గుంటూరు, నవంబర్ 22: జీవవైవిధ్య సంరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ తెలిపారు. గురువారం సెయింట్ జోసఫ్ మహిళా బిఇడి కళాశాలలో జీవవైవిధ్యంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. భారతదేశం జీవవైవిధ్య భాగస్వామ్యదేశాల అంతర్జాతీయ సదస్సుకు వేదికగా నిలిచిందన్నారు. మానవ మనుగడకు వివిధ జంతుజాలం ప్రకృతిలో అవసరమని ఈ ప్రాణకోటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఈ బాధ్యతను గుర్తిస్తే భవిష్యత్ తరాల వారికి విలువైన ప్రకృతి సంపదను అందించిన వారమవుతామని కలెక్టర్ వివరించారు. ప్రకృతిలో వివిద జంతుజాలాలను కనిపెట్టి శాస్తజ్ఞ్రులు అధ్యయనం చేశారన్నారు. సూక్ష్మజీవుల నుంచి అతిపెద్ద జీవులు ఉన్నా, సృష్టిలో విచక్షణాజ్ఞానం మనిషి సొంతమన్నారు. భావిపౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు జీవవైవిధ్య పరిరక్షణపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. మానవాళి తీసుకునే ఆహార పదార్థాలు ప్రకృతి సిద్ధంగా ఉత్పత్తి అవుతాయన్నారు. ఎక్కువశాతం మెడిసిన్స్ ప్రకృతి వనరులతోనే తయారవుతున్నాయని, కృత్రిమ మందులు తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాలు కృషిచేయడం జరిగిందని గుర్తుచేశారు. మేన్ గ్రూప్ ఫారెస్ట్ ఆవరణ వ్యవస్థలో సముద్ర జలాలతో పలు రకాల మొక్కలు పెరుగుతున్నాయని, సముద్రనీటితో కూడా వ్యవసాయం చేయడానికి అనుకూలమైన వాతావరణంపై శాస్తజ్ఞ్రులు కృషి చేస్తున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డి ఆంజనేయులు మాట్లాడుతూ జీవవైవిధ్య సంపద రోజురోజుకు తరిగిపోతోందని, మానవ మనుగడపై తీవ్రప్రభావం చూపుతోందన్నారు. ప్రకృతి సంపదను తన స్వలాభం కోసం మానవాళి వినియోగించుకుంటుందని, వీటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిఇడి శాఖ ప్రిన్సిపాల్ జిపి శాస్ర్తీ మాట్లాడుతూ మనిషి, ప్రకృతి పరస్పరాశ్రీతాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మహత్మాగాంధీ 1920 దశకంలోనే జీవవైవిధ్యంపై ఆందోళన వ్యక్తం చేశారని, అలాగే ప్రకృతి నాకు చాలా స్ఫూర్తి నిచ్చిందని, దిగ్భ్రాంతికి, కలవరానికి గురి చేసిందని గాంధీ వెల్లడించినట్లు ఆయన తెలిపారు. సృష్టిలో సహజ వనరులు క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలు, పాకే జీవులు వంటి ఎన్నోరకాల జీవులు క్రమేణా నశించిపోతున్నాయని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తొలుత బిఇడి కళాశాలలో ఏర్పాటు చేసిన జీవవైవిధ్య ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ తిలకించారు. అనంతరం జీవవైవిధ్యంపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సదస్సులో కరస్పాండెంట్ టి ఆరోగ్యమ్మ, బిఇడి కళాశాల ప్రిన్సిపాల్ స్వరూపరాణి, రాజీవ్ విద్యామిషన్ నుండి అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ కిరణ్‌కుమార్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
‘నీలం’ బాధిత రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాలి
* రైతులను ఆదుకోకుంటే సిసిఐ, కలెక్టరేట్ ముట్టడి
* టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 22: నీలం తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు వెంటనే పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నీలం తుఫాన్ బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చి, ఆచరణలో 50 శాతంకు పైగా పంటనష్టపోయిన రైతులకే పరిహారం అందిస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. ప్రస్తుత జిఒ ప్రకారం జిల్లాలోని పత్తి, మిర్చి రైతులకు నష్టపరిహారం అందే పరిస్థితి లేదన్నారు. ఎకరాకు 10 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, తడిసిన పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులను ఆదుకోవాల్సిన సమయంలో వ్యాపార ధోరణిలో వ్యవహరించడం తగదన్నారు. రైతులకు నష్టపరిహారం అందకపోతే కాటన్ కార్పొరేషన్‌ను దిగ్బంధిస్తామని, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్ఠంగా ఉందని, ప్రస్తుత నాయకులు ఎలాంటి ప్రలోభాలకు లొంగేవారు కాదన్నారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీరు పుష్కలంగా ఉన్నా ఆయకట్టు భూములకు నీరు విడుదల చేయక పోవడంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ్యులను సంతలో పశువుల్లాగా బేరసారాలు చేయడం సిగ్గుచేటన్నారు. టిడిపి నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుండి వారంలో మూడు రోజుల పాటు వాడవాడలా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దామచర్ల శ్రీనివాసరావు, లాల్‌వజీర్, జాగర్లమూడి శ్రీనివాసరావు, చిట్టాబత్తుని చిట్టిబాబు, హనుమంతరావు, బొంతల సాయి, వీరాంజనేయులు, లంకా మాధవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
* సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారాలను మోపుతూ ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో గల విఎస్‌కె హాలులో పెనుభారాలు వేస్తూ ప్రజలపై దాడులు చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల నిత్య జీవిత అవసరాల్లో విద్యుత్ ప్రధానమైనదని, అలాంటి విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. విద్యుత్ కోతల వల్ల లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ విద్యుత్‌కోతలు, విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు గతంలో అనేక పోరాటాలు నిర్వహించాయన్నారు. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యుత్‌రంగ ప్రవేటీకరణ విధానాలే విద్యుత్ కోతలకు కారణమన్నారు. సిపిఐ నగర కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ బొగ్గు, గ్యాస్, సౌరశక్తిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడంలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి కృష్ణయ్య, సిపిఐ ఎంఎల్ నాయకుడు సింహాద్రి లక్ష్మీరెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం బ్రహ్మయ్య, సిపిఐ సీనియర్ నాయకులు జివి కృష్ణారావు, సిపిఎం నగర కార్యదర్శి భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌గా విజయసాగర్‌బాబు
అమరావతి, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌గా అమరావతికి చెందిన నిమ్మా విజయసాగర్‌బాబును ఎంపిక చేస్తూ ఆ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరి వి నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న విజయసాగర్‌బాబు స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, డిసిసి ఉపాధ్యక్షుడు పక్కాల సూరిబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయసాగర్‌బాబు ఎంపిక పట్ల మండల కాంగ్రెస్ నాయకులు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వాకా సరోజబాబు, గోవిందు కోటేశ్వరరావు, ఎమ్మిశెట్టి పెద్దబ్బాయ్, జగన్నాధం, పోలిశెట్టి సాయి, మంగిశెట్టి శ్రీనివాసరావు, విన్నకోట సాంబశివరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
చలపతి, సిమ్స్ కళాశాలల జట్ల విజయం
గుంటూరు (స్పోర్ట్స్), నవంబర్ 22: ప్లేయర్స్ క్రికెట్ అసోసియేషన్, డిబి ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో స్థానిక బిఆర్ స్టేడియంలో జరుగుతున్న డిబి కబ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ కప్ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లలో చలపతి జూనియర్ కళాశాల, సిమ్స్ కళాశాల జట్లు విజయం సాధించాయి. ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో చలపతి కళాశాల జట్టు 90 పరుగుల తేడాతో ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కళాశాల జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చలపతి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జట్టులో హరీష్ 55, సాయి 17 పరుగులు చేయగా ఎన్‌ఆర్‌ఐ బౌలర్లు సాంబ, కాంతారావు చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎన్‌ఆర్‌ఐ జట్టు 8.5 ఓవర్లలో 51 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో నాగరాజు 10 పరుగులు చేయగా చలపతి బౌలర్లు ఆర్ సాయి 4, బి సాయి 3, మోహన్ ఒక వికెట్ పడగొట్టారు. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్‌లో సిమ్స్ కళాశాల జట్టు 7 వికెట్ల తేడాతో విజ్ఞాన్ యూనివర్శిటీ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన విజ్ఞాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జట్టులో ఎఎస్ తేజ 38, కె తేజ 27 పరుగులు చేయగా సిమ్స్ బౌలర్లు అశ్విన్ 2, కృష్ణా, లక్ష్మణ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిమ్స్ జట్టు 10.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. జట్టులో దుర్గాప్రసాద్ 56, అశ్విన్ 43 పరుగులు చేయగా విజ్ఞాన్ బౌలర్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టారు.
