రాజమండ్రి/కాకినాడ, ఫిబ్రవరి 21: శాసనమండలిలోని ఉభయగోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో గురువారం జరిగిన పోలింగ్‌లో 52.68 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 2,01, 763 పట్ట్భద్రులు ఓటర్ల జాబితాలో నమోదుకాగా, ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 53.08 శాతం మంది ఓటర్లు, పశ్చిమగోదావరిలో 52.20 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ చాలా మందకొడిగా ప్రారంభమయింది. రెండు గంటల పాటు ఇదే తరహాలో అతి తక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. దాంతో మొదటి రెండు గంటల్లో అంటే ఉదయం 10గంటలకు ఉభయగోదావరి జిల్లాల్లో కేవలం 9.5 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. మధ్యాహ్నం 12గంటలకు 24శాతం, రెండు గంటలకు 40శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సాయంత్రం 4గంటలకు ముగిసే సమయానికి తూర్పుగోదావరి జిల్లాలో 53.08శాతం మంది, పశ్చిమలో 52.20శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రారంభం నుండి పోలింగ్ ముగిసే వరకు పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. కొన్ని చోట్ల నకిలీ ఫోటో గుర్తింపు కార్డులు తయారుచేస్తున్నారని, మరికొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల లోపల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే కాకినాడ, రాజమండ్రి వంటి నగరాలతో పాటు, పట్టణం ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌ల్లోనే ఒక మోస్తరు క్యూలు కనిపించాయి. పోలింగ్ శాతం కూడా గ్రామీణ పోలింగ్ బూత్‌ల్లోనే కాస్తంత ఎక్కువగా నమోదయింది. రాజమండ్రి నగరంలో 24పోలింగ్ బూత్‌లు ఉంటే, వీటిలో అత్యధికంగా లాలాచెరువులో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో మాత్రమే 47శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అతి తక్కువగా 28.125శాతం మంది ఓటర్లు విఎల్ పురంలోని నగరపాలకసంస్థలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 50 శాతంలోపునే రాజమండ్రిలోని పోలింగ్ కేంద్రాల్లో నమోదయింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తే బిక్కవోలులోని రెండు పోలింగ్ కేంద్రాల్లో 72.57శాతం, 67.9శాతం, అనపర్తిలో 67.15శాతం, కోరుకొండలో 67.11శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్బన్ ప్రాంతాల్లోని పట్ట్భద్రుల కన్నా, గ్రామీణ ప్రాంతాల్లోని పట్ట్భద్రులే ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకున్నట్టు స్పష్టమవుతోంది. పురుష పట్ట్భద్రుల కన్నా, మహిళా పట్ట్భద్రులు తక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
25న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
కాకినాడకు చేరిన బ్యాలెట్ బాక్స్‌లు
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 21: ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్ట్భద్రుల నియోజకవర్గానికి గురువారం జరిగిన ఎన్నికల నేపధ్యంలో ఓట్ల లెక్కింపును ఈ నెల 25వ తేదీన కాకినాడ నగరం రంగరాయ వైద్య కళాశాలలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నీతూప్రసాద్ చేశారు. ఆర్‌ఎంసిలో ఏర్పాటు చేసిన రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్‌లను అధికారులతో కలిసి గురువారం రాత్రి కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికలు జరిగిన పోలింగ్ కేంద్రాల నుండి పోలింగ్ బాక్స్‌లను గురువారం రాత్రికి రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు ఎన్నికల సిబ్బంది తరలించారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను కలెక్టర్ స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట కాకినాడ వాణిజ్య పన్నుల శాఖ ఉప కమీషనర్ పౌసమీబసు, రంపచోడవరం సబ్ కలెక్టర్ చంద్రుడు, డిఆర్‌ఓ యాదగిరి, ఆర్డీఒ జవహర్‌లాల్‌నెహ్రూ, శివశంకరవరప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి, ప్రొబీషనరీ డిప్యూటీ కలెక్టర్ గోవిందరావు తదితరులు ఉన్నారు.
