నేడు తెలుగు భాషోద్యమ సమాఖ్య 9వ వార్షిక మహాసభలు
గుంటూరులో జరగనున్న సందర్భంగా...
=================
ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్తమైన విశాల రాష్ట్రంగా ఏర్పడి 56 ఏళ్లయింది. దీనికి మూడేళ్లముందు ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రాతిపదికమీదే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంనుండి విడివడింది. నిజామ్ పాలన నుంచి విముక్తమైన భూభాగంలోని తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌గా రూపుదాల్చింది కూడా ఈ ప్రాతిపదిక మీదే. తెలుగువారంతా ఒక భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడి, తమ భాషలోనే పరిపాలించుకోవాలనీ, తమ భాషలోనే విద్యాబుద్ధులు నేర్చుకోవాలనీ ఒక భాషాజాతిగా అన్నివిధాలా అభివృద్ధి చెందాలనీ నాటి నేతలు ఆశించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజ్యవ్యవస్థగా, భారతదేశంలో ఒక భాగంగా ఎదగాలనేదే మన రాష్ట్ర నిర్మాతల సంకల్పం.
మన రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వ వ్యవస్థలో అవసరమైన అన్ని రంగాలకు పాలనా విభాగాలుంటాయి. ఆ విభాగాలకు మంత్రులుంటారు. ప్రజల హితాన్ని కోరి, ఆ మంత్రిమండలి చేసే విధాన నిర్ణయాలను ఆయా విభాగాల కార్యదర్శులు అమలుచేస్తారు. ఆర్థికం, వ్యవసాయం, మద్యం వంటి ఎన్నో రంగాలకు పాలనా విభాగాలు ఉన్నాయి గాని, ఏ భాష ఆధారంగా రాష్ట్రం ఏర్పడిందో, దాని రక్షణకు, అభివృద్ధికి సంబంధించి గాని, ఒక భాషాజాతిగా ఎదగడానికి సంబంధించి గాని అందుకోసం ఒక పాలనా విభాగం- అంటే మంత్రిత్వశాఖ మనకు నాటికీ, నేటికీ ఏర్పడలేదు. కనుక, దానికొక మంత్రి ఉండడమనే మాటే తలెత్తదు. మంత్రిత్వశాఖ లేనందున దానికొక విధాన నిర్దేశమే అక్కరలేదు. భాష ప్రాతిపదికపైనే ఏర్పడిన ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక భాషా విధానమంటూ లేకపోవడం ఎంతో శోచనీయమైన సంగతి. మనతోపాటే ఏర్పడిన పొరుగు రాష్ట్రాలయిన తమిళనాడు, కర్నాటకలతో పోల్చుకొంటే లోకం ముందు మనం తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇంతకాలంగా మన రాష్ట్రంలో భాష విషయంలో ఏ మంత్రివర్గం ఏ నిర్ణయం ప్రకటించినా అది అప్పటికప్పుడు వారనుకొన్నదేదైనా చేసెయ్యడమే తప్ప, ఒక శాస్ర్తియమైన విధాన ప్రాతిపదిక లేకుండాపోయింది. భాషా జాతిగా ఎదగాల్సిన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ కారణం చేతనే ఈనాటి ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా భాషను ఎదిగించడానికి కావలసిన ఆలోచనే లేకుండాపోయింది. జాతీయ, విదేశీ వత్తిళ్లకు, గాలివాటు ధోరణులకు అనుగుణంగా మన విధానాలు ఊగిసలాడుతున్నాయి. అందువల్ల అన్ని రంగాల్లో తెలుగు శక్తిహీనమైపోయింది. కొత్త తరం తెలుగుజాతి- అంటే నేటి విద్యార్థులు ఏ భాషలోనూ, సలక్షణంగా నాలుగు వాక్యాలు రాయలేని దుస్థితి ఏర్పడింది. ఈ స్థితి విద్యార్థుల ఆత్మవిశ్వాసానికి, వ్యక్తి వికాసానికి కూడా నేరుగా విఘాతం కలిగిస్తున్నది. రాష్ట్రంలోని విద్యావ్యవస్థ కేవలం వ్యాపార వస్తువుగా మారి, జాతిని కలవారి, లేనివారి బిడ్డలుగా వేరుచేస్తున్న తీరు ప్రజాస్వామికంగాని, నైతికంగాని కాదు.
