Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చెక్‌డామ్ నిర్మాణంలో అవినీతి చెద

$
0
0

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
కారణాలు ఏమైనప్పటికీ మన్యంలో చెక్‌డామ్‌ల పనులలో అవినీతి వరద పారుతోందన్న అభియోగాన్ని అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడే బహిర్గతం చేస్తూ సమగ్ర గిరిజనాభివృద్ధిశాఖ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం చిన్నతరహా నీటి వనరుల్లో అవినీతి పారుదలకు పాలనా యంత్రాంగమే పరోక్షంగా ప్రోత్సాహాన్ని అందించిన తీరు వివాదమవుతోంది. చాలా వరకూ ఏ పనులకు మరమ్మతులు చేస్తారో అన్న స్పష్టత లేని 28 పనులకు పరిపాలనామోదాన్ని ఇవ్వడమే కాకుండా ఇచ్చిన విధానంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎంపి అయిన కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్ ఈ వివాదానికి తెరలేపారు. వ్యవహారంపై నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి విచారణ కోరినట్లు తెలిసింది. ఐటిడిఎ పరిధిలో గల 11 మండలాల్లో జరుగుతున్న చెక్‌డామ్‌ల పనులను తాజాగా ఉపాధి హామీ చట్టం కింద జిల్లా యంత్రాంగం చేపడుతోంది. హిరమండలంలో మూడు పనులకు పరిపాలనామోదం పొందగా, జలుమూరు, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, మందస, నందిగాం, పలా, సారవకోట మండలాల్లో ఒక్కోక్క పనికి ఆమోదాలు లభించాయి. ఇక మెళియాపుట్టి మండలంలో ఐదు పనులకు ఆమోదం లభిస్తే ఇటీవల కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పాతపట్నం మండలంలో రెండు, సీతంపేట మండలంలో 11 పనులకు పాలనామోదం లభించింది. మరమ్మతులు ప్రతిపాదించిన పనులపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ వివాదంగా మారితే వాటికి పరిపాలనామోదం ఇచ్చిన తీరు మరో వివాదానికి దారి తీస్తోంది. ఏజెన్సీలో 11 మండలాల్లో మొన్నటి వరకూ చిన్నతరహా నీటిపారుదలశాఖ చేపట్టిన చెక్‌డామ్ పనులను తాజాగా మహాత్మగాంధీ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టారు. సర్కార్ ఇందుకుగాను రూ. 218 కోట్లు మంజూరు చేసి 28 పనులు పూర్తి చేయాలంటూ అన్నీ అనుమతులు ఇచ్చింది. ఇందులో 189.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంబంధిత యంత్రాంగం 19 పనులు పూర్తి చేసింది. ఆ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చిందన్న విమర్శలు తెలిసినవే. ఇకపోతే మిగిలిన తొమ్మిది పనులు పూర్తిగా ప్రారంభించనేలేదు. అయితే ఆయా పనులు అసలు ఉన్నాయా లేదా, ఉంటే వాటికి నిజంగా ఎప్పుడు పూర్తి చేయాలి? చేసిన పనులకే మళ్లీ ప్రతిపాదించారా? అన్న నిర్థారణ లేకుండానే పరిపాలనామోదం ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతోంది. సీతంపేట మండలంలో నాలుగు చెక్‌డామ్ పనులతోపాటు మర్రిపాడు పంచాయితీలో చేపట్టిన పనులకు మొన్న లైలా, నిన్న నీలం తుపానుకు కొట్టుకుపోయింది. దీనివల్ల 2.18 కోట్ల రూపాయలు నిధులు వరదపాలైనట్టే! ఇక మెళియాపుట్టి మండలంలో సుమారు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు ఇంజనీరింగ్ అధికారులే గుర్తించారు. దీనిపై అప్పట్లో ఫైళ్లు తొక్కేయడంతో బహిరంగం కాలేదు. తాజాగా అరకు ఎం.పి. దీనిని వెలుగులోకి తీసుకువచ్చారు. దీంతో అవినీతికి అధికార యంత్రాంగం ప్రోత్సహాం ఎంతన్నది అర్థమవుతుంది. ప్రతిపాదించిన పనుల్లో ఏ వాగుపై ఉన్న చెక్‌డామ్‌లకు మరమ్మతులు ప్రతిపాదించిందన్నది చాలా పనుల పేరుల్లో లేకపోవడం శోచనీయం. ఆయా పనులకు పరిపాలనామోదాన్ని ఇచ్చే సందర్భంలో సాధారణంగా అవలంభించే విధానంలో ఆయా పనుల వాస్తవ స్థితిని గ్రహించాల్సిన యంత్రాంగం ఇందుకు భిన్నంగా రాజకీయ ఒత్తిడితో ఆమోదాన్ని ఇచ్చారని తెలుస్తోంది. ఐదు లక్షల రూపాయల లోపు అంచనా విలువ కలిగిన ఇరిగేషన్ పనులకు పరిపాలనామోదాన్ని మంజూరు చేసే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం 2011, జూలైలో జీవో నెం. 