కర్నూలు, ఫిబ్రవరి 21: హైదరాబాద్‌లో గురువారం రాత్రి జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపధ్యంలో కర్నూలు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస పేలుళ్లలో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం జరిగిన నేపధ్యంలో ఎస్‌పి చంద్రశేఖర్‌రెడ్డి జిల్లాలోని పోలీసు అధికారులను అలర్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఎస్‌పి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. అనుమానిత వాహనాలు, వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రార్థనా మందిరాలు, బస్టాండ్‌లు, బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. హైవేపై పెట్రోలింగ్ చేపట్టారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుం డా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు.
చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తాం..
* నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్‌గుప్త
నంద్యాల రూరల్, ఫిబ్రవరి 21 : చెరకు రైతుల రూ. 1.6 కోట్ల బకాయిలను మార్చి 4వ తేదీలోపు చెల్లిస్తానని నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్‌గుప్త ప్రకటించారు. గత రెండు వారాలుగా నంద్యాల ప్రాంతంలోని చెరకు రైతుల సమస్య వివాదస్పదంగా మారిన విషయం కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో గురువారం నంద్యాలలోని వైఎస్‌ఆర్ సెంటినరీ హాల్‌లో చెరుకు రైతులతో కలెక్టర్, షుగర్ కేన్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్, ఫ్యాక్టరీ చైర్మన్ మధుతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొందరు రైతులు వేదికపైకి పైకి వచ్చి వారి సమస్యలను తెలియజేయాలని కోరారు. దీంతో రైతులు బసవేశ్వరరెడ్డి, బంగారురెడ్డి, సిద్ధారెడ్డి, తదితరులు లేచి మాట్లాడు తూ గత రెండు వారాలుగా 1500 టన్నుల చెరకు చక్కెర ప్యాక్టరీ ఆవరణలో నిల్వ ఉందని, దీంతో ఎండకు ఎండిపోతూ తూకం తగ్గి రైతుకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. అలాగే గత ఏడాది చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, కొత్తకోట చక్కెర ఫ్యాక్టరీకి తరలించిన చెరకు బకాయిలు వెంటనే ఇవ్వాలని, లేనిపక్షంలో ఇక్కడి నుంచి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో పాటు ఫ్యాక్టరీపై నమ్మకం లేదని కలెక్టర్ హామీ ఇస్తేనే నమ్మకం ఉంటుందని రైతులు తెలిపారు. ఈ విషయంపై ఎండి మధు వివరణ ఇవ్వాలని కలెక్టర్ కోరగా మార్చి 4వ తేదీలోగా రూ. 1.6 కోట్ల బకాయిలను చెల్లిస్తానని ఎంపి కలెక్టర్ సమక్షంలో ప్రకటించారు. అలాగే చక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో నిల్వ ఉన్న చెరకును, పొలాల్లో ఉన్న చెరకును ఫ్యాక్టరీ ప్రారంభించిన వెంటనే క్రాసింగ్‌కు తీసుకుంటా మన్నారు. మార్చి చివరి లోపు కొత్తకోటకు తరలించిన చెరకు రైతులకు నగదును ఇస్తామని తెలిపారు. దీంతో కలెక్టర్ సమక్షంలోనే హామీలు ఇవ్వడంతో రైతులు సంతోషంగా వెనుదిరిగిపోయారు.
