Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

38వ ప్రయోగానికి షార్ సన్నద్ధం

$
0
0

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 21: రాష్టప్రతి సమక్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 38వ ప్రయోగానికి సన్నద్ధమైంది. ఇప్పటి వరకు షార్ నుండి 37 ప్రయోగాలు చేపట్టిన ఇస్రో పిఎస్‌ఎల్‌వి-సి 20 రాకెట్ ప్రయోగంతో 38వది కావడం విశేషం. ఇప్పటి వరకు ప్రయోగించిన వాటిలో 29 విజయం సాధించాయి. ఎనిమిది ప్రయోగాలు విఫలం అయ్యాయి. మొదటిది 1979లో ఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా అతి తక్కువ బరువుగల రోహిణి ఉపగ్రహం విఫలం చెందిన నిరాశ చెందకుండా శాస్తవ్రేత్తలు మరో ప్రయోగానికి సన్నాహం చేసి 1980,81,82 సంవత్సరాల్లో వరుసగా ఎస్‌ఎల్‌వి ద్వారా మూడు ప్రయోగాలను విజయవంతం చేశారు. అనంతరం 1987 మార్చిలో ఎఎస్‌ఎల్‌వి ద్వారా 150 కిలోల బరువుగల స్రోస్-ఎ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపి విజయవంతం చేశారు. ఎఎస్‌ఎల్‌వి ద్వారా మొత్తం నాలుగు ప్రయోగాలు చేయగా రెండు విజయవంతమై రెండు విఫలమయ్యాయి. అనంతరం 1993లో అధిక బరువుల గల ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. 1993లో తొలిసారిగా పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా 846 కిలోల బరువుగల ఐఆర్‌ఎస్- 1ఇ ఉపగ్రహం విఫలం చెందింది. ఏడాది విరామం తర్వాత 1994 అక్టోబర్‌లో పిఎస్‌ఎల్‌వి ద్వారా 804 కిలోల బరువుగల ఐఆర్‌ఎస్-పి 2 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపి విజయవంతం చేశారు. అప్పటి నుంచి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు వరుసగా 21ప్రయోగాలు విజయవంతమవ్వడంతో ఇస్రో కీర్తి నలుదిశలా వ్యాపించింది. దీంతో ఇస్రో భారీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టి 2001లో తొలిసారిగా జిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా 1,540కిలోల బరువుగల జీశాట్-1 ఉపగ్రహా ప్రయోగం విఫలం చెందింది. నిరాశ చెందకుండా ఇస్రో శాస్తవ్రేత్తలు మళ్లీ 2003లో జిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా 1,825కిలోల బరువుగల జీశాట్-2 ఉపగ్రహాన్ని పంపి విజయవంతం చేశారు. 2004లో సెప్టెంబర్‌లో జిఎస్‌ఎల్‌వి ద్వారా ఎడ్యుశాట్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యింది. అనంతరం 2010 ఏప్రిల్, డిసెంబర్ మాసాల్లో ప్రయోగించిన రెండు జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు క్రయోజనిక్ దశలో తలెత్తిన లోపంతో విఫలం చెందాయి. మొత్తం 7 జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు చేయగా అందులో మూడు విజయవంతం కాగా నాలుగు ప్రయోగాలు విఫలమయ్యాయి. సౌండ్ రాకెట్లతో ప్రయోగాలు మొదలుపెట్టి నేడు భారీ రాకెట్ ప్రయోగాలను ప్రయోగించేందుకు ఇస్రో షార్‌ను ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది. శ్రీహరికోట భూమధ్య రేఖకు ఏటవాలుగా సముద్రానికి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని రాకెట్ ప్రయోగాలకు అనుకూలమని గుర్తించి 1979లో రాకెట్ కేంద్రంగా ఎంచుకొన్నారు. ఇక్కడ రెండు ప్రయోగ వేదికలు ఉన్నాయి. మరిన్ని రాకెట్లను ప్రయోగించేందుకు వీలుగా మూడో ప్రయోగ వేదికను కూడా షార్‌లోనే నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాకెట్ పితామహుడు సతీషథావన్ మరణాంతరం శ్రీహరికోటను 2002లో సతీష్ థావన్ స్పేస్ సెంటర్‌గా పేరుమార్చారు.
షార్‌లో కూంబింగ్

