విశాఖపట్నం, నవంబర్ 29: విశాఖకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. ఇప్పటికే సుమారు 50 వేల కోట్ల రూపాయలతో వివిధ పరిశ్రమలు విశాఖ జిల్లాకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజ్‌కి కార్ల పరిశ్రమ విశాఖ నగరానికి రాబోతోంది. వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైన సమయంలో ఆ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో కంపెనీ కాస్తా వెనక్కు వెళ్లిపోయింది. తాజాగా మారుతి సుజ్‌కి కంపెనీ విశాఖ నగరంలో కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు యోచిస్తోంది. ఇటీవల ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (ఆపరేషన్స్) ఎస్‌వై సిద్ధేష్ ఇక్కడికి వచ్చారు. గీతం యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరై, ఆ తరువాత నగరంలో కాసేపు పర్యటించారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ నగరం నుంచి వాయు, రోడ్డు, జల మార్గాల ద్వారా అనేక దేశాలకు కనెక్టివిటీ ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన కార్లను ఎగుమతి చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా కావల్సినంత ప్రభుత్వ స్థలం కూడా ఉంది. ఇప్పటికే ఎస్‌ఇజెడ్‌లను ఏర్పాటు చేసి, కొత్తగా వస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ఒక్క విద్యుత్ సమస్య తప్ప, మరే ఇబ్బందులూ పరిశ్రమలకు ఉండని పరిస్థితి ఇక్కడుంది. దీంతో సిఇఓ సిద్ధేష్ కూడా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే, బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పెట్టుబడులు, వౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మారుతు సుజ్‌కి యాజమాన్యానికి లేఖ రాశారు. విశాఖలో యూనిట్ నెలకొల్పాలనుకుంటే, అందుకు తగిన స్థలం, వౌలిక సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై మంత్రి గంటా ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ త్వరలో తాను మారుతి యాజమాన్యంతో మాట్లాడతానని అన్నారు. విశాఖకు కార్ల పరిశ్రమ వస్తే, జిల్లా ముఖ చిత్రమే మారిపోతోందని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలియచేశారు.
ఎసిబికి చిక్కిన శానిటరీ ఇన్‌స్పెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 29: జివిఎంసిలో కోకొల్లలుగా ఉన్న లంచావతారాల్లో ఒకరు గురువారం ఎసిబికి చిక్కాడు. 34వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ కె.సీతారాం ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ యజమాని నుంచి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి అతనిని పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ అందించిన వివరాల ప్రకారం స్థానిక 34వ వార్డులో వై.బి.రవికుమార్, ఎస్‌కెఎంఎల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఈ దుకాణానికి సంబంధించిన లైసెన్స్ పీజ్‌ను అధిక మొత్తంలో పెంచాల్సి ఉంటుందని శానిటరీ ఇన్‌స్పెక్టర్ నిత్యం రవికుమార్‌ను హెచ్చరిస్తున్నాడు. అంతే కాకుండా ఇతరత్రా కేసులు కూడా నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పుకొస్తున్నాడు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే, ఐదు వేల రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. సీతారాం తీరుతో విసిగిపోయిన రవికుమార్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వార్డులోని ఓ అద్దె భవనంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ సీతారాం ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలో రవికుమార్ 5000 రూపాయలు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో సిఐలు రామకృష్ణ, జంగయ్య, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ రైల్వే సమస్యలపై సానుకూల స్పందన