తెలుగు అక్షరం నేర్చుకోకుండా మన రాష్ట్రంలో పరభాషలో ఎంతైనా చదువుకోవచ్చుననే స్థితి 2003నాటికి ఉంది. అప్పటికే ప్రభుత్వ పాఠశాలల పతనం ప్రారంభమైంది. ప్రయివేటు రంగంలో ఇంగ్లీషు మీడియం జోరందుకొంటున్నది. ఆ దశలో తెలుగు భాషోద్యమ సమాఖ్య పట్టుబట్టి నాటి ప్రభుత్వంచేత జి.ఒ.నెం.86/2003 జారీచేయించింది. దాని ఫలితంగా - 1నుండి 10వ తరగతి వరకు ఏ మాధ్యమంలో బోధించే పాఠశాల అయినా- అన్ని ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా బోధించాలి. ఇప్పటికి ఎన్నోచోట్ల ఆ ఉత్తర్వు సరిగా అమలుకు నోచుకోవడం లేదు. 10వ తరగతిలో తెలుగులో వచ్చే మార్కులు కూడ విద్యార్థి ఉత్తీర్ణతను నిర్ణయిస్తాయి గనుక మొక్కుబడిగా, పరీక్షలకోసమే పాఠం చెప్పడంగా ఎన్నో పాఠశాలల్లో అలవాటయిపోయింది. ఇక- 10వ తరగతి దాటితే తెలుగు చదవవలసిన అవసరమే లేకుండా చేశారు.
పరిపాలన అంతా ప్రజల భాషలో జరగాలనే ప్రజాస్వామ్య దృక్పథంగాని, అందుకోసమే ఈ రాష్ట్రం ఏర్పడిందన్న స్పృహగాని మన ప్రభుత్వాలకు లేదు. ముఖ్యంగా మన పాలకపార్టీలకు ఒక రాజకీయ సంకల్పం ఈ విషయంలో లేకపోవడమే ఇందుకు కారణం. పాలనలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు తలచుకొంటే పూర్తిగా తెలుగులోనే పాలించడం సాధ్యమే అని నిరూపణ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీ రామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయ స్థాయి లో ఎంత త్వరితంగా మార్పుతెచ్చారో చరిత్ర ప్రసిద్ధం. 2005 ప్రాంతంలో నెల్లూరు జిల్లా కలెక్టరుగా ఉన్న రవిచంద్రగారూ నిజామాబాద్ జిల్లా కలెక్టరుగా ఉన్న రాయుడుగారూ, నూరు శాతం ఫలితాన్ని ఆ జిల్లాల్లో సాధించారు. ఇదంతా చరిత్రలో నమోదు అయింది. నేతలు తలచుకొంటే అధికారులు పట్టించుకొంటారు. నేతలకు ఆ సంకల్పమే లేకపోతే ఏం జరుగుతుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అధికార భాషగా తెలుగు అమలుకు సంబంధించి ఎన్నో చట్టాలున్నాయి.
ఇప్పుడు కొత్తగా చట్టాలు చెయ్యాల్సిన అవసరమే లేదు. ఉన్న చట్టాలను అమలుచేస్తే రాష్టమ్రంతా తెలుగే వెల్లివిరుస్తుంది. కాని, ఆ సంగతే మన నేతలకు పట్టదు.
భాషోద్యమకారులు కొన్ని ఏళ్ల తరబడీ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వినతులు ఇస్తున్నారు. ప్రభుత్వ నేతల్లో మాత్రం కదలిక లేదు. నిరసన దీక్షలు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. 2004లో తెలుగు భాషోద్యమ సమాఖ్య గుంటూరులో రెండురోజుల సమావేశం జరిపి, విద్యావేత్తలతో, పాలనా నిపుణులతో ఎంతో చర్చించి ప్రభుత్వానికి ఒక భాషా విధానం ఉండాలంటూ ఒక ప్రణాళికను ప్రభుత్వానికి ఇచ్చింది. దాన్ని నాటి ముఖ్యమంత్రి పట్టించుకోనేలేదు.