ప్రభుత్వ పథకాలు యథాతథం
గుంటూరు (కార్పొరేషన్), నవంబర్ 22: వైఎస్ హయాంలో ప్రారంభించిన పథకాలు ఆగిపోయాయని కొందరు పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, పథకాలేవీ ఆగిపోలేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు తెలిపారు. గురువారం గుంటూరు నగర నూర్‌బాషా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మక్కెనను కలిసి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసిల అభివృద్ధికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ఫీజు రీయింబర్సుమెంటులో భాగంగా 3,500 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు స్టార్ మస్తాన్‌వలి, డిసిసి మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజావలి, మహమ్మద్ ఖాజావలి, షేక్ నైజాంబాబు, వౌలాలి, ఆదంషఫి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సర్‌చార్జీలతో పేదల బతుకు ఛిద్రం
* వైఎస్‌ఆర్ సిపి నగర శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా
గుంటూరు, నవంబర్ 22: ఓ పక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ బిల్లులపై సర్‌చార్జీలను విధించడంతో పేదల బతుకు ఛిద్రమైందని వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వైఎస్‌ఆర్ సిపి నగరశాఖ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులపై సర్‌చార్జీల బాదుడును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నగరంలో ప్రదర్శన నిర్వహించి, బ్రాడీపేటలోని ఎస్‌ఇ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కోతలతో పారిశ్రామిక వర్గాల నడ్డివిరిచిన ప్రభుత్వం తాజాగా బిల్లులపై సర్‌చార్జీలను విధించి అన్ని వర్గాల ప్రజలను అతలాకుతలం చేసిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్య మధ్య తరగతి కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయని తెలిపారు. తక్షణం ప్రభుత్వం విద్యుత్ బిల్లులపై సర్‌చార్జీలను ఎత్తివేయాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఇని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సిపి నాయకులు రాతంశెట్టి సీతారామాంజనేయులు, ఆతుకూరి ఆంజనేయులు, నసీర్ అహమ్మద్, గులాం రసూల్, పోలూరి వెంకటరెడ్డి, మార్కెట్‌బాబు, స్టాలిన్‌బాబు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కసబ్‌నే కాదు సూత్రధారులనూ శిక్షించాలి
గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 22: ఉగ్రవాది కసబ్‌ను శిక్షించిన విధంగానే ముంబయి దాడులకు సూత్రధారులైన వారిని కూడా కఠినంగా శిక్షించాలని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో గురువారం సంస్థ కార్యాలయంలో కసబ్ ఉరి అమలుపై జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. ఈ గోష్ఠిలో ఆంధ్రప్రయోజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు పిఎస్ మూర్తి మాట్లాడుతూ తన పైశాచిక చర్యకు ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయని కసబ్‌కు ఉరిశిక్షే సరైందన్నారు. ఈ కేసులో ఏ మాత్రం మెతక వైఖరిని అవలంబించకుండా కోర్టు ఇచ్చిన తీర్పు, చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై గౌరవాన్ని పెంచాయన్నారు. అయితే ఉరి శిక్ష అమలు ద్వారా ఉగ్రవాద ముఠాలకు కఠినమైన సందేశాన్ని పంపించాల్సిన ప్రభుత్వం శిక్ష అమలులో గోప్యత పాటించాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ మరణ శిక్ష మంచిది కాదనుకునే వారికి తప్ప కసబ్ శిక్షపై ఎవరికీ అభ్యంతరాలు లేవన్నారు. ఈ చర్చాగోష్ఠిలో సమాచార హక్కు ఉద్యమ వేదిక కన్వీనర్ పి నరసింహులు, మల్లిఖార్జునరావు, ఇ చంద్రయ్య, జాషువా తదితరులు పాల్గొన్నారు.
