Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పురాతన ఆలయాలను పునరుద్ధరిస్తాం

$
0
0

పుట్టపర్తి, నవంబర్ 28: రాష్ట్రంలో శిథిలమైన దేవాలయాలను టిటిడి, దేవాదయ శాఖ సంయుక్తంగా పునరుద్దరించడానికి తగు చర్యలు తీసుకున్నట్లు టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. బుధవారం సత్యసాయి మహాసమాధి ప్రత్యేకంగా దర్శనార్థం ప్రశాంతి నిలయానికి విచ్చేశారు. ఆయనకు ట్రస్టు సభ్యులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వేకువ జామునే ఓంకారంలో పాల్గొన్న బాపిరాజు అనంతరం నగర సంకీర్తనలో పాల్గొని ప్రశాంతినిలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని ప్రణమిల్లారు. అక్కడ వేదపండితులు ఆశీర్వదించారు. అనంతరం శాంతి భవనంలో విలేఖర్లతో మాట్లాడుతూ మొదట జిల్లాకు రెండు పురాతన దేవాలయాలు ఎంపిక చేసుకుని వాటిని పునరుద్దరిస్తామని అనంతరం దశల వారీగా మిగిలిన దేవాలయల పునరుద్దరణ పనులు చేపడతామన్నారు. అదే విధంగా తిరుమలలో శ్రీవారి సేవలు మరింత విస్తృత పరుస్తామని,వచ్చేవారికి చక్కటి వసతి కల్పిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హిందూ ధార్మిక ప్రచారాన్ని విస్తృతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనగుడి కార్యక్రమం బుధవారం నుండి ప్రారంభమవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23వేల దేవాలయాల్లో మనగుడి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయాలకు పసుపుకుంకుమ, కంకనాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30వేల ఆలయాలు ఉండగా, ఇంకా 7వేల ఆలయాలను గుర్తించాల్సి ఉందన్నారు. రెండవ సారి టిటిడి అధ్యక్షులు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన యుపిఎ చైర్మన్ సోనియాగాంధీ, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దశాబ్దాలుగా తాను పుట్టపర్తికి వస్తున్నాని, బాబా తనకు గురువుగా భావిస్తున్నానన్నారు. అనంతరం ఆయన మనగుడి కార్యక్రమంలో భాగంగా పెన్న అహోభిలంకు బయలుదేరి వెళ్ళారు. బాపిరాజు వెంట వెంకటశివ, వేణు తదితరులు పాల్గొన్నారు.

కరవు సీమను సస్యశ్యామలం చేస్తాం
ఉరవకొండ, నవంబర్ 28: అనంత వెంకటరెడ్డి హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనులను రెండేళ్లలో పనులు పూర్తి చేసి కరవుసీమను సస్యశామలం చేశామని కేంద్ర పెట్రోలియ శాఖ మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుండి మాల్యాల నుండి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కృష్ణ జలాలు అందించాలనే ఉద్దేశంతో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి చేపడుతున్న భగీరథ విజయ యాత్ర బుధవారం 11వ రోజు ఉరవకొండ నియోజక వర్గంలోని లత్తవరం నుండి ప్రారంభమై, కౌకుంట్ల వరకు కొనసాగింది. ఈ భగీరథ యాత్రలో చేపడుతున్న మంత్రి రఘువీరారెడ్డికి, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డికి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పనబాక లక్ష్మి, టిటిడి చైర్మన్ కనమూరి బాపురాజ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి బలరాం నాయక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పనకాల లక్ష్మి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాజెక్ట్ చేపట్టి, రైతులను ఆదుకోవాడానికి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఉదయం లత్తవరం నుండి పాద యాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటలకు అమిదాల వద్దకు చేరుకుంది. కార్తీక పౌర్ణమి పురష్కరించుకుని మల్యాల నుండి జీడిపల్లి రిజర్వాయర్‌కు తరలివెళ్తున్న కృష్ణ జలాలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పనబాక లక్ష్మి గంగకు పూజలు నిర్వహించారు. పాదయాత్ర చేపడుతున్న మంత్రి రఘువీరారెడ్డికి, అనంతవెంకటరామిరెడ్డికి గిరజన మహిళలు హారతులు ఇచ్చి, స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ వై.శివరామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బీమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు ముఖ్యమంత్రి రాక
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, నవంబర్ 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయరు వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడే అధికార, అనధికారులతోమాట్లాడతారు. అనంతరం 1.15 గంటల సమయంలో బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. అక్కడే ఏర్పాటుచేసిన అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి మరియు భగీరథ విజయయాత్రకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తారు. జీడిపల్లి రిజర్వాయరును జాతికి అంకితం చేసి ప్రసంగిస్తారు. అనంతరం 03.50 గంటలకు హైదరాబాదుకు బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు బొత్స, మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శైలజానాథ్ నేడు పాల్గొననున్నారు.
