గుంటూరు, నవంబర్ 28: జిల్లాలోని మున్సిపాలిటీలలో మురికివాడల్లో నివశిస్తున్న ప్రతి పేద కుటుంబానికి స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం కల్పించాలని, ఇందుకు అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లాశాఖ, రాష్టప్రురపాలన, పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యవేక్షణా కమిటీ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ప్రతి పేదమహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలై ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా మున్సిపాలిటీ అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. పనితీరులో ప్రతి సంఘం ఏ గ్రేడ్‌కు చేరుకోవాలన్నారు. పింఛన్లు పొందుతున్న వికలాంగుల వివరాలను అందజేస్తే అర్హత కల్గిన వారికి అంత్యోదయ అన్నయోజన కార్డులను జారీచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి స్వయం సహాయక సంఘం కార్పస్ ఫండ్‌ను 50 వేల రూపాయలకు పెంచేలా కృషి చేయాలన్నారు. బ్యాంకు లింకేజీ కింద డిసెంబర్ నెలాఖరుకు నూరుశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాకు 14 మహిళా స్వశక్తి భవనాలు మంజూరయ్యాయని, ఒక్కో నిర్మాణానికి 25 లక్షల రూపాయల చొప్పున మూడున్నర కోట్ల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. వీటి విషయంలో స్థల సమస్య ఉంటే సంబంధిత తహశీల్దార్లతో సమావేశం కావాలని సూచించారు. అనంతరం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకుల నుండి రుణాలు పొంది తిరిగి సక్రమంగా చెల్లించని సంఘాల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మెప్మా పిడి కృష్ణకపర్థి, పురపాలక ఆర్‌జెడి శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్, బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
అవమానాలు భరించలేకే పార్టీని వీడా
* బాపట్ల సభలో ఉమ్మారెడ్డి
బాపట్ల, నవంబర్ 28: గడచిన 27 సంవత్సరాలుగా పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యభూమిక వహించిన తన పట్ల పార్టీ అవమానించేవిధంగా ప్రవర్తించడం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఇదే వైఖరి వ్యవహరించడాన్ని భరించలేక పార్టీని వీడుతున్నట్లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. స్థానిక ఎబిఎం ఉన్నత పాఠశాల ఆవరణలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్‌ఆర్ సిపిలో చేరిక సందర్భంగా బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. క్రమశిక్షణతో పనిచేయడం ఒక్కటే తనకు తెలుసునని, అదే క్రమశిక్షణనను నేడు జగన్ నాయకత్వంలోని వైఎస్‌ఆర్ సిపి పట్ల చూపుతానన్నారు. ఉమ్మారెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పలుమార్లు విఫలమైన చంద్రబాబుతో కలసి పనిచేయలేనని, విశ్వసనీయతకు మారుపేరైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో గర్వంగా కలసి పనిచేస్తానన్నారు. టిడిపిలో క్రమశిక్షణతో కొనసాగిన నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాకతో వైఎస్‌ఆర్ సిపి మరింత బలోపేతమైందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రం, కేంద్రంలో రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, వైఎస్ కుటుంబంపై కొనసాగుతున్న వివక్ష హేయమని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్‌ను జైలుపాలు చేసినా ప్రజలు మాత్రం ఆయనను గుండెల్లో దాచుకున్నారన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి మేధావి, అనుభవజ్ఞుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మద్దతునిస్తూ, ఒక సైనికునివలే పనిచేస్తానని ముందుకురావడం ఎంతో ముదావహమన్నారు. ఈకార్యక్రమానికి జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించగా, పార్టీ ముఖ్యనేతలు జంగా కృష్ణమూర్తి, మేరుగ నాగార్జున, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, కావటి మనోహర్‌నాయుడు, లేళ్ల అప్పిరెడ్డి, కోన రఘుపతి, మోదుగుల బసవపున్నారెడ్డి, కళ్ళం హరినాథరెడ్డి, సజ్జా హేమలత, లక్ష్మిరాజ్యం, బిఎస్‌ఆర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మారెడ్డికి సంఘీభావంగా కొండారెడ్డి అనిల్‌కుమార్, సాధువెంకటరమణ, పసుమర్తి రాజమణి, కాండ్రు నాగేశ్వరరావు తదితరులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.
