్మానం
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా లక్ష్మీకాంతం శుక్రవారం ఉద్యోగ బాధ్యతులు చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ టిఎస్‌ఆర్ ఆంజనేయులు, ఆర్‌డిఓ మాధవీలత ఘనంగా సన్మానించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీకాంతంకు ఐఎఎస్ హోదా రావడంతో ప్రమోషన్‌పై నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు అధికారులు ఆయన్ని అభినందించారు. ఈ సమావేశంలో డిసిసి ఇన్‌చార్జ్ చాట్ల నరసింహారావు, జాకీర్, మేకల నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు
అవగాహన
కల్పించాలి

సూళ్లూరుపేట, నవంబర్ 22: ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, మార్పు కార్యక్రమాన్ని జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం పేదలకు అందించే పథకాలపై నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్పు కార్యక్రమాన్ని అధికారులు గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవ్వాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మాతా శిశు మరణాల నివారణకు అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు గ్రామాల్లో పొదుపుగ్రూపు సభ్యులతోపాటు అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు పేదలు వచ్చే విధంగా అధికారులు నమ్మకం కలిగించాలన్నారు. రోగులకు ఎళ్లవేళలా మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆరో విడత భూ పంపిణీలో అర్హులైన వారిని గుర్తించి వారికే భూములు చూపించి పట్టాదారు పాసుపుస్తకం అందజేయాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు అందేలా చూడాలన్నారు. జిల్లాలో లక్షమంది కౌలు రైతులకు 100కోట్ల రూపాయలు రుణాలుగా అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేస్తే పూర్తిస్థాయిలో రుణాలు అందించవచ్చన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, ఎమ్మెల్యే పరసా రత్నం నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీసిఇవో వీరభద్రయ్య, సబ్‌కలెక్టర్ నివాస్, డిఆర్‌డిఎ పిడి వెంకటసుబ్బయ్య, ఎస్సీ, బిసి కార్పొరేషన్ ఇడిలు సోమయ్య, కోటేశ్వరరావు, వ్యవసాయశాఖ జెడి సుబ్బారావు, డిఎస్‌వో ఉమామహేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ హుస్సేన్‌రెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల తహశీలార్లు, ఎంపిడివోలు, అధికారులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యం పట్టివేత
కావలి, నవంబర్ 22: మండలంలోని మద్దూరుపాడు గ్రామం నుండి సిరిపురం గ్రామానికి వెళ్లే అటవీమార్గంలో ఓ లారీలో అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని రూరల్ పోలీస్ కానిస్టేబుల్ వినోద్, సిబ్బంది పట్టుకున్నారు. రేషన్‌బియ్యం గల లారీ ప్రకాశం జిల్లా నుండి కావలి పట్టణానికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక ఎఎంసి కార్యాలయ చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పసిగట్టిన లారీ డ్రైవర్ సమీపంలోని ఓ విత్తన తయారీ కేంద్రం పక్కనే గల మార్గం నుండి అటవీ ప్రాంతంలోకి వాహనాన్ని మళ్లించగా గమనించిన పోలీసులు దానిని అనుసరించారు. సిరిపురం గ్రామానికి వెళ్ళే రోడ్డు వద్ద లారీని వదిలి అందులోని డ్రైవర్‌తో పాటు కూలీలు పరారయ్యారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సరుకును పరిశీలించగా ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో గల రేషన్ దుకాణాల నుండి సేకరించిన పిడిఎస్ బియ్యంగా గుర్తించారు. ఇందులో మధ్యాహ్న భోజనంకు సంబంధించిన బియ్యం బస్తాలు ఉండటం విశేషం. రూరల్ ఎస్‌ఐ గిరిబాబు అక్కడకు చేరుకుని లారీని స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో వుంది. కాగా, రెండునెలల్లో ఆరు లారీల బియ్యాన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ వినోద్‌కు పోలీసు అధికారులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

టిడిపి వైద్య విభాగం అధ్యక్షులుగా శివప్రసాద్
నెల్లూరు కల్చరల్, నవంబర్ 22: తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం (డాక్టర్స్‌సెల్) జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ రాపూరు శివప్రసాద్‌ను నియమించినట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ అమ్మనబ్రోలు శ్రీ్ధర్‌రెడ్డిని నియమించినట్టు తెలియచేశారు.

ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి
* జెసి లక్ష్మీకాంతంకు విద్యార్థి జెఎసి విజ్ఞప్తి
నెల్లూరు కల్చరల్, నవంబర్ 22: కళాశాల, హాస్టల్ నిధులు దుర్వినియోగం చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్న డికెడబ్ల్యు కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీమాంధ్ర యువజన విద్యార్థి జెఎసి నేతలు జెసి లక్ష్మీకాంతంను కోరారు. ఈమేరకు గురువారం వారు జెసి లక్ష్మీకాంతంను కలిసి వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ ముక్కు రాధాకృష్ణగౌడ్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ అవినీతి, అక్రమాలు తారాస్థాయికి చేరుకున్నాయన్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం హాస్టల్ కూడా డికెడబ్ల్యు కళాశాల ప్రాంగణంలోనే ఏర్పాటుచేయడంతో వారినిసైతం వేధిస్తున్నారన్నారు. కుల, మత ప్రాంతాల పేరుతో దూషిస్తున్నారని చెప్పారు. నియంతలా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ తీరుకు భయపడి విద్యార్థినులు హాస్టల్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారన్నారు. కళాశాల, హాస్టల్‌కు సంబంధించిన వివిధ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని, లక్షలాది రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని రాధాకృష్ణ ఆరోపించారు. ప్రిన్సిపాల్ నియంతృత్వ విధానం, నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపి విద్యార్థినులకు న్యాయం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, నరేష్ గౌడ్, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నాయకులు దొరబాబు, మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, రాము, ప్రసాద్, గోపాల్, రసూల్, నర్సింహులు, రమేష్, పాపయ్య,శీను తదితరులు పాల్గొన్నారు.

ఐఇఆర్‌టి ఉద్యోగాలు భర్తీచేయాలి
* విఆర్‌సిసెంటర్‌లో రాస్తారోకో
నెల్లూరు కల్చరల్, నవంబర్ 22: ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ (మానసిక వికలాంగుల శిక్షణ ఉపాధ్యాయులు) ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ గురువారం సీమాంధ్ర యువజన విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో విఆర్‌సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో ఐఇఆర్‌టి పోస్టులు భర్తీ చేశారని, నెల్లూరు జిల్లాలో పోస్టుల భర్తీకి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే రాజీవ్ విద్యామిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేసినా ఇంతవరకు పోస్టులు భర్తీ చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుతం చిన్నారి చూపు కార్యక్రమంలో ఐఇఆర్‌టి అభ్యర్థులకు శిక్షణ కూడా ఇచ్చి నియామకాలు జరిపినా జిల్లాలో మాత్రం పట్టించుకోలేదన్నారు. ఆర్‌విఎం పిఓ కనీసం మెరిట్ జాబితా కూడా తయారుచేయలేదన్నారు. జిల్లాలో 30 మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున, 16 మండలాల్లో ఇద్దరు వంతున పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా పిఓ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా అధికారులు తక్షణమే చొరవ తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేసి వికలాంగ విద్యార్థులు, వికలాంగ వయోజనులు, వికలాంగ వృద్ధులకు పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు అవసరమైన పింఛన్లు, చేతికర్రలు, ట్రైసైకిళ్లు, విద్య, వైద్యం తదితరాలు త్వరిత గతిని చేరేలా చూడాలన్నారు. రెగ్యులర్ టీచర్లకు కూడా మానసిక వికలాంగ విద్యార్థులకు ఉపయోగపడేలా శిక్షణ ఇప్పించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. రాస్తారోకో అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతంకు వినతిపత్రం అందచేశారు. ఈకార్యక్రమంలో సీమాంధ్ర విద్యార్థి,యువజన జెఎసి రాష్ట్ర కోకన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, నగేష్‌గౌడ్, ఐఇఆర్‌టి అభ్యర్థులు వెంకటేశ్వర్లు, నర్సింహులు, మాల్యాద్రి, రమేష్, రామ్‌ప్రసాద్,పాపయ్య ,శీను, జెఎసి నాయకులు పాల్గొన్నారు.

ముస్లిం యువకుల అరెస్టులు ఆపండి
* స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ విజ్ఞప్తి
నెల్లూరు కల్చరల్, నవంబర్ 22: రాష్టవ్య్రాప్తంగా అమాయక ముస్లిం యువకుల అరెస్టులను ఆపాలని కోరుతూ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నగర శాఖ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు నగర శాఖ సభ్యులు జిల్లా జెసి లక్ష్మీకాంతంను గురువారం కలిసి వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా నగరాధ్యక్షుడు షేక్ ఖయ్యుం బాషా మాట్లాడుతూ అమాయకులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలన్నారు. కొన్ని కేసుల్లో మైనార్టీ హక్కుల కమిషన్ ఇతర సంస్థల జోక్యంతో ఆర్థిక నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. చాలా కేసుల్లో బాధితులు అన్యాయంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో వారికి జీవనోపాధి,నివాస ప్రదేశం కల్పించాలన్నారు. కేసులను దీర్ఘకాలం సాగదీయకుండా త్వరగా ముగిసేలా కాలవ్యవధిని నిర్ణయించాలని కోరారు. అమాయకులను కేసులు ఇరికించేందుకు నేర పరిశోధక సంస్ధలు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఉంటే అందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మత కల్లోలాల బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో కార్యదర్శి షేక్ అక్బర్, ఇమ్రాన్, హమీద్‌ఖాన్, రషీద్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుత అస్తవ్యస్త రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో దేశంలో ఎప్పుడైనా
english title: 
snap poll

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>