అకాల వర్షాలతో స్వల్పంగా పెరిగిన ప్రవాహం
* సీలేరు అదనపు జలాల కోసం కొనసాగుతున్న ప్రయత్నాలు
* బ్యారేజి వద్దకు 6వేల 250క్యూసెక్కులు
రాజమండ్రి, ఫిబ్రవరి 21: గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా గోదావరి ప్రధాన ప్రవాహంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. వర్షాలకు ముందు సీలేరు జలాలు, ప్రధాన ప్రవాహం కలిపి 5వేల క్యూసెక్కులు మాత్రమే బ్యారేజి వద్దకు చేరితే, ఇపుడు 6వేల 250క్యూసెక్కుల నీరు చేరుతోంది. సీలేరు నుండి 4వేల 200క్యూసెక్కులు కొన్నిసార్లు, 3వేల 700క్యూసెక్కులే కొన్నిసార్లు గోదావరిలోకి విడుదలవుతున్నప్పటికీ, ప్రధాన ప్రవాహం స్వల్పంగా పెరగటంతో 6వేల 250క్యూసెక్కుల నీరు సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి వద్దకు చేరుతోంది. దాంతో గోదావరి డెల్టా రైతులు తాత్కాలికంగా ఊపిరిపీల్చుకుంటున్నారు. సీలేరు, గోదావరి ప్రధాన ప్రవాహం నుండి వస్తున్న 6వేల 250క్యూసెక్కుల్లో 6వేల 180క్యూసెక్కుల నీటిని గోదావరి డెల్టాకు సరఫరాచేస్తూ 70క్యూసెక్కులను బ్యారేజి బేసిన్‌లో ఉంచుతున్నారు. దాంతో బేసిన్ నీటిమట్టం స్వల్పంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం బేసిన్ నీటిమట్టం 13.76మీటర్లుగా నమోదయింది. ముందు జాగ్రత్తగా దీనిని ఇలాగే 13.85మీటర్లు వరకు పెంచి, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాలని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. గురువారం నాటికి తూర్పు డెల్టాకు 3వేల 170క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 1186క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 1824క్యూసెక్కులు సరఫరాచేస్తున్నారు. వర్షాలు కురవటం వల్ల గోదావరిలోకి కొంత నీరు వచ్చి చేరుతుండటంతో పాటు, అనధికారికంగా గోదావరి నుండి నీటిని తోడుతున్న మోటార్లు కూడా తాత్కాలికంగా నిలిచిపోవటం వల్ల ఈ మాత్రం వెసులుబాటు గోదావరి డెల్టాకు లభించి ఉంటుందని ఇరిగేషన్ నిపుణులు అంచనావేస్తున్నారు. గోదావరి డెల్టాలో సాగునీటి సరఫరా పరిస్థితిని ఇరిగేషన్ మంత్రి సుదర్శన్‌రెడ్డి కూడా ఆరా తీసారు. క్రాస్ బండ్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆయన సమీక్షించినట్టు సమాచారం. అవసరమైన చోట్ల క్రాస్‌బండ్లు ఏర్పాటుచేస్తున్న ఇరిగేషన్ అధికారులు, గత మూడు రోజులుగా ద్రాక్షారామ సమీపంలోని గొప్పిరేవు వద్ద డ్రెయిన్ నుండి నీటిని రివర్స్ పంపింగ్ చేసేందుకు తాత్కాలిక లిఫ్ట్‌ను ఏర్పాటుచేసారు. ఈ లిఫ్ట్ సహాయంతో సుమారు 50క్యూసెక్కుల నీటిని సరఫరాచేస్తున్నట్టు గోదావరి డెల్టా సిఇ గోపాలకృష్ణారెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు.
తాత్కాలికంగా సాగునీటి సమస్యకు పరిష్కారం లభించటంతో సీలేరు నుండి అదనపు జలాలను బైపాస్ మార్గంలో విడుదల చేయించుకునేందుకు గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 15వరకు రబీ పంటకు అత్యంత కీలకమైన సమయమని, ఈ సమయంలో సాగునీటి కొరత ఏర్పడితే, దిగుబడి దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దాంతో ఈ సమయానికి సీలేరు నుండి బైపాస్ మార్గంలో అదనపు జలాలను విడుదల చేయించుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. సీలేరు నుండి రెగ్యులర్‌గా వచ్చే నీటితో పాటు కనీసం వెయ్యి కూసెక్కులయినా బైపాస్ మార్గంలో విడుదలచేయిస్తామని మంత్రి పితాని సత్యనారాయణ రైతులకు భరోసా ఇచ్చారు.