కార్తీక పుణ్యస్నానాలకు
భక్తులతో పోటెత్తిన సూర్యలంక తీరం
ప 2.5లక్షల మంది కార్తీక స్నానాలు
బాపట్ల, నవంబర్ 28: పరమ పవిత్రమైన కార్తీకమాసంలో అందునా పౌర్ణమి ఘడియలలో సాగరస్నానం పరమ పుణ్యదాయకం, ముక్తి ప్రదాయకమని భక్తుల అచంచల విశ్వాసం. ఈవిశ్వాసంతోనే బాపట్ల మండలంలోని సూర్యలంక తీరానికి లక్షలాదిమంది భక్తులు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం మండలంలోని సూర్యలంక తీరం పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. పెద్దసంఖ్యలో మహిళలు తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి, పసుపుతో అమ్మవారి రూపును తయారుచేసుకొని పుసుపు,కుంకుమలతో ఆరాధించి, దీపారాధనలు చేశారు. మంగళగౌరి ఆశీస్సుల కోసం తీరంలో కార్తీక సమారాధనలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో బాపట్ల పట్టణమంతా కోలాహలంగా మారింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ పర్యాటకుల రాకపోకలతో కిక్కిరిసిపోగా, జిబిసి రోడ్డు, సూర్యలంక రోడ్డు రద్దీగా మారిపోయాయి. ఆర్టీసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 బస్సులతోపాటు, వందలాది ఆటోలు, ప్రైవేట్ వాహనాలలో భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. తెల్లవారుఝాము నుండి మొదలైన భక్తుల రాకపోకలు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు రెండున్నర లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించి ఉంటారని ఒక అంచనా. డిఎస్‌పి భాస్కర్ ఆధ్వర్యంలో సిఐ సురేష్, ఎస్సైల పర్యవేక్షణలో 200మంది పోలీసుబలగాలు తీరం పొడవునా గస్తీ నిర్వహించాయి. అప్పికట్ల ప్రాథమిక వైద్యకేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేయగా, 108ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటుచేశారు. మెరైన్ సిఐ పరంధామయ్య నేతృత్వంలో తీరప్రాంత గస్తీ సిబ్బంది, గజఈతగాళ్లతో తీరంలో ప్రత్యేక నియంత్రణ వలయాన్ని నిర్వహించి, పర్యాటకులు లోతుకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. అడవి పంచాయతీ ఆధ్వర్యంలో సువిశాలమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేసి వాహనాలను తీరం వరకు వెళ్లకుండా నిలిపే అవకాశాన్ని కల్పించారు. రెడ్‌క్రాస్, రోటరీక్లబ్ ఇంకా పలు స్వచ్ఛంద సంస్థల సిబ్బంది తీరంలో సేవాకార్యక్రమాలను నిర్వహించారు. తీరానికి వచ్చిన భక్తులంతా తీరంలోని అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పదవులనుభవించి పార్టీని విమర్శించడం సబబుకాదు
* ఉమ్మారెడ్డికి మాజీ మంత్రి శనక్కాయల అరుణ హితవు
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 28: తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యతనిచ్చిందని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీలో పదవులను అనుభవించి నేడు అదే పార్టీపై విమర్శలు చేయడం సబబు కాదని మాజీ మంత్రి శనక్కాయల అరుణ పేర్కొన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో శనక్కాయల అరుణ మాట్లాడుతూ ఉపాధ్యాయ పదవిలో ఉన్న ఉమ్మారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగాను, ఎంపిగాను, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కేంద్రంమంత్రిగా అనేక పదవులకు అవకాశాలు కల్పించి, ఉన్నతస్థాయికి చేర్చిన విషయాన్ని మరిచి రాజకీయ లబ్ధికోసం ఊసరవెల్లిలా రంగులు మారిస్తే ప్రజలు సహించరన్నారు. పార్టీని వీడినంతమాత్రాన తమకు ఎలాంటి నష్టంలేదని, అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజామాస్టారు మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని పాటించింది ఒక్క తెలుగుటిడిపియేనన్నారు. ఈ సమావేశంలో అడపా శివప్రసాదరావు, పోతురాజు ఉమాదేవి, రామిదేవి హనుమాయమ్మ, చంద్రగిరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
కనులపండువగా కార్తీక దీపోత్సవం
నరసరావుపేట, నవంబర్ 28: కార్తీ క పౌర్ణమి సందర్భంగా పట్టణ, పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు ఝామున 3గంటల నుండే భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. మహిళలు, అయ్యప్పలు దేవాలయ ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున దీపారాధన చేశారు. పాతూరులోని శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఉచిత క్యూలు, టికెట్ క్యూలను అధికారులు ఏర్పాటుచేశారు. శివాలయం పక్కనే ఉన్న కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్తెనపల్లి రోడ్డులోని అయ్యప్పస్వామి దేవాలయం, షిర్డీ సాయిబాబా దేవాల యం, ఆవుల సత్రం, సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో భక్తులు బా రులు తీరారు. లింగంగుంట్ల ఎన్‌ఎస్‌పి కాలనీలోని శివాలయంలో భక్తులు పో టెత్తారు. అన్ని దేవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. సాయంత్రం లక్షదీపారాధన, జ్వాలాతోరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పొన్నూరులో ఉమ్మారెడ్డికి ఘనస్వాగతం
