Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన

$
0
0

విశాఖపట్నం, పిబ్రవరి 21: విద్యుత్ చార్జీల పెంపుపై సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. వివిధ డిస్కంల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ గ్యో బ్యాక్ అంటూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి, అరెస్ట్ చేశారు. భారీ పోలీస్ బందోబస్త్ మధ్య ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆద్యంతం ఉద్రిక్త పరిస్థితుల నడుమల ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది. ఇక ప్రజాభిప్రాయ సేకరణలో ఈపిడిసిఎల్ సిఎండి నదీమ్ మాట్లాడుతూ ఈపిడిసిఎల్ పరిధిలో 52 మంది వినియోగదారులు ఉన్నారని తెలియచేశారు. ఈ డిస్కం పరిధిలో 14,945.04 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని, ఇందుకోసం 8,968.13 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని అన్నారు. అయితే అన్ని వనరుల నుంచి 6,095.69 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని అన్నారు. కొత్తగా ప్రతిపాదించిన ధరల వలన 2,851.34 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు. అయినప్పటికీ 21.10 కోట్ల రూపాయల లోటు ఉంటుందని నదీమ్ తెలియచేశారు. ఈ డిస్కం పరిధిలో 102.52 కోట్ల రూపాయలతో 84 కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 12.36 కోట్లతోరి 41 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్య్నన పెంచామని అన్నారు. 108.14 కోట్లతో 10514 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామని అన్నారు. అధిక లైన్ లాస్ కలిగిన 60 ఫీడర్లకు ఐఆర్ పోర్టు ఆధారిత మీటర్లను అమర్చామని అన్నారు. డిడిజి పథకంలో భాగంగా పాడేరు ఐటిడిఎ పరిధిలో 30 ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు. ఈ డిస్కం పరిధిలోని రిటైల్ సరఫరా వ్యాపారం గురించి నదీమ్ వివరిస్తూ, 2012-13 సంవత్సరంలో 6,045.98 కోట్ల రూపాయలు రిటైల్ సరఫరాకు ఖర్చయితే, 2013-14 8,968.13 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. కాగా ఎల్‌టి గృహావసరాలకు ప్రతిపాదిత విద్యుత్ టారీఫ్ ఈ విధంగా ఉంది.
0-50 యూనిట్‌లు శ్లాబ్‌లో యూనిట్‌కు 1.45 రూపాయలు వసూలు చేస్తారు. 0-100 శ్లాబ్‌లో యూనిట్‌కు 2.60 రూపాయలు, 0-200 శ్లాబ్‌లో యూనిట్‌కు 5.65 రూపాయలు, 0-300 శ్లాబ్‌లో యూనిట్‌కు 6.15 రూపాయలు, 0-500 శ్లాబ్‌లో యూనిట్‌కు 6.50 రూపాయలు, 0-500 యూనిట్లకు మించి ఉంటే యూనిట్‌కు ఏడు రూపాయలు వసూలు చేస్తారు. గృహేతర అవసరాలు, వాణిజ్య సంస్థలకు కెవిఎకు 50 రూపాయల ఫిక్స్‌డ్ ధరను నిర్ణయించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి నర్సింగరావు మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని అన్నారు. రాజకీయ విధానాలతో విద్యుత్ ధరలను పెంచాలనుకోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం ఒకవేళ ప్రయత్నించినా, దాన్ని అమలు చేయనవసరం కమిషన్‌కు లేదని అన్నారు. అసెంబ్లీలో రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను పూర్తిగా వ్యతిరేకించారని, ఆయన అధికారంలోకి వచ్చాక, దాన్ని ప్రవేశపెట్టారని, అందుకే విద్యుత్ శాఖ అధ్వాన్న స్థితికి చేరుకుందని అన్నారు. విద్యుత్ బోర్డును ముక్కలు చేయడమే ప్రధాన నేరమని అన్నారు. ప్రభుత్వం రిలయన్స్ యాజమాన్యానికి దాసోహమై పనిచేస్తోందని నర్సింగరావు విమర్శించారు. చివరకు జైపాల్‌రెడ్డి మంత్రిత్వశాఖను మార్చేందుకు కూడా తెగబడ్డారని ఆయన అన్నారు. మర్చంట్ పవర్ పాలసీని అమలు చేయాలనుకోవడం ద్రోహమని ఆయన అన్నారు. లైన్ లాస్ తక్కువగా ఉన్న, ఈపిడిసిఎల్ పరిధిలో ప్రజలకు అన్ని అధిక నష్టాలతో నడుస్తున్న అన్ని డిస్కంలతోపాటు చార్జీలను భారీగా పెంచడం అన్యాయమని అన్నారు. విద్యుత్ బిల్లులు ఎగ్గొట్టే వారిని కాపాడుకుంటూ, పేదవాళ్ళపై విద్యుత్ శాఖ తమ ప్రతాపాన్ని చూపుతోందని విమర్శించారు. నాన్ టెలిస్కోపిక్ విధానం పేరుతో పేదల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్‌లో కొంత పవర్ గ్రిడ్‌కు ఇచ్చేదని, అయితే ఇటీవల స్టీల్ ప్లాంట్ కొద్ది పాటి విద్యుత్‌ను అదనంగా వాడుకుందని 150 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వారిపై మోపడం ఎంతవరకూ సమంజసమని నర్సింగరావు ప్రశ్నించారు.
వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు తోట రాజీవ్ మాట్లాడుతూ 2004 నుంచి 2009 వరకూ పెరగని విద్యుత్ చార్జీలను ఈ మూడేళ్లలో ఎందుకు పెంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కంపెనీ దుబారా, అవకతవకల వలనే ఈ నష్టాలు చవి చూడాల్సి వచ్చిందని అన్నారు. ఈ భారాన్ని ప్రజలు ఎందుకు మోయాలని ప్రశ్నించారు. సిపిఎం నాయకుడు గంగారావు మాట్లాడుతూ సబ్బవరంలో ఓ విద్యుత్ ప్లాంట్‌కు కోట్ల రూపాయలు అప్పగిస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలోని గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి, అధిక ధర చెల్లించి, తిరిగి మనం ఎందుకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు. జన్‌కోను వ్యాపార సంస్థగా మార్చుతున్నారని అన్నారు. రైతు సంఘం నాయకుడు రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇవ్వడం లేదని అన్నారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయుకుడు వాసుదేవరావు మాట్లాడుతూ ఫెర్రో ఎల్లారుూస్ అసోసియేషన్ తరపున శ్రీ్ధర్ ప్రభు మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి ఆరవ తేదీన రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 510.6 టిఎంసిల నీరు ఉందని, ఈ సంవత్సరం ఇదే తేదీ నాటికి 526 టిఎంసిల నీరు ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఫెర్రో ఎల్లారుూస్ కంపెనీలు 750 కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నాయని, విద్యుత్ కోత వలన ఎల్లారుూస్ కంపెనీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.

