వీరవాసరం, ఫిబ్రవరి 21: ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని ఓటర్లను ప్రలోభపెట్టడానికి కొందరు అభ్యర్థులు పంపిణీచేసిన కానుకలు ప్రతికూల ప్రభావాన్ని చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక అభ్యర్థి కొన్ని ప్రాంతాల్లో రిస్టు వాచీలు, మరికొన్ని ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు పంపిణీచేశారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పంపిణీని ప్రత్యర్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించడం కూడా జరిగింది. అయితే పంపిణీ నిమిత్తం ఆ అభ్యర్థి నియమించుకున్న ఏజెంట్ల చేతివాటం ఓటర్లను ఆగ్రహానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే... కానుకల పంపిణీ కోసం 200 మంది ఓటర్లకు ఒక ఏజెంటును సదరు అభ్యర్థి నియమించారు. అలా నియమితులైన ఏజెంట్లు తమకు కేటాయించిన 200 మంది ఓటర్లు గ్రామంలో ఉన్నారో లేదో చూసి సమాచారాన్ని సంబంధిత అభ్యర్థి మద్దతుదారులకు అందించారు. ఓటరు గ్రామంలో ఉన్నా లేకపోయినా ఇంటిలో కానుక, ఓటరు స్లిప్ అందజేయాలని పోటీలో ఉన్న అభ్యర్థి తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే పంపిణీదారులు మాత్రం గ్రామంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వమన్నారని పేర్కొంటూ పలువురికి కానుకలివ్వడానికి నిరాకరించారు. ఓటర్ల ఇంటికి కానుకలతో వెళ్లి, ఓటర్లు లేనందున ఇవ్వలేకపోతున్నామని చెప్పి మరీ వెళ్లిపోయారు. ఇంతవరకు బాగానేవున్నా కొందరు ఏజెంట్లు పంపిణీ చేయని కానుకలను సైతం పంపిణీ జాబితాలో లెక్క రాసేసుకున్నట్టు సమాచారం. కొందరు ఓటర్లు తమకు కానుక అందలేదని ఈ ఏజెంట్లపై సూపర్‌వైజర్‌గా ఉన్న వ్యక్తి దృష్టికి తీస్కెళ్లినపుడు ఈ వ్యవహారం బట్టబయలయ్యింది. దీనితో ఆయా ఓటర్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. తమ పక్కింట్లో కానుకలు ఇచ్చి, మాకు ఇవ్వరా అంటూ పనిగట్టుకుని వెళ్లి మరీ ప్రత్యర్థులకు ఓటు వేసివచ్చినట్టు కొందరు ఓటర్లు తెలిపారు. ఇటువంటి సంఘటనలు వీరవాసరం, పాలకోడేరు, కాళ్ల, పాలకొల్లు, నర్సాపురం మండలాల్లో చోటుచేసుకున్నట్టు సమాచారం. దీనితో కానుకలు పంచిన అభ్యర్థి వర్గంవారు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి పంచిన వాచీల కారణంగా తమ అభ్యర్థికి వాచిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతుండటం విశేషం. కొన్ని ప్రాంతాల్లో పంపిణీచేసిన సెల్‌ఫోన్లు నాసిరకంగా ఉండటం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపినట్టు సమాచారం.
