Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

18 నుండి ఏఐఆర్‌ఎఫ్ జాతీయ మహాసభలు

$
0
0

విశాఖపట్నం, నవంబర్ 22: అఖిల భారతీయ రైల్వే సమాఖ్య (ఏఐఆర్‌ఎఫ్) 88వ జాతీయ మహాసభలు డిసెంబర్ 18వ తేదీ నుండి మూడు రోజులపాటు విశాఖలో నిర్వహిస్తున్నట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చలసాని గాంధీ తెలిపారు. యూనియన్ కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ సమావేశాలకు హెచ్‌ఎంఎస్, అంతర్జాతీయ రవాణా సమాఖ్య (ఐటిఎఫ్) నుండి వివిధ దేశాల కార్మిక ప్రతినిధులు పాల్గొంటారన్నారు. రైల్వే సమస్యలపై చేపట్టనున్న సమ్మెకు ఈ సమావేశాల్లో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశాలకు రైల్వేశాఖ మంత్రి బన్సాల్, సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, రైల్వేబోర్డు చైర్మన్లను ఆహ్వానించామన్నారు. 18న అఖిల భారత రైల్వే మహిళా సమాఖ్య జాతీయ మహాసభలు కూడా జరుగుతాయన్నారు. దేశం నలుమూలల నుండి సుమారు వెయ్యి మంది మహిళా కార్మిక ప్రతినిధులు పాల్గొనే ఈ మహాసభలను ఏఐఆర్‌ఎఫ్ మహిళా కమిటీ చైర్‌పర్సన్ నిర్వహిస్తారన్నారు. ఈ సభల్లో మహిళా కార్మిక సమస్యలు, పనిచేస్తున్న ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పన కోసం పోరాటం దిశగా ప్రణాళికను రూపొందిస్తారన్నారు. అఖిల భారత రైల్వే సమాఖ్య 88వ జాతీయ మహాసభల్లో భారతీయ రైల్వేలోని రెండున్నర లక్షల ఖాళీల భర్తీ, రైల్వే భద్రత, నూతన పెన్షన్ విధానం రద్దు, రైల్వే ప్రైవేటీకరణ రద్దు, రైల్వే కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయంతోపాటు వౌలిక వసతుల కల్పనకు అధిక మొత్తంలో నిధుల కేటాయింపు, రైల్వే కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆరో వేతన సంఘం సిఫారసులు తక్షణం అమలు, తదితర అంశాలపై చర్చతో పాటు, ‘సేవ్ రైల్వే - సేవ్ నేషన్’ నినాదంతో కార్యాచరణను రూపొందిస్తామన్నారు. 18న మధ్యాహ్నం రెండు గంటలకు భారీ ర్యాలీ ఉంటుందని, సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. 1960, 1968, 1974 సంవత్సరాల్లో ఒక్క సమాఖ్య మాత్రమే సమ్మెకు దిగి కొన్ని సమస్యలను పరిష్కరించగలిగిందన్నారు. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ, వివి గిరి, ప్రియ గుప్తా, జెపి చౌబే, ఆచార్య మధుదండావతే, జార్జి పెర్నాండెజ్, తదితర ప్రముఖులు నాటి సమ్మెలకు నాయకత్వం వహించారన్నారు.

రూ కోట్లు సేకరించి
బోర్డు తిప్పేసిన రియల్ సంస్థ

విశాఖపట్నం, నవంబర్ 22: అతి తక్కువ ధరకే స్థలాలు, ఫ్లాట్‌లు ఇస్తామని పలువురిని నమ్మించి కోట్లాది రూపాయాలను సేకరించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేవలం రూ 99 వేలకు వంద గజాలు స్థలం ఇచ్చి వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని, రూ.6 లక్షల 99వేలకు ఎకరా స్థలం అంటూ విశాఖ నగరం ద్వారకానగర్‌లోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ జనాన్ని నమ్మించింది. దీంతో అనేకమంది స్థలాల కోసం లక్షలాది రూపాయలను చెల్లించారు. భూముల రిజిస్ట్రేషన్‌లో కాలయాపన జరుగుతుండడంతో బాధితులు సంస్థ యజమానిని నిలదీశారు. ఈ క్రమంలో స్థలం కోసం డబ్బులు చెల్లించిన డి రమేష్‌శర్మ రిజిస్ట్రేషన్ కోసం గురువారం ఉదయం కంచరపాలెంలోని ధర్మానగర్‌లో గల సంస్థ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్ళగా మూసి వేసి ఉండడాన్ని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేయగా సంస్థ యజమాని పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శుక్రవారం నాటికి మరింత మంది బాధితులు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సిఐ తాతారావు నేతృత్వంలో కంచరపాలెం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