హై అలర్ట్
* నగరంలో నాకాబందీ
* షాపింగ్ మాల్స్ దగ్గర తనిఖీలు
* ఎయిర్‌పోర్టు, బస్టాండ్‌లలో మరింత భద్రత
* అప్రమత్తమైన పోలీసులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 21: హైదరాబాద్‌లో పేలుళ్ళు సంభవించి పలువురు మరణించిన నేపథ్యంలో నగరంలోని పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ళలో పోలీసులు గురువారం రాత్రి నాకాబందీ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. నగరంలోని అన్ని షాపింగ్ మాల్స్, జన సమ్మర్థమైన ప్రదేశాల్లో పోలీసులు బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను అప్రమత్తం చేశారు. ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. బస్టాండ్‌లో పోలీసులు అణువణువున పరిశీలించారు. నగరంలోనికి వచ్చే బస్సులను, వాహనాలను కూడా వదిలిపెట్టకుండా తనిఖీ చేస్తున్నారు. మఫ్టీలో పోలీలను అన్ని ప్రాంతాల్లో నియమించారు. అనుమానాస్పద వస్తువులను తాకవద్దని, అలాగే అనుమానాస్పదంగా తిరిగేవారి సమాచారాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు గానీ, కంట్రోల్ రూంకు కానీ తెలియచేయాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ప్రజల్లో ఉద్యమం మొదలైంది
* గ్రామాల్లో మావోలకు స్ధానం లేదు
* ఒఎస్డీ దామోదర్, ఎఎస్పీ జెట్టీ
గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 21: విశాఖ మన్యంలో మావోయిస్టులకు ఇక కాలం చెల్లిందని నర్సీపట్నం ఒఎస్.డి. దామోదర్, ఎఎస్పీ గోపీనాథ్‌జెట్టీ ఆరోపించారు. గత కొంతకాలంగా మావోయిస్టులపై గ్రామాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ మంగళవారం జరిగిన సంఘటనతో మావోయిస్టులపై తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని వారన్నారు. గురువారం సాగుల సంఘటన బాధితులను పరామర్శించడానికి జి.కె.వీధి వచ్చిన ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు మావోయిస్టుల చర్యల వలన విసుగు చెందిన గిరిజనులు గ్రామాల్లో వారిపై తిరగబడుతున్నారని వారన్నారు. అమ్మాయిలను హింసించే వ్యక్తిని దేహశుద్ధి చేయడం మాని అని మొప్పుకోసం ప్రజాకోర్టు పెట్టి గ్రామస్థులను విచక్షణ రహితంగా చితకబాది చిట్టిబాబు, హనుమంతరావు, పండయ్యలను కాల్చడం వారి నీచబుద్ధికి నిదర్శనమన్నారు. గిరిజనులను భయబ్రాంతులకు గురి చేసి భూస్వాములనే ముసుగులో ఇరువర్గాల వారిని పిలిచి భీభత్సం సృష్టించడం మావోయిస్టుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. గ్రామాల్లో తిరుగుబాటు మొదలైందని, ఏజెన్సీ వదిలివెళ్ళిపోవాలని, లేక స్వచ్చందంగా లొంగిపోవాలని దామోదర్, ఎఎస్పీగోపీనాథ్‌జెట్టీ సూచించారు. ప్రజల్లో ఉద్యమం మొదలైందని, మావోయిస్టుల ఉద్యమానికి మన్యంలో స్థానం లేదని ఆయన అన్నారు. అరాచకం సృష్టిస్తున్న మావోయిస్టులకు ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి పరిస్థితి ఎదురవుతుందని దామోదర్ అన్నారు. లక్కవరంలో మావోయిస్టులు చేసిన భీభత్సం వలన ముగ్గురు మృతి చెందడమే కాకుండా వారి కుటుంబాల పుట్టకు, చెట్టుకు ఒకరుగా అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాలు ముసుగు వేసుకుని ఉన్నారా, లేక గంతలు కట్టుకున్నారా? విశాఖ మన్యంలో ఇంత భీభత్సం జరిగినా స్పందించక పోవడంపై వారి బుద్ధి ఏమిటో తేటతెల్లమవుతుందని దామోదర్,జెట్టీ స్పష్టం చేశారు. మావోయిస్టులు, సంఘాలు ఏకమై భయోత్పాదం సృష్టించి గ్రామాలు ఖాళీ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని, వారిపై కేసులు పెడతామన్నారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆత్మరక్షణ కోసం గ్రామాలకు వచ్చిన మావోయిస్టులను నిలదీయాలని, అవసరమైతే తిరగబడాలని గిరిజనులను ఎఎస్పీ దామోదర్ సూచించారు.
బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ
గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఒ.ఎస్.డి. దామోదర్, ఎఎస్పీ గోపీనాథ్ జెట్టీ సాగులు బాధిత కుటుంబాలకు బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వపరంగా అందే ప్రతీ రాయితీని వీరికి అందేలా కృషి చేస్తామని పోలీసు అధికారులు బాధితులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగా వచ్చే నష్టపరిహారంతోపాటు మీకు ఉండటానికి వసతి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ. రామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ. వెంకట్రావు, ఎస్సై విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

