Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వీసీ కోసం సెర్చ్

$
0
0

ఎచ్చెర్ల, నవంబర్ 22: గత కొన్నాళ్లుగా ఇన్‌చార్జి పాలనలో కొనసాగుతున్న అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామక ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది. వీసీ అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేసే సెర్చ్‌కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం వీసీ నియామకం కోసం ప్రభుత్వం ఇప్పటికే సెర్చ్‌కమిటీ నియమించింది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ వర్సిటీ వీసీ నియామకంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు సెర్చ్‌కమిటీ నామినీని ప్రతిపాదించాల్సిందిగా అంబేద్కర్ వర్సిటీ అధికారులను ఆదేశించింది. దీనిప్రాప్తికి ఎంఎన్‌డిసికి సూచిస్తూ ముగ్గురు ఆచార్యుల పేర్లను కూడా సెర్చ్‌కమిటీ నియామకానికి వర్సిటీ అధికారులు సూచించినట్లు భోగట్టా. ఈ కమిటీలో యు.జి.సి నామినీగా గతంలో నియమించిన మెహతా వ్యవహరించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ నామినీగా ఉన్నత విద్యామండలి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం.జి.గోపాల్‌ను నియమిస్తూ వర్సిటీ నుంచి ఒక ఆచార్యులను నియమించేందుకు ప్రక్రియను పూర్తిచేసినట్లు సమాచారం. 2011, జూలై 26 నుంచి యూనివర్శిటీకి రెగ్యులర్ వీసీ లేరు. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా విశాఖలోని ఎపి లాయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆర్.జి.బి.్భగవత్‌కుమార్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వీసీ కుర్చీ కోసం సుమారు 73 మంది ఆచార్యులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 11 మందిని పరిశీలన జాబితాలో ఉంచి గతంలో నియమించిన సెర్చ్‌కమిటీ గత ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్నంలో పేనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి ప్రభుత్వానికి అభ్యర్థుల జాబితాలను కూడా అందజేసింది. ఈ జాబితాలో అంబేద్కర్ వర్సిటీ పూర్వపు వీసీ ఎస్.వి.సుధాకర్, ఎయు పూర్వరిజిస్ట్రార్ పి.జయప్రకాష్, కెమిస్ట్రీ ప్రొఫెసర్ ప్రసాద్ పేర్లు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాలతో అప్పటి సెర్చ్‌కమిటీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో వీసీ ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. వీసీ నియామకం కోసం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించకూడదని, ఇంటర్వ్యూలు కూడా నిర్వహించరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా నియమించాలని భావిస్తోంది. ఈ నేపధ్యంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ప్రొఫెసర్ లజపతిరాయ్, ప్రొఫెసర్ విప్లవప్రసాద్, జయప్రకాష్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వినికిడి. ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో వీసీ కుర్చీ ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి మరి.

రూ.138కోట్లతో ఉపాధి పనులు
శ్రీకాకుళం, నవంబర్ 22: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాలో 138 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టవచ్చునని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. ఉపాధి హామీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, మీసేవా కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో సి.సి రహదారులు, గ్రావెల్ రోడ్లు, డబ్ల్యుఎం రహదారులు, సాగునీటి పనులైన తూముల నిర్మాణం, కాలువల లైనింగ్ పనులతోపాటు భవనాలను కూడా నిర్మించవచ్చునని చెప్పారు. ఈ పనులన్నీ మెటీరియల్ కాంపోనెంట్‌గా మాత్రమే చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీని యూనిట్‌గా తీసుకోవాలన్నారు. ఇంత వరకు చక్కటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పనులు చేపట్టారని, ఇకపై మరింత చక్కగా పనిచేసే లక్ష్యాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. స్థూలజాతీయ ఉత్పత్తి, తలసరి ఆదాయంలో జిల్లా స్థానాన్ని మెరుగుపరచాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లను పెద్దఎత్తున చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతీ మండలంలో కనీసం 2,500 మరుగుదొడ్లు నిర్మించాలని, ఈ ఏడాదిలో లక్ష మరుగుదొడ్లు నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఒ కైలాసగిరీశ్వర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కల్యాణచక్రవర్తి, మండల ప్రత్యేకాధికారులు, మండల అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ ఎపిఒలు తదితరులు పాల్గొన్నారు.

