విజయనగరం , ఫిబ్రవరి 21: జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని బాంబ్ పేలుళ్ళ ఘటన నేపథ్యంలో ఎస్పీ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు గురువారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు లాడ్జీలతో పాటు వసతిగృహాలు, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లలో పోలీసులు తనిఖీలు కొనసాగాయి. డిఎస్పీ కృష్ణ ప్రసన్న నేతృత్వంలో పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానితుల వివరాలు సేకరించారు. ఇది సాధారణ తనిఖీల్లో భాగమేనని పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ హైదరాబాద్ ఘటనను దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్టు అవగతమవుతోంది. వాహన తనిఖీలను సైతం పోలీసులు ఎక్కువ చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీలు నిర్వహించారు. డిఎస్పీతో పాటు పట్టణంలోని సర్కిల్ ఇనస్పెక్టర్లు, సబ్ ఇనస్పెక్టర్లు పాల్గొన్నారు.
ఇంట్లో చోరీ.. ఆభరణాల అపహరణ
గజపతినగరం, ఫిబ్రవరి 21 : ఇక్కడికి సమీపంలోని పురిటిపెంట న్యూకాలనీ పరిధిలో ఒక ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి కొందరు చొరబడి వెండి బంగారు నగలు, నగదు అపహరించుకుపోయారు. స్థానిక బాలసదనంలో సేవికగా ఉద్యోగం చేస్తున్న ఆర్. అలివేలుమంగమ్మ తన కుమారుడు, కోడలు తిరుపతి వెళ్లగా అలివేలు, కుమార్తె బాలసదనంలో నిద్రించారు. గుర్తు తెలియని చోరులు తాళాలు పగల గొట్టి తలుపులు తెరచి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో గల బీరువా తెరచి చిందర వందరగా బట్టలు పారవేసి రెండుతులాల బంగారు నగలు, అలాగే వెండి కంచం, పూజా సామగ్రితో సహా 10 వేల రూపాయల నగదు అపహరించి ఇంటి వెనుక బాగం నుండి పరారయ్యాయరు. బాలసదనంలో నిద్రించిన అలివెలు ఉదయం ఇంటికి వచ్చే సరికి చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. అపహరణకు గురైన చోరీ సొత్తు లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా. స్థానిక ఎఎస్సై కృష్ణమూర్తినాయుడు చోరీ జరిగిన ఇంటికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.
నడకతోతే సంపూర్ణ ఆరోగ్యం
గజపతినగరం, ఫిబ్రవరి 21 : ప్రతీ రోజు నడవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్య సాధించవచ్చని వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు సుబ్బరాజు అన్నారు. స్థానిక లయన్స్ ట్రస్ట్ భవనంలో గురువారం వాకర్స్ క్లబ్ సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు ఆధునిక జీవనంలో ప్రజలు నడకను తగ్గించేస్తున్నారని దీనివలన ఊబకాయం పెరిగిపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. దీంతో వైద్య కోసం పెట్టే ఖర్చులు పెరిగిపోతాయన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఔషదం నవడం అన్నారు. నడవడం వలన మంచి సమాజాన్ని స్థాపించవచ్చునన్నారు. అలాగే క్లబ్ సభ్యుడు వారి శక్తి మేరకు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎస్‌ఆర్ మూర్తి, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కె. హరిబాబు, సభ్యుడు ఆదుర్తి రామకృష్ణలు పాల్గొన్నారు.
‘ప్రభుత్వ విధానాలపై అలుపెరగని పోరాటం’
విజయనగరం , ఫిబ్రవరి 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అమలు పెరగని పోరాటాలు సాగిస్తామని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడంలో రెండు ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. అసంఘిటిరంగ కార్మికుల జీవనస్థితిగతులను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా నాయకులు బుగత సూరిబాబు, ఎస్.రంగరాజు, పి.పి.నాయుడు, ఆల్తి చిన్నమారయ్య, నీలవేణి, ఎ.రాములు, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
నెల్లిమర్ల, ఫిబ్రవరి 21 : ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్ధంలో గురువారం శ్రీసీతారాముల వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవ కార్యక్రమాలు ఉదయం పారాయణం, వేదపఠనంతో ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణము, నాదస్వర కచేరీ, స్వామివారి సేవ కార్యక్రమాలు జరిగాయి. కాగా రాత్రి 10 గంటలకు స్వారివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభంగా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణం తిలకించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని దేవస్థానంకార్యనిర్వహణాధికారి పి.బాబురావు పర్యవేక్షించారు. ఆలయ సిబ్బంది కెవి రమణ పాల్గొన్నారు.
