పావన గంగానది ప్రవహించే ఈ పవిత్ర భారతదేశంలో ఎందరో మహనీయులు జన్మించి, తమ దివ్యమైన జీవనం ద్వారా ఈ మన దేశానికి వనె్న తెచ్చారు. ఒక విదేశీ వనిత స్వామివివేకానందను 1896 మే నెలలో ఇంగ్లండులో కలుసుకొని, ఆయన ప్రవచించిన విశ్వవ్యాపక హైందవ సిద్ధాతాలకు ఆకర్షితురాలై, మానవ సేవలోనే జీవన పరమార్ధం ఉన్నదనే నిగూఢ సత్యాన్ని ఆమె గ్రహించి భారతదేశానికి వచ్చి, బెంగాలీ భాష నేర్చుకొని, శ్రీరామకృష్ణమఠం కేంద్రంగా చేసుకొని, బాలికా పాఠశాలనేర్పరచి, స్ర్తివిద్యావ్యాప్తికి, ఎంతో సేవ చేసింది. 1899లో బెంగాల్‌ను ప్లేగువ్యాధి కబళించిన భయంకర స్థితిలో స్వామి వివేకానంద, సహాయ కార్యక్రమాలకు వెంట తీసుకువెళ్లిన బృందానికి, సోదరి నివేదిత నాయకత్వం వహించి, వ్యాధిగ్రస్తులైన వారిని అక్కునచేర్చుకొని, గుడిసె వాసుల పరిసరాల దుర్గంధాన్ని తొలగించి, ఎంతో సేవ చేసింది. అంతేకాదు స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర నిర్వహించింది. భారతదేశంలో స్వదేశీ భావనను ప్రోత్సహించింది.
సోదరి నివేదితగా ఖ్యాతిగాంచిన, ఈమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్, ఇంగ్లండులో క్రీ.శ.1867లో మేరి, శామ్యూల్ దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి క్రైస్తవ మతాచార్యుడు, ఈమె తల్లి మేరి, ఈమె తన గర్భంలో ఉన్నప్పుడే ఈమెను పరమేశ్వరుని సేవకు అర్పించాలని, నిర్ణయించుకుంది.17 ఏళ్ళ వయస్సులో విద్య పూర్తిచేసి, విద్యార్థి వసతి గృహంలో ఉండేది. ఆ వసతి గృహ నిర్వాహకురాలి ప్రభావంతో ఈమె సంయమనం, అనుశాసనం, ఆజ్ఞాపాలనం వంటి ఉత్తమ గుణాలను పుణికి పుచ్చుకుంది!
1893లో చికాగోలో జరిగిన విశ్వ మత సభలో, తన అనర్గళ వాగ్ధాటితో నాటి సభలోని వారందరినీ మంత్రముగ్ధులను చేసిన స్వామి వివేకానంద కొందరు ఆంగ్ల స్నేహితుల ఆహ్వానంపై 1895లో హిందూ ధర్మం గురించి ప్రసంగించడానికి లండన్ చేరుకున్నారు. స్వామీజీ ప్రసంగాలను, మార్గరెట్ నోబుల్ శ్రద్ధగా విని, ధర్మభూమి, కర్మభూమి, భగవద్గీతను అందించిన పుణ్యభూమి భారత్‌లో తన జీవన కార్యాన్ని కొనసాగించాలని స్వామీజీని ప్రాధేయపడింది! కాని నాడు స్వామీజీ ఆమెకు పూర్తి అనుమతి యివ్వలేదు, కొన్ని గ్రంథాలనిచ్చి అవగాహన పెంచుకోమన్నారు. 1897లో మార్గరేట్ (సోదరి నివేదిత) నేను భారతదేశం వస్తానని ఉత్తరం వ్రాసింది. స్వామీజీ సమాధానమిస్తూ, భారతదేశ వాతావరణం నీకు సరిపడదు. నేడు ఇచ్చట పేదరికం తాండవిస్తుంది. ప్రజల్లో కొన్ని మూఢ నమ్మకాలున్నాయి. ప్రజల్లో కొంత అజ్ఞానం ఉంది. నీ కాళ్లపై నీవు నిలబడగలిగే స్థితిలో రాగలగాలి. కొన్ని యిబ్బందులను ఎదుర్కొనగలగాలి. ఇవన్నీ ఆలోచించుకొని రావలసిందిగా స్వామీజీ సలహా యిచ్చారు.
1898 జనవరి 28న మొంబాసా, ఓడలోని ఆమె కలకత్తా ఓడరేవులో స్వామి వివేకానంద ఆమెను సాదరంగా ఆహ్వానించి బేలూరు దగ్గర నిర్మించబోయే మఠం దగ్గర ఉంచారు. అక్కడ ఆమె హిందూ జీవన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. స్వామీజీ వేదాంతం ఆధ్యాత్మికత అద్వైతం కర్మయోగం మొదలైన విషయాలు విపులంగా ఆమెకు వివరించారు. అంతేగాదు శ్రీరామకృష్ణ మఠ సభ ప్రారంభ సందర్భంలో సభాముఖంగా స్వామీజి మార్గరెట్‌ను పరిచయం చేశారు. ఆ సందర్భంలో ఆమె ప్రసంగిస్తూ గత అర్ధశతాబ్దినుండి ఆధ్యాత్మిక రంగంలో మాకు ఏర్పడిన శూన్యతను పోగొట్టి ప్రాణప్రతిష్ట చేయగలిగింది ఒక్క హిందూ ధర్మమేనని ప్రసంగించింది. యావత్ ప్రపంచానికి సుఖశాంతులను అందించేది హిందూత్వమే అన్నదామె. ఆ తరువాత స్వామీజీ ఆమెను నీలాంబరుచటర్జీ ఇంటికి తీసుకెళ్లి దేవి ప్రతిమ ముందు మోకరిల్లచేసి నుదుట విభూది, కుంకుమ అద్ది ఆమె జీవిత కుసుమాన్ని పరమేశ్వరుని చెంత సమాజ పరమేశ్వరుని పాదాల మ్రోల నివేదిస్తున్నానని, నేటి నుండి ఆమె నివేదితగా పిలువబడుతుందని ప్రకటించారు. ఆమె రామకృష్ణమఠంలో నైష్టిక బ్రహ్మచర్యం స్వీకరించింది. రామకృష్ణ మఠం ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొని పేద సాదల పాలిట కన్నతల్లిలా ఆదుకొన్నది.
- వెనె్నల యోగయ్య
పావన గంగానది ప్రవహించే ఈ పవిత్ర భారతదేశంలో ఎందరో మహనీయులు జన్మించి
english title:
samaja sevake ankitamina sodari nivedita
Date:
Saturday, February 4, 2012