ఇంతలో కేంద్ర ప్రభుత్వం తెలుగు, కన్నడాలను పట్టించుకోకుండా తమిళానికి మాత్రమే ప్రాచీన భాషా ప్రతిపత్తినివ్వడం పెద్ద సంచలనానే్న రే పింది. భాషా సాహిత్య సంఘాలు ఉద్యమించాయి. మన ప్రభుత్వానికి ఒక భాషా విధానమంటూ లేకపోవడంవల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. చివరకు 2006 ఫిబ్రవరి 21న తెలుగు భాషోద్యమ సమాఖ్య నిరాహారదీక్షలు చేపట్టిన మీదట, ఆ మర్నాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రయివేటు తీర్మానం పెట్టిన తర్వాతే ప్రభుత్వం కదలింది. 2008నాటికి ప్రాచీన భాష హోదావచ్చినా, పోయి న ఏడాది కేంద్రం నిధులను విడుదలచేసినా, మన ప్రభుత్వం తానుగా ఏమీ డబ్బు ఇవ్వవలసిన అవసరం లేకపోయినా, కనీసం ఒక భవనాన్ని చూపడాన్ని కూడా సకాలంలో చెయ్యలేకపోయింది. ఒక మంత్రిత్వశాఖ, దానికొక మంత్రీ ఉండివుంటే ఈ గతి ఉండేది కాదు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీతోపాటు కొన్ని అకాడమీలను ఎన్టీఆర్ ప్రభుత్వం అనాలోచితంగా రద్దుచేస్తే, ఈనాటివరకూ వాటిని పునరుద్ధరిద్దామనే ప్రయత్నమే లేదు. తెలుగు నేల మీద తెలుగువాడు తెలుగు బాగా చదువుకొంటే ఉద్యోగాలు వస్తాయనే పరిస్థితి లేదు. అస్తవ్యస్త విద్యావిధానాలవల్ల తెలుగు భాష, తెలుగు జాతి దెబ్బతింటున్నది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ భాగస్వాములైన వివిధ ప్రాంతాల ప్రజల యాసలను గౌరవించి, మాండలికాలను సేకరించి అందరికీ ఆమోదయోగ్యమైన ఉమ్మడి భాషను రూపొందించే ప్రయత్నాన్ని చెయ్యనేలేదు. అందరూ కలిసి భాషాబంధంతో పెనవేసుకునే విధంగా భాషా సాంస్కృతిక విధానాన్ని చేపట్టలేకపోయింది. ఇవ్వాళ ప్రాంతాలమధ్య పాలనాపరమైన వైరుధ్యాలు, సంఘర్షణలలో భాషాభేదాలు చోటుచేసుకొంటున్నందుకు మన ప్రభుత్వాలే, మన పాలకులే బాధ్యత వహించాల్సి వుంది.
ఈ అన్ని కారణాలవల్ల ఇప్పుడు తెలుగు ప్రజ లు, భాషా సాంస్కృతికోద్యమకారులు ప్రభుత్వంపట్ల ఆగ్రహంతో ఉన్నారు. 37 ఏళ్ల తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతామని ముందుకు వచ్చిన ప్రభుత్వ నేతలను- ఈ సభలు ఎవరికోసం, ఎందుకోసం అని ప్రశ్నిస్తున్నారు. ఈ సభలు నిర్వహించే నైతిక అర్హత మీకు ఉండాలంటే ముందుగా మీ భాషా విధానం ఏమిటో ప్రకటించమంటున్నారు. తెలుగుకు మంత్రిత్వశాఖను, దాని క్రింద ఒక తెలుగు అభివృద్ధి సాధికార సంస్థ (డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటుచేస్తూ ప్రకటన చెయ్యాల్సిందే అంటున్నారు. 9 డిమాండ్లను ముందుకు తెచ్చి వాటిని ఆమోదించాల్సిందేనని పట్టుపడుతున్నారు. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తెలుగులో పాలనను మొదలుపెడతామని ప్రకటించాలని పట్టుపడుతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఈ అంశాల మీద ఏమీ స్పందించడం లేదు.