తిరిగి గ్రామానికి వెళ్ళం
* సాగులు బాధితులు
గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 21: మా వోయిస్టుల భీభత్సం వల్ల ప్రాణాలు కోల్పోయిన సాగులు గ్రామస్థులు చిట్టిబాబు, హనుమంతరావు, పండయ్య కుటుంబాలు తిరిగి గ్రామానికి వెళ్ళేందుకు సిద్ధపడడం లేదు. ఎటువంటి త ప్పుచేయని తమ వారిని అనవసరంగా చంపి మా ఉసురు పోసుకున్నారని, అటవీ ప్రాంతానికి వెళ్తే మావోయిస్టుల చర్యలకు మరోసారి మేము చిక్కుకోవాల్సి వస్తోందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతను పోలీసులు కల్పిస్తామన్నప్పటికీ మేము తిరిగి గ్రామానికి వెళ్ళే పరిస్థితి లేదని బాధితులు బోరున విలేఖరుల ముందు విలపించారు. ప్రజాకోర్టు పేరుతో పిలిపించి మావోయిస్టుల తప్పుడు మాటలకు ఎదురు తిరిగినందుకే మా వారిని ప్రాణాలు తీశారని, కుటుంబ పెద్దలు చనిపోవడంతో మేమంతా అనాధులుగా మారామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి గ్రామానికి వెళ్ళి ప్రాణాలు తీసుకోవడం తప్పా వేరే దారిలేదన్నారు.

