తోట్లవల్లూరు, నవంబర్ 29: కార్తీక స్నానానికి వెళ్ళి కెఇబి కెనాల్‌లో భర్త గల్లంతవ్వగా భార్య ప్రాణాలతో బయటపడిన సంఘటన మండలంలోని చాగంటిపాడు శివారు ఆళ్ళవారిపాలెంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్ళవారిపాలెంలో మానేపల్లి నాగేశ్వరరావు(45), భార్య శేషారత్నం (చంటి) వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. కార్తీక మాసం ప్రారంభమైన నాటి నుంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ప్రతి రోజు వేకువ జామున సమీపంలోని కెఇబి కెనాల్‌లో భార్యభర్తలిద్దరూ పుణ్య స్నానం చేసి వచ్చి ఇంటి వద్ద పూజలు చేసుకుంటున్నారు. అదేవిధంగా గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో భార్యభర్తలు కెఇబి కెనాల్ వద్దకు వెళ్ళి కాలిబాట వంతెన పక్కన గల రేవులో స్నానం చేస్తుండగా ఇద్దరు మహిళలు బట్టలు ఉతికేందుకు రేవుకు వచ్చారు. బట్టలు ఉతికే నీళ్ళు మీద పడతాయని కొంచెం లోపలికి జరగమని ఆ మహిళలు కోరడంతో భర్త నాగేశ్వరరావు, భార్య శేషారత్నం రెండడుగులు లోపలికి దిగారు. దీంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ఒరవడికి భర్త కాలువలోకి జారిపోయాడు. భర్త మునిగిపోతుంటే రక్షిద్దామని భార్య దిగటంతో ఆమె కూడా కాలువలో మునిగిపోతూ ఆర్తనాదాలు చేసింది. సుమారు 20 మీటర్ల వరకు కాలువలో భార్యభర్తలిద్దరు కొట్టుకుపోతుండగా గమనించిన మేడూరు అంజయ్య, చాగంటి సాంబిరెడ్డి(బారు) కాలువలోకి దూకి భార్య శేషారత్నాన్ని రక్షించారు. భర్త నాగేశ్వరరావు మాత్రం మునిగి గల్లంతయ్యాడు. బాగా నీరు తాగి అపస్మారక స్థితిలో ఉన్న శేషారత్నంను 108లో విజయవాడ ఆసుప్రతికి తరలించారు. గల్లంతైన నాగేశ్వరరావు కోసం బంధువులు, గ్రామస్థులు ఈతగాళ్ళ సాయంతో కాలువలో గాలిస్తున్నారు. కాగా కాల్వలో రేవు సైడు గోడ విరిగిపోయి ఉండటం వల్లే నాగేశ్వరరావు గల్లంతయ్యాడని గ్రామస్థులు అంటున్నారు.
రేపటి నుండి కూచిపూడిలో తానీషా యువ నాట్యోత్సవ్-2012
కూచిపూడి, నవంబర్ 29: కూచిపూడి కళా ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న తానీషా యువ నాట్యోత్సవాలకు నాట్య క్షేత్రం కూచిపూడి సిద్ధమైంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి సంయుక్త సహకారంతో డిసెంబరు 1వ తేదీ నుండి మూడు రోజులపాటు కూచిపూడి అగ్రహారంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళా వేదికపై హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, ధర్మవరం, వరంగల్, బెంగుళూరు, కేరళ రాష్ట్రాల నుండే కాకుండా రష్యా, అమెరికా దేశాల నుండి పలువురు కళాకారులు శ్రీ సిద్ధేంద్రయోగి నడయాడిన నాట్య క్షేత్రంలో తమ గజ్జలు మోగించి నాట్యాచార్యుల ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి ఆశీర్వాదాలు పొందేందుకు సొంత ఖర్చులతో తరలిరావటం విశేషం. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నాట్యోత్సవాలను 1వ తేదీన కీ.శే పద్మశ్రీ డా. వేదాంతం సత్యన్నారాయణ శర్మ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, ప్రముఖ సంఘ సేవకులు బి గోపాలకృష్ణ సాయికి సత్కారం, రష్యాకి చెందిన భరత నాట్య కళాకారిణి గన్నా స్మిర్నోవాకు నాట్య భారతి బిరుదు ఇస్తున్నట్లు కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా గన్నా స్పిర్నోవా భరత నాట్యం, బెంగుళూరుకు చెందిన ప్రతీక్షాకాశీ, అమెరికాకు చెందిన దేవిక, చిన్మయి, ధర్మవరానికి చెందిన పూజల కూచిపూడి నాట్య ఏకపాత్ర కేళికలు. 2వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఎం కామేశ్వరి శిష్యబృందం, పసుమర్తి కాశీవిశ్వనాధ్, విశాఖపట్నంకు చెందిన ఎ ఆదిత్య బుల్లిబ్రహ్మం, రాజమండ్రికి చెందిన వై లలితా సింధూరి, విజయవాడకు చెందిన సిహెచ్ అజయ్ కుమార్‌ల కూచిపూడి నాట్యాలు. 3వ తేదీన హైదరాబాద్‌కు చెందిన లాస్య ప్రణతి, బిజీనా, పసుమర్తి మృత్యుంజయ శర్మ, వరంగల్‌కు చెందిన వెంపటి శ్రావణి, కేరళకు చెందిన శ్రీలక్ష్మి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్‌వి రమణమూర్తి, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వి వెంకయ్య, రిజిస్టార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, చల్లపల్లి కెసిపి సిఇఓ జి వెంకటేశ్వరరావు, పామర్రు ఎమ్మెల్యే డివై దాస్ తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు కేశవ ప్రసాద్ తెలిపారు.