రైతాంగం అభివృద్ధే ధ్యేయంగా సంస్కరణలు
కార్యాచరణ ప్రణాళికతో ముందుకు:డిసిసిబి ఛైర్మన్ ముత్యాల
ఏలూరు, ఫిబ్రవరి 21 : జిల్లాలో రైతాంగం అభివృద్ధే ధ్యేయంగా బ్యాంకు పనితీరును సంస్కరించడం జరుగుతుందని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డిసిసిబి) ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) అన్నారు. అందరి సహకారంతో డిసిసిబిని అభివృద్ధి పధంలో పయనింపచేస్తామని ఆయన చెప్పారు. స్థానిక డిసిసిబి సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతమైన బ్యాంకుగా ఏలూరు డిసిసిబి పనిచేస్తోందన్నారు. గతంలో బ్యాంకు అధ్యక్షులుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యక్తులు పనిచేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని బ్యాంకును మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. 575 కోట్ల రూపాయల డిపాజిట్లతో, 1400 కోట్ల రూపాయల రుణాలను రైతులకు ఇచ్చి రాష్ట్రంలోని కో ఆపరేటివ్ బ్యాంకులలో పశ్చిమ డిసిసిబి మొదటి స్థానంలో వుందన్నారు. రికవరీ, నిరర్ధక ఆస్తులలో బ్యాంకు మిగతా కో ఆపరేటివ్ బ్యాంకులకు ఒక మోడల్ బ్యాంకుగా నిలిచిందన్నారు. కమర్షియల్ బ్యాంకుల పోటీని తట్టుకునేలా కంప్యూటరేజేషన్ సేవలు వేగవంతం చేశామని చెప్పారు. ఖాతాదారులకు ఇతర బ్యాంకులతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బ్యాంకు సర్వతోముఖాభివృద్ధికి పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామన్నారు. ప్రస్తుతం వున్న రెండు వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ను రాబోయే అయిదు సంవత్సరాలలో అయిదు వేల కోట్లకు పెంచే విధంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని బ్యాంకులు కలిసి సేకరించిన డిపాజిట్లు 8500 కోట్లు వున్నాయన్నారు. ఈస్థాయిని అనుసరించి బ్యాంకు డిపాజిట్లు కనీసం వెయ్యి కోట్ల వరకు సేకరించేందుకు లక్ష్యంగా నిర్ధేశించుకోవడం జరిగిందన్నారు. బ్యాంకు సిబ్బందిలో పోటీతత్వాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డిపాజిట్ దారులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రుణ పతకాలను ప్రవేశపెడతామన్నారు. ప్రతీ ఇంటికి కనీసం ఒక బ్యాంకు అకౌంట్ కో ఆపరేటివ్ బ్యాంకులో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. లాభాల బాటలో బ్యాంకు పయనించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతీ సహకార సంఘంలో ఒక రైతు క్లబ్‌ను స్థాపించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సహకార సంఘాల కంప్యూటరీకరణ అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. డిపాజిట్ల సేకరణ, రైతులకు రుణాలు, కంప్యూటరీకరణ, సిబ్బంది నైపుణ్యం పెంచడం ద్వారా బ్యాంకును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. తనకు డిసిసిబి ఛైర్మన్ పదవి లభించటంలో కృషి చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కన్నా లక్ష్మినారాయణ, జిల్లా మంత్రులు పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, ఎంపిలు కనుమూరి బాపిరాజు, కావూరి సాంబశివరావు, ఉండవల్లి అరుణకుమార్, డిసిసి అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు ఈలి నాని, కారుమూరి నాగేశ్వరరావు, బంగారు ఉషారాణి, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలకు ముత్యాల రత్నం కృతజ్ఞతలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో బ్యాంకు సి ఇవో కె నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
52.23 శాతం
*ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
*పోలింగ్ ఏజెంటుగా ఉపాధ్యాయుడు
*్ఫర్యాదుతో స్పందించి, తొలగించిన అధికార్లు