తుదిరోజు సమ్మె పాక్షికం
రాజమండ్రి, ఫిబ్రవరి 21: యుపిఏ ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన 2రోజుల సమ్మె పిలుపు మేరకు మలిరోజు సమ్మె పాక్షికంగా జరిగింది. సిపిఎం, టిడిపి, కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాలు ఎమ్మెల్సీ ఎన్నికల బిజీలో మునిగిపోయాయి. ఈప్రభావం సమ్మె పడి పాక్షికంగానే సమ్మె జరిగింది. తొలిరోజు సమ్మెకు అన్ని కార్మిక సంఘాలతో పాటు చాంబర్ ఆఫ్‌కామర్స్, బ్యాంకు ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. మలిరోజు నగరంలోని పలు దుకాణాలు యధావిధిగా తెరిచారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా యధావిధిగా పనిచేశాయి. అయితే బ్యాంకులు మాత్రం మూతపడ్డాయి. రాజమండ్రి బ్యాంకు ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు వద్ద బ్యాంకు ఉద్యోగులు, ఎఐటియుసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎవివి సత్యనారాయణ, కార్యదర్శి కెఆర్‌కె రెడ్డి, ఎఐటియుసి నాయకుడు మీసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రాబ్యాంకు అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మెయిన్ బ్రాంచి ఎదుట బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
వైభవంగా అంతర్వేది నరసన్న రథోత్సవం
సఖినేటిపల్లి, ఫిబ్రవరి 21: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారి సోదరి అశ్వరూఢాంబికకు శ్రీస్వామి వారు చీర, సారెను రథంపై తీసుకెళ్ళి సమర్పించారు. గురువారం నిర్వహించిన రథయాత్రలో ఆలయ ఛైర్మన్, మొగల్తూరు రాజు రాజాబహద్దూర్ రథానికి పూజలు చేసారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, నర్సాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు రథానికి కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ లక్ష్మీనరసింహుని ఉత్సవమూర్తులు రథంపై కొలువుతీరగా ఊరేగింపు సాగింది. మెరక వీధి నుంచి ప్రారంభమైన రథయాత్ర పల్లపువీధిలోని 16 స్థంభాల మండపానికి చేరుకోవడంతో ముగిసింది. గోవిందనామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. రథానికి అరటి గెలలు, గుమ్మడికాయలు కట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భీష్మ ఏకాదశని పురష్కరించుకుని తెల్లవారు జాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. అలాగే పితృదేవతలకు భక్తులు పిండప్రధానాలు చేసారు. జంగమదేవర్లు ఊదిన శంఖాల ధ్వనితో అంతర్వేది సముద్రతీరం మార్మ్రోగిపోయింది.
మోటారు సైకిళ్లు ధ్వంసం
నరసన్న యాత్రాపథంలో రథం అదుపుతప్పి రెండు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. గుర్రాలక్క ఆలయం వైపు వెళుతున్న రోడ్డు కల్వర్టు ప్రక్కన రథం ప్రక్కకు వెళ్ళడంతో అక్కడే వున్న రెండు మోటారు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఏవిధమైన ప్రమాదం జరగకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
వైభవంగా భీమేశ్వర కల్యాణం
రామచంద్రపురం, ఫిబ్రవరి 21: ద్రాక్షారామ గ్రామంలో వేంచేసియున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ్భమేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామి, శ్రీ చండికా సమేత శ్రీసూర్యేశ్వరస్వామి వార్ల దివ్య కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రముఖులు, భక్తులు, కన్నులారా వీక్షిస్తుండగా గురువారం రాత్రి 9.56 గంటలకు జరిగాయి. ఆగమ విశారదులు, బ్రహ్మశ్రీ దేవులపల్లి రామశాస్ర్తీ, కృష్ణమూర్తి సోదరులు ఈ కల్యాణ తంతును వేద పఠనం, వైదిక కార్యక్రమాలు, వివాహ తతంగంతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు నంది వాహనంపై శ్రీ స్వామివార్ల నగరోత్సవం జరిగింది. అంతకుముందు శ్రీస్వామి వార్లకు, శ్రీ అమ్మవార్లకు ఎదుర్కోలు సన్నాహాన్ని శ్రీమాణిక్యాంబ, మహిళా భక్తబృంద సభ్యులు ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకలను వీక్షించేందుకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సతీమణి సూర్యకుమారి, రీజినల్ జాయింట్ కమిషనర్ ఎన్ సోమశేఖర్ దంపతులు, అడిషినల్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె విజయకుమార్ దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పేష్కార్ రామారావు దంపతులు, జిల్లా పరిషత్ మాజీ వైస్-్ఛర్మన్ చింతపల్లి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే మేడిశెట్టి వీరవెంకట రామారావు దంపతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. టిటిడి పేష్కార్ రామారావు దేవస్థానం తరఫున వధూవరులకు పట్టువస్త్రాలు బహూకరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే త్రిమూర్తులు, ఆర్‌జెసి సోమశేఖర్ స్వామివార్లకు, అమ్మవార్లకు నూతన వస్త్రాలు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎన్‌విడి ప్రసాద్ నేతృత్వంలో ఆలయ అనువంశిక అర్చకస్వాములు, పురోహిత బ్రహ్మలు, వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్రాక్షారామ గ్రామానికి చెందిన కంచర్ల చక్రధరరావు అనే చక్రి స్వామివారికి 145 కిలోల కల్యాణ లడ్డూను, భక్తులకు పంచేందుకు 101 కేజీల బాదుషాలను అందజేశారు. కల్యాణ తలంబ్రాలను, రుద్రాక్షలను భక్తులకు పంపిణీ చేశారు.