పొన్నూరు, నవంబర్ 28: తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి స్వస్థలమైన బాపట్లకు తరలివెళ్తున్న కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పొన్నూరులో వైఎస్‌ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు బుధవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. వందలాది కారులు, మోటారు సైకిళ్ల ర్యాలీ ప్రదర్శనగా పట్టణ శివారులోని కట్టెంపూడి అడ్డరోడ్డు వద్దకు చేరుకున్న పార్టీ నేతలు ఉమ్మారెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సిపి నేతలు ఎస్‌కె యాసిన్, మారుపూడి లీలాధరరావు, దాసరి నారాయణరావు, డాక్టర్ ఎన్ రూత్‌రాణి, డాక్టర్ సజ్జా హేమలత తదితర నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా తరలివచ్చిన ఉమ్మారెడ్డి పట్టణ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎస్‌కె యాసిన్ నివాసంలోనూ, లీలాధరరావు వాటర్‌ప్లాంట్‌లో కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన తనకు కొన్ని సందర్భాల్లో అన్యాయం, అవనామాలు జరిగాయన్నారు. తన సామాజిక వర్గానికి పార్టీలో జరుగుతున్న అన్యాయం విషయం, పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించకపోవడంతో గత ఆరు నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్న తాను యువనేత జగన్ సారధ్యంలోని వైఎస్‌ఆర్ సిపిలో చేరడం జరిగిందన్నారు. పేదలతో పాటు అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఉమ్మారెడ్డి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సిపి నేతలు జూపూడి ప్రభాకరరావు, కిలారి రోశయ్య, ఎల్ అప్పిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటరమణ, మైనేని రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిలో మనగుడి ప్రచార యాత్ర
తాడేపల్లి, నవంబర్ 28: తాడేపల్లి పట్టణంలో బుధవారం మనగుడి ప్రచారయాత్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం స్థానిక వెంకటేశ్వరస్వామి వారి ఆలయం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పురవీధుల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. వీటితో పాటు విష్ణుసహస్రనామ పారాయణం, దైవారాధనలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భవానీలు, భక్తబృందం తదితరులు పాల్గొన్నారు.
496 ఆలయాల్లో మంగళప్రదంగా మనగుడి మహోత్సవం
గుంటూరు (కల్చరల్), నవంబర్ 28: పుణ్యప్రదమైన కార్తీక పౌర్ణమి బుధవారం నాడు జిల్లా వ్యాప్తంగా 496 ఆలయాల్లో మనగుడి మహోత్సవం మంగళప్రదంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మప్రచార పరిషత్, రాష్ట్ర దేవాదాయధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు కార్తీక పౌర్ణమి శుభవేళ టిటిడి సంకల్పించిన రెండవ విడత మనగుడి మహోత్సవాన్ని కార్తీక దీపకాంతుల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన 300 ఎంపిక చేసిన ఆలయాలు, పలు సంస్థల ఆధ్వర్యంలోని 196 దేవస్థానాల్లో మనగుడి మహోత్సవాన్ని దేదీప్యమానంగా జరిపించారు. ఈ సందర్భంగా మారుతీనగర్‌లోని మారుతీక్షేత్రంలో జరిగిన ప్రత్యేక ఉత్సవంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మనగుడి కార్తీక పౌర్ణమి పర్వదినాన నిర్వహించడం ఎంతో శుభకరమన్నారు. ఆధ్యాత్మిక చైతన్య వికాసబడిగా మనగుడిని జెసి యువరాజ్ అభివర్ణించారు. ఉత్సవంలో భాగంగా టిటిడి నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పూజా సామగ్రి, పుస్తక ప్రసాదం, కంకణాలు, అక్షతలు, పసుపు కుంకుమ, శ్రీవారి ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. స్వాగతోపన్యాసం చేసిన టిటిడి ఉప కార్యనిర్వహణాధికారిణి కె బేబి సరోజిని, మొదటి విడత కన్నా రెండవ విడత మనగుడి మహోత్సవానికి జిల్లాలో విశేష స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మారుతీక్షేత్ర పాలకవర్గ సభ్యులు, అర్చకస్వాములు, పెద్దసంఖ్యలో టిటిడి సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని పలు డివిజన్లలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైయున్న దేవస్థానాలు, ఇతర ముఖ్య ఆరాధనా మందిరాల్లో మనగుడి మహోత్సవాన్ని కార్తీకపౌర్ణమి దీప కాంతుల వెలుగుల మధ్య ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకగా నిర్వహించారు. భక్తులు చేసిన గోవిందనామ స్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి.
