మైలవరం, నవంబర్ 22: ఇటీవల నీలం తుపాను వల్ల తడిసిపోయి రంగుమారిన పత్తిని సిసిఐ కొనుగోలు చేయటం వట్టిమాటేనా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీలం తుపాను కారణంగా మైలవరం నియోజకవర్గంలోని మైలవరం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాల్లో వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పత్తిపంట వర్షంపాలైంది. భారీ వర్షాలకు చేలల్లోని పత్తి పూర్తిగా తడిసిపోవటం, రంగుమారి పోవటం జరిగింది. అప్పట్లో ఈ పంటలను పరిశీలించిన పాలకులు రంగుమారిన పత్తిని కూడా సిసిఐ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని రైతుల కన్నీళ్లు తుడిచారు. తుపాను విడిచిపోయి 20రోజులు కావస్తున్నా తడిసిన, రంగుమారిన పత్తి కొనుగోళ్ళపై అటు పాలకులు గానీ, ఇటు సిసిఐ కొనుగోలు కేంద్రం గానీ నోరు మెదపటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల వద్ద ఇప్పటికే పెద్దఎత్తున రంగుమారిన పత్తి నిల్వలు ఉన్నాయి. రంగుమారిన పత్తిని కొనుగోలు చేయమని తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు అందలేదని, కనుక తాము కొనలేమని సిసిఐ బయ్యర్ వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేయటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆనాడు పాలకులు మాట్లాడిన మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రంగుమారిన పత్తిని అతి తక్కువ ధరకు ప్రవేటు వ్యాపారులు కొంటున్నారని, తప్పనిసరి స్థితిలో వచ్చిన కాడికి తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. రంగుమారిన పత్తి కొనాలని ఇంతవరకూ ప్రభుత్వ ఆదేశాలు రాకపోతే ఇంకెప్పుడు కొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా మంత్రి కెపి సారథి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పందించి సిసిఐ ఉన్నతాధికారులతో మాట్లాడాలని రంగుమారిన పత్తి కొనుగోలుకు తగిన ఆదేశాలు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. అసలే ఈ ఏడాది పెట్టుబడులు ఎక్కువై అప్పుల పాలయ్యామని, నీలం తుపాను తమను మరింతగా కుంగదీసిన స్థితిలో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఏ పార్టీలో ఉన్నా మీ వెంటే ఉంటా!
* ఎమ్మెల్యే జోగి సంచలన వ్యాఖ్యలు
బంటుమిల్లి, నవంబర్ 22: ‘నేను ఏ పార్టీలో ఉన్నా మీ వెంటే ఉంటాను.. మీరు నాతోనే ఉండాలి’ అని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రజలను కోరారు. గురువారం రామవరపుమోడి గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తొలుత మాజీ సర్పంచ్ కట్టా జయరామ్ మాట్లాడుతూ జోగి రమేష్ గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరూ ఓటువేయాలని ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ కోరారు. అనంతరం మాట్లాడిన రమేష్ ఏ పార్టీ అనేది ఇప్పుడే వద్దని, నేను మీతోనే ఉంటాను, మీరు నాతో ఉండాలని, మీరు ఓట్లు వేసినా.. వేయకపోయినా నన్ను మీలో ఒకడిగానే చూడాలని కోరారు. ఇంత చేసిన తాను ఒకసారి మీ వద్దకు వస్తానని, తప్పకుండా ఓటు వేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. గతంలో జోగి రమేష్ కాంగ్రెస్‌ను వీడుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని తనదైన శైలిలో ఖండించారు. ప్రస్తుతం రమేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
1 నుండి తానీషా యువ మహోత్సవాలు
కూచిపూడి, నవంబర్ 22: అఖిల భారత కూచిపూడి కళామండలి, పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నాట్యక్షేత్రం కూచిపూడిలో డిసెంబర్ 1నుండి మూడురోజుల పాటు తానీషా యువ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి అగ్రహారాన్ని భాగవతులకు దానం ఇచ్చిన అబూ హసన్ తానీషా పేరుతో నాట్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూచిపూడి నాట్యాచార్యుల ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద సిద్ధేంద్రయోగి నాట్యకళా వేదికపై డిసెంబరు 1, 2, 3తేదీల్లో కీర్తిశేషులైన 20వ శతాబ్దపు కూచిపూడి నాట్యత్రయం పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం, పద్మశ్రీ డా. వేదాంతం సత్యనారాయణశర్మ, కులపతి పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ, ఈ నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషిచేసిన బందా కనకలింగేశ్వరరావు స్మృత్యర్థం ఈ నాట్యోత్సవాలను అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా ఉక్రెయిన్ దేశస్థురాలు గన్నాస్మిర్నోవా రాజ్‌హన్స్, డా. వెంపటి చినసత్యం కుమార్తెలు కామేశ్వరి, బాలాత్రిపుర సుందరి శిష్యబృందాలు, బెంగుళూరుకు చెందిన ప్రతీక్షా కాశీ, శ్రీలక్ష్మి, కేరళకు చెందిన లాస్య ప్రణతి, హైదరాబాదుకు చెందిన సిహెచ్ అజయ్‌కుమార్, గీతామాధురి, కలియుగ సత్యభామ వెంపటి వెంకటనారాయణ ముది మనుమరాళ్ళు వెంపటి శ్రావణి, వై లలితా సింధూరి, కళారత్న ఏబి బాలకొండలరావు కుమారుడు ఆదిత్య బుల్లిబ్రహ్మం, పసుమర్తి శ్రీనివాసశర్మ కుమారుడు కుమారదత్త కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నట్లు కేశవప్రసాద్ వివరించారు.