రెండేళ్ళ విజయోత్సవ సభపై ఏర్పాట్లపై
మంత్రి గంటా గంటా నివాసంలో సమీక్ష
* తొలిసారిగా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు

విశాఖపట్నం, నవంబర్ 22: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ళ విజయోత్సవ సభను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నెల 25న నిర్వహించే ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర ఓడరేవులు,పెట్టుబడులు శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో రాష్ట్ర గిరిజనశాఖామంత్రి పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్యేలు చింతలపూడి, మళ్ళ విజయప్రసాద్, తైనాల విజయకుమార్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) పాల్గొన్న ఈ సమావేశంలో విజయోత్సవ సభను నిర్వహించే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. దీనిని ఆర్‌కె బీచ్‌లో జరపాలని ఆలోచన చేస్తున్నారు. అక్కడ వేదికను ఏర్పాటు చేస్తే తీసుకోవాల్సిన చర్యలు, భద్రత, కార్యకర్తల సమీకరించడం తదితర అంశాలపై చర్చించారు. విజయోత్సవ సభ నిర్వహణపై జరిగే ఈ సమావేశం సందర్భంగా అంతా కలియడంపై, అదీ మంత్రి గంటా నివాసంలో మంత్రి బాలరాజు, ఎమ్మెల్యేలు పాల్గొనడంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిన్న,మొన్నటి వరకు ఎడ ముఖం పెడముఖంగా ఉన్న మంత్రులు గంటా, బాలరాజులు పలు కార్యక్రమాలు, సమావేశాలను సైతం వేర్వేరుగా నిర్వహించగా, ఇపుడు సిఎం కార్యక్రమం పేరుతో జరిగే సమీక్షలో ఒక్కటిగా కనిపిస్తుండటం పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

జూపార్కును సందర్శించిన మలేషియా బృందం
* అక్కడి జిరాఫీలు, ఇక్కడి తెల్ల పులుల తరలింపు
ఆరిలోవ, నవంబర్ 22: జూపార్కులో జంతువులను పరస్పరం మార్పు చేసుకునే సరికొత్త విధానానికి అధికారులు శ్రీకారం చుట్టారు. దీనిలోభాగంగా గురువారం మలేషియా జూ పార్కు నుంచి విశాఖ జూపార్కుకు మూడు జిరాఫీలను, ఇక్కడ నుండి మూడు తెల్ల పులి పిల్లలను అక్కడి జూ పార్కుకు తరలింపుపై జరిగిన ఒప్పందంలో భాగంగా మలేషియా జూ పార్కు బృందం గురువారం ఇక్కడి జూపార్కును సందర్శించింది. తెల్లపులులు పెంపక విధానం, ఎన్‌క్లోజర్ నిర్మాణానికి సంబంధించి ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూపార్కులో చిరుతలు, సింహాలు, ఎలుగబంట్లు, పాములు ఉండే ఎన్‌క్లోజర్‌లను బృందం సభ్యులు ఆసక్తికరంగా తిలకించారు. అలాగే శుక్రవారం ఈ బృందం సభ్యులు జూపార్కులో పక్షులు, జంతువులు కలిగి ఉన్న ఎన్‌క్లోజర్లను సందర్శిస్తారు. మలేషియా జూపార్కు వైస్-చైర్మన్ అహ్మద్ సివిక్స్, అక్కడి జూ క్యూరేటర్ డురినా, వెటర్నరీ వైద్యులు నెయిమ్, యానిమల్ వెల్ఫేర్ ఎతిక్ చైర్మన్ లోలోటైన్‌లు జూపార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ జూపార్కు క్యూరేటర్ జి.రామలింగం జంతువుల జీవన విధానాన్ని వారికి వివరించారు. ఈ తరలింపు ప్రక్రియ అయిన తరువాత అక్కడి సింఫాంజీలను అలాగే మలయన్ టాపర్ వంటి జంతువులను ఇక్కడికి తరలించేందుకు ఈ జూపార్కులో ఎలుగుబంట్లు, వైల్డ్‌డాగ్స్ అక్కడకు మార్పు చేసుకునేందుకు ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.

