ఒంగోలు, నవంబర్ 22: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సర్దుబాటు సుంకం పేరుతో అదనపు భారం మోపుతోంది. దీంతో విద్యుత్ వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతినెలా జిల్లావ్యాప్తంగా 8 కోట్లరూపాయలకు పైగానే అదనపు భారాన్ని వినియోగదారుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఆమేరకు విద్యుత్ బిల్లులను ట్రాన్స్‌కో అధికారులు వినియోగదారులకు అందచేస్తున్నారు. ఆ బిల్లులను చూసి వినియోగదారులు ఠారెత్తిపోతున్నారు. ఇంధన సర్దుబాటు పేరుతో ఈసంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వినియోగదారులు వాడిన విద్యుత్‌ను ప్రామాణికంగా తీసుకుని యూనిట్‌కు 1.45 రూపాయల మేర ఆదనపు భారాన్ని మోపారు. ప్రధానంగా వేసవికాలంలో ఎసిలు, కూలర్లు, ఫ్యాన్లను ప్రజలు అధికంగా వినియోగిస్తారు. ఆ వినియోగాన్ని తీసుకుని విద్యుత్ భారాన్ని వేయడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ భారం మరో రెండు నెలలు పాటు ఉండనుండటంతో వినియోగదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా గృహ వినియోగదారులకు, పరిశ్రమలకు ఒకే రేటు ప్రకారం ఇంధన సర్దుబాటు సుంకాన్ని విధించారు. దీంతో గృహవినియోగదారులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ బిల్లు 1500 రూపాయలు వస్తే ఇంధన సర్దుబాటు సుంకం ఐదువందల రూపాయల వరకు అదనంగా ఉంటోంది. దీంతో రెండు వేల రూపాయలను వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు ఏడు లక్షల యూనిట్లు అవసరం కాగా విద్యుత్ కోతలతో ఐదులక్షల యూనిట్లను మాత్రమే సరఫరా చేస్తున్నారు. జిల్లాలో విద్యుత్ కోతలు అమలౌతూనే ఉన్నాయి. ప్రధానంగా గ్రామాల్లో విద్యుత్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. రాత్రివేళల్లో అప్రకటిత విద్యుత్‌కోతలు అమలౌతుండటంతో గ్రామీణప్రాంత ప్రజలు విష పురుగులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయకపోగా అధిక బిల్లులు బాదటం ఏమిటని జిల్లాప్రజలు ట్రాన్స్‌కో అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా పరిశ్రమల యజమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలంలో వారానికి మూడు రోజులపాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేయటంతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. కొన్ని పరిశ్రమలు మూతవేసే దశకు వచ్చాయి. కూలీలకు నెల జీతాలను కొంతమంది యజమానులు చెల్లించలేక వారిని పంపించివేశారు. ప్రధానంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వాడిన విద్యుత్‌కు ప్రస్తుతం ఇంధన సర్దుబాటు సుంకాన్ని వసూలు చేయటం ఏమిటని పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు.
గ్యాస్ పంపిణీలో చేతివాటం
నెలకు కోటికి పైగా అక్రమార్జన
కందుకూరు, నవంబర్ 22: అసలుకంటే కొసర మిన్న అన్నచందంగా గ్యాస్ వినియోగదారులపై రోజురోజుకి భారం పెరుగుతూనే ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర 26.50పైసలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈపెంపు సబ్సిడీపై సిలిండర్లు తీసుకుంటున్న వారికి ఈధరలు వర్తించవని పెంచిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ పై ఇటీవల పలుసార్లు పెంచుతూనే వచ్చారు. ప్రస్తుతం సిలిండర్ ధర 450కి చేరుకుంది. ఒక కుటుంబానికి ఏడాదికి 6సిలిండర్లు మాత్రమేనని కేంద్రం తేల్చిచెప్పింది. బండ ఇంటికి తెచ్చినందుకు అసలు ధరకు అదనంగా 20నుంచి 25రూపాయలు ఇవ్వాల్సిందేనని డెలివరీబాయ్ డిమాండ్ చేస్తున్నాడు. పొయ్యి వెలిగితేచాలు అదే పదివేలు అన్నట్లు కష్టాలకోర్చి ప్రజలు గ్యాస్‌ను తీసుకుంటున్నారు. జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీలు సరఫరా చేస్తున్న సిలిండర్లలో తక్కువ గ్యాస్ ఉండడంతో వినియోగదారులు గుండెలు బాదుకుంటున్నారు. జిల్లాలో నెలకు పంపిణీ చేసే 1.5లక్షల సిలిండర్లలలో ఎక్కువభాగం ఇలాంటివే వస్తున్నాయి. నల్లబజారులో కిలో గ్యాస్ 120నుంచి 150రూపాయల చొప్పున విక్రయిస్తూ వినియోగదారులను నిట్టనిలువునా ముంచుతున్నారు. జిల్లాలో 51ఏజెన్సీల పరిధిలో సుమారు 5,38,337గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో 3,54,750 డబుల్ సిలిండర్ల కనెక్షన్లు కాగా, 1,72,554 సిగింల్ సిలిండర్లు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గతంలో సిలిండర్ ధర 406రూపాయలు ఉంటే, ప్రస్తుతం 450రూపాయలు వసూలు చేస్తున్నారు. అదనంగా మరో 20రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీల వారు వినియోగదారుడికి ఇచ్చే సిలిండర్ బిల్లులో