Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

హిందూ ధర్మం దళితుల సొత్తు

$
0
0

ప్రొద్దుటూరు, నవంబర్ 28 : హిందూ పరిరక్షణ ధర్మం దళితుల సొత్తు అని, వారే ఈ ధర్మాన్ని కాపాడే బాధ్యత స్వీకరించి ప్రోత్సహించాలని శ్రీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతీస్వామీజీ పేర్కొన్నారు. పట్టణంలోని నామా ఎరికల ఆశ్రమంలో మంగళవారం నుండి డిసెంబర్ 4వతేది వరకు నిర్వహించే గీతాజ్ఞాన ప్రబోదంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా బుధవారం పట్టణంలోని నడింపల్లె హరిజనవాడలో ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామిజీకి ఘనస్వాగతం పలికారు. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారని కానీ హరిజనవాడే గుడిగా హరిజనులే ఇక్కడి భక్తులుగా భావించి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. దళితవాడలోని ప్రతి వీధికి ప్రతి ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. తన రాక సందర్భంగా దళితవాడలలో స్వాగతంతో పాటు హిందూ ధర్మాలను పాటించి చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. ఇదే ధర్మాన్ని ఆఖరి శ్వాసవరకు కొనసాగేలా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా దళితులు హిందుధర్మాన్ని ప్రోత్సహించేలా, బాధ్యత స్వీకరించేలా సహకరించాలన్నారు. ఆయన రాక సందర్భంగా పలు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లాలో శాంతి భద్రతలు భేష్
* కర్నూలు రేంజ్ డిఐజి అనిల్‌కుమార్
ప్రొద్దుటూరు, నవంబర్ 28 : జిల్లాలో శాంతి భద్రతలు భాగా ఉన్నాయని కర్నూలు రేంజ్ డిఐజి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసుల పనితీరు బాగుందని, నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. అక్కడక్కడ అక్రమాలకు అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న సిబ్బందిపై వేటు వేయడం జరిగిందన్నారు. సింహాద్రిపురం ఎస్‌ఐ గత కొన్నినెలల కిందట బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై విఆర్‌కు పంపడం జరిగిందన్నారు. అలాగే ప్రొద్దుటూరులో పోలీసులకు కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ఆయన స్పందిస్తూ గత 20 సంవత్సరాలుగా ఉన్న రోడ్లు, ప్రస్తుతం అలాగే ఉన్నాయని జనాభా పెరుగుతున్న దృష్ట్యా వాహనాల సంఖ్యకూడా పెరిగిందన్నారు.పోలీస్ , రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని కేవలం ఒక పోలీస్ శాఖతో ఆచరణ సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కరుణాకర్, అర్బన్ సిఐ యుగంధర్‌బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆధార్ ప్రక్రియకు
ప్రభుత్వం పచ్చజెండా
* 3 మండలాలు గుర్తింపు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, నవంబర్ 28 : భారత ప్రభుత్వ విశిష్ట (ఆధార్) గుర్తింపు పత్రం జిల్లా ప్రజల ముంగిటకు వచ్చేస్తోంది. ఏడు నెలల అనంతరం ఇంకా నమోదు చేసుకోని వారి వివరాల నమోదుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో జిడిసి సంస్థ చేపట్టనుంది. డిసెంబర్ నెలలోనే ఆధార్ ప్రక్రియ పునఃప్రారంభించనున్నారు. గతంలో నమోదు కార్యక్రమంలో తలెత్తిన వివాదాలను దృష్టిలో పెట్టుకుని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఇప్పటికే ఆధార్ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా జిల్లాలో డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. అందుకు ముందుగా లింగాల, సుండుపల్లె, ఓబులవారిపల్లె మండలాలు తొలి విడతలో చేపడతారు. అవి పూర్తయ్యాక మరో మండలంలోకి ప్రవేశిస్తారు. గతంలో రెండు సంస్థలకు జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియను ఇచ్చి అధికారులకు తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఈ దఫా అలాంటి గొడవ రాకుండా ఉండేందుకు ఒకే సంస్థకు బాధ్యత అప్పగించారు. మండలంలోని ఇంచుమించు 15 రోజుల కంటే మించి కార్యక్రమం ఉండకపోవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే నమోదు చేయించుకోని ప్రజలు స్పందించి కేంద్రాలు పెట్టిన సందర్భంలో దగ్గర ఉండి పేర్లు నమోదు చేయించుకోవాలని కోరుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 28 లక్షల 84వేల 524 మంది జనాభా ఉన్నారు. అందులో నమోదు కార్యక్రమం ముగిసే నాటికి 16 లక్షల 6వేల 30 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు. మిగిలిన వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంది. వారందరికీ ప్రస్తుతం పేర్లు నమోదు చేయనున్నారు.

వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు
* భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
కడప (కల్చరల్), నవంబర్ 28 : కార్తీక పౌర్ణమి పండుగను కడపలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అన్ని శివాలయాల్లో ఉదయం 4 గంటల నుంచే భక్తుల సందడి కనిపించింది. ఆలయ ప్రాంగణాలు భక్తులు వెలిగించిన నిమ్మ, ఉసిరి, పిండి దీపాలతో కళకళలాడాయి. దేవుని కడప శ్రీసోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గడ్డిబజారు వీధిలోని శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రాహ్మణపల్లి చంద్రవౌళీశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయకర్పూరాలు సమర్పించారు. అలాగే శ్రీమృత్యుంజయేశ్వర స్వామి ఆలయం, ఎర్రముక్కపల్లెలోని శివాలయం, మోచంపేటలోని శ్రీప్రసన్న విశే్వశ్వరస్వామి ఆలయాల్లో శివునికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకారం, పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే స్థానిక ఎన్‌జిఓ కాలనీలోని వాసవీ ఎన్‌క్లేవ్‌లో శ్రీవేంకటేశ్వరస్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి పాలక మండలి సభ్యులు పాలాది లక్ష్మీకాంతం శ్రేష్టి పాల్గొన్నారు. అదేవిధంగా శివాలయాల్లో రాత్రి వేళ భక్తులు శివభజనలు, స్తుతి కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
శ్రీకామాక్షీదేవికి విభూది అలంకరణ
నగరంలోని సాధుచెంగన్న వీధిలో వెలసిన శ్రీకామాక్షీదేవి మహాశక్తి పీఠం దేవస్థానంలో బుధవారం ఉదయం కార్తీకపౌర్ణమి పండుగను పురస్కరించుకుని శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన వీభూదితో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అభిషేకం, కుంకుమార్చన, అమ్మవారి కంచి కామాక్షిదేవి సహస్ర నామావళి తదితర పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆలయ కమిటీ అధ్యక్షులు కోనేరు సుధాకర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాగా అమ్మవారి ప్రత్యేక అలంకరణ శ్రీసాయి భక్తులతో చేయించారు. వీభూది అలంకరణ చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
రాజంపేటలో...
రాజంపేట : కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా బుధవారం అన్ని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము 4 గంటల నుండే భక్తుల సందడి మొదలైంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించే భక్తులతో శివాలయాలు నిండిపోయాయి. 108 ఒత్తులతో దీపాలు వెలిగిస్తే మంచిదన్న ఉద్దేశంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సందడిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినా భక్తులు ఎక్కువగా రావడంతో బారిగేట్లు కూడా ఊడిపోయాయి. ప్రధాన రహదారిలో ఉన్న శివాలయంలో భక్తుల సందడి ఎక్కువ కావడంతో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం నుండి భక్తులు మహాశివుడిని దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. పలు శివాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. మరికొంత మంది భక్తులు అన్నదానాలు చేయడం కూడా జరిగింది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమితో పాటు మూడవ సోమవారానికి కూడా భక్తుల్లో విశేష ప్రాముఖ్యత ఉండ దృష్ట్యా రానున్న మూడవ సోమవారం కూడా ఇదే స్థాయిలో భక్తుల సందడి ఉంటుందని ఆలయ కమిటీలు ఊహిస్తూ ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలు శివాలయాల్లో శివలింగాలతో పాటు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు శివపార్వతులను దర్శించుకొని తరించిపోవడమే కాకుండా ఉపవాసాలు కూడా ఉండడం విశేషం.