రాజధానికి ఎన్ని నడిపినా చాలని రైళ్ళు
* రోజూ వెయిటింగ్‌లిస్ట్‌తోనే ఐదు ఎక్స్‌ప్రెస్‌లు

విశాఖపట్నం, నవంబర్ 22: విశాఖ నుంచి రాజధానికి రోజుకీ ఎన్ని రైళ్ళను నడుపుతున్నా ప్రయాణికుల అవసరాలు తీరడంలేదు. సెలవులు, పండుగ సీజన్లలోనే కాకుండా సాధారణ రోజుల్లో సైతం సికింద్రాబాద్‌కు వెళ్ళే రైళ్ళన్నీ వెయిటింగ్‌లిస్ట్‌తోనే నడుస్తున్నాయి. అదీ 300నుంచి 400 వెయిటింగ్‌లిస్ట్ చూపుతున్న పరిస్థితులే రిజర్వేషన్ బెర్తులకున్న డిమాండ్‌ను స్పష్టంచేస్తున్నాయి. 14 బోగీలతో నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను 24కు పెంచారు. రెండు జనరల్ బోగీలు తప్పితే మిగిలనవన్నీ ఎసి, సెకండ్, , థర్డ్, స్లీపర్ క్లాసులకు చెందినవే. వీటన్నింటి ద్వారా రోజుకీ దాదాపు 1800 మంది ఇక్కడ నుంచి వెళ్తుంటారు. అలాగే భునేశ్వర్-సికింద్రాబాద్ (విశాఖ ఎక్స్‌ప్రెస్) 20కి మించి బోగీలున్నాయి. వీటితోపాటు ప్రతి ఆది,మంగళ,గురువారాల్లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే దురంతో, రోజుకీ నడుస్తున్న గరీభ్థ్‌ల్ర ద్వారా మూడు వేల మందికి పైగానే వెళ్తుంటారు. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు బయలుదేరి వెళ్ళే విశాఖ-సికింద్రాబాద్ (జన్మభూమి), హౌరా-సికింద్రాబాద్ (ఈస్ట్‌కోస్ట్) ఫలక్‌నుమాతోపాటు మరికొన్ని రైళ్ళు సికింద్రాబాద్‌కు ఉన్నాయి. ఈ విధంగా రోజుకీ 15 వేల మందికి పైగానే రాజధానికి చేరుకుంటున్నారు. అయినా ప్రతి ఎక్స్‌ప్రెస్ రోజుకీ వెయిటింగ్‌లిస్ట్‌తోనే బయలుదేరి వెళ్తుంది. ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, పోలీసు అధికారులు, రాజకీయ నేతలకు మాత్రం ఖచ్చితంగా బెర్తులు లభిస్తున్నాయి. తప్పితే ఏ రోజూ సామాన్యులకు ఒక్క బెర్తులు లభించక, దళారుల చేతుల్లో మోసపోతున్నారు. మరోపక్క రెండు మాసాల ముందుగా టికెట్ తీసుకున్న ఫలితం లేకపోతోందని మహిళలు ఆందోళన చెందుతున్నారు.
దురంతోను రోజూ నడపాలి
విశాఖ నుంచి బయలుదేరి వెళ్ళే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని రైళ్ళను ప్రవేశపెట్టాలనే డిమాండ్ రెండేళ్ళుగా ఉన్నా దీనిపై ఎటువంటి స్పందన లేదు. కనీసం వారానికి మూడు రోజులు నడుస్తున్న దురంతోను రోజుకీ నడపాలని, అలాగే రోజు నడుస్తున్న గరీభ్థ్‌క్రు ప్రస్తుతం ఉన్న 18 బోగీలను గోదావరి మాదిరి 24కి పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల చాలామటుకు బెర్తుల సమస్యలు తీరుతాయని అంటున్నారు. అలాగే వారానికి రెండు రోజులు నడుస్తున్న స్వర్ణజయంతిని, మధ్యాహ్నాం బయలుదేరి వెళ్ళే లింక్ ఎక్స్‌ప్రెస్‌లను కాకుండా రోజుకీ రాత్రి 8 గంటలకు ఇక్కడి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళే విధంగా ఒక ప్రత్యేక రైలును ప్రవేశపెట్టాలని, విశాఖ-వారణాసి మధ్య మరో కొత్త రైలును నడపాలని విశాఖ వాసులు కోరుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి రైల్వేబడ్జెట్‌లో వీటిని ఆమోదించే విధంగా ఇక్కడి నేతలు కృషి చేయాలన్నారు.

