అన్నవరం, నవంబర్ 28: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా రత్నగిరి భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన దేవస్థాన అధికారులు మంగళవారం అర్థరాత్రి నుంచి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి అర్థరాత్రి 12గంటల నుంచి బుకింగ్ కౌంటర్ తెరిచి వత్ర టిక్కెట్లు విక్రయించారు. అర్థరాత్రి ఒంటి గంట నుంచి స్వామివారి వత్ర మండపాలను ప్రారంభించారు. రెండు గంటల నుంచి శ్రీస్వామి వారి ప్రధాన ఆలయ దర్శనానికి అనుమతించారు. దీంతో వచ్చిన భక్తులందరికీ వేగవంతంగా వత్రాలు, దర్శనాలు జరిపించగా క్యూలైన్‌లలో భక్తులను క్రమబద్దీకరించడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రద్దీని క్రమబద్దీకరించారు. ఈ ఒక్కరోజు స్వామి వారి అమ్మవార్లకు సుమారు 40 లక్షల రూపాయలు ఆదాయం లభించగా 8 వేల 558 వత్రాలు జరిగాయి. భక్తులందరికీ ఉచిత అన్నదానం పధకం ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కొండపై నుంచి కొండ దిగువకు రైల్వే స్టేషన్‌కు దేవస్ధాన బస్సుల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను తరలించారు. రవాణా ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఇఒ ప్రసాదం వెంకటేశ్వర్లు, ఛైర్మన్ రాజా ఐవి రామ్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
కన్నుల పండువగా గోదావరి హారతి
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, నవంబర్ 28: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్, రాష్టద్రేవాదాయ శాఖ, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లో బుధవారం రాత్రి గోదావరికి హారతినిచ్చే కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. రెండేళ్ల క్రితమే బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన గోదావరికి పౌర్ణమి హారతినిచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది నుండి దేవాదాయశాఖ పుణ్యనదీ హారతి పేరుతో రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులకు ప్రారంభించిన సంగతి విదితమే. అందులో భాగంగా దేవాదాయశాఖ తరపున రాష్టద్రేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ గోదావరి హారతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీరామదూత స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో, ఆశీస్సులతో గోదావరి హారతి కార్యక్రమం జరిగింది. సాయంత్రం 5గంటలకే లలితా సహహ్రనామ పారాయణం, శ్రీసువర్ణదత్త లక్ష్మీ దాంపత్యవ్రతం తదితర కార్యక్రమాలు జరిగాయి. గోదావరి నదిపై పంట్లు ఏర్పాటుచేసి, వాటిపై రూపొందించిన వేదికపై గోదావరి హారతి కార్యక్రమం జరిగింది. హారతి కార్యక్రమానికి ముందు బుద్భవరపు చారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం అందించే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కథారచయిత, మిథునం సినిమా కథా రచయిత శ్రీరమణకు టస్ట్ అధ్యక్షుడు బిఎస్‌ఎన్ కుమార్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రారామచంద్రన్ అందించారు. ఇదే వేదికపై మిథునం సినిమా ఆడియో సిడిని అర్బన్ జిల్లా ఎస్పీ రవికుమార్‌మూర్తి సతీమణి ఆవిష్కరించారు. మిథునం చిత్ర యూనిట్‌ను బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ సత్కరించింది. గత ఏడాది కార్తీక పౌర్ణమి హారతి కార్యక్రమానికి హాజరయిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రముఖ నటుడు, సాహితీవేత్త తనికెళ్ల భరణి తాను గోదావరి నదిపై రాసిన పాటను పాడి వినిపించారు. గజల్స్ శ్రీనివాస్ దేవాలయాలను రక్షిస్తే, ఆ దేవాలయాలే మనల్ని రక్షిస్తాయనే నినాదంతో పాట పాడి వినిపించారు. శ్రీరామదూత స్వామీజీ భక్తుల నుద్దేశించి మాటాడి, ఆశీస్సులందించారు. అనంతరం గోదావరి హారతి కార్యక్రమం జరిగింది. ధూప హారతి నుండి నక్షత్ర హారతి వరకు అన్ని రకాల హారతులను ఇచ్చారు. గోదావరి హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో పుష్కర్‌ఘాట్ నిండిపోయింది. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అందించారు. గత రెండేళ్ల కన్నా అత్యధిక సంఖ్యలో భక్తులు గోదావరి హారతి కార్యక్రమానికి హాజరైనప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోటరీ క్లబ్‌కు చెందిన నలుగురు మెక్సికో దేశానికి చెందిన సభ్యులు గోదావరి హారతి కార్యక్రమానికి హాజరవటం ప్రత్యేక ఆకర్షరణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బిఎస్‌ఎన్ కుమార్, ఎస్పీ రవికుమార్‌మూర్తి, కమిషనర్ జితేంద్ర, అన్నవరం దేవస్థానం ఇఓ పి వెంకటేశ్వర్లు, హారతి ఉత్సవ్ కమిటీ నిర్వాహకులు ఎస్‌ఎన్ రాజా, ప్రసాదుల హరనాథ్, ఏవిఎస్ నాగేశ్వరరావు, మిథునం చిత్ర సంగీత దర్శకుడు వీణాపాణి, ఇతర యూనిట్ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
కణుజు మాంసం స్వాధీనం!