అరటి తోటల్లో ఏనుగుల బీభత్సం
ఓబులవారిపల్లె, నవంబర్ 28 : ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంత శివారులోని ఆరుమంది రైతుల అరటి తోటలను మంగళవారం రాత్రి ఏనుగులు దాడి చేసి ధ్వంసం చేశాయి. ఈ అరటితోటలు కాపుకు రావడంతో నోటికాడికి వచ్చిన పంట ధ్వంసం కావడంతో రైతులు లబోదిబో మంటున్నారు. చందా వెంకటయ్య, పాపమ్మ, సుశీలమ్మ, శ్రీనివాసులు, రామసుబ్బయ్యలకు చెందిన అరటితోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తోటలలో కాపు కోసేందుకు సిద్దంగా ఉండడంతో వ్యాఫారుల వద్ద డబ్బులు తీసుకుని ఒప్పందం చేసుకున్నామని, ఏనుగుల దాడితో తాము పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకు పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై కనికరించి పరిహరం అందించాలన్నారు. బుధవారం రెవెన్యూ, అటవీ, ఉద్యాన శాఖల అధికారులు ధ్వంసమైన తోటలను పరిశీలించారు. నష్టం విలువపై ప్రభుత్వానికి నివేదిస్తామని తహశీల్దార్ దుర్గయ్య తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్‌ఐ రమణ, విఆర్వో మధుసూధనరెడ్డి, మాజీ ఎంపిపి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎక్కువైన భూ తగాదాలు
* రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా
సిద్దవటం, నవంబర్ 28 : రాజంపేట డివిజన్ పరిధిలో భూ తగదాలు, ఎన్‌క్రోచ్‌మెంట్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. సిద్దవటం తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ కార్యాలంలోని రికార్డులు, కంప్యూటర్ గది, కార్యాలయ ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం అసైన్‌మెంట్ రికార్డులు, ఇండ్ల స్థలాల రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేఖరుతో మాట్లాడుతూ సిద్దవటం రోడ్డు వైడింగ్ పనుల గురించి కలెక్టర్‌తో చర్చిస్తానన్నారు. డివిజన్ పరిధిలో భూ పంపిణీ కార్యక్రమం 95 శాతం పూర్తి చేశామన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పరిశీలించి డికెటి భూమికి అర్హులకు మాత్రమే పంపిణీ చేశానన్నారు. రేషన్‌కార్డు ఐడి కార్డు అసైన్‌మెంట్ కమిటీకి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సత్యనందం, వి ఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించం
* మహాధర్నాకు తరలివచ్చిన భారీ జనం
* 14న ఆర్‌అండ్‌బి కార్యాలయం ముట్టడి
నందలూరు, నవంబర్ 28 : నందలూరు బస్టాండ్ నుండి రైల్వేస్టేషన్ రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం కల్గించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని ఐక్య పోరాట సమితి నాయకులు హెచ్చరించారు. ఐకెపిఎస్ పిలుపుమేరకు బుధవారం నిర్వహించిన మహధర్నాకు మండలవ్యాప్తంగా వందలాది మంది తరలివచ్చారు. తొలుత నాగిరెడ్డిపల్లె పంచాయితీ కార్యాలయ నుండి పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీలో ఆర్‌ఎస్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, అభివృద్ధిని అడ్డుకోవద్దని, ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయకూడదని నినాదాలు చేశారు. బస్టాండ్ వద్ద జరిగిన సమావేశంలో బిజెపి నాయకులు పి.మస్తానయ్య, వైకాపా నాయకులు భోగాపతి వెంకటరమణ, టిడిపి నాయకులు యెద్దల వెంకటేశ్వర్లు, జె.