* పరిష్కారానికి మంత్రి హామీ
* వచ్చేనెల 15న షిరిడి, చెన్నై రైళ్లకు పచ్చజెండా
విశాఖపట్నం, నవంబర్ 29: వాల్తేరు డివిజన్‌లో రైల్వే సమస్యలపై అమీతుమీ తేల్చుకునేందుకు వెళ్ళిన విశాఖ రైల్వేజోన్ సాధనసమితికి రైల్వేశాఖ మంత్రి ప్రసన్నకుమార్ బన్సాల్ నుంచి సానుకూల హామీ లభించింది. విశాఖ కేంద్రంగా ‘ప్రత్యేక రైల్వేజోన్’ ఏర్పాటు, దువ్వాడ మీదుగా నడుస్తోన్న రైళ్ళను విశాఖకు తీసుకురావడం, అంతర్జాతీయ గుర్తింపు కలిగిన విశాఖ నగరం నుంచి దేశ నలుమూలలకు వెళ్ళేందుకు వీలుగా కొత్త రైళ్ళను ప్రవేశపెట్టాలని చేసిన విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి సారధ్యంలో సాధన సమితి ప్రతినిధులు గురువారం దేశరాజధానిలో రైల్వేశాఖ మంత్రిని, సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని వేర్వేరుగా కలిసి రైల్వే సమస్యలు సుదీర్ఘంగా చర్చించారు. రైల్వే ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే యువత ప్రస్తుతం భువనేశ్వర్ వెళ్లాల్సి వస్తోందని, అక్కడ వీరికి అక్కడ కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆర్‌ర్‌బి కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని, విశాఖ రైల్వేస్టేషన్‌లో అవసరమైన ప్లాట్‌ఫారాలు లేవన్న నెపంతో పలు రైళ్ళు విశాఖకు రాకుండా దుర్వాడ మీదుగా తరలివెళ్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ రైల్వేస్టేషన్‌లో అవసరానికి సరిపడే ప్లాట్‌ఫారాలు ఉన్నాయని, మళ్ళింపు మార్గంలో వెళ్తున్న రైళ్ళను విశాఖకు తీసుకురావాలని రైల్వేమంత్రిని కోరారు. గూడ్స్ రైళ్ళ రాకపోకలఫలితంగా విశాఖపట్నానికి వచ్చే రైళ్ళను దువ్వాడ, గోపాలప్నం స్టేషన్‌ల్లో నిలుపుతున్నారని, తద్వారా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని, దీని నివారణకు గోపాలపట్నం, విశాఖపట్నంల మధ్య మూడవ రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. విశాఖ మీదుగా వెళ్తున్న చెన్నై, సికింద్రాబాద్, బెంగుళూరు రైళ్ళను భువనేశ్వర్‌కు పొడిగించడం వలన స్థానిక ప్రయాణికులకు తగినన్ని సీట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. త్వరలో పట్టాలెక్కనున్న షిరిడి, చెన్నై రైళ్ళకు విశాఖ ప్రజల అవసరాల దృష్ట్యా వారంలో మూడు రోజులు నడపాలని, తిరుపతి వెళ్ళే ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ పద్ధతిలో మరో సూపర్‌పాస్ట్‌ను ప్రవేశపెట్టాలని కోరారు. అలాగే ఢిల్లీకి పరిమిత స్టాప్‌లతో నూతనంగా సూపర్‌పాస్ట్ రైలును కేటాయించాలని, వారణాసి, పాట్నాలకు నేరుగా విశాఖ నుండి రైళ్ళను నడపాలని, అరుకకు అదనంగా మరో పాసింజర్ రైలును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విశాఖ,సికింద్రాబాద్‌ల మధ్య నడుస్తున్న గరీబ్థ్‌క్రు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా అదనపు బోగీలను పెంచాలని, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు కొత్త బోగీలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటికి సానుకూలంగా స్పందించిన మంత్రి బన్సాల్ తగిన హామీ ఇచ్చారని సాధన సమితి కన్వీనర్ జెవి సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు చెరువు రామకోటయ్య (బిజెపి), తోట రాజీవ్ (వైఎస్సార్‌సిపి), అనురాగ్ కేజ్రివాల్ (లోక్‌సత్తా) తదితరులు పాల్గొన్నారు.
