భారతదేశంలో తెలుగుకు ప్రాముఖ్యత తగ్గు తోంది. ఇది నిజం! ఇది భయపడాల్సిన, అంతకంటే సిగ్గుపడాల్సిన ఉపద్రవం. కాశ్మీరునుండి, కన్యాకుమారి వరకూ మన దేశంలో అనేక భాషలు, మతాలు, కులాలు, సంస్కృతులు ఉన్నాయి. అనేకానేక ఉప నదుల్నీ, సెలయేళ్ళనీ, కొండవాగుల్నీ కలుపుకుంటూ సమున్నతంగా, అవిచ్ఛిన్నంగా సాగిపోయే అఖండ గోదావరి నదీమతల్లిలా మన భారతదేశం... అజరామరమైన ఒక సాంస్కృతిక ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వుంది. వుంటుంది. ఎల్లప్పుడూ- ఎప్పటికీ!
ఒక జనావాస ప్రాంతం గురించి చెప్పుకోవాలంటే, ఆ ప్రాంతం వైశాల్యం, విస్తీర్ణం, జనాభా సంస్కృతీ సంప్రదాయాల గురించీ, ఆహార విహారాదుల గురిం చి, కట్టుబొట్టుల గురించి చెప్పుకోవాలి. ఒక జాతి గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటి స్థానంలో నిలిచేది ‘్భష’ ఆ తర్వాత సంప్రదాయం.
ఒక మనిషి తన తల్లిదండ్రులతోనూ, బంధువులతోనూ తన సహజమైన శైలిలో (ఎటువంటి భేషజాలకూపోకుండా) మాట్లాడుకునేదే ‘‘మాతృభాష’’. ఆ మాతృభాష నీడలోనే అనేక తరాలనుండి అనేక కుటుంబాలూ, సమూహాలు, వ్యక్తులూ, వ్యక్తిత్వాలూ అనాదిగా పరిఢవిల్లుతూ వస్తున్నాయి.
భాష!
మనిషికి జంతువులనుండి ప్రత్యేకత నిచ్చింది.
మనిషికి విజ్ఞానాన్నిచ్చింది.
మనిషికీ మనిషికీ మాటల నిచ్చెన వేసింది
మనిషి విజ్ఞాన నైపుణ్యాల్ని మరో మనిషికి అందించింది.
సంస్కృతుల్నీ, సంప్రదాయాల్నీ, సంస్కారాల్నీ అవిరళంగా, అవిశ్రాంతంగా నిలబెట్టుకుంటూ వస్తోంది.
బాధనీ, ఆనందాన్నీ, ఆవేశాన్నీ, ఆక్రోశాల్నీ, ఆవేదననీ, ఆవేశాన్నీ
అక్షరాల్లోనో పదాల్లోనో అభివ్యక్తం చేస్తుంది.
భాష లేని జాతి నిస్తేజం. నిరాసక్తం, నిరర్థకం, నిరామయం, నిర్వీర్యం.
అది కళ్ళు లేని కబోదుల- అగమ్యగమనం.
మాతృభాష అంటే- అమ్మభాష
అమ్మలోని తీయదనం, కమ్మదనం- కొండొకచో కరుకుదనం.
బిడ్డల ప్రవర్తనపై తల్లి పెంపకమే ప్రధాన ప్రభావం కలిగినట్టు, ఒక జాతి సమూహంపై మాతృభాషా ప్రభావం ఖచ్చితంగా వుంటుంది.
మనది తెలుగుభాష!
‘‘దేశభాషలందు తెలుగు లెస్స!’’అని శ్రీకృష్ణదేవరాయలు అన్నా, ‘‘సుందర తెలుంగు’’అని తమిళ కవి సుబ్రహ్మణ్యభారతి అన్నా, తెలుగు భాషావైభవం ఎంత గొప్పదో వాళ్ళు తెలుసుకున్నాకే!
కానీ- ప్రస్తుతం జరుగుతున్నదేమిటి?
మనది కాని విదేశీ భాషా సంస్కృతిలో, వేలంవెర్రిగా వచ్చేస్తున్న అసభ్యమైన జుగుప్సాకరమైన వస్తధ్రారణలోనూ, ఫారిన్ కల్చర్ పేరిట ప్రతీ వ్యక్తి జీవితంలోకీ ముంచుకువస్తున్న పాశ్చాత్య విష సంస్కృతినీ, దానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రాజకీయ, వర్గ, భాషా, సంస్కృతీ వైకృతికాల్నీ, ఇతోధికంగా వాటిని పెంచిపోషిస్తున్న ప్రస్తుత కుహనా మేధావుల్నీ చూస్తే ఏమనిపిస్తోంది?
తెలుగు మాట్లాడ్డం, తెలుగురాయడం, చదవడం- అజ్ఞానంగా, అనాగరికంగా భావించే వీళ్లకి తెలుగు గురించి చెప్పడం వృథాప్రయాసే అవుతుంది. ఈనాడు ఎన్నో సాధించామనుకునే వాళ్ళందరి తెలివితేటలకీ, బీజం భారత సాంప్రదాయంలోనూ, సంస్కృతిలోనూ వుందని ఎప్పటికి అర్ధమవుతుంది?
విమాన నిర్మాణ శాస్త్రం మనదేనని తెలుసా?
కంప్యూటర్లనే తలదనే్న మేధావితనం మన వేద గణితంలో వుందన్న విషయం ఎంతమందికి తెలుసు?
‘‘అనగా అనగా’’ కథల్లో మన పెద్దవాళ్ళు పిల్లలకి అందించిన భారతదేశ పురాణేతిహాసాలూ, సంస్కృతీ సంప్రదాయాలూ, పెద్దవాళ్ల పట్ల గౌరవం, మర్యాద, అణకువ, మన్నన, అంతకుమించి సాంఘిక జీవితావశ్యకత యివన్నీ ఇప్పుడెవరు చెపుతారు?
ఈ కథలూ కబుర్లూ కడుపునింపుతాయా అని నాన్నమ్మ తాతయ్యల్నుంచి బలవంతంగా పిల్లల్ని వేరుచేసి కానె్వంట్ల కారాగృహాల్లో బలవంతంగా తోసేస్తున్న ఈనాటి తల్లిదండ్రులది కాదా ఈ తప్పు.
‘‘విద్యయొసంగు వినయంబు’’ అన్న సూక్తినిబట్టే విద్యయొక్క పరమార్ధం ఉద్యోగాలు మాత్రమే కాదనీ, అంతకు మించి సంస్కార సముపార్జన అని ఎవరైనా ఎప్పటికి తెలుసుకుంటారు?
పరాయి భాషల్ని కించపరచడం నా అభిమతం కాదుగానీ, ‘‘మాతృభాష కళ్ళవంటిది. పరాయిభాష కళ్ళజోడులాంటిది!’’అని తెలుసుకుంటే ప్రతీ మనిషి జీవితం అన్నివైపులనుండీ వీచే పవనాల్ని ఆస్వాదించే నవ్యనందనమై అద్భుతమైన విజ్ఞానానందానుభూతులతో నిండిపోగలదని నా విశ్వాసం.
భారతదేశంలో తెలుగుకు ప్రాముఖ్యత తగ్గు తోంది. ఇది నిజం!
english title:
bhasha leni jaati nisthejam!
Date:
Saturday, December 1, 2012