మద్యం సిండికేట్?
పలాస, నవంబర్ 22: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో 16 మద్యం దుకాణాలను సిండికేట్ చేసేందుకు నరసన్నపేటకు చెందిన మద్యం వ్యాపారి రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఇటీవల ఆ వ్యాపారి పలాసలోని రాజకీయవేత్తలను, ఇద్దరు మద్యంవ్యాపారులతో ప్రత్యేక రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మద్యం దుకాణాలు తనకు అప్పగించినట్లైతే సిండికేట్ చేసి లాభాలు తెచ్చేలా అమ్మకాలు చేపడతానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. మద్యం సిండికేట్ వ్యాపారంపై గతేడాది సర్కార్ ఉక్కుపాదం మోపి వ్యాపారులపై ఎసిబి దాడులు చేయించి సిండికేట్‌ను నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి పకడ్బందీ చర్యలు తీసుకున్న సంగతి విదితమే. దీంతో గడచిన జులై నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమలులోకి తేవడంతో ఏ ప్రాంతంలోనైనా సిండికేట్ చేసేందుకు మద్యం వ్యాపారులు వెనుకంజ వేసారు. అయితే గతంలో ఎసిబి దాడుల్లో అరెస్టు అయి బెయిల్‌పై వచ్చిన ఓ మద్యంవ్యాపారి మరోమారు పలాసలో మద్యం సిండికేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈయనకు సహకరించేందుకు కొంతమంది వ్యాపారులు కూడా ముందుకు వచ్చినట్లు తెలిసింది. మరికొంతమంది మద్యం వ్యాపారులు మాత్రం ఇప్పటికే తాము లక్షల రూపాయల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయామని, ఇటువంటి తరుణంలో ఎటువంటి లాభాలు ఇవ్వకుండా మద్యం దుకాణాలను అందివ్వలేమని ఆ వ్యాపారికి స్పష్టం చేసినట్లు భోగట్టా. అయితే దుకాణాలు కాలపరిమితి ముగిసేలోగా మద్యం వ్యాపారులకు లాభాలు తెచ్చేలా అమ్మకాలు చేపడతానని, దీనికి సహకరించాలని ఆ వ్యాపారి కోరినట్లు తెలిసింది. కాగా మరో వైపు ఈ సిండికేట్ దందా విజయవంతమైతే మందుబాబుల జేబులకు చిల్లు పడే అవకాశం తప్పదు. ఈ విషయమై ఎక్సైజ్ సి ఐ రాజశేఖర్‌నాయుడుకు ఫోన్‌లో వివరణ కోరగా మద్యం సిండికేట్ ఏర్పాటు చేస్తే తాము సహించేది లేదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉత్కంఠగా బ్యాడ్మింటన్ పోటీలు
బలగ, నవంబర్ 22: ఆహ్లాదకరమైన వాతావరణంలో రెండు రోజుల నుంచి జరుగుతున్న స్కూల్‌గేమ్స్ రాష్టస్థ్రాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతలుగా తూర్పుగోదావరి, ఖమ్మం, విశాఖపట్నం జట్లు నిలిచాయి. అండర్-14 బాలుర విభాగంలో విశాఖపట్నం (ప్రథమ), తూర్పుగోదావరి (ద్వితీయ), వరంగల్ (తృతీయ) స్థానాలు సాధించాయి. అండర్-14 బాలికల విభాగంలో తూర్పుగోదావరి (ప్రథమ), ఖమ్మం (ద్వితీయ), హైదరాబాద్ (తృతీయ)స్థానాలు కైవసం చేసుకున్నాయి. అదేవిధంగా అండర్-17 బాలుర విభాగంలో ఖమ్మం, తూర్పుగోదావరి, కృష్ణా జట్లు వరుస స్థానాలు సాధించారు. అండర్-17 బాలికల విభాగంలో విశాఖపట్నం, కృష్ణ, రంగారెడ్డి జట్లు తొలి మూడు స్థానాలు కైవశం చేసుకున్నారు. అదేవిధంగా క్వార్టర్ ఫైనల్స్‌కు పలు జిల్లాల జట్లు చేరుకోగా అండర్-17 బాలికల విభాగంలో పి.సోనికా సాయి (కృష్ణ), బి.అర్చన (రంగారెడ్డి), సిహెచ్. ఉత్తేజిత (విశాఖ), రీతూమంత్ర (హైదరాబాద్), పి.వైష్ణవి (కృష్ణ), సాహితి (విశాఖ), జి.లక్ష్మి (పశ్చిమ గోదావరి)లు విజేతలుగా నిలిచి క్వార్టర్‌కు చేరుకున్నారు. అదేవిధంగా అండర్-14 బాలికల విభాగంలో నవ్య స్వరూప (పశ్చిమ గోదావరి), ఎం.శ్రావణి (ఖమ్మం), నిశిత వర్మ (విశాఖ), ఫైజాన్ (వరంగల్), పి.సుప్రియ (రంగారెడ్డి), షన్విత (తూర్పుగోదావరి), జి.మేఘన (విశాఖపట్నం), ఎ.అక్షిత (తూర్పుగోదావరి)లు క్వార్టర్ ఫైనల్స్‌లో ఉన్నారు. అర్థరాత్రికి ఇంచుమించు సెమీ ఫైనల్స్‌కు జట్లన్నీ చేరుకుంటాయని నిర్వాహకులు తెలియజేశారు. ఫ్లడ్‌లైట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లు మూడు ఉడెన్ కోర్టులలో నిర్వహించి త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నామని ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.వి.రమణ, ఎస్.సూరిబాబులు తెలియజేశారు.