వచ్చేనెల 15 షిరిడి, చెన్నై రైళ్ళకు పచ్చజెండా
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చెన్నై, షిరిడి రైళ్ళు వచ్చేనెల 15వ తేదీన విశాఖ నుంచి బయలుదేరి వెళ్తాయి. వీటిని రైల్వే సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆ రోజు సహాయమంత్రిని సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరిస్తారు. రైల్వేపరంగా విశాఖ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరోసారి ఆయన దృష్టికి తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తామని సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
* మంత్రి బాలరాజు
విశాఖపట్నం, నవంబర్ 29: సంక్షేమ పథకాలను అమలు చేయడం, తగిన అభివృద్ధిని సాధించడమనేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం వలనే సాధ్యపడుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి పసులులేటి బాలరాజు అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం అసెంబ్లీ హాలులో గురువారం నిర్వహించిన ఆరవ విడత భూ పంపిణీలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు హక్కుపత్రాలను పంపణీ చేశారు. జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో 6.5 లక్షల ఎకరాల రెవెన్యూ భొములను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిందన్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే 82 వేల ఎకరాల భూములను పంచిందని, ఇపుడు ఆరవ విడతలో భాగంగా 4,500 మందికి వీటిని పంచుతున్నామన్నారు. మహిళల పేరుతోనే హక్కుపత్రాలనిస్తున్నామని, వీరితై దుబారా, దుర్వినియోగం చేయరన్నారు. మహిళాసాధికారితలో భాగంగా ఇందిరమ్మగృహాలు, భూ పంపిణీ, పావలావడ్డీ రుణాలు వంటివి పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. ఇవి కాకుండా రూపాయి కిలోబియ్యం, లక్ష వరకు వడ్డీలేని రుణాలు, దీపం కనెక్షన్లు వంటి అందజేస్తున్నామన్నారు. వ్యవసాయం, రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వంపై కొందరు అదేపనిగా విమర్శలు చేయడం తగదన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాలు ఇది దండగా, లాభాలుండవంటూ చెప్పడం దురదృష్టకరమని, మెట్ట భూములు సైతం సస్యశ్యామలం చేసేందుకు తోడ్పడిన జలయజ్ఞాన్ని దనయజ్ఞంగా విమర్శించడం అవివేకమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెనుకబడిన రాయలసీమ ప్రాంతాల్లో ఆరు వేల కోట్లు ఖర్చు చేసి ఆరు లక్షల ఎకరాలకు నీటిని నాలుగున్నర ఏళ్ళల్లో ఇవ్వగలిగారన్నారు. ఈ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. రైతాంగం సమస్యలు, వ్యవసాయ అభివృద్ధి ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు హామీనిచ్చే హక్కు, బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం, రుణాలు రీ షెడ్యూల్, వ్యవసాయ రుణాలకు ఈ హక్కుపత్రాలు ద్వారా కల్పిస్తున్నామన్నారు. అటవీ భూములకు సంబంధించి 14 లక్షల ఎకరాలు 1.67 కుటుంబాలకు వ్యక్తిగత పంటాలులుగా గిరిజనులకు ఈ ప్రభుత్వం అందివ్వగలిగిందన్నారు. రాష్ట్ర ఓడరేవులు,పెట్టుబడిదారుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ పథకంలోనైనా మహిళలకే ప్రాధాన్యతనిస్తున్న ఈ ప్రభుత్వం భూ పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుందన్నారు. ఆరో విడత భూ పంపిణీని రాష్ట్రంలో అనంతపురం పుట్టపర్తి ప్రాంతంలో ప్రారంభించామని, ఇక్కడ కాస్త జాప్యం జరిగిందని, అయితే 30లోపు పూర్తిచేయాలనే ఆలోచనతో దీనిని విజయవంతంగా