ఈ సారైనా సిఎం వరాలు కురిపించేనా...
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, నవంబర్ 28: జిల్లాకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముచ్చటగా మూడవసారి వస్తున్నారు. ఈ నెల మూడవ తేదీ ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని పుట్టపర్తిలోప్రారంభించారు. ఈ నెల 17వ తేదీన మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్‌సాన్‌సూకీ పర్యటన కోసం రెండవసారి జిల్లాకు విచ్చేశారు. నేడు జీడిపల్లి రిజర్వాయరును ప్రారంభించి జాతికి అంకితం చేయడానికి ముచ్చటగా మూడవసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. రెండు సార్లు జిల్లా పర్యటనకు వచ్చినా జిల్లా సమస్యల పై ఆయన ఏ మాత్రం స్పందించలేదు. జిల్లాకు ముచ్చటగా మూడవసారి వస్తున్న సందర్భంగానైనా ఆయన జిల్లాపై వరాలు జల్లు కురిపిస్తారా అని ప్రజలకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక జిల్లాలోని ప్రధాన సమస్యలను ఒకమారు పరిశీలిస్తే ... హంద్రీనీవా మొదటి దశలోభాగంగా జీడిపల్లి రిజర్వాయరును లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కానీ ఇప్పటికీ అక్కడ మొదటి దశ పనులు పూర్తికాకపోవడం గమనార్హం. మొదటి దశ పనులను పూర్తి స్థాయిలో ఎప్పటిలోగా పూర్తి చేసి సాగుకు నీరు ఇస్తారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో గడచిన నాలుగు సంవత్సరాలుగా తీవ్ర కరవుపరిస్థితులు నెలకొని ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది కూడా దాదాపుగా అటువంటి పరిస్థితులే పునరావృతమయ్యే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రభుత్వం ఇంతవరకూ కరువు మండలాలను ప్రకటించలేదు.తాజాగా వాతావరణ బీమా నిబంధనల వల్ల కరువు మండలాలు ప్రకటించకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు కరువు మండలాలు ప్రకటిస్తారా లేదా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. చేనేత రంగానికి సంబంధించి ముడి సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.ఇప్పటికే జిల్లాలో సుమారు లక్ష మగ్గాల వరకూ మూతపడ్డాయి. జిల్లాలో చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి సంబంధించి ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. ఇక జిల్లాలో లేపాక్షి, సైన్సుసిటీ తదితర పేర్లతో సుమారు పది వేల ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించారు. సెజ్‌ల పేరుతో రైతుల నుంచి సేకరించిన భూములపై ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. జిల్లాలో డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు, టైఫాయిడ్, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్‌సిలలోవైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మందులు అందుబాటులో ఉండడం లేదు. సకాలంలో వైద్యం అందక చాలామంది మరణిస్తున్నారు. వీటితో జిల్లాలో నెలకొని ఉన్న అనేక సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించి ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శ్రీరామరెడ్డి పథకాన్ని
వెంటాడుతున్న బాలారిష్టాలు
హిందూపురం టౌన్, నవంబర్ 28: హిందూపురం పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం అమలు చేస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క నెలలోనూ పూర్తిస్థాయిలో నీరు అందలేదంటే అతిశయోక్తి కాదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం లో హిందూపురం మున్సిపాలిటీతోపాటు పారిశ్రామిక వాడ, మడకశిర, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు నీటిని అందించేందుకు రూ.650 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని అమలు చేశారు. పెన్నోహోబిలం