వైభవంగా మనగుడి, కార్తీక పౌర్ణమి
మంగళగిరి, నవంబర్ 28: టిటిడి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యాన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం మంగళగిరిలోని వివిధ దేవాలయాల్లో మనగుడి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన మనగుడి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాండ్రు కమల దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఇ శ్రీనివాసరావు టిటిడి అధికారిణి బేబి సరోజ పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా పూజాది కార్యక్రమాలు జరిపారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదాల చెంత వుంచిన పసుపుకుంకుమ అక్షింతలు, కంకణాలు భక్తులు అందజేశారు. ఈ సందర్భంగా నరసింహస్వామి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి, సుంకర రఘుపతిరావు, భగవన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. సీతారామకోవెల, నూతక్కి, గుండిమెడ ఆలయాల్లో కూడా మనగుడి కార్యక్రమం నిర్వహించారు. పాత మంగళగిరి ఆలయం నుంచి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికుల ర్యాలీ
గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 28: కేంద్రప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలతో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె నళినీకాంత్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వారికి పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. శ్రామిక మహిళా కార్యదర్శి షేక్ షకీలా మాట్లాడుతూ స్కీంవర్కర్లుగా పనిచేస్తున్న అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా, అర్బన్ హెల్త్ సెంటర్ల కార్మికులచే ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటూ కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదన్నారు. డిసెంబర్ 26,27 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న కార్మికుల ధర్నాకు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ర్యాలీలో పి నిర్మల, ఎం ధనలక్ష్మి, నాగలక్ష్మి, బషీరా, ఉమా మహేశ్వరి, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
’నీలం‘ బాధితులను ఆదుకుంటాం
చేబ్రోలు, నవంబర్ 28: ఇటీవల సంభవించిన నీలం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జాతీయ విపత్తుల పరిహారం కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. మండల కేంద్రమైన చేబ్రోలు పరిధిలో గల పాతరెడ్డిపాలెంలో దెబ్బతిన్న వరి పొలాలను బుధవారం కేంద్రబృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాతలకు అపారనష్టం వాటిల్లిందని, ప్రతిఒక్క రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే వరదనష్టం అంచనాలను తయారు చేయ డం జరిగిందని, త్వరితగతిన రైతులకు నష్టపరిహారం అందజేసే విధం గా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు వై లక్ష్మణరావు, కె సత్యప్రసాద్, వై లక్ష్మణదాసు, పి సుధాకరరావులతో పాటు వ్యవసాయశాఖ జెడిఎ శ్రీ్ధర్, పొన్నూరు ఎడిఎ శ్రీనివాసరావు, ఎఒ పద్మాంజలి తదితరులున్నారు.