మావోల చర్యకు నిరసనగా మృతదేహాలతో ధర్నా
జి.కె.వీధి. ఫిబ్రవరి 21: మావోయిస్టులు అతికిరాతకంగా చంపిన గిరిజనుల మృతదేహాలతో గురువారం గూడెంకొత్తవీధిలో ధర్నా నిర్వహించారు. మావోయిస్టుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ మృతదేహాలతో ఊరేగింపు జరిపి ధర్నా నిర్వహించారు. మండల కేంద్రం నుండి శ్మశాన వాటికి వరకు భారీయెత్తున గిరిజనులు శవయాత్రలో పాల్గొని మృతులకు ఘనంగా కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం సాగులు గ్రామస్థులను లక్కవరంలో ఏర్పాటుచేసిన ప్రజాకోర్టుకు పిలిపించి మావోయిస్టులు భీబత్సం సృష్టించడంలో ముగ్గురు గిరిజనులు మృతి చెందడమే కాక మరికొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వీరి మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించి సొంత గ్రామాలకు తీసుకువెళ్ళలేని పరిస్థితుల్లో మండల కేంద్రంలో దహన సంస్కారాలు నిర్వహించారు. వీరి మృతికి మండలంలోని చుట్టుపక్కల ప్రజలు తీవ్ర సంతాపం తెలియజేయడమే కాక స్వయంగా శవయాత్రలో పాల్గొని మావోయిస్టుల చర్యలను ఖండించారు. అసువుల బాసిన పండయ్య, హనుమంతరావు, చిట్టిబాబులకు గ్రామస్థులు కడసారి వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖ స్వయంగా దహన సంస్కారాల్లో పాల్గొని మృతదేహాల తరలింపు నుండి వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటూ దహన సంస్కారాలు నిర్వహించారు.
వేదాలు, శాస్త్రాలపై నిర్లక్ష్యం వల్లే అరిష్టాలు
* శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర

పెందుర్తి, ఫిబ్రవరి 21: తరతరాల భారతీయ పురాతత్వ సంపదైన వేదాలు, శాస్త్రాల పట్ల నిర్లక్ష్యం వల్లే దేశంలో వివిధ సమస్యలు తలెత్తుతున్నాయని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ శ్రీశారదాపీఠంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న వార్షికోత్సవ వేడుకలు గురువారం వైభవంగా ముగిశాయి. దేశ, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన వేద ఘనాపాఠీలు పీఠం ప్రాంగణంలో నిర్వహించిన చతుర్వేద సంహిత యాగం, వనదుర్గా హోమం పూర్ణాహుతితో ముగిశాయి. ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అభిభాషిస్తూ వేద భూమిగా పిలిచే భారతదేశంలో వేదాలు, శాస్త్రాలు మరుగున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వేదశాస్త్ర పండితులు, ఘనాపాఠీలను సత్కరించి వారి ప్రతభను గుర్తంచాలని, శాస్త్రాలను బతికించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. పెద్దఎత్తున వేద, శాస్త్ర పండితులు తరలి రావటం విశాఖకే గర్హకారణమన్నారు. చర్చలో పాల్గొన్న అగ్నిహోత్రి మద్దూరి యాజులు, శాస్త్ర నిపుణులు సుబ్రహ్మణ్యం, సులక్షణ ఘనపాఠీలను స్వరూపానందేంద్ర సరస్వతి సువర్ణ కంకణంతో సత్కరించారు. కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, విజయప్రసాద్, తైనాల విజయకుమార్, తదితరులు పీఠాన్ని సందర్శించారు.

పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్ళు
* రైల్వేబడ్జెట్‌లో గ్రీన్‌సిగ్నల్
* విశాఖ-చెన్నై, వారణాసికి అవకాశాలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 21: రెండు కొత్త రైళ్ళు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 26న ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్‌లో వీటిని గ్రీన్‌సిగ్నల్ లభించనుంది. విశాఖ-వారణాసి, విశాఖ-చెన్నైల మధ్య ఇవి నడుస్తాయి. కొనే్నళ్ళుగా పెండింగ్‌లో ఉన్న ఈ రైళ్ళు వస్తే నిత్యం రాకపోకలు సాగించే భక్తులకు, వ్యాపారస్తుల సమస్యలు తీరుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వారణాసికి వెళ్తున్న భక్తులు రోజురోజుకీ పెరుగుతున్నారు. అలాగే బంగారు వర్తకులు, ఐటి సెక్టార్‌లలో పనిచేసే అధికారులు నిత్యం చెన్నైకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా విమానాలపైన లేదంటే చెన్నై మెయిల్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. అందువల్ల చెన్నైకు నేరుగా ప్రత్యేక రైలు వస్తే వీరందరి సమస్యలు తీరుతాయి.

విశాఖ స్టేషన్‌లో రుచికరమైన వంటకాలు
* జ్ఞానాపురం వైపు ఫుడ్‌ప్లజా
* తక్కువ ధరలకే భోజన వసతి