99ని జారీ చేసిన మేరకే ఈ పనులు ప్రతిపాదనలు కలెక్టర్‌కు చేరాయి. సంబంధిత మంత్రికి ఈ ఏడాది జూన్‌లో వినతి అందితే ఆయన సూచన మేరకు అప్పటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అదే రోజున జిల్లా యంత్రాంగానికి ఎండార్సుమెంటు ఇచ్చారు. రెండు రోజులకే అంటే అన్నీ పనులకు పరిపాలనామోదం లభించింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆయా పనులకు పరిపాలనామోదం లభించడం మరింత శోచనీయం. ఈ వ్యవహారంపై పార్లమెంటు సభ్యుడు కిషోర్‌చంద్రదేవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ సమగ్ర విచారణ కోరారు. ఆయా పనులను మంజూరు చేసే అంశమైనా, నిధులను కేటాయించే అంశమైనా ఐటీడిఏ పాలకమండలి ఆమోదానికి లోబడి జరిపించాలని ఆయన పేర్కొన్నారు. విచిత్రమేమిటంటే ఈ అంశంపై వివాదం ఇలా సాగుతూ, ప్రభుత్వ పరిశీలనలో ఉండగానే మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లు మాత్రం ఇటీవల జరిగిన ఐటీడిఏ పాలక మండలికి అసలు చేపట్టని తొమ్మిది పనులూ చేపట్టినట్టే భౌతిక ప్రగతి నివేదికలో పొందుపర్చడం విడ్డూరం. ఏదిఏమైనప్పటికీ ప్రతిపాదించిన పనులు, జారీ చేసిన పరిపాలనామోదాలు, వివాదమైన నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరిపి నిగ్గు తేల్చాల్సి ఉంది!
భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి
శ్రీకాకుళం (కల్చరల్), నవంబర్ 28: జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని భక్తులు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇంటిని సర్వసుందరంగా అలంకరించి పూజా మందిరాల్లో సిద్ధం చేసిన వరి దుబ్బిను కేదారేశ్వరునిగా పూజిస్తూ ప్రణమిల్లారు. బూరెలు, గారెలు, పరమాన్నం, ఫలాలు, పంచామృతం నైవేద్యాలు సమర్పించి వ్రత కథ చదివి ఎల్లాపట్టు దారాలతో పూజించుకుని చేతికి ధరించుకున్నారు. సాయంత్రం ఉపవాసానంతరం పండు పున్నమి వెన్నల దర్శించుకుని దేవాలయాలు చేరుకుని ఆకాశ దీపాలు, నదీ, కోనేరులలో కార్తీక దీపాలు వెలిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అరసవల్లిలో కార్తీక పౌర్ణమి పూజలు
ఆరోగ్య ప్రదాత అరసవల్లి ఆదిత్యుని సన్నిధిలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. మనగుడి కార్యక్రమంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, కార్యనిర్వహణాధికారి బి.ప్రసాద్ పట్నాయక్ నిర్వహణలో కేదారేశ్వరస్వామి పూజలు, కుంకుమ పూజలు జరిగాయి. అనంతరం అర్చకులు పాల్గొన్న భక్తులకు శక్తికంకణ బహూకరణ, తీర్ధ ప్రసాదాలతో పాటు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి, సాంప్రదాయాల సంరక్షణకు టిటిడి దేవాదాయ శాఖ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించడం హర్షనీయమన్నారు.
భక్తుల తాకిడి
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదిత్యుని దేవస్థానానికి భక్తుల తాకిడి అధికమైంది. వేకువ జామునే భక్తులు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించి స్వామిని దర్శించుకున్నారు.
* పట్టణంలోగల గురిటి పోలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ కాత్యాయనీ సమేత మండలేశ్వర స్వామికి కార్తీక పౌర్ణమి పర్వదినం బుధవారం రాత్రి విశేష దీపాలలంకరణ, ఏకాదశ రుద్ర హారతి సేవలు దేదీప్యంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకులు వేమకోటి ప్రదీప్ శర్మ, పెంట అనీల్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వాహణలో హారతి సేవలతోపాటు కాత్యాయనీ అమ్మవారికి విశేష పుష్పాలంకరణ, శ్రీచక్ర అభిషేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా మనగుడి పూజలు
శ్రీకాకుళం (కల్చరల్), నవంబర్ 28: కార్తీక పౌర్ణమి సందర్భంగా మనగుడి పేరుతో జిల్లాలోని 445 దేవాలయాల్లో పూజలునిర్వహించినట్లు టిటిడి జిల్లా ఇన్‌చార్జి ఆర్.సుబ్రహ్మణ్యం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలో బుధవారం నాగావళి నదీ తీరంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి కంకణాలు, అక్షింతలు, లక్ష్మీదేవి పసుపు కుంకుమలు ఊరేగింపుగా వేదమంత్రాలతో సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదేవిధంగా పాతశ్రీకాకుళం సంతోషిమాత ఆలయం, గుజరాతీపేట నారాయణ తిరుమల దేవాలయాల్లో కూడా పూజలు జరిగాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో భక్తులకు శ్రీవారి పుస్తకాలు, గోవిందనామాలు, ప్రసాదాలు అందించారు.

