Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బాస్ వివేకా ఎక్కడ?

$
0
0

నెల్లూరు, నవంబర్ 21: చాన్నాళ్ల నుంచి నల్లటి కళ్లద్దాలు, ఇటీవల బ్రౌన్ కలర్ హెయిర్‌తో, ఎప్పుడూ అదిరేటి డ్రస్సింగ్‌తో(్ఫ్యంట్ షర్ట్ లేక పంచెకట్టు), నడి బజార్‌లో సిగరెట్ కాలుస్తూ పొగ రింగులు రింగులుగా వదిలే ఆయనను ఎమ్మెల్యేగా ప్రజలెన్నుకుంటే స్టైల్ ఆఫ్ సింహపురిగా పత్రికల్లో పేరొందారు. ఆయన అడుగెస్తే మాస్... అనుచరులంతా ముద్దుగా బాస్ అంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని పిలుచుకోవడం పరిపాటి. పేరుకు గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా నగరమంతా ఆయన హడావుడి జాస్తి. ప్రయాణంలో నల్ల కళ్లద్దాలు, ఎక్కడైనా సభలు, సమావేశాల్లో ప్రసంగ సమయంలోనూ, ఏవైనా చదివే సందర్భంలో తెల్లటి కళ్లద్దాలను మార్చిమార్చి అందించే వ్యక్తిగత సహాయకులు, లేటెస్ట్‌మోడల్ కార్లలో షికార్లు, ఎప్పటికప్పుడు పత్రికాముఖంగా మాట్లాడే అంశాలకు సంబంధించి ముందస్తుగానే కాగితాలపై రాసిచ్చే సిబ్బంది, ఇలా పెద్ద సరంజామాతో హంగులన్నీ ఆయనకే చెల్లు. అయితే గత కొన్నాళ్లగా ఆయన ప్రచార ఆర్భాటానికి దూరంగా వ్యవహరిస్తుండటంతో స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఆయనంటే నెల్లూరు ప్రాంతంలో పసిపిల్లోడి నుంచి పండు ముదుసలి వరకు అందరికీ ఎరుక. వివేకా ఫోటో దినపత్రికల్లో నిత్యం కవరేజి కావడం పరిపాటి. ఆయన విన్యాసాలు ఎక్కువగా చిన్నపిల్లోళ్లలా చిలిపి చేష్టల్ని తలపిస్తుంటాయి. బేల్దారి పనిచేసే కార్మికునిగా, కొలిమి కార్మికుడిగా , ఇస్ర్తి చేసే రజకునిగా, నూతన దుకాణాల ప్రారంభ వేడుకల్లో మహిళల చీరలు ధరించినట్లుగా, బంగారు ఆభరణాలు వంటివి అలంకరించుకునే, తదితర వివిధ విన్యాసాల్లో నిత్యం ఏదో ఒక స్టిల్‌తో ఎక్కడో ఒక ఒకచోట కనిపించి వింతగొలుపుతుంటారు. రోజూ నెల్లూరులో పలు కార్యక్రమాల్లో హడావుడి సాగించే వివేకానందరెడ్డి గత కొన్నాళ్లగా స్థానికంగా ఎక్కడా కానరావడం లేదు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు, గట్రా జరిగినప్పుడు నెల్లూరులో ఉండటం సాధ్యపడదు. హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోనే ధూమపానం చేస్తూనో ఇంకోరకం వింత వింతగా వ్యవహరించడమో లేక బాంబుల్లాంటి ప్రకటనలతో పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడో ఒక చోట కనిపించడం రివాజు. అయితే అలాంటి వివేకా గురించి గత కొద్దిరోజులుగా ఊసే లేకుండా పోయింది. చిన్నపాటి కార్యక్రమాల్లోనూ పెద్ద ఆర్భాటం సృష్టించే ఆయన ఇటీవలకాలంలో జరుగుతున్న భారీ సభలు, సమావేశాలకు సైతం దూరంగానే ఉంటున్నారు. ఇంతకీ ఆయన గురించి ఆరా తీస్తే, మోకాలి నొప్పి వల్ల డాక్టర్ల సలహామేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని తెలియవచ్చింది. అయితే ఆయన రాకపోతుండటం వల్ల చాలా కార్యక్రమాలు బోసిపోయినట్లుగా దర్శనమిస్తున్నాయి. ఆయనకు ఓ వైపున అడుగులు వేసే నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, మరో పక్క కొనసాగే మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ సైతం వివిధ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. వాస్తవం చూస్తే ఈయన వ్యవహారాలన్నీ ‘అతి’గా అనిపించినా నెల్లూరీయులకు మాత్రం ఇవేమి కొత్తగా కనిపిస్తున్న వింతలు కాకపోవడం వల్ల సాధారణంగానే భావించడం అలవాటైంది.
