దీక్ష నిర్వహణకు అనుమతి నిరాకరించిన పోలీసులు అడ్డుకుంటే తెలంగాణ వ్యాప్తంగా దీక్షలని హెచ్చరిక
ఏం జరిగినా తెలంగాణ మంత్రులదే బాధ్యతని ప్రకటన
హైదరాబాద్, జనవరి 26: ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా ఆదివారం తెలంగాణ సమర దీక్ష జరిపి తీరుతామని తెలంగాణ రాజకీయ జెఎసి ప్రకటించింది. అనుమతిస్తే ఇందిరాపార్క్ వద్ద 36 గంటల దీక్ష జరుగుతుందని, అనుమతించకుంటే ఎక్కడ నిలిపివేస్తే అక్కడే తెలంగాణవ్యాప్తంగా 36 గంటలపాటు సమర దీక్ష సాగుతుందని ప్రకటించింది. తెలంగాణపై సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ రాజకీయ జెఎసి ఆదివారం నుంచి 36 గంటల సమర దీక్షను ఇందిరాపార్క్ వద్ద తలపెట్టింది. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, జెఎసిలు ఇందిరాపార్క్ వద్ద జరిగే సమర దీక్షకు కదలి రావాలని జెఎసి పిలుపునిచ్చింది. అడ్డుకుంటే ఎక్కడికక్కడే దీక్ష జరపాలని సూచించింది. 27న ఇందిరాపార్క్ వద్ద సమరభేరి నిర్వహణ గురించి జెఎసి ముందే ప్రకటించింది. అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేశారు. పది రోజుల తరువాత చివరకు శనివారం అనుమతి నిరాకరిస్తూ పోలీసులు లేఖ పంపించారని జెఎసి తెలిపింది. అనుమతి నిరాకరిస్తూ పోలీసులు సమాచారం ఇచ్చిన తరువాత జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో జెఎసి ప్రతినిధులు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌తో చర్చలు జరిపారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. కుంటి సాకులతో అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. అసాంఘిక శక్తులు సమర దీక్షలో ప్రవేశిస్తాయని చెబుతూ అనుమతి నిరాకరించారని తెలిపారు. సీమాంధ్ర నాయకులు ఉండవల్లి అరుణ్‌కుమార్ నిర్వహించిన సమైక్యాంధ్ర సభలో తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజాప్రతినిధులు, మంత్రులు స్పందించలేదు. సమర దీక్షలో స్పందించేందుకు జెఎసి ప్రయత్నించినా అనుమతి ఇప్పించడానికి ప్రయత్నించలేదని విమర్శించారు. అనుమతి నిరాకరణతో జరిగే సమర దీక్షలో తలెత్తే పరిణామాలకు తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత వహించాలని హెచ్చరించారు.
తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలకు సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం దారుణమని, ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం జరిపినట్టు, ఆంధ్రా పాలకులకు, ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని తెలిపారు.
సమర దీక్షకు అనుమతి లేకపోతే తెలంగాణవ్యాప్తంగా ఎక్కడికక్కడే దీక్ష జరపాలని ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. నూతనంగా ముంబై జెఎసిని ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన పదిహేను మంది సభ్యులు బృందం దీక్షలో పాల్గొనడానికి వచ్చింది. విలేఖరుల సమావేశంలో జెఎసి కన్వీనర్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నాయకులు దేవిప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, బిజెపి నాయకులు రాజేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.