తునికాకు సేకరణపై తొలగని అనిశ్చితి
కురుపాం, ఫిబ్రవరి 21: గిరిజనులకు ఉపాధి కల్పించే తునికాకు సేకరణపై అనిశ్చితి తొలగడం లేదు. ప్రతీ ఏటా ఇదే తంతు సాగుతుండటంతో గిరిజనులు నష్టపోతునారు. ప్రతీ ఏటా తునికాకు సేకరణ వల్ల డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొంత ఆదాయం పొందగలుగుతున్నామన్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం రెండు మండలాల్లో తునికాకు ఎక్కువగా లభిస్తుంది. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎంతో ధర పలుకుతుంది. తునికాకును సేకరించి వాటిని కట్టలుగా కట్టి అమ్ముతుంటారు. ఒకప్పుడు మహిళా సంఘాలు కొనుగోలు, అమ్మకాలు చేపట్టాయి. కొన్ని సార్లు గిరిజన సంఘాలు చేపట్టాయి. అనంతరం టెండర్లు పిలవడం ద్వారా కొనుగోలు చేపట్టేవారు. అయితే ఈ ఏడాది ఇంతవరకు టెండర్లు పిలవలేదు. దీంతో కొనుగోలుదారులు లేక గిరిజనులు తునికాకు సేకరించలేదు. తునికాకు సేకరణకు టెండర్లు పిలవకపోవడంతో గిరిజనులు అయోమయంలో పడ్డారని ఆదివాసీ సవర సేవా సంఘం అధ్యక్షుడు నిమ్మక గురపన్న తెలిపారు.
కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆందోళన
విజయనగరం , ఫిబ్రవరి 21: ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో బాగంగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో పలు కార్మిక, ఉద్యోగ సంఘాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే పెట్రోల్, ఢీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, కనీస వేతన చట్టం ప్రకారం 10 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు పనిభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయుకలు టి.వి.రమణ, రమణమ్మ, రవికుమార్, రామచంద్రరావులతోపాటు 108, ఎల్.ఐ.సి, అంగన్‌వాడీ తదితర సంఘాల ప్రతినిధులు కార్మికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
‘26 నుంచి పల్లెపల్లెకు తెలుగుదేశం’
విజయనగరం , ఫిబ్రవరి 21: జిల్లాలో ఈనెల 26వ తేదీ నుంచి పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యుడు, ఎమ్మెల్యే పి.అశోక్‌గజపతిరాజు తెలిపారు. గురువారం ఇక్కడ అశోక్‌బంగ్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అధ్యక్షతన నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం యాత్ర విజయవంతం చేయాలని కోరారు. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్ పరిశీలన, పాదయాత్రలో స్థానికంగా ఉన్న సమస్యలను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళతామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీశ్రేణులను సిద్ధం చేయాలని కోరారు. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించాలన్నారు. ఈనెల 27న పార్వతీపురం, 28న ఎస్.కోట, మార్చి 3న గజపతినగరం, మార్చి5న విజయనగరం, 7న కురుపాం, 9న చీపురుపల్లి, 14న బొబ్బిలిల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. అలాగే ఈనెల 25వ తేదీన మహిళల సమస్యలపై బొబ్బిలిలో నిర్వహించనున్న జిల్లా తెలుగుమహిళ సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తెలుగుమహిళ జిల్లా అధ్యక్షరాలు తూముల అచ్యుతవల్లి, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, గుమ్మడి సంధ్యారాణి, తెంటు లక్ష్మునాయుడు, డాక్టర్ కె.ఎ.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ ప్రశాంతం
విజయనగరం, ఫిబ్రవరి 21: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. జిల్లా పరిధిలో 3723 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 3514 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం డివిజన్ పరిధిలో 2215 మందికిగాను 2070 (93శాతం), పార్వతీపురం డివిజన్ పరిధిలో 1508 మందికిగాను 1444 మంది (96 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో శతశాతం పోలింగ్ నమోదైంది. డెంకాడ (27 మంది), మెంటాడ (32మంది), పూసపాటిరేగ (14మంది), రామభద్రపురం (30మంది), పాచిపెంట (23మంది), సీతానగరం (61మంది) ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను ఆన్‌లైన్ చేశారు. ఎన్నికల నిర్వహణ అంశాలను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పి.ఎ.శోభ ఎన్.ఐ.సి కేంద్రం నుంచి ఆమె పర్యవేక్షించారు. ఓటింగ్, పోలింగ్ విధానంలో లోటుపాట్లను పరిశీలించిన ఆమె నేరుగా పోలింగ్ అధికారులకు తగిన సూచనలు అందజేశారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగాజరిగినట్టు ఆమె తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించిన రాష్ట్ర పరిశీలకులు వి.ఎన్.విష్ణు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను జిల్లా యంత్రాంగం స్వాధీనం చేసుకుని భద్రపరచింది. ఆర్డీఓలు రాజకుమారి, వెంకటరావు తదితరులు ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు.