నిర్వహించామన్నారు. రైతుకు ప్రత్యేక హోదా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. టైటిల్‌డీడ్, ఎఫ్‌ఎంబి, పంచనామా, పట్టాదారు పాస్ పుస్తకం వంటిని అందజేస్తున్నామన్నారు. దేశంలో మరే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఈ రాష్ట్రంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. భీమునిపట్నం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) మాట్లాడుతూ దళితులు, మైనారిటీలు భూమి హక్కు కలిగి ఉండాలనే లక్ష్యంతో జమీందరా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జమీందారీ విధానాన్ని రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటివి ప్రవేశపెట్టారన్నారు. భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల్లో ఇదే విధానం అమలయ్యే విధంగా చొరవ చూపాలన్నారు. సెజ్‌ల పేరుతో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దీనిని అమలు చేయాలన్నారు. చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌రాజు మాట్లాడుతూ అసైన్డ్‌మెంట్ కమిటీని నియమించిన ఏడాది తరువాత భూ పంపిణీ చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో లబ్ధిదారులకు సమస్యలు రాకుండా చూడాలన్నారు. సర్వేయర్లు, సమయం లేక అర్హులైన లబ్ధిదారులకు తగిన విధంగా న్యాయం జరగటంలేదని, వారంలో ఒకరోజు స్పెషల్ ఆఫీసర్లను నియమించి భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు. కలెక్టర్ వి.శేషాద్రి మాట్లాడుతూ ఐదు విడతల్లో 82 వేల ఎకరాలు 48,500 మందికి పంపిణీ చేయగా ఇపుడు 4,186 ఎకరాలను 3,530 మందికి పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ పథకానికి ఇందిర జలప్రభ, నీటిపారుదల, పండ్లతోట పధకాలను అనుసంధానం చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి జెసి లేదా అదనపుజెసి స్థాయిలో నియమించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డిఆర్‌ఓ వెంకటేశ్వరరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. తొలుత హుకుంపేట, నాతవరం మండలాలకు చెందిన గంగభవాని, బాకురు సోమేశ్‌కుమారి,జానకమ్మ, చిన్నయమ్మ, చిట్టిమ్మలతోపాటు మరికొన్ని మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రులు గంటా, బాలరాజు చేతులమీదుగా వీటిని అందజేశారు.
రిజర్వేషన్ ప్రయాణికులకు గుర్తింపుకార్డులు
* 1వ తేదీ నుంచి తప్పనిసరి చేసిన రైల్వే
విశాఖపట్నం, నవంబర్ 29: రైల్వే రిజర్వేషన్ టికెట్ తీసుకుని ప్రయాణించే ప్రతిఒక్కరు ఇక నుంచి కచ్చితంగా తమ వెంట గుర్తింపుకార్డును పెట్టుకోవాల్సిందే. టికెట్‌తోపాటు దీనిని చూపాలి. లేదంటే జరిమానా విదిస్తారు. ఈ విధానం డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని భారతీయరైల్వే నిర్ణయించింది. దీనిలోభాగంగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే ఒక ప్రకటన చేయగా, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో దీనిని అమలు చేయనున్నారు. పది గుర్తింపుకార్డులో ఏదైనా ఒక దానిని చూపితే సరిపోతుందని అంటున్న రైల్వే ఈ ఏవేమీ ఉండానే దానిపై స్పష్టతలేదు. పైగా ఎటువంటి ముందస్తు ప్రచారం లేకుండాను, ప్రయాణికులకు అవగాహన కల్పించకుండానే ఈ విధానాన్ని శనివారం నుంచి అమలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులకు గుర్తింపుకార్డులు కలిగి ఉండతే అవకాశం ఉందని, అదే గృహిణులు, చిన్నపిల్లల విషయంలో పరిస్థితి ఏమీటంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తక్షణమే అమల్లోకి తీసుకువస్తూ, ఇవి లేనివారందరికీ జరిమానా విధిస్తుండం ఏమాత్రం తగదని ప్రయాణికులు చెబుతున్నారు. ఏ తరహా గుర్తింపుకార్డులుండాలనే దానిపై విస్తృత ప్రచారం నిర్వహించి, కాస్తంత గడువు నిర్ణయిస్తే ఆ తరువాత జరిమానా విధించిన సమంజసంగా ఉంటుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