రాష్టప్రతి పర్యటనకు భారీ భద్రత
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 21: ఈనెల 25వ తేదీన భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ పిఎస్‌ఎల్‌వి-సి 20 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు షార్‌కు రానున్నారు. రాష్టప్రతి షార్‌కు రానున్న నేపధ్యంలో జిల్లా ఎస్పీ బివి రమణకుమార్ ఆధ్వర్యంలో షార్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచి షార్‌లోని సముద్ర మార్గాన, పులికాట్ పరిధిలో తనిఖీలు నిర్వహించి కూంబింగ్ చేస్తున్నారు. అదే విధంగా సూళ్లూరుపేట నుండి షార్‌కు వెళ్లే మార్గాల్లో కూడా పోలీసులు, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గురువారం కూడా జిల్లా ఎస్పీ బివి రమణకుమార్ షార్‌కెళ్లి హెలిప్యాడ్ పరిశీలించారు. అనంతరం భద్రతపై షార్ అధికారులతో చర్చించారు. రాష్ట్రం నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ వారు కూడా షార్‌కు చేరుకొని భద్రత ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. రాష్టప్రతి రానుండడంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో పాటు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉండడంతో షార్‌లో మొత్తం నాలుగు హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి రాష్టప్రతి వచ్చే రూట్‌మ్యాప్‌ను, బసచేసే భాస్కర అతిధిగృహ పరిసరాల్లో జల్లెడ పట్టి గాలిస్తున్నారు. ఈసారి విఐపిల పాసులకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మీడియా ప్రతినిధులకు ఆంక్షలు తప్పడం లేదు. రాష్టప్రతి 25వ తేదీ మధ్యాహ్నం షార్‌కు చేరుకొని సాయంత్రం ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించి రాత్రికి అక్కడ బసచేసి 26న ఉదయం ఢిల్లీకి తిరిగి వెళ్తారు. దీంతో ఇటు పోలీసు యంత్రాంగంతో పాటు సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిని కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. సూళ్లూరుపేట నుంచి షార్‌కు వెళ్లే మార్గమధ్యంలో అట్టకానితిప్ప వద్ద శనివారం నుంచి పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయనున్నారు.
ఎడతెగని రెడ్‌క్రాస్ వివాదం
నెల్లూరు, ఫిబ్రవరి 21: సేవానిరతిలో విశ్వఖ్యాతి నొందిన రెడ్‌క్రాస్ సంస్థకు నెల్లూరు కమిటీ సభ్యులు రచ్చకీడుస్తూ భ్రష్టు పట్టిస్తున్నారు. గత 15నెలలుగా కమిటీ లేక సేవా కార్యక్రమాల విస్తృతికి గ్రహణం పడుతున్న రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌కు ఇప్పుడు మరింత అప్రతిష్ట ఎదురైంది. నెల్లూరు రెడ్‌క్రాస్‌కు అనుబంధంగా సేవలందిస్తున్న పది విభాగాలకు ఇకపై ప్రభుత్వ అధికారులే అడ్‌హక్ కమిటీ ప్రతినిధులుగా కార్యాచరణ కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడటం విమర్శలకు తావిస్తోన్న పరిణామం. సరిగ్గా గత ఏడాది డిసెంబర్ తొలివారంలో ఓ మహిళకు స్థానిక రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ హెచ్‌ఐవి పాజిటివ్ రక్తం అందజేసిందనే ఆరోపణల నేపథ్యంలో కమిటీ రద్దు కావడం విదితమే. కొత్త కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఏవేవో లొసుగులు, కుంటిసాకులు చూపుతూ ఎప్పటికప్పుడు వెనక్కు నెడుతున్న పలువురు రెడ్‌క్రాస్ జీవిత సభ్యులు మళ్లీ ఇప్పుడు తెగబడ్డారు. ఇంకొన్నాళ్లు అధికార్ల పర్యవేక్షణకే మొత్తం విభాగాలన్నీ అప్పగించేలా బలవంతం చేశారు. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుడు రక్తం ప్యాకెట్లను బ్లాక్‌మార్కెట్‌లోకి తరలిస్తూ పట్టుబడిపోవడం ప్రస్తావించుకుంటున్నారు. అలాంటి దుస్సంఘటనలు అధికార్ల పాలనలో రెడ్‌క్రాస్‌లోనూ చోటుచేసుకుంటాయంటూ ఇదే సందర్భంలో మరోవర్గానికి చెందిన జీవితకాలం సభ్యులు పేర్కొనడం గమనార్హం. గురువారం నెల్లూరు రెడ్‌క్రాస్ సర్వసభ్య సమావేశం నూతన కమిటీ నియామకానికి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం శ్రీకారం చుట్టారు. అయితే యధాప్రకారం అభిప్రాయ భేదాలు వ్యక్తపరుస్తూ వివాదాల పరంపర సాగించారు. రెడ్‌క్రాస్ రాష్ట్ర కమిటీ జిల్లా బ్రాంచిలకు సరైన మార్గదర్శకాలు పంపే వరకు నూతన కమిటీ నియామకం వద్దంటూ భీష్మించారు. అలా వ్యాఖ్యానించిన వర్గానికి చెందినోళ్లే ఇదే సందర్భంలో మరలా ప్రభుత్వ అధికార్ల నియామకం వల్ల సేవా కార్యక్రమాలు కుంటుపడుతాయంటూ కూడా సన్నాయి నొక్కులు నొక్కారు. ప్రభుత్వశాఖల కార్యాచరణే ఎక్కువగా ఉంటూ ఇలాంటి అదనపుబాధ్యతలు మోయలేరంటూ అభిప్రాయపడ్డారు. అంతేగాక పిల్లిపిల్లి కోతి తీర్పు మాదిరిగా మనలో విభేదాలు అధికార్ల అవినీతికి రెడ్‌క్రాస్ కూడా ఊతమిట్చేలా పరిస్థితులు ఏర్పడతాయంటూ మరో వక్త ఉపన్యసించడం గమనార్హం. ఇదిలాఉంటే రెడ్‌క్రాస్ వల్ల హెచ్‌ఐవి మహమ్మారి సోకిన బాధితురాలి తరఫున వామపక్షాలు జాయింట్ కలెక్టర్‌ను ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశాయి. ఆందోళనకారులకు సర్దిచెప్పి సభావేదిక వద్దకు చేరుకున్న జెసికి సభ్యుల నడుమ సర్దుబాటు ధోరణి లేదని తెలుసుకుని అన్ని సేవా విభాగాలకు అడ్‌హక్ కమిటీగా అధికార్లను నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు బ్లడ్‌బ్యాంక్‌ను పర్యవేక్షిస్తున్న జిల్లా అదనపువైద్యారోగ్య అధికారిణి పద్మావతి, ముఖ్య వైద్యాధికారిగా డి జులైనానా యధాప్రకారం కొనసాగుతారు. అలాగే రెడ్‌క్రాస్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు టిబి ఆసుపత్రి సూపరింటిండెంట్ నియమితులయ్యారు. ఏఆర్‌వి క్లీనిక్, శవపేటికల విభాగానికి నెల్లూరు తహశీల్దార్, సంజీవని ఔషధాల విభాగానికి డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎంఎస్‌ఆర్ స్పాస్టిక్ సెంటర్‌కు డిబిసిస్ కార్యక్రమ అధికారి, ఐఆర్‌సిఎస్ డైజస్టర్ మేనేజిమెంట్, కమ్యూనిటీ బేస్డ్ రిస్క్ రిడక్షన్ కార్యక్రమానికి నెల్లూరు ఆర్డీఓ, జూనియర్, యువ రెడ్‌క్రాస్‌లకు డ్వామా పి.డి, వైఆర్‌జి కేర్ యూనిట్‌కు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ఐఆర్‌సిఎస్ పారామెడికల్ సైనె్సస్‌కు డిఎంహెచ్‌ఓ, జిల్లా వికలాంగ రిహాబిలేషన్ కేంద్రానికి సెట్నల్ సిఇఓలు నూతనంగా నియమితులయ్యారు.