పది రోజుల్లో పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్ళు
* విశాఖ-చెన్నై, విశాఖ-షిరిడి
విశాఖపట్నం, నవంబర్ 22: మరో పది రోజుల్లో కొత్త రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. అనుకున్నట్టుగా ఇవి పట్టాలెక్కితే కొనే్నళ్ళుగా నెలకొన్న సమస్య తీరినట్టే. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండే ఈ రైళ్ళతో నిత్యం రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. కేంద్ర రైల్వేశాఖామంత్రి బన్సాల్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించిన నాలుగు ప్రత్యేక రైళ్ళల్లో రెండు విశాఖకు చెందినవే కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇవి రెగ్యులర్‌గా నడుపుతారా? లేదంటే వారంలో ఒకరోజుకే పరిమితమవుతాయా? అనే సందేహాలు ప్రయాణికుల్లో నెలకొన్నాయి. గత కొన్నాళ్ళుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ-చెన్నై ఎక్స్‌ప్రెస్‌పై కేంద్ర మంత్రి నుంచి హామీ లభించింది. అలాగే విశాఖ-షిరిడి మధ్య మరో రైలును నిర్వహిస్తామంటున్నారు. ఇప్పటికే షిరిడి ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం ఇక్కడ నుంచి నడుస్తోంది. గత రెండేళ్ళుగా విశాఖ-షిడిరి ప్రత్యేక రైలుగానే నడుపుతున్నారు. తప్పితే విపరీతమైన డిమాండ్ కలిగి ఉన్న దీనిని రెగ్యులర్ చేయకపోవడంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సాయి భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు.