స్వామి శ్రీనివాసానంద అరెస్టు, విడుదల
పోలీసు బలగాలను వెనక్కిరప్పించాలని చిలకలపాలెం కూడలిలో బైఠాయింపు
ఎచ్చెర్ల, నవంబర్ 28: గత నాలుగురోజులుగా నాగార్జున అగ్రికెమ్ పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బలగాలను వెనక్కిరప్పించాలని కోరుతూ బుధవారం చిలకపాలెం కూడలికి పది గంటల సమయంలో భారతస్వాభిమాన్ జిల్లా అధ్యక్షులు, పోరాట కమిటీ సభ్యుడు స్వామి శ్రీనివాసానంద చేరుకుని రోడ్డుపై బైటాయించి నిరసనకు దిగారు. వెంటనే అక్కడున్న పోలీసులు అప్రమత్తమై శ్రీనివాసానందను ఆందోళన నుంచి వైదొలగాలని సూచించారు. దీనిపై స్వామి శ్రీనివాసానంద పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి ప్రజల పక్షాన ఆందోళన సాగిస్తుంటే అమర్యాదగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలా కొంత సమయం పోలీసులకు, శ్రీనివాసానందకు వాగ్వివాదం చోటుచేసుకుంది. అప్పటికే చేరుకున్న జె.ఆర్ పురం, నరసన్నపేట సి.ఐలు వేణుగోపాలనాయుడు, మూర్తి, ఎచ్చెర్ల ఎస్సై సన్యాసినాయుడులు ఆందోళన విరమించాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం డిఎస్‌పి ఎల్.అర్జున్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగించేందుకు యత్నించారు. ఫలితం లేకపోవడంతో స్వామి శ్రీనివాసానందతో పాటు చిలకపాలెం మాజీ ఉపసర్పంచు చిలక గోవిందరావు, మరోముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అక్కడి నుంచి నేరుగా గార పోలీసుస్టేషన్‌కు తరలించి తిరిగి స్థానిక పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి ఎటువంటి కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టినట్లు ఎస్సై సన్యాసినాయుడు పేర్కొన్నారు. కాగా, బాధిత గ్రామాల నుంచి పోలీసులను వెనక్కు పంపించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, ఎస్పీ కె.వి.వి.గోపాలరావులకు పోరాటకమిటీ ప్రతినిధులు కలిసి ఏకరవు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ అప్రకటిత కర్ఫ్యూ , 144 సెక్షన్‌ను చిలకపాలెం, అల్లినగరం, అరిణాం అక్కివలస, కేశవదాసుపురం, అన్నంపేట సమీప గ్రామాల్లో కొనసాగిస్తుండటంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
మహోన్నత వ్యక్తి పూలే