ఎర్రన్న మృతి ఘటనపై ఆరా!
సారవకోట, నవంబర్ 22: ఈ నెల రెండవ తేదిన రోడ్డుప్రమాదంలో దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు మృతిచెందిన సంఘటనపై అతని సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో ఇద్దరు సోదరులు ప్రభాకరరావు, హరిప్రసాద్‌లు ఆరాతీశారు. ఈ సంఘటనలో బుడితి గ్రామానికి చెందిన ఎర్రన్నాయుడు ప్రధాన అనుచరుడు పొన్నాన సీతారామనాయుడు నివాసంలో గురువారం వీరు పలు విషయాలను సేకరించారు. తొలుత గాయపడిన సీతారామనాయుడు ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తదుపరి ఘటనపై వివరాలు సేకరించారు. ఆక్సిజన్ అందకపోవడంతో ఎర్రన్నాయుడు మృతిచెందాడన్న ప్రచారంలో వాస్తవం లేదని అచ్చెన్నాయుడు సోదరులు నిర్ధారణకు వచ్చారు. ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న కారుడ్రైవర్ తప్పిదం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని వీరు గుర్తించారు. వీరితోపాటు స్థానిక మాజీ జెడ్పీటిసి నామగిరి జగన్నాధరావు, కోటబొమ్మాళి మాజీ మండలాధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మీ తదితరులు ఉన్నారు.