గ్యాస్ వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారం
మచిలీపట్నం, నవంబర్ 22: గ్యాస్ వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి టి ప్రభాకరరావు డీలర్లను ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల కార్యాలయంలో గురువారం గ్యాస్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ గ్యాస్ బుకింగ్, రీపుల్స్ డెలివరీ ప్రక్రియలు వివిధ గ్యాస్ కంపెనీలు ఆన్‌లైన్ చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సంవత్సరానికి ఒక్కో వినియోగదారునికి ఆరు సిలిండర్లు మాత్రమే అందించనున్నట్లు తెలిపారు. ఈ విధానం గత సెప్టెంబర్ 14నుండి అమలులోకి వచ్చిందన్నారు. సెప్టెంబర్ 14నుండి 2013 మార్చి 31వ తేదీ మధ్యకాలంలో వినియోగదారుడు తీసుకునే మూడు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ ఉంటుందని, నాలుగో సిలిండర్ నుండి సబ్సిడీ లేని సిలిండర్లు సరఫరా చేస్తారని తెలిపారు. ఈ అంశంపై వివిధ గ్యాస్ కంపెనీలు కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్ రూపొందించాయన్నారు. కొత్త గ్యాస్ కనక్షన్‌లు పొందిన వారికి సబ్సిడీ లేని సిలిండర్లు ఇస్తారన్నారు. వేరే పేరు మీద ఉన్న కనక్షన్‌లు కన్వర్షన్ కోసం, రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం నిబంధనలు రూపొందించినట్లు చెప్పారు. నాన్ రెగ్యులర్, మల్టిపుల్ కనక్షన్‌లు తల్లిదండ్రులు చనిపోయి పిల్లల పేరుతో మార్చుకునేవారు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి బదిలీ కోరేవారు మాత్రమే కెవైసి ఫారాలు పూర్తిచేసి వారి గ్యాస్ ఏజెన్సీలకు అందచేయాల్సి ఉంటుందన్నారు. మిగతా వారు కెవైసి ఫారాలు ఇవ్వనవసరం లేదన్నారు. కెవైసి ఫారాలను ఉచితంగానే అందించాలన్నారు. ఆర్డీవో ఐ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వినియోగదారులతో గౌరవప్రదంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. సమావేశంలో గ్యాస్ డీలర్లు కొండలరావు, మురళీకృష్ణ, వాలిశెట్టి తిరుమలరావు, దాస్, మహాంకాళిరావు నాయుడు, డివిజనల్ ఎఎస్ ప్రభు, సరోజ, సూపరింటెండెంట్ ఇంతియాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుండి కృష్ణా వర్సిటీ యువజనోత్సవాలు
మచిలీపట్నం , నవంబర్ 22: క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కృష్ణా విశ్వవిద్యాలయం పెద్దపీట వేసిందని ఉప కులపతి ఆచార్య వి వెంకయ్య అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26, 27, 28తేదీల్లో యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు గురువారం తన ఛాంబర్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో తెలిపారు. మూడురోజులు నిర్వహించే ఈ యువజనోత్సవాలు విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో జరుగుతాయని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తోట నరసింహం యువజనోత్సవాలను ప్రారంభిస్తారన్నారు. ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కెపి సారథి, ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య(నాని), పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, కొనకళ్ళ నారాయణరావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొనున్నట్లు తెలిపారు. 28న జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ పాల్గొంటారని చెప్పారు. 20నుండి 30లక్షల రూపాయల బడ్జెట్‌తో మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. పోటీల్లో వెయ్యి మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఎంపికైన బృందాలను డిసెంబర్ 16నుండి 19వరకు గుల్బర్గాలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. క్రీడల నిర్వహణకు ప్రిన్సిపాల్ ఇన్‌చార్జి ఆచార్య సుందరకృష్ణ కోశాధికారిగా, డా. బసవేశ్వరరావు కన్వీనర్‌గా డా. ఉషను కో-ఆర్డినేటర్‌గా నియమిస్తూ మొత్తం 100మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