విశాఖపట్నం, ఫిబ్రవరి 21: విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు రుచికరమైన వంటకాలు అందుబాటులోకి రానున్నాయి. అదీ తక్కువ ధరలకే వీటిని సరఫరా చేయాలని వాల్తేరు డివిజన్ అధికారులు నిర్ణయించారు. చిన్న,చిన్న హోటళ్ళ నుంచి ప్లాట్‌ఫారాలపై మోబైల్ పార్లర్లు, కార్పొరేట్ హోటళ్ల వరకు ఉన్నా, వీటి ద్వారా విక్రయించే భోజన సదుపాయం ఖరీదుగా మారుతోంది. నాణ్యత కొరవడి, అధిక ధరలకు వంటకాలను రుచిచూడాల్సి వస్తోంది. విశాఖ మీదుగా నడుస్తున్న పలు ఎక్స్‌ప్రెస్‌లో హాల్ట్ చేసిన కొద్దిసేపటికే ప్రయాణికులు తమకు అవసరమైన భోజన, అల్పాహారం, శీతలపానీయాలు, వాటర్‌బాటిల్స్‌ను హడావుడిగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దళారులు వీరిని నిలువునా మోసగిస్తున్నారు. ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు, దళారులను కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో జ్ఞానాపురం స్టేషన్ దగ్గర ఫుడ్ ప్లజాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ రైల్వేబడ్జెట్‌లోనే ఫుడ్‌ప్లజాకు గ్రీన్‌సిగ్నల్ లభించనుంది. ఇది అందుబాటులోకి వస్తే మధ్యతరగతి ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. రుచికరమైన వంటకాలను అందుబాటులో ధరలకే విక్రయిస్తారు. డివిజన్ అధికారులు నిర్ధేశించిన ధరలకే వంటకాలను విక్రయించాలి. టెండర్ ద్వారా దీని నిర్వహణకు కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. అయితే డివిజన్ పర్యవేక్షణలోనే ఇది నడువనుంది. పరిశుద్ధమైన తాగునీటి నుంచి బోజన వసతి వరకు ఇందులో లభిస్తాయి. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లో నడుస్తున్న కార్పొరేట్ హోటల్ ద్వారా భోజనం, అల్పాహార ధరలు మండిపోతున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇవి షాక్‌నిస్తున్నాయి. భోజనం 60రూపాయలిస్తే తప్ప లభించడంలేదు. దేనినైనా కనీసం రూ. 25లకు కొనుగోలు చేయాల్సి పరిస్థితులున్నాయి. అలాగే ప్లాట్‌ఫారాలపై విక్రయించే భోజన పార్శిల్స్, అల్పాహారం, టీకాపీలు,శీతలపానీయులు, వాటర్ బాటిల్స్ సైతం ఖరీదవుతున్నాయి. విశాఖ మీదుగా వెళ్ళే ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్‌లు ఆగిన కొద్దిసేపటికే ఖరీదైన ఆహారాన్ని కొనుగోలు చేస్తూ నిలువునా మోసపోతున్నారు. నాణ్యతలేని ఆహారంతో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవలకాలంలో అత్యధిక ధరలు, నాణ్యత కొరవడిన బోజన వసతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎస్‌ఎంఎస్ ఫిర్యాదులు ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ అధికారులకు అందుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రైల్వే అధికారులు ఇక్కడి పరిస్థితులను బోర్డు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద విశాఖ రైల్వేస్టేషన్‌లో మెరుగైన భోజన వసతిని ప్రయాణికులకు ఫుడ్ ఫ్లజాను అందుబాటులోకి తీసుకురావాలని వాల్తేరు డివిజన్ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వేకు వెళ్ళాయి. ఈ బడ్జెట్‌లో ఆమోదం లభిస్తే త్వరలో ఇది అందుబాటులోకి రానుందని సంబంధితాధికారి ఒకరు తెలిపారు.

సమ్మె ప్రశాంతం...పాక్షికం
* కార్మికుల ప్రదర్శనలు...నిరసనలు
* కలెక్టరేట్ ముట్టడి
* నిరసనకారుల అరెస్టు

