మదనపల్లె, జనవరి 27: జిల్లాలో మదనపల్లె డివిజన్‌లోని 26 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేషన్లు, స్క్రూట్నీలు, బుజ్జగింపులతో నామినేషన్‌ల తిరస్కరణ వంటివి శనివారం నాటికి ముగిశాయి. బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల చిహ్నాలు కేటాయించారు. చిహ్నాలతో పాటు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన అభ్యర్థులు ఓటుకు రూ.1000లు, అత్యంత కీలకమైన, సింగిల్‌విండో చైర్మన్ అభ్యర్థులు పోటీ పడుతున్న స్థానాలలో ఓటుకు రూ.3వేలు నుంచి రూ.5వేలు చెల్లించేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓటరు ఏ పార్టీకి చెందిన వాడైనా ఆ ఓటు తమకే పడేలా రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా రంగంలోకి దిగి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. డివిజన్‌లోని మదనపల్లె, వాల్మీకిపురం, నిమ్మనపల్లె, చౌడేపల్లె, రామకుప్పం, అగరం, ముదరందొడ్డి తదితర సహకార సంఘాల పరిధిలో చైర్మన్ అభ్యర్థుల మధ్యే గట్టిపోటీ నెలకొంది. దీంతో పరపతి కోసం, పార్టీ కోసం, నాయకత్వం కోసం నాయకులు ఆరాటం పడుతూ ఓటర్లను ప్రలోభాలతో, ఒత్తిడుల మధ్య డబ్బులతో కొనుగోలు చేసేందుకు సైతం వెనకడుగు వేయడం లేదు. ఇదిలావుండగా కాంగ్రెస్, టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నాయకులు తమబలాన్ని నిరూపించుకునేందుకు ఏ పార్టీకి చెందిన ఓటరైనా తమవైపు మళ్ళించుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. కీలకపదవుల కోసం క్యాంపులకు తరలించే వారిని చూశాం.. ఇందుకు భిన్నంగా ఓటర్లును ఏకంగా క్యాంపులకు తరలిస్తున్నారు. తాము గెలిస్తే కావాల్సిన సహకార రుణంతో పాటు ఓటుకు రేటు చెల్లిస్తున్నారు. రైతులు అభ్యర్థుల హామీలపై ఏమి పోల్చుకోలేక పోతున్నారు. అధికార పార్టీలకు చెందిన నాయకులు ఏకంగా పోలీసులు, సహకారంలో రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు ఇచ్చి బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారపార్టీకి చెందిన నాయకులు, అభ్యర్థులు సైతం సహకారసంఘంలో రుణాలు తీసుకుని చెల్లించని రైతుల జాబితాలతో ప్రచారంలోకి వెళుతున్నట్లు సమాచారం. మరో నాలుగురోజులలో జరుగనున్న సహకార ఎన్నికలకు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు, అభ్యర్థులు సైతం గెలుపే లక్ష్యంగా రేయింబవళ్ళు ప్రచారంలో మునిగి తేలుతున్నారు.
* ఓటుకు రూ. వెయ్యి, కీలక ఓటుకు రూ. 3వేలు * రంగంలోకి దిగిన కాంగ్రెస్, వైఎస్సార్, టిడిపి
english title:
c
Date:
Monday, January 28, 2013