పోలీసుల పహారాలో సమావేశం
నంద్యాలలో జరిగిన చెరకు రైతుల సమావేశం పోలీసుల దిగ్బంధంలో జిల్లా కలెక్టర్, ఎండి మధుసూధన్‌గుప్తతో సమావేశం కావాల్సిన దౌర్బాగ్య పరిస్థితి అవసరమా అని రైతులు సమావేశం మందిరంలో వాపోయారు. రూ. 300కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని కొనుగోలు చేశానని రూ. 150కోట్లతో ఫ్యాక్టరీని లీజుకు ఇస్తానని ఎవరైనా నడిపే వారుంటే ముందుకు రావాలని షుగర్ ఫ్యాక్టరీ ఎండి మధుసూధన్‌గుప్తా ఆవేశంగా రైతులతో మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీ నష్టాలో ఊబిలో ఉన్నప్పుడే ప్రారంభించి రైతులకు సేవలందించానని అటువంటి యాజమాన్యాన్ని శిక్షించాలని అనడం రైతులకు తగదన్నారు. త్వరలోనే రైతుల బకాయిలన్నింటినీ ఇవ్వడం జరుగుతుందని ఎండి గుప్త పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు, నంద్యాల ఆర్డీవో శంకర్, వ్యవసాయ శాఖ జెడిఎ ఠాగూర్‌నాయక్, డిపిఓ శోభా స్వరూపారాణి, డిఎల్‌పిఓ ప్రభాకర్‌రావు, నంద్యాల తహశీల్దార్ మాలకొండయ్య, ఆర్‌ఐ రామనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చెరుకు రైతుల సమావేశానికి కలెక్టర్, ఎండి మధుసూధన్‌గుప్త రావడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా డిఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు పర్యవేక్షణలో సిఐలు గుమ్మడి రవికుమార్, హుశేన్‌పీరా, రామాంజినాయక్, ఎస్‌ఐలు పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫ్యాక్టరీలో భూమి అమ్మితే ఉద్యమిస్తాం: రైతుల సంఘం
ఆధునీకరణ పేరుతో నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ లోని భూమిని అమ్ముకుంటే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి సిద్దారెడ్డి, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్‌లు హెచ్చరించారు. గురువారం నంద్యాలలో జరిగిన రైతుల సమావేశంలో అధికారుల వద్దకు పలు డిమాండ్లను వివరించారు. రెండు సంవత్సరాలుగా చెరకు రైతులు ఇబ్బందులు పడుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు భాగస్వామ్యంతో ఫ్యాక్టరీ ఉండేదని యాజమాన్యం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. రైతుల అభ్యున్నతికి పాటుపడేందుకు ఫ్యాక్టరీ లేదన్నారు. రూ. 300కోట్లతో కొనుగోలు చేశానని అమ్ముకొనే హక్కు తమకు ఉందని ఎండి అనడం తగదన్నారు. భూమి జోలికి వస్తే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని వారు అన్నారు.
ఎర్రగుంట్ల రైల్వేలైన్‌కు నిధుల లేమి!
* ఏళ్ల తరబడి సాగుతున్న పనులు
బనగానపల్లె, ఫిబ్రవరి 21: నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వేలైన్ ప్రజలకు అందని ద్రాక్షలా మారి ఊరిస్తుంది. నిధుల కొరతతో ఎర్రగుంట్ల నుంచి నంద్యాల వరకూ 135 కిలోమీటర్ల మేర వున్న ఈ లైన్ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఎట్టకేలకు ఎర్రగుంట్ల నుం చి బనగానపల్లె వరకూ లైన్ తయారు కావడంతో రైల్ ఇంజిన్‌తో ట్రయల్ రన్ చేయగా ఇక రైలు వచ్చినట్లేనని ఇక్కడి ప్రజలు భావించారు. అప్పటి నుంచి ఏడాది అవుతున్నా ఇంతవరకూ రైలు కూత వినబడలేదు. ఎర్రగుంట్ల నుంచి బనగానపల్లె వరకూ రైల్వే లైన్ పనులు పూర్తయినప్పటికీ బనగానపల్లె స్టేషన్ నిర్మాణం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. కోవెలకుంట్ల స్టేషన్ పనులైతే ప్రారంభించనేలేదు. కాగా బనగానపల్లె నుంచి నంద్యాల వరకూ రైల్వే లైన్ పనులు పూర్తికావలసి వుంది. నిధులు కేటాయిస్తారు పనులు జరుగుతాయని అందరూ భావించారు. మధ్యలో వంతెనల పనులు కొంతమేరకు జరిగినా లైనింగ్ పనులు జరుగవలసి వుంది. నిధులు కేటాయించి అధికారులు దృష్టి సారిస్తే ఈసారి బడ్జెట్‌కంతా లైనింగ్ పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు. నిధులు తగినంతగా లేక పనులు మందకొడిగా జరుగుతున్నాయి. జిల్లా నేత కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ వారంలో జరిగే రైల్వే బడ్జెట్‌పై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ రైల్వే లైన్ పనులు పూర్తయితే నంద్యాల నుంచి తిరుపతి మార్గం మరింత దగ్గరవుతుంది.