విశాఖపట్నం, ఫిబ్రవరి 21: రెండవ రోజు సమ్మె ప్రశాంతంగా ముగిసింది. స్వల్ప సంఘటనలు మినహా పాక్షికంగా జరిగింది. ఏఐటియుసి ఏపి కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు గేటు నుంచి లోపలకు వెళ్ళే ప్రయత్నాలను పోలీసులు తొలిదశలోనే అడ్డుకోవడం, అందర్ని అరెస్టు చేయడంతో పరిస్థితి మెరుగుపడింది. పార్టీ నాయకులు అజయ్‌శర్మతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల అదుపులో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపించారు. సామాన్యుల నడ్డి విరిచే విదంగా ఉన్నా ఏమాత్రం ఛలించడంలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది వేలకు తగ్గకుండా కనీస వేతనాలు నిర్ణయించాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణను విరమించాలని, అసంఘటిత కార్మికుల భద్రతకు జాతీయ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, శ్రామిక మహిళలకు ఆరు మాసాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందిగా కోరారు. వీటితోపాటు కనీస ఫించన్ మూడు వేలకు నిర్ణయించాలని, బోనస్, గ్రాట్యూటీలపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేయాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని, అందిరికీ భవిష్యనిధి, కార్మిక భీమా సౌకర్యం కల్పించాలని, కార్మిక సంఘాలు పెట్టుకునే చట్టబద్ధహక్కును అమలు చేయాలన్నారు. మరిన్ని ఐక్య ఉద్యమాలు
ఏఐటియుసి విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రెండవ రోజు సమ్మెలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. మద్దిలపాలెంలో 10 గంటలకు ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఆఫీస్ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు, ఆటోడ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో మెకానిక్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మద్దిలపాలెం జాతీయ రహదారి వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి ఇసుకతోట ఆటోమోటివ్ కంపెనీ మీదుగా తిరిగి మద్దిలపాలెం పోలీసు అవుట్‌పోస్ట్ వద్దకు చేరుకుంది. అక్కడ మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పడాల రమణ మాట్లాడుతూ రెండు రోజులు రాష్టవ్య్రాప్తంగా కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా సమ్మె చేసి ప్రభుత్వం కళ్ళు తెరిపించారన్నారు. ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగాన్ని పెంచే సంస్కరణలను ఆపాలన్నారు, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని, అసంఘటిత రంగంలో ఆటో డ్రైవర్లు, ముఠా కళాసీలు, రిక్షా కార్మికులు, చిల్లర వర్తకులకు, మోటారు వాహన మెకానిక్‌లకు పిఎఫ్, ఇఎస్‌ఐతో కూడిన సమగ్ర చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు కె.శివాజీ, బిఎల్ రావు, టిఆర్ వర్మ, కెవి శ్రీ్ధర్, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్ల కార్మిక సంఘ నాయకులు జి.లక్ష్మణ, ఎస్‌కె రజాక్, ఎపి బిల్డింగ్ వర్కర్ల యూనియన్ నాయకులు కోట సత్తిబాబు, ఎం.మోహన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో వన్‌టౌను, మర్రిపాలెం, అక్కయపాలెం, ఆర్టీసీకాంప్లెక్స్ పలుచోట్ల కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.

దేశాభివృద్ధికి యువత పాటుపడాలి
* ఎన్‌ఎస్‌ఎస్ యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభం
* వీసి ఆచార్య జిఎస్‌ఎన్ రాజు
విశాఖపట్నం, ఫిబ్రవరి 21: దేశాభివృద్ధికి బాటలు వేసే దిశగా యువతరం పనిచేయాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య జిఎస్‌ఎన్ రాజు అన్నారు. గురువారం సాయంత్రం ఏయులో ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర యువజనోత్సవాలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యపై అలక్ష్యం వద్దని, విద్య ద్వారానే ప్రగతి సాధ్యపడుతుందన్నారు. తాము ఎంచుకున్న రంగంలో యువత ఉన్నత స్థానాలను చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలన్నారు. విద్యతోపాటు కళలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమన్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కలిగి ఉండడం ద్వారా మెరుగైన ఫలితదాలు రాబట్టవచ్చునన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా ఒకే ఏడాదిలో 548 ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. వర్శిటీ రెక్టార్ ఆచార్య ఎవి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడం ఎన్‌ఎస్‌ఎస్‌కే చెల్లిందన్నారు. నమ్మకం, నిబద్ధత, వ్యక్తిత్వం నిలుపుకున్నపుడే వ్యక్తికి విలువ ఉంటుందే విషయం యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక బాధ్యతను గుర్తెరికి ప్రవర్తించాలన్నారు. స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ ఆచార్య ఎ.సుబ్రహ్మాణ్యం మాట్లాడుతూ సంస్కృతి ప్రజలను ఏకంక చేస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని నేడు ఈ వేదికపై చూస్తున్నామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర లైజోన్ అధికారి పి.రామచంద్రరావు మాట్లాడుతూ సేవ ద్వారా విద్యార్థి సమగ్ర అభివృద్ధికి ఎన్‌ఎస్‌ఎస్ పనిచేస్తుందన్నారు. వ్యక్తిత్వ వికాసం, సమాజసేవ దీనిలోభాగంగా ఉన్నాయన్నారు. వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డి.ప్రభాకరరావు మాట్లాడుతూ విద్యార్థులు సేవ కోసం సమయం కేటాయించడం, సమాజం కోసం పనిచేయడం మంచి పరిణామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్.రామచంద్రరావుమూర్తి మాట్లాడుతూ యువతలో సామర్థ్యాలను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. యువజన అధికారి, కేంద్ర యువజన సర్వీసుల, క్రీడా మంత్రిత్వశాఖ ఆర్.గోకుల్ కృష్ణన్ మాట్లాడుతూ సమాజంలోని అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలను చైతన్య వంతం చేస్తూ నిరంతరం ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రం 3.26 లక్షల విద్యార్థులతో దేశంలో రెండవస్థానంలో ఉందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎన్‌ఏడి పాల్ మాట్లాడుతూ యువతలో ద్విగుణీకృతమైయున్న సామర్థ్యాలను వెలికితీయడానికి సాంస్కృతిక ఉత్సవాలు ఉపకరిస్తాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి ఇపిఎస్ భాగ్యలక్ష్మి, నరసింహమూర్తి, డాక్టర్ హరనాథ్, సిహెచ్.ఇమ్మానియల్‌రాజు, హనుమాన్, పాలూరి శేషుమాంబ, వివిధ వర్శిటీలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, విద్యార్థులో పాల్గొన్నారు.
సాంస్కృతిక ర్యాలీ
ఈ కార్యక్రమంలో భాగంగా యువజనోత్సవాలకు హాజరైన 13 వర్శిటీల విద్యార్థులు తమ ప్రాంతా సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, చేసిన ర్యాలీని వీసి ఆచార్య జిఎస్‌ఎన్ రాజు ప్రారంభించారు. ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ మందిరం వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులు ర్యాలీ వర్శిటీలో పండుగ వాతావరణాన్ని తలపించింది. శుక్రవారం ఉదయం నుంచి వర్శిటీలో విద్యార్థులకు 13 అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు ఏయూ కాన్వకేషన్ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