గోకవరం/గంగవరం, నవంబర్ 28: అక్రమంగా తరలిస్తున్న కణుజు మాంసాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం గోకవరం మండలంలో జరిగింది. దీనికి సంబంధించి సూదికొండ రేంజర్ త్రిమూర్తులురెడ్డి మాట్లాడుతూ రిజర్వు ఫారెస్టులో కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు కణుజును చంపి మాంసాన్ని తరలిస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసినట్టు చెప్పారు. అయితే దాడి సమయంలో వేటగాళ్లు పరారయ్యారని, కణుజుమాంసం మాత్రం స్వాధీనం చేసుకోగలిగామని తెలిపారు. ఈ దాడిలో గార్డులు బాషా, రామలక్ష్మి, ఎబిఒ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. గంగవరం పశువైద్యాధికారి చేత పోస్టుమార్టం చేయించి, సూదికొండ కార్యాలయం సమీపంలో గొయ్యి తీసి పాతిపెట్టినట్టు చెప్పారు. వేటగాళ్లపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు రేంజర్ త్రిమూర్తులురెడ్డి వివరించారు.
జగన్‌ను అక్రమ కేసుల్లో ఇరికించే కుట్ర:బోసు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 28: వైఎస్ జగన్‌ను అక్రమ కేసుల్లో ఇరికేందుకు అధికార కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. కాకినాడలోని వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో బుధవారం బోసు విలేఖరులతో మాట్లాడారు. తమ అధినేత జగన్‌కు లభిస్తున్న జనాదరణను చూసి ఓర్వలేకే ఆయనను అక్రమ కేసుల్లో ఇరికించారన్నారు. చట్టప్రకారం 90 రోజుల్లో ఎఫ్‌ఐఆర్ దాఖలు కాని పక్షంలో జైలునుండి విడుదల చేయాల్సి ఉండగా కావాలనే సిబిఐ అధికార్లు ఎఫ్‌ఐఆర్ దాఖలు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. దీన్నిబట్టి చూస్తే ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఉందన్న విషయం స్పష్టం అవుతోందన్నారు. అప్పటి వైఎస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా 16 జిఒలు విడుదల చేసినట్టు చెబుతున్నారని, అవి చట్టవిరుద్ధమైతే అప్పటి కేబినెట్‌పై చర్య తీసుకోవాలని, అవే సక్రమమైనవైతే జగన్‌ను జైలు నుండి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌కు బెయిల్ మంజూరు విషయంలో ప్రభుత్వంపై న్యాయపోరాటం సాగిస్తామని బోసు చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జగన్‌ను జైలులో పెట్టించిన కారణంగా షర్మిల మరో జగన్ రూపంలో జనం ముందుకు వచ్చేందుకు అవకాశం కలిగిందన్నారు. షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపిలో చేరాల్సిందిగా ఎవరిపైనా తాము బలవంతపు వత్తిళ్ళు చేయడం లేదన్నారు. ప్రజలే తమ నేతలను వైఎస్‌ఆర్ సిపిలో చేరాలంటూ డిమాండ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. దివంగత నేత వైఎస్ ఆశయాలు జగన్మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమవుతాయని, ఈ నమ్మకంతోనే జగన్‌కు జనాదరణ లభిస్తోందని బోసు పేర్కొన్నారు.
ఇక అరచేతిలో నేరగాళ్ల చరిత్ర
రాజమండ్రి అర్బన్ జిల్లాలో క్రిమినల్స్, క్రైం ట్రాక్ నెట్‌వర్క్ విభాగం ప్రారంభించిన డిఐజి
రాజమండ్రి, నవంబర్ 28: ఇకపై దేశంలోని ప్రతీ నేరస్థుడి నేర చరిత్ర పోలీసుల చేతిలో ఉంటుంది. నేరగాళ్ల నేర చరిత్రను భద్రపరిచే క్రిమినల్స్, క్రైం ట్రాక్ నెట్‌వర్క్ విభాగాన్ని ఏలూరు రేంజి పరిధిలో తొలిసారిగా రాజమండ్రి అర్బన్‌జిల్లాలో ప్రారంభించారు. నేరగాళ్ల ఆటకట్టించేందుకు పోలీసుశాఖ ఆధునిక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏలూరు రేంజి డిఐజి జి సూర్యప్రకాశరావు బుధవారం సాయంత్రం ఈ విభాగాన్ని అర్బన్‌జిల్లా కార్యాలయంలో ప్రారంభించారు. అలాగే కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. క్రిమినల్స్, క్రైం ట్రాక్ నెట్‌వర్క్ విధానంలో భాగంగా 1990 నుంచి జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న నేరాలకు సంబంధించిన సమాచారంతో పాటు, నేరగాళ్ల గత చరిత్ర, వారి వేలిముద్రలను కంప్యూటర్లలో భద్రపరుస్తారు. ఏదేని కేసులో అనుమానితులు పోలీసులకు దొరికితే వేలి ముద్రల ఆధారంగా వారి పూర్తి గత చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంటుందని డిఐజి వివరించారు. ఈవిధానాన్ని త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రారంభిస్తామన్నారు. కిడ్నాప్‌ల వంటి సంఘటనల్లో నేరస్తుల జాడను కనుగొనేందుకు మొబైల్ ట్రాకింగ్ విధానాన్ని కూడా ఇక్కడ ప్రారంభించామన్నారు. ఈవిధానంలో నేరస్తుడు వినియోగించిన సెల్‌ఫోన్ ఆధారంగా ఎక్కడున్నాడనే విషయాన్ని తెలుసుకోవచ్చన్నారు.