వైభవంగా కుంభాభిషేకం
అయినవిల్లి, ఫిబ్రవరి 21: అయినవిల్లి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీవిఘ్నేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 12న ప్రారంభమైన గణపతి యాగ మహోత్సవములు గురువారం కుంభాభిషేకంతో హోమ యాగాలు ముగిసాయి. ఈ పది రోజుల పాటు హోమ కార్యక్రమాలన్నీ ఆలయ ప్రధాన అర్చకులు సూర్యనారాయణమూర్తి, సురేష్, వ్యాఖ్యాత వ్యవహారకర్త బాదంపూడి ప్రసాద్‌బాబ్జీ, వ్యవహారకర్త విలపర్తి సత్యనారాయణమూర్తిల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా యాగ కార్యక్రమాలు జరిగాయి. ఆఖరి రోజైన గురువారం పరిపూర్ణానంద స్వామీ చేతులు మీదుగా 108 కలశాలతో కుంభాభిషేకం ఆలయ శిఖరంపై అత్యంత ఘనంగా జరిగింది. ఈ కుంభాభిషేకానికి ఉదయం నుండి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పరిపూర్ణానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం ఏ పని మొదలు పెట్టినా ముందుగా ఓంకారం పలుకుతామని, ఓంకారం అనేది విఘ్నేశ్వరుని నుండి పుట్టిందని ఆయన అన్నారు. ఇటువంటి హోమ యాగ కార్యక్రమాలు భక్తుల ఉపయోగార్ధమై మరిన్ని చేపట్టాలని ఆయన సూచించారు. కుంభాభిషేకానికి తరలివచ్చిన భక్తులందరికీ భోజన సదుపాయంతో పాటు ఆలయ అర్చకులకు సన్మానం కార్యక్రమం నిర్వహించినట్లు ఇవో వివివిఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
13వ ఆర్థిక సంఘం నిధులతో ప్రజలకు మెరుగైన సేవలు
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ పిడి భాస్కర్
రాజమండ్రి, ఫిబ్రవరి 21: ప్రభుత్వం మంజూరు చేసిన 13వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ కె భాస్కర్ వెల్లడించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 800నుంచి 900కోట్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఇంజనీర్లు, ఇతర అధికారులతో గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్‌హాలులో ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్ష జరిపారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈవిషయంలో వనరులు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించుకుని, వాటిని మెరుగుపరిచేందుకు కృషిచేయాలన్నారు. మంచినీటి సరఫరాలో వృధాను అరికట్టాలన్నారు. అక్రమ కుళాయిలను గుర్తించాలన్నారు. మంచినీటి సరఫరాలో ఆదాయ, వ్యయాలను సమీక్షించుకోవాలని సూచించారు. బెంచ్‌మార్క్ రూపకల్పనలో తప్పుడు నివేదికలను రూపొందించవద్దని భాస్కర్ స్పష్టం చేశారు. చెత్తసేకరణ, మంచినీటి సరఫరాలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దేశ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నాయన్నారు. ఈసమావేశంలో పురపాలకశాఖ రీజనల్ డైరెక్టర్ వి రాజేంద్రప్రసాద్, కమిషనర్ ఎం జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
జనార్దనస్వామి రథయాత్రలో అపసృతి
ఆలమూరు, ఫిబ్రవరి 21: స్థానికంగా వేంచేసియున్న శ్రీ జనార్దనస్వామి ఆలయంలో గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా జరుగుతున్న రథయాత్రలో అదే గ్రామానికి చెందిన చెక్కా మానస (8) అనే బాలిక కాలుపై నుండి రథచక్రం వెళ్ళిపోవడంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. కాలి మూడు వేళ్లు నుజ్జునుజ్జు కావడంతో రాజమండ్రి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
జిల్లాలో రెడ్ అలర్ట్
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 21: హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న బాంబు పేలుళ్ళ ఘటనతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. పోలీస్ యంత్రాంగం తమ సిబ్బందికి ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం. అధికారుల ఆదేశాలు అందుకున్న పోలీస్ సిబ్బందిని ఇప్పటికే పలు చోట్ల బంధోబస్తును ఏర్పాటు చేసి అనుమానితులను తనిఖీలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక సంస్థల వద్ద భద్రతను మరింత పటిష్టపరిచారు.