సమ్మెతో రూ. 300 కోట్ల మేర స్తంభించిన లావాదేవీలు
విజయనగరం, ఫిబ్రవరి 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యితిరేకంగా తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రెండో రోజు ప్రభావం చూపింది. సాధారణ జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ బ్యాంకింగ్ రంగంలో సేవలు పూర్తిగా నిలచిపోయాయి. అలాగే కార్మిక సంఘాల ప్రభావం ఉన్న చోట్ల కూడా సమ్మె ప్రభావం కన్పించింది. సార్వత్రిక సమ్మెలో బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పూర్తిగా భాగస్వామ్యం కావడంతో రెండు రోజుల పాటు వ్యాపారలావాదేవీలు నిలచిపోయాయి. దీంతో రెండు రోజుల్లో సుమారు 300 కోట్ల రూపాయల మేర బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగలేదు. రెండు రోజుల పాటు సమ్మె కొనసాగడం, బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎటిఎంల్లో కూడా సొమ్ము లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఆర్టీసీ పరంగా సమ్మె ప్రభావం స్వల్పంగా పడింది. వామపక్ష కార్మిక సంఘాల ప్రమేయం ఉండటంతో తొలిరోజు సుమారు 300 సర్వీసులు నిలిచిపోగా 30 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. రెండో కొన్ని సర్వీసులు పునరుద్ధంచడంతో నష్టం కొంతమేర తగ్గింది. సార్వత్రిక సమ్మెను పురస్కరించుకుని ఎ.ఐ.టి.యు.సి, సి.ఐ.టి.యు, ఇఫ్టు, ఇంటక్ తదితర కార్మిక సంఘాలు ప్రదర్శనలు నిర్వహించాయి.
‘ట్రాఫిక్ నియంత్రణకు ఆటో డ్రైవర్లు సహకరించాలి’
గజపతినగరం, ఫిబ్రవరి 21 : స్థానిక మెంటాడ రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి ఆటో డ్రైవర్లు పోలీసులు, ఆర్టీసీ అధికారులతో సహకరించాలని సిఐ ఎం.శ్రీనివాసరావు విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ టి.మల్లికార్జునరావు కోరారు. స్థానిక మెంటాడ రోడ్డులో గల ఆటో డ్రైవర్లతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించి చర్చించారు. మెంటాడ రోడ్డులో ఆటోలను ఎక్కడ బడితే అక్కడ నిలపడం వలన ఆర్టీసీ బస్సులను నిలపడానికి స్థలం ఉండటం లేదని అలాగే ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నట్లు చెప్పారు. ఆటోలను రోడ్డుకు 60 మీటర్ల దూరంలో నిలపడం వలన కొంత వరకు ట్రాఫిక్ నివారించవచ్చునని అన్నారు. ఆర్టీసి బస్సులతోపాటు, ఆటోలను శుక్రవారం నుంచి 60 మీటర్ల దూరంలో నిలపాలన్నారు. ఆటోలు నిలపడానికి స్థలాన్ని పరిశీలించడం జరుగుతుందని స్థలం గుర్తించే వరకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై టి. కాంతికుమార్, ఆటో యూనియన్ నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.