ఘంటాలమ్మ చెరువులో గుర్తు తెలియని మృతదేహం
మచిలీపట్నం (కోనేరుసెంటరు), నవంబర్ 29: స్థానిక జలాల్‌పేట ఘంటాలమ్మ చెరువులో గురువారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్థానికులు విఆర్‌ఓ ద్వాసనపూడి చలమయ్యకు తెలుపగా ఆయన ఇనకుదురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇనకుదురు ఎస్‌ఐ గంగాధరరావు సంఘటన ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. వివరాల ప్రకారం మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాల ఉంటుందని, మాసిన గడ్డం, నలుపు, ఆకుపచ్చ రంగు టీషర్టు, బాబే డయింగ్ నలుపు, బ్రౌన్ లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగాధర్ తెలిపారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద సిపిఎం నాయకుల ధర్నా
కలిదిండి, నవంబర్ 29: పెంచిన విద్యుత్ సర్‌చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల నాయకులు మూలలంక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఎపిఇఆర్‌సి వారు ప్రభుత్వ ప్రోత్సాహంతో సర్‌చార్జీల పేరున ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేశారన్నారు. అనంతరం సిపిఎం నాయకులు మూలలంక పంచాయతీ కార్యాలయం వద్ద విద్యుత్ బిల్లులను తగలపెట్టారు. ఈ ధర్నాలో సిపిఎం డివిజనల్ కమిటీ సభ్యులు పైలా వెంకట రామకృష్ణ, రామనాధం మాణిక్యాలరావు, విక్టర్‌పాల్, వీరవల్లి భాస్కరరావు, ఘంటా సోమయ్య, బోగేశ్వరరావు, పుష్పమూర్తి పాల్గొన్నారు.
రోటరీ, మణిపాల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 29: వ్యాధులు ముదరక ముందే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని జిల్లా ఆసుపత్రి సర్వీసుల కో-ఆర్డినేటర్ డా. పరసా రామారావు అన్నారు. స్థానిక రోటరీ క్లబ్, విజయవాడ మణిపాల్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఇంగ్లీష్‌పాలెం షాదీఖానాలో గురువారం జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు తరచుగా వైద్యుల సలహాలను పాటించాలన్నారు. యురాలజీ విభాగాన్ని డా. వెంకటేశ్వరరెడ్డి, కార్డియాలజీ విభాగాన్ని డా. శివ కోటేశ్, జనరల్ విభాగాన్ని డా. క్రాంతి, స్ర్తిల సంబంధిత వ్యాధుల విభాగాన్ని డా. సితార నిర్వహించారు. సుమారు 600 మంది రోగులను పరీక్షించి 10వేల రూపాయల విలువగల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జనవరి నెలలో విజయవాడ హృద్రోగ నిపుణులు డా. రమేష్ ఆధ్వర్యంలో హృద్రోగ సంబంధమైన వ్యాధుల పరీక్షా శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు పరుచూరి బాబు తెలిపారు. రోటరీ సభ్యులు డా. బి ధన్వంతరి ఆచార్య, గఫార్, ఎంవి సీతాపతిరావు, డా. రావి శ్రీనివాసరావు, పూర్ణ బిందు, అజ్మతున్నీసా, సాయి ప్రసాద్, కొండవేటి శ్రీనివాసరావు, పెసల వెంకటేశ్వర్లు తదితరులు సేవాకార్యక్రమాలను పర్యవేక్షించారు.
విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 29: విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించాలని హిందూ కళాశాల పాలకవర్గ కార్యదర్శి దైతా రామచంద్రశాస్ర్తీ అన్నారు. హిందూ కళాశాల ఆడిటోరియంలో గురువారం జరిగిన క్రీడా విజేతల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం నిర్వహించిన యువజనోత్సవాల్లో స్థానిక హిందూ కళాశాల విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. ఈనెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు నిర్వహించిన పలు పోటీలలో హిందూ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. జానపద నృత్యం తప్పెట గుళ్ళు, క్విజ్, స్పాట్ ఫొటోగ్రఫీ పోటీలలో ప్రధమ బహుమతులను కైవసం చేసుకున్నారు. ఫోక్ ఆర్కెస్ట్రా, మూకాభినయం పోటీలలో ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఏకాంక నాటిక ప్రదర్శనలో తృతీయ స్థానాన్ని గెలుచుకున్నారు. విజేతలను, విద్యార్థులను ప్రోత్సహించి విజయపధంలో నడిపిన కల్చరల్ కో-ఆర్డినేటర్ ఎస్ లలితలను అభినందించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన సిహెచ్ నాగరాజు, జివికె మూర్తిలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి ఉషారాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాజ్యాధికారమే లక్ష్యంగా బిసిలు ఉద్యమించాలి
చల్లపల్లి, నవంబర్ 29: రాజ్యాధికారమే లక్ష్యంగా బలహీన వర్గాలు సమన్వయంతో ముందుకు సాగాలని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ పిలుపునిచ్చారు. ఈనెల 20న జగ్గయ్యపేటలో ప్రారంభమైన బిసి రాజ్యాధికార యాత్ర గురువారం రాత్రికి చల్లపల్లికి చేరింది. ఈ సందర్భంగా ప్రధాన సెంటరులో జిల్లా అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ 122 సార్లు వివిధ అంశాలపై రాజ్యాంగ సవరణ చేసిన ప్రభుత్వం జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బిసిల కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించకపోవటం గర్హనీయమన్నారు. బలహీన వర్గాలకు జీవనాధారమైన చేతి వృత్తులు ప్రపంచీకరణ పేరుతో నాశనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం ధారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులలో బిసి ఉద్యోగులకు పదోన్నతికి రిజర్వేషన్లు అమలు చేయకపోవడం అసంఖ్యాకంగా ఉన్న బిసి వర్గాలను మోసగించటమేనని దుయ్యబట్టారు. బిసిలు ఐఖ్యతతో సమస్యల సాధనకు కృషి చేయాలని కోరారు. బిసి కళామండలి రాష్ట్ర కన్వీనర్ రామలింగం బృందం ఆలపించిన చైతన్య గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నల్గొండ ప్రతినిధి కిరణ్‌తో పాటు స్థానిక నేతలు పాల్గొని కర్రి వేణుమాధవ్‌ను పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
స్కూటర్ డిక్కీలోని 1.90 క్షలు అపహరణ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 29: బ్యాంక్ నుండి డబ్బు డ్రా చేసుకుని వెళుతుండగా స్కూటర్ డిక్కీలో ఉన్న సొమ్మును గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక చిలకలపూడి శ్రీ కృష్ణనగర్‌కు చెందిన నాగులపాటి జలంధరరావు జిల్లా కోర్టు సెంటర్‌లోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో గురువారం లక్షా 90 వేల రూపాయలు డ్రా చేసుకుని స్కూటర్ డిక్కీలో పెట్టుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయానికి వెళ్ళాడు. స్కూటర్ పార్క్ చేసి కార్యాలయంలో పనిచూసుకుని వచ్చేసరికి డిక్కీ తెరిచి ఉంది. అందులో ఉన్న లక్షా 90 వేలు కనిపించలేదు. బాధితుని ఫిర్యాదు మేరకు మచిలీపట్నం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోరం పూర్తి కాకపోవడంతో మండల మహిళా సమాఖ్య ఎన్నిక వాయిదా
వత్సవాయి, నవంబర్ 29: మండల మహిళా సమాఖ్య ఎన్నిక మరో దఫా వాయిదా పడింది. గతంలో మండల మహిళా సమాఖ్య ఎన్నిక కోసం నాలుగు సార్లు ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. కాగా కోరం లేకపోవడంతో రెండు మూడు సార్లు వాయిదా పడిన సమావేశం గత సమావేశంలో మాత్రం కోరం ఉండటంతో ఎన్నిక నిర్వహించారు. కానీ ఎన్నికైన అధ్యక్షురాలు పెద్ద ఎత్తున డ్వాక్రా రుణ బకాయిలు ఉండటంతో అర్హత లేదనే ఉద్దేశంతో తొలగించారు. దీనిలో భాగంగా గురువారం మండల మహిళా సమాఖ్య ఎన్నిక నిర్వహించారు. మొత్తం 35మంది విఒలు ఉండగా ఇద్దరికి ఓటు వేసే అర్హత లేకపోవడంతో 33మంది హజరుకావాల్సి