చెరకు రైతుల బకాయలు చెల్లించకుంటే ఆందోళన ఉద్ధృతం
* అఖిల పక్ష నేతల హెచ్చరిక
నెల్లూరుఅర్బన్, నవంబర్ 28: చెరుకు రైతులకు బకాయిలు డిసెంబర్ 10 తేదీలోగా చెల్లించకుంటే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని అఖిల పక్షం నేతలు హెచ్చరించారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కోవూరు షుగర్ ఫ్యాక్టరికి సంబంధించి చెరుకు రైతులకు దాదాపు 9 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఎన్నో పర్యాయాలుగా హామీ ఇస్తున్నా రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి నెల్లూరు జిల్లావాసే అయినా ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. గురువారం నెల్లూరుకు వస్తున్నందున మంత్రికి వినతిపత్రాన్ని అందజేస్తామన్నారు. నెలాఖరునుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా చెరకు రైతులకు న్యాయం చేకూరేలా చూడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రిని సంప్రదించి కూడా విజ్ఞాపన పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల జీతభత్యాలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ సమస్యపై పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. చెరకు రైతుల సమస్యల్ని పరిష్కారం కోసం అధికార్లతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం సముచితమన్నారు. విలేఖర్ల సమావేశంలో కావలి ఎమ్మెల్యే బీదా మస్తానరావు, గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర, తెలుగురైతు జిల్లా అధ్యక్షులు రాపూరు సుందరరామిరెడ్డి, కోవూరు నియోజకవర్గ పార్టీ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్దనరెడ్డి, సిపిఐ నాయకులు పముజుల దశరధరామయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సిపిఐ జిల్లా కార్యదర్శి వి రామరాజు, రైతు నాయకులు, తదితరులు పాల్గొన్నారు. విలేఖర్లతో మాట్లాడే ముందు అఖిలపక్ష నేతలు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు.
ఎన్నికలు
ఎప్పుడొచ్చినా
వైఎస్‌ఆర్‌సిపిదే
జైత్రయాత్ర

కావలి, నవంబర్ 28: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీదే జైత్రయాత్ర అని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కోవూరు నియోజకవర్గ సమస్యలపై ఆర్‌డిఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డితో చర్చలు జరిపేందుకు రాగా స్థానిక విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలంతా దివంగత వైఎస్‌ఆర్ పాలన కావాలని ప్రగాఢంగా కోరుతున్నారని, దీనిని నెరవేర్చే సమర్ధుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని నిర్ణయించుకున్నారని చెప్పారు. జగన్ సోదరి షర్మిల తీవ్ర ఉద్యమాలు జరిగిన తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తుండగా ఆప్రాంత ప్రజలు ప్రాంతీయ భావోద్వేగాలను పక్కనపెట్టి పాదయాత్రకు తరలివస్తూ వైఎస్‌ఆర్ కుటుంబానికి అండగా వుంటామని ప్రతిజ్ఞచేస్తున్నారని చెప్పారు. పరిస్థితి ఇలా వుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌పార్టీతో తెరవెనుక చేయి కలుపుతూ తమ పార్టీని ఇబ్బందులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడం లేదని ఆక్షేపించారు. పార్టీ నాయకులు కొండూరువెంకటరమణారెడ్డి, నారా కొండపనాయుడు తదితరులు వున్నారు.

‘క్రీడలతో వత్తిడి దూరం ’
గూడూరు, నవంబర్ 28: క్రీడలు మనిషిలో ఉన్న వత్తిడిలను దూరం చేస్తాయని సన్నపురెడ్డి కృష్ణారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జి సరళకుమారి అన్నారు. బుధవారం కళాశాలలో యువజనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన జిల్లా గేమ్స్, స్పోర్ట్స్‌మీట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. క్రీడల విషయంలో డిగ్రీ కళాశాలల కమిషనర్ సునీత ఎంతో ఆసక్తితో ఉన్నారని, యువతను చక్కగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. జోనల్ కో ఆర్డినేటర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల విజేతలు డిసెంబర్ 3,4 తేదీల్లో నెల్లూరు డికెడబ్ల్యు కళాశాలలో జరిగే జోనల్ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొంటారన్నారు. అనంతరం స్టేట్ లెవల్ పోటీలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ సురేంద్ర రెడ్డి, పిఇటి సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లాలోని కళాశాలల పిడిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు 100, 200, 400, 800, 1500, షాట్‌పుట్, డిస్క్‌త్రో, లాంగ్ జంప్, హైజంప్ పోటీలు నిర్వహించారు.