వైభవంగా భీష్మఏకాదశి కల్యాణాలు

సింహాచలం, ఫిబ్రవరి 21: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సింహాచలం పరిసరాలలోని ఆలయంలోని శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి, లక్ష్మీనారాయణ విశాలాక్షి సహిత కాశీ విశే్వశ్వరస్వామికి, బాలాత్రిపురసుందరీదేవి సమేత త్రిపురాంతకస్వామి వార్షిక కల్యాణోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. కాశీవిశే్వశ్వరస్వామి కల్యాణం మధ్యాస్నం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. వెంకటేశ్వరస్వామికి, త్రిపురాంతకస్వామికి రాత్రి కల్యాణోత్సవాలు నిర్వహించారు. సాయంత్రం వెంకన్న ఉభయదేవేరులతో కలిసి పురవీథులలో ఊరేగారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణ జరిగింది. సింహాచల క్షేత్ర ప్రధాన అర్చక పురోహితుడు మోర్తి సీతారామాచార్యుల పర్యవేక్షణలో అర్చకులు చక్రవర్తి, ఎస్‌టిపి కుమార్, టిపి.రాజీవ్‌లోచన్, శ్రావణ్‌కుమార్‌లు కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.

స్వర్ణకాంతులతో శోభిల్లిన సింహాచలేశుడు
* రికార్డుస్థాయిలో స్వర్ణ పుష్పార్చనలు

సింహాచలం, ఫిబ్రవరి 21: కృతయుగ దైవం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని గురువారం స్వర్ణకాంతులతో శోభిల్లి రికార్డుస్థాయిలో స్వర్ణ పుష్పార్చనలు జరిగాయి. ఆర్జి స్వర్ణపుష్పార్చన జంటలతో సింహాచలేశుని అంతరాలయం కిటకిటలాడింది. చందనోచ్ఛాదీశుడు సింహాద్రినాధుడు స్వర్ణ నృసింహ కవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. 108 స్వర్ణ సంపంగి పుష్పాలతో అర్చకులు మూలవిరాట్‌ను అర్చిస్తుండగా ప్రధానార్చక పురోహితుడు భక్తులతో అష్టోత్తర శతనామాలను వల్లివేయించారు. అనంతరం అర్చకులు భక్తులను ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేసారు. పిదప స్వామివారి నిత్య కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి ఆర్జిత గరుడసేవా ఘనంగా జరిగింది.

ప్రశాంతంగా శాసనమండలి ఎన్నికల పోలింగ్
* భారీ పోలీస్‌బందోబస్తు
విశాఖపట్నం , ఫిబ్రవరి 21: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగింది. దీంతో జిల్లాలో 88.25% ఓట్లు నమోదయ్యాయి. మొదట మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ కాస్త మధ్యాహ్నానికి ఊపు అందుకుంది. మూడు జిల్లాల్లో ఉపాధ్యాయులు పోలింగ్‌బూత్‌లకు చేరుకొని ఉత్సాహంగా ఓట్లు వేసారు. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో 48 కేంద్రాలలో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు జిల్లాల్లో 92.38 శాతం ఓట్లు పోలైనట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం తెలిసింది. విజయనగరం జిల్లాలో 94 శాతం ఓట్లు పోలవ్వగా విశాఖ జిల్లాలో 88 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 92 శాతం ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకూ జరిగిన పోలింగ్ శాంతియుతంగా పూర్తయింది. ఈ ఎన్నికల పోలింగ్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి, ఎన్నికల పరిశీలకులు విఎన్.విష్ణు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. తొలిసారిగా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ వి.శేషాద్రి తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన వీడియో వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలోని 14 జోన్లకు సంబంధించి జోనల్ అధికారులు తమ జోన్లలోని పోలింగ్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించారు. అంతే కాకుండా ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్‌కమిషనర్ శివధర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీబందోబస్తును ఏర్పాటు చేసారు. ఇదిలా ఉండగా ప్రతి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఆయా యూనియన్ సంఘాలు ఏర్పాటు చేసిన విబిరాల వద్ద ఉదయం నుండి హడావుడి కొనసాగింది.

