న్యూఢిల్లీ, జనవరి 26: ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కోర్ కమిటీ శనివారం సాయంత్రం మరోసారి సమావేశమై, ప్రత్యేక తెలంగాణ అంశంపై గంటన్నరపాటు చర్చలు జరిపింది. గతవారం రోజుల్లో భేటీ కావడం ఇది మూడోసారి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు ప్రత్యేక తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశానికి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, లోక్‌సభ నాయకుడు, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి పి చిదంబరం, రక్షణ మంత్రి ఏకె ఆంటోనితోపాటు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ కూడా హాజరయ్యారు. తెలంగాణ అంశంపై షిండే పెట్టిన గడువు సోమవారంతో పూర్తి కావస్తున్న తరుణంలో కోర్ కమిటీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 28 లోగా తెలంగాణపై ఏదోఒక నిర్ణయం ప్రకటించటం సాధ్యం కాదని గులాం నబీ ఆజాద్ ఇటీవల ప్రకటించటం తెలిసిందే. ఆజాద్ చేసిన ప్రకటనపై తెలంగాణ భగ్గుమనటంతోపాటు, గడువులోగా నిర్ణయం ప్రకటించకుంటే తమ దారి తాము చూసుకుంటామని టి.ఎంపీలు ప్రకటించటంతోపాటు టిఆర్‌ఎస్, ఇతర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంస్థలు తాజాగా ఉద్యమ కార్యక్రమం ప్రకటించాయి. మరోవైపు సీమాంధ్రకు చెందిన ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం రాజమండ్రిలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సదస్సు నిర్వహించి సమైక్యాంధ్రకు పిలుపునివ్వటంతో రాష్ట్రంలో పరిస్థితి మరింత విషమించింది. ఇరువర్గాల వాదనల నేపథ్యంలో, సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తే బాగుంటుందనేది కాంగ్రెస్ పెద్దలకు అంతుపట్టటం లేదని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల రాజీనామాలతో కిరణ్ ప్రభుత్వం కుప్పకూలుతుందని హైకమాండ్ ఆందోళన చెందుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు తెలంగాణ సమస్యను ఇదేవిధంగా నాన్చి, తరువాత నిర్ణయం తీసుకుంటే మంచిదన్న ఆలోచన కూడా హైకమాండ్ మదిలో లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మూడోసారి ‘కోర్’ భేటీ ఎటూ తేలని నిర్ణయం ‘బడ్జెట్’ ముగిసే వరకూ ఇంతే..
english title:
n
Date:
Sunday, January 27, 2013