అగ్రికెమ్ పునఃప్రారంభంపై టెన్షన్
ఎచ్చెర్ల, నవంబర్ 22: ఎ.ఎ.వలస పరిధిలో ఉన్న నాగార్జున అగ్రికెమ్ రసాయనిక పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన బాధిత గ్రామాలను తీవ్రంగా ఆలోచింపజేసింది. ప్రభుత్వం కూడా నిబంధనలు పాటించకపోవడం వల్లే భారీ పేలుడు సంభవించిందని ఉత్పత్తులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా బాధిత గ్రామాల పక్షాన పోరాట కమిటీ ప్రతినిధులు పరిశ్రమను పలుమార్లు చుట్టుముట్టి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. మరోవైపు కార్మికులు కూడా తమకు ఉపాధి కల్పించాలని జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఇలా పోటాపోటీగా కార్యక్రమాలు రూపకల్పన చేయడంతో అధికారులు మరింత ఇరకాటంలో పడ్డారు. తాజాగా ప్రభుత్వం తాత్కాలికంగా పునఃప్రారంభానికి అనుమతులు జారీ చేయడంతో కలెక్టర్ పలుమార్లు పోరాట కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపినప్పటికీ వీరంతా శాశ్వతంగా మూసివేయాలని పట్టుబట్టారు. సర్కార్ అనుమతులకు తలొగ్గి యాజమాన్యం ఉత్పత్తులు పునఃప్రారంభానికి సమాయత్తం కావడంతో దీనిని అడ్డుకునేందుకు పోరాట కమిటీ ప్రతినిధులు పావులు కదుపుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ముందుగానే మొహరించి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అటు పోరాట కమిటీ ప్రతినిధులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడమే కాకుండా వివిధ రాజకీయ పక్షాల సంఘీభావం కూడగట్టేందుకు తీవ్రప్రయత్నాలు సాగిస్తున్నారు. గురువారం పరిశ్రమను పునఃప్రారంభిస్తారని వార్తలు ప్రచారంలో ఉండటంతో చిలకపాలెం, అల్లినగరం, ఎ.ఎ.వలస, కేశవదాసుపురం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు పరిశ్రమను ముట్టడించి అడ్డుకోవాలని భావించారు. అయితే పరిశ్రమలో ఉత్పత్తులు ఆరంభించకపోవడంతో వారంతా ఇళ్లవద్దే వేచి ఉండడం కనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన సమీప గ్రామాల్లో వ్యక్తమవుతోంది. పోలీసులు మాత్రం పెద్దసంఖ్యలో స్థానిక పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. పరిశ్రమను పునఃప్రారంభిస్తే మరో సోంపేట, కాకరాపల్లి వంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని అనేకమంది చర్చించుకుంటున్నారు. ఏం జరుగుతుందోనన్న భయం కూడా ఈ ప్రాంతవాసుల్లో నెలకొంది.

........
మలేరియా మరణాలు తగ్గుముఖం
* మలేరియా అధికారి అరుణకుమార్
సారవకోట, నవంబర్ 22: జిల్లాలో మలేరియా జ్వరాల మరణాలు గణనీయంగా తగ్గాయని, ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు కాలేదని జిల్లా మలేరియా అధికారి ఎన్.అరుణకుమార్ తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఎఎన్‌ఎంలు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే జిల్లాలో 40 మరణాలకు సరైన కారణాలు తెలియలేదన్నారు. జిల్లాలో 1,40,000 దోమతెరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సీజన్‌లో 20 వేల వరకు విషజ్వరాలు, 18 డెంగూ జ్వరాలు నమోదైనట్లు వివరించారు. మార్పు కార్యక్రమం బుడితి క్లస్టర్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న అరుణకుమార్ గర్భిణీ, జనన, మరణాల రికార్డులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నెలాఖరులోగా రికార్డులను సరిచేయాలని ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గత ఆరునెలలుగా ఐరన్ మాత్రలు నిలువలేదని తెలుసుకున్న ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైద్యాధికారి దినీష్, ఎ.ఎన్.ఎం.లు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీని కలిసిన కృపారాణి
శ్రీకాకుళం, నవంబర్ 22: కేంద్ర ఐటి, కమ్యూనికేషన్లు శాఖా సహాయమంత్రి కిల్లి కృపారాణి భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీని ఢిల్లీలో కలిశారు. తనను కేంద్రసహాయమంత్రి పదవి నియాకమం పట్ల రాహుల్‌గాంధీని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం తుఫాన్ కారణంగా రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశామని, దీనిని ఈ నెల 19న ప్రారంభించినట్లు తెలిపారు. శతశాతం సభ్యత్వ నమోదును పూర్తిచేస్తామన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాంస్య విగ్రహాన్ని టెక్కలి మండల కేంద్రంలో ఆవిష్కరించామని, దీనిని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించినట్లు రాహుల్‌కు వివరించారు. ఈమెతోపాటు డాక్టర్స్‌సెల్ కన్వీనర్ కిల్లి రామ్మోహన్ ఉన్నారు.

