వేదిక
===========
జనవాణిలో జ్ఞాన సాధనకు తల్లి భాషే పునాది అన్నమాట అక్షర సత్యం. 3 ఏళ్ళ నా మనుమడు నర్సరీ క్లాసులో నేర్పే ఆంగ్ల చిలుకపలుకులు నేర్చుకుంటున్నాడు. ‘‘మే ఐ గెట్ ఇన్ క్లాస్‌రూం’’అన్న వాక్యంలో క్లాస్ రూం బదులు కిచెన్, బాత్‌రూం ఇలా నేర్పారు. ‘‘మే ఐ గెటిన్ కిచెన్’’ అన్న వాళ్ళ నాన్న ప్రశ్నకు ‘‘మే ఐ గెటిన్ కిచెన్ నో’’ అని బదులిచ్చాడు. మరి అదే శిశువుకు కన్నడ మాట్లాడే తల్లిదండ్రులు, తెలుగు మాట్లాడే వాడిఈడు స్నేహితులు, మరాఠీ, హిందీ మాట్లాడే తల్లి ఆమె బంధువుల వలన పుట్టిన రోజునుంచి (మరీ మాట్లాడితే కడుపులో ఉండగానే) ఆ భాషలన్నీ వినటంవలన మాట్లాడటం వలన ఏ విధమైన వ్యాకరణ దోషాలు ఉండటం లేదు. వాళ్ళమ్మ ఉద్యోగానికి పోతూ నావద్ద వదలి మళ్ళీ ఇంటికి వెళుతూ తీసుకెళుతుంది. నాకు ఈ వయసులో హిందీ నేర్చుకోవాలన్న తపన వలన నాతో హిందీలో మాట్లాడమన్నాను ఆమెను. ‘‘కల్ చుట్టీ హై’’అన్నదామె. దానికి వెంటనే బాబు కూడా ‘‘కల్ ఆప్ కో భీ చుట్టీ హై’’అన్నాడు. ఇదేదో గొప్పకోసమో, సరదాకోసమో రాయటంలేదు. బళ్ళో బలవంతంగా రుద్దే ఆంగ్లంలో తప్పు మాట్లాడిన విధం వివరించటంకోసం రాయాల్సి వచ్చింది. కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు లాగే రోజూ ఆంగ్లంకూడా పుట్టినప్పటినుంచి విని ఉంటే వ్యాకరణ దోషాలు ఎలా వస్తాయి? ఇది నేటి సంగతి. 20 ఏళ్ళ క్రితం మేం కర్నాటక బార్డర్‌లో ఉన్నాము. మా మాతృభాష కన్నడం. తెలుగులో ఎవ్వరూ మాట్లాడరు. చదువు తెలుగు మీడియం. మరి నాలాగే తెలుగుమీద విపరీతమైన ఆసక్తి నా కొడుకుకు. బడి, ఇల్లు, లైబ్రరీ మినహా మరొకటి అక్కరలేదు నా కుమారుడికి. టెన్త్ పూర్తిచేసినా తెలుగులో మాట్లాడమంటే తడబడి చచ్చేవాడు. సగం లైబ్రరీ చదివిన వాడికి తెలుగులో మాట్లాడడం రాకపోవటంతో చచ్చినట్లు ఇంట్లో తెలుగు మాట్లాడి మాటలు నేర్పాల్సి వచ్చింది. వినికిడివల్ల మాటలు త్వరగా వస్తాయి. ఇంత కష్టపడి మనం ఆంగ్లం నేర్పినా వాళ్లల్లే మనం మాట్లాడలేం కదా! ఎందుకీ ప్రయాస?
===========================
రచనలు పంపవలసిన చిరునామా
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్ - 500 003.
వేదిక
english title:
vedika
Date:
Saturday, December 1, 2012