దేవాలయం ఉంచాలని రాస్తారోకో
యడ్లపాడు, నవంబర్ 22: 16వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమంలో భాగంగా బోయపాలెం గ్రామంలోని పార్వతీ అమ్మవారి దేవాలయాన్ని తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేయడం భక్తులకు ఆందోళన కల్గించింది. చారిత్రక ప్రాధాన్యం గల ఈ పురాతన దేవాలయాన్ని తొలగించేది లేదని భక్తులు గురువారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం వద్దకు చేరిన దాదాపు 200 మంది మహిళలు, పురుషులు రహదారిపై ట్రాఫిక్ నిలిపివేశారు. దేవాలయం వెనుక చాలా స్థలం ఉందని, అక్కడ రహదారిని విస్తరించాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిలకలూరిపేట శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు దేవాలయం వద్దకు వచ్చి దేవాలయాన్ని తొలగించకుండా తగు ఏర్పాట్లు చేస్తానని, అధికారులతో చర్చిస్తానని భక్తులకు హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ దేవాలయం వద్దకు చేరిన భక్తులతో మాట్లాడుతూ భక్తుల మనోభావాలను అధికారులు గౌరవించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని తాను ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు.
కేంద్రప్రభుత్వ పథకాల ఉద్యోగులకు కనీస వేతనాలివ్వాలి
గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 22: కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగబ్రహ్మచారి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో కాపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన స్కీం వర్కర్ల జిల్లా సదస్సులో బ్రహ్మచారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వస్తున్నాయని, పథకాల అమలులో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం కనీస వేతనం అమలు చేయకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో స్కీం వర్కర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యానిమేటర్లు చేసిన పోరాటాల ఫలితంగా వారికి విఎఒలుగా నియామక ఉత్తర్వులు ఇచ్చి వేతనాలు పెంచకపోగా తొలగించేందుకు అవసరమైన నిబంధనలను మాత్రం పెట్టారన్నారు. ఫీల్డు అసిస్టెంట్లను పనిదినాలు లేవని అక్రమంగా తొలగిస్తున్నారని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించే శాఖలో ఉన్న సిఎ, విఎలకు కనీస వేతనాలు లేవని, ఆయుష్, అంధత్వ నివారణ, టిబి, ఎయిడ్స్ కంట్రోల్, మలేరియా విభాగాల్లో సిబ్బందిని, కంప్యూటర్ టీచర్లను రెగ్యులర్ చేయడం లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి నవంబర్ 26, 27 తేదీల్లో మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో యానిమేటర్ల సంఘ నాయకులు శ్రీనివాస్, రామారావు, ఎన్‌సిఎం నాయకులు వరప్రసాద్, ఆర్‌డబ్ల్యుఎస్ నాయకులు కె నాగేశ్వరరావు, మధ్యాహ్న భోజన సంఘ నాయకులు రాజేశ్వరి, ఆశావర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
రొంపిచర్ల, నవంబర్ 22: అద్దంకి- నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై రొంపిచర్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రొంపిచర్ల ఎస్‌ఐ సురేష్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదని ఎస్‌ఐ తెలిపారు.