‘‘అండమాన్’’ కష్టాలు
* నడిసంద్రంలో ఆగిపోయిన నౌక
* మూడురోజులుగా నిరీక్షణ
* సాంకేతిక లోపాలే కారణం
* బితుకు బితుకుమంటూ గడిపిన ప్రయాణికులు
* ఎట్టకేలకు తీరానికి చేరిన నౌక

విశాఖపట్నం , ఫిబ్రవరి 21: వారంతా రెక్కాడితేగాని..డొక్కాడని కూలీలు...సొంత ఊరిలో పనులు దొరకక...ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి అండమాన్ వెళ్లి బతుకుదామనే వెళుతున్న వారికి కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే విశాఖ నుంచి అండమాన్ వెళ్లాల్సిన నౌక ప్రయాణికులను నడి సముద్రంలో తీసుకెళ్లి మూడు రోజుల నిరీక్షణకు గురి చేసింది. అటు గమ్యానికి చేరుకోలేక....ఇటు తీరానికి రాక నానా ఇక్కట్ల పాలు చేసింది. విహారయాత్ర కాస్తా విచారయాత్రగా మారింది.
ఈ నెల 18వ తేదీన ఒక ప్రైవేట్ షిప్పింగ్ ఏజెన్సీకి చెందిన నౌక సుమారు 800కు పైగా ప్రయాణికులతో బైలుదేరి వెళ్ళింది. అయితే వెళ్ళిన మరుసటి రోజు ఉదయం సాంకేతిక కారణాలతో నౌక సముద్రంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అంతా బిక్కుబిక్కు మంటూ కాలం గడిపారు. దీంతో అందులో ప్రయాణిస్తూ విధులు నిర్వహిస్తున్న నేవీ సిబ్బంది ఇద్దరు చాకచక్యంగా ప్రవర్తించి సాంకేతిక లోపాన్ని పసిగట్టి ఎట్టకేలకు గురువారం ఉదయానికి విశాఖ నికోబార్ నౌక తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు ఒకింత ఊపిరి పీల్చుకున్నప్పటికీ అండమాన్ చేరుకోలేక పోయామన్న నిరుత్సాహంతో నీరుగారిపోయారు. అయితే సుమారు 120 నుండి 150 నాటికల్ మైళ్ళ దూరంలోనే నిలిచిపోవడంతో ప్రయాణికుల్లో భయాందోళన చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా నడిసముద్రంలో ఈ నౌక ఆగిపోవడంతో ఏం జరుగుతుందోననే ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో కనీసం అన్న పానీయాలు లేకుండా కాలం గడిపారు. దీనిని గమనించిన ప్రయాణికులు వారే చొరవ తీసుకొని అధికారులకు సమాచారం అందజేసి తమ ప్రాణాలను కాపాడాలని అర్ధించారు. అయినప్పటికీ స్పందన రాకపోవడంతో చేసేదేమీ లేక నౌకలోనే ఉండిపోయారు. ఎట్టకేలకు ఈ విషయాన్ని ప్రయాణికులు వారి బంధువుల ద్వారా మీడియాకు చేరవేయడంతో ఈ నౌకల్లో చిక్కుకున్న ప్రయాణికుల పరిస్థితిపై వారి బంధువుల్లో కూడా ఆందోళన మొదలైంది. అయితేఇదే సమయంలో ఒడ్డుకు చేరుకున్న నౌకలో ప్రయాణికులంతా మీడియాను లోపలికి అనుమతించాలని లేకుంటే మేము దిగేది లేదంటూ భీష్మించుకుని ఉన్నారు. ఇదంతా సుమారు మూడు గంటల పాటు జరిగింది. అయినప్పటికీ సిఐఎస్‌ఎఫ్ పోలీసులు మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో బయటకు వచ్చిన వారంతా తమ బాధలను వెల్లబుచ్చారు. అంతే కాకండా ఈ నెల 28న స్వరాజ్ దీప్ అనే ప్రత్యేక నౌకలో వారందరిని అండమాన్‌కు తరలించడం జరుగుతుందని చెబుతూ ఒక్కొక్కరికి 500 రూపాయలను అందజేసారు.

* ప్రజాభిప్రాయసేకరణలో హోరెత్తిన నినాదాలు * భారీగా అరెస్ట్‌లు
english title: 
protest

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>