ఏలూరు, ఫిబ్రవరి 21: దాదాపుగా నెలరోజులుగా సాగిన పట్ట్భద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరింది. ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. జిల్లాలో ఎక్కడా చెప్పుకోదగ్గ సంఘటనలు జరగలేదు. మొగల్తూరులోని జడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఒక అభ్యర్ధి తరపున ఎస్టీయుకు చెందిన ఒక ఉపాధ్యాయుడు పోలింగ్ ఏజెంటుగా వ్యవహరిస్తూ అధికారులకు పట్టుపడ్డారు. సిహెచ్ రత్నానందకుమార్ అనే ఉపాధ్యాయుడు ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఇండిపెండెంట్ అభ్యర్ధి జార్జి విక్టర్ అనుచరులు జిల్లా కలెక్టరుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వెనువెంటనే నర్సాపురం ఆర్డీవో వసంతరావు అక్కడకు చేరుకుని సదరు ఉపాధ్యాయుడ్ని నిలదీశారు. ఏజెంటుగా రాకూడదన్న విషయం తనకు తెలియదని ఆయన సమాధానం చెప్పారు. ఆయన్ని వెంటనే ఏజెంటు విధుల నుంచి తొలగించటంతోపాటు ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలింగ్ అధికారిని ఆర్డీవో ఆదేశించారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కూడా ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా సాగిపోయింది. పట్ట్భద్రుల నియోజకవర్గంలో పోలింగ్ ముగిసేసమయానికి 52.23శాతం పోలింగ్ నమోదు అయింది. చాలాచోట్ల ఓటర్లు పెద్దసంఖ్యలో రాకపోవటంతో బూత్‌లు వెలవెలపోయాయి. అయా ప్రాంతాల్లో బూత్‌ల్లోని అధికారులు ఖాళీగా కన్పించారు. అంతేకాకుండా కొన్నిపోలింగ్ బూత్‌లలో ఏజెంట్లు, పోలీసు సిబ్బందే ఓటర్ల కన్నా అధికంగా కన్పించారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా మండలి ఎన్నికల తీరు సాగింది. మండల కేంద్రాల్లోనూ, మున్సిపాల్టీలు, కార్పోరేషన్‌లలో పరిమిత సంఖ్యలో ఏర్పాటైన పోలింగ్ బూత్‌ల్లో మండలి ఓటింగ్ సాగింది. ఏలూరులోని చాలా పోలింగ్ బూత్‌లు ఖాళీగానే కన్పించాయి. వివిధ సంఘాలు, వాటి ప్రతినిధులు, ప్రధాన నాయకుల అనుచరులు పోలింగ్ బూత్‌ల వద్ద శిబిరాలు ఏర్పాటుచేసి తమ సభ్యులను ఓటింగ్‌కు పంపుతూ వచ్చారు. మొత్తంమీద పట్ట్భద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో 92630 మంది ఓటర్లు ఉండగా వీరిలో 48381 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో 52.23 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభం కాగా 10గంటలకు 9.5శాతం, 12గంటలకు 25.13శాతం, 2గంటలకు 38.51శాతం, 4గంటలకు 52.23శాతం పోలింగ్ జరిగింది. ఏలూరు డివిజన్ పరిధిలో 14652 మంది, నర్సాపురం డివిజన్‌లో 15163 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 3715మంది, కొవ్వూరు డివిజన్‌లో 14851 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఏలూరులో జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్, జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదిలాఉంటే తమ ఓట్లు గల్లంతయ్యాయన్న ఆవేదనలు ఈ ఎన్నికల్లోనూ తప్పలేదు. అడ్రస్సులు నమోదు చేయటంలో అవగాహన లేని కారణంగా జరిగిన పొరపాట్లు వల్ల చాలా ఓట్లు గల్లంతు అయ్యాయి. అంతేకాకుండా పేర్లలో ఉన్న చిన్నచిన్న తప్పుల వల్ల కూడా కొంతమంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. ఈ పరిస్ధితే ఇలాఉంటే విద్యావంతులతో ప్రజాస్వామ్య వ్యవస్ధ బలోపేతం అవుతుందని కొంతమంది నాయకులు, పార్టీలు చెపుతూ ఉండటం తెల్సిందే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల తీరు చూస్తే మాత్రం ఆ నమ్మకాలు ఎంతమాత్రం పనిచేయవని అర్ధమవుతుంది. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ప్రచారంలోనూ భారీగా తాయిలాలు, పంపిణిలు, నగదు విస్తృతంగా పంచిపెట్టడం ఇప్పటికే విమర్శలకు కారణమైంది. దానికితోడు కనీసం ఓటింగ్ శాతం కూడా నామమాత్రంగా ఉండటం విస్మయకరంగానే చెప్పుకోవాలి. వాస్తవానికి ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీల తరపున ఆశించిన హడావిడి లేకపోయినా అభ్యర్ధులు తరపున మాత్రం కొంత సందడి సృష్టించగలిగారు. అదీకూడా ఓటింగ్ శాతం పెరగడానికి ఏమాత్రం సహకరించలేదనే చెప్పుకోవాలి. మొత్తంమీద జిల్లాలో మండలి ఎన్నికల వ్యవహారం ప్రశాంతంగా ముగిసింది.
ఆ హడావుడి లేదు...