ఆ రెండు పార్టీలవే కుమ్మక్కు రాజకీయాలు

కావలి, ఫిబ్రవరి 21: తాము కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కుయ్యామని ఆరోపిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలే కాంగ్రెస్‌పార్టీతో కుమ్మక్కై తమ పార్టీని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర విమర్శించారు. గురువారం ఆయన పట్టణంలోని ఉదయగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఇన్‌చార్జ్ బొల్లినేని వెంకటరామారావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుందని, మరోవైపు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత ఎలాగైనా బయటపడాలని ఆలోచిస్తుండగా అవి రెండూ భవిష్యత్తు కోసం కుమ్మక్కు అవుతున్నారని, ఈవిషయం ప్రజలు స్పష్టంగా అర్ధం చేసుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకు రానున్నారని జోస్యం చెప్పారు. ఈకార్యక్రమంలో వారితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
1న సిఎం ముత్తుకూరు రాక
ముత్తుకూరు, ఫిబ్రవరి 21: ఇందిరమ్మ బాటలో భాగంగా ముఖ్యమంత్రి వచ్చేనెల 1న ముత్తుకూరుకు రానున్నట్లు జడ్పీ సిఇఓ టి వీరభద్రయ్య, నెల్లూరు ఆర్డీఓ మాధవీలత సంయుక్తంగా వెల్లడించారు. గురువారం వారిద్దరూ స్థానికంగా పర్యటించి ఈ విషయాన్ని నిర్థారించారు.

సినీ ఫక్కీలో జాతీయ రహదారిపై ఛేజింగ్
* ఎస్‌ఐ వాహనంపైకి డీజిల్ క్యాన్‌లు విసిరి నిప్పు అంటించే యత్నం * ప్రతిగా 9రౌండ్ల కాల్పులు
కావలి, ఫిబ్రవరి 21: రాత్రి సమయాల్లో హైవే పెట్రోలింగ్ విధి నిర్వహణలో వున్న స్థానిక రూరల్ ఎస్‌ఐ గిరిబాబు ఓ అనుమానాస్పద వాహనాన్ని వెంటాడగా చివరికి కాల్పులకు దారితీసిన ఘటన గురువారం వేకువఝామున జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి. విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు చేస్తున్న ఆయనకు మండలంలోని గౌరవరం గ్రామ సమీపంలో రెస్ట్ పాయింట్ వద్ద ఒక అనుమానాస్పద స్కార్పియో వాహనం కనిపించగా అందులో వున్న వారిని తనతో వున్న సిబ్బందితో కలిసి ప్రశ్నించారు. వెంటనే వారు ఒక ఉదుటన నెల్లూరువైపు వాహనాన్ని మళ్ళించగా అనుమానంతో ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి దానిని వెంబడించారు. అయితే తిప్పవరకు వెళ్ళిన స్కార్పియో వాహనం యుటర్న్ తీసుకొని కావలి వైపు పరుగులు తీయగా అంతేవేగంతో దానిని అనుసరించి ఛేజ్ చేసేందుకు ప్రయత్నించారు. దుండగులు వున్న వాహనం కావలి పట్టణం వైపునకు రాగా రూరల్ స్టేషన్‌లోగల పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసినప్పటికీ వారిని దాటుకొని తిరిగి మద్దూరపాడు హైవే పైకి వెళ్ళిపోయింది. ఒకవైపు దానిని నిలిపివేసి అందులో వున్నవారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఈ సమాచారాన్ని ఎస్‌ఐ గిరిబాబు తన పై అధికారులతోపాటు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రకాశం జిల్లా శింగరాయకొండ ప్రాంతానికి చేరుకోగా వెనుక వస్తున్న ఎస్‌ఐ వాహనంపైకి వారి వాహనంలో వున్న క్యాన్‌లో గల డీజిల్‌ను రోడ్డుపై పోసి వాహనంపై విసిరి నిప్పంటించే ప్రయత్నంచేశారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియచేయగా వారి సూచనల మేరకు ముందు వెళ్తున్న వాహనంపై ఎస్‌ఐ తన వద్దనున్న తుపాకీతో 9రౌండ్లు కాల్పులు జరపగా టైర్లు పేలి నిలిచిపోయింది. అయితే అందులో వున్న సుమారు ఆరుగురు వ్యక్తులు అక్కడ నుంచి తప్పించుకొని సమీపంలోగల కట్టెల అడితిలోకి పారిపోయారు. సిఐ ప్రసాద్‌తోపాటు పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని జరిగిన తీరును పరిశీలించగా అనుమానితులు ప్రయాణించిన వాహనం ఆత్మకూరు సమీపంలోని ఏఎస్ పేటకు చెందినదిగా తెలిసింది. కాగా, రెండు జిల్లాల పరిధిలో పోలీసు వర్గాలతోపాటు ప్రజల్లోను ఈ విషయం సంచలనం సృష్టించింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు పూర్తయితే కాని అందులో వున్న వ్యక్తులెవరో తెలియరాదని పోలీసులు అంటున్నారు.

రాజన్న రాజ్యం కోసమే ‘దీవెన’
ముత్తుకూరు, ఫిబ్రవరి 21: రాజన్న రాజ్యం సాధించేందుకే దీవెన యాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధనరెడ్డి తెలిపారు. గురువారం ఇంటింటికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నినాదంతో మండలంలోని పైనంపురంలో దీవెన యాత్ర నిర్వహించారు. స్థానిక పార్టీ నేత మెట్టా విష్ణువర్ధనరెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా కాకాణి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తిరిగి రావాలంటే జగన్‌కే సాధ్యమవుతుందన్నారు. ప్రజాభిమానం ముందు అధికార, ప్రతిపక్ష పార్టీల కుయుక్తులు అడ్డురావన్నారు. జగన్ సారధ్యంలో వైఎస్‌ఆర్‌సి రాష్ట్రంలో ప్రజాభిమానం సొంతం చేసుకోవడం ఖాయమన్నారు. ప్రజలంతా తమ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పైనంపురం మహిళలు కాకాణికి ఈ సందర్భంలో హారతులతో స్వాగతం పలికి దీవించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, ఈపూరు కోటారెడ్డి, యానాటి శశిధరరెడ్డి, ఎర్రం వేణుయాదవ్, బందెల వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
‘ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం తూట్లు’
ముత్తుకూరు, రెండురోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా వివిధ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. గురువారం సదరు నాయకులు ముత్తుకూరులో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను బలవంతంగా మూయించారు. నిరసనలో భాగంగా స్థానిక విబిఆర్ స్కూల్ విద్యార్థుల్ని తరగతి గదుల నుంచి దూరంగా పంపించారు. అలాగే తహశీల్దార్, ఎండిఓ కార్యాలయాల్లో కూడా ఉద్యోగుల్ని వెలుపలకు వెళ్లాలంటూ పట్టుబట్టారు.

జగన్ సిఎం అయితే సుభిక్ష పాలన
అనిల్ ప్రజా దీవెనలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు
నెల్లూరు, ఫిబ్రవరి 21: జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే రాష్ట్రంలో సుభిక్ష పాలనకు సాధ్యపడుతుందని జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. గురువారంరాత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నెల్లూరు నగర ఇన్‌చార్జి అనిల్‌కుమార్‌యాదవ్ ప్రజాదీవెన కార్యక్రమం ఆడంబరంగా ఆరంభమైంది. ఈ ప్రజాదీవెన కార్యక్రమానికి జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు తరలివచ్చి ప్రసంగిస్తూ ప్రతి పేదవాడి గుండెలో తమ పార్టీ పట్ల తిరుగులేని అభిమానం ఉందన్నారు. జగన్ జైలువాసం నుంచి అనతికాలంలోనే విముక్తి పొందడం ఖాయమని జోస్యం చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా తమ పార్టీ వైపే ప్రజలు మొగ్గుచూపనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నెల్లూరుజిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, పార్టీ నేతలు రామిరెడ్డిప్రతాప్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ్ధరరెడ్డి, ముక్కాల ద్వారకానాధ్, బండ్లమూడి అనిత, పులిమి శైలజ, రూప్‌కుమార్‌యాదవ్, సంక్రాంతి కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
‘గ్రేటర్ రాయలసీమగా చేయాలి’
వెంకటగిరి, ఫిబ్రవరి 21: గ్రేటర్ రాయలసీమగా ప్రకటించకపోతే పోరాటం తప్పదని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కుంచం వెంకటసుబ్బారెడ్డి స్పష్టంచేశారు. గురువారం వెంకటగిరి విచ్చేసిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కంకణం కట్టుకున్నది యూపిఏ అన్నారు. తెలంగాణా కావాలని తెలంగాణా వాదులు నానా రకాల సమస్యలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న సమయంలో సోనియా జన్మదిన కానుకగా చిదంబరం తెలంగాణా ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో అటు తెలంగాణ, ఇటు సమైక్యాంధ్రా వాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తున్నా రాయలసీమను గురించి పట్టుంచుకున్న నాథుడే లేరన్నారు. రాయలసీమ వ్యక్తిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాయలసీమను గురించి పట్టుంచుకోక పోవడమేకాక తెలంగాణా అంశాన్ని రాహుల్‌తో ప్రస్తావించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణాతో పాటు రాయలసీమను ప్రత్యేక గ్రేటర్ రాయలసీమ చేయకపోతే తెలంగాణా, సమైక్యాంధ్రాతో పాటు రాయలసీమ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మూడవ వ్యక్తిగా రాయలసీమ కోసం పోరాటం తప్పదన్నారు. తెలంగాణా ఏర్పాటుకు ప్రస్తుతం కేంద్రంలో రాహుల్‌గాంధీ మూడవ కృష్ణని అవతారం ఎత్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమకు ఎంత అన్యాయం జరుగుతుందో రాయలసీమ నాయకులకు తెలియదా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ప్రత్యేక గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పలు సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించామన్నారు. రానున్న 2014 ఎన్నికల్లో రాయలసీమ రాష్ట్ర సమితి తరపున పోటీకి సిద్ధవౌతున్నట్లు చెప్పారు.