సిబ్బందిని బెదిరించి అంబులెన్స్ అపహరణ
దొరవారిసత్రం, నవంబర్ 28: చెన్నైనుంచి నెల్లూరుకు వస్తున్న అంబులెన్స్‌లోని సిబ్బందిని బెదిరించి గుర్తుతెలియని నలుగురు దుండగులు అంబులెన్స్‌ను అపహరించుకుపోయన సంఘటన బుధవారం దొరవారిసత్రం సమీపంలో జరిగింది. రవి చిన్నపిల్లల ఆసుపత్రినుంచి ఓ బాలుడ్ని చెన్నైకు తీసుకునివెళ్లి అంబులెన్స్ సిబ్బంది తిరిగి బుధవారం నెల్లూరుకు వస్తున్న సమయంలో తమిళనాడులోని పూడి వద్ద నలుగురు గుర్తుతెలియని దుండగులు అంబులెన్స్‌లోకి బలవంతంగా ప్రవేశించారు. సిబ్బందిని తుపాకీలతో బెదిరించారు. అంబులెన్స్ దొరవారిసత్రం సమీపంలోని రోసనూరుకు వెళ్లే రోడ్డుమార్గంలో రాగానే సిబ్బంది ప్రకాష్, గోపాల్‌లను కిందికి దించి , తాళ్లతో బంధించి పక్కనేవున్న ముళ్లపొదల్లో పడేశారు. వారి వద్దనున్న సెల్‌ఫోన్లు, సుమారు 2 వేల రూపాయలు, గుర్తింపు కార్డులతోపాటు అంబులెన్స్‌నుకూడా అపహరించుకుని వెళ్లారు. కొద్దిసేపటి కి ఎలాగోలా కట్లు విప్పుకున్న సిబ్బంది జరిగిన సంఘటనను నెల్లూరులోని అంబులెన్స్ యజమానికి సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్, గూడూరు డిఎస్పి సురేష్‌కుమార్, నాయుడుపేట, సూళ్లూరుపేట సిఐలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత ప్రకాష్, ప్రదీప్, గోపాల్‌లనుంచి నిందితుల ఆచూకీ కోసం వివరాలను సేకరించారు.
చోరికి గురైన అంబులెన్స్
ప్రకాశం జిల్లాలో లభ్యం
దొరవారిసత్రంలో చోరికి గురైన అంబులెన్స్ ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు అంబులెన్స్‌ను దొంగలించుకువెళ్లిన దుండగులు ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు వద్ద ఓ పెట్రోల్ బంకులోకి ప్రవేశించి తుపాకీలతో బెదిరించి సుమారు లక్ష రూపాయల మేర దొంగిలించుకువెళ్లారు. అనంతరం పట్టుబడతామన్న భయంతో అంబులెన్స్‌ను మేదరమెట్ల వద్ద రహదారిపై వదిలి మరో వాహనంలో హైదరాబాదుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే వాహనాన్ని తీసుకు వచ్చేందుకు దొరవారిసత్రం ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి, ప్రకాశం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. జిల్లా పోలీసులు దుండగులను పట్టుకునేందుకు అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసినట్లు సమాచారం.