మండలి ఎన్నికలో అన్ని చిత్రాలే
ఏలూరు, ఫిబ్రవరి 21: సాధారణంగా ఎన్నికలంటే పండుగే. అందరికి పనే. ప్రతిఒక్కరికి హడావిడి, కంగారు, ఉత్సాహం. అభ్యర్ధుల కారణాలు వాళ్లకుంటే స్థానికంగా పనిచేసేవారికి ఉపాధి లభిస్తోందన్న అనందం మరింత. ఇలా సాధారణ ఎన్నికలు వచ్చాయంటేనే అన్ని ప్రాంతాలు ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. కానీ గురువారం జరిగిన శాసనమండలి ఎన్నికలు కూడా ఎన్నికలే అయినా ఆ ఉత్సవాలు, ఆ హడావిడి లేకుండా పోయింది. అభ్యర్ధులు సంఖ్య అధికంగా ఉన్నా వారి ప్రచారంలో సాధారణ ఎన్నికల జోరు లేదు. అయితే పోలింగ్ తేదీ దగ్గర పడుతోందంటే ఎనె్నన్ని సంతర్పణలు, మరెన్ని పంపకాలు జరిగేవో బహిరంగరహస్యమే. ఆ సీన్ మాత్రం ఈ మండలి ఎన్నికల్లో ఒకింత ఎక్కువగానే కన్పించింది. మరోవైపు ఎన్నికల పోలింగ్ కేంద్రాలు జాతరలా కన్పించేవి. బారులు తీరిన ఓటర్లతో అంతా సందడిగా ఉండేది. కానీ మండలి ఎన్నికలు మాత్రం పెద్దరికాన్ని సంతరించుకున్నాయో అనిపించేలా సాగిపోయాయి. పోలింగ్ కేంద్రాల్లో అరకొరగా ఓటర్లు రావటం, ఓట్లు వేసి వెనుతిరగటం జరిగిపోయింది. దీంతోపాటు అభ్యర్ధుల శిబిరాలు అయా కేంద్రాల వద్ద ఉన్నప్పటికీ అప్పటి హడావిడి ఏమాత్రం లేదు. ఈ శిబిరాలకు వద్దకు వెళ్లి ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువే. పట్ట్భద్రులకు సంబంధించి వారి ఓట్లు, వరుస సంఖ్య, పోలింగ్ కేంద్రం వంటి సమాచారాలన్నీ వారు ముందుగానే సేకరించుకుని ఉంచుకున్నారు. కొన్ని సంఘాలు, అభ్యర్ధుల తరపున ప్రతినిధులు ఇదే పనిగా పెట్టుకుని ఆ సమాచారాన్ని ఓటర్లకు అందించాయి. దీంతో ఎవరికివారు ఓటు వేసి వెనుతిరుగుతూ కన్పించారు. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలలోనైతే ఆటోలు, లారీలతో సహా ఏ వాహనం అనుకూలంగా ఉంటే ఆ వాహనాన్ని ఓటర్లను తరలించడానికి వినియోగించేవారు. పెద్దలసభకు పోలింగ్ జరుగుతున్న కారణంగానేమోగాని ఈసారి ఓటర్లను తరలించేందుకు పెద్దగా వాహనాలు వినియోగించకపోవటం విశేషం. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలలో కూడా స్పష్టమైన మార్పు కన్పించింది. ఏ ఎన్నిక జరిగినా పోలింగ్ అధికారులుగా ఉపాధ్యాయులు మాత్రమే నియామకం అవటం తెల్సిందే. కానీ ఈసారి ఆ స్ధానాల్లో టీచర్లు లేరు. ఇతర ఉద్యోగులను నియమించి పోలింగ్ వ్యవహారం కొనసాగించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్ధుల ప్రచారం కూడా తక్కువగానే కన్పించింది. జిల్లాకు చెందిన కొంతమంది అభ్యర్ధులు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి పోలింగ్ సరళిని పరిశీలించారు. అసలు ఎన్నికల పోలింగ్ గురువారం జరిగిందా అన్నది కూడా కొంతమందికి తెలియని విధంగా ముగిసిపోయిందంటే ఆతిశయోక్తి కాదు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతలు, పార్టీల ప్రతినిధులు కొంత హడావిడి చేస్తూ కన్పించారు. అంతేకాకుండా పెద్ద ఉపశమనం ఏమిటంటే పోలింగ్ కేంద్రాల వద్ద మందుబాబుల తాకిడి లేకపోవటం.