47వేల బోగస్ కార్డులు రద్దుచేశాం
మచిలీపట్నం టౌన్, నవంబర్ 22: జిల్లాలో 47వేల బోగస్ కార్డులను రద్దుచేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రభాకరరావు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన డెప్యూటీ తహశీల్దార్ల సమావేశంలో మాట్లాడుతూ రచ్చబండలో దరఖాస్తు చేసుకుని తాత్కాలిక రేషన్ కూపన్‌లు పొందిన లబ్ధిదారులందరికీ పర్మినెంట్ కార్డులు ఇచ్చేందుకు వారి ఫొటోలు, కుటుంబ వివరాలు వెంటనే సివిల్ సప్లయిస్ వెబ్‌సైట్ నుండి అప్‌లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని వారంరోజుల్లో పూర్తిచేయాలన్నారు. గతంలో మంజూరు చేసిన తాత్కాలిక కార్డుదారులందరి కుటుంబ సభ్యుల ఫొటోలు కచ్చితంగా ఉండేవిధంగా చూడాలన్నారు. జిల్లాలో సుమారు 11,746 తాత్కాలిక రేషన్ కార్డులు ఇవ్వగా వారిలో 16,300 మంది లబ్ధిదారులకు శాశ్వత కార్డులు మొదటి దశలో ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగిలిన లక్ష మంది లబ్ధిదారుల ఫొటోలు, రేషన్ కూపన్‌లు సివిల్ సప్లయిస్ వైబ్‌సైట్‌లో సత్వరమే అప్‌లోడ్ చేయాలన్నారు. వీరికి కూడా త్వరలో రేషన్ కార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో 596 అంత్యోదయ కార్డులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీకి కృషి చేయాలన్నారు. సహాయ పౌరసరఫరాల అధికారి సరోజ, సూపరింటెండెంట్ నెల్సన్ పాల్, డెప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.
జాతీయ త్రోబాల్ పోటీలకు కృష్ణ ఎంపిక
మోపిదేవి, నవంబర్ 22: మోపిదేవి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి డొక్కు కృష్ణ రెండురోజుల క్రితం చిత్తూరు జిల్లా పీలేరులో జరిగిన రాష్టస్థ్రాయి త్రోబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు డిసెంబరులో ఢిల్లీలో నిర్వహించనున్న త్రోబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామోపాధ్యాయులు జి మారుతి తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం కెవిడి నాగేశ్వరమ్మ, ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, సముద్రాల, శేషగిరిరావు తదితరులు కృష్ణను అభినందించారు.
నాకౌట్ దశకు చేరుకున్న ఖోఖో పోటీలు
గుడివాడ, నవంబర్ 22: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 46వ ఆంధ్రా ఖోఖో రాష్టస్థ్రాయి పోటీలు గురువారం నాకౌట్ దశకు చేరుకున్నాయి. లీగ్ దశలో జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో విజయనగరం, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, వైజాగ్, కర్నూలు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మహిళల విభాగంలో కృష్ణా, తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, వైజాగ్, పశ్చిమగోదావరి జిల్లాల జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. లీగ్ దశలో విజయనగరం, విశాఖ జిల్లాల జట్లు అద్భుత ప్రతిభను కనబర్చాయి. విశాఖ క్రీడాకారుడు ఎన్ సుధీర్ అద్భుతమైన డైవ్స్, ఫోల్‌కిక్స్, ఫోల్‌డైవ్‌లతో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఖోఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడకా ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీతో పోటీలు ముగుస్తాయని, అనంతరం జాతీయ ఖోఖో పోటీల్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేస్తామన్నారు. ఈ పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, స్టేడియం కమిటీ సభ్యుడు బొగ్గరపు తిరుపతయ్య పర్యవేక్షించారు.
‘నీలం’కు దెబ్బతిన్న వాణిజ్య పైర్లు పట్టవా?