దళారీ వ్యవస్థ అంతంతోనే
లబ్ధిదారుడికి లాభం
* భారత్ నిర్మాణ్ పౌర సమాచార ఉత్సవాల
ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కాటసాని
కల్లూరు, ఫిభ్రవరి 21: పేద మధ్య తరగతి కుటుంబాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా అందులో 80 శాతం దళారుల పాలవుతున్నాయని, ఈ దళారీ వ్యవస్థ అంతమైనప్పుడే లబ్ధిదారులకు లాభం చేకూరుతుందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నాడు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక స్పెషల్ పోలీసు స్టేడియంలో భారత్ నిర్మాణ్ పౌర సమాచార ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే కాటసాని, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, పత్రిక సమాచార కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవివిఎఎస్ మూర్తి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విద్యార్థులు, ప్రజలతో మాతృభాష ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు అందినప్పుడే ఆ ప్రభుత్వాలకు గుర్తింపు వుంటుదని, అందుకోసం కష్టపడిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆత్మ సంతృప్తి కల్గుతుందన్నారు. జిల్లా ఉన్నత అధికార యంత్రాంగం ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో లోటు పాట్లను గుర్తించి అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొదుపులక్ష్మి పథకానికి గుర్తింపు తెచ్చిన ఓర్వకల్లు మహిళలను ప్రతిఒక్కరూ మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం తెలియక చాలామంది నష్టపోతున్నారని, తద్వారా అక్కడక్కడ పథకాలు నీరుగారి అభివృద్ధి అడుగంటిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాచార ఉత్సవంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా 28 శాఖలకు చెందిన ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే అవసరం వుందన్నారు. అధికారులు కూడా గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకూ ప్రతి సంక్షేమ పథకం గురించి అందరికీ తెలియజేయలన్నారు. అనంతరం జడ్పీ సిఇఓ సూర్యప్రకాష్, డిఆర్‌డిఎ పిడి వెంకటకృష్ణ, ఎంవివివిఎఎస్ మూర్తి ప్రసంగించారు. అనంతరం వివిధ పాఠశాలల చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు, ఆలపించిన దేశ భక్తిగీతాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పిడి హరినాథ్, డిఇఓ బుచ్చన్న, ఆర్వీఎం పిడి పద్మకుమారి, జిల్లా ప్రణాళిక అధికారి ఆనంద్ నాయక్, కర్నూలు ఆర్డీఓ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
సమ్మె సక్సెస్
* పలువురి అరెస్టు
కర్నూలు, ఫిబ్రవరి 21: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సమ్మె విజయవంతమైంది. పెరిగిన ధరలు, కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా దేశంలోని కార్మిక సంఘాలు సంయుక్తంగా సా ర్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంకులు, జీవిత బీమా సంస్థ, తపా లా వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు సంఘటిత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు మద్దతుగా కార్మి క సంఘాల నాయకులు, కార్మికులు గురువారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు పలు కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించగా అన్ని మండల కేంద్రాల్లో సార్వత్రిక సమ్మెకు మద్దతునిస్తున్న పార్టీల కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సమ్మెలో భాగంగా రెండో రోజు సైతం ఆటోలు నడవకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కర్నూలు, ఆదోని, నంద్యాల మార్కెట్ యార్డుల్లో పని చేసే కార్మికులు రెండో రోజు కూడా విధులకు హాజరు కాకపోవడంతో లావాదేవీలు స్తంభించాయి. ఇక బ్యాంకు ఉద్యోగులు, తపాలా కార్మికులు, జీవిత బీమా సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఆయా సంస్థల్లో సేవలు నిలిచిపోయాయి. ప్రధానంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎటిఎంలలో నగదు నిల్వలు అయిపోవడంతో పలువురు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. రెండు రోజుల సార్వత్రిక సమ్మె ప్రజాజీవనంపై పాక్షిక ప్రభావం చూపింది. ప్రధానంగా ఆటో కార్మికులు సమ్మెలో ఉండటంతో దీని ప్రభావం సామాన్య ప్రజలపై ఎక్కువగా కనిపించింది.
