హైదరాబాద్, జనవరి 26: జై ఆంధ్రప్రదేశ్ పేరిట ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజమండ్రిలో నిర్వహించిన సభలో తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను కించపర్చే విధంగా అభూత కల్పనలు, మితిమీరిన అహంకారంతో మాట్లాడారని వివిధ పార్టీల తెలంగాణ నేతలు, సంఘాలు విరుచుకుపడ్డాయి. ఉద్యమకారులను, ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉండవల్లి మాట్లాడారని ఎమ్మెల్యే తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చీమూనెత్తురు ఉంటే కాంగ్రెస్ విషకౌగిలి నుంచి బయటకు రావాలని సూచించారు. కెవిపి రామచంద్రరావు దర్శకత్వంలో ఉండవల్లి వీధినాటకం ఆడుతూ డ్రామా ఆర్టిస్ట్‌గా మారారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు డిమాండ్ వేర్పాటువాదం అయితే మద్రాస్ నుంచి విడిపోయిన మీదేమిటని ప్రశ్నించారు. చెప్పులు లేకుండా హైదరాబాద్ వచ్చి, ఇప్పుడు కోటీశ్వరులై బలిసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మొదటి ఎస్సార్సీ విశాలాంధ్ర కావాలని చెప్పిందనేది పచ్చి అబద్ధమన్నారు. కెవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నర్సింగరావులాంటి తెలంగాణ నేతలు విలీనాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. విశాలాంధ్ర వాదన సామ్రాజ్యవాదకాంక్షతో నిండి ఉందని నెహ్రూ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కానీ నెహ్రూ వాఖ్యలను ఉండవల్లి వక్రీకరించారని విమర్శించారు. తెలంగాణ గిరిజనులను కాల్చి చంపి పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని ఉండవల్లి అంటున్నారని మండిపడ్డారు. ఏకంగా నదికి నదినే మలుపుకుపోతే రాజశేఖర్‌రెడ్డిని జలదొంగ అనకపోతే ఏమనాలని ప్రశ్నించారు. ఆర్డీఎస్ తూములను బాంబులతో బద్ధలు కొట్టి పాలమూరు నీళ్లను దోచుకుపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నోళ్లు ఎండబెట్టి నారుమళ్ల కోసం నీరు తరలించుకు పోలేదా? అని అడిగారు. పేరుకే ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ కానీ, అక్కడ ఒక్క తెలంగాణ నాయకుడైనా లేడని తెలిపారు.
జై ఆంధ్రప్రదేశ్ పేరిట నిర్వహించిన సీమాంధ్ర సభకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ తప్ప సీమాంధ్ర నేతలంతా సభకు వెళ్లారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ‘సీమాంధ్రకు అసెంబ్లీలో 175 సీట్లు ఉన్నాయి. తెలంగాణకు 119 సీట్లు మాత్రమే ఉన్నాయి. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం’ అని అహంకారపూరితంగా ఉండవల్లి మాట్లాడారని విమర్శించారు. ఇలాంటి దురంహకారుల గురించి బాబా సాహెబ్ అంబేద్కర్ ముందే ఊహించి రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని రాష్ట్రం పరిధిలోకాకుండా కేంద్రం పరిధిలో చేర్చారని అన్నారు. మా ఉద్యోగాలు, మా నీళ్లను దోచుకున్న వారిని దోపిడీదారులు అనకుండా ఇంకేమనాలి, ఇంకే పదముందని హరీశ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారిపై ఇప్పుడు ప్రేమ చూపుతున్నారని, ఎప్పుడైనా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారా? అని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో నాయకుల పిల్లలు ఎందుకు మరణించలేదని ప్రశ్నిస్తున్నారు. జై ఆంధ్ర ఉద్యమంలో ఉండవల్లి, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల పిల్లలు ఎందుకు మరణించలేదని మేం ప్రశ్నిస్తే ఎలా ఉంటుందని అడిగారు. ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తరువాత వాటిని రద్దు చేయించారని విమర్శించారు. ఒకప్పుడు జై ఆంధ్ర ఉద్యమం నడిపిన ఉండవల్లి తెలంగాణ ఉద్యమం తరువాత రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ సమైక్యాంధ్ర అంటూ ఊసరవెల్లిలా మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు.
ఉండవల్లి మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. సీమాంధ్ర నాయకులు ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుని ఇప్పుడు ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానించే విధంగా ఉండవల్లి మాట్లాడారని టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం నాయకుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. ఉండవల్లి మాటలు కండకావరంతో కూడుకున్నాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తెలగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారన్నారు. దోచుకున్న వారిని దోపిడీదారులు అనే పిలుస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ కోసం ఉద్యమించాలన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ అఫ్జల్‌గురు కన్నా ప్రమాదకరమైన ఉగ్రవాది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మొత్తం పార్లమెంటు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఉండవల్లి ఉపన్యాసంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్ర నేతలంతా దొంగల ముఠాయేనని, దొంగలను దొంగలు అనకుంటే ఇంకేమనాలని ప్రశ్నించారు. లగడపాటి రాజ్‌గోపాల్ గజదొంగ అని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఉండవల్లి అఫ్జల్‌గురులాంటి ఉగ్రవాది
english title:
n
Date:
Sunday, January 27, 2013