మాత్రం ఒక రేటు ఉంటే, వసూలు చేసేది మరొకరేటుగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో అదనంగా 30రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సిలిండర్‌కు అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వచ్చేనెలలో సమయానికి సిలిండర్ ఇస్తారోలేదోనని వినియోగదారులు భయపడుతున్నారు. దాంతో సిలిండర్ల అదనపు దోపిడీపై ఎవరూ అధికారులకు ఫిర్యాదు చేసే సాహసం చేయడం లేదు. జిల్లాలో 5లక్షల 38వేలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. సుమారు నెలకు కోటి రూపాయలకుపైగా అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఆయిల్ కంపెనీల అధికారులు, జిల్లా పౌరసరఫరాశాఖ అధికారుల పర్యవేక్షణ ఉన్నా లేనట్లే అవుతుంది. గ్యాస్ ఏజెన్సీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్, ఎఎస్‌ఓలు, డిఎస్‌ఓలు, జిల్లా జెసి, జిల్లా కలెక్టర్ తనిఖీ చేయవచ్చు. అయితే ఇవేమీ నామమాత్రంగా కూడా సాగనందువల్లే పలు ఏజెన్సీల నిర్వాహకులు దండుకుంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్‌పై అదనపు భారాన్ని తగ్గించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సాంస్కృతిక సదస్సులు విజయవంతం చేయాలి
కలెక్టర్ అనితారాజేంద్ర ఆదేశించా
ఒంగోలు, నవంబర్ 22: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జిల్లాలో జరిగే సాంస్కృతిక సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక సిపిఓ సమావేశ మందిరంలో ప్రపంచ తెలుగు మహాసభలకు చేపట్టవల్సిన కార్యక్రమాలపై జిల్లా అధికారులు, కవులు, మేధావులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు వచ్చే నెల 27, 28, 29 తేదీలలో తిరుపతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అందులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 25 నుండి 30వ తేది వరకు సాంస్కృతిక సదస్సులు నిర్వహించాలన్నారు. మండలస్థాయిలో వచ్చేనెల 1 నుండి 8వ తేది వరకు సదస్సు నిర్వహించాలన్నారు. డివిజన్ స్థాయిలో వచ్చే నెల 10 నుండి 14వ తేది వరకు జిల్లా కేంద్రంలో 19 నుండి 20వ తేది వరకు సాంస్కృతిక సదస్సులు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో తెలుగు ప్రపంచ మహాసభల విశిష్టతను చాటిచెప్పే విధంగా ప్రత్యేక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక వైభవాన్ని తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో వచ్చేనెల 19వ తేదిన తెలుగు చరిత్ర, సాంస్కృతిక, సాహిత్యాలపై సదస్సులు, తీర్మానాలు, కవి సమ్మేళనాలు, సాహితి విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పల్లె పదాలు, జానపద కళారూపాలు, సురభి నాటకాలు, ఆపాత మధుర చలనచిత్రాలు, ప్రపంచ తెలుగు పుస్తక ప్రదర్శనలు, పురావస్తు హస్తకళలు, పుష్ప ప్రదర్శనలు, తెలుగువంటకాలు, తెలుగువారి క్రీడలతోపాటు మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో సాంస్కృతిక సదస్సుల నిర్వహణకు జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థాయిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన వారికి మండల స్థాయిలో నిర్వహించే సాంస్కృతిక పోటీలకు పంపిస్తామన్నారు. మండలస్థాయిలో గెలుపొందిన విజేతలను డివిజన్ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. డివిజన్‌లో గెలుపొందిన విజేతలను జిల్లాస్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తామన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన విజేతలను తిరుపతిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు పంపిస్తామన్నారు. నగరంలో ప్రముఖ సాహితీ కవుల పేరుతో ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా జిల్లాలో సాంస్కృతిక సదస్సులు నిర్వహించాలన్నారు. వచ్చేనెల 19వ తేదిన రంగా భవన్‌లో కవి సమ్మేళనం జరుగుతుందన్నారు. 20వ తేది సౌత్ బైపాస్‌లోని మినీ స్టేడియం నుండి పివిఆర్ స్కూల్ వరకు తెలుగుదనం ఉట్టిపడే విధంగా కళాకారులు ప్రత్యేక వేషధారణతో, పాఠశాల విద్యార్థులతో ర్యాలీ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పివిఆర్ హైస్కూల్ మైదానంలో జిల్లాస్థాయి సాంస్కృతిక సదస్సు జరుగుతుందన్నారు. జిల్లాలో కళాక్షేత్రం, ఓపెన్ ఆడిటోరియం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి లక్ష్మీనృశింహం, అదనపు సంయుక్త కలెక్టర్ జి గంగాధరం, జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి, జిల్లా పరిషత్ సిఇఓ జి గంగాధర్‌గౌడ్ తదితర అధికారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.
పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం
ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖరరావు స్పష్టం
ఒంగోలు అర్బన్, నవంబర్ 22: పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖరరావు అన్నారు. చీరాల మండలం అయోధ్య నగర్‌లో ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ అయోధ్యనగర్ వాసులు ఆర్‌డిఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరాహారదీక్షలు గురువారం మూడవ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు ప్రారంభించి మాట్లాడారు. మద్యం షాపును తమ గ్రామంలో ఏర్పాటు చేయవద్దని, తమ కుటుంబాలు వీధిన పడతాయని మహిళలు గత కొన్ని నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే కలెక్టర్ అనితా రాజేంద్ర పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా అధికారుల తీరు ఉందన్నారు. అయోధ్యనగర్‌లో వెంటనే మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ పక్కనే ఉన్న షాపును వెంటనే మార్చాలన్నారు. చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ ధన దాహానికి, అధికార దాహానికి మడుగులెత్తే అధికారులు ఉన్నంతకాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. అధికార దౌర్జన్యం ఎంతోకాలం సాగదని, కచ్చితంగా వివిధ రూపాలలో పోరాటాలు ఉద్ధృతం చేసి సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం కార్యదర్శి వి హనుమారెడ్డి, వివిధ సంఘాల నాయకులు ఎస్‌డి సర్దార్, ఎస్ పాలస్, ఎం విజయ, మోహన్‌రావు, పున్నారావు, పివి కోటయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ దీక్షల్లో అయోధ్యనగర్ వాసులు కూర్చున్నారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఒంగోలు అర్బన్, నవంబర్ 22: పెండింగ్‌లో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నేతలు చేపట్టిన దీక్షలు గురువారం నాటికి నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నేతలు మాట్లాడుతూ ఆరుగురు విద్యార్థి నాయకులకు నాలుగు రోజులుగా అన్నపానీయాలు లేకుండా రోడ్లపై టెంట్లు వేసి కూర్చుంటే అధికారులు సమస్యల గురించి పట్టించుకోకుండా ఏసి గదుల్లో సేద తీరుతున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా దీక్షలకు మద్దతుగా రాస్తారోకోలు, వివిధ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దీక్షలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యారంగ సమస్యలపై పలు దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న అధికారుల్లో స్పందన మాత్రం రాలేదన్నారు. జిల్లాలో యూనివర్శిటీ ఏర్పాటు చేయకుండా ఉన్నత విద్యకు జిల్లా విద్యార్థులను దూరం చేస్తున్నారని మండి పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ నగర కమిటి అధ్యక్షుడు మాధవరావు, గౌరవాధ్యక్షుడు పి కిషోర్ కుమార్‌లు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. దీక్షలకు మద్దతుగా ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ ట్రెజరర్ రామచంద్రరావు, ఐఎల్‌టిడి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ప్రభుదాసు, పౌరసంఘాల సమాఖ్య కన్వీనర్ జి రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌డి సర్దార్, పి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఈ దీక్షల్లో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు బి రఘురాం, పి కిరణ్, పి రాంబాబు, పి ప్రవీణ్, ఇ శ్యాం, వై రమేష్ తదితరులు కూర్చున్నారు.