* రవీంద్ర పాదయాత్రలో రైతుల గగ్గోలు
మచిలీపట్నం టౌన్, నవంబర్ 22: సముద్ర తీర గ్రామమైన గోపువానిపాలెంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరుకు పూర్వవైభవం తెచ్చేందుకు రవీంద్ర చేపట్టిన పాదయాత్ర గురువారం 5వ రోజుకు చేరింది. గోపువానిపాలెం గ్రామంలో టిడిపి నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించిన ఆయన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నూతన పైప్‌లైన్ వేసినప్పటికీ సక్రమంగా తాగునీరు అందడం లేదని ప్రజలు రవీంద్ర దృష్టికి తీసుకొచ్చారు. వేసవిలో తాగునీటి కోసం తాము అల్లాడిపోతున్నామన్నారు. ఇటీవలి నీలం తుఫాన్ భారీ వర్షాలకు వాణిజ్య పంటలైన వేరుశనగ, చామదుంప, కొత్తిమీర తదితర పంటలకు భారీగా నష్టం జరిగినా ఇప్పటివరకు నష్టపరిహారం అందించలేదన్నారు. పంట నష్టం అంచనాలు వేసేందుకు కూడా అధికారులు ఎవ్వరూ తమ గ్రామానికి రాలేదని రవీంద్రకు ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై స్పందించిన రవీంద్ర మాట్లాడుతూ మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకే తాను పాదయాత్ర చేపట్టానని తెలిపారు. టిడిపి మండల అధ్యక్షులు గోపు సత్యనారాయణ, నాయకులు కుంచే దుర్గాప్రసాద్, తలారి సోమశేఖర్, కోరాటి సుబ్బారావు, పెద్ది వీర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గొర్రిపాటి గోపిచంద్, నారగాని ఆంజనేయప్రసాద్, పచ్చిగోళ్ళ కొండలరావు, రామకృష్ణ, నాంచారయ్య సంఘీభావం తెలిపారు.
టిడిపికి అధికారం ఖాయం:కాగిత
కృత్తివెన్ను, నవంబర్ 22: పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కాగిత వెంకట్రావు గురువారం మండల పరిధిలోని పడతడిక, నిడమర్రు పంచాయతీ శివారు గ్రామాలైన పోడు, పెదగొల్లపాలెం, నిడమర్రు, ఒర్లగొందితిప్ప, దండిదారు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిడమర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాగిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వాటాల నరసింహ స్వామి, బొల్లా వెంకన్న, ఎస్‌ఎస్‌ఆర్ ఆంజనేయులు, గుడిశేవ కనకయ్య, ఒడుగు తులసీరావు, ఎన్ ఆంజనేయులు, పిటి రాజు, టి మురళి, బి మురళి, ఏడుకొండలు, వీర్రాజు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్లకు దశలవారీగా బిల్లులు
కమిషనర్ చర్చలతో తొలగిన ప్రతిష్టంభన
అజిత్‌సింగ్‌నగర్, నవంబర్ 22: గత కొద్ది నెలలుగా బిల్లుల చెల్లింపులు ఆగిపోయి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న విజయవాడ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లకు కార్పొరేషన్ కమిషనర్ దశల వారీగా బిల్లుల చెల్లింపులకు అంగీకారం తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం కార్పొరేషన్ కాంట్రాక్టర్లతో కమిషనర్ జరిపిన ప్రత్యేక సమావేశ చర్చల్లో కమిషనర్ ప్రతిపాదించిన అంశాలకు కాంట్రాక్టర్లు పూర్తి అంగీకారం తెలపడంతో బిల్లుల చెల్లింపులపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయినట్లయింది. నిధుల లేమి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ నగర పాలక సంస్థ గత ఎనిమిది నెలలుగా కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో అనేక ఆర్ధిక సమస్యలను కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్నారు. గతకొద్ది రోజుల క్రితం ముత్తయ్య అనే కాంట్రాక్టర్ తీవ్ర అనారోగ్యం పాలై వైద్యం చేయించుకునేందుకు సైతం డబ్బులు లేక చివరికి మృతి చెందిన సంఘటన ఇటు కాంట్రాక్టర్లతో పాటు కార్పొరేషన్ అధికారులు సైతం చలించిపోయారు. ఈ నేపథ్యంలో తమకు తక్షణమే బిల్లులు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం, ఈ నిరసన కార్యక్రమానికి నగర సిపిఎం సంఘీభావం తెలపడమే కాకుండా ధర్నాలో నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు పాల్గొన్న విషయం తెలిసిందే. డబ్బులు లేక వైద్యం చేయించుకోలేక అకాల మరణం చెందిన కాంట్రాక్టర్ సంఘటనకు చలించిన కమిషనర్ బిల్లుల చెల్లింపులపై దృష్టి పెట్టడం, వెనువెంటనే కాంట్రాక్టర్లను చర్చలకు ఆహ్వానించడం, చర్చలు ఫలప్రదమై చెల్లింపులకు