సుబ్బరాయుడు, కాంగ్రెస్ నాయకులు ధనుంజయనాయుడు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితమే బ్రిటిష్‌వారు నందలూరు రైల్వేస్టేషన్, లోకోషెడ్‌ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధిని కాంక్షిస్తూ 125 అడుగుల రోడ్డును ఏర్పాటు చేశారని, కాలక్రమేణా రోడ్డు ఆక్రమణకు గురికావడం, పంటకాల్వలు, డ్రైనేజీ కాల్వలు కబ్జాకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటికి నేటికి జనాభా పెరగడంతో రోడ్డు ఇరుకు కావడంతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. నాగిరెడ్డిపల్లె, నందలూరు, పాటూరు, వివిధ గ్రామాల నుండి రైల్వేస్టేషన్, కోర్టు, ఆస్పత్రి, విద్యాసంస్థలకు వెళ్లేవారంతా ఈ రహదారిలోనే రాకపోకలు సాగించాల్సి ఉందన్నారు. రోడ్డు విస్తరణకు అంతా స్వచ్ఛందంగా సహకరించాలని వారు కోరారు. రోడ్డు పనులు చేపట్టకుంటే డిసెంబర్ 14న వేలాది మంది ప్రజలతో రాజంపేట ఆర్‌అండ్‌బి కార్యాలయాన్ని పాదయాత్రతో వెళ్లి ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు, విద్యార్థులు, న్యాయవాదులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

వేతన సవరణ కోసం ఉద్యమించిన ఉపాధ్యాయులు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, నవంబర్ 28 : వేతన సవరణ కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించడంతో బుధవారం కలెక్టరేట్ దద్దరిళ్లింది. జిల్లాలోని ఉపాధ్యాయుల సంఘాలకు చెందిన నేతలంతా జెఎసి నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల సమస్యలపై నినాదాలు చేశారు. జెఎసి రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలో 2వ రోజున నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ శిబిరాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శివారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 10వ తేదీన పిఆర్సీ కమిటీ నియమించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల పోరాటాలను కాలరాసే జివో నెం. 177ను వెంటనే రద్దు చేయాలన్నారు. 398 రూపాయలతో స్పెషల్ టీచర్లతో వెట్టి చారికి చేయించుకుంటున్న కాలానికి నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. జిల్లాలో పదవి కాలం ముగిసిన ఉపాధ్యాయులకు ఫెన్షన్, రావాల్సిన అలవెన్స్‌ల కోసం ఆఫీసులు, ట్రెజరీల చుట్టూ తిరుగుతున్న వారికి రావాల్సిన డబ్బులు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎయిడెడ్ టీచర్లు, భాషా పండితుల యాక్ట్ 37/2005, 1/2005 అమలు చేయాలన్నారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఉండాలనే నిబంధన తుంగలో తొక్కి పిఇటి, భాషా పండితులను మాత్రం ఎస్‌జిటి క్యాడర్‌లో పని చేయడం అన్యాయమన్నారు. పిఇటి భాషా పండితులు పోస్టులను ఎస్‌ఎ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. పిఎఫ్ ఆర్‌డిఎ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనను విరమించాలన్నారు. మహిళా ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల మాదిరిగానే అమలు చేయాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ వి. శ్రీనివాసులు, కో- చైర్మన్లు బి.లక్ష్మీరాజు, జమాల్‌రెడ్డి, కృష్ణయ్య, ఖాదర్‌బాషా, రాష్ట్ర జెఎసి సుధాకర్‌రెడ్డి, రవికుమార్, ఓబుల్‌రెడ్డి, శ్యామ్ సుందర్‌రెడ్డి, ఎపిటిఎఫ్ చెంచురెడ్డి, గజిటేడ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రామ్మూర్తి, వెంకటరామిరెడ్డి, డిటిఎఫ్ రామాంజనేయులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వెంకట సుబ్బయ్య, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* శ్రీ పరిపూర్ణానంద సరస్వతి
english title: 
h

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>