అహోబిలేశుని సేవలో
దేవాదాయ శాఖ సిఇ
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, ఇఇ శ్రీనివాసులు, డిఇ గంగయ్య గురువారం కుటుంబ సమేతంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిఇ సత్యనారాయణరెడ్డికి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్, మేనేజర్ బివి నరసయ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఎగువ అహోబిలంలో స్వయంభువుగా వెలసిన నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను, దిగువలో వెలసిన ప్రహ్లాద వరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వారిని అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి జ్ఞాపికతో సత్కరించారు. వీరి వెంట ఎఇ సతీష్ వున్నారు.
దేవాలయాల అభివృద్ధికి
రూ. 40 కోట్ల సిజిఎఫ్ నిధులు
మహానంది, ఫిబ్రవరి 21: రాష్ట్రంలోని పలుదేవాలయాల అభివృద్ధికై మొదటి విడతగా రూ. 40 కోట్ల సిజిఎఫ్ నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. గురువారం మహానంది పుణ్యక్షేత్రంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇఓ దివాకర్‌బాబు ఆయన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా విడుదలైన సిజిఎఫ్ నిధుల్లో రాయలసీమకే అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఆ పనులు అన్ని ప్రారంభమైనట్లు తెలిపారు. రెండవ విడత నిధుల కోసం ఈనెల 8న దేవాదాయశాఖ మంత్రి రామచంద్రయ్యతో సమావేశం నిర్వహించడం జరిగిందని నిధులను త్వరగా కేటాయిస్తామ న్నారు. దేవాలయ ఆస్తులు అక్రమించినా సర్వేచేసి స్వాధీ నం చేసుకుంటామన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయని మహానంది క్షేత్రం లాంటి దేవాలయాలు వచ్చిన ఆదాయంలో సిజిఎఫ్‌కు కట్టా ల్సి ఉంటుందని దాని ద్వారా వచ్చిన నిధులతోనే అభివృద్ధి చేయాల్సి ఉం టుందని కాబట్టి దేవాలయాలు అభివృద్ధి చెందడం లేదన్నారు. ఈ ఆలయాలకు దాతలు సహకరించాలన్నా రు. వీరి వెంట గంగయ్య, శ్రీనివాసు లు, సతీష్, శ్రీనివాసప్రసాద్, మల్లి కార్జున, మధు, వెంకటేశ్వర్లు ఉన్నారు.
స్వయం సహాయక
బృందాల ద్వారానే అభివృద్ధి
* కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి
కర్నూలు, ఫిబ్రవరి 21: స్వయం సహాయక బృందాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జమ్మూకాశ్మీర్, హర్యానా రాష్ట్రాల స్వయం సహాయక బృందా లు, అధికారులతో గురువారం జిల్లా స్వయం సహాయక బృందాల పనితీరుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1985వ సంవత్సరంలో జిల్లా లో చిన్నగా స్వయం సహాయక బృం దాలు ఏర్పడ్డాయని, వాటి ద్వారా అర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఇకపోతే మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పలు పథకాలను ప్రవే శ పెట్టి అమలు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాలకు పావ లా వడ్డీ, వడ్డీ లేని రుణాలు ఇస్తుందన్నారు. డిఆర్‌డిఎ ద్వారా మహిళలకు కుట్టుశిక్షణ, చిన్న చిన్న వ్యాపారాలు, చేతి వృత్తులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలపై ఎస్‌హెచ్‌జీ బ్యాంకుల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించి మహిళల్లో చైతన్యం తెచ్చి అర్హులకు పథకాలు అందిస్తున్నారన్నారు. గ్రామాల్లో మధ్యాహ్న భోజన పథకం, మాతాశిశు సంరక్షణ, భూమి పంపిణీ తదితర పథకాల్లో అవగాహన పరుస్తున్నామని వీటి ద్వారా వారు ప్రయోజనం పొందుతారని తెలిపారు. జడ్పీ సిఇఓ సూర్యప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి మహిళా ఎస్‌హెచ్‌జి బృందాలున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా తదితర వాటికి పంచాయతీ నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. అలాగే మాతాశిశు సంరక్షణ పథకం ద్వారా జాబ్ కార్డు పంపిణీ చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో డిఇఓ బుచ్చన్న, డిఆర్‌డిఎ పిడి వెంకటకృష్ణ, ఎస్‌హెచ్‌జి బృందాల సహాయ సలహాదారులు విజయభారతి, 40 మంది జమ్మూకాశ్మీర్ బృందాల మహిళలు, 15 మంది హర్యాన బృందాల అధికారులు పాల్గొన్నారు.