కొనసాగిన ప్రలోభాలు
పట్ట్భద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా కొంతమంది అభ్యర్ధుల తరపున అనుచరుల హడావిడి కొంత అధికంగానే కన్పించింది. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో కొన్ని ప్రాంతాల్లో వీరి హవా నడిచింది. అయితే ప్రలోభాల పర్వానికి ప్రత్యర్ధుల నుంచి ఆటంకాలు ఎదురుకావటంతో కొన్నిచోట్ల ఇబ్బందులు తప్పలేదు. అంతేకాకుండా నగదుతోనూ, వస్తువులతోను పోలీసులకు కొంతమంది చిక్కడం కూడా ఈసందర్భంగా గమనార్హం. ప్రధానంగా కొన్ని ప్రాంతాలలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక అభ్యర్ది తరపున పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ పంపిణిలను కొనసాగించటంతో వివాదాలు నెలకొన్నాయి. గత రెండురోజుల నుంచి పంపిణిల పర్వం మరింత జోరుగా సాగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మండలి ఎన్నికల విషయంలో అభ్యర్ధులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీఎత్తున తాయిలాలను అందజేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే దీనికి విరుద్దంగా ఆశించిన రీతిలో పంపిణి వ్యవహారాలు నడవకపోవటంతో కొంతమంది ఓటర్లలో పోలింగ్‌పై నిరాసక్తత నెలకొంది. దీన్ని గుర్తించిన అభ్యర్ధులు యధాశక్తి పంపిణిలు చేసేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాచీలు, సెల్‌ఫోన్లు వంటివి పంపిణి చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్లలో చాలామంది అభ్యర్ధులు నజరానాలను సమర్పిస్తారని ఎదురుచూడటం కూడా ఈసారి విశేషంగానే కన్పిస్తుంది. కొంతమంది అయా అభ్యర్ధుల కార్యాలయాలకు ఫోన్లు చేసి మరీ తమ వద్ద ఇంతమంది ఓటర్లు ఉన్నారంటూ పరోక్షంగా నజరానాల వ్యవహారాన్ని కనుక్కునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మాదిరిగా మన జిల్లాలో పంపకాలు ఓటర్లకు కాకుండా మధ్యవర్తులకు ఎక్కువగా జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని సంఘాల నేతలు అభ్యర్ధుల నుండి వాచీలు, సెల్‌ఫోన్లు తీసుకుని వాటిని సక్రమంగా పంపిణి చేయకుండా నొక్కేసారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి.
కుంగుతున్న ఏటిగట్టు
పెనుగొండ, ఫిబ్రవరి 21: రాబోయే పంట కాలానికి ఏమాత్రం నీటిని అందించలేని స్థాయిలో గోదావరి నీటి జలాలు పడిపోయాయి. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సిద్ధాంతం బ్రిడ్జికి అతి సమీపంలో 20 అడుగుల మేరకు ఏటిగట్టు కుంగిపోయింది. ఇదే తరహాలో నీటిమట్టం తగ్గినట్టయితే ఏటిగట్టు తీవ్ర ప్రమాదానికి గురయ్యే సూచనలున్నాయి. ఈ విషయంపై గోదావరి హెడ్‌వర్క్స్ ఎఇని ప్రశ్నించగా అయన అందుబాటులో లేరు. గోదావరి ఏటిగట్టు ఆధునీకరణ పనుల్లో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించాలేదనే సమాచారం. ఇప్పుడే నీటిమట్టం ఈ స్థాయిలో ఉంటే వేసవిలో నీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నీటిమట్టం తగ్గేకొద్దీ ఏటిగట్టు మరింత కుంగి ఇంతవరకు చేసిన మరమ్మతులు గాలికి వదిలే పరిస్థితి ఉంటుందని సూచిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. జీవాధారమైన గోదావరి నది జలాలను పరిరక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాదాసీదాగా సార్వత్రిక సమ్మె
మూతపడిన బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు - యథావిథిగా పనిచేసిన వాణిజ్య, విద్యా సంస్థలు
ఏలూరు, ఫిబ్రవరి 21 : తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు దేశ వ్యాప్తంగా చేపట్టిన రెండురోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం ఏలూరులో వామపక్ష పార్టీల అనుబంధాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మె పాక్షికంగా జరిగింది. సమ్మెలో భాగంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఇన్సూరెన్స్, నగరపాలక సంస్థ, టెలికం, పోస్టల్ రంగాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. అయితే నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు యధావిధిగా పనిచేశాయి. ఆర్టీసీ బస్సులు కూడా