విజయనగరం, నవంబర్ 29: పదవ తరగతి పరీక్షా ఫలితాల సాధనకు పక్కా ప్రణాళిక అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి జి.కృష్ణారావు అభిప్రాయపడ్డారు. డివిజన్ పరిధిలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈసదంర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్‌లో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ఇప్పటి నుంచి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడం ద్వారా ఫలితాలను మెరుగుపరచుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. టెన్త్ పరీక్షలు ముగిసేంత వరకూ ఉపాధ్యాయులు సెలవులు తీసుకోరాదని, అలాగే విద్యార్థులకు కూడా సెలవులు ఇవ్వరాదని ఆయన ఆదేశించారు. ఫలితాలను సాధించేందుకు పక్కదార్లను వెతకవద్దని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే రాజీవ్ విద్యా మిషన్ ద్వారా మంజూరవుతున్న నిధులను సక్రమంగా వినియోగించాలని ఆదేశించారు. నిధులను ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహణ విషయంలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో ఉప విద్యాశాఖ అధికారి జి.నాగమణి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ఐ.టి.డి.ఎ. చేతిలో ఉపాధి పనులు
జియ్యమ్మవలస, నవంబర్ 29: పార్వతీపురం ఐ.టి.డి.ఎ. పరిధిలోని ఉపాధి పథకం పగ్గాలు ఇక నుంచి ఐ.టి.డి.ఎ. చేతికి వెళ్లనున్నాయి. ఈ పథకం అమలు ప్రారంభం నుంచి డుమా ఆధ్వర్యంలో నిర్వహించిన పథకం ఉప ప్రణాళిక ప్రాంతంలో 8మండలాల్లో ఉపాధి సిబ్బంది ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇటీవల గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై చెప్పడంతో ఇందుకు అనువైన పథకాన్ని రూపొందిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనులకు దీర్ఘకాలం లాభదాయక పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పాడేరు ఐ.టి.డి.ఎ. పథక నిర్వహణాధికారిగా పనిచేసే సమయంలో కేవలం ఒక కోటి 2లక్షల రూపాయలతో హార్టికల్చర్ అమలు చేసి గిరిజనులకు ఏటా లాభాలు అందేటట్లు చేసినట్లు ఉపాధి అధికారులు సిబ్బందితో నిర్వహించిన వీడియో కానె్ఫరెన్స్‌లో వివరించారు. ఉపాధి పథకంలో వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న ఫలితం లేకపోయిందని సిబ్బంది పేర్కొంటున్నారు. దీంతో హార్టికల్చర్‌ని అభివృద్ధి చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతీ గిరిజన కుటుంబానికి జాబ్‌కార్డులు ఇవ్వనున్నారు. భూమి గల ప్రతీ గిరిజన కుటుంబానికి కనీసం రెండున్నర ఎకరాల్లో పంట్ల తోటల పెంపకాన్ని చేపడతారు. ఈమేరకు 26 నుంచి పార్వతీపురం ఐ.టి.డి.ఏ. పరిధిలో గిరిజన గ్రామాల్లో గిరిజన కుటుంబాలు సర్వే మొదలుపెట్టారు.
మండల స్థాయిలో కమిటీలు
ప్రతీ మండలంలో ఐదు కమిటీలను నియమించనున్నారు. ఈ కమిటీలకు ఎం.పి.డి.ఓ., ఏ.పి.ఓ., ఇ.ఓ.పి.ఆర్.డి., వ్యవసాయాధికారి, వెలుగు ఏ.పి. ఎంలు నేతృత్వం వహిస్తుండగా వారికి సాంకేతిక సాయం అందించేందుకు నీటిపారుదలశాఖ, గృహణ నిర్మాణ, ఆర్.డబ్ల్యు. ఎస్., మండల ఏ. ఇ.లు ఉంటారు. గ్రామస్థాయిలో కమిటీలను నిర్వహించి గిరిజన గ్రామాల్లో గిరిజన ఇళ్లకే వెళ్లి భూ వివరాలను తెలుసుకుని హార్టికల్చర్‌పై ప్రతిపాదనలు చేపట్టనున్నారు. ఈ సర్వే డిసెంబర్ 18నాటికి పూర్తి చేసి 20వ తేదీనాటికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది.