మార్గం సుగమమం కావడంపై కాంట్రాక్టర్లలో నూతన ఉత్సాహం నింపింది. ఇప్పటివరకూ బిల్లులంటేనే మీకేంటి తొందరంటూ అధికారుల చిరాకులను ఎదుర్కొన్న కాంట్రాక్టర్లు కమిషనర్ అజీమ్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కమిషనర్ అబ్ధుల్ అజీమ్ మాట్లాడుతూ వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయిలో బిల్లుల చెల్లింపులకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్లు వివరించారు. కార్పొరేషన్ ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని అందరికీ ఒకేసారి కాకపోయినా దశల వారీగానైనా బిల్లులను చెల్లించనున్నట్లు వివరించారు. లక్షలోపు ఉన్న వారికి ముందుగాను, ఆపై లక్ష నుంచి ఇరవై లక్షల రూపాయల బిల్లుల ఉన్న వారికి ఆ తరువాత చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధుల రాబడితోపాటు కార్పొరేషన్‌కు 250 కోట్ల రూపాయల నిధుల సేకరణ లక్ష్యంగా బాండ్లను స్వీకరించే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా బిల్లుల చెల్లింపులపై కమిషనర్‌తోపాటు సిఇ లకు కొన్ని ప్రతిపాదనలు తెలిపినట్లు, మొత్తం 13 కోట్ల రూపాయల నుంచి 16 కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సిన ఈ మొత్తాన్ని నెలకు నాలుగు కోట్ల రూపాయల చొప్పున నాలుగు నెలల్లో తమకు మొత్తం బిల్లుల క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతూ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ కొండల రావు దృష్టికి తీసుకెళ్ళినట్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేముల అంకేశ్వరరావు పేర్కొనడం గమనార్హం.
పథకం ప్రకారం పాడుకున్నారు
ఇంద్రకీలాద్రి, నవంబర్ 22: దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరలను పోగు చేసుకోవటానికి నిర్వహించిన బహిరంగవేలం పాట దుర్గగుడి అధికారుల ఆశీస్సులతో పాటకు వచ్చిన ఇద్దరు పాటదారులను సంతృప్తిపర్చి ఒక పాటదారుడు ఈ హక్కును కైవసం చేసుకున్నట్టు తెలిసింది. అటు అధికారులు, ఇటు మిగతా పోటీదారులు అందరు రింగైపోయిన కారణంగా శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానానికి సుమారు 30 లక్షల మేరకు వచ్చే ఆదాయానికి భారీస్ధాయిలో గండిపడిందని దుర్గగుడి సీనియర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో గురువారం మధ్యాహ్నం 3 గంటలనుండి రాత్రి 7గంటల వరకు సుమారు 4 గంటల పాటు బహిరంగవేలం పాట నిర్వహించారు. ఈ వేలంపాటకు యంపి వర్గానికి చెందిన తంగెళ్ళ రామచంద్రరావు(రాము), తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్దా వెంకన్న వర్గానికి చెందిన రాపాటి దుర్గారావు, దుర్గగుడి కాంట్రాక్టర్ రవి వ్యాపార భాగస్వాముడు యం చంద్ తదితరులు ఒక్కొక్క పాటదారుడు దేవస్థానానికి 30 లక్షల రూపాయలు డిపాజిట్‌గా చెల్లించి ఈ పాటలో పాల్గొన్నారు. బుధవారం అమ్మవారి సన్నిధిలో క్లోక్ రూమ్‌కు నిర్వహించిన విధంగా గురువారం కూడా బహిరంగవేలం పాట నిర్వహించారు. గురువారం నిర్వహించిన వేలంపాట నాటకీయ ఫక్కీలో జరిగింది. దేవస్థానం పిఎలు సాయిబాబా, యస్‌విప్రసాద్, సాయిప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారి భవానీదీక్ష మంటపంలో వేలంపాట ప్రారంభించారు. వేలంపాటను ప్రారంభించిన కొన్ని నిమిషాలకే పాటదారులు కాలవ్యవధి పూర్తయిన తర్వాత మిగిలిపోయిన చీరలను అమ్మవారి సన్నిధిలో విక్రయించుకోవటానికి స్ధలం కేటాయించాలని పాటలో దేవస్థానం పిఎలకు విజ్ఞప్తి చేయటంతో షరతుల్లో ఈ అంశం కూడా చేర్చాలని పట్టుబట్టారు. దీంతో వారితో పిఎ సాయిబాబా మాట్లాడటం, ఆ సమయంలోనే దేవస్థానం ఈఇ బాలమురళీకృష్ణ వచ్చి పాటదారులను సూచనను పరిగణనలోనికి తీసుకునే ప్రసక్తిలేదని తేగేసి చెప్పటం, ఈ సమయంలోనే ఇన్‌చార్జ్ ఇవో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం ఓ ఫార్సుగా జరిగిందని సీనియర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఒక పాటదారుడు ఐదు వేలను పెంచితే వారికి నిర్ణీత సమయాన్ని కేటాయించకుండా నిరంతరం వారు రింగుకావటానికి, పాటలో పాల్గొనేందు4పాటు వారి వెంట వచ్చిన అనుచరులకు కూడ వాటాలు ఇవ్వటం తదితర వాటిని అమ్మవారి సాక్షిగా జరిగిపోయంది. పారదర్శకతతో వేలంపాట నిర్వహించినట్టు పైకి కనబడుతున్నా ‘అంతా అనుకున్నట్టే’ అయందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