ద్రాక్షారామలో మిన్నంటిన కల్యాణ శోభ
పాత సంప్రదాయాలకు తెరలేపిన ఇఒ ప్రసాద్
రామచంద్రపురం, ఫిబ్రవరి 21: దక్షిణకాశీ ద్రాక్షారామ గ్రామంలో వేంచేసియున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో వార్షిక కల్యాణోత్సవాలు గురువారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మేలుకొలుపులు, సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన నిర్వహించిన అనువంశిక అర్చక స్వాములు, వేద పండితులు, స్వస్తివాచకులు తదనంతరం తీర్థపు బిందెను తెచ్చి బాలభోగం చేశారు. తరువాత విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామివార్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం రుద్రాభిషేకాన్ని, లక్ష రుద్రాక్షలతో అభిషేకం నిర్వహించారు. తదనంతరం కల్యాణ మూర్తులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముత్తయిదువలు కల్యాణ మూర్తులను వధూవరులుగా తీర్చిదిద్దే కార్యక్రమ పరంపరలో పసుపు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొనే్నళ్లుగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానంలో నిర్వహించకపోగా, కార్యనిర్వహణాధికారి కెఎన్‌విడివి ప్రసాద్ పాత సంప్రదాయాలకు తెర తీయాలని భావించి, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న కాలార్చన, రాజభోగం నిర్వహించిన తరువాత కాలార్చనలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీసమేత శ్రీ నారాయణస్వామి, శ్రీ చండికా సమేత శ్రీ సూరేశ్వర స్వామివార్లకు పాంచాహ్నిక దీక్షగా దివ్య కల్యాణ మహోత్సవాలను నిర్వహించేందుకు వీలుగా అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
భక్తి శ్రద్ధలతో మహావిష్ణు యాగం
ఐ పోలవరం, ఫిబ్రవరి 21: శత చండీ సహిత అతిరుద్ర మహాయాగంలో మహావిష్ణువు, ధన్వంతరీ హోమం, సహస్రాధిక దీపార్చన కార్యక్రమాలు భక్తుల ఓంకార నాధాల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మురమళ్ళ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉత్కృష్ట మహాయాగ క్రతువులో గురువారం భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శివయంత్ర ప్రచారంలో 1,128 నూనె దీపాలను వెలిగించి సహస్ర జ్యోతిర్లింగార్చన జరిపారు. వేదబ్రహ్మ ఈమణి వెంకట చంద్రశేఖరశాస్ర్తీ పర్యవేక్షణలో 180 మంది పండితులు ఏకకాలంలో 99 రుద్ర హోమాలను పటించడంతో యాగశాల ప్రాంతం హరిహర నామస్మరణతో మార్మ్రోగింది. ఓంకార నాధాలు, ఢమరుక శబ్దాలు, వేదమంత్రోచ్చరణలతో రాష్ట్రం నలుమూలల నుంచి అశేషంగా తరలివచ్చిన భక్తజనావళి తన్మయత్వం పొందారు. అతిరుద్రం ప్రారంభమైన నాటి నుంచి 11 క్రతువుల వద్ద రుద్ర హోమం నిర్వహిస్తూ పుట్టమట్టితో తయారుచేసిన 1,128 శివలింగాలను శివయంత్ర ప్రస్థానంలో ఉంచుతున్నారు. రుద్రహోమం అనంతరం వీటిని అభిషేక జలాల్లో కలిపి యాగాల్లో వినియోగిస్తున్నారు. మట్టిని శుద్ధిచేసిన తరువాత చీమలు పుట్టలు తయారుచేస్తాయని యాగకర్తల్లో ముఖ్యుడైన కేశాప్రగడ రాజశేఖరశర్మ వివరించారు.