తుంగభద్ర నుంచి
నీటివాటా సాధిస్తాం..
ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 21: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి నెలలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. ఎన్నడూ లేనివిధం గా ముందుగానే తుంగభద్ర దిగువ కాలువకు 20 రో జుల ముందే నీరు నిలిచిపోయింది. కారణంగా 1.2 లక్షల జనాభా కలిగిన పట్టణంలో మున్సిపల్ అధికారులు రోజు ఉదయం గంటపాటు కొళాయిలకు నీరు వదిలి చేతు లు దులుపుకుంటున్నారు. దీంతో తాగునీటి ఎద్దడి జఠిలమైంది. పట్టణ ప్రజలు బో ర్లను ఆశ్రయిస్తున్నారు. తుంగభద్ర దిగువ కాలువకు నీరు లేకపోవడంతో గ్రామాల్లో పశువులు తాగేందుకు నీరు లేకపోవడం, అలాగే రైతులకు తాగునీరు, సాగునీరు లేకపోవడంతో గ్రామాల్లో ఉపాధి పనులు లేక గ్రామాలకు గ్రామాలు వెళ్ళిపోతున్నారు. కర్నాటక, బెంగుళూరు పట్టణాలకు వలస వెళ్తున్నారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లోని నదులకు కూడా నీటిమట్టం పూర్తిశాతం తగ్గింది. నాగలదినె్న, గురుజాల, చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి నదులకు ఆనుకొని నదులకు నీటి శాతం పూ ర్తిగా తగ్గడంతో మూగజీవాలు నీరు తాగేందుకు నీరు లేకపోవడంతో అల్లాడిపోతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మిగనూరుకు విచ్చేసిన మంత్రి కోట్ల మాట్లాడుతూ గత ఏడాది తుంగభద్ర నదీ పరివాహక గ్రామాలకు అనుకొని ఉన్న నదులకు నీరు తగ్గడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ను ఒప్పించి రెండు టిఎంసీల నీరు విడుదల చేశామని, ఈ సారి కూడ నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. అందువలన కర్నాటకలోని తుంగభద్ర డ్యాంను సందర్శించి మనకొచ్చే నీటివాటాను సాధిస్తామని స్పష్టం చేశారు. ఎల్లెల్సీ కాలువలపై కేంద్ర బలగాల తో గస్తీ చేపడతామన్నారు.
