Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వైభవంగా పుణ్యనదీ హారతి

$
0
0

భద్రాచలం, నవంబర్ 28: పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రిలో బుధవారం రాత్రి పావన గోదావరి నదికి పుణ్యనదీ హారతిని వేలాది మంది భక్తుల నడుమ సంప్రదాయబద్దంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తొలుత భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిపై భాజాబజంత్రీలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాటాల నడుమ తోడ్కొని వెళ్లారు. నదీ తీరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని ఆశీనులను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక పౌర్ణమి రెండూ ఒకేరోజు రావడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు దేవస్థానం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇందుకు తగిన ఏర్పాట్లు చేసింది. తొలిసారి భద్రాచలంలో పుణ్యనదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. తీర ప్రాంతంతో పాటు ట్యాంక్ బండ్‌పై విద్యుద్దీపాలను ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా శోభను సంతరించుకుంది. మంగళవాయిద్యం, వేదపఠనం (అనుహవం), శ్రీ సూక్తములు, ఆస్థాన హరిదాసులచే శ్రీరామదాసు కీర్తనలు, కార్తీక పౌర్ణమి వైశిష్ట్యం, ప్రవచనాలు జరిగాయి. సువర్ణ పుష్పాలతో శ్రీరామ షడాక్షరిమంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. స్వామివారికి కుంభ, ద్వయ, అష్ట, ద్వాదశ, నక్షత్ర హారతులను ఇచ్చి ప్రసాద ఆరగింపు అనంతరం మంగళనీరాజనం పలికారు. గోదావరి నదికి పూజలు జరిపి పసుపు, కుంకుమ, వస్త్రాలు, గాజులు తదితర మంగళవస్తువులను సమర్పించారు. నదీమాతకు వరుసగా కుంభాది ఐదు హారతులిచ్చి 108 వత్తుల హారతి (మహా హారతి)ని ముందుగా స్వామివారికి ఇచ్చిన తర్వాత గోదావరి మాతకు నీరాజనం చేశారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉందని వేద పండితులు, అర్చకులు తెలిపారు. పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే శుభాలు కల్గుతాయని శాస్త్రంలో చెప్పారన్నారు. ఏక హారతి ఓంకారాన్ని తెలియజేస్తే ద్వయ హారతి జీవుడు, భగవంతుడి తత్వాలకు గుర్తని చెప్పారు. అష్టాక్షరీ మంత్రాన్ని అష్ట హారతి స్తుతిస్తుందని, అంతేగాక సంపదకు ఇది గుర్తుగా ఉంటుందన్నారు. వాసుదేవ ద్వాదశ మంత్రాన్ని ద్వాదశ హారతి స్తుతిస్తుందని, 12 నెలలకు ఇది గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే నక్షత్ర హారతి 27 నక్షత్రాలను చూపిస్తుందని, అష్టోత్తర శతహారతి నక్షత్రాల పాదాలతోసహా చూపిస్తూ మంత్రజపానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. పరిపూర్ణ మనసుకు కుంభ హారతి నిదర్శనమని తెలుపుతూ భక్తుల్లోని పాపాలన్నింటినీ కర్పూర హారతి కరిగించేలా చేస్తుందని వివరించారు. వేలాది మంది భక్తులు నదీ పూజలు జరిపి సామూహిక హారతినిచ్చేలా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆలయ వేదపండితులు, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, అర్చకులు, వైదిక కమిటీ, ఆస్థాన హరిదాసులు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, పీఓ జి వీరపాండియన్, సబ్ కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా, ఎఎస్పీ డా.గజరావ్ భూపాల్, దేవస్థానం పాలకమండలి మాజీ చైర్మన్ కెపి రంగారావు, ఇఓ కె రామచంద్రమోహన్, డిసిఎంఎస్ చైర్మన్ కురిచేటి రామచంద్రమూర్తి, తహశీల్దార్ జి నర్సింహారావు, సిఐలు రమేష్, మనోహర్, ఎస్‌ఐలు జితేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
15 కోట్లతో సంక్షేమ వసతిగృహాల
ఆధునికీకరణ
* జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, నవంబర్ 28: జిల్లా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 15కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికీకరణ, వౌలిక వసతుల కల్పన పనులను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. 9కోట్ల 60లక్షల వ్యయంతో ఖానాపురం హవేలిలోని టేకులపల్లిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నామన్నారు. పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. జనవరి నెలాఖరులోగా పనులు పూర్తయి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కోటి 5లక్షల వ్యయంతో ఖమ్మం నగరంలోని అంబేద్కర్ బాలికల జూనియర్ కళాశాలలో ఎంసెట్ కోచింగ్ సెంటర్ నిర్వహణ చేపట్టామన్నారు. సత్తుపల్లిలో కోటి 68లక్షలతో సమీకృత బాలికల వసతి గృహం, బేతుపల్లి, గంగారంలలో బాలుర వసతిగృహం 50లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులు, ప్రహారీగోడ, వైట్‌వాష్ తదితర వౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయన్నారు. ఈపనులు ఇప్పటి వరకు చాలా వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
మొద్దు నిద్రపోతున్న
గుడ్డి ప్రభుత్వం
* ఖమ్మం ఎంపి నామ విమర్శ
ఖమ్మం రూరల్, నవంబర్ 28: రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది గుడ్డి ప్రభుత్వమని, అది మొద్దు నిద్రపోతూ ప్రజలను మోసం చేస్తోందని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామ నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం మండలంలోని రామన్నపేట కాలనీలో టిడిపి మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం విస్మరించి ప్రజలపై మోయలేని భారాలను మోపుతోందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తొమ్మిదివేల కోట్లు మాత్రమే ఉన్న రాష్ట్ర ఆదాయం ప్రస్తుతం లక్ష 25వేల కోట్లకు పెరిగిందన్నారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఈ ఆదాయాన్ని తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేయకుండా దోపిడీ చేస్తుందని విమర్శించారు. ప్రజల సొమ్మును అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నామని రూపాయి చూపించి లక్షల కోట్ల రూపాయలను దోచుకుంటుందన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ కోత, సర్‌ఛార్జీల పెంపుదల, పంటలు నష్టపోయిన రైతాంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎంపి ఎండగట్టారు. ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉన్నన్నాళ్లూ మన బతుకులు ఇంకెనే్నళ్లయినా మారవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఊరికి నాలుగైదు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి చేతులు దులిపేసుకుందని, అధికారంలో లేనప్పటికీ 70వేల గ్యాస్ కనెక్షన్లు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. రామన్నపేటలో పేదలకు ఇళ్ళస్థలాలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనేనని, కాంగ్రెస్ పాలనలో ఇళ్లస్థలాలు ఇచ్చిన దాఖలాలు లేనేలేవని విమర్శించారు. గ్రామపంచాయితీ పరిధిలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందంటే ప్రభుత్వ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా కాలనీలో సంవత్సరం క్రితం సుమారు 150 వీధి దీపాలను సొంత డబ్బులతో ఏర్పాటు చేయించినట్టు తెలిపారు. అదేవిధంగా రెండు బోర్లు, రోడ్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. కాలనీలో వౌలిక వసతులు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తీరుతాయని హామీ ఇచ్చారు. మరికొద్ది రోజులలో కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అవసరమైతే పరిధిలో ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారమార్గం చూపుతునని, స్థాయికి మించినవైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 100 కుటుంబాలు నామ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలుత బైపాస్‌రోడ్ నుండి రామన్నపేట కాలనీ వరకు ద్విచక్రవాహనాలు, ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ పతాకాన్ని, ఎన్‌టిఆర్ నగర్ బోర్డును ఆవిష్కరించారు. సభ ప్రారంభంలో యర్రన్నాయుడు మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ రెండు నిమిషాలు వౌనం పాటించారు. కార్యక్రమంలో టిడిపి పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బేబి స్వర్ణకుమారి, మండల కార్యదర్శి రాంమూర్తి నాయక్, నాయకులు గుర్రం వెంకట్రామయ్య, వెంకటనర్సయ్య, హన్మంతరావు, వెంకటేశ్వర్లు, భిక్షం, గూడ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అట్టడుగువర్గాలకు ఆదర్శం పూలే, అంబేద్కర్
కూసుమంచి, నవంబర్ 28: అట్టడుగు వర్గాల ప్రజా అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన త్యాగమూర్తులు మహాత్మాజ్యోతిరావుపూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌లు అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు కొనియాడారు. ప్రముఖ సీనియర్ వైద్యులు ఎంఎఫ్ గోపినాథ్ వ్యవస్థాపక పూలే - అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్ ఆధ్వర్యంలో పూలే - అంబేద్కర్ జంట వర్ధంతి సభ బుధవారం మండలంలోని నాయకన్‌గూడెం గ్రామంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాధవరావుపూలే, అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ నాటి మహానీయులు అందించిన ఫలాలే నేడు అణగారిన ప్రజానీకం అందుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. వారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగ ఫలితమే అన్ని రంగాల్లో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బిసి కులకు అవకాశం లభిస్తుందన్నారు. డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ మాట్లాడుతూ అగ్రకుల విధానాలను అధిగమించి అణగారిన శ్రమికుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయులన్నారు. లోకమంతటికి వెలుగునిచ్చేది సూర్యుడైతే, దళిత బహుజనుల జీవితాలకు మాత్రం వెలుగునిచ్చింది పూలే - అంబేద్కర్‌లని ఆయన అభివర్ణించారు. అనంతరం కాకి మాధవరావు మోటార్ సైకిళ్ళ ర్యాలీని ప్రారంభించారు. గోపినాథ్ సారధ్యంలో జరుగుతున్న ఆత్మ గౌరవయాత్రకు పలు రాజకీయ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు బహుజన గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో చెవుల వెంకన్న యాదవ్, డాక్టర్ రాధా రుక్మిణి, బాబురావు, దేవసహాయం, భిక్షపతి, కిషన్ నాయక్, సంచార జాతుల సంక్షేమసంఘం రాష్ట్ర కార్యదర్శి పెండ్ర అంజయ్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి మన్మథరావు, వీరయ్య, రాము, వెంకన్న, ధార కిషన్ పాల్గొన్నారు.
సిఎం స్వయంగా వచ్చి చూసినా సమస్యలు తీర్చలేదు
దమ్మపేట, నవంబర్ 28: నీలం తుపానుకు పంటలు నష్టపోయిన ప్రాంతాలను స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించినా నేటికీ బాధిత రైతుల సమస్యలు తీర్చలేదని ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మండల పరిధిలోని గండుగులపల్లిలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం తుపానుకు రైతులు పంటలన్నీ నష్టపోతే నేటికీ పరిహారం అందించలేదని విమర్శించారు. రంగుమారిన ధాన్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారంలో నిజమైన లబ్దిదారులకే పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరారు. నూతనంగా నిర్మించే పామాయిల్ ఫ్యాక్టరీని దమ్మపేటలో ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ నిర్మించడం వల్ల ములకలపల్లి, సత్తుపల్లి ప్రాంతాలకు దగ్గరగా ఉండటమే కాక అశ్వారావుపేటకు తరలించేందుకు ఏటా రూ.