సార్వవంతమైన మట్టి పుట్టలో దొరుకుతున్నందున శివలింగాల తయారీకి ప్రతీరోజూ పుట్ట మట్టిని వినియోగిస్తున్నామన్నారు. గురువారం పుట్టమట్టి శివలింగాల స్థానంలో నువ్వెల నూనె దీపాలు వెలిగించి సహస్ర జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. యాగంలో ఆరోగ్య ఆది దేవతగా వున్న మహావిష్ణువుకు ప్రీతికరమైన ధన్వంతరి హోమం చేసారు. అతిరుద్ర యాగంలో 8వ రుద్రుడైన మహాత్రిపుర సుందరి సహిత మహాలింగ పరమశివునికి రుద్రయాగం నిర్వహించారు. రావి, మేడి, మారేడు సమిధలతో పాటు క్షీరపాయసంతో నివేదన జరిపారు. అతిరుద్ర మహాయాగానికి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు దంపతులు, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, విజయనగరం వింజా కాశీ పీఠాధిపతి భైరవానంద స్వామీజీలు హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. వీరిని యాగకర్త హరిహరనాధశర్మ సాదరంగా ఆహ్వానించారు.
తరలి వచ్చిన భక్తులు
వేదఘోషతో ప్రతిధ్వనిస్తున్న మురమళ్ళకు భక్తజనం తండోప తండాలుగా తరలివస్తున్నారు. అతిరుద్ర మహాయాగం తొమ్మిదవ రోజైన గురువారం వేలాది మంది యాగశాలకు వచ్చారు. గురువారం రాత్రి సహస్రాధిక దీపార్చన కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. భక్తజన గోదావరి పరవళ్లతో మురమళ్ళ ఉప్పొంగిపోతోంది. గత ఏడాది భద్రాచలంలో జరిగిన అతిరాత్రంకు వచ్చిన జనం కంటే అతిరుద్రం మహాయాగానికే భక్తజనం పోటెత్తుతున్నారని యాగకర్తలు చెబుతున్నారు. కోస్తా జిల్లాల నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు మహాయాగాన్ని చూసి పరవశించిపోతున్నారు. ఇప్పటి వరకు రెండున్నర లక్షలకు మందికి పైగా భక్తులు అతిరుద్రంలో పాల్గొన్నట్లు అంచనా. మరో నాలుగు రోజుల్లో అతిరుద్రం ముగియనుందని, మరో మూడు లక్షల మంది వరకు భక్తులు పాల్గొంటారని అంచనా వేసారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్టల్రకు చెందిన 120 మంది రుత్వికులు కృష్ణ యజుర్వేదంలో వివరించినట్లు ఈ మహాయాగం నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా సాగుతున్న ఉత్కృష్ట యాగం వల్ల గోదావరి వాసులు అద్భుత అవకాశాలు చవిచూస్తారని పండితులు చెబుతున్నారు. అతిరుద్రం యాగం ద్వారా కోనసీమ మరోసారి వేదభూమిగా తన పేరును సార్ధకం చేసుకుంది. శుక్రవారం నాడు సకల సౌభాగ్యాలు, సౌమాంగళ్యం సిద్ధించాలని కోరుతూ యాగశాలలో లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు.
వైభవంగా శ్రీసూర్యనారాయణమూర్తి కల్యాణం
పెదపూడి, ఫిబ్రవరి 21: యావత్ భారత్‌దేశానికే ఏకైక శ్రీవైష్ణవ సంప్రదాయ సూర్యదేవాలయంగా ప్రసిద్ధి గాంచిన పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఉషా, పద్మిని, ఛాయ, సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి వారి దివ్య కళ్యాణం, రధోత్సవం వేలాది మంది భక్తుల హర్షధ్వానాల మధ్య వైభవంగా జరిగింది. గురువారం ఉదయం నుండి ఆలయ అర్చకులు రేజేటి వెంకటనరసింహాచార్యులు, లక్ష్మినరసింహాచార్యుల ఆధ్వర్యంలో అరుణం, సౌరం పారాయణాలతో స్వామివారికి విశిష్ట పూజలను నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ టిఎస్ బాలకృష్ణారెడ్డి, మేనేజర్ ఎన్‌ఎల్ మోహనరావుస్వామి వారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. త్రిదండి చినజీయర్ రామానుజస్వామి వారి మంగళ శాసనాలతో శ్రీ సూర్యనారాయణమూర్తి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మయూర నృత్యాలు, కోలాట బృందాలు, బాణాసంచా కాల్పులు, మంగళ వాయిద్యాలతో శ్రీ సూర్యనారాయణమూర్తి కళ్యాణ రధోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామిని దర్శించి తరించారు.