తెలుగు సాహిత్యానికి మాధుర్యాన్ని సంతరింపజేసింది పద్యమే
* పద్యకవి డాక్టర్ రామడుగు
గుంటూరు , నవంబర్ 22: ప్రపంచ భాషలన్నింటిలో స్వతఃసిద్ధంగా, తనదైన ప్రత్యేకతను కల్గి, చందోబద్ధమైన వ్యాకరణ సూత్రాలతో ఉత్తమమైన భాషగా వర్ధిల్లుతున్న మన తెలుగుభాషకు, సాహిత్యానికి తరతరాలుగా మాధుర్యాన్ని సంతరింపజేసింది పద్యమేనని, రచయిత, పద్యకవి డాక్టర్ రామడుగు వెంకటేశ్వరశర్మ పేర్కొన్నారు. నగరంలోని లాడ్జిసెంటర్‌లో విశాలాంధ్ర బుక్‌హౌస్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న గుంటూరు పుస్తక మహోత్సవంలో భాగంగా గురువారం రాత్రి విద్యార్థినీ, విద్యార్థులకు పద్యపఠన పోటీని ఏర్పాటు చేశారు. రసవత్తరంగా సాగిన ఈ పోటీ, అనంతరం జరిగిన సమావేశానికి డాక్టర్ రామడుగు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరశర్మ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తెలుగు సాహిత్యంలో గువ్వల చెన్నకవి చెప్పినట్లు చెడనిది పద్యమ్ము సుమీ అనే విషయాన్ని ఆయన తన ప్రసంగంలో స్పష్టంగా ప్రస్తావించారు. మొదటి నుంచి కూడా తెలుగు పద్యానికి ఒక ప్రత్యేకత ఉందని, మిగతా భాషలన్నింటి కన్నా మన ఆంధ్రభాష ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను పద్యం ద్వారా తెలుసుకో గలుగుతామన్నారు. ఆదికవి నన్నయ్య రచించిన పద్యానికి విశేషమైన ఖ్యాతి లభించిందన్నారు. నన్నయ్య రచించిన తెలుగు పద్యం తదనంతర కాలంలో అనేక విధాల మార్పుచెంది మన తెలుగుప్రజల జీవితంలో భాగమైపోయిందన్నారు. పద్యం కంటే ముందు పాట పుట్టిందన్న విషయాన్ని రామడుగు గుర్తుచేసి పాట, పద్యం జన సామాన్యంలో ప్రధానంగా సాహిత్య సారస్వత ప్రియుల జవజీవాల్లో చైతన్యాన్ని కల్గజేశాయన్నారు. రాగయుక్తంగా పద్యాలను ఆలపించడంలో మన తెలుగువారే ప్రపంచ ఖ్యాతిని పొందారన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వరరావు తన ప్రసంగంలో పద్యం ద్వారా గుంటూరు జిల్లాకు జాతీయస్థాయి కీర్తిని కరుణ కవి కరుణశ్రీ, కవికోకిల గుర్రం జాషువా తెచ్చిపెట్టారన్నారు. శతకపద్యాలు, ప్రముఖ కవులు రచించిన పద్యాలను ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడానికి విచ్చేసిన విభిన్న వయస్సులకు చెందిన బాల బాలికలు తమదైన రీతిలో పాడి ఆహ్లాదపర్చారు. విజేతలకు పుస్తక మహోత్సవ కన్వీనర్ ఎఎంఆర్ ఆనంద్ అతిథులు బహుమతులు అందజేశారు.