పాసింజర్ రాదు...ప్రత్యామ్నాయం లేదు
* నీలం తుపానుతో దెబ్బతిన్న ట్రాక్
* ఇంకా కొనసాగుతున్న పనులు
* సమాచారం లేక వలస కూలీలు, చిరు వ్యాపారుల అవస్థలు
విశాఖపట్నం, నవంబర్ 22: పండుగలు, సెలవు రోజుల్లో విశాఖ నుంచి ప్రత్యేక రైళ్ళు ఎలాగూ ఉండటంలేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో సామాన్యులకు బెర్తులు గగనంగా మారుతున్నాయి. కనీసం పాసింజర్ రైళ్ళు సైతం అందుబాటులో లేక ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. నీలం తుపానుతో పలుచోట్ల దెబ్బతిన్న ట్రాక్ పనులతో విశాఖ-విజయవాడ మధ్య నడిచే పాసింజర్ రైలును రెండు రోజులుగా నిలిపివేశారు. మరో రెండు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. కనీసం ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన వలస కూలీలు, చిరు వ్యాపారులు, సాధారణ ఉద్యోగులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఎపుడూ రద్దీగానే నడిచే ఈ పాసింజర్ ద్వారానే చిరు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. అసలే ఆర్టీసీ బస్సు చార్జీలు సామాన్యులకు పెనుభారం కావడంతో గత నాలుగు మాసాలుగా సామాన్య కుటుంబాలు పాసింజర్ రైళ్ళపైనే ఆధారపడుతున్నారు. ఆర్టీసీ బస్సులో విజయవాడకు వెళ్ళాలంటే రూ. 300కుపైనే చార్జీలు చెల్లించాలి. అదే పాసింజర్ రైలులో వెళ్ళే కేవలం 60రూపాయలంటే సరిపోతుంది. లగేజీలకు, చిన్న పిల్లలకు చార్జీలుండవు. ఇంటిళ్ళపాది సుఖ ప్రయాణం చేయవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా విజయవాడకు పాసింజర్ రైలు నిలిచిపోవడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గృహ నిర్మాణ సంస్థ అధికారుల నిర్బంధం
* అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారంటూ
గిరిజనం ఆగ్రహం
డుంబ్రిగుడ, నవంబర్ 22: ఇందిరమ్మ గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్న గృహ నిర్మాణ సంస్థ పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవిశంకర్, ఎ.ఇ.లను గిరిజనులు గురువారం నిర్బంధించారు. మండలం గుంటసీమ పంచాయతీలో ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ నిర్వహించేందుకు గుంటసీమ వెళ్లిన అధికారిని గిరిజనులు చుట్టుముట్టి నిర్బంధించడమే కాకుండా తాళ్లతో కట్టడానికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుంటసీమ పంచాయతీలో ఇందిరమ్మ గృహాలను నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లించాల్సిన దాదాపు రెండు లక్షల రూపాయల బిల్లులను వర్క్ ఇన్‌స్పెక్టర్, కించుమండ స్టేట్‌బ్యాంకు బ్రాంచి నగదు అధికారి స్వాహా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహరంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గృహ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవిశంకర్ ఇప్పటికే రెండు సార్లు విచారణ నిర్వహించారు. మూడోసారి విచారణ నిర్వహించేందుకు గుంటసీమ వెళ్లిన ఇ.ఇ.తోపాటు ఎ.ఇ.లను గిరిజనులు నిలదీసి నిర్బంధించారు. తమకు చెల్లించాల్సిన బిల్లులను స్వాహా చేసిన వారిపై ఇప్పటికే రెండుసార్లు విచారణ నిర్వహించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడాన్ని వారు నిలదీశారు. విచారణల పేరిట కాలయాపన చేస్తూ అక్రమాలకు పాల్పడిన వారికి కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహించిన గిరిజనులు ఇ.ఇ.తోపాటు ఎ.ఇ.లను దాదాపు రెండు గంటల పాటు నిర్బంధించడమే కాకుండా ఇ.ఇ. రవిశంకర్‌ను ఆయన కూర్చున్న కుర్చీకి తాళ్లతో కట్టే ప్రయత్నం చేశారు. దీంతో గృహ నిర్మాణ సంస్థ అధికారులు తీవ్ర ఆందోళనకు లోనుకావడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఇ.ఇ. రవిశంకర్ గిరిజనులకు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో వారిని విడిచిపెట్టారు. అనంతరం రవిశంకర్ విలేఖరులతో మాట్లాడుతూ మండలంలోని సోవ్వ, కితలంగి, రంగిలిసింగి, గుంటసీమ పంచాయతీలలో ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ నిర్వహిస్తున్నామని, కింతలంగి పంచాయతీలో 14 లక్షల 42 వేల రూపాయలు స్వాహాకు గురైనట్టు నిర్థారణఅయిందని ఆయన తెలిపారు. తమ సంస్థ డి.ఇ. అసమర్థత కారణంగానే గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపుల్లో అవినీతి అక్రమాలకు ఆస్కారం ఏర్పడినట్టు ఆయన ఆక్షేపించారు. అవినీతికి పాల్పడిన వర్క్ ఇన్‌స్పెక్టర్, కించుమండ స్టేట్ బ్యాంకు నగదు అధికారితోపాటు డి.ఇ.పై పోలీసు కేసు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.

స్వామీజీ ఆశ్రమంపై కేసు నమోదు
పాడేరు, నవంబర్ 22: వంతాడపల్లి సమీపాన నిర్వహిస్తున్న బాలత్రిపుర సుందరీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆశ్రమంలో మహిళలను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గఫూర్ తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో మహిళలను వేధించడం, విరాళాల పేరిట వేధింపులకు స్వామీజీ పాల్పడుతున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్‌రెడ్డి, దివ్యారెడ్డి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఈ ఫిర్యాదులో దివ్యారెడ్డి తన సమస్యలపై ఆయనను సంప్రదిస్తే వేధింపులకు గురిచేసినట్టు పేర్కొనగా, ప్రసాద్‌రెడ్డి తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించాలని కోరితే విరాళాల పేరిట తనను నిలువుదోపిడి చేయడంతోపాటు అనేక మంది నమ్మకాలను వమ్ముచేస్తూ విరాళాల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఆశ్రమంలో తనతోపాటు అనేకమంది మహిళల పట్ల స్వామీజీ, అతని అనుచరులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు దివ్యారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. ఈ ఇద్దరి ఫిర్యాదు మేరకు 420, 120బి, 354, 506 సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఆశ్రమానికి సంబందించిన ఎవరినీ అరెస్ట్ చేయలేదని, స్వామీజీ ముఖ్య అనుచరుడైన శ్రీను అనే వ్యక్తిని గురువారం విచారించి మళ్ళీ విడిచిపెట్టామని ఆయన చెప్పారు. ఆశ్రమంలో మరింత మంది భక్తులను, అనుచరులను విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నామని గఫూర్ తెలిపారు.

పోలీస్ స్టేషన్‌పై
దండెత్తిన చోరీల బాధితులు
అనకాపల్లి టౌన్, నవంబర్ 22: వరుస దొంగతనాలతో పైకి బంగారు వస్తువులతో వెళ్లాలంటేనే మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా మహిళల మెడల్లో బంగారు నగలు అపహరణకు గురవుతున్నా, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టకపోవడంతో సహనం కోల్పోయిన బాధితులు పోలీస్‌స్టేషన్‌పై ముప్పేట దాడికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా పట్టణంలో వరుసగా మహిళ మెడల్లో బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోతున్న విషయం విదితమే. వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ పట్టణ పురవీధుల గుండా నిరసన ప్రదర్శన జరిపిన మహిళలు పట్టణ పోలీస్‌స్టేషన్, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణ పోలీసులకు వినతిపత్రాన్ని మహిళలు అందజేశారు. త్వరలోనే దొంగలను పట్టుకుని చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆందోళనకారులకు భరోసా ఇచ్చారు. ఇంతవరకు మహిళల మెడల్లో ఆభరణాల చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడిన వారి ఫొటోలను తమకు ఇవ్వాలని పలు సార్లు పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని డాన్ సంస్థ కార్యదర్శి శరగడం శ్రీనివాసరావు విమర్శించారు. చోరీలకు పాల్పడిన వారి ఫొటోలను తమకు అందిస్తే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో డిజిటల్ బోర్డుల ద్వారా ప్రచారం చేసి అటువంటి వారిపట్ల మహిళలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందుకు పోలీసులు అంగీకరించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట కూడా ఇదే తరహాలో ఆందోళన చేపట్టి తహశీల్దార్ పాండురంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.సత్యవతి, బి.అచ్చియ్యమ్మ, బి.అన్నపూర్ణ, ఆర్.లక్ష్మి, పి.లక్ష్మి, ఎన్‌వి సుధారాణి, ధనలక్ష్మి పాల్గొన్నారు.

రూ. 10 లక్షలతో గండ్లు పూడ్చివేత
పాయకరావుపేట, నవంబర్ 22: నీలం తుపాను కారణంగా తాండవ నదిలో నీటి ఉద్ధృత ప్రవాహానికి భూమి, ముఠా ఆనకట్టల వద్ద పడిన గండ్లను పూడ్చి వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 10 లక్షల రూపాయలతో రెండు గండ్లను పూడ్చడానికి ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇప్పటికే ముఠా ఆనకట్ట వద్ద ఉన్న గండిని పూడ్చేందుకు పనులు చేపట్టగా, భూమి ఆనకట్ట వద్ద పడిన గండిని పూడ్చేందుకు శుక్రవారం నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు ఇరిగేషన్ జె. ఇ. సత్యనారాయణ దొర తెలిపారు. తాండవ నదిలో వరద ఉద్ధృతానికి గండ్లు పడడంతో నీరంతా వృథాగా పోయిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేస్తామని లేదంటే రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తే మళ్ళీ నీరు వృథాగా సముద్రం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని జెఇ తెలిపారు.