వుడా కార్యదర్శికి రెడ్‌క్రాస్ పతకం
విశాఖపట్నం, నవంబర్ 29: రెడ్‌క్రాస్ సంస్థ తరపున అత్యుత్తమ సేవలతోపాటు నిర్దేశించిన లక్ష్యాల సాధనకుగాను వుడా కార్యదర్శి డాక్టర్ జిసి కిషోర్‌కుమార్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహం నుండి బంగారు పతకం అందుకున్నారు. మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రవీంద్రభారతిలోజరిగిన కార్యక్రమంలో ఈ పతకాన్ని అందుకున్నారు. వుడా కార్యదర్శి రాక ముందు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆర్డీవోగా సేవలందించిన కిషోర్‌కుమార్ ఆ హోదాలో రెడ్‌క్రాస్ సంస్థ లక్ష్యాలు సాధించిన అధికారిగా రాష్టస్థ్రాయిలో ఈ పతకానికి ఎంపికయ్యారు. మంగళవారం అందుకున్న ఈ పతకం ఆరవది కావడం వివేషం. గవర్నర్ పర్యవేక్షణలో నడిచే సేవాసంస్థ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు, నిధుల సమీకరణలో అత్యుత్తమ సేవలకుగాను కిషోర్‌కుమార్ గతంలో ఐదు బంగారు పతకాలు అందుకున్నారు. పిహెచ్‌డితో సహా విద్యాపరంగా 16 డిగ్రీలు పొందిన ఆయన కాకినాడ ఆర్డీవోగా వుండగానే కాకినాడ నగరపాలకసంస్థ పరిదిలో శతశాతం ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల జారీకిగాను భారత ఎన్నికల సంఘం నుండి పురస్కారం అందుకున్నారు. అలాగే తెలుగుభాషా ప్రచారం, అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్ర అధికార భాషా సంఘం నుండి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. రాష్ట్ర గవర్నర్ నుండి ఆరో పతకాన్ని అందుకున్న ఆక్టర్ కిషోర్‌కుమార్‌ను వుడా ఉపాధ్యక్షులు కోన శశిధర్ ప్రత్యేకంగా అభినందించారు.
4న త్రివిధ దళాల విన్యాసాలు
విశాఖపట్నం, నవంబర్ 29: నేవీ మేళాలో భాగంగా ఆర్‌కె బీచ్ వద్ద డిసెంబర్ 4వ తేదీన త్రివిధ దళాల విన్యాసాలు ఉంటాయి. వీటిని ప్రదర్శనకు తరలివచ్చే సందర్శకుల సౌకర్యార్ధం సముద్రతీరంలో తూర్పునౌకాదళం భారీ ఏర్పాట్లు చేపడుతోంది. 1971లో ఇండో-పాక్ యుద్ధంలో శత్రుసైనాన్ని మట్టి కరిపించిన ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ మిసైల్ బోట్ల ప్రదర్శన, వీటి కార్యకలాపలను విన్యాసాల ద్వారా చూపుతారు. ప్రధానంగా త్రివిధ దళాలకు చెందిన కార్యకలాపలు సందర్శకులు అబ్బురపరుస్తాయి. ఆర్‌కె బీచ్‌వద్దనున్న అమరవీరుల స్మారక స్థాపం వద్ద తూర్పునౌకాదళం వైస్-అడ్మిరల్ అనిల్ చోప్రా ఘన నివాళలర్పిస్తారు. ఇక్కడ నుంచి నేవీ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఆపరేషనల్ డిస్‌ప్లేను నిర్వహిస్తారు. నేవీ నౌకలు, సబ్‌మెరైన్లు, ఎయిర్‌క్రాప్ట్ ఇందులో పాల్గొంటాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకె నారాయణన్ ఆ రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. వీటన్నింటికీ తిలకించే వీలుగా సన్నాహాలు చేస్తున్నామని, దీనిని సద్వినియోగపర్చుకోవాల్సిందిగా సంబంధితాధికారులు విజ్ఞప్తి చేశారు. శత్రు నౌకలను అత్యంత వేగంగా దూసుకువచ్చి విచ్చిన్నం చేసే ప్రదర్శన, స్కై డైవింగ్. ల్యాండింగ్ నౌకలు, కార్వెట్స్, క్లోజు రేంజ్ యాంటీ ఎయిర్‌క్రాప్ట్స్ తదితర ఆసక్తికరమైన అంశాలను నిర్వహిస్తారు.