పేదరిక నిర్మూలనే టిడిపి లక్ష్యం:సోమిరెడ్డి
కలువాయి, నవంబర్ 28: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తెలుగుదేశంపార్టీ పనిచేస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని మండలంలోని దాసరిపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత తమ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌కు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఊరూరా ప్రజా సమస్యలు తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. ఆనం, మేకపాటి సోదరులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోడమే తప్ప జిల్లాను అభివృద్ధిపరిచిన దాఖలాల్లేవ న్నారు. జిల్లాలోని రెండు రిజర్వాయర్లలో 53 టిఎంసిల వరకు నీటి నిల్వ ఉన్నా చెరువుల్లో చుక్క నీరు కూడా లేదని వాపోయారు. తెలుగుదేశంపార్టీ ప్రభుత్వ హయాంలో కండలేరు జలాలను చెన్నైకు తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన నేటి రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు చేస్తున్నదేమిటి అంటూ ప్రశ్నించారు. పక్షంరోజులకో పర్యాయం జరగాల్సిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మూడు నెలలకో పర్యాయం కూడా సీఎం కిరణ్ నిర్వహించలేకున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఆరేళ్లపాటు కరవుపరిస్థితులు నెలకొన్నా పరిశ్రమలకు విద్యుత్ కోత విధించలేదన్నారు. నాలుగు సంవత్సరాల్లో 43వేల కోట్ల రూపాయలను జగన్ ఎలా సంపాదించాడో ముందుగా షర్మిల ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన జగన్మోహనరెడ్డి తన తండ్రి పాలనలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా వెంకట రత్నం, కావలి ఎమ్మెల్యే బీదా మస్తానరావు, నాయకులు చెలికం శంకరరెడ్డి, గంగోటి నాగేశ్వరారవు, మేడా విజయకుమార్, కిలారి వెంకటస్వామినాయుడు, బి గోపాలకృష్ణ, తిరుమల, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, ఆరు మండలాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

తత్కాల్‌లో
ఇంటర్ ఫీజు చెల్లింపు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 28: జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించకుంటే తత్కాల్ స్కీమ్ కింద అందజేయవచ్చని ఇంటర్‌మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వై పరంధామయ్య తెలిపారు. బుధవారం ఆయన ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ అంశాన్ని గుర్తెరగాలన్నారు. కాలేజి చదవకుండా అటెండెన్స్ ఎగ్జామినేషన్ (ఆర్ట్స్ గ్రూపులు) తీసుకున్నవారు కూడా ఈ స్కీమ్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. తత్కాల్ ఫీజు ఐదువందల రూపాయలు, అటెండెన్స్ ఎగ్జామినేషన్ (ఆర్ట్స్‌గ్రూపులకు) ఐదువందల రూపాయలు, తొలి సంవత్సర ఫీజు 240 రూపాయలు, రెండవ సంవత్సర ఫీజు 240 రూపాయలు, అప్లికేషన్ ఫీజు పది రూపాయలు వంతున చెల్లించాలన్నారు.
సముద్రంలో మునిగి
మత్స్యకార విద్యార్థి మృతి
ఇందుకూరుపేట, నవంబర్ 28: మైపాడుసముద్రంలో మునిగి స్థానిక మత్స్యకార కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇందుకూరుపేట మండలం మైపాడు పట్టపుపాలేనికి చెందిన పామంజి శివకుమార్ (16) ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుని సుదూర ప్రాంతాల నుంచి నెల్లూరు దర్గాకు వచ్చిన భక్తులు స్నానానికి, సేద తీర్చుకొనుటకు మైపాడు బీచ్‌కు అధిక సంఖ్యలో వాహనాల్లో వచ్చారు. అక్కడ నెలకొన్న సందడిని చూసి ఆ యువకుడు కూడా స్నానం చేస్తుండగా విధి వక్రీకరించి సముద్రంలో మునిగి మృతిచెందాడు. యువకుడి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. యువకుడి ఇద్దరు చెల్లెళ్లూ అన్న మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం మైపాడు బీచ్‌లో ఓపక్క పర్యాటకుల సందడి మరోపక్క విద్యార్థి మృతిపట్ల విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి:కలెక్టర్