‘పకడ్బందీగా పథకాలను పర్యవేక్షించాలి’
గజపతినగరం, నవంబర్ 29 : ఇందిరా క్రాంతి పథం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పర్యవేక్షించే బాధ్యత ఎపిఎంలపై ఉందని ఐకెపి ఏరియా సమన్వయ కర్త కె. రాజేశ్వరి అన్నారు. స్థానిక ఇందిరా క్రాంతి పథం కార్యాలయంలో గురువారం క్లస్టర్ పరిధిలోని 6 మండలాల ఎపిఎంలు సిసిలతో మాసాంతర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలకు పొదుపు చేసి గడువు పూర్తయిన సంఘాలను గుర్తించి ఆయా బ్యాంకుల ద్వారా బ్యాంకు లింకేజి రుణాలు సకాలంలో అందించాలన్నారు. స్ర్తినిధి రుణాలు సంఘాలోని సభ్యులకు విరివిగా అందించడంతో పాటు స్ర్తినిధిపై సంఘాలకు అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన పాల ప్రగతి కేంద్రాలు గూర్చిపూర్తి స్థాయిలో అవగాహన కల్పించి పాల ప్రగతికేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మొబైల్ బుక్ కీపింగ్‌పై సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. సుస్థిర వ్యవసాయం ఆరోగ్యం, పౌష్టికాహారం వికలాంగులకు రుణాలపైన అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా ఉపయోగపడేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో 6 మండలాల ఎపిఎంలు, సుస్థిర వ్యవసాయం, వికలాంగుల ఎపియంలతో పాటు సిసిలు పాల్గొన్నారు.
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మృతి
పార్వతీపురం, నవంబర్ 29: పార్వతీపురం పట్టణానికి చెందిన వ్యక్తి, విశాఖ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జమ్మాన ప్రసాద్ (47) విశాఖలోని సింహాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు పార్వతీపురానికి ప్రసాద్ మృత దేహాన్ని గురువారం తరలించారు. ప్రసాద్ మాజీ శాసన సభ్యుడు స్వర్గీయ జమ్మాన జోజి ప్రధమ కుమారుడు. జమ్మాన మృతి పట్ల పలువురు ప్రముఖులు బౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈమేరకు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ రంగారావు, బేబీనాయన, డాక్టర్ చీకటి బదిరీనారాయణ, జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, వై ఎస్ ఆర్ సి పి నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ఆర్ వి ఎస్ కుమార్, చుక్క లక్ష్ముంనాయుడులతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
రెండు గ్రామాల మధ్య
ఇసుక వేలం పాటలో తగదా
సీతానగరం, నవంబర్ 29: సువర్ణముఖి నది ఇసుక తవ్వకాల వేలం పాట సొమ్మును తమ గ్రామానికి కేటాయించాలంటే తమ గ్రామానికి కేటాయించాలని రెండు గ్రామాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ మేరకు మండల పరిధిలోని బూర్జ, ఆవాలవలస గ్రామాల మధ్య ఉన్న సువర్ణముఖి నదిలో ఇసుక తవ్వకానికి సంబంధించిన వేలం పాటకు వచ్చిన సొమ్మును బూర్జ గ్రామానికి కేటాయించాలని బూర్జ గ్రామస్థులు, ఆవాలవలస గ్రామస్థులు గురువారం పట్టుబట్టారు. ఈ మేరకు రెండు గ్రామాలకు వెళుతున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని రెండు గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బొబ్బిలి రూరల్ సి.ఐ. శ్రీహరిరాజు ఆధ్వర్యంలో రెండు గ్రామాల పెద్దలతో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సి.ఐ. మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేయడం నేరమని, వేలం పాటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల జోక్యంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
కారు, లారీ ఢీ: ఒకరి మృతి, నలుగురికి గాయాలు
డెంకాడ, నవంబర్ 29: కారు లారీ ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడకు చెందిన వడ్లమాని సుబ్బారావు తన కుటుంబ సభ్యులతో విజయనగరంలోని బంధువుల ఇంటికి గురువారం కారులో వస్తున్నారు. ఈ మండలం బొడ్డవలస గ్రామం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొంది. ఈ ఘటనలో వడ్లమాని సుబ్బలక్ష్మి (65) అక్కడికక్కడే మృతి చెందింది. ఈమె భర్త సుబ్బారావు, బంధువులు దుర్గాకుమారి, సుందరి, డ్రైవర్ నాగబాబు గాయపడ్డారు. వీరిలో సుబ్బారావు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం’
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో డిసెంబర్ 11న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఆపార్టీ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి వెల్లడించారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి, గ్యాస్ సబ్సిడీల ఎత్తివేత అదితర అంశాలతో పాటు రాష్ట్రంలో విద్యుత్ సర్‌ఛార్జీల విధింపు, ఇంధన సర్దుబాటు పేరిట ఛార్జీల పెంపు వంటి అంశాలకు వ్యతిరేకంగా అంచెలంచెల ఉద్యమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. కేంద్రంలో యు.పి.ఎ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం అందిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే విద్యుత్ సర్‌ఛార్జీ పేరిట వేలకోట్ల రూపాయలను వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ప్రభుత్వం రానున్న కాలంలో మరో 4800 కోట్ల రూపాయల మేర విద్యుత్ బాదుడుకు రంగం సిద్ధం చేస్తోందని ఆయన ఆరోపించారు. జిల్లాలో జీవ నదులున్నప్పటికీ వాటిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కృష్ణమూర్తి ఆరోపించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా తలపెట్టిన పోరులో డిసెంబర్ 1 నుంచి 6 వరకూ మండల కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు, పికెటింగ్‌లు చేపట్టనున్నట్టు కృష్ణమూర్తి తెలిపారు. అలాగే ప్రభుత్వ విధానాలపై రాజకీయ ప్రచారం నిమిత్తం 50 దళాలను రూపొందించినట్టు తెలిపారు.
