నేడు మన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడానికి కంకణం కట్టుకున్నట్లు కనబడుతుంది. మన చిన్నతనంలో రాజుల కథలు విన్నాం. రాజులు ప్రజల బాగుకోసం ఎంతగానో శ్రమించేవారని నాటి కథల ద్వారా బోధపడింది. కాని నేటి నేతల్లో అటువంటి ఛాయలు మచ్చుకైనా కానరావడంలేదు. కాని అవినీతి ఛాయలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. మన ప్రజాస్వామ్యానికి ఆరుపదులు దాటినా ప్రజల సమస్యలు తగ్గకపోగా వంద రెట్లు పెరిగాయి. నేడు దేశంలో ధరలు ఉప్పు సహా త్రాగేనీరు మొదలు మధ్యతరగతివారికి అందుబాటులో లేకుండాపోయాయి. ఇక పేదవారి బతుకు వర్ణనాతీతం. 120కోట్ల జనాభా కలిగిన భారత ప్రజలను కేవలం 545 మంది పార్లమెంటు సభ్యులు గారడిచేస్తూ మోసం చేస్తున్నారు. ప్రజలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
- మూర్తి ఆనంద్‌కుమార్, రామాయంపేట
ఇదేం ప్రభుత్వ రీతి?
ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను వివాదాస్పదంగా మార్చటం ప్రభుత్వం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం ఇలా కావాలనే చేస్తుంటుంది. ఎప్పుడూ లేనిది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అంటూ ప్రవేశపెట్టింది. అందులోనూ తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించాలని మెలిక పెట్టింది. ఎప్పటినుండో ఎస్.జి.టి. పోస్టులకు అందరూ అర్హులు కాగా, కాదు డి.ఎడ్ వారు మాత్రమే రాయాలంటూ కొత్త పల్లవి అందుకొని, బి.ఇడి. చేసిన వారి జీవితాలను అంధకారం చేసింది. బి.కాం., బి.ఇడి. వారు దేనికీ అర్హులు కారంటూ అప్పుడప్పుడూ వారినీ భయపెడుతుంటుంది. తీరిగ్గా సరే దయతలిచాం లెండి రాసుకోండి అంటూ వరమిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఆర్.ఎస్.ఎమ్.ఎ. ద్వారా ఇచ్చే స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మాత్రమే భర్తీచేస్తామని టీచర్లకు ఝలక్ ఇస్తోంది. నిబంధనల ప్రకారం 70 శాతం పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీచేయవలసి వుంటుంది. అయినా కావాలనే వివాదాస్పదం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం.
- యస్.ఇస్మాయిల్ బాష, నందికొట్కూరు
కట్టడముంటే చాలు!
కోల్‌కతాలోని ఇందిరాభవన్ పేరును ఖాజీనజ్రూల్ ఇస్లాం భవన్‌గా మార్చితే ఎందుకు అభ్యంతరం? దేశంలో ఇందిర పేరుతో ఎన్నో పథకాలు, విగ్రహాలు ఉన్నాయి. అవి చాలవా? మమతాబెనర్జీ కాంగ్రెస్ మనోభావాలను దెబ్బతీశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించుట పాడియా? మైనారిటీలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుందన్న కాంగ్రెస్ పార్టీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మైనారిటీ కవి పేరు ఆ భవనానికి పెడితే వచ్చే నష్టమేంటి? 1972లో ఎఐసిసి సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే ఇందిర ఆ భవనంలో ఉన్నారని ఆ తర్వాత ఎప్పుడు కూడా బసచేయలేదని చెబుతున్న అల్వీ, వివాదంలోనికి దిగదలచుకోలేదని దాటవేయుట ఎంతవరకు సమంజసం? ఇది ముస్లిముల మనోభావనలను దెబ్బతీయడం కాదా?! అట్లే ఢిల్లీలోని చాందినీ చౌక్‌కు సచిన్ తెండూల్కర్ పేరు పెట్టడం అసమంజసం. ఒక చరిత్రాత్మక నగరంలో షాజహాను మొగలు చక్రవర్తి నిర్మించిన కట్టడం పేరు మార్చి ఒక క్రీడాకారుని పేరుపెట్టుట చరిత్రకు ద్రోహం చేయుటయే.
- పెండెం శ్రీ్ధర్, సిద్దిపేట
నేడు మన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం
english title:
pramadamlo prajaswamyam
Date:
Saturday, February 4, 2012