రెండో రోజు సమ్మె పాక్షికం
నెల్లూరు, ఫిబ్రవరి 21: అధికార కాంగ్రెస్‌పార్టీకి అనుబంధంగా వ్యవహరించే ఐఎన్‌టియూసితో సహా మరో నాలుగు కార్మిక సంఘాలు సంయుక్తంగా చేపట్టిన రెండురోజుల సార్వత్రిక సమ్మె నెల్లూరుజిల్లాలో పాక్షికంగా ముగిసింది. గురువారం రెండోరోజున ఎల్‌ఐసి, బ్యాంకులు, టెలికమ్, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. కార్మిక సంఘాల నేతలు స్థానికంగా ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. కాగా, ఆందోళనకారులు నెల్లూరు కలెక్టరేట్‌లోకి దూసుకురాకుండా భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ సంగతి ముందుగానే తెలుసుకున్న నిరసన కారులు అటు దిశగా వెళ్లకుండా ప్రధాన బజార్లలో ట్రాఫిక్ స్థంభింపజేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పెళ్లకూరు, ఫిబ్రవరి 21: మండలంలోని అక్కగారి పేట గ్రామ సమీపంలో నాయుడుపేట-పూతలపట్టు రహదారిపై బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆగివున్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండల సమీపంలో అక్కగారిపేట సమీపంలో బుధవారం అర్ధరాత్రి నాయుడుపేట నుండి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న ఓ లారీ మరమ్మతులకు గురైంది, దీంతో లారీ డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలపగా ఆ మార్గంలో గుంటూరు జిల్లా వినుకొండ నుండి తమిళనాడులోని కాట్పాడికి కందిపప్పు నూక లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుండి ఢీకొంది. ఈ సంఘటనలో ఢీకొన్న లారీ క్లీనర్ అంబటిపూడి వెంకటేశ్వర్లు(40)తో పాటు లారీలో ప్రయాణిస్తున్న సరకు యజమాని మీనుపాడి కృష్ణమూర్తి(35) సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. డ్రైవర్ రామకృష్ణ సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డాడు. మృతుడు కృష్ణమూర్తిది తమిళనాడులోని వేలూరు జిల్లా కాడ్పాడి తాలూకా సంజీవ రాయపురం గ్రామం. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇతను స్థానికంగా హోల్‌సేల్ వ్యాపారి అని తెలిసింది. మృతుడు క్లీనర్ వెంకటేశ్వర్లుది ప్రకాశం జిల్లా మార్కాపురం. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాలను ఎస్సై రామకృష్ణ నాయుడుపేట ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్టప్రతి సమక్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోట
english title: 
shar

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>