రూ. 10 కోట్లతో పాఠశాల అదనపు భవన నిర్మాణాలు
పాచిపెంట, నవంబర్ 29: జిల్లాలో గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ, సాలూరు, మక్కువ, పాచిపెంటలలో దాదాపు 10కోట్ల రూపాయలతో పాఠశాలల అదనపు భవన నిర్మాణాలను చేపడుతున్నామని రాజీవ్ విద్యామిషన్(ఎస్.ఎస్.ఏ) డి.ఇ. బి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆయా మండలాలకు సుమారు 219 భవనాలు మంజూరయ్యాయన్నారు. ఒక్కొ భవన నిర్మాణానికి 5లక్షల 30వేల రూపాయలు చొప్పున నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ భవన నిర్మాణాలు పాఠశాలల కమిటీలకు అప్పగించారని తెలిపారు. పాచిపెంట మండలంలో 2011-12 సంవత్సరానికిగా 14 భవనాలు, 2012-13గాను 56 భవనాలు తమ పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం పలు పాఠశాలల భవన నిర్మాణాలు వివిధ దశలకు చేరుకున్నాయన్నారు. వచ్చే మార్చినెలాఖరుకు తమ పర్యవేక్షణలో జరుగుతున్న భవన నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని, ప్రస్తుతం నిర్మాణ పనులకు నిధులు కొరత లేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు జాప్యాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా జాప్యం వాస్తవమేనని అక్కడ కూడా భవన నిర్మాణాలు వేగవంతానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఈయనతోపాటు సైట్ ఇంజనీర్ రవికుమార్ పాల్గొన్నారు.
లింకేజీ రుణాల్లోనూ ముందుడాలి
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 29: పట్టణ ఇందిరక్రాంతిపథం ద్వారా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులింకేజి రుణాల మంజూరులో రాష్ట్రంలో జిల్లాకు ప్రధమస్థానం తీసుకురావాలని జిల్లాకలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కోరారు. పట్టణంలో ఇక్కడ గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో స్వయం సహాయక సంఘాలకు 43కోట్ల రూపాయల బ్యాంకులింకేజి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇంతవరకు 28 కోట్ల 87లక్షల రూపాయలను అందించామన్నారు. బ్యాంకులింకేజి రుణాల ద్వారా మహిళలు ఏదైనా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతారని, స్వయం సహాయక సంఘాల అవసరాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. స్వయం సహాయక సంఘాల రుణాల రికవరీ 96 శాతం ఉందన్నారు. లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ కె.రవీంధ్రరెడ్డి మాట్లాడుతూ బ్యాంకు అధికారులు స్వయం సహాయక సంఘాలకు సకాలంలో రుణాలను అందిస్తున్నారని తెలిపారు. పట్టణ ఇందిర కాంత్రిపథం ప్రాజెక్టు అధికారి బి.వి.రమణ మాట్లాడుతూ మహిళా సంఘాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు రుణాలను సకాలంలో మంజూరు చేయాలని కోరారు. విజయనగరం, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్లు ఎస్.గోవిందస్వామి, సిహెచ్.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఇంటి పక్క ఇల్లు
తొలగించేందుకు అధికారుల యత్నం
పార్వతీపురం, నవంబర్ 29: రాష్టమ్రంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఇంటిని ఆనుకుని ఉండటమే ఆ ఇంటి యజమాని చేసిన నేరంలా కనిపిస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురం సౌందర్య నారాయణమూర్తినగర్‌లో తెంటు వెంకటరావు అనే వ్యక్తి నిర్మిస్తున్న ఇంటికి అనుమతి లేదనే కారణంతో గురువారం మున్సిపల్ అధికారులు దానిని తొలగించేందుకు ప్రయత్నించారు. ఇంట్లోని వారు అడ్డుకోవటంతో పోలీసుల సహకారం తీసుకుని తొలగించడానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఇంటి యజమాని వెంకటరావు ఇంటి వద్ద లేనందువల్ల తమకురెండురోజులు గడువు ఇవ్వాలని ఆయన భార్య, కుటుంబ సభ్యులు కోరడంతో అందుకు అధికారులు అంగీకరించారు. మంత్రి శత్రుచర్ల ఇంటికి ఆనుకుని ఉన్న ఈ ఇంటి గోడను తొలగించడానికి ఆయన ఆదేశాల మేరకే అధికారులు రంగంలోకి దిగారనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనల మేరకు వదలాల్సిన ఖాళీ స్థలం వదల లేదనే కారణంతో దీనిని తొలగించేందుకు అధికారులు నిర్ణయించారు. తన ఇంటిని ఆనుకుని ఈ ఇల్లు నిర్మిస్తుండటంతో వాస్తు దోషం తగులుతుందని మంత్రి భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా మంత్రి ఇంటి సమీపంలో ఒక ఇంటిని మున్సిపల్ అధికారులు ఇదే విధంగా తొలగించటం విమర్శలకు తావిచ్చింది. తొలగింపును అడ్డుకునేందుకు పట్టణ పేదల సంక్షేమ సంఘం ప్రతినిధి ఉమా కూడా ప్రయత్నించారు. మున్సిపల్ అధికారులు టిపి ఎస్ నాయుడు, జనార్థనరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్‌ఐ ఎల్.్భస్కరరావుకూడా సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు.