జననీ శిశు సంక్షేమ పథకాలపై శ్రద్ధచూపాలి
* ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ప్రత్యేకాధికారి గాయత్రీ
నరసన్నపేట, నవంబర్ 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జననీ శిశు సంరక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రత్యేకాధికారి ఎం.గాయత్రీ కోరారు. గురువారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతా, శిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గర్భస్థ దశ నుండి ప్రసవం అయిన తరువాత కూడా బాలింతతోపాటు శిశువులకు కూడా అన్ని విధాలా ఆరోగ్యసదుపాయాలను కలిగిస్తోందని తెలిపారు. ఈ సంక్షేమ పథకాలపై ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడైనా ఎటువంటి అవకతవకలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్టస్థ్రాయిలో 160 మంది వైద్యాధికారులను పరిచయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం స్థానిక ఆరోగ్యకేంద్రం వార్డుల్లో ఉన్న బాలింతలను కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆమె ఆరాతీశారు. ఆరోగ్యకేంద్ర నిర్వహణ సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి చాపర సుధాకర్, స్థానిక సూపరింటెండెంట్ ఎం.పద్మావతి, వైద్యులు ఎస్.హిందూసింహ, అరుణకుమారి, నవీన్, దీప్తి సిబ్బంది పాల్గొన్నారు.

గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు
శ్రీకాకుళం, నవంబర్ 22: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడం వల్ల బహిరంగ మార్కెట్‌లో ధర పెరుగుతుందని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రైతుకు మద్దతు ధర కల్పించడమే ధ్యేయంగా ఉన్నారన్నారు. అందుకు అధికారులు కూడా సన్నద్ధం కావాలని చెప్పారు. జిల్లా రైతులకు మద్ధతు ధర కల్పించడానికి వంద కొనుగోలు కేంద్రాలు ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని తెలిపారు. డిసిఎంఎస్, కోఆపరేటివ్ సొసైటీలు, ఐకెపి, జిసిసి ద్వారా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి వ్యవసాయశాఖ నుండి ఒక టెక్నికల్ అసిస్టెంట్‌గా మండల వ్యవసాయాధికారిని, రెవెన్యూ శాఖ నుండి తహశీల్దార్‌ను సెంటర్‌ను ఇన్‌చార్జ్జిగా నియమించినట్లు తెలిపారు. టెక్నికల్ అధికారులు, ఐకెపి ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. కొనుగోలుచేసిన ధాన్యాన్ని మిల్లులకు చేరవేసే బాధ్యత పౌరసరఫరాల శాఖ తీసుకుంటుందన్నారు. పదిరోజుల కాలవ్యవధిలో పోస్టుడేటెడ్ చెక్కును వెంటనే రైతుకు ఇవ్వాలని చెప్పారు. రైతు తెచ్చిన ధాన్యం తూకం వేయడానికి ఆయన హమాలీ చార్జీలు రైతు భరించాల్సి ఉంటుంది. తూకం అయిన తరువాత కొనుగోలు సెంటర్ వారు భరిస్తారన్నారు. ప్రతీ సెంటర్ వద్ద వీఆర్వోలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ మాట్లాడుతూ తూనిక సామాగ్రి లేనివారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథకసంచాలకులు తెలియజేస్తే సరఫరా చేస్తారని చెప్పారు. గత సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఐకెపి సిబ్బందికి టెక్నికల్ అసిస్టెంట్స్‌కు ఇబ్బంది ఎక్కువగా ఎదురైందని, ఈ ఏడాది ఆ విధంగా జరిగేందుకు వీల్లేదని వారు ఫోన్ చేసిన వెంటనే వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నిర్మలాభాయి, జిల్లా మేనేజర్ మార్కండేయులు, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయవేత్తలకు నిజాయితీ ఉండాలి
శ్రీకాకుళం , నవంబర్ 22: ప్రజలను వ్యూహాలతో మభ్యపెట్టడం కాకుండా రాజకీయ వేత్తలకు నిజాయితీ ఉండాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ హితవు పలికారు. స్థానిక ఆయన నివాసంలో గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ముంపునకు గురైన ఇందిరానగర్, విశాఖ కాలనీలో కాలువ నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరైతే కాంట్రాక్టర్‌తో మంత్రి ధర్మానకు బేరసారాలు కుదరక ఆ నిధులు వెనక్కి మళ్లించారని ఆరోపించారు. పట్టణం నీట మునిగి ప్రజలు పలు ఇబ్బందులనెదుర్కొంటే వారి బాగోగులు చూడాల్సిన నియోజక వర్గ ప్రతినిధిగా ఉన్న మంత్రి ధర్మాన తన వ్యక్తిగత అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారని విమర్శించారు. ఇవన్నీ దాచిపెట్టి చుట్టపుచూపుగా వచ్చి ముంపునుండి పట్టణాన్ని కాపాడతామంటూ పలకడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టణం అభివృద్ధి చేశామంటూ చెబుతున్న ధర్మాన వెనక్కి వెళ్లిన నిధులను తిరిగి రప్పించి కాలువ నిర్మాణం పనులు చేపట్టాలని హితవు పలికారు. సమావేశంలో మాదారపు వెంకటేష్, డి.వి.ఎస్.ప్రకాశ్, బస్వా రాజేశ్‌రెడ్డి, రోణంకి మల్లేశ్వరరావు, జి.వి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తీరంలో మృతదేహం లభ్యం
* అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
ఎచ్చెర్ల, నవంబర్ 22: మండలంలో బొంతలకోడూరు పంచాయతీ పాతదిబ్బలపాలెం సముద్రతీరంలో గుర్తుతెలియని మృతదేహం గురువారం లభ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక విఆర్వో రామయ్య పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఎస్సై ఎల్.సన్యాసినాయుడు ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉండడమే కాకుండా ఒక కాలు కూడా లేకపోవడంతో సముద్రంలో కుళ్లి రాలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలి శ్రీకాకుళం రూరల్, గార, పోలాకి మండలాల్లో సముద్రంలో వేటకని వెళ్లి గల్లంతైన వ్యక్తుల వివరాలపై వారు ఆరాతీస్తున్నారు. అంతేకాకుండా అదృశ్యమైన యువకుల వివరాలను కూడా సంబంధిత పోలీసు స్టేషన్‌ల నుంచి రాబెడుతున్నారు. పోస్టుమార్టంను కూడా శుక్రవారానికి వాయిదా వేశారు.

