అనంతపురం, ఫిబ్రవరి 20 : జిల్లాలో మొదటిరోజు నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతంగా ముగిసింది. మొదటి రోజు సమ్మెలో వివిధ ఉద్యోగ సంఘాలు విధులను బహిష్కరించి ర్యాలీలు నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశాయి. జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో పలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో వివిధ కార్మిక సంఘాలు ధర్నా కార్యక్రమం నిర్వహించాయి. ఎఐటియుసి, సిఐటియు, బియంయస్, ఎఐఎఫ్‌టియు, ఐయఫ్‌టియు ఆధ్వర్యం లో వివిధ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. వివిధ కార్మిక సంఘాలకు మద్దతుగా సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, యల్‌ఐసి,ఎడిసిసి, తపాలా, వివిధ బ్యాంకు శాఖలకు చెందిన ఉద్యోగులు, కలెక్టరేట్, జిల్లా పరిషత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో కలెక్టరేట్, జిల్లాపరిషత్‌లతోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్మానుష్య వాతావరణం కనిపించింది. వివిధ బ్యాంకులకు చెందిన బ్యాంకు శాఖలు, తపాలా శాఖ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో ఇవన్నీ మూతపడ్డాయి. ఆర్టీసీలో కూడా ఒక వర్గం సమ్మెలో పాల్గొనడంతో పలు ప్రాంతాలకు బస్సులు తిరగలేదు. ఆటోకార్మికులు, హమాలీలు సమ్మెలో పాల్గొనడంతో వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా మొదటి రోజు వివిధ వర్గాలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.
కరవుసాయంపై ఏదీ స్పష్టత...
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఫిబ్రవరి 20 : జిల్లాలోని 63 మండలాల్లోనూ కరవు నెలకొందని పేర్కొంటూ ప్రభుత్వం కరవుమండలాల ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం కరవు మండలాల ప్రకటన అయితే చేసింది కానీ ఇప్పటికీ కరవుసాయంపై ఒక స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. జిల్లాలో నెలకొంటున్న వరుస కరవులతో తీవ్ర తాగునీటి సమస్య, పశుగ్రాస కొరత ఏర్పడింది. ప్రభుత్వం తాగునీటి కోసం ఏర్పాటుచేసిన పథకాలను కూడా తాగునీటి కొరత వెంటాడుతోంది. ఈ సంవత్సరం 348 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటుందని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు లెక్కలు వేశారు. కానీ అధికారులు చెప్పిన సంఖ్య కన్నా అధిక సంఖ్యలోనే గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండడం గమనార్హం. దీనిపై జిల్లా ప్రణాళిక సంఘ సమావేశంలోప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఇక జిల్లా అధికార యంత్రాంగం తాగునీటి కోసం రూ. 11.58 కోట్లతోప్రతిపాదనలు పంపగాప్రభుత్వం రూ. 50 లక్షలు విడుదల చేసి చేతులు దులుపుకుంది. తాగునీటి సమస్య పరిస్థితి ఇలా ఉంటే వరుస కరవులతో పశుగ్రాసం లేక పశువులు కబేళాలకు తరలుతున్నాయి. జిల్లాలో అరకొరగా ఉన్న పశువులకు తీవ్ర పశుగ్రాస కొరత వేధిస్తోంది. ఇక ప్రభుత్వం పశుగ్రాసం కోసం రూ. 18 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇక సుమారుగా రెండు వేల కోట్ల వరకూ పంట రుణాలు తీసుకున్న రైతులు తీసుకున్న రుణాలను రెన్యూవల్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం కరవుమండలాల ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. గత వారంలో పంట నష్టపోయిన రైతుల జాబితా సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో అధికారులు జాబితా సిద్ధం చేసే పనిలోపడ్డారు. అరకొరగా చేతికి వచ్చిన పంటలు డిసెంబరులోనే పూర్తయ్యాయి కానీ అధికార యంత్రాంగం మాత్రం పంటలు పూర్తయిన రెండు నెలల తరువాత పంటలు నష్టపోయిన రైతుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. దీంతోవారం రోజుల నుంచీ అధికారులు జాబితా తయారీ చేసే పనిలోనిమగ్నమై ఉన్నారు. 2011 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూపేణా మంజూరు చేసిన మొత్తంలో ఇంకా మిగిలిన మొత్తాన్ని పంపిణీ చేయలేని పరిస్థితిలో యంత్రాంగం ఉంది. ఈ సంవత్సరం జాబితా తయారీలోనైనా అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ప్రభుత్వం కరవు మండలాల ప్రకటన చేసి కనీస కరవు సహాయక చర్యలు చేయకపోవడం తోప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మంత్రి ఇంట్లో పంచాయతీ
