తొలి చదువులు -21
==========
ఏబీసీడీలతో మొదలు అయ్యే ఇంగ్లీషు నేర్చుకునే తొలినాళ్లలో అప్పుడు చాలా సుళువు అనిపిస్తుంది. లోతుల్లోకి వెళ్లేకొద్దీ దాంతో దాని తడాఖా ఏమిటో తెలుస్తుంది. ఇంగ్లీషు బయటకు కనిపించే అంత సుళువు అయిన భాషేమీ కాదు. ఇంగ్లీషు భాషావేత్తలకు సైతం తలనొప్పి మాత్రలను మింగించే అంత చిక్కు (కాంప్లెక్సు) నుడి. ఇంగ్లీషు భాషలో ఉద్దండ పండితులు కూడా ఈ భాషలో తప్పులు దొర్లకుండా రాయలేరు. చదవలేరు, మాట్లాడలేరు. ఇంగ్లీషు సొంత భాషగా ఉన్న ఆంగ్లేయులకు సైతం చదవటానికీ రాయటానికి వచ్చేసరికి వాళ్లకూ ఇది నొప్పే. వాళ్లు కూడా ఉచ్ఛారణలూ, స్పెల్లింగులూ ఎప్పటికి అప్పుడు నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఆ భాష కట్టుబడి తీరే అంత. ఆంగ్ల అక్షర మాల (ఆల్ఫాబెట్)లో తక్కువ అక్షరాలుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇతర ప్రపంచ భాషలనుండి వచ్చి చేరే పదాలకు తగ్గట్టు రాతను, ఉచ్ఛారణ ఇవ్వలేకపోవడమే ఈ తిప్పలకు కారణం.
చిన్న పిల్లలకు ఇంగ్లీషు సులభంగా ఉన్నట్టు అనిపించడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి తెలుగుతో పోలిస్తే అక్షరాల సంఖ్య తక్కువ. అదీకాక అక్షరాలు దాదాపుగా నిలువు, అడ్డ, వాలు గీతలతో ఉంటాయి. పిల్లలకు గీతలతో ఉండే ఆంగ్ల అక్షరాలు రాయడం చాలా సుళువు.
రెండో కారణం బోధనలో చూపే శ్రద్ధ, నేర్పించే తీరు, పిల్లల్ని బడిలో వేసిన మొదటి రోజునుండే ‘ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్..’ అని కానీ, లేదా ‘ఏ పి పి ఎల్ ఈ-యాపిల్’ ‘ బి ఏ టి- బ్యాట్’ ‘సి ఏ టి- క్యాట్’ అంటూ ఆంగ్ల పదాలను స్పెల్లింగులతో సహా నేర్పిస్తుంటారు. ఆ విధంగా స్కూల్లో వేసిన నాటినుంచి పదాలను స్పెల్లింగులతో సహా బట్టీపట్టడం అలవాటు చేస్తారు. ఆదిలో చిన్న చిన్న పదాలు, తక్కువ పదాలు ఉంటాయి కాబట్టి సులువు అనిపించిన ఇంగ్లీషు రానురాను గుదిబండగా మారడానికి కారణం ఏమిటో కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే కానీ అర్ధం కాదు.
ఆంగ్లంలో మొత్తం అక్షరాలు 26. వీటిలో A E I O U అనేవి అచ్చులు మిగతా 21 హల్లులు. ఈ 21 హల్లులు వాటంతట అవి పలకలేవు. వీటికి అచ్చులు తోడు అయితేనే పలకగలవు. మచ్చుకు K అక్షరం ‘క్’ అనే మూల పలుకును ఇస్తుంది. దీని పక్కన A చేరినప్పుడు అది ‘క’ అనీ, O చేరినప్పుడు ‘కొ’ అనే ఇస్తుంది. అయితే K పక్కన O చేరిన ప్రతిసారి ‘కొ’ పలకాలనే ఖచ్చితమైన నిబంధన ఏమీ లేదు. మచ్చుకు COLLEGE అనే పదంలో COని ‘కా‘లేజ్‌గా పలకాలి. అదే COని COMAలో ‘కో’మగా పలకాలి. ఈ విధంగా CO అనే రెండు అక్షరాలు ఆయా సందర్భాలకు తగ్గట్టు ‘కొ’, ‘కో’, ‘క’, ‘కా’లుగా పలకాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా హల్లులకు అచ్చులు కలిపి చదవడంలో ఈ పితలాటకం తప్పదు. దేన్ని ఎప్పుడు ఎలా పలకాలి అనేది ఆ పదాన్ని నేర్చుకునేటప్పుడే తెలుసుకోవాలి. ఇందుకు నిరంతర సాధన కావాలి. ఇంగ్లీషులో దీనికి ‘్ఫనిటిక్స్’ అనే పెద్ద శాస్తమ్రే ఉంది.
