Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రయాణికుల భద్రతే లక్ష్యం

$
0
0

డోన్, నవంబర్ 28: ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తామని రైల్వే జనరల్ మేనేజర్ జిఎన్ ఆస్తానా వెల్లడించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రన్నింగ్ రూమ్, ప్లాట్ ఫారం, రైల్వే ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంతో పరిశుభ్రంగా రన్నింగ్ రూంను ఉంచినందుకు 25 వేల రూపాయలు, ఆసుపత్రికి 15 వేల రూపాయల రివార్డు పంపిణీ చేశారు. అదేవిధంగా రైళ్లలో ప్రయాణించే సమయంలో ఏవైన ప్రేలుడు పదార్థాలు వుంటే ఏవిధంగా వాటిని నిర్వీర్యం చేసి ప్రమాద సమయాల్లో ప్రయాణికులను రక్షించడంలో భద్రతావిభాగం చేయాల్సిన పద్ధతులను కళ్లకు కట్టినట్లు రైల్వే పోలీసులు ప్రదర్శించారు. ప్రదర్శనను మెచ్చిన జియం ఆస్తానా పదివేల రూపాయల రివార్డును అందించారు. ఈ సందర్బంగా జిఎం ఆస్తానా మాట్లాడుతూ రైల్వే తనిఖీల్లో భాగంగానే డోన్‌కు వచ్చినట్లు వివరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి డోన్ వరకు తనిఖీ చేసినట్లు తెలిపారు. డోన్ మీదుగా వెళ్లే సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు డోన్‌లో టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరగా పరిశీలిస్తామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందివ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిఎం ఆస్తానాతో పాటు డిఆర్‌ఎం సింగ్, స్టేషన్ సూపరింటెండెంట్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే జిఎంకు వినతుల వెల్లువ
డోన్, నవంబర్ 28: మండలంలోని చిన్నమల్కాపురం గ్రామంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలేక పోవడం వల్ల వలసల, మల్కాపురం గ్రామస్థులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఐ నాయకులు రంగనాయుడు, మాజీ జడ్పీటిసి మెంబర్ వలసల రామక్రిష్ణతోపాటు కాంగ్రెస్ నాయకులు జిఎం ఆస్తానాను కోరారు. డోన్ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసేందుకు వచ్చిన రైల్వే జిఎం కు వినతులను సమర్పించారు. అదేవిధంగా డోన్‌లో అదనపు కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని, రైల్వేలో ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని, బి రామదుర్గం వద్ద లెవెల్ క్రాసింగ్ గేట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ముంబాయి, మచిలీ పట్నం రైళ్లను డోన్ మీదుగా మళ్లించాలని కోరారు. దీనికి స్పందించిన జి ఎం ఆస్తానా మాట్లాడుతూ స్థానిక ఎంపి నిధులను కేటాయిస్తే వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతామన్నారు. మిగతా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.
విజృంభిస్తున్న డెంగీ జ్వరాలు
కర్నూలు, నవంబర్ 28: జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ అనుమానిత లక్షణాలతో పెద్దసంఖ్యలో రోగులు చికిత్సకోసం చేరుతున్నారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతవాసులు ఈ డెంగీ జ్వరాలతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. దీనికితోడు రికెట్సియా జ్వరాలు కూడా అనేక ప్రాంతాల్లో బయపడుతున్నాయి. డెంగీని నోటిఫైడ్ డిసీజ్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది యుద్దప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాల్సి వుంది. రోగి ఇంటి చుట్టుపక్కల 200 ఇళ్ళ నుండి రక్తనమూనాలు సేకరించాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తుజాగ్రత్తగా ప్రైవేటు వైద్యశాలపై ఒత్తిడి తెస్తూ డెంగీ జ్వరాలుగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు డెంగీ సోకినట్లు ఎలీసా రీడర్ పరీక్ష ద్వారా ప్రైవేటు డయాగ్నిస్టిక్ సెంటర్లు నిర్దారిస్తాయి. అయినప్పటికి ఆయా వైద్యశాలల నిర్వహకులు మాత్రం కేస్ షీట్లపై డెంగీకి బదులుగా వైరల్ హెమరేజిక్ ఫీవర్ అని ఎక్యూట్‌ఫైబెల్ ఇల్‌నెస్ విత్‌ధ్రాంటో సైటోఫినియాగా నమోదు చేస్తున్నారు. అయితే రోగుల కుటుంబీకులకు మాత్రం డెంగీ జ్వరంగానే చెపుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ఐసియూ వార్డుల్లో డెంగీ రోగులు చికిత్స పొందుతుండగా వీరికి ప్లేట్‌లెట్లు ఎక్కించేందుకు దాతలను అదే ఆసుపత్రుల్లోని రూంలో కూర్చోబెడుతున్నారు. జిల్లాలోని కొన్ని