బాలెన్సింగ్ రిజర్వాయర్ (పిఏబిఆర్) నుండి దాదాపు 200 కిలోమీటర్ల పైపులైన్‌లు ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నారు. ఆసియాలోనే అతి పెద్ద గ్రామీణ తాగునీటి పథకంగా దీనికి గుర్తింపు ఉంది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల ఉదాసీనత కారణంగా ప్ర జలకు మాత్రం నీటి కష్టాలు తప్పడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హిందూపురం ప్రాంతం లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, మున్సిపాలిటీకి సంబంధించి ఉన్న బోర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటి కోసం కేవలం శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపైనే ప్రజలు ఆధారపడాల్సి వచ్చింది. అయితే అటు బోరు నీరు అందక ఇటు పిఏబిఆర్ నుండి తుంగభద్రజలాలు రాకపోవడంతో ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా అందరూ బిందెకు రూ.2 వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇకపోతే గతంలో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ప్రతిరోజూ హిందూపురం మున్సిపాలిటీకి 10 మిలియన్ లీటర్ల నీటిని అందించాల్సి ఉంటుంది. అయితే ఈ మేరకు ఏ నెలలో కూడా పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. నెలలో 15 రోజుల పాటు లీకేజీల కారణంగా నీరు రాకుండా పోతుండగా పట్టణంలో వారానికి ఒకరోజు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. ఈ నెలలో ఇప్పటి వరకు 15 రోజుల పాటు లీకేజీలు చోటు చేసుకుని నీరు రాకపోగా సగటును రోజుకు కేవలం 4.31 ఎంఎల్‌డి నీరు మాత్రమే పట్టణానికి వచ్చి చేరింది. గత 23 రోజులుగా నీరు రాకపోవడంతో పట్టణ ప్రజలు ట్యాంకర్ల కోసం ఎగబడుతున్నారు. అయితే విద్యుత్ సమస్య కారణంగా ట్యాంకర్లు కూడా పూర్తిస్థాయిలో నీటిని అందించలేకపోతున్నట్లు మహిళలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా తాగునీటి పథకం నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి బోర్డు లాంటి సంస్థలకు అప్పగిస్తే తప్ప ఇలాంటి బాలారిష్టాల నుండి బయటపడే అవకాశాలు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి తాగునీటి పథకం నిర్వహణ బాధ్యతలను స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలకు కేటాయించి సక్రమంగా నీరు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం
గుంతకల్లు, నవంబర్ 28: దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆస్థానా పేర్కొన్నారు. గుంతకల్లులో బుధవారం జిఎం అస్థానా రైల్వే డివిజన్ పరిధిలోని గుత్తి, అనంతపురం, ధర్మవరం సెక్షన్‌లలో జిఎం విస్తృతంగా పర్యటించారు. రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రైల్వేకు నిధుల కొరత వుందని, అయిన గుంతకల్లు డివిజన్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రేణిగుంట, గుంతకల్లు మద్య డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. వాడి, గుంతకల్లు మద్య, రేణిగుంట, గుత్తిల మద్య గల పెండింగ్ పనులు సాగుతున్నాయన్నారు. వాడి, గుంతకల్లుల మద్య అధిక శాతం పనులతో పాటు మంత్రాలయం బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయన్నారు. బెంగళూరు, ధర్మవరం మద్య విద్యుదీకరణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. వచ్చే ఎడాది నాటికి డబ్లింగ్ లైన్‌లతో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యో అవకాశం వుందన్నారు. ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గుంతకల్లు మోడల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు, అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరచనున్నట్లు తెలిపారు. అదే విధంగా బాలాజీ డివిజన్‌కు సంబంధించి డిమాండ్ అధికంగా వుందని, అయితే రైల్వే బోర్డు ఇప్పట్లో బాలాజీ డివిజన్, ఖాజీపేట డివిజన్‌ల ఏర్పాటుపై ఆసక్తి చూపడం లేదన్నారు. ఇతర డివిజన్లు వచ్చిన గుంతకల్లు డివిజన్ మారే సమస్య లేదన్నారు. ఈ సమావేశంలో గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ టిపి సింగ్, ఎడిఆర్‌ఎం సత్యనారాయణ, సీనియర్ డిసిఎం విక్టర్‌బాబు, డివిజనల్ కమాండెంట్ సెంథిల్‌కుమరేశన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని
దర్శించుకున్న బాపిరాజు
ఉరవకొండ, నవంబర్ 28: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన పెన్నహోబిళంలోని శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయాన్ని బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ కనమురి బాపి రాజు స్వామి వారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ, టిటిడి అధికారులు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పాదయాత్రకు సంఘీభావం తెలుపడానికి కోసం టిటిడి చైర్మన్ కనమూరి బాపిరాజు వచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు దుశ్శాలువాలతో సత్కరించారు. టిటిడి దేవాదాయ, దర్మదయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న మన గుడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నెట్టికంటిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి
గుంతకల్లు, నవంబర్ 28: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని బుధవారం కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి, ఎంపి అనంతవెంకటరామిరెడ్డిలు చేపట్టిన అనంతవెంకటరెడ్డి హంద్రీనీవా కాలవపై కృష్ణా జలాలతో చేపట్టిన భగీరథ యాత్రకు విచ్చేసిన ఆమె ముందుగా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర పెటోలియం శాఖ మంత్రి పనబాక లక్ష్మిని ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మూల విరాట్ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి సురేష్, ఎఇఓ ధనుంజయ, వంశ పార్యంపర్య ధర్మకర్త సుగుణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు 40 టిఎంసిల నీటి జిఓ విడుదల చేయాలి: ఎమ్మెల్యే కేశవ్
ఉరవకొండ, నవంబర్ 28: హంద్రీనివా సుజల సవ్రంతి పథకానికి 40 టిఎంసిల నీటి జిఓను విడుదల చేయాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణ శివార్లులో ఉన్న వేర్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా సుజల సవ్రంతి నుండి మల్యాల నుండి జిడీపల్లి రిజర్వాయర్‌కు నీరు అందించామని మంత్రి రఘువీరారెడ్డి భగీరథ పాద యాత్ర చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఇలాంటి పాదయాత్రలకు ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. ట్రైల్ రన్ కింద కేవలం 2 టిఎంసిల నీటిని విడుదల చేశారన్నారు. చంద్రబాబుపై కేంద్ర పర్యటక శాఖ మంత్రి చిరంజీవి విమర్శించే అర్హత లేదన్నారు. హంద్రీనివా ప్రాజెక్ట్‌కు స్వర్గీయ ఎన్‌టి రామారావు రూప కల్పన చేశారన్నారు. దివగంత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయలేదని, తనసొంత జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. 40 టిఎంసిల జిఓను విడుదల చేస్తే మంత్రులకు జలాభిషేకం చేస్తానన్నారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగురైతు అధ్యక్షులు పురుషోత్తం, తెలుగుదేశం నాయకులు నాగరాజు, మాజీ సర్పంచ్ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో శిథిలమైన దేవాలయాలను టిటిడి, దేవాదయ శాఖ సంయుక్తంగా పునరుద్దరించడానికి తగు చర్యలు తీసుకున్నట్లు టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు.
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles