హైదరాబాద్, జనవరి 26: వివాదాస్పదమైన కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి రాజమండ్రిలో నిర్వహించిన ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ వెనుక అధిష్ఠానం హస్తం ఉందా? వ్యూహాత్మకంగానే హైకమాండ్ మార్గదర్శకంలో ఉండవల్లి సభను నిర్వహించారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ సాగుతోంది.
రాజమండ్రిలో ఉండవల్లి నిర్వహించిన సభకు అధిష్ఠానం అండ ఉందనడానికి అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకపక్క ప్రత్యేక తెలంగాణ, మరోపక్క సమైక్యాంధ్ర ఆందోళనలు కొన్ని రోజులుగా ఉధృతంగా సాగుతుండగా, ఢిల్లీలో అధిష్ఠానం తెలంగాణపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉండవల్లి సభను నిర్వహించడం విశేషం.
సాధారణంగా ప్రస్తుత వాతావరణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ నేతలు ఎవరైనా సభను నిర్వహించదలచుకుంటే అధిష్ఠానం అడ్డుకుంటుంది. ఇటీవల పిసిసి నేతృత్వంలో విజయవాడలో కాంగ్రెస్ ప్రాంతీయ సదస్సు నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు జరగ్గా చివరి క్షణంలో అధిష్ఠానం రద్దు చేయించిన విషయం తెలిసిందే. రాజమండ్రిలో ఉండవల్లి నిర్వహించిన సమైక్యాంధ్ర సదస్సుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ అతిరథ, మహారధులందరూ హాజరు కావడం గమనార్హం. పిసిసి అధినేత బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కెవిపి రామచంద్రరావు, పదిమంది వరకు మంత్రులు, పాతికమంది వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ ప్రముఖులు రాజమండ్రి సభకు హాజరయ్యారు.
అధిష్ఠానం అండ లేనిదే ఇంతమంది హాజరుకారన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఇక సభలో ప్రసంగించిన ఉండవల్లి ప్రధానంగా తెరాస అధినేత కెసిఆర్, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కెటిఆర్, మేనల్లుడు, ఎమ్మెల్యే టి హరీష్‌రావు, కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌లపై మాత్రమే నిప్పులు చెరిగారు. వారితో సమానంగా సీమాంధ్ర నాయకుల్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలనుగాని, నాయకుల్నిగాని ఉండవల్లి ఒక్క మాట అనకపోవడం గమనార్హం. కేవలం తెరాసనే లక్ష్యంగా చేసుకుని ఉండవల్లి విమర్శలు చేశారు.
చక్రం తిప్పిన కెవిపి
తెలంగాణ, సీమాంధ్ర నాయకులు ఇటీవల నాలుగైదు రోజులు ఢిల్లీలో మకాం వేసి అధిష్ఠానం పెద్దల్ని కలిసి తమతమ వాదనల్ని వినిపించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగానే అధిష్ఠానం నిర్ణయం తీసుకోనున్నట్టు, 28లోగానే దీనిపై ప్రకటన చేయనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో సీమాంథ్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానం పెద్దలకు తమ వాదన వినిపించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఢిల్లీ లాబీయింగ్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే పైచేయి సాధించారన్న అభిప్రాయం కలిగింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కెవిపి రామచంద్రరావు వెనుక ఉండి చక్రం తిప్పడమే దీనికి కారణమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీమాంథ్ర నాయకులు అధిష్ఠానం పెద్దలందరినీ సుడిగాలిలా తిరిగి కలుసుకున్నారు. చివరకు రాష్టప్రతిని, ప్రధానమంత్రిని కూడా వారు కలుసుకున్నారు. ఇక ఆజాద్, వాయలార్, షిండే వంటివారిని ఒకటికి రెండుసార్లు కలిసి తమ వాదనల్ని వినిపించారు. వీరందరి వద్ద అప్పాయింట్‌మెంట్లు తీసుకోవడంలో డాక్టర్ కెవిపిదే కీలక పాత్ర. ఢిల్లీ పెద్దలతో తనకున్న పరిచయాలను డాక్టర్ కెవిపి ఈ సందర్భంగా ఉపయోగించుకున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరిద్దరు కాంగ్రెస్ పెద్దల్ని మాత్రమే కలుసుకోగలిగారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో కెవిపి వంటి నాయకుడు లేని కొరత స్పష్టంగా బయటపడింది. అందువల్లనే ఇపుడు తెరాసకు, టి.కాంగ్రెస్‌కు డాక్టర్ కెవిపి లక్ష్యంగా మారారు. రాజమండ్రి సభకు కెవిపి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి నేరుగా చేరుకోవడం విశేషం. తెలంగాణ ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, సీమాంధ్ర నాయకులకు నుంచి వ్యతిరేకత రావడం వల్ల తాము ఏం చేయలేకపోతున్నామని తప్పించుకునేందుకే అధిష్ఠానం రాజమండ్రి సభను ప్రోత్సహించిందా? అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విషయంలో తన చేతికి మట్టి అంటుకోకుండా సీమాంధ్ర నాయకుల్ని సాకుగా చూపించాలన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సభలో ఉండవల్లి మాట్లాడుతూ, ‘సీమాంథ్ర నాయకుల్ని కెసిఆర్ ప్రభృతులు తీవ్రస్ధాయిలో తిడుతుంటే మీరెవరూ వారిని ఎందుకు తిట్టడంలేదని కొందరు అడుగుతున్నారు. వారు విడాకులు కావాలని కోరుకుంటున్నారు. మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం కూడా వారిని తిడితే విడాకులు వచ్చేస్తాయి’ అని అన్నారు. అయితే ఈ సూత్రాన్ని కేవలం టి.కాంగ్రెస్ నాయకుల వరకు మాత్రమే పాటించిన ఉండవల్లి కెసిఆర్ బృందానికి మాత్రం మినహాయింపు ఇవ్వలేదు.
ఢిల్లీ వ్యూహంలో భాగంగానే రాజమండ్రి సభ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ
english title:
s
Date:
Sunday, January 27, 2013