భూసార పరీక్షలతో అధికలాభాలు
* ఎ.డి సత్యవతి
ఎచ్చెర్ల, నవంబర్ 22: భూసార పరీక్షలతో అధిక లాభాలు పొందవచ్చునని వ్యవసాయ సహాయ సంచాలకులు జి.సత్యవతి తెలిపారు. మండలంలో ఇబ్రహీంబాద్ గ్రామంలో ఆమదాలవలస భూసార పరీక్షాకేంద్రం సారధ్యంలో పదిమంది రైతులకు సంబంధించిన పది ఎకరాల విస్తీర్ణంలో భూసార పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల ఆవశ్యకతను రైతులకు వివరించడమే కాకుండా ఎకరాకు వెయ్యి రూపాయలు వంతున రాయితీపై డిఏపి, యూరియా, జింకు, గత్తెంలను సరఫరా చేశామని తెలిపారు. భూమి ఆరోగ్యం-పరిరక్షణ వంటి అంశాలపై రైతులు అవగాహన పెంచుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి వై.శారద, సూర్యకుమారి, ఎఇఒలు డి.ఉషారాణి, కె.కృష్ణకాంత్, మహ్మద్‌బేగ్, రైతులు పాల్గొన్నారు.

బాలుడి అదృశ్యం
ఎచ్చెర్ల, నవంబర్ 22: మండలంలో కుశాలపురం గ్రామానికి చెందిన కూన శ్రీరాములు అనే బాలుడు అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో వాటర్‌ప్యాకెట్లు సరఫరా చేస్తూ ఉండేవాడు. అయితే నాలుగురోజుల కిందట నుంచి ఇంటికి రావడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సై ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గత కొన్నాళ్లుగా ఇన్‌చార్జి పాలనలో కొనసాగుతున్న అంబేద్కర్ యూనివర్సిటీ
english title: 
vc search

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>