హైదరాబాద్‌ను దేశ రెండో
రాజధానిగా మార్చాలి
* దివాలా దిశలో కెడిసిసి బ్యాంకులు
* టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కెఇ
డోన్, ఫిబ్రవరి 21: రాష్ట్ర విభజనకు ముఖ్యకారణమైన హైదరాబాద్ నగరాన్ని దేశ రెండో రాజధానిగా మారిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ నిర్ణయం అన్ని ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగా వుంటుందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కెయి కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో గురువారం ఎమ్మెల్యే విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న సమస్య పరిష్కారం కావాలంటే హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేయాలన్నారు. ఇకపోతే రాష్ట్రంలో కిరణ్ సర్కారు అధ్వాన్న పాలనను కొనసాగిస్తుందని విమర్శించారు. రైతుల సంక్షేమం పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఉచిత విద్యుత్‌కు కనీసం 4 గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయలేమని, గ్యాస్, విద్యుత్ సంక్షోభాలను తీర్చలేమని, రాబోయే రోజుల్లో విద్యుత్ కోత తప్పదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి చూపిస్తామన్నారు. ఈ పథకాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నామని ఎన్నివేల కోట్లయినా మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం సహకార సంఘాలు అప్పుల ఊబిలో వున్నాయని రాబోయే రోజుల్లో రైతులకు రుణాలు ఇవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటున్నాయని వివరించారు. గత ఎన్నికల ముందు రైతులకు ఎన్నో ఆశలు పెట్టి గద్దెనెక్కిన అధికార పార్టీ నేతల వల్ల సహకార బ్యాంకులు దివాళా తీయడం ఖాయమన్నారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపిపిలు కెయి మద్దిలేటి, టిఇ శేషఫణి గౌడ్, నాయకులు ఆలంకొండ నబిసాహెబ్, మండల అధ్యక్షులు కొత్తకోట శ్రీనివాసులు పాల్గొన్నారు.
కడపకు తాగునీరు అందేనా!
* నీటి సరఫరాపై ఇరు జిల్లాల అధికారుల సమీక్ష
అవుకు, ఫిబ్రవరి 21: రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాకు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించాలని నిర్ణయించి ఆ మేరకు నీటి విడుదల చేపట్టిన విషయం విధితమే. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు అవసరమైన నీరు విడుదల చేసి అనంతరం ఆపేశారు. ఈ నీరు అవుకు రిజర్వాయర్‌కు చేరేలోగా మధ్యలో చాలానీరు వృథా కావడంతో రిజర్వాయర్‌కు నామమాత్రంగానే నీరు చేరింది. రిజర్వాయర్ నుంచి రెండు రోజుల క్రితం కడప జిల్లాకు అధికారులు నీరు విడుదల చేశారు. గాలేరు నగరి ప్రధాన కాలువ వెంట 53 కి.మీ ప్రయాణించాల్సిన నీరు గురువారం నాటికి 10 కి.మీ ప్రయాణించాయి. ఈ లెక్కన మరో 4 రోజులకు కడప జిల్లా మైలవరం డ్యాంకు నీరు చేరుతోంది. ఇక్కడే నీటి సరఫరాపై అనుమానాలు తలెత్తున్నాయి. రిజర్వాయర్‌కు విడుదల కావాల్సిన నీరు ఆగిపోయిందని నంద్యాల ఎస్‌ఇ వెంకటరమణ స్పష్టం చేశారు. ఇంకా 4 రోజులు నీటి సరఫరా జరిగితేనే మైలవరం డ్యాంకు నీరు చేరుతుందని జమ్ములమడుగు ఆర్డీఓ రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఇరు జిల్లా అధికారులు సమీక్షించిన తీరును బట్టి చూస్తే కడప జిల్లా ప్రజల దాహార్తి తీరే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. రిజర్వాయర్‌లో 219.6 (1.62 టిఎంసిలు) లెవల్ వరకూ నీటి నిల్వ వుంది. కేవలం 0.6 లెవల్ వరకూ ఉన్న నీటిని మాత్రమే గాలేరి నగరి మీదుగా కడప జిల్లాకు తరలించే అవకాశం వుంది. సుమారు 0.5 టిఎంసిలు తరలిస్తేనే మైలవరానికి నీరు చేరే అవకాశం వుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ మేరకు రిజర్వాయర్‌లో నీటి నిల్వ లేకపోవడంతో కడప ప్రజలకు తాగునీరు అందే అవకాశాలు సన్నగిల్లినట్లే. కడప జిల్లాకు చెందిన జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, మైలవరం పట్టణాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం వృథా ప్రయాసగా మారే అవకాశం వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్‌లో గురువారం రాత్రి జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపధ్యంలో
english title:
high alert
Date:
Friday, February 22, 2013