ఒంగోలు, నవంబర్ 28: కార్తీకపౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ప్రధానంగా జిల్లాలోని కొత్తపట్నం, చీరాల, పాకల సముద్రతీరంలో వేలాదిమంది భక్తులు స్నానమాచరించారు. ఆయా సముద్రతీరాలకు మంగళవారం రాత్రి నుండే భక్తులకు తరలివచ్చారు. బుధవారం వేకువజాము నుండే భక్తులు స్నానాలు చేసి సమీప శైవక్షేత్రాల్లో పూజలు చేశారు. సంతపేటలోని వీరాంజనేయస్వామి సన్నిధిలో వేదపండితులు మఠంపల్లి శ్రీరామశర్మ ఆధ్వర్యంలో భక్తులు ఐదుకోట్ల 11 లక్షల జ్యోతులను వెలిగించారు. భక్తుల సౌకర్యార్ధం ఆర్‌టిసి వేకువజాము నుండే ప్రత్యేక బస్సులను సముద్రతీరాలకు నడిపింది. కార్తీకపౌర్ణమి సందర్భంగా ఆర్‌టిసికి కూడా అదనపు ఆదాయం వచ్చింది. ఇదిలాఉండగా భక్తుల సౌకర్యార్ధం సముద్రం తీరం వెంట ప్రత్యేక వసతులను కల్పించటంలో అధికారులు వైఫల్యం చెందారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉండగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోని కేశవస్వామిపేటలోని గంగాపార్వతీ సమేత కాశీవిశే్వశ్వరస్వామి, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్ధానాల్లో జిల్లా కలెక్టర్ అనితారాజేంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీకజ్యోతులు వెలిగించారు. అదేవిధంగా సిఎస్‌పురం మండలంలోని భైరవకోన, త్రిపురాంతకం మండలంలోని త్రిపురాంతకేశ్వరుడి ఆలయం, టంగుటూరు మండలంలోని జమ్ములపాలంలో ఉన్న 1116 శివలింగాల ఆలయం, సురభేశ్వరకోన, ఒంగోలులోని శివాలయలం, కొత్తపట్నంలోని శివాలయం తదితర క్షేత్రాల్లో భక్తులు విశేష పూజలు చేశారు. ప్రధానంగా జిల్లాలోని అయ్యప్పభక్తులు వేకుమజామునే సముద్రంలో స్నానమాచరించి దగ్గరలోని శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 440 దేవాలయాల్లో మనగుడి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందని దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి శ్రీనివాసరావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. జిల్లాలోని పలుప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఇఇ జి వెంకటకృష్ణారెడ్డి, తాను పర్యటించామన్నారు. ప్రధానంగా తిరుపతి నుండి వచ్చిన కంకణాలను కట్టించుకునేందుకు భక్తులు ఎగబడ్డారని ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉండగా మహిళలు దేవాలయాల వద్ద కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మార్కాపురం రైల్వేస్టేషన్‌లో సమస్యలను పరిష్కరిస్తా
* డిఆర్‌ఎం ప్రసాద్ హామీ
మార్కాపురంరూరల్, నవంబర్ 28: మార్కాపురం రైల్వేస్టేషన్‌లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని గుంటూరు డిఆర్‌ఎం ప్రసాద్ ప్రయాణీకుల సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. బుధవారం మార్కాపురం రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన శ్రీశైలం వెళ్ళే భక్తుల సౌకర్యార్ధం 130 మీటర్ల ప్లాట్‌ఫారం పనులను పరిశీలించారు. షెడ్ పొడిగింపు, పార్కింగ్ షెడ్‌ను అదనంగా ఏర్పాటు చేయిస్తామని, దొంగతనాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ఆర్‌కెజె నరసింహం, ఆర్గనైజర్ ఎన్ నరసింహాచార్యులు, మార్కాపురం నీటిసంఘం అధ్యక్షులు జి వెలుగొండారెడ్డి, శ్రావణి స్వచ్చంధ సేవాసంఘం కోశాధికారి పి రాధాకృష్ణమూర్తి తదితరులు డిఆర్‌ఎంతో మాట్లాడుతూ 1,2 ఫ్లాట్‌ఫారాలను అభివృద్ధి చేయాలని, గుంటూరు - కాచీగూడ రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని, గుంటూరు - ద్రోణాచలం రైలును గుంతకల్లు వరకు పొడిగించాలని, ద్రోణాచలం - గుంటూరు రైలును నర్సాపురం వరకు పొడిగించాలని, మచిలీపట్నం - యశ్వంతపూర్ రైలును ప్రతిరోజూ నడపాలని కోరారు. ఆయన వెంట గుంటూరు డివిజన్ అధికారులు సత్యనారాయణ, మురళీకృష్ణ, జయప్రకాశ్‌రెడ్డి, రత్నాకర్, శ్యాంసుందర్‌లు ఉన్నారు. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి, డిఆర్‌యుసిసి నెంబర్ ఎస్‌కె ఇస్మాయిల్ అభ్యర్ధన మేరకు డిఆర్‌ఎం బుధవారం మార్కాపురం రైల్వేస్టేషన్‌ను సందర్శించినట్లు ఆర్‌కెజె నరసింహం తెలిపారు. ఈసమస్యలపై మంగళవారం ఇస్మాయిల్ ఢిల్లీలో రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు.