యధావిధిగా తిరిగాయి. ఏలూరు, కొత్తూరు జూట్‌మిల్లు కార్మికులు సుమారు ఏడు వేల మంది రెండవ రోజు విధులను బహిష్కరించారు. హమాలీ, చుట్టల కార్మికులు, ఫ్యాక్టరీల కార్మికులు రెండవ రోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పాతబస్టాండ్ వద్ద ఇఫ్టూ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఇఫ్టూ జిల్లా కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడు, కాకర్ల అప్పారావు, జి సత్యనారాయణ, ఎం రాము, పి అప్పలరాజు, వీరినాయుడు, అప్పారావు, తవిటి రాజు, దుర్గారావు, పోలినాయుడు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. బి సోమయ్య, బండి వెంకటేశ్వరరావు, బోను రాజు, జె వివేకవతి, కూనపరెడ్డి కృష్ణారావు, బండి రాజు, బి మణి, బట్టు శ్రీనివాసరావు, బంగారు శంకరరావు, లావేటి చంద్రప్రసాద్, చవిటి ఏలీషా తదితరులు పాల్గొన్నారు. ఎపి మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి సమ్మెలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మణమూర్తి, అధ్యక్షురాలు పి సూర్యావతి తదితరులు పాల్గొన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సార్వత్రిక సమ్మెలో భాగంగా భారతీయ జనతా మజ్దూర్ మహాసంఘ్ నాయకులు గురువారం ఏలూరులోని ఉప కార్మిక శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరళ్ల సుధాకర్‌కృష్ణ, నాయకులు గాది రాంబాబు, ముద్దాని దుర్గారావు, నెరుసు నెలరాజా, మేకల శ్రీకృష్ణదేవరాయలు, బత్తల పార్ధసారధి, ముదిగంటి లక్ష్మీనారాయణ, జి వీర్రాజు, మత్సా శాంతారామ్, చంటి, ఏసురాజు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ ఏలూరు డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏలూరు డివిజన్‌లోని అన్ని పోస్ట్ఫాసులను మూసివేశారు. జెసిఎ కన్వీనర్ వివివి సత్యనారాయణ నాయకులు జి సుధాకర్, ఎం నారాయణ, కె మరియన్న, ఎడ్వర్డ్, వి సత్యనారాయణ, ఎంకె దుర్గాప్రసాద్, ఎం ఇక్బాల్, పి చిట్టిబాబు, ఎం శ్రీనివాసరావు, ఎస్ ఎల్ నరసింహారావు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 56.18 శాతం పోలింగ్
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 21: జంగారెడ్డిగూడెం డివిజన్‌లో ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. డివిజన్‌లో పది పోలింగ్ కేంద్రాలలో పట్ట్భద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 6,613 మంది ఓటర్లు ఉండగా, వారిలో 3,715 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 56.18 శాతం పోలింగ్ నమోదయినట్టు ఆర్డీఒ ఎన్‌వివి సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలింగ్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి.బాబూరావు నాయుడు పర్యవేక్షించారు. పట్టణంలోని 172వ పోలింగ్ కేంద్రంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఒ ఎన్‌వివి సత్యనారాయణ, తహశీల్థార్ బి.ఎస్.నారాయణరెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో 2,706 మంది ఓటర్లు ఉండగా వారి కోసం పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌లో రెండు, గరల్స్ హైస్కూల్‌లో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. డివిజన్‌లో అత్యధికంగా బుట్టాయగూడెం మండలంలో 62.30 శాతం పోలింగ్ నమోదయినట్టు ఆర్డీవో తెలిపారు. అత్యల్పంగా జంగారెడ్డిగూడెం మండలంలో 52.81 శాతం నమోదయినట్టు తెలిపారు. జీలుగుమిల్లి మండలంలో 59.68 శాతం, గోపాలపురం మండలంలో 55.39 శాతం, కొయ్యలగూడెం మండలంలో 57.92 శాతం, పోలవరం మండలంలో 58.65 శాతం పోలింగ్ నమోదయినట్టు వివరించారు. ప్రత్యేక సి.ఐ ఆర్.మనోజహర్, స్థానిక ఎస్సై బి.ఎన్.నాయక్ ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ బి.ఎస్.నారాయణరెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు జి.ఉదయ్, శ్రీనివాస భుజంగం, విఆర్‌ఒలు పోలింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. సాయంత్రం బ్యాలెట్ పెట్టెలను కొవ్వూరు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.