దుర్గమ్మ చీరల కోసం వేలం
కోటి 80 లక్షల ఆదాయం
ఇంద్రకీలాద్రి, నవంబర్ 22: దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరెలను పోగు చేసుకోనే హక్కు నిమిత్తం గురువారం నిర్వహించిన బహిరంగవేలంలో సంవత్సరానికి కోటి 80 లక్షల 70 వేల రూపాయలకు యం చంద్ అధిక హెచ్చుమొత్తంలో పాడి కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం కంటె ఈ సంవత్సరం సుమారు ఐదున్నర లక్షల మేరకు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లకు అధికంగా ఆదాయం లభించింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి భవానీదీక్ష మంటపంలో జరిగిన ఈ బహిరంగవేలంలో మొత్తం ముగ్గురు పాటదారులు పాల్గొన్నారు. దేవస్థానం ఇన్‌చార్జ్ ఇవో విష్ణుప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం సుమారు 3.30గంటల సమయంలో బహిరంగవేలం పాటను దేవస్థానం పాటగా 2 కోట్లతో ప్రారంభించారు. అయతే వేలంపాట పాడుకోవటానికి పాటదారులు ఎవరూ ముందుకు రాకపోవటంతో దేవస్థానం అధికారులు పాటను తగ్గిస్తూ కోటి 85 లక్షల 10వేల వరకు వచ్చి నిలిపివేశారు. పాటదారులు ముందుకు రాకపోతే పాటను నిలిపివేస్తామని అధికారులు పాటదారులను హెచ్చరించారు. పరిస్ధితిని గమినించి పాటదారులు ముందుకొచ్చి ఐదు వేల రూపాయలను పెంచుకొంటూ రావటం ప్రారంభించారు. చివరిలో యం చంద్ కోటి 80 లక్షల 70 వేలకు పాడారు. ఆయనకు పోటీగా మిగిలిన ఇద్దరు పోటీకి రాకపోవటంతో యం చంద్‌కు లీజు హక్కు లభించింది. చీరలను పోగు చేసుకోవటానికి దేవస్థానం అధికారులు బహిరంగవేలంపాట, సీల్డుటెండర్లు, ఈ ప్రొక్యూర్‌మెంట్, ఈ విధంగా ఈ మూడు పద్దతులను నిర్వహించారు. సీల్డు టెండర్ బాక్స్‌లో ఇద్దరు వారి పాట సొమ్మును కోట్ చేయగా ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో ఎవరు కోడ్ చేయకపోవటంతో చివరకు దేవస్థానం అధికారులు బహిరంగ వేలంపాటనే ఖరారు చేశారు. ఈ వేలంపాటలో దేవస్థానం పిఎలు సాయిప్రసాద్, సాయిబాబా నాయుడు, యస్‌వి ప్రసాద్, అధికారులు గోపిచంద్, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ బతుకూ లేకుండా చేస్తారా?
చిరు వ్యాపారుల నుండి సెస్ సహించం
సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ హెచ్చరిక
విజయవాడ, నవంబర్ 22: పండ్ల మార్కెట్‌లో చిరు వ్యాపారాలు చేసుకుని పొట్టనింపుకుంటున్న పేదల నుండి నిబంధనలకు వ్యతిరేకంగా సెస్ వసూలు చేస్తే మార్కెటింగ్ శాఖాధికారులను దిగ్భందిస్తామని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ హెచ్చరించారు. గురువారం ఉదయం స్థానిక కేదారేశ్వరపేటలోని పండ్ల మార్కెట్‌లో అధికారులు పర్యటిస్తున్న సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారులకు, చిరు వ్యాపారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న దోనేపూడి శంకర్, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు పల్లా సూర్యరావు, పండ్ల ముఠా కార్మిక సంఘం కార్యదర్శి బోను సీతారాములు (చిన శ్రీరాములు) తదితరులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు లేనప్పటికీ ఒంటెత్తు పోకడలతో చిరు వ్యాపారుల నుండి సెస్ వసూలు చేయడానికి పూనుకున్న మార్కెటింగ్ శాఖాధికారులను నిలదీశారు. నిబంధనలకు వ్యతిరేకంగా అప్పీ ఆటోకు రూ. 100లు, టాటాఎస్‌కు రూ. 150లు వసూలు చేయడం క్షంతవ్యం కాదన్నారు. కొద్దిపాటి పెట్టుబడులతో పండ్లు అమ్ముకుని జీవనం సాగించే చిరు వ్యాపారులు సెస్ ఎక్కడి నుండి తెచ్చి కడతారని ప్రశ్నించారు. చిరు వ్యాపారులపై ఏ మాత్రం కనికరం లేకుండా దుర్మార్గపూరితంగా విధించిన సెస్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో చిరు వ్యాపారులకు అండగా కమ్యూనిస్టు పార్టీ తీవ్రరూపంలో ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
పోలీస్, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఎంపికకు‘పరుగే’ ప్రామాణికమా!?