పెట్రోలు బంకులో నగదు చోరీ
గుడ్లూరు, నవంబర్ 28: మండల పరిధిలోని తెట్టు రైల్వేస్టేషన్ రహదారికి సమీపంలో ఉన్న హెచ్‌పిసి పెట్రోల్ బంకులో 2లక్షల రూపాయలు చోరీ జరిగింది. ఈఘటన బుధవారం వేకువజామున జరిగింది. పోలీసులు, పెట్రోల్‌బంకు యజమాని కథనం మేరకు బుధవారం వేకువ జామును ఒక అంబులెన్స్‌లో నలుగురు వ్యక్తులు వచ్చి వాహనంలో ఆయిల్ పట్టమని అక్కడ పంపింగ్ చేసే కోటేశ్వరరావును అడిగారు. ఆయిల్ నింపిన అనంతరం కోటేశ్వరరావు నగదు అడిగాడు. దానికి అగంతకులు తమ వద్దనున్న తుపాకులతో కోటేశ్వరరావును బెదిరించి క్యాష్ కౌంటర్‌లోనున్న రెండు లక్షల రూపాయలు అపహరించుకువెళ్లారు. నెల్లూరులో అంబులెన్స్ దొంగిలించి తెట్టుదగ్గర ఆయిల్ పట్టించుకోవడానికి వచ్చి నగదు రెండు లక్షల రూపాయలు దోపిడీచేసి ఆవాహనాన్ని మేదరమెట్ల దగ్గర విడిచివెళ్లినట్లు సమాచారం. కందుకూరు డిఎస్పీ అశోక్‌కుమార్, సిఐ అక్కేశ్వరరావు, గుడ్లూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించారు. గుడ్లూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు దుండగులను పట్టుకోవడానికి సమాచారం తెలుసుకున్న వెంటనే వెంబడించారు. అగంతకులు నగదు చోరీ చేసే సమయంలో హిందీ మాట్లాడుతున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, నవంబర్ 28: ఖాయిలా పరిశ్రమలను గుర్తించి పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఒంగోలులో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానం ద్వారా మంజూరు చేస్తున్నామన్నారు. వివిధ శాఖల అనుమతులకు ఔత్సాహికుల నుండి 199 దరఖాస్తులు రాగా వాటిలో 153 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. 26 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారుల వద్ద అత్యధికంగా 17 దరఖాస్తులు, కాలుష్య నియంత్రణ మండలి వద్ద రెండు దరఖాస్తులు, పరిశ్రమల శాఖ వద్ద రెండు దరఖాస్తులు, టౌన్ ప్లానింగ్, చీమకుర్తి మున్సిపాలిటీల పరిధిలో ఐదు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఉలవపాడు, గుడ్లూరు, మార్కాపురం, మార్టూరు, ఇంకొల్లు, చీరాల, వేటపాలెం, తదితర ప్రాంతాలలో విస్తారంగా సాగవుతున్న పండ్లతోటలు, కూరగాయలు, జీడిపప్పు ప్రాపెసింగ్ చేసేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. పండ్లతోటలు విస్తారంగా ఉన్న ప్రాంతాలలో బహుళ స్థాయి కోల్డ్‌స్టోరేజీల నిర్మాణాలను ప్రోత్సహించాలని వారు తెలిపారు. అదేవిధంగా ఖాయిలాపడ్డ పరిశ్రమలను గుర్తించి వాటిని పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఎక్కువమంది కార్మికులకు ఉపాధిని అందిస్తున్న పరిశ్రమలను, వివిధ రకాల వస్తువులను తయారు చేస్తున్న పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో ప్లాట్ల కేటాయింపుకోసం అందింన దరఖాస్తులను పరిశీలించి వివిధ పరిశ్రమలకు ప్లాట్లు కేటాయించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ ఎం మురళీ మోహన్, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ కృష్ణమూర్తి, ఫ్యాక్టరీస్ ఇన్స్‌పెక్టర్ శ్రీ సురేష్, ఎపిఎస్‌ఎఫ్‌సి అసిస్టెంట్ మేనేజర్ మురళీకృష్ణ, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ అఖిల్, కాలుష్య నియంత్రణ మండలి ఎఇ విజయమోహన్, ట్రాన్స్‌కో ఎడిఇ పద్మావతి, డివిజనల్ పంచాయతీ అధికారి కృష్ణమోహన్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జెవిఎస్ ప్రసాద్, టిపిఓ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
డబ్బుల కోసం బ్రతికి ఉన్నవారిని చంపేస్తారా..?