రూ. 15కోట్లతో మెడికల్ షాపుయజమాని పరారీ?
ఐపి నోటీసుకు రంగం సిద్ధం
అనకాపల్లి టౌన్, నవంబర్ 29: చీటిల పేరుతో పెద్దమొత్తంలో వసూలు చేసి అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పలువురు ఘనాపాటీలు ఫలాయనం చిత్తగిస్తున్న విషయం విధితమే. సంబంధిత నేరగాళ్లపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడం. తమ బాకీతీర్చమని నింధితుల వద్దకు వెళితే వారి కుటుంబీకులు దౌర్జన్యాలకు పాల్పడటం వంటి సంఘటనలు ఇటీవల పట్టణంలో చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో పట్టణంలోని ఓ మెడికల్ షాపుయజమాని సుమారు 15కోట్ల రూపాయల వివిధ వర్గాల వారినుండి అప్పులుగా తీసుకుని గత వారం రోజుల నుండి ఎవరికీ అందుబాటులో లేకుండా పలాయనం చిత్తగించారు. సంబంధిత దుకాణం వద్దకు వెళ్లి బాధితులు నింధితుని గూర్చి ఆరాతీస్తే ఆయన తండ్రి తనకేమీ తెలియదని చేతులెత్తేస్తున్నారు. నింధితునికి ఫోన్‌చేస్తే తిరుపతిలో ఉన్నానని, మరోచోట ఉన్నానని పరస్పర భిన్నమైన సమాధానాలు చెబుతుండటంతో బాధితులు కలవరం చెందుతున్నారు. నింధితులంతా తాము మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. ఐపి నోటీసులు ఇచ్చే లక్ష్యంతోనే నింధితుడు కనిపించకుండా తిరుగుతున్నాడని ఆయన సహచరులు చెప్పడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. రోజువారీ వడ్డీలు, నెలవారీ వడ్డీలు చెల్లిస్తామని చెప్పి ప్రతీ ఒక్కరినుండి లక్ష నుండి పదిలక్షల రూపాయల వరకు అప్పులు తీసుకుని పరారయ్యారు. ఈ విధంగా దాదాపుగా వందమంది నుండి 15కోట్ల రూపాయల వరకు వసూలు చేసి పలాయనం చిత్తగించిన వ్యక్తిపై పట్టణంలో పెద్ద చర్చనీయాంశమవుతుంది. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందకు వెనుకాడుతున్నారు.