దుత్తలూరు, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను, వాటికి వర్తించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ సూచించారు. మండల పరిధిలోని కమ్మవారిపాళెంలో సబ్సిడీపై సాగు చేస్తున్న అరటి తోటలను, బోడవారిపల్లిలోని ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న ఇందిర జలప్రభ భూములను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో పేద ప్రజలకు అన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అందించే రాయితీలను నేరుగా అర్హులైన లబ్ధిదారునికి అందేలా చూడాలన్నారు. అనంతరం రైతు సమస్యలు తెలపాలని కోరగా కమ్మవారిపాలేనికి చెందిన రైతు వెంకటేశ్వర్లు తన సొంత పొలానికి పాస్ పుస్తకం ఇచ్చారని అయితే టైటిల్‌లీడ్‌ను అడిగితే ఎమ్మెల్యే, కలెక్టర్ చేబితే ఆర్డీవో ఇస్తారని తహశీల్దార్ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే ఆర్డీవోకు ఫోన్‌చేసి విషయం తెల్సుకున్నారు. తహశీల్దార్‌తో కలెక్టర్ అసైన్‌మెంట్ భూములకు పాస్ పుస్తకాలు వెంటనే అందేలా చూడాలన్నారు. అనంతరం మనగుడి కార్యక్రమంలో భాగంగా నర్రవాడలోని వెంగమాంబ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది కలెక్టర్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడీ పంపిణీ చేసిన కంకణాలు, లడ్డూలను కలెక్టర్‌కు అందించారు. దుత్తలూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని కూడా దర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిడి వెంకటేశ్వర్లు, ఉపాధిహామీ ఎపిడి భాస్కర్‌రావు, వింజమూరు హెల్త్ క్లష్టర్ అధికారి సుధాకర్, దుత్తలూరు ఎపివో రాజ్‌కుమార్, తహశీల్దార్ నరహరి, ఎంపిడివో శివారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పదోన్నతి రిజర్వేషన్లు అడ్డుకోవాలి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 28: పదోన్నతుల్లో రిజర్వేషన్లను అగ్రవర్ణాలకు చెందిన పార్లమెంట్ సభ్యులైనా వ్యతిరేకించాలని ఓసి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జి కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం నెల్లూరులో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లను అమలు చేయడం వల్ల ఎందరో అగ్రవర్ణాలకు చెందిన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో జరగనున్న రాజ్యాంగ సవరణను ఓసీ ఎంపీలైనా వ్యతిరేకించాలంటూ కోరారు. ఈతరహా అంశాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడితే భావితరాల్లో అగ్రవర్ణాలు తీవ్రంగా నష్టపోతాయంటూ ఆవేదన చెందారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సరైన గణాంకాలు లేకుండా కుల ప్రాతిపదికన పదోన్నతుల్లో రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, సీనియారిటీ మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు కొట్టివేసిన సంగతి గుర్తు చేశారు. 1995లో ఇదే అంశంపై రాజ్యాంగ సవరణ చేసినా సుప్రీం కోర్టు కొట్టివేసిందన్నారు. మరో పర్యాయం రాజ్యాంగ సవరణ చేసినా తాము న్యాయస్థానం ఆశ్రయిస్తామంటూ హెచ్చరించారు. కోర్టు తీర్పును గౌరవించకుండా ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం పాలకులు వెంపర్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల వల్ల అగ్రవర్ణాలు తీవ్రంగా నష్టపోతున్నాయని వివరించారు. భవిష్యత్‌లో ఉన్నత అధికార్లలో ఒక్క ఓసి కూడా ఉండే అవకాశాల్లేవని తెలిపారు. ఈ అంశాన్ని వ్యతిరేకించకుంటే ఓసి ప్రజాప్రతినిధుల్ని వారి నియోజకవర్గాల్లో పర్యటించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కుంభ కోణాల నుంచి దృష్టి మరల్చేందుకు పదోన్నతుల్లో రిజర్వేషన్లంటూ మభ్యపెడుతుందని ఆరోపించారు. కొత్తపట్నం థర్మల్ స్టేషన్‌లో చీటికిమాటికీ విద్యుత్ ఉత్పాదన నిలిచిపోతుండటానికి కారణం కూడా అక్కడ ఉన్నత స్థాయిల్లో ఉండే అధికార్లంతా దొడ్డిదోవన పదోన్నతులు పొందడమేనన్నారు. అలా నైపుణ్యత లేకుండా పదోన్నతులు పొంది కడకు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి దుష్పరిణామాలకు అడ్డుకట్ట పడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విలేఖర్ల సమావేశంలో ఇంకా ఓసి సంక్షేమ సంఘ ఆత్మకూరు నేత వాసిపల్లి నారాయణరెడ్డి, ఓసి విద్యార్థి సంఘ నాయకులు కందనూరు వెంకటసుబ్బారెడ్డి, కోవూరు నియోజకవర్గ నేత బోడిశెట్టి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు

చాన్నాళ్ల నుంచి నల్లటి కళ్లద్దాలు, ఇటీవల బ్రౌన్ కలర్ హెయిర్‌తో, ఎప్పుడూ అదిరేటి డ్రస్సింగ్‌తో(్ఫ్యంట్ షర్ట్
english title: 
b

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>