విజయవాడ, నవంబర్ 22: నిన్నా మొన్నటి వరకు పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ జరిగింది... ఇందుకోసం జరిగిన పరుగుల పోటీలో రాష్ట్రంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం దుర్లభమవుతున్న ప్రస్తుత తరుణంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రాణాలకు తెగించి లక్షలాది మంది పరుగులు దీస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ప్రస్తుత రోజుల్లో కూడా... ప్రతిభకు స్థానం లేకుండా బ్రిటీష్ కాలం నాటి ‘పరుగు’ పోటీని నేటికీ కొనసాగింప చేయటంలో ఆంతర్యం అంతుబట్టటం లేదు. వాస్తవానికి ప్రస్తుతం దొంగతనం చేసి పరుగులు దీసే దొంగలు లేరు... అలాగే వారిని వెంబడించే పోలీసులు కన్పించడంలేదు. అంతా సైబర్ క్రైం.. అయితే ఈ పరుగు పోటీ... అందునా మండుటెండలో పోటీలేమిటో అర్ధం కావటంలేదు. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖలో 2066 కానిస్టేబుళ్ల నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి ఐదు లక్షల 41వేల 863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక వయస్సు 40 ఏళ్ల వరకు సడలింపు జరిగినా వీరు కూడా యువకులతో సమానంగా కేవలం 20 నిమిషాల్లో 4 కి.మీ పరుగులు దీయాల్సిందే. ఖర్మకాలి గుండెపోటు, ఆయాసం వచ్చి వారి ప్రాణాలు గాలిలో కలిపిపోతే ఏమిటి పరిస్థితి.
గ ‘మ్మత్తు’ నాటకం
* పనిమనిషే సూత్రధారి * చోరీ సొత్తుతో వృద్ధుల ఇంటి దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
విజయవాడ , నవంబర్ 22: పనిమనిషిపై మత్తు మందు చల్లి, ఇంట్లో యజమానులు ఉండగానే చప్పుడు కూడా కాకుండా బీరువాలోని నగదు, నగలు దోచుకెళ్లిన కేసులో నిందితులను మాచవరం క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నేరం జరిగిన రెండురోజుల్లో కేసును చేధించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడం గమనార్హం. అయితే ఈ నేరానికి ప్రధాన సూత్రధారి ఆ ఇంటి పని మనిషే కావడం విశేషం. తన బంధువు, తన కుమార్తెతో నేరం చేయించి, అనుమానం రాకుండా తనకు దుండగులు మత్తు ఇచ్చి వెళ్లిపోయినట్లు అల్లిన కట్టుకథ పారలేదు. అనుమానంతో ఆమెను ప్రశ్నించగా పొంతన లేని సమాధానంతో గుట్టు రట్టయింది. ఇంకేముంది పనిమనిషితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి 91వేల నగదుతో కలిపి ఐదు లక్షలు విలువైన రెండు కిలోల వెండి వస్తువులు, పది కాసుల బంగారు ఆభరణాలు, చేతి గడియారాన్ని రికవరీ చేసినట్లు సెంట్రల్ ఏసిపి సత్యనారాయణ తెలిపారు. గాయత్రినగర్ విజేత అపార్ట్‌మెంట్ ప్లాట్ నెంబర్-1లో నివాసముంటున్న వృద్ధురాలు ప్రసూనాంబ ఇంట్లో ఈనెల 18న పట్టపగలే దుండగులు చొరబడి పనిమనిషిపై మత్తు చల్లి చోరీకి పాల్పడిన ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా మాచవరం పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 17న రూ.30లక్షలు నగదు తీసుకుని బ్యాంకుకు వెళ్లి లాకర్‌లో డిపాజిట్ చేశారు. అయితే అప్పటికే లాకర్‌లో బంగారం, వెండి వస్తువులు ఉన్నందున నగదు పట్టలేదు. దీంతో బంగారు, వెండి వస్తువులు, లక్ష రూపాయలు నగదు తీసుకుని ఇంటికి వచ్చి బీరువాలో పెట్టారు. కాగా ఎలాగైనా యజమాని ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న పనిమనిషి వరలక్ష్మీ గమనించింది. 