ఉంది. కానీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఈ మహిళా సమాఖ్య ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకొని వారికి సంబంధించిన విఒలతో శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న 17మంది విఒలు సమావేశానికి హజరైయ్యారు. కాగా ఎన్నిక నిర్వహించాలంటే కనీసం 22మంది ఉండాలని అప్పుడే ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని జిల్లా సిఆర్‌పి సభ్యులు శిరీష, రాణి తెలిపారు. సాయంత్రం 5గంటల వరకూ కోరం పూర్తికాకపోవడంతో నెల రోజుల్లో మరల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహించాలని సభ్యులతో సంతకాలు తీసుకొని వాయిదా వేశారు. కాగా సమావేశం వాయిదా వేసి ఆటోలో వెళుతున్న సిఆర్‌పిలను టిడిపి అనుకూలంగా వ్యవహరిస్తున్న విఒలు, వారికి సంబంధించిన వారు అడ్డగించి ఎన్నిక నిర్వహించాలని పట్టుబట్టడంతో పాటు వారిపై దురుసుగా వ్యవహరించారు. దాదాపు అరగంట పాటు జడ్‌పి స్కూల్ సెంటర్‌లో సిఆర్‌పిలతో వాదన జరిగింది. ఈ నేపథ్యంలో బందోబస్తుకు వచ్చిన జగ్గయ్యపేట ఎస్‌ఐ రమణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సిఆర్‌పిలను అడ్డుకున్న వారిని హెచ్చరించారు. దీంతో వారు అక్కడ నుండి వెళ్లిపోయారు. వాతావరణం సద్దుమణిగింది.
స్కూల్ కాంప్లెక్స్‌కు ఉపాధ్యాయులు గైర్హాజరు
జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 29: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో ప్రదర్శిస్తున్న అలసత్వంపై విమర్శలు వస్తున్నా వారి వైఖరిలో మార్పురావడం లేదు. గత వారం జిల్లాలోని పరిటాల ప్రభుత్వ పాఠశాలకు ఆలస్యంగా హాజరైన ఉపాధ్యాయులపై సాక్షాత్తు డిఇఒ సస్పెండ్ వేటు వేసిన విషయం విదితమే. గురువారం జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, జగ్గయ్యపేటలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్‌కు గైర్హాజరు అయిన ఉపాధ్యాయులపై ఎంఇఒ ఎల్ చిట్టిబాబు డిఇఒకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. చిల్లకల్లు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించి జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలోని ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ నిర్వహించగా 52మందికి గానూ కేవలం 18మంది మాత్రమే హాజరయ్యారు. జగ్గయ్యపేటలో తెలుగు సబ్జెక్ట్‌పై నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్‌కు 42మందికి గానూ 24మంది హాజరయ్యారని ఎంఇఒ తెలిపారు. స్కూల్ కాంప్లెక్స్‌కు వెళుతున్నట్లుఆయా పాఠశాలల్లో రికార్డులో సంతకాలు చేసిన ఉపాధ్యాయులు సమావేశానికి మాత్రం డుమ్మా కొట్టారు. స్కూల్ కాంప్లెక్స్ జరుగుతున్న చిల్లకల్లు హైస్కూల్‌లోనే నలుగురు ఉపాధ్యాయులకు గానూ ఒక్కరు మాత్రమే హాజరుకావడం ఎంఇఒను నివ్వెర పరిచింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చిల్లకల్లు హైస్కూల్‌లో గురువారం 11మంది ఉపాధ్యాయులు మూకుమ్మడిగా సెలవు పెట్టడం వల్ల తరగతు జరగగ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
కోటిలింగ హరిహర క్షేత్రంలో వైభవంగా ప్రతిష్ఠామహోత్సవాలు
జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 29: మండలంలోని ముక్త్యాల సమీపంలో వేంచేసి ఉన్న శ్రీకోటిలింగ హరిహర మహక్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం వంద ఉపాలయాల్లో నాలుగు ఉపాలయాలకు చెందిన దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్ఠలు జరిగాయి. అనంతేశ్వరుడు, బ్రుగుమహర్షి, కౌశికమూర్తి, శనేశ్వరుడి దేవాలయాల్లో దేవతా విగ్రహ ప్రతిష్ఠలు, కలశ స్థాపనలు జరిగాయి. వీటిని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మధుసూధనరావు, శ్రీనివాస్, వెంకట్రామారావు, గోవిందరాజు తదితరులు సతీసమేతంగా ప్రతిష్ఠలు నిర్వహించారు. ఈ దేవాలయాల్లో శనిగ్రహ దోషం ఉన్న వారు పూజలు జరుపుకునేందుకు శనేశ్వరుడికి ప్రత్యేక ఆలయం నిర్మించినట్లు ఇఒ ధూళిపాళ సుబ్రమణ్యం తెలిపారు. ప్రతిష్ఠా కార్యక్రమాలతో పాటు హోమాలు, యంత్రస్థాపన, పూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను వేదపండితులు యలమంచిలి కృష్ణమూర్తి శర్మ వారి శిష్యబృందంతో పాటు ఆలయ అర్చకులు తేజేంద్రశర్మ, మణికంఠ శర్మ, భానుమూర్తి శర్మ, సత్యానంద శర్మలు భక్తులతో నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా పంచముఖేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి.
