హైదరాబాద్, జనవరి 26: స్వార్థం, సంకుచిత ధోరణి విడనాడి బాధ్యతగల పౌరులుగా రాష్ట్రంలోని ప్రజలు కలిసిమెలిసి అభివృద్ధి సాధనకు సమిష్టిగా శ్రమిద్దామని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేద్దామన్నారు. పేద, బడుగుర్గాల ఉన్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం అంకితమై పని చేస్తోందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం ఇక్కడ పరేడ్ మైదానంలో కన్నుల పండువగా జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకూ సమంగా అదాలని, లక్ష్య సాధనకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. రాష్ట్రం సాధించిన అభివృద్ధిని గణాంకాలతో వివరిస్తూ జాతీయ స్ధాయిలో వ్యవసాయంలో 2.57 శాతం వృద్ధిరేటు సాధించగా, ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో 8.77 శాతం వృద్ధి సాధించిందన్నారు. సేవా రంగంలో 7.79 శాతం, పరిశ్రమల్లో 2.30 శాతం వృద్ధి రేటు సాధించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించి దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. 37ఏళ్ల తర్వాత తిరుపతిలో నిర్వహించిన నాల్గవ తెలుగు ప్రపంచ సభల నిర్వహణను అభినందించారు. తెలుగును అధికారిక భాషగా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యత, సకాలంలో సేవా ఫలాలను సామాన్యులకు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వచ్చే మూడు నెలల్లో మీ సేవ ద్వారా 100 సేవలను అందించేందుకు ప్రణాళిక ఖరారు చేశామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయడాన్ని స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగాల భర్తీలో సంస్కరణలు తెచ్చామని, నిర్ణీత కాలపరిమితి లోపల ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభమైందన్నారు. సుపరిపాలనను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందిరమ్మ బాట ద్వారా ముఖ్యమంత్రి నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి 42 ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి 31 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి నిర్మాణాన్ని చేపడుతామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఇందిర క్రాంతి పథం కింద 1.46 కోట్ల మంది మహిళలతో ఏర్పాటు చేసిన 13.61 లక్షల స్వయం సహాయ బృందాలకు 5900 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. వీరికి బ్యాంకులు 56వేలకోట్ల రూపాయలు ఇచ్చాయన్నారు. బాలికల పాఠశాలలు, వసతి గృహాల్లో మూడు వేల కోట్ల రూపాయలతో వౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సున్నంవారిగూడెం డిక్లరేషన్‌కు లోబడి గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. శిశు మరణాల రేటు, కాన్పుల్లో శిశు మరణాల రేటును తగ్గించేందుకు ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. త్వరలో ప్రభుత్వోద్యోగుల కోసం ఆరోగ్య నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజీవ్ యువకిరణాలు, మన బియ్యం, ఇందిర జల ప్రభ పథకాల అమలు తీరును ప్రశంసించారు. ఐటి రంగంలో 3.2 లక్షల మందికి ఉపాధి కల్పించామని, ఈ రంగంలో ఎగుమతులు 39 శాతానికి చేరుకున్నాయని, 53 వేల కోట్ల రూపాయల టర్నోవర్ దాటిందన్నారు. విశాఖపట్నం, కాకినాడ, వరంగల్, తిరుపతిలో ఐటి ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహేశ్వరంలో హార్డ్‌వేర్ పార్కులను త్వరలో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 202 చదరపు కి.మీ పరిధిలో ఐటి పెట్టుబడుల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇంతవరకు 6.40 కోట్ల మంది ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోగా, 4.96 కోట్ల మందికి కార్డులను పంపిణీ చేశామన్నారు. నగదు బదిలీ పథకం, లబ్ధి దారులకు నేరుగా ప్రభుత్వ ఫలాలు అందించేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, కేజీ బేసిన్‌లో డి-6 బావుల్లో సహజవాయువు నిల్వలు తగ్గినందున, జల విద్యుత్ ఉత్పాదన తగ్గినందున విద్యుత్ కొరత తలెత్తిందని, ఏపి ట్రాన్స్‌కో అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యుత్ ఆదా కోసం ఇంధన పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందించారు. డిస్కాంలు వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి నాగోలు- మెట్టుగూడ మధ్య మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభం అవుతాయన్నారు. వచ్చే 18 నెలల్లో కృష్ణా తాగునీటి పథకం మూడో దశను పూర్తి చేస్తామని, గోదావరి జలాలను తరలించేందుకు 3,375 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. భాగస్వామ్య సదస్సు వల్ల పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. చితూర్తు, మెదక్ జిల్లాల్లో ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో జాతీయ పెట్టుబడుల తయారీ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు, వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో 74 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 12 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. చెన్నై- బెంగళూరు పరిశ్రమల కారిడార్‌లో కృష్ణపట్నంరేవును చేర్చారన్నారు. హైదరాబాద్‌లో ఫుట్ వియర్ డిజైన్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఎనిమిది జిల్లాల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసి కేంద్రం సహాయంతో అమలుచేస్తున్నామన్నారు. దీని వల్ల వామపక్ష తీవ్రవాదం వ్యాప్తిని నిరోధించామన్నారు. శాంతి భధ్రతల విభాగం, అభివృద్ధి సంస్ధలు సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు.
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్
english title:
n
Date:
Sunday, January 27, 2013