లాటరీ పేరుతో చీటింగ్
ఏలూరు, ఫిబ్రవరి 21 : లాటరీలో కోట్లాది రూపాయలు వచ్చాయని, ముందుగా లక్షలాది రూపాయలు కమీషన్‌గా చెల్లించాలంటూ మోసగించిన నైజీరియాకు చెందిన ఒక వ్యక్తిని ఏలూరు సిసి ఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పాస్‌పోర్టులు, రసాయనిక పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక క్రైం కంట్రోల్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిసి ఎస్ సి ఐ నక్కా సూర్యచంద్రరావు ఇందుకు సంబంధించి వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. తాడేపల్లిగూడెంనకు చెందిన అంబటి అంబికా నాగవేణి, సోదరుడు అంబటి సాయికి ఇంటర్నెట్‌లో చాటింగ్ చేసే అలవాటుంది. వీరికి నైజీరియాకు చెందిన జోజి, జో అల్వర్టులు పరిచయమయ్యారు. మీకు లాటరీ తగిలిందంటూ నాగవేణి, సాయిలకు చాటింగ్ ద్వారా చెప్పారు. భారత కరెన్సీ ప్రకారం ఏడున్నర కోట్ల రూపాయలు వస్తాయని, అయితే ముందుగా పది శాతం అంటే 7.50 లక్షల రూపాయలు చెల్లించాలని వారికి చెప్పారు. దీన్ని నమ్మిన నాగవేణి, సాయిలు గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వారు చెప్పిన అకౌంట్‌లోకి ఏడున్నర లక్షల రూపాయలను జమ చేశారు. ఆ తరువాత ఛాటింగ్‌లో అల్వర్టు, జోజీల ఆచూకీ లభించలేదు. మోసపోయామని గ్రహించి, కొత్త మెయిల్ అడ్రసు క్రియేట్ చేసి మళ్లీ ఛాటింగ్ మొదలు పెట్టారు. దీనితో జోజి, అల్వర్టులు మళ్లీ అందుబాటులోకి వచ్చారు. గతంలో చెల్లించిన ఏడున్నర లక్షల రూపాయలు తక్షణం ఇవ్వాలంటూ నాగవేణి, సాయిలు డిమాండ్ చేశారు. అయితే డొలోమో అలియాస్ ఇబ్రహీం మోడీ అనే వ్యక్తి తమ సంస్థకు చెందిన వాడని, అతను నైజీరియా కరెన్సీ తీసుకువచ్చి ఇస్తాడని జోజి, జో అల్వర్టులు చెప్పారు. ఆ ప్రకారంగానే ఇబ్రహీం మోడీ పది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. అతన్ని కలుసుకునేందుకు వారి తండ్రి అంబటి మురళీమోహన్, న్యాయవాది మాకా శ్రీనివాసరావు, సన్నిహితుడు మూర్తి హైదరాబాద్ వెళ్లారు. ఒక హోటల్‌లో వున్న ఇబ్రహీం మోడీని కలుసుకున్నారు. కాగితాలు కలిగిన ఒక కట్టను ఆ నలుగురికి ఇచ్చి దానితోపాటు ఒక కెమికల్ బాటిల్‌ను కూడా అందజేశాడు. ఈ బండిల్‌పై కెమికల్ చల్లితే ఉదయానికి అసలు కరెన్సీగా మారిపోతుందంటూ వారిని నమ్మించాడు. ఇందుకు 25 శాతం కమిషన్ కూడా ఇవ్వాలని వారిని కోరాడు. ఇబ్రహీం మోడీ ఇచ్చిన బండిల్, కెమికల్ బాటిల్‌తో వారు తాడేపల్లిగూడెం చేరుకున్నారు. ఇబ్రహీం మోడీ చెప్పిన విధంగా బండిల్‌పై కెమికల్ వేసి వుంచగా ఉదయానికి ఎటువంటి మార్పు లేకపోగా పేపర్ బండిల్ ముద్దగా మారిపోయింది. దీంతో మళ్లీ మోసపోయామని నాగవేణి, సాయి గ్రహించారు. మీకు ఇవ్వాల్సిన కమిషన్ ఇస్తామని, తాడేపల్లిగూడెం రావాలంటూ ఇబ్రహీం మోడీకి సమాచారం అందించగా అతను తాడేపల్లిగూడెం చేరుకున్నాడు. వెంటనే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సిసిఎస్ సిఐ నక్కా సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో సిసిఎస్ ఎస్‌ఐ రజనీకుమార్, సిబ్బంది అతన్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
లక్ష్మీనరసింహుని కల్యాణోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 21: సుందరగిరిపై స్వయం భువమూర్తిగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య కల్యాణ మహోత్సవాలు గురువారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన మండలంలోని ఐఎస్ జగన్నాధపురం ఆలయంలో ఉదయం శుభముహూర్త సమయంలో స్వామివారిని పెండ్లి కుమారునిగాను, లక్ష్మీ కనవల్లీ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. తొలుత ఆలయ ఆవరణను, పరిసరాలను పుష్పమాలలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో నయనానందకరంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన వేదికపై కనకవల్లీ సమేత లక్ష్మీ నరసింహుని ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు, అమ్మవార్లను వధూవరులుగా తీర్చిదిద్దుతున్న సమయంలో భక్తులు భగవన్నామ స్మరణ చేశారు. ఆలయ ఇఒ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
400 బస్తాల బియ్యం స్వాధీనం
నల్లజర్ల, ఫిబ్రవరి 21: పెరవలి నుంచి టి నర్సాపురం వెడుతున్న పది టన్నుల సూపర్ ఫైన్ బియ్యం లారీని నల్లజర్ల వద్ద విజిలెన్స్ అధికారులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. 25 కిలోల ప్యాకింగ్ గల 400 బస్తాలు లారీలో వెళుతున్నాయి. అయితే తమవద్ద అనుమతులు వున్నాయని రైస్‌మిల్లు యజమాని చూపించగా, ఆ అనుమతులు గత నెలలో ముగిసినందున కొత్తగా అనుమతులు పొందాల్సి వుందని విజిలెన్స్ అధికారులు చెప్పారు. ఓనరుపై కేసు నమోదుచేసి అనంతరం స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను నల్లజర్లలోని ఒక రైసుమిల్లుకు తరలించారు. ఈ దాడిలో విజిలెన్స్ డిసిపిఒ ఎ. శ్రీ్ధర్, ఎసిపిఒ ఐవిఎస్ సుబ్రహ్మణ్యం, సిబ్బంది రాజేంద్రప్రసాద్, బాషా, వై. శ్రీ్ధర్‌బాబు పాల్గొన్నారు.