డయాగ్నిస్టిక్ సెంటర్లు ఎలీసా రీడర్ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అయితే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ప్రైవేటు ల్యాబ్‌ల నివేదికలను పరిగణలోకి తీసుకోవద్దని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. డెంగీ నిర్దారణచేసే ఎలీసా పరీక్షలకు దాదాపు రూ.2వేలు వసూలు చేస్తున్నారు. ఇంత ఖర్చుపెట్టి చేయిస్తున్న పరీక్షకు విలువలేకపోతే అ పరీక్ష చేయించడం ఎందుకనే ప్రశ్న వస్తోంది. కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో డెంగీ నిర్దారణకు నోడల్ కేంద్రంగా వైద్యశాఖ అధికారి ప్రకటించారు. ఇక్కడ రక్తనమూనాలు సేకరించేందుకు తిరస్కరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 70 రక్తనమూనాలు వస్తేనే అన్నిటికి కలిపి ఎలీసా పరీక్షలు చేస్తారని వైద్యులు చెపుతున్నారు. దీంతో వారాల తరబడి పలితాల కోసం రోగులు ఎదురుచూడాల్సి వస్తోంది. నివేదికలు వచ్చేలోపు రోగులు వ్యాధి నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యి ఇంటికి కూడా వెళ్లిపోతున్నారు. మైక్రోబయాలజీ విభాగంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల నుండి ఎక్కువ సంఖ్యలో రక్తనమూనాలు అందుతున్నాయి. వైరస్ జ్వరాల నిర్దారణపై తగుచర్యలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎక్కువైన సుగర్, రక్తపోటు వ్యాధులు నివారణకు కూడ వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టాల్సి వుంది.

శివబాష్యం గౌడు ప్రాజెక్టు రైతులకు అంకితం
ఆత్మకూరు, రూరల్, నంబర్ 28: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 సంవత్సరాల పాటు నిర్మాణ దశను పూర్తిచేసుకున్న మూఢ నమ్మకాల వల్ల ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసిన ముగ్గురు ముఖ్యమంత్రులు పదవులు కోల్పోవడం ప్రాణాలు కోల్పోవడం జరిగిందనే ప్రచారం జరిగింది. 12 సంవత్సరాల క్రితం పూర్తిచేసిన ఈ శివ బాష్యం గౌడు ప్రాజెక్టు ఎట్టకేలకు బుధవారం కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో ఇంకా పనులు చేయాల్సి వుందని అధికారికంగా ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సైడు కాలువలు నిర్మించాల్సి వుందని, ఈ ప్రాజెక్టులో 0.389 టిఎంసిలు నీటి సామర్థ్యం కల్గివుంటుందని, ఈ ప్రాజెక్టు పరిధిలో 13 చెరువులు ఉన్నాయి. సుమారు 13 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. ఈ ప్రాజెక్టు పనులకు త్వరలో నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు అభివృద్ధికి తోడ్పడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, ఇఇ శంకర్‌రెడ్డి, డిప్యూటి ఇఇ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా కార్తీక దీపాలు

ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, నవంబర్ 28: నవ నందులకు నిలయమైన కర్నూలు జిల్లాలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని, కృష్ణ, తుంగభద్ర పుణ్య నదీ హారతి కార్యక్రమాన్ని గురువారం ఘనం జరుపుకున్నారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివుడిని సేవించుకుంటే మంచి జరుగుతుందన్న విశ్వాసంతో భక్తులు భారీ ఎత్తున నదులు, కాలువల్లో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాల్లో స్వామి వారిని దర్శించుకున్నారు. జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటివంటి శైవ క్షేత్రాల్లోనే కాకుండా మంత్రాలయం వంటి ఇతర ఆలయాల్లో కూడా భక్తులు పెద్దఎత్తున బారులు తీరి భగవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలంలో సుమారు 1.50 లక్షల మంది భక్తులు విచ్చేసి పాతాళ గంగ వద్ద కృష్ణా నదిలో తెల్లవారుజామున పుణ్య స్నానాలు ఆచరించి కృష్ణ వేణమ్మకు హారతులు, నైవేద్యాలు సమర్పించుకున్నారు. ఆలయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం తీసుకుంది. పెద్దఎత్తున భక్తులు తరలి రావడంతో శ్రీశైలంలో భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఇక సాయంత్రం కృష్ణా పుణ్య నదీ హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు పాతాళ గంగ వద్ద కృష్ణమ్మ నదీమ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహించిన అనంతరం నదిలో ఏకదశ హారతులనిచ్చారు. మహానంది క్షేత్రంలో సుమారు 40వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానమాచరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహానంది చుట్టూ ఉన్న నవనందుల దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బనగానపల్లె వద్ద ఉన్న యాగంటి క్షేత్రంలో కూడా భక్తులు ఉమా మహేశ్వర, యాగంటీశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ పుణ్య క్షేత్రాలే కాకుండా నల్లమల అడవిలో ఉన్న అనేక పురాతన ఆలయాలైన నాగలూటి, రుద్రకోడు, గుమ్మితం, గుండ్ల బ్రహ్మేశ్వరం వంటి ఆలయాలకు కూడా భక్తులు పెద్దఎత్తున తరలి వెళ్లారు. కాగా పుణ్యనదీ హారతి కార్యక్రమంలో భాగంగా తుంగభద్ర పుణ్య నదీ హారతి కార్యక్రమం ప్రముఖ పుణ్య క్షేత్రమైన మంత్రాలయం వద్ద ఉన్న తుంగభద్ర నది వద్ద నిర్వహించారు. మఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తుంగభద్ర నదికి హారతులనిచ్చారు. కాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా అనేక ఆలయాల్లో లక్ష దీపోత్సవాన్ని దేదీప్య మానంగా నిర్వహించారు. తెల్లవారుజామున హారతిని సమర్పించుకున్న భక్తులు సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.
హిందూ ధర్మాన్ని కాపాడడమే టిటిడి లక్ష్యం
ఆళ్లగడ్డ, నవంబర్ 28: హిందూధర్మాన్ని కాపాడడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు కంకణం కట్టుకుందని టిటిడి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరాజు అన్నారు. మన గుడి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన కుటుంబసమేతంగా అహోబిలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మేనేజర్ బివి నరసయ్య, ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ మేనేజర్, ప్రధానార్చకులు ఆయనను కుటుంబసమేతంగా ఆశీర్వదించి నవనారసింహస్వాముల మెమొంటోను ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనగుడి కార్యక్రమంలో భాగంగా శ్రీవారి పట్టువస్త్రాలను మహానందీశ్వరునికి సమర్పించడం జరిగిందన్నారు. మన సంస్క్రృతిని భవిష్యత్ తరాలకు అందించడమే ధ్యేయంగా టిటిడి ముందుకు సాగుతుందన్నారు. అర్చకులు ధర్మకర్తలు, గ్రామపెద్దలు కలిసి మనగుడి కార్యకమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నంద్యాల డీఎస్పీ అమరనాథనాయుడు, రూరల్ ఎస్‌ఐ ఈశ్వరయ్య తదితరులు వున్నారు. పట్టణంలోని శ్రీ అమృతలింగేవ్వరస్వామి ఆలయంలో జరిగిన మనగుడి కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బివి ఈఓ నరసయ్య ఆధ్వర్యంలో జరిగింది. బివి రామిరెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైలంలో
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీశైల దేవస్థానం వారు మనగుడి శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదయశాఖ టిటిడి దేవస్థానం వారిచే సాంప్రదాయబద్ధంగా ఆయా ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటలకు శోభయాత్రను నిర్వహించారు. టిటిడి వారిచే అంక్షింతలను, కంకణాలకు సాంప్రదాయబద్దంగా పల్లకిలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి ఉదయం 6 గంటల నుండి పురవీధుల గుండా శోభయాత్రను నిర్వహించారు. పుణ్యక్షేత్రాల సాంప్రదాయాలపై భక్తులకు అవగాన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇవో సాగర్‌బాబు తెలియజేశారు. ఈ మన గుడి శోభయాత్ర ఆలయం నుండి నంది మండపం, వీరభద్ర స్వామి ఆలయం వరకు పల్లకిలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారి రాజశేఖర్, పిఆర్‌వో అనీల్ కుమార్, సిఎస్‌వో కర్ణానిధి, అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా కార్తీక పౌర్ణమి
మహానంది, నవంబర్ 28: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపాలతో వెలుగొందింది. బుధవారం సాయంత్రం మహానంది ఆలయ ముందు బాగంలో కోనేర్ల వద్ద జ్వాలా తోరణాన్ని ఆలయ ఇఓ దివాకర్‌బాబు వెలిగించి ప్రారంభించారు. అనంతరం వేలాధి మంది భక్తుల మధ్య కార్తీక దీపాలను మహిళలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాధి మంది భక్తులు మహానంది క్షేత్రానికి తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. దేవాలయ అధికారులు భక్తుల రద్దీతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి శ్రీకామేశ్వరీదేవి సమేత శ్రీమహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకునేలా ఏర్పాటు చేశారు.