అదనపు జాయింట్ కలెక్టర్ రాజ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 28:సమాజంలో బడుగు, బలహీన వర్గాలను బహుజనులుగా సంఘటితం చేసిన మహావ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్. ఎస్.రాజ్‌కుమార్ అన్నారు. పూలే 122వ వర్ధంతి సభ బుధవారం స్థానిక హెచ్‌బికాలనీ అంబేద్కర్ భవనంలో బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రపతి అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఎజేసీ మాట్లాడుతూ నాగరికత అభివృద్ధి చెందాలంటే అణగారిన వర్గాలు, అన్ని కులాలు సమానంగా ఉండాలని అన్నారు. స్వయం కృషితో పట్టుదలతో పోరాటం చేసిన వ్యక్తి పూలే అంటూ కొనియాడారు. ఆడపిల్లలు చదువుకోకూడదన్న భావనను రూపుమాపి సంఘంలో అందరూ సమానమే అంటూ చెప్పిన వ్యక్తన్నారు. పట్టణంలో పూలే విగ్రహం స్థాపించాలని బిసి సంక్షేమ సంఘం కోరగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా ఖాసిం, డిఆర్‌డిఎ పిడి పి.రజనీకాంతారావు, బలరాం, అచ్యుతానంద గుప్త, వి.వి.ఆర్. ఎస్.మూర్తి తదితరులున్నారు.

గార్నెట్ కార్మికుల కలెక్టరేట్ ముట్టడి
అడ్డుకున్న పోలీసులు, 88 మంది అరెస్టు
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 28: అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని, రోడ్డున పడ్డ కార్మికులకు జీవనభృతి కల్పించాలని కోరుతూ సిటు ఆధ్వర్యంలో జిల్లాలోని గారమండలం సతివాడ వద్ద నున్న ట్రాన్స్‌వరల్డ్ గార్నెట్ పరిశ్రమ కార్మికులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ గేట్ వద్ద వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పట్టణంలో ర్యాలీగా బయలుదేరిన కార్మికులు కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించి యాజమాన్యానికి, కార్మికశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా గేట్లు బంద్ చేసి పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులు సిఐటియు నాయకులు ప్రతిఘటించడంతో చేసేదేమీ లేక కార్మికులను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 88 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ముందుగా నిర్వహించిన ముట్టడి కార్యక్రమంలో కార్మికులనుద్దేశించి సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా పరిశ్రమ యాజమాన్యం అక్రమ లాకౌట్ ప్రకటించిందని, దీంతో సుమారు 450 మంది కార్మికులంతా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం అందజేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేవని తెలిపారు. అధికారులు పరిశ్రమ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ కార్మికుల పట్ల నిరంకుశ వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. పరిశ్రమను తెరిపించి కార్మికులకు జీవిన భృతి కల్పించాలని లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జి.బండారి, అప్పలరాజు, వై.గారయ్య, ఎం.రామకృష్ణ, సతీష్, కామయ్య, చిన్నవాడు, ఎం.రామారావులు పాల్గొన్నారు.

యువకిరణాలకు 172 మంది ఎంపిక

ఎచ్చెర్ల, నవంబర్ 28: నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో రాజీవ్ యువకిరణాలను ప్రభుత్వం రూపొందించి 21వ శతాబ్ధపు గురుకులంలో రెండురోజుల పాటు ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా జాబ్స్ మేనేజర్ ఎస్.రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం గురుకులం ఆవరణలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పర్యవేక్షణ అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఇంజనీరింగ్, ఎంబిఏ, ఎంసిఏ, బిఎస్‌సి తదితర ఉన్నత విద్య అభ్యసించిన అభ్యర్థులను 11 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు రెండురోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశామన్నారు. సాహితీ సిస్టమ్‌కు 36 మంది, ఫ్రింకో వర్క్స్ 62, సత్యంగ్రేప్స్ 25, టీమ్‌లీడర్ 12, నేక్ ఎలక్ట్రికల్ 39 మందిని ఎంపిక చేశామని తెలిపారు. వీరందరికి డిసెంబర్ మొదటివారం నుంచి 21వ శతాబ్ధపు గురుకులంలో 60 రోజులు, 90 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ప్లేస్‌మెంట్ కల్పిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో నేక్ ఎ.డి జి.చిట్టిబాబు, ఐకెపి ఎ.ఒ జగన్నాధ

మన్యంలో రూ. 7.18 కోట్ల పనులకు అధికారుల అత్యుత్సాహం విచారణ కోరుతూ చీఫ్‌సెక్రటరీకి కేంద్రమంత్రి కిషోర్ లేఖ? 28 పనులపై అవినీతి ఆరోపణలు
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>