హైదరాబాద్, జనవరి 26: బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్ సంస్థకు గతంలో ఇచ్చిన 250 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం నిర్ణయించారు. ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సంస్థకు (ఎపిఐఐసి) ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక ఆర్ధిక మండలి ఏర్పాటుకు ఇచ్చిన భూములను సంస్థ వినియోగించక పోవడంవల్లే భూములను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే సద్వినియోగం చేయని సంస్థల నుంచి భూములను స్వాధీనం
చేసుకుంటున్న ప్రభుత్వం, తాజాగా బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్ భూములు కేటాయింపు సైతం రద్దు చేయడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో 250 ఎకరాల భూమిని బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌కు 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించారు. 2006 జూలై 12న సెజ్‌కు భూములు కేటాయించేందుకు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం, కేవలం 24 గంటల్లోనే భూములను సంస్థకు అప్పగించింది. తరువాతి కాలంలో భూములు వినియోగం కాకపోవడంతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా తీవ్ర స్థాయిలోనే ఆక్షేపణలు చేసింది. ప్రభుత్వం భూముల కేటాయింపు సక్రమంగా లేదని ఆరోపించింది. ఇది అప్పట్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌కు కేటాయించిన భూములను వెనుక్కి తీసుకోవాలని ఎపిఐఐసిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఒప్పందం చేసుకున్న ఏడాదిలోగా నిర్మాణ పనులు చేపట్టాలని, తదుపరి ఐదేళ్లలో ఐటి రంగానికి 4.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. అలాగే 45 వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కూడా ఒప్పందంలో స్పష్టం చేశారు. ఇందులో 20వేల మందికి ప్రాజెక్టు ప్రారంభమైన మూడేళ్లలోనే ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందాలను బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ఉల్లంఘించడంతో 2011 ఏప్రిల్‌లో ప్రభుత్వం సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఇచ్చిన భూములు ఎందుకు వెనుక్కి తీసుకోకూడదో చెప్పాలంటూ ప్రశ్నించింది. అయితే ఇందుకు సమాధానంగా తాము భూములను వినియోగించుకోలేక పోతున్నామని, అందువల్ల తమకు ఇచ్చిన భూములు వెనుక్కి తీసుకోవాలని బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్ సంస్థే ప్రభుత్వానికి లేఖ రాయడంతో చివరకు ప్రభుత్వం ఈ భూములు వెనుక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఇలా ఉండగా, గతం నుంచి అనేక సంస్థలకు భూములు కేటాయిస్తున్నప్పటికీ ఆ సంస్థలు భూములను సద్వినియోగం చేయకపోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. గత కొన్ని నెలలుగా ఇటువంటి సంస్థల నంచి భూములను వెనుక్కి తీసుకునేందుకు చర్యలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే రాకియా, బ్రాహ్మణి స్టీల్స్, రక్షణ, లేపాక్షి హబ్, మోజర్ బేర్ వంటి సంస్థలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనుక్కి తీసుకుంది. అలాగే మరికొన్ని సంస్థలకు ఇచ్చిన భూముల వినియోగంపైనా దృష్టి పెడుతున్నామని, వాటిపైనా త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
తక్షణ చర్యలకు ఎపిఐఐసికి సిఎం ఆదేశం
english title:
s
Date:
Sunday, January 27, 2013