30లక్షలు నగదు ఇంటి బీరువాలోనే ఉన్నాయని భావించింది. చోరీకి సహకరించమని తన బంధువైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన అరిపి సత్తిబాబు (22), తన కుమార్తె అయిన తూర్పుగోదావరి జిల్లా వడ్లమూడికి చెందిన గండ్రోతు రామలక్ష్మీ (30)లకు సమాచారం చేరవేసింది. ఈనేపధ్యంలో సత్తిబాబు, రామలక్ష్మీ ఇద్దరూ 18వ తేదీన బాధితురాలు ప్రసూనాంబ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో సిద్ధంగా ఉన్న పనిమనిషి వరలక్ష్మీ వారికి బీరువా తాళాలు అపహరించి చేతికిచ్చింది. అయితే ఇంట్లో పూజగదిలో ప్రసూనాంబ, మరోగదిలో టివి చూస్తూ నిమగ్నమైన ఆమె భర్త ఇదంతా గమనించలేకపోయారు. సత్తిబాబు, రామలక్ష్మీ ఇద్దరూ చప్పుడు కాకుండా తాళాలతో బీరువా తెరచి అందులో ఉన్న నగదు, నగలు, చేతి గడియారం దొంగిలించి మెల్లగా జారుకున్నారు. అనంతరం మనిమనిషి వరలక్ష్మీ ఏమాత్రం అనుమానం రాకుండా హైడ్రామా నడిపింది. తనకు గుర్తు తెలీని వ్యక్తులు మత్తు ఇచ్చినట్లుగా వ్యవహరించి నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పనిమనిషి పొంతన లేని సమాధానంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా గుట్టు రట్టయింది. దీంతో ప్రధాన సూత్రధారి వరలక్ష్మీ, నిందితులు సత్తిబాబు, రామలక్ష్మీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.91వేల నగదు, పది కాసుల బంగారు రెండు పేటల గొలుసు, మూడు బంగారు లక్ష్మీ రూపులు, రెండు కిలోల బరువైన వెండి ప్లేట్లు, వెండి గ్లాసులు, చేతి గడియారం స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి తెలిపారు. విలేఖరుల సమావేశంలో మాచవరం సిఐ సత్యానందం, ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
బషీర్‌బాగ్ ఉద్యమం పునరావృతం
విజయవాడ, నవంబర్ 22: విద్యుత్ బిల్లులు తగ్గించకుంటే 2000 సంవత్సరంలో తాము నిర్వహించిన బషీర్‌బాగ్ ఉద్యమాన్ని పునరావృతం చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ జోగిరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ బిల్లులు, సర్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని కోరుతూ సిపిఎం 19వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్‌లోని నిమ్మతోట సెంటర్‌లో గురువార ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ బిల్లులు దగ్ధం చేశారు. అనంతరం జోగిరాజు మాట్లాడుతూ కేవలం వెయ్యి కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీలు పెంచిన నాటి టిడిపి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురై అధికారాన్ని పోగొట్టుకుందని గుర్తు చేశారు. సిపిఎం డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రూపాల్లో విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో 2వ శాఖ కార్యదర్శి ఎస్‌కె ననె్న, మహిళా శాఖ కార్యదర్శి ఎస్‌కె కాశింబీ, చిన్నా, జి నాగరాజు, బి లక్ష్మణ, ఎం రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబును ప్రజలే కాదు...
తెలుగు తమ్ముళ్లూ నమ్మడం లేదు
సబ్ కలెక్టరేట్, నవంబర్ 22: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని రాష్ట్ర ప్రజలే కాకుండా ఆ పార్టీలోని నాయకులే నమ్మడంలేదని వైఎస్సార్ సిపి జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను విమర్శించారు. చంద్రబాబుపై నమ్మకంలేకనే వైఎస్సార్‌కు ఓట్లు వేసి గెలిపించారని ఇప్పుడు టిడిపి నాయకులు తమ పార్టీలో చేరడమే అందుకు నిదర్శనమని తెలిపారు. గురువారం ఉదయం సీతారామపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశం జరిగింది. భాను మాట్లాడుతూ చంద్రబాబు యాత్ర పూర్తి చేసిన జిల్లాలోని నాయకులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారని చెప్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి యాత్ర ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది మాజీ శాసనసభ్యులు పార్టీ మారారని వివరించారు. ప్రధాన ప్రతిపక్షంగా కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ప్రభుత్వానికి మెజారిటీ లేకపోయినా అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడమే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు మధ్య ఒప్పందం కుదిరిందనడానికి నిదర్శనమని చెప్పారు.