సిరిబాలలో మావోయిస్టుల అలజడి
* ద్విచక్ర వాహనం దగ్ధం
* త్రుటిలో తప్పించుకున్న మాజీ సర్పంచ్
గూడెంకొత్తవీధి, నవంబర్ 22: మండలం సిరిబాల గ్రామంలో సి.పి.ఐ. మావోయిస్టులు అలజడి సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి సిరిబాలలో పర్యటించి వంచుల మాజీ సర్పంచ్ డుంబు చిన్నారావు ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేసి అతని కోసం గ్రామంలో గడపగడపకు వెతికారు. అనంతరం సమీపంలో ఉన్న ఎ.పి.ఎఫ్.డి.సి. చెల్లంగి కామేశ్వరరావు కోసం మావోయిస్టులు ఆరా తీశారు. దీనికి సంబంధించి గ్రామస్థులు,ప్రత్యక్ష సాక్ష్యులు అందించిన వివరాల మేరకు గురువారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో సామాన్య దుస్తులు వేసుకున్న ఐదుగురు మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించారు. ముందుగా ఎ.పి.ఎఫ్.డి.సి. చెల్లంగి కామేశ్వరరావు కోసం ఆరా తీసి అనంతరం మాజీ సర్పంచ్ డుంబు చిన్నారావు ఇంటికి వెళ్ళారు. అక్కడ సర్పంచ్‌ను వెంట బెట్టుకుని కామేశ్వరరావు వద్దకు తీసుకువెళ్ళారు. ఈ సంఘటన జరిగిందన్న విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్థులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఎంతో చాకచక్యంగా మాజీ సర్పంచ్ చిన్నారావు తప్పించుకున్నారు. తప్పించుకున్న సర్పంచ్ కోసం సుమారు రెండు గంటలపాటు ఇంటింటికి వెళ్ళి వెతికారు. అయినప్పటికీ సర్పంచ్ దొరక్కపోవడంతో అతని ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపైకి లాక్కొని వచ్చి నిప్పంటించి దగ్ధం చేశారు. ఈ సంఘటనలో సుమారు ఐదుగురు మావోయిస్టులు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరికొంతమంది సమీప ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనా ప్రదేశంలో మావోయిస్టు కరపత్రాలుగాని, ఎటువంటిది మావోయిస్టులు వదలివెళ్ళలేదు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ సుమారు రెండు గంటల పాటు గ్రామస్థులు ఆందోళన చెందారు.

‘బాక్సైట్‌పై మంత్రి బాలరాజు
వైఖరి ప్రకటించాలి’
ముంచంగిపుట్టు, నవంబర్ 22: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజన మంత్రి పసుపులేటి బాలరాజు స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు గడ్డంగి రామ్మూర్తి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బాక్సైట్‌పై మంత్రి రెండు నా ల్కల ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. గిరిజనుల అభీష్టం మేరకే బాక్సైట్‌పై నిర్ణయం ఉంటుందని ప్రకటిస్తున్న మంత్రి ఏనిర్ణయం తీసుకున్నది చెప్పడం లేదన్నారు. గిరిజనులం తా బాక్సైట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దృష్ట్యా మంత్రి తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన కోరారు.

కిశోర్‌పై విమర్శలు..
గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడమే
* మాజీ మంత్రి బాలరాజు ధ్వజం
పాడేరు, నవంబర్ 22: గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఆదివాసుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడుతున్న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌పై రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, గంటా శ్రీనివాసరావు అర్థరహితమైన విమర్శలు గుప్పిస్తూ తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మత్స్యరాస బాలరాజు అన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆదివాసుల బతుకులను ఛిద్రం చేసే బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనను తీవ్రం గా వ్యతిరేకిస్తున్న కిశోర్ చంద్రదేవ్ గిరిజనులకు న్యాయం చేసేందుకు పాటుపడుతున్నారని చెప్పారు. గిరిజన మంత్రిగా గిరిజనులకు న్యాయం చేసేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న కేంద్ర మంత్రి చర్యలను మంత్రులు దానం, గంటా విమర్శించడం గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. పరిపాలనలోనూ, రాజకీయ రంగంలో ఆరితేరి ఎంతో అనుభవం కలిగిన కిశోర్‌ను విమర్శించే స్థాయి ఈ మంత్రులకు లేదన్న సంగతి గుర్తుంచుకోవడం మంచిదని ఆయన హితవు చెప్పారు. విశాఖ మన్యం బాక్సైట్ రగడతో అట్టుడికిపోతుందని, బాక్సైట్ తవ్వకాలు చేపడితే తమ మనుగడ ఏమవుతుందోనని గిరిజనులు ఆం దోళన చెందుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యంలోకి, తరువాత కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన గం టా వంటి స్వార్థపరులు కూడా కిశోర్ వంటి జాతీయ స్థాయి నాయకులను విమర్శించడం అర్థరహితమని ఆయన ఆక్షేపించారు. అధికారం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలలోకి చేరి, పార్టీలు మార్చుతున్న గంటా తన స్థాయిని, పరిధిని తెలుసుకుని వ్యవహరించడం మంచిదని ఆయన హితవు చెప్పారు. బాక్సైట్ అంశంపై గిరిజనుల పక్షాన నిలిచి పోరాటం సాగిస్తున్న కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై రాష్ట్ర మంత్రులు అనవసర రాద్ధాంతం చేసేకంటే బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసేందుకు పాటుపడితే మంచిదని సూచించారు.