బాణసంచా పేలుళ్ళ నివారణకు పోలీసు, రెవెన్యూ తనిఖీలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 29: ‘లైసెన్సులు లేకుండా పేలుడు పదార్ధాలను నిల్వ చేయడం, తయారు చేయడం, రవాణా చేయడంపై ఇక కఠినంగా వ్యవహరించాలి. అక్రమంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మీదట బాణసంచా తయారీ దార్లు, అక్రమ నిల్వ, రవాణా దార్లపై పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా దాడులు చేయాలి’ అని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశించారు. బాణసంచా వ్యాపారులు, అధికారులతో కలెక్టర్ గురువారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి మండలం పారాది, పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామాల్లో ఇటీవల జరిగిన రెండు ప్రమాదాల్లో ప్రాణనష్టంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పారాది గ్రామంలో జరిగిన దుర్ఘటనలో అయిదుగురు వ్యక్తులు మృతి చెందగా, రెల్లివలస ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలైన సంగతిని ఈసందర్భంగా కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రస్తావించారు. వ్యాపారస్తుల లాభార్జనలో సామాన్యులు తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారన్నారు. ఈఘటనలు పునరావృతం కాకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గతేడాది జరిపిన తనిఖీలు, నమోదు చేసిన కేసుల వివరాలను అడిగితెలుసుకున్నారు. గతేడాది ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేలుడు పదార్ధాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్న వారి జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎవరివద్దనైనా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు సమాచారం అందితే తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. లైసెన్సు లేకుండా పేలుడు పదార్ధాలను తయారు చేసినా, రవాణా చేసినా, నిబంధనలు అతిక్రమించినా వారి లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ కార్తికేయ, సంయుక్త కలెక్టర్ పి.ఎ.శోభ, డిఆర్‌ఓ బి.హెచ్.ఎస్.వెంకటరావు, ఆర్డీశలు రాజకుమారి, వెంకటరావు, డిఎస్పీలు ఇషాక్ అహ్మద్, శ్రీదేవిరావు, జిల్లా అగ్నిమాపక అధికారి, పేలుడు పదార్ధాల వ్యాపారులు పాల్గొన్నారు.
‘సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదు’
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 29: మూగ,చెవిటి, అంధ, మానసిక వికలాంగ విద్యార్థులకు సదుపాయాల కల్పనలో అధికారులు ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశించారు. పట్టణంలోని ఎస్.ఎం.ఆర్.పి.ఆర్.సి పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన వికలాంగ విద్యార్థులతో మమేకమయ్యారు. ఇక్కడి పాఠశాలలో సదుపాయాలను నిర్వాహకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వై.విష్ణు మాట్లాడుతూ పాఠశాలలో కనీస సదుపాయాల కల్పనకు సంబంధించి నాలుగు లక్షల రూపాయల మేర గ్రాంటు నిలచిపోయిందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రతిపాదనలు తనకు పంపాలని, తక్షణమే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పాఠశాలలో విద్యార్ధులకు దాతల నుంచి భోజన సహాయం అందుతుందన్నారు. తమ వారి జ్ఞాపకార్ధం దాతలు ఇచ్చే నిధులతో విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. దీంతో స్పందించిన కలెక్టర్ రెండు రోజుల పాటు విద్యార్థుల భోజనాలకు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో రెసిడెంట్ బోర్డు సభ్యులు ఎం.్భవాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.