తెలుగుభాష ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి
నందిగామ, నవంబర్ 29: తెలుగుభాష ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక డాన్‌బాస్కో ఉన్నత పాఠశాల (బాలికలు) నందు ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని మండల సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో గురువారం తెలుగు వైభవము ప్రదర్శనశాల, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఉన్నం వెంకయ్య, అతిధులుగా ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు, జాతీయ ఉక్కు వినియోగదారుల మండలి సభ్యుడు బొగ్గవరపు శ్రీశైలవాసు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మండల స్థాయి పోటీల విజేతలకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, తెలుగు వైభవం ప్రదర్శన శాలలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎండిఒ నాగార్జున శ్రీనివాస్, ఎంఇఒ కెజడ్‌ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విశేషంగా ఆకట్టుకున్న కార్తీక దీపోత్సవం
జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 29: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం రాత్రి మండలంలో జరిగిన దీప కార్యక్రమాలు భక్తులను కనువిందు చేశాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ పిలుపు మేరకు శ్రీ భవానీ ముక్తేశ్వస్వామి ఆలయ అర్చకులు ముక్త్యాలలో కృష్ణానదికి హరతులు ఇచ్చారు. మొదటిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వందల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. బలుసుపాడు శ్రీగురుథామ్‌లో తాత్వికులు గెంటేల వెంకట రమణ సూచనల మేరకు శివానంద భక్తబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా దీపోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేవతామూర్తులను ఊరేగింపుగా కైలాసగిరికి తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. వంద అడుగుల ఎతె్తైన కొండపైన 20కేజీల కర్పూరం వెలిగించారు. జ్వాలాతోరణం నిర్వహించారు. పౌర్ణమి వెనె్నలలో భక్తులు పాలను సేవించారు.
చిల్లకల్లు వివాహ వేడుకల్లో వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 29: ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కుమారుడు భరత్‌కు చిల్లకల్లు మాజీ సర్పంచ్ ముత్తినేని విజయశేఖర్ కుమార్తె నవ్యతో బుధవారం రాత్రి చిల్లకల్లులో జరిగిన వివాహ వేడుకల్లో అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కతో పాటు కృష్ణా, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను అశీర్వదించారు. హాజరైన వారిలో ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, వేనేపల్లి చంద్రరావు, చండ్ర వెంకట వీరయ్య, బాణావత్ చంద్రావతి, శ్రీరాం రాజగోపాల్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కోనేరు నాగేశ్వరరావు, ఎంఎల్‌సిలు పోట్ల నాగేశ్వరరావు, జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖుల రాకను పురస్కరించుకొని పోలీసులు విస్తృత స్థాయిలో బందోబస్తు నిర్వహించారు.
సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రంలో దళారులదే హవా
* వైఎస్‌ఆర్ సిపి నేతల విమర్శ
నందిగామ, నవంబర్ 29: మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రంలో బయ్యర్ వ్యాపారుల నుండే కొనుగోలు చేస్తున్నారు గానీ రైతుల నుండి కొనుగోలు చేయడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల కన్వీనర్‌లు తాటి రామకృష్ణ, కుక్కల సత్యనారాయణ ప్రసాద్‌లు విమర్శించారు. గురువారం యార్డ్‌లోని సిసిఐ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యార్డ్‌లో పదివేల క్వింటాళ్ల పత్తి గుట్టలుగుట్టలుగా పోసి ఉందన్నారు. బుధవారం ఒక గంట మాత్రమే పత్తి కొనుగోలు చేసి గురువారం కొనుగోళ్లు నిర్వహించలేదన్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని ప్రకటిస్తున్నా కేవలం క్వింటాల్‌కు రూ.3700లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిన కారణంగా రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.4500లతో కొనుగోలు చేయాలని, తడిసిన పత్తిని సైతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం కన్వీనర్ చిలుకూరి బుచ్చిరెడ్డి, కామసాని ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరభాషా మోజులో మాతృభాషను మరవద్దు
ముసునూరు, నవంబర్ 29: రానురాను పరభాషా మోజులో పడి తెలుగును మరిచిపోయే ప్రమాదం ఉందని మన తల్లి బాషను బతికించుకుందామని విద్యార్థినీ, విద్యార్థులు ప్లకార్డులతో గ్రామ పురవీధులలో గురువారం ర్యాలీ నిర్వహించారు. తెలుగు మహాసభల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మండలంలో గత కొన్ని రోజులుగా ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలో తెలుగు ప్రాముఖ్యతను వివరిస్తు సభలను నిర్వహించారు. గురువారం మండల విద్యాశాఖాధికారి టి సాంబశివరావు ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో తెలుగు విశిష్టతను చాటిచెప్పుచూ విద్యార్థినీ, విద్యార్థులు తెలుగు తల్లి, గురుజాడ ఆప్పారావు, కందుకూరి వీరేశలింగం వంటి ఎందరో మహనీయుల వేషధారణలతో పురవీధుల్లో నిర్వహించిన ర్యాలీ గ్రామస్థులను అమితంగా ఆకట్టుకుంది. ముసునూరు మండపం సెంటర్ నుండి బయలు దేరిన ర్యాలీ పోలీస్‌స్టేషన్, హైస్కూల్, తహశీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాల మీదుగా ఏలూరు రోడ్డులో ప్రవేశించి మరల మండపం సెంటర్ వద్ద ముగిసింది. ఈర్యాలీలో భారతీ విద్యానికేతన్ కరస్పాండెంట్ కె శౌరీ, ఎస్‌ఎస్‌ఎన్ స్కూల్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, సెయింట్ యూజీన్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆరోగ్యరాజు, స్థానిక ఎంపిపి, ఎంపియూపి పాఠశాలల ఉపాధాయ్యులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రణాళిక ప్రకారం పనులు చేయకపోతే ఎలా?
*డ్వామా పిడి హనుమానాయక్
నూజివీడు, నవంబర్ 29: ఉపాధిహామీ పనులు చూపించాల్సిన సమయం దగ్గరపడుతున్నా ఇంకా పనులు గుర్తించకపోతే ఎలా అంటూ నూజివీడు క్లష్టర్ పరిధిలోని అధికారులపై డ్వామా పిడి హనుమానాయక్ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయ మీటంగ్ హాల్ నందు గురువారం నూజివీడు క్లష్టర్ పరిధిలోని ఎంపిడిఓలతో పిడి నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఈపనులు చేపట్టేందుకు ఆగస్టులో అనుమతి పొందాల్సి ఉండగా నేటికీ ఆపనులను గుర్తించకపోతే ఎలాగని, త్వరితగతిన పనుల గుర్తింపును పూర్తిచేసి నివేదికను పంపాల్సిందిగా సూచించారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులకు ఇందిరాకాంతి పథం వేలల్లో లబ్ధిదారులను గుర్తిస్తే వీరు వందల్లో కూడా పనులు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతను అధికమించి ఉపాధిహామీ పనులను త్వరితంగా చేసుకునేందుకు సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. ఒక్కో సిస్టమ్‌కు రూ.1.60 వేలు ఖర్చవుతుందని వివరించారు. పనులకు ఆటంకం లేకుండా చూడాలని, ఒక్కో చెరువులో 100మందికి 20, 30 రోజులు పని ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమగ్ర భూఅభివృద్ది పథకంలో ఎన్ని బ్లాక్‌లో పనులు గుర్తించారని తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
మినీ జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలు...