ఇళ్ల పట్టాలు ఇచ్చేవరకు పోరాటం:సిపిఎం
ఒంగోలు అర్బన్, నవంబర్ 22: ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేంతవరకు, కాలనీల్లో వౌలిక సదుపాయాలు కల్పించేంతవరకు పేదలు సంఘటితంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ ప్రభుదాసు పిలుపునిచ్చారు. ఆర్‌డిఓ కార్యాలయం ముందు సిపిఎం నేతలు చేపట్టిన దీక్షలు గురువారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సిపిఎం నగర కమిటి సభ్యులు తంబి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభుదాసు మాట్లాడుతూ పేదల సమస్యలపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి జివి కొండారెడ్డి మాట్లాడుతూ 8వ వార్డు అశోక్‌నగర్‌లో నివసిస్తున్న 80 మంది పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేశవరాజుకుంట, ఎన్‌టిఆర్ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, మోటూరు ఉదయం కాలనీలలో మిగిలి పోయిన పేదలకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ కాలనీల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కారుసాల శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు కెఎఫ్ బాబు, ఎ శ్రీనివాసరావు, ఆర్ శ్రీనివాసరావు, వివిధ కాలనీల నాయకులు ఎం వెంకటేశ్వరరావు, భావనారాయణ, సరస్వతి, బాబూరావు, దావీదు, శ్రీను, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అసిస్టెండ్ డిఇఓ
శింగరాయకొండ, నవంబర్ 22: మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలో జువ్వలగుంట చెరువు సమీపంలో రైల్వే ట్రాక్‌పై నుండి ప్రస్తుతం రోడ్డు ఉండగా, అటువైపు రాకపోకలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉండడంతో రైల్వేట్రాక్ కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని 2.5లక్షల వ్యయంతో నిర్మించనున్నట్లు విజయవాడకు రైల్వే అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్ సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన శింగరాయకొండ తహశీల్దార్ అంబటి వందనంతో కలిసి బ్రిడ్జి నిర్మాణం చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని సర్వేచేయించి బ్రిడ్జి నిర్మాణానికి అనుగుణంగా ఉండే స్థలాన్ని పరిశీలించారు. ఈబ్రిడ్జి నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట రైల్వే జెఇ నీలాద్రిరాజు, శింగరాయకొండ ఆర్‌ఐ వెంకటలక్ష్మి, సర్వేయర్ బాలవీరాంజనేయులు, విఆర్వో రవి తదితరులు ఉన్నారు.
పాడి రైతులకు ప్రోత్సాహం:చల్లా
ముర్రాజాతి విత్తన దున్నపోతులు పంపిణీ
ఒంగోలు, నవంబర్ 22: పాడి రైతులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. పాడి పరిశ్రమ రైతులకు, సహకార సొసైటీలకు ముర్రాజాతి విత్తన దున్నపోతులను డెయిరీ చైర్మన్ చల్లా పంపిణీ చేశారు. డెయిరీ ఆధ్వర్యంలో ముర్రాజాతి విత్తన దున్నపోతుల పంపిణీ కార్యక్రమం గురువారం స్థానిక డెయిరీలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్యఅతిధిగా హాజరైన ఆంధ్రబ్యాంకు ఎజిఎం వి శివనాగిరెడ్డి మాట్లాడుతూ డెయిరీ ఆధ్వర్యంలో జిల్లాలోని పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయడం సంతోషకరమన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమే ప్రధానమైందని, పాడి పరిశ్రమ ద్వారా రైతులు ఎంతోమంది అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. నాణ్యమైన పాలు ఉత్పత్తి కావడంవల్ల పాడి పరిశ్రమకు మంచి పేరుప్రతిష్టలు వచ్చాయన్నారు. బ్యాంకు ద్వారా రైతులకు తనవంతు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ హర్యానాలోని లోకత్ నుండి 28 ముర్రాజాతి విత్తన దున్నలను తీసుకొచ్చి డెయిరీ ద్వారా పాడి రైతులకు, సహకార సొసైటీలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క దున్నపోతు ఖరీదు 45 వేల రూపాయలుకాగా తాము 22 వేల రూపాయలు సబ్సిడీపై అందిస్తున్నామని, 23 వేల రూపాయలను రైతు భరించవల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు. జిల్లాలో ప్రతి సంవత్సరం డెయిరీ ద్వారా ముర్రా జాతి విత్తన దున్నలను రైతులకు అందిస్తున్నామన్నారు. జిల్లా డెయిరీ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఈనెల 30వ తేది వరకు డెయిరి ఎన్‌డిడిబి కింద నడుస్తుందని, వచ్చే నెల 1వ తేది నుండి తమ సహకార సమితి పరిధిలోకి పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ప్రతిరోజు లక్షా 2 వేల లీటర్ల పాలను డెయిరీ సేకరిస్తున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌లో 1 లక్షా 45 వేల లీటర్ల పాలు పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో డెయిరికి పాలు పోసిన రైతులు ఉత్పత్తి చేసే ఎన్ని పాలనైనా తాము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లీటర్ పాలు 42 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామన్నారు. అనంతరం ఆంధ్రబ్యాంకు ఎజిఎం లాటరీ ద్వారా రైతులకు దున్న పోతులను చల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డెయిరీ ఎండి బి శివరామయ్య, వెటర్నరి డాక్టర్ ప్రసాద్, డైరెక్టర్‌లు చెంచురామయ్య, వెంకటరామయ్య, బోసు, హనుమంతురావు తదితర రైతులు, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.