చిత్తూరు, జనవరి 27: జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా అన్ని మండలాల్లో ఎన్నికలు ఈ దఫా సింగిల్‌విండోలతో ప్రారంభమవుతున్నాయి. సింగిల్ విండోల ఫలితాలపై పంచాయతీలు, ఎంపిటిసిలు, జిల్లాపరిషత్ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీకన్నా తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా కావడం, ఇంకోవైపు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకీ సొంతజిల్లానే. అలాగే వారికి అన్నివిధాల సమఉజ్జీ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులు వైఎస్‌ఆర్‌సిపి గెలుపు బాధ్యతలు చేపట్టడంతో చిత్తూరుజిల్లాలో సింగిల్ విండో ఎన్నికలు శాసనసభ ఎన్నికలకన్నా రసకందాయంగా మారాయి. ఈ నేపధ్యంలోనే మదనపల్లె డివిజన్‌లో గత వారం నామినేషన్ల సమయంలో కాంగ్రెస్ నాయకులు అధికారుల అండదండలతో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి తరపున నామినేషన్లు వేయనివ్వకుండా కొంతమేరకు అడ్డుకున్నారు. ఈ ఘటన చిత్తూరు, తిరుపతి డివిజన్లలో సోమవారం నామినేషన్ల సమయంలో జరగకుండా ఉండేందుకు టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి రెండురోజులు ముందుగానే పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 77 సింగిల్‌విండోలు ఉండగా ఇందులో ఐదింటికి నోటిఫికేషన్ వెలువడలేదు. మిగిలిన 71 సింగిల్‌విండోల్లో మదనపల్లె డివిజన్‌లో 33 ఉండగా అందులో సదుం, సోంపల్లి, చిన్నగొట్టిగల్లు, ఏర్రావారిపాళ్యం, బైరెడ్డిపల్లె, బయప్పగారిపల్లె, పుంగనూరు ఏడు సింగిల్ విండోలు కోర్టు ఆడర్లతో అర్ధతరంగా నామినేషన్లు వేయకుండానే నిలిచిపోయాయి. మిగిలిన 26 సింగిల్‌విండోలకు నామినేషన్లు పర్వం, ఉపసంహరణ పూర్తయింది. ఇదిలా ఉండగా మిగిలిన 38సింగిల్ విండోలు చిత్తూరు, తిరుపతి డివిజన్లలో ఉన్నాయి. చిత్తూరు డివిజన్‌లో మొత్తం 24 సింగిల్‌విండోలు ఉండగా అందులో నాలిగింటికి వివిధ కారణాలతో ఎన్నికల నిలుపుదల చేశారు. సోమవారం 20 సింగిల్ విండోలకు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక తిరుపతి డివిజన్‌లో మొత్తం 16 సింగిల్‌విండోలు ఉండగా అందులో కోర్టు ఆదేశాలతో రెండు నిలిచిపోగా మరో 14 సింగిల్‌విండోలకు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రధానంగా తిరుపతి డివిజన్‌లో వైఎస్‌ఆర్‌సిపికి కొమ్ములు తిరిగిన నాయకులు ఉండగా, కాంగ్రెస్‌పక్షాన మంత్రి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలుగుదేశంపార్టీకి సంబంధించి నగరి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు ఇప్పటికే డివిజన్‌లో రెండు పర్యాయాలు పర్యటించి కార్యాచరణ రూపొందించారు. ఇక చిత్తూరు నియోజకవర్గ విషయానికొస్తే ఇక్కడ టిడిపి అధ్యక్షులు జంగాలపల్లె శ్రీనివాసులు లోలోపలే అందరిని సర్దుబాటు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విషయానికొస్తే చిత్తూరులో ఆ పార్టీ జిల్లామహిళా అధ్యక్షురాలు, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, చిత్తూరునియోజకవర్గ ఇన్‌చార్జి ఎఎస్ మనోహర్ గత వారం చిత్తూరులో జరిగిన న్యూట్రిన్ ఫ్యాక్టరీ యూనియన్ ఎన్నికల సందర్భంగానే సింగిల్ విండోల గురించి ఒక పర్యాయం చర్చించుకున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే నూతనంగా డిసిసి బాధ్యతలు చేపట్టిన అమాస రాజశేఖర్‌రెడ్డి, చిత్తూరు శాసనసభ్యులు సి.కె.బాబుతోపాటు పలువురు నాయకులు పదిరోజుల ముందే కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. మదనపల్లె డివిజన్‌లో నామినేషన్ల సమయంలో స్వయానా ముఖ్యమంత్రినే అక్కడ టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, చిత్తూరు, తిరుపతి డివిజన్లలో అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసేందుకు ఆ పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే చిత్తూరుజిల్లాలో సింగిల్ విండో ఎన్నికలను కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి, తెలుగుదేశంపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, త్రిముఖ పోటీ ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
* తిరుపతి, చిత్తూరు డివిజన్లలో ఏర్పాట్లు * అన్నిచోట్ల త్రిముఖ పోటీనే
english title:
c
Date:
Monday, January 28, 2013