చాంపియన్స్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 29: స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న చెరుకూరి లెనిన్ ఓల్గా మెమోరియల్ 5వ మినీ జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలు గురువారంతో ముగిశాయి. రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో టీం, వ్యక్తిగత చాంపియన్లుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ జట్లు నిలిచాయి. అనంతరం జరిగిన బహుమతీ ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పి రామకృష్ణ, ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి జివి రామారావులు పాల్గొని విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఆర్చరీ సంఘ సంయుక్త కార్యదర్శి విద్యార్థి, కృష్ణాజిల్లా ఆర్చరీ సంఘ అధ్యక్షుడు వి రామకృష్ణ, కార్య నిర్వాహక కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంపౌండ్ వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్ బాలుర విభాగంలో అమిత్‌కుమార్ (జార్ఖండ్), తనీష్‌లూల్ల (మహారాష్ట్ర), ఎ మోహనకృష్ణ (ఆంధ్రప్రదేశ్)లు మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల విభాగంలో కె జోత్స్న (ఆంధ్రప్రదేశ్), పి గీతికలక్ష్మి (ఆంధ్రప్రదేశ్), మేఘ అగర్వాల్ (మహారాష్ట్ర)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు. రికర్వ్ వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్ బాలుర విభాగంలో జి ఛుయ్‌ఛుయ్ (మణిపూర్), ప్రథమ స్థానం, కమల్ కిషోర్ (జార్ఖండ్) ద్వితీయ స్థానం, బిక్లెష్ (జార్ఖండ్) తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో ముష్కన్, అనీహషా, ఉన్నతి (మహారాష్ట్ర)లు మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నారు. రికర్వ్ టీం బాలుర విభాగంలో జార్ఖండ్ ప్రథమ స్థానం, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానం, మహారాష్ట్ర తృతీయ స్థానం సాధించారు. బాలికల విభాగంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌లు మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. కాంపౌండ్ టీం బాలుర విభాగంలో జార్ఖండ్ ప్రథమ స్థానం, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానం, మహారాష్ట్ర తృతీయ స్థానం సాధించగా బాలికల విభాగంలో మహారాష్ట్ర ప్రథమ స్థానం, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానం, జార్ఖండ్ తృతీయ స్థానం దక్కించుకున్నాయి.
వర్తకులకు వైఎస్‌ఆర్‌సిపి కొండంత అండ
* అర్బన్ కన్వీనర్ జలీల్ ఖాన్
ఇంద్రకీలాద్రి, నవంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిపుష్టికి మూలస్తంభాలుగా ఉండే వర్తకులకు అన్నివిధాలుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా ఉంటుందని ఆ పార్టీ అర్బన్ కన్వీనర్ జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిజాయితీగా వివిధ రకాలైన వ్యాపారాలు చేసుకునే వర్తకులకు కిరణ్‌కుమార్ సర్కార్ ఇప్పటివరకు ఎటువంటి ప్రయోజకరమైన పథకాలను చేపట్టలేదని ఆయన అన్నారు. గడప గడపకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ఉదయం పాతబస్తీ సామారంగ్‌చౌక్ సెంటర్ నుండి ప్రారంభమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తకులపై రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని పన్నులు విధించి, వారి నెత్తిపై భారాలు వేసిందన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు రాంపిళ్ళ శ్రీనివాసరావు, కెనడి, వాణిజ్యసెల్ అర్బన్ కన్వీనర్ కొణిజేటి రమేష్, స్థానిక డివిజన్ కన్వీనర్ మనోజ్‌కొఠారీ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో వర్తకులు సుఖంగా ఉన్నారని, ఆయన మరణంతోనే వర్తకులకు కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. అప్రకటిత కరెంట్ కోత కారణంగా చిన్నపాటి వ్యాపారాలన్ని మూతపడే స్థితికి చేరుకున్నాయన్నారు. ముఖ్యంగా వస్త్ర వ్యాపారస్తులపై వ్యాట్‌ను వేసి రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని వారు నిప్పులు చెరిగారు. పార్టీ మహిళ కన్వీనర్ వై సునీత, డివిజన్ కన్వీనర్లు ఎం రాజకుమారి, పీతా మోహనరావు, పైడిపాటి మురళీ, పప్పుల రమణారెడ్డి, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, వరకాల జోషి, మాణిక్యాలరావు, అశోక్‌యాదవ్, సీనియర్ నాయకుడు ఆర్‌డి ప్రసాద్, స్టీరింగ్ కమిటీ సభ్యులు రుద్రశంకర్, తుమ్మా ఆదిరెడ్డి, హౌసింగ్ బోర్డు కాలనీ నాయకులు భాస్కరరావు, వై విజయలక్ష్మీ, వివిధ డివిజన్ల నాయకులు పాల్గొన్నారు. సామరంగ్‌చౌక్ సెంటర్ నుండి ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఐరన్ సెంటర్ వరకు ఉన్న వర్తకుల వద్దకు వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించి వారిని పార్టీ క్రియశీలక సభ్యులుగా చేర్చారు.
మున్సిపల్ అధికారులకు కార్మికుల గోడు పట్టదా?