అంగన్‌వాడీ వ్యవస్థ నిర్వీర్యానికి
సర్కారు కుట్ర!
* సిఐటియు ధర్నా
పాడేరు, నవంబర్ 22: అంగన్‌వాడీ వ్యవస్థను స్వచ్చంద సేవా సంస్థలకు అప్పగించి నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు పాడేరు పట్టణంలో ప్రదర్శన చేపట్టి అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య, నిరంకుశ వైఖరికి నిరసనగా పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. పాడేరు డివిజన్ కార్యదర్శి ఆర్.రవిశంకర్ మాట్లాడుతూ ఐ.సి.డి.ఎస్.-4 పేరుతో ప్రపంచబ్యాంకు నుంచి అప్పు తీసుకువచ్చిన ప్రభుత్వం అంగన్‌వాడీ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు సాగిస్తుందని ఆరోపించారు. స్వచ్చంద సంస్థలకు అంగన్‌వాడీ కేంద్రాలను అప్పగించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుందని, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ ఆహార పథకం ఇందులో భాగమేనని చెప్పారు. ఈ పథకాన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేస్త్తూనే అమలు బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్షయపాత్ర అనే స్వచ్చంద సేవా సంస్థకు పౌష్టికాహారం పంపిణీ బాధ్యతను ఇప్పటికే అప్పగించారని చెప్పారు. అంగన్‌వాడీలకు కనీస వేతనాలను అమలు చేయకుండా వారి సమస్యలను పరిష్కరించకుండా ఇటువంటి దొడ్డిదారి పథకాలతో వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. అంగన్‌వాడీలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలను విడనాడి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. అనంతరం పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం ప్రతినిధులు ఎం.అంబాలమ్మ, జి.విజయలక్ష్మి, ఎల్.లక్ష్మి, కుమారి, బంగారుపాప, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

రోడ్ల అభివృద్ధికి రూ.4.45 కోట్లు మంజూరు
* ఎమ్మెల్యే పంచకర్ల
సబ్బవరం,నవంబర్ 22: మండలంలో నాలుగు మారుమూల గ్రామాల రోడ్ల అభివృద్ధికి 4.45 కోట్లరూపాయల నిధులను మంజూరు చేశామని ,దీంతో ఆయాగ్రామాలకు తారురోడ్లు నిర్మిస్తారని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. గురువారం ఇక్కడికి వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కొత్తగా మంజూరైన నిధుల్లో రాయపుర అగ్రహారం-టెక్కలిపాలెం రోడ్డుకు 1.05 కోట్లరూపాయలు,పినగాడి -కె.కోటపాడు రోడ్డుకు 1.10 కోట్లు, వంగలి -ఒమ్మివానిపాలెం రో డ్డుకు 2.30కోట్లరూపాయల చొప్పున నిధులను మంజూరు చేశామని తెలిపారు. అలాగే శుక్రవారం సబ్బవరం కళాశాల విద్యార్థులకు సుమారు 30 వేల రూపాయల విలువైన స్పోర్ట్స్ కిట్స్ అందించే కార్యక్రమం సొంత నిధులతో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రమేష్‌బాబు వివరించారు. ఈసమావేశంలో విశాఖ మార్కెటింగ్ చైర్మన్ వేగి దివాకర్,మండల కాంగ్రెస్ నేతలు గవర శ్రీనివాసరావు,సాలాపువెంకటేశ్వరరావు,గొర్లి అచ్చిమనాయుడు,కరణం రామనాయుడు,కరణం రామోజీ,జెట్టిప్రసాద్,కర్రి బంగారునాయుడు, దొడ్డి అప్పారావు,కరణం అప్పారావు,్భగ్గుఈశ్వరరావు పాల్గొన్నారు.

అఖిల భారతీయ రైల్వే సమాఖ్య (ఏఐఆర్‌ఎఫ్) 88వ జాతీయ మహాసభలు
english title: 
aifr national conference

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>