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
గుంటూరు, నవంబర్ 22: జిల్లాలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఎస్‌జిటి టీచర్లను సస్పెండ్ చేసినట్లు డిఇఒ డి ఆంజనేయులు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం గుంటూరు రూరల్ మండలం లింగాయపాలెంలోని మండల పరిషత్ స్కూలు, వట్టిచెరుకూరు మండలం కోర్నెపాడు గ్రామంలోని మండల పరిషత్ స్కూళ్లను డిఇఒ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లింగాయపాలెంలోని పాఠశాలలో ఎస్‌జిటి డి వీరాంజమ్మ, వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో పాఠశాల హెచ్‌ఎం డి విజయబాబు, ఎస్‌జిటి టీచర్ శేషారత్నం విధులకు సరిగా కాకపోవడం, ఎటువంటి అనుమతి లేకుండా విద్యావాలంటరీని నియమించుకుని విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలుసుకుని ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు డిఇఒ తెలిపారు. పూర్తి వివరాలను కలెక్టర్ సురేష్‌కుమార్‌కు అందజేసినట్లు తెలిపారు.
త్వరితగతిన మిలీనియం బ్లాక్ నిర్మాణం
* రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి కె రత్నకిషోర్
గుంటూరు, నవంబర్ 22: కోస్తాతీర ప్రాంత జిల్లాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేపట్టిన మిలీనియం బ్లాక్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి కె రత్నకిషోర్ తెలిపారు. గురువారం గుంటూరుకు విచ్చేసిన ఆయన ప్రభుత్వాసుపత్రిలో నిర్మాణంలో ఉన్న మిలీనియం బ్లాక్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణం పూరె్తైన వార్డులను పరిశీలించి సూపరింటెండెంట్ చల్లా మోహనరావు, కార్పొరేషన్ ఇఇ కేశవరావులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో రత్నకిషోర్ మాట్లాడుతూ జింఖానా సంఘ సభ్యులు ప్రవాస భారతీయ వైద్యుల సహకారంతో మిలీనియం బ్లాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చుకన్నా అదనంగా రెండు కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పిపిపి ప్రాతిపదికన బ్లాక్ నిర్మాణం చేపట్టిందన్నారు. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో విశాఖపట్నంలో తప్ప మరెక్కడా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి లేదని, జిజిహెచ్‌లో చేపట్టిన మిలీనియం బ్లాక్ నిర్మాణం పూరె్తైతే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు లభిస్తాయన్నారు. రత్నకిషోర్ వెంట కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్, వివిధ విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
గవర్నర్ రోశయ్యను కలిసిన డిసిసి ఉపాధ్యక్షుడు కట్టా
వినుకొండ, నవంబర్ 22: తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్యను గురువారం డిసిసి ఉపాధ్యక్షుడు కట్టా సుబ్బారావు వేమూరులో మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కట్టా పేరయ్య మనవడు కట్టా సుబ్బారావు వినుకొండ నియోజకవర్గంలో పర్యటించాలని రోశయ్యను అభ్యర్థించినట్లు తెలిపారు. రోటరీ క్లబ్ అధ్యక్షులుగా, ఈపూరు మండలంలో కట్టా సుబ్బారావు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను రోశయ్యకు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి, ప్రజా మన్ననలను పొందాలని కొణిజేటి రోశయ్య తెలిపినట్లు సుబ్బారావు పేర్కొన్నారు.
విద్యుదాఘాతానికి గురై రైతు మృతి
బొల్లాపల్లి, నవంబర్ 22: విద్యుదాఘాతానికి రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మనే్నపల్లిపాడుతండాలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన బాణావత్ బాబీనాయక్ (65) తన మిర్చి పొలానికి నీరుపెట్టడం కోసం మధ్యాహ్నం పొలానికి వెళ్ళాడు. అక్కడ మోటారు విద్యుత్ తీగలను లైన్ వైర్లకు తగిలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు.