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 29: వేలకువేల రూపాయల జీతాలను సకాలంలో తీసుకుంటూ ఏసి గదుల్లో కాలక్షేపం చేస్తూ, విమానాల్లో చక్కర్లు కొడుతున్న కార్పొరేషన్ అధికారులకు జీతాలు లేక పస్తులతో అలమటించిపోతున్న కార్మికుల ఆకలి కేకలు వినిపించడం లేదా అని ఎఐటియుసి అనుబంధ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆసుల రంగ నాయకులు ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్మికులకు బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు. ధర్నాలో రంగనాయకులు మాట్లాడుతూ కార్మికులకు రెండు నెలల జీతాలు నిల్వవుంచటంతో పాటు ఏనెలకానెల చెల్లించిన తర్వాతనే అధికారులు జీతాలు తీసుకోవాలనే నిబంధన వున్నప్పటికీ సదరు ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందన్నారు. ఇప్పటికైనా అధికారులు చలనం తెచ్చుకుని తక్షణం జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో ఈ ఆందోళనను తీవ్ర ఉద్యమంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు జక్కిజేమ్స్, యూనియన్ నాయకులు దోడ్డా కుమార్ పాల్గొన్నారు.
బదిలీలపై నివేదికకు లోకాయుక్త ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 27: జిల్లా రెవెన్యూ శాఖలో ఇటీవల జరిగిన బదిలీలపై జిల్లా కలెక్టర్‌ను లోకాయుక్త వివరణ కోరింది. ఈమేర గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్టవ్య్రాప్తంగా ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతున్నందున ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది బదిలీలపై భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. మాథ్యూ గత సెప్టెంబర్ 21న జివో జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల జారీ అనంతరం, ఓటర్ల నమోదుతో సంబంధం ఉన్న 21 మంది రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ బదిలీ చేశారంటూ సామాజిక కార్యకర్త, గురజాడ మాజీ సర్పంచ్ జంపాన శ్రీనివాసగౌడ్ లోకాయుక్తను ఆశ్రయించారు. అవినీతి చోటుచేసుకోవటం వల్లనే ఈ బదిలీలు జరిగాయంటూ ఆయన ఆరోపించారు. దీనిపై జంపాన చేసిన ఫిర్యాదును లోకాయుక్త బి. సుభాషణరెడ్డి స్వీకరించటమేగాక దీనిపై వచ్చే ఫిబ్రవరి ఐదోతేదీలోపు నివేదిక సమర్పించాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు.
ఫార్మశీ రంగంపై అవగాహన కల్పించాలి
గాంధీనగర్, నవంబర్ 29: రాష్ట్రంలో ఫార్మశీ విధానం గురించి మరింత మెరుగైన అవగాహన కల్పించేందుకు ఫార్మశీ రంగ నిపుణులు రాష్టమ్రంతటా విస్తృత పర్యటనలు చేయాలని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ ఆచార్యులు ప్రొఫెసర్ ఎ రఘురామారావు అన్నారు. గురువారం ఉదయం స్థానిక సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ కాలేజీలో జరిగిన 51వ జాతీయ ఫార్మాస్యూటికల్ వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఈసందర్భంగా కళాశాలలోని 3వ సంవత్సర ఫార్మసీ విద్యార్థులు ఫార్మసీ విధానం, మందుల వాడకం, వైద్యుల సంప్రదింపు, సలహాలు ఏ విధంగా స్వీకరించాలని అనే అంశాలకు సంబంధించి కళాశాల ప్రాంగణంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. రఘురామారావు మాట్లాడుతూ నేడు ఫార్మసీ రంగంలో పురుషులతో పాటు స్ర్తిలు కూడా కృషి చేసినా ప్రోత్సాహం కరువైందన్నారు. రోగం వచ్చాక మందులు వాడటం కంటే రోగం రాకుండా ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ దేవళ్రావు మాట్లాడుతూ 1962నుంచి ఈ వారోత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వారం రోజుల పాటు ప్రజల్లో ఫార్మసీ రంగం పట్ల అవగాహన కల్గించటం, రక్తదాన శిబిరం నిర్వహణ తదితర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రొఫెసర్ డి విష్ణువర్థనరావు ఆయుర్వేదం గురించి తెలియచేయటమే కాక ‘అడ్వాన్స్‌డ్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్’ అనే పుస్తకాన్ని రచించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిజి డైరెక్టర్ ఎన్ బుచ్చయ్య నాయుడు, సిద్ధార్థ అకాడమీ సెక్రటరీ ఎన్ వెంకటేశ్వర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.