భాషా సూత్రాల ప్రకారం 21 హల్లులు 21 మూల శబ్దాలనే పలుకుతాయి. వీటికి అచ్చుల్ని కూడా కలిపితే మొత్తం 26 మూల శబ్దాలే పలకటానికి వీలు అవుతుంది. కానీ మనిషి చాలా శబ్దాలు చేయగలడు. వాటి అన్నింటికి అక్షర రూపం ఇవ్వాలంటే ఉన్న ఈ 26 మూల శబ్దాలు చాలవు. కాబట్టి అవసరాల రీత్యా ఒక అక్షరాన్ని ఒక శబ్దం కంటే ఎక్కువ శబ్దాల కోసం వాడుకోవాలి. సరిగ్గా ఇక్కడినుండే ఇంగ్లీషుతో పితలాటకం మొదలవుతుంది. దీనికి ఎన్ని నియమాలు పాటించినా పలుకు తీరులో, రాత తీరులో తికమక తప్పదు.
21 హల్లులకు కలిపితే 21 పలుకులు పుడతాయి. ఇలాగే, ఉన్న 21 హల్లులకు ఐదు అచ్చులు కలిస్తే 21X5=105 పలుకులు ఏర్పడతాయి. ఇంగ్లీషులో రెండు అక్షరాల తర్వాత అచ్చు వచ్చే సాంప్రదాయం కూడా ఉంది. అంటే CAT..లో C తరువాత రావడం వల్ల ‘కా’ అయినట్టే CLASS అనే పదంలో CLతరువాత రావడంవల్ల ‘క్లా’గా పలుకుతారు. అంటే ఇవి మన ద్విత్త అక్షరాలూ, సంయుక్త అక్షరాలు లాంటివి. ఈ రకంగా 105 శబ్దాలకు మరో మారు 26 అక్షరాలు వచ్చి చేరాయి అనుకున్నా అచ్చులవల్ల 105X262730 పలుకులు రావటానికి అవకాశం ఉంది. ఇంకా నియమాలు లేకుండా ఏర్పడే పలుకులను కూడా పరిగణనలోకి తీసుకుంటే 3వేలు దాటకపోవచ్చు. కానీ ఇంగ్లీషులో ఉన్న ఈ 26 అక్షరాలతోనే ప్రపంచంలో మానవుడు చేయగలిగిన అన్ని పలుకులకు అక్షర రూపం ఇవ్వాలి..
ఇంగ్లీషులో అక్షరాలు లేవని మనిషి శబ్దం చేయకుండా ఉండలేడు. మనిషి చేయగలిగిన అన్ని శబ్దాలకు 26 అక్షరాలతోనే రాయాలి, చదవాలి. అందువల్ల వీటికి ఎన్ని నియమాలు, నిబంధనలు వర్తింప చేసుకున్నా అందరు ఒకే రకంగా చదివి, రాయగలిగే విధంగా అక్షర రూపం ఇవ్వడం వీలు కాదు. అందుకే ఏ ఇద్దరు ఒక రకంగా చదవలేరు, పలకలేరు. గతంలో కడప స్పెల్లింగ్ cuddapahగా ఉన్నప్పుడు ఇంగ్లీషు వార్తలు చదివే వాళ్లు ‘కుడప’, ‘కుడ్డప్’, ‘కడ్డప్’, ‘కుడపహ్’ అని రకరకాలుగా చదువుతుంటే మనకి తమాషాగా ఉండేది. ఇంగ్లీషువాళ్లు గోదావరిని ‘గోడావరి’ అనీ, గుంతకల్లుని ‘గుంటకల్’ అనీ, అనంతపురాన్ని ‘అనంటపురం’ అని పలికేవాళ్లు. కారణం తెలిసిందే. ఇంగ్లీషులో ‘ద,డ’లకు D I, ‘త,ట’లకు T I వాడడంవల్ల స్థానికంగా ఆ పదంతో పరిచయం లేకపోతే ఎవరికి తోచినట్టు పలుకుతారు.