తిరునామాల గుండు!
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 21: ద్వారకాతిరుమలలో ఓ భక్తుడు ఏడు కొండలవాని తిరునామాలను తెలిపే గుర్తును శిరస్సుపై కనిపించేలా ఉంచి, మిగిలిన కేశాలను తొలగింపజేసుకున్నాడు. గోపాలపురానికి చెందిన భక్తుడు ఎం రమేష్ ఇలా నెత్తిపై తిరునామాలతో ఆలయంలో తిరుగుతూ కనిపించాడు.
అంతర్వేది ఉత్సవాలకు రంగంలోకి గజ ఈతగాళ్లు
ఏలూరు, ఫిబ్రవరి 21 : అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు సందర్భంగా జిల్లా నుండి వేలాది మంది ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి గోదావరిలో ప్రయాణ సందర్భంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన చెందిన 35 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన ఇన్‌స్పెక్టర్ ఎండి అక్బర్‌తోపాటు 35 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని నరసాపురం ప్రాంతానికి తీసుకువచ్చారు. ఈ బృందం గోదావరిలో నిరంతర నిఘాతో లాంచీలు, పడవల రాకపోకలను పర్యవేక్షిస్తుంది. గత మూడు రోజులు నుండి వేలాది మంది భక్తులు దక్షిణ కాశీగా పేరుగాంచిన అంతర్వేదికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కోరిన వెంటనే ప్రత్యేక బృందాన్ని పశ్చిమగోదావరి జిల్లాకు పంపిన జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి, ప్రకృతి వైపరీత్యాల నివారణ కమిషనర్ టి రాధాలకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్‌పి ఎం రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు.
పోలింగ్‌లో ఘర్షణ.. ఉద్రిక్తత
తణుకు, ఫిబ్రవరి 21: తణుకు బాలురోన్నత, బాలికోన్నత పాఠశాలల్లో గురువారం నిర్వహించిన పట్ట్భద్రుల శాసన మండలి ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ప్రశాంతంగా జరిగినప్పటికీ చివరి గంటలో చెలరేగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి నెలకొని, ధర్నాకు దారితీసింది. అభ్యర్థుల తరఫున పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన శిబిరాలలో మద్దతుదారులు ఓట్లను అభ్యర్థించారు. అందులో భాగంగా సెల్‌ఫోన్లు విస్తృతంగా పంపిణీ చేసిన ఒక అభ్యర్థి తరఫున కార్యకర్తలు పోలింగ్ బూత్ సమీపంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా మరో అభ్యర్థి కచ్చా జార్జివిక్టర్ మద్దతుదారులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి, వివాదాన్ని నివారించేందుకు ప్రయత్నించారు. అయితే విక్టర్ మద్దతుదారులు బాలురోన్నత పాఠశాల ముఖద్వారం ముందు బైఠాయించి, ధర్నాకు దిగారు. ఈ కేంద్రంలో ఎన్నికలు తిరిగి నిర్వహించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జార్జి విక్టర్‌తోబాటు యుటిఎఫ్ నేత సిహెచ్ సుభాష్‌చంద్రబోస్, ఎన్టీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాగర్, సత్యనారాయణమూర్తి, వివి రమణ, శ్రీనివాసులు, చంద్రశేఖర్, తెలుగదేశం నాయకులు తమరాపు సత్యనారాయణ, మేడికొండ నాగయ్య, సిఐటియు నాయకులు పి దక్షిణామూర్తి, పి ప్రతాప్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.