మున్సిపల్ ఖాళీస్థలాల్లో
హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలి
మున్సిపల్ అధికారులకు మంత్రి గంటా ఆదేశాలు
అనకాపల్లి టౌన్, నవంబర్ 29: మున్సిపాల్టీకి సంబంధించిన ఖాళీస్థలాలు ఎక్కడున్నా వాటిలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తక్షణం ఏర్పాటు చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2010వ సంవత్సరంలో పనులు ఇప్పటివరకు ఎందుకు జరగలేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి అధికారులు కాంట్రాక్టర్లెవ్వరూ ఆ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆయనకు తెలియజేసారు. దీనికి ఆయన స్పందిస్తూ ఇప్పటివరకు నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. పట్టణంలో గల వివిధ పార్కుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పై అంతస్తులో నూతన భవన నిర్మాణానికి లోడ్ బెండింగ్ తనిఖీచేయించారా అని అధికారులను అడిగారు. వుడా అధికారులు వచ్చి తనిఖీచేసి వెళ్లారని వారినుండి రిపోర్టు రావాల్సివుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వేల్పులవీధి కళ్యాణ మండపం నిర్మాణ పనులు ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయాయని దానికి మూడులక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందని నిర్మాణ పనులు ఎందుకు చేపట్టలేదని అడగగా దానికి అధికారులు పై అంతస్తులో స్లాబ్‌వేయడానికి పదిలక్షల రూపాయలు ఖర్చవుతుందని అంతడబ్బు ఖర్చుపెట్టాల్సినవసరం మున్సిపాల్టీకి లేదని ఎందుకంటే అది ప్రైవేటు భవనమని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు ఎందుకు మంజూరు చేసారని ప్రశ్నించగా అప్పటి అధికారుల నిర్వాకానికి ఇది నిదర్శనమన్నారు. 2010లో పూల్‌బాగ్, పూడిమడక రోడ్డు విస్తరణపనులు ఎందుకు జరగలేదని ఆయన అధికారులను నిలదీసారు. ప్రతీసోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే ఫిర్యాదులకు స్పందిస్తున్నారా లేదా అని ప్రశ్నించగా అధికారులు ఆ లిస్టును మంత్రికి చూపగా ఆ లిస్టులో ఉన్న నెంబర్లకు ఫోన్‌చేసి మున్సిపల్ అధికారులు మీరిచ్చిన ఫిర్యాదులకు స్పందించి తక్షణ చర్యలు చేపట్టారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులు సమాధానంగా మున్సిపల్ అధికారులు స్పందించి పనులు చేపట్టారని చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషలాఫీసర్ పివిఎల్ నారాయణ, మున్సిపల్ కమీషనర్ మురళీదరరావు, తహశీల్దార్ పాండురంగారెడ్డి, ఆరోగ్య శాఖాధికారి నాగేశ్వరరావు, డిపివో తులసీరావు, మేనేజర్ శేషాద్రి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
గోపాలన్‌కు నేదునూరి కృష్ణమూర్తి పురస్కారం
ఆరిలోవ, నవంబర్ 29: దేశ విదేశాలలో ఖ్యాతినార్జించిన చెన్నైకి చెందిన ప్రఖ్యాత గాత్ర సంగీత కళాకారుడు నైవేలి శంతనగోపాలన్‌ను విశాఖ మ్యూజిక్ అకాడరీ చీఫ్ పేట్రన్ డాక్టర్ సూరపనేని విజయ్‌కుమార్, అకాడమీ అధ్యక్షుడు ఎన్‌ఎస్‌టిఎల్ డైరెక్టర్ ఎస్‌వి.రంగారాజన్ పూలమాల, శాలువ, ప్రజ్ఞాపన పత్రంతో ఘనంగా సత్కరించి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి పురస్కారం అందజేసారు. ఈ కార్యక్రమంల కార్యదర్శి ఎంఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. విశాఖ మ్యూజిక్ అకాడమీ 43వ వార్షిక సంగీత, నృత్యోత్సవాల్లో నాల్గవరోజు గురువారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో శంతన గోపాలన్‌కు నేదునూరి పురస్కార ప్రదానం, గోపాలన్ గాత్రకచేరి కార్యక్రమాలు జరిగాయి.
అమృతమయం గోపాలన్ గానం
అమృతమయ సంగీత గానంతో వివిధ సత్కారాలు, సన్మానాలు పొంది పురస్కారాలు అందుకున్న నైవేలి శంతనగోపాలన్ కృతులు, కీర్తనతలో సంగీతప్రియులను అలరించారు. పేరి శ్రీరామమూర్తి వయోలిన్‌పై. జి.గణపతిరామన్ మృదంగంపై. చంద్రశేఖర్‌శర్మ ఘటంపై చక్కని లయ వాద్య సహకారం దించి ఆహూతుల కరతాళ ధ్వనులను అందుకున్నారు. తన గానామృతంతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసే పద్మవిభూషణ్, సంగీతరత్న డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గోపాలన్ కీర్తనలను ఆసక్తిగా విని శ్రోతలకు కనువిందు చేసారు.