ద్విచక్ర వాహనాలు ఢీ: ఒకరికి తీవ్ర గాయాలు
మాచవరం, నవంబర్ 22: ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి మరొక ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని తురకపాలెం గ్రామ సమీపంలో గురువారం జరిగింది. తురకపాలెం గ్రామానికి చెందిన షేక్ అల్లావుద్దీన్ తన ద్విచక్ర వాహనంపై వేమవరం నుండి తురకపాలెంకు వస్తుండగా, అదే గ్రామానికి చెందిన షేక్ షరీఫ్ తన ద్విచక్ర వాహనంపై వస్తూ అల్లావుద్దీన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అల్లావుద్దీన్ కాలు విరిగిపోయింది. క్షతగాత్రులను పిడుగురాళ్ళలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అల్లావుద్దీన్ పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలించారు. మాచవరం ఎస్‌ఐ షఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సాగర్ నీటిని ఆరుతడి పంటలకు, మంచినీటికి మాత్రమే వాడుకోవాలి
* అధికారుల సమావేశంలో ఆర్డీవో
నరసరావుపేట, నవంబర్ 22: నాగార్జున సాగర్ నుండి విడుదల చేసిన నీటిని కేవలం ఆరుతడి పంటలకు, మంచినీటికి మాత్రమే వాడుకోవాలని ఆర్డీవో పి అరుణ్‌బాబు స్పష్టం చేశారు. గురువారం రాత్రి స్థానిక ఆర్డీవో కార్యాలయ చాంబర్‌లో కెనాల్స్, పోలీస్, మున్సిపల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ నుండి విడుదలైన నీటితో కొత్త పంటలు వేసుకునే పరిస్థితి లేదన్నారు. వరి పంట వేయకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. రైతులను చైతన్యపరుస్తూ కరపత్రాలను గ్రామాల్లో పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పొలంపై ఉన్న మొక్కజొన్న, జొన్న, కంది పంటలకు మాత్రమే ఈ నీటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, మున్సిపల్ కమిషనర్లు తాగునీటిని నిల్వ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంచినీటిని వృధా చేయవద్దని స్పష్టం చేశారు. నకరికల్లు ట్యాంకును పూర్తి స్థాయిలో నీటితో నింపుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కాల్వలపై లస్కర్లు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. కాల్వలపై మోటార్లను వినియోగించవద్దని రైతులను కోరారు. ఈ సమావేశంలో డిఎస్పీ పి వెంకటరామిరెడ్డి, ఎన్‌ఎస్‌పి ఇఇ శశిభూషణ్, నరసరావుపేట తహశీల్దార్ పార్థసారధి, ఎంపిడివో అర్జునరావు, మున్సిపల్ కమిషనర్ ఏవివి భద్రరావు, వ్యవసాయ శాఖాధికారి అబ్థుల్ సత్తార్, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రైతుల పట్ల పక్షపాత ప్రభుత్వ వైఖరి
ఈపూరు, నవంబర్ 22: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపట్ల పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆయన పరిశీలించారు. రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందటం లేదని బొల్లాకు వివరించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతానని, తగిన చర్యలు తీసుకోని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ సమావేశంలో అంజిరెడ్డి, వీరభద్రారెడ్డి, బొల్లా వెంకటకోటయ్య, లక్ష్మయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అతిగా తాగి వ్యక్తి మృతి
* మృతుడు నల్గొండ జిల్లావాసి
విజయపురిసౌత్, నవంబర్ 22: గత నాలుగు రోజులుగా అతిగా తాగి గురువారం ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన చింతలతండాలో జరిగింది. నల్గొండ జిల్లా అనుమల మండలం బోయగూడెంకు చెందిన ఎస్ మోహన్‌రెడ్డి (38) సాగార్జునసాగర్ వచ్చి బాగా తాగి గురువారం తెల్లవారుఝామున చింతలతండాలో సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు మోహన్‌రెడ్డిని గమనించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. విజయపురిసౌత్ పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ శింగయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మోహన్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. జేబులో ఉన్న కాగితాల అధారంగా మృతుడు మోహన్‌రెడ్డి నల్గొండ జిల్లా అనుమల మండలం బోయగూడెంవాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కమలా నెహ్రూ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.