కోటి వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. హైవే పక్కన నిర్మించాలని ఆయిల్‌ఫెడ్ అధికారులు అనడం విడ్డూరంగా ఉందని, అదేం షోరూం కాదని, రైతుల కోసం ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ అని వ్యంగ్యంగా అన్నారు. అశ్వారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచితే ఆ మండలంలో భవిష్యత్ అవసరాలకు సరిపోతుందన్నారు. వివిధ అంశాలపై మాట్లాడిన తుమ్మల తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ సమావేశంలో జిల్లా దేశం కార్యదర్శి దొడ్డాకుల రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు మెచ్చా నాగేశ్వరరావు, సహకార సంఘం అధ్యక్షులు పైడి వెంకటేశ్వరరావు, దేశం నేత దొడ్డా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కోయగూడెం ఓసికి జాతీయ రక్షణ అవార్డు
* ఇల్లెందు ఏరియా జిఎం డబ్ల్యూ విజయబాబు వెల్లడి
టేకులపల్లి, నవంబర్ 28: కోయగూడెం ఓపెన్‌కాస్ట్ గనికి 2009-10 సంవత్సరానికి ద్వితీయ జాతీయ రక్షణ అవార్డు లభించినట్లు ఇల్లెందు ఏరియా జిఎం డబ్ల్యూ విజయబాబు తెలిపారు. బుధవారం కెఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రక్షణ అవార్డును రాష్టప్రతి చేతుల మీదుగా కోయగూడెం ప్రాజెక్టు ఆఫీసర్ మనుబోతుల సురేష్ ఈనెల 21న అందుకున్నారన్నారు. ఈసందర్భంగా కోయగూడెం ఓసి అధికారులను, కార్మికులను ఆయన అభినందించారు. సమష్టి కృషితో ఈఅవార్డు దక్కిందన్నారు. కెఓసి పరిసర ప్రాంతాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 2006లో కూడా ఈఓపెన్‌కాస్ట్‌కు ద్వితీయ జాతీయ రక్షణ అవార్డు వచ్చినట్లు తెలిపారు. సింగరేణి సంస్థలో కెఓసికి మంచి గుర్తింపు ఉందని, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, క్రషర్ అవసరం లేకుండా బొగ్గు ఉత్పత్తి జరగడం వల్ల బొగ్గు నాణ్యత ఉంటుందని తద్వారా ఈఓసి బొగ్గుకు మంచి డిమాండ్ ఉందన్నారు. కెఓసి నుండి టేకులపల్లి వరకు రూ 1.8కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో ఎజిఎం వెంకటేష్, డిజిఎం సాయిరాం, పిఓ సురేష్, ఎస్‌ఓటు జిఎం రవిశంకర్ పాల్గొన్నారు.
ఎలుగుబంటి దాడిలో ఇద్దరికి గాయాలు
ములకలపల్లి, నవంబర్ 28: మండల పరిధిలోని పాతగుండాలపాడుకు చెందిన పొట్టా వీరభద్రం, సున్నం వీరభద్రం బుధవారం తెల్లవారుఝామున పొలం పనులకు వెళ్ళగా వీరిపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. చెట్ల పొదలలో ఉన్న ఎలుగుబంటిని ఇద్దరు చూసుకోకపోవడంతో వారి వెనుక నుండి వచ్చి ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో పొట్ట వీరభద్రంకు తలకు, కాళ్లకు తీవ్రమైన గాయాలు కాగా సున్నం వీరభద్రంకు కళ్లు, శరీర ఎదురుభాగాలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానికులు 108వాహనానికి ఫోన్ చేసి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పువ్వు కోసం చెరువులోకి దిగి
ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు
చర్ల, నవంబర్ 28: మండలంలోని పాతచర్ల చెరువులో ఓ తామరపువ్వు కోసం చెరువులోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం...మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కారం రమేష్ (32) ఓ కిరణా దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వడ్లు పట్టుబడి జరుగుతుండగా సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. దీంతో ఓ తామర పువ్వు అతడి కంటపడింది. దానిపై ఆశపడ్డ రమేష్ కోసేందుకు యత్నిస్తుండగా అతడితో పాటు వచ్చిన కొందరు వ్యక్తులు వద్దురా..కోయవద్దని అనడంతో ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ బుధవారం ఉదయం అదే పువ్వుకోసం వచ్చిన రమేష్ చెరువులోకి దిగి పువ్వు కోసి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు.
ఈ దృశ్యాన్ని చూసిన కొందరు అతడిని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, బాబు ఉన్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రిలో బుధవారం రాత్రి పావన గోదావరి నదికి పుణ్యనదీ హారతిని వేలాది మంది
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>