* ఉపాధిహామీ సిబ్బందిపై ఎమ్మెల్యే కందుల ఆగ్రహం
మార్కాపురంరూరల్, నవంబర్ 28: భర్త, పిల్లలతో సుఖంగా ఉన్న మనిషిని డబ్బుల కోసం మరణించినట్లుగా రికార్డుల్లో రాసుకొని ఆ నగదును పంచుకున్న ఉపాధిహామీ సిబ్బందిపై ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మార్కాపురం ఎంపిడిఓ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం నాల్గవ విడత సామాజిక తనిఖీ జరిగిది. గతఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈఏడాది సెప్టెంబర్ 30వరకు జరిగిన పనులను సమీక్షించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేములకోట గ్రామానికి చెందిన ఎం వెంకటమ్మ మరణించినట్లుగా రికార్డుల్లో రాసుకొని ఈఏడాది మే 7న ఉపాధి హామీ సిబ్బంది అభయహస్తం పథకం కింద డబ్బులు డ్రా చేశారని, ఇది మీకు న్యాయంగా అనిపిస్తుందా..? అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వెంకటమ్మను వేదికపైకి పిలిచి అందరికి చూపించారు. ఈ విషయాన్ని ఫోన్‌లో ఎమ్మెల్యే కందుల డిఆర్‌డిఎ పిడి పద్మజకు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కూలీలకు కష్టాలు తీర్చాల్సిందిపోయి లేని కష్టాలను తెస్తుందన్నారు. కొన్ని గ్రామాల్లో ఈ పథకంలో పని చేస్తున్న కూలీలకు రోజుకు రెండు నుంచి ఆరు రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నారని, దేశంలో ఇలాంటి కూలీలు ఎవరైనా ఇస్తున్నారా..? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కష్టపడిన తరువాత లీటరు నీళ్ళు తాగుదామన్నా 4 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. భవిష్యత్తులోనైనా సక్రమంగా ఈపథకాన్ని అమలు చేసి వలసలను నివారించి సరైన వేతనం లభించేలా సిబ్బంది పని చేయాలని అన్నారు. అసిస్టెంటు ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు కొలతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పారదర్శకంగా పనులు చేయాలని కోరారు. ఎంపిడిఓ హనుమంతరావు, ఎస్‌ఆర్‌పి నీలకంఠం, స్మార్ట్‌కార్డు ప్రతినిధి శిరీషా, విజిలెన్స్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలుగ్రామాల్లో పథకం అమలులో జరిగిన అవకతవకలను సర్వే చేసిన సిబ్బంది వెలుగులోనికి తెచ్చారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు మృతి
ఒకరికి తీవ్ర గాయాలు
మర్రిపూడి, నవంబర్ 28: మండలంలోని కూచిపూడి పెట్రోలు బంకు సమీపంలో బుధవారం ఆర్‌టిసి బస్సును మోటార్‌సైకిల్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే.. మండలంలోని సన్నమూరు గ్రామానికి చెందిన మొగిలిశెట్టి రమణయ్య (40), దొద్దాలి దినె్ననాగయ్య (35), భీమాని శ్రీను (30) పొదిలి వైపు నుండి మోటార్‌సైకిల్‌పై సన్నమూరు వైపు వెళుతుండగా కొండపి వైపు నుండి పొదిలి వెళుతున్న ఆర్‌టిసి బస్సును ఢీకొనడంతో రమణయ్య, నాగయ్యలు మృతి చెందారు. శ్రీనుకి తీవ్రగాయాలు కావడంతో 108 ద్వారా పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై మర్రిపూడి ఎస్సై బాలరంగయ్యకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల బంధువుల వివరాలను, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పొదిలి ఆర్‌టిసి డిపో మేనేజర్ మధుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తహశీల్దార్ చంద్రావతి మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆపద్బంధు పథకం వచ్చేందుకు కృషి చేస్తానని బంధువులకు హామీ ఇచ్చారు.
భైరవకోనకు పోటెత్తిన భక్తజన సందోహం
సిఎస్‌పురం, నవంబర్ 28: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన భైరవకోన కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం భక్తులతో పోటెత్తింది. వేకువజామునుంచి గుంటూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాలలో భైరవకోనకు త