మొదట్లో సులభం అయిన ఇంగ్లీషు రాను రాను స్పెల్లింగులు, ఉచ్ఛా రణ, గ్రామరుతో పిల్లల కష్టాలు మొదలవుతాయి. తెలుగులో అయితే ఒక గుణింతం నేర్చుకోగానే మిగతా గుణింతాలు కొద్దిపాటి ప్రయత్నంతో వాటంతట అవే వస్తాయి. ఇంగ్లీషులో ఆ పప్పులు ఉడకవు. p-u-t ‘పుట్’ అయినప్పుడు b-u-t ‘బుట్’ కావాలనే రూలేం ఉండదు. దాన్ని ‘బట్’ అనాల్సిందే. ఈ విధంగా ప్రతి పదానికి స్పెల్లింగు, అర్ధం, వాక్య నిర్మాణం, గ్రామరు అన్నీ కలిసి ఓ పెద్ద సుడిగుండంలా తయారవుతుంది.
అక్షరాలు పూర్తిగా రానిదే చదవడమూ, రాయడమూ చేయలేరు. కాబట్టి పుస్తకాలలో ఉన్న దాన్ని చదవాలన్నా, చదివిన దాన్ని తిరిగి రాయాలన్నా అక్షరాలు నేర్చుకోవాలి. సొంత భాషలో చదివే పిల్లలు అయితే చదవడం, రాయడం నేర్చుకుంటే చాలు. మిగతా చదువు అంతా దాని ద్వారా జరిగిపోతుంది. అది పనిగా భాష నేర్చుకోవాల్సిన పని లేదు.
ఇతర భాషలో చదవాలి అంటే, ఆ భాషను ముందుగా నేర్చుకోవాలి. పరాయి భాషలో చదవటమూ, రాయడం నేర్చుకోవడం పెద్ద పని ఏమీ కాదు. మచ్చుకు తమిళ అక్షర మాలను, గుణింతాలను పదిరోజుల్లో నేర్చుకోవచ్చు. అప్పటినుండి ఆ భాషలో చదవడము, రాయడం చేయగలము. కానీ ఆ భాషలో మనం మాట్లాడలేము. అవతలివారు మాట్లాడితే మనకు అర్ధం కాదు. చదవడం, రాయడం వచ్చినంతనే పూర్తి భాష వచ్చినట్టు కాదు.ఈ సంగతి తెలియకే తల్లిదండ్రులు మా పిల్లలకు ఇంగ్లీషు సులభం అనే పయిపయి గమనింపును చెప్పేది.
ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలకు ఎక్కువ భాగం ఆ భాషను చదవడము, రాయడమో వచ్చు. మొత్తం భాషమీద పట్టు రాకపోవడానికి కారణం పిల్లలకు సొంత భాషే ఎరగని వయసులో రాని భాషలో బోధించడం, తెలుగు ద్వారా నేర్పాల్సిన ఇంగ్లీషును, రాని ఇంగ్లీషు ద్వారానే నేర్పించడంవల్ల భాష పెరుగుదలకు గండిపడుతుంది. మొత్తంమీద అటు ఇంగ్లీషు సరిగా రాక, ఇటు సొంత భాషా సరిగా రాక పిల్లలు రెంటికి చెడుతున్నారు. *
తొలి చదువులు -21
english title:
early learning - 21
Date:
Saturday, December 1, 2012