మహానందీశ్వరుడికి టిటిడి పట్టువస్త్రాలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో వెలసిన శ్రీకామేశ్వరీదేవి సమేత, మహానందీశ్వరస్వామివార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టువస్త్రాలను సమర్పించారు. బుధవారం తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు దంపతులు తీసుకువచ్చిన పట్టు వస్త్రాలకు ఆలయ ముఖ మండపం వద్ద వేదపండితులు, ఇఓ దివాకర్‌బాబులు స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో ఎఇఓ శివయ్య, అధికారులు రాజమ్మ, ఈశ్వర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.
కోనేటిలో పుష్కరిణి హారతులు
మహానంది క్షేత్రంలోని రుద్రగుండం పుష్కరిణిలో మనగుడి సందర్భంగా బుధవారం పుష్కరిణి హారతులు వేదపండితులు వేదమంత్రాలతో నిర్వహించారు. దేవాదాయశాఖ, హిందూ ధర్మప్రచార సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తిరుపతి జెఇఓ శ్రీనివాసరాజు, ఇఓ దివాకర్‌బాబులు పాల్గొన్నారు.
యాగంటి క్షేత్రంలో
బనగానపల్లె: యాగంటి క్షేత్రంలో బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్షదీపార్చన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుండి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్ర నామావళి పూజలు జరిపారు. సాయంకాలం లక్షదీపార్చన కార్యక్రమం నిర్వహించారు.
మఠంలో లక్ష దీపోత్సవం
మంత్రాలయం: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాఘవేంద్రస్వామి మఠంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మఠం యజమాన్యం నిర్వహించింది. పీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం భక్తులు మఠం ఆలయ ప్రాంగణమంతా కార్తీక దీపాలు వెలిగించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా కార్తీక జ్యోతులతో నిండిపోయింది.

భార్యను హత్యచేసిన భర్త
దేవనకొండ, నవంబర్ 28 : మండల పరిధిలోని తెర్నేకల్ గ్రామానికి చెందిన లక్ష్మి(35)ని, భర్త సత్తెన్న బుధవారం రాత్రి బ్లేడుతో గొంతుకోసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెర్నేకల్ గ్రామానికి చెందిన లక్ష్మీకి, సత్తెన్నకు 18 సంవత్సరాల క్రితం వివాహం అయింది. అయితే సత్తెన్న మద్యానికి బానిసై కొంతకాలంగా భార్యను వేధిస్తుండేవాడని తెలిపారు. అంతేగాకుండా మతిస్థిమితం సరిగా లేకుండా తిరుగుతుండేవాడన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వేరుశెనగ పాసే గుంటక బ్లేడుతో లక్ష్మి గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పత్తికొండ సిఐ శ్రీ్ధర్, దేవనకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతానికి కౌలురైతు మృతి
ఉయ్యాలవాడ, నవంబర్ 28: మండలంలోని కొండుపల్లె గ్రామానికి చెందిన మాఘం మోహనరావు(50) విద్యుత్ షాక్‌తో బుధవారం ఉదయం మృతి చెందాడు. మోహనరావు రెండు సంవత్సరాల నుండి సర్వాయిపల్లె లింగందినె్న గ్రామాల మద్యలో లక్ష్మిరెడ్డి బావివద్ద 10 ఎకరాలు భూమి కౌలుకు తీసుకుని 6 ఎకరాల్లో సీడుపత్తి, 4 ఎకరాల్లో మినుము పెసర పంటలను సాగు చేసుకుంటుంన్నారు. బుధవారం ఉదయం మినుము పంటకు బోరు ద్వారా సాగు నీరందించేందుకు పైపులను తరలించుకున్నారు. బోరుకు విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో పక్కనే వున్న విద్యుత్ మీటర్‌ను పరిశీలించేందుకు వెళ్లగా ప్రవ

ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తామని రైల్వే జనరల్ మేనేజర్ జిఎన్ ఆస్తానా వెల్లడించారు.
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>