ఎన్నికలపై సమావేశం
కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 20: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తన స్వగృహంలో బుధవారం అధికారులతో సమావేశం, అనంతరం మండలాల వారీగా పార్టీ నేతలతో పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. బుధవారం మంత్రి రఘువీరారెడ్డి అధికారులతో ప్రత్యేక సమావేశం మండలాల వారీగా నిర్వహించి, ఆయా గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు చేరుతున్న విధానంపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ప్రజల నుంచి వచ్చే ఇబ్బందులను ముందుగానే నివేధిక రూపంలో తయారు చేసుకోవడానికే మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి, ఇందరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, పంట నష్టపరిహారం తదితర అనేక అంశాలపై సమీక్ష నిర్వహించి, వాటిని వెంటనే తీర్చడానికి కృషి చేయాలని, అనేక సార్లు పంట నష్టపరిహారం విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ఫ్యాకేజీ అమలు, దాని తీరు, ఉపయోగాలుపై సైతం మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. అధికారులతో సమీక్ష ముగించిన తర్వాత ఆయా మండలాల నేతలు, కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించి సహకార ఎన్నికల్లో జరిగిన లోపాలు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు రాకుండా, కలసి కట్టుగా పని చేసి పంచాయితీ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి పని చేయాలని కోరినట్లు తెలిసింది. ప్రభుత్వం సాధించిన విజయాలు, నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి ఇతర విషయాలను ప్రజల దృష్టికి తీసుకుని పోయి పంచాయతీ ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని మండల పార్టీ నేతలను కోరినట్లు తెలుస్తోంది.
నిరుపేదల అభ్యున్నతే 20 సూత్రాల ధ్యేయం
లేపాక్షి, ఫిబ్రవరి 20: దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే 20 సూత్రాల పథకం ధ్యేయమని సంబంధిత కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం లేపాక్షి వీరభద్రాలయాన్ని ఆయన సందర్శించిన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిఫుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేదల అభివృద్ధికి 20 సూత్రాలు తయారు చేసి దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం జరుగుతోందన్నారు. 20 సూత్రాల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం వల్ల పేదరికం గణనీయంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఇప్పటి వరకు 20 సూ త్రాల పథకం అమలులో 65 అంశా లు, 160 సూచనలు కూడా చేర్చడం జరిగిందన్నారు. 1982, 1986, 2006ల్లో 20 సూత్రాల పథకంలో పలు మార్పులు చేయడం జరిగిందన్నారు. దేశంలో పేదల అభివృద్ధికి 20 సూత్రాల పథకం అనేక రకాలుగా ఉపయోగపడుతోందన్నారు. ఆయన వెంట తహశీల్దార్ ప్రభాకర్‌బాబు తదితరులు ఉన్నారు.
వీరభద్రాలయంలో పూజలు
దేవాలయ సందర్శనలో భాగంగా తులసిరెడ్డి స్థానిక వీరభద్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం లేపాక్షి ఆలయ చరిత్రను తెలుసుకున్నారు. ఏడు పడగల నాగేంద్రుడు, అసంపూర్తి కల్యాణ మంటపం, నాట్య మంటపం, శిల్పాలు, తైలవర్ణ చిత్రాల విశిష్టతను ఆయనకు వివరించారు. ఆలయ మర్యాదలతో శేషవస్త్రంతో తులసిరెడ్డిని సన్మానించారు.