సహ చట్టాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వం
గుంటూరు, నవంబర్ 28: ప్రభుత్వమే సమాచారహక్కు చట్టాన్ని నీరుగారుస్తోందని, ప్రతిఒక్కరూ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని మనకోసం సమాచారహక్కు (సహ) చట్టం రాష్ట్ర అధ్యక్షుడు కమ్మ శివరామకృష్ణ పేర్కొన్నారు. గుంటూరు నగరంలో బుధవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ 2005 వరకు బ్రిటీష్ ప్రభుత్వం రూపొందించిన అధికార రహస్యాల చట్టం కొనసాగిందని, ప్రభుత్వం చేయాల్సిన పని చేయక పోవడం వల్ల సహ చట్టం ప్రచార బాధ్యతను తామే తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి మురళి మాట్లాడుతూ ప్రభుత్వం చట్టాలు చేస్తుంది గానీ అమలు చేయడం లేదన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్లకే చట్టంపై సరైన అవగాహన లేదని, శిక్షణ ఇచ్చి కమిషనర్లను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. దరఖాస్తుదారులపై జరుగుతున్న దాడుల నియంత్రణకు ఒక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. తెలుగులోనే సమాచారాన్ని ఇవ్వాలని, జిల్లాలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మనకోసం సహ చట్టం జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు కమ్మ శివరామకృష్ణ నియమించారు. జిల్లా అధ్యక్షుడుగా కనపర్తి వరప్రసాద్, ఉపాధ్యక్షునిగా టి యుగంధర్‌గుప్తా, జనరల్ సెక్రటరీగా ఎం మహేష్‌నాథ్, జాయింట్ సెక్రటరీగా సిహెచ్ ధనుంజయ, కన్వీనర్‌గా పి వీరరాఘవరెడ్డితో పాటు మరో 23 మంది సభ్యులను ఎంపిక చేశారు.
ఇస్కాన్ పేరుతో వచ్చే నకిలీలను నమ్మొద్దు
తాడేపల్లి, నవంబర్ 28: ఎంతో పవిత్రమైన అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) పేరుతో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అటువంటి వారిని ప్రజలు నమ్మ వద్దని ఇస్కాన్ అధికార ప్రతినిధి డిఎల్‌వి ప్రసాద్ యాదవ్ బుధవారం ప్రకటించారు. ఇస్కాన్ పేరుతో సంబంధం లేనటువంటి వారు వివిధ ప్రాంతాల్లో జీవిత సభ్యత్వం, ఇతర సేవల నిమిత్తం మందిరాల పేర్లు చెప్పి డబ్బులు వసూళు చేస్తున్నట్లు, వాటికి రశీదులు కూడా ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తాజాగా ఇస్కాన్ సభ్యుల జాబితాలో ఇస్కాన్‌కు సంబంధం లేనివారి పేర్లు రావటంతో పాటు వారి సభ్యత్వానికి సంబంధించిన నగదు కూడా ఇస్కాన్ సంస్థకు జమ కాకపోవటంతో నకిలీ వ్యవహారం బయటపడిందన్నారు. ప్రజలు ఇటువంటి నకిలీ ప్రచారాలకు మోసపోవద్దని ఇస్కాన్ పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే ఈ సంస్థ గుంటూరు, విజయవాడ అధ్యక్షుడు శ్రీ రామ్‌మూరారీ దాస్ దృష్టికి తీసుకొని వారాలని కోరారు.
రిటైల్‌లో ఎఫ్‌డిఐల నిర్ణయాన్ని ఉపసంహరించాలి
* చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 28: దేశవ్యాప్తంగా రిటైల్‌వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే నిర్ణయాన్ని యుపిఎ ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని ది గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం చాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వలన 7.50 కోట్ల మంది చిల్లర వర్తకులు, వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందన్నారు. రిటైల్, ఇన్సూరెన్స్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గురువారం వావిలాల గ్రంథాలయ సంస్థలో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు ప్రధానవక్తగా మరో ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ విచ్చేస్తారన్నారు.
దళిత హక్కుల సాధనకు నిరంతర పోరాటాలు
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 28: జిల్లాలో దళిత హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నగర కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో దళిత హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం సంఘ నాయకులు చెవుల పున్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ తరతరాలుగా వెనుకబాటు తనాన్ని ఎదుర్కొంటూ రాజకీయంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎర్రజెండా వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. సంఘ నగర కన్వీనర్ కనకరాజ ప్రసాద్ మాట్లాడుతూ భూమిలేని దళితుల కోసం, అంటరానితనం నిర్మూలన కోసం, కులరహిత సమాజం కోసం పోరాడే పోరాట సమితి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి నగర అధ్యక్షుడు నూతలపాటి చిన్న, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన పిచ్చయ్య, ఇన్సాఫ్ నాయకులు అమీర్‌వలి, కుమార్ తదితరు లు పాల్గొన్నారు.