ధర్మవరంపై పోలీసు నిఘా!
ధర్మవరంరూరల్, ఫిబ్రవరి 20: ధర్మవరం పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చిల్లర దొంగతనాలను అరికట్టేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సహకారంతో రూ.50 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ఎస్పీ షానవాజ్‌ఖాసీం, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలు డీఎస్పీ నవాబ్‌జాన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఇఇ నాగమోహన్‌లు ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో సమావేశమయ్యారు. కెమెరాలు ఏర్పాటుచేసే ప్రదేశాలను ఎస్పీకి మున్సిపల్ అధికారులు వివరించారు. కెమెరాలు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేయడంతోపాటు వాటిని స్థానిక పోలీసు స్టేషన్‌లకు అనుసంధానం చేస్తున్నట్లు ఎస్పీకి వివరించారు. ఎమ్మెల్యే రూ.20 లక్షలు నిధులు కేటాయించగా మిగిలిన రూ.30 లక్షలు మున్సిపాలిటీ భరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఎమ్మెల్యే, పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఎస్పీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల ప్రమాదాలు జరిగిన ప్రదేశాల్లో నిందితులను త్వరితగతిన గుర్తించవచ్చునని, దొంగతనాలు అరికట్టవచ్చని, ప్రధానంగా కిడ్నాప్‌లు చేసే వారిని సైతం పోలీసులకు వెంటనే గుర్తించే అవకాశం కలుగుతుందన్నారు. పట్టణంలో ఇలాంటి కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టడంపై ఎస్పీ ఆయనను అభినందించారు. ఇదే తరహాలో జిల్లాలో ఎవరైనా ముందుకు వస్తే భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు. నెల రోజుల్లోగా కెమెరాలు ఏర్పాటును పూర్తి చేస్తామని, కెమెరాలు అమర్చే ప్రసిద్ధ జర్మనీకి చెందిన సంస్థని, ఈ సంస్థ అసెంబ్లీలో కూడా కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఎస్పీకి తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలపై ఎస్పీని విలేఖరులు అడుగగా జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖ నిత్యం పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే మరింత దృష్టి సారించి ఎక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు. అంతేగాక నకిలీ కరెన్సీ ముఠాను 20 రోజుల్లోగా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
పంటనష్ట పరిహారం జాబితా సిద్ధం చేయండి: ఆర్డీఓ
పెద్దవడుగూరు, ఫిబ్రవరి 20: పంట నష్టపరిహారం జాబితాను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీఓ షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో విఆర్‌ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆర్డీఓ ఇస్మాయిల్ మాట్లాడుతూ 2012-13సంవత్సరంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం పరిహారం మంజూరు చేయడానికి సిద్ధంగా వుందన్నారు. మెట్టపొలాల రైతులకు మాత్రమే జాబితాలను తయారు చేయాలని ఇందులో అక్రమాలు జరిగితే విఆర్‌ఓలపైన, రైతులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మండలంలో జరిగే గ్రామ సభల వివరాలు, అలాగే బృందాల గురించి తహసీల్దార్ రమాను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమా, డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్, ఆర్‌ఐలు శ్రీనివాసులు, విఆర్‌ఓలు పాల్గొన్నారు.
వేంకటేశ్వర స్వామికి విశేష పూజలు
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 20: తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న బంజార ధార్మిక చైతన్య రథం బుధవారం నుండి యాత్ర ప్రారంభించడమైనది. ఈ సందర్భంగా టిటిడి కల్యాణ మండపం ఆవరణంలో రథంలోని వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. విష్ణు సహస్రనామ సత్సంగ మండలి ఆధ్వర్యంలో సా మూహిక విష్ణు సహస్రనామ పారాయ ణం జరిగింది. అనంతరం భజనలు, భక్తి గీతాలతో ఆవరణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా చైతన్య రథం ఇన్‌చార్జి గణపతిస్వామి మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో బంజారాలకు ధార్మిక చైతన్యాన్ని కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశ