శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: రెండేళ్ల క్రితం మంత్రి ధర్మాన వినిపించిన విప్లవాత్మకమైన రాజకీయ చర్చ ఢిల్లీ పెద్దలకు చేరింరు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష, పార్టీ రహితంగా నిర్వహించాలన్న తొలి ప్రతిపాదన, ప్రజాభిప్రాయసేకరణ సిక్కోల్ గడ్డ నుంచి ఆరంభమైంది. నేతలలో మళ్లీ అదే చర్చ రాజుకుంటోంది. మరికొద్ది నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. గతానికి భిన్నంగా ఈ ఎన్నికలు పార్టీ రహితంగా, ప్రత్యక్షంగా నిర్వహిస్తే ఏలా ఉంటుందన్న ఆలోచనలకు శ్రీకాకుళం వేదికగా మారనుంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు మున్సిపల్ ఎన్నికలు పార్టీ రహితంగా, ప్రత్యక్షంగా నిర్వహించేందుకు వ్యూహరచన ఆరంభించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రధాన కర్తవ్యం తప్ప, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం మున్సిపల్ పరిధిలో లేనందున పార్టీ ఆవశ్యకత ఏమిటంటూ ఒక చర్చకు నాంది పలికారు. స్థానిక సంస్థలలో పార్టీల ప్రమేయం పునాది స్థాయిలో వైషమ్యాలకు దారితీస్తోందన్న చర్చ మరోసారి ముందుకు వచ్చింది. ఇది నిజమైనప్పటికీ, రాజకీయ పార్టీలు టిక్కెట్ల పంపిణీ నుంచి ఎదుర్కొంటున్న ఇక్కట్ల నుంచి తప్పించుకునేందుకే ఈ విధానం ముందుకు తెస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనప్పటికీ ప్రజలకు సేవలందించే పనిలో స్థానిక స్వపరిపాలన సభ్యులు రాజకీయాలతో అడ్డుకోవడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది నిజం. ఇక వార్డుల పరిధిలో జరిగే స్థానిక సమరంలో రాజకీయ పార్టీలు తలపడడంతో ఖర్చులు ఇబ్బుడిముబ్బడిగా పెరగడంతోపాటు, వెన్నుపోటు రాజకీయాలు అనివార్యంగా మారుతున్నాయి. వీటన్నంటికీ పార్టీ రహిత ఎన్నికలే శాశ్వతంగా పరిష్కారం. ఇక గత మున్సిపల్ ఎన్నికల్లో నేరుగా చైర్‌పర్సన్‌లకు ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ నిజానికి తెలుగుదేశం పార్టీ సొంతం. అయితే, దివంగత సిఎం వైఎస్ పరోక్ష ఎన్నికలకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో అత్యధిక మున్సిపల్ చైర్మన్ గిరిలు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ దక్కించుకునేలా వైఎస్ వ్యూహరచన ఫలించింది. అయితే గత ఐదేళ్ళ పాలనాకాలంలో మున్సిపాలిటీలలో పరోక్ష ఎన్నికల సారాంశం ప్రభుత్వ పెద్దలకు బాగానే బోధపడింది. అంశాలవారీగా గ్రూపులు కట్టిన కౌన్సిలర్లు స్థానిక పాలనను సజావుగా సాగనివ్వకుండా చేసిన రాద్ధాంతం బయటపడింది. ఇదే పరిస్థితుల్లో మున్సిపల్ చట్టానికి సవరణ తీసుకువచ్చి అవిశ్వాసాల బారి నుంచి కాంగ్రెస్ మున్సిపాలిటీలను రక్షించుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. ఇటువంటి మున్సిపాలిటీలలో శ్రీకాకుళం మున్సిపాలిటీ కూడా ఉండడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల దిశగా కాంగ్రెస్ నాయకత్వం ఆలోచనలు చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుత మున్సిపల్ పాలనలో చేలరేగిన అసమ్మతి, వినిపించిన అవిశ్వాస తీర్మానాల రాగాలు, శాశ్వతంగా తెరమరుగుకావాలంటే ప్రత్యక్ష ఎన్నికలే పరిష్కార మార్గం. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటుగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచనలు చేస్తోంది. అయితే, ఈ పద్ధతులపై ఏ మేరకు ప్రజామోదం పొందుతుందన్నది డాలర్ల ప్రశ్న?? ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో ఇదే విషయంపై చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో భాగంగానే ఇటీవల మంత్రి ధర్మాన శ్రీకాకుళం జిల్లాకు వచ్చే నెల ఒకటో తేదీని వస్తున్న నేపధ్యంలో దీనికి తెరలేపనున్నారు. మార్చి మూడో తేదిన మున్సిపల్, జెడ్పీ, పంచాయితీ కార్యాలయాల వద్ద ప్రజాభిప్రాయసేకరణ పెట్టెలను ఏర్పాటు చేయడమేకాకుండా, అందరినోట వారి అభిప్రాయాలు వెల్లడయ్యేలా బహిరంగ చర్చావేదిక కార్యక్రమాన్ని నిర్వహించేలా వ్యూహం రచించారు. నిజానికి పార్టీ రహిత, ప్రత్యక్ష ఎన్నికల విధానంపై అన్నీ పార్టీలలో తర్జనభర్జన సాగితుంది. ఇదే జరిగితే, తాజామాజీ మున్సిపల్ పాలకవర్గవర్గంలో సగం సీట్లు గల్లంతైయ్యే అవకాశాలు కూడా లేకపోవలేదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే, ప్రజల మన్ననపొందే నాయకులు ఈ విధానంలో మొదటి వరుసలో ఉంటారు. పురపాలక సంస్థలో ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకునే నేతలు రావాలనుకున్నప్పుడు ఈ విధానం ఎంతో దోహదపడుందని అన్ని వర్గాల ప్రజలు ఉక్తకంఠంతో ఆహ్వానిస్తున్నారు. మంత్రి ధర్మాన ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పించగలిగితే జిల్లాలో పురపాలికలు సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు పార్టీలకతీతంగా చర్చించుకుంటున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
ప్రశాంతం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: జిల్లాలో 39 కేంద్రాల్లో గురువారం జరిగిన శాసనమండలి ఉపాధ్యాయఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 4,611 మంది ఓటర్లు గాను 4,338 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 94శాతం ఓటింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, సీనియర్ ఐఎఎస్ అధికారి వి.ఎన్.విష్ణు రణస్థలం, లావేరు, రాజాం తదితర పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సంతృప్తివ్యక్తంచేశారు. అధికారులు పక్కాఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎటువంటి వివాదాలకు తావులేకుండా పోలింగ్‌ముగిసింది. ఉదయం ఎనిమిదిగంటలకు ప్రారంభమైన పోలింగ్ 11 గంటల వరకు మందకొడిగా సాగింది. అనంతరం ఊపందుకొని 94 శాతానికి చేరుకుంది. అన్ని పోలింగ్‌కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు బందోబస్తు కూడా పోలీసు సిబ్బందిని నిర్వహించడం కనిపించింది. వెబ్‌కెమెరాలు ఏర్పాటుచేయడమే కాకుండా వీడియోచిత్రీకరణ కూడా అధికార యంత్రాంగం నిర్వహించింది. కలెక్టర్ సౌరభ్‌గౌర్ , జెసి పోలాభాస్కర్, ఎజెసి రాజ్‌కుమార్, డిఆర్వో నూర్‌భాషాఖాసీం, ఆర్డీఒలు, తహశీల్దార్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే అభ్యర్థుల తరపున శిబిరాలు ఏర్పాటుచేసి ఉపాధ్యాయులకు బ్యాలెట్ నమూనా చూపించడం కనిపించింది. పిఆర్‌టియు ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు, యుటిఎఫ్ అభ్యర్థి బొడ్డేపల్లి మోహనరావు, నక్క దామోదరరావు పోలింగ్‌కేంద్రాలను సందర్శించి పోలింగ్‌శాతాన్ని అడిగి తెలుసుకున్నారు.
రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
పోలింగ్ రిసెప్షన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ సాయంత్రం పరిశీలించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో పోలింగ్ పూర్తి చేసి తీసుకువచ్చే ఎన్నికల సామాగ్రి స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. బ్యాలెట్ బాక్సులను విశాఖపట్నంలో లెక్కింపుకేంద్రానికి తరలిస్తామని కలెక్టర్ తెలిపారు.ఈయనతోపాటు ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డిఆర్వో నూర్‌భాషాఖాసీం, ఆర్డీఒ జి.గణేష్‌కుమార్, తహశీల్దార్ సి.హెచ్.సత్తిబాబులు ఉన్నారు.
త్వరితగతిన ప్రత్యేక కోర్టు నిర్మాణం
వంగర, ఫిబ్రవరి 21: మండలంలోని లక్ష్మిపేటలో ప్రత్యేక కోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్లి కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధికారులను ఆదేశించారు. గురువారం గ్రామాన్ని సందర్శించిన ఆయన నిర్మాణంలో ఉన్న ప్రత్యేక కోర్టు, పశువుల శాలలను, రక్షిత మంచినీటి పథకం పనులను పరిశీలించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలోని సమస్యలు ఎంత వరకు పరిష్కారమయ్యాయో బాధితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 35లక్షలతో సిసి రహదారి నిర్మాణం చేపట్టాలని, అలాగే మద్దివలస గ్రామం నుండి మంచినీటిని రక్షిత మంచినీటి పథకానికి తెప్పించి అన్ని గృహాలకు కుళాయి సౌకర్యం ఏర్పాటు చేయాలని బాధితులు కోరగా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తొలుత బాధిత కుటుంబాలకు ఇళ్ళు మంజూరు చేసిన స్థలాలను ఆయన పరిశీలించారు. పశుగ్రాసం పెంచేందుకు నీటి సౌకర్యం కల్పించేందుకు ఆరు బోర్లును ఏర్పాటు చేయాలని బాధితులు కోరగా నాలుగు బోర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి రజనీకాంతారావు, డిపి ఒ వెంకటేశ్వరరావు, డుమా పిడి కల్యాణ చక్రవర్తి, సోషల్ వెల్ఫేర్ డిడి అచ్చుతానందం, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి మహాలక్ష్మి, ఆర్‌డబ్య్లూఎస్ అధికారులు క్రిష్ణారావు, ఆర్డీఒ బి.దయానిధి, ఎంపిడిఒ రామ్మోహనరావు, తహశీల్దార్ బి.రామారావు, ఎసి సీతారామయ్య, పశు సంవర్థక జెడి శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
శోభాయమానంగా ఆదిత్యుని కల్యాణం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి సన్నిధిలో కల్యాణశోభతో కళల్లాడింది. మాఘశుద్ధ ఏకాదశి గురువారం పర్వదినం పురస్కరించుకుని ఆదిత్యుని కల్యాణం కమనీయంగా జరిగింది. దేవాలయంలో అనివెట్టి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రజితవేదికపై ఉషాపద్మిని, ఛాయాసహిత ఆదిత్య నారాయణ ఉత్సవ విగ్రహమార్పులను ఈ మేరకు వైభవంగా అర్చకులు అలంకరించారు. జీలకర్ర, బెల్లం, తాలిబొట్టు, తలంబ్రాలు, పట్టువస్త్రాలు తదితర వివాహసామాగ్రిని వినియోగించి ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నేతృత్వంలో కల్యాణం జరిపించారు. భక్తులు భారీగా హాజరయ్యారు. భీష్మఏకాదశి కావడంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కోణార్క్ సూరిబాబు, ప్రముఖ జ్యోతిష్కులు మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం దిశగా ఇళ్ల నిర్మాణాలు
గృహనిర్మాణ శాఖ ఇ.ఇ మెట్ట గణపతిరావు
జలుమూరు, ఫిబ్రవరి 21: డివిజన్ పరిధిలో మంజూరైన 7788 ఇళ్లను మార్చి చివరినాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గ్రామీణ గృహనిర్మాణ శాఖ ఇ.ఇ మెట్ట గణపతిరావు అన్నారు. మండల హౌసింగ్ కార్యాలయంలో గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే 4,500 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇందులో ఇందిరమ్మ, రచ్చబండ ఇళ్లు కూడా ఉన్నాయని తెలిపారు. షెడ్యూల్‌కులాలకు మంజూరైన ఇళ్లు ఐఎవై కింద గుర్తిస్తారని చెప్పారు. మండలం శ్రీముఖలింగంలో ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన 15 ఇళ్లు, గొటివాడలో 8 ఇళ్ల స్థానంలో ఐఎవై కింద ఇళ్లు మంజూరయ్యాయన్నారు. మిగిలిన ఇండ్లను సత్వరమే నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. ఇళ్ల బిల్లు మంజూరైన ధృవపత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నామని, అది అందిన వెంటనే జాతీయబ్యాంకుకు వెళ్లి నేరుగా నిధులు తీసుకోవచ్చని తెలిపారు. ఆయనతోపాటు ఎ.ఇ నర్సింగరావు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు పాగోటి ప్రసాదరావు, సీతారాంలు ఉన్నారు.
నిలిచిపోయిన పోస్టల్ సర్వీస్‌లు
ఆమదాలవలస, ఫిబ్రవరి 21: రెండురోజులపాటు దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మె కారణంగా పోస్టల్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇక్కడి రైల్వే ఆర్.ఎం.ఎస్. పోస్టల్ కార్యాలయం సమ్మె కారణంగా మూతపడడంతో రైల్వేస్టేషన్ల వద్ద ఉత్తరాలు కుప్పలుతెప్పలుగా పడిఉన్నాయి. దీంతో పాటు పోస్టల్ ఆర్డర్ల కోసం, స్పీడుపోస్టు సేవలు కోసం నానాఇబ్బందులకు గురయ్యారు.
ఆధునిక యంత్రాలతో సాగుఖర్చు నియంత్రణ
* ఆత్మ డి.పి.డి. రామారావు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: రైతులు సాగుఖర్చును తగ్గించుకునేందుకు ఆధునిక యంత్రాలపై దృష్టిసారించాలని ఆత్మ డి.పి.డి రామారావు అన్నారు. రాగోలు వరి పరిశోధనాకేంద్రంలో గురువారం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విద్యాలయం, ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో రైతులతో శాస్తవ్రేత్తల చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు ఖర్చు తగ్గించే పద్ధతులు, సమగ్ర నీటివినియోగం వాటి గూర్చి వివరించారు. రబీలో పెసర, మినుము పంటలకు పల్లాకు తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి వివరించారు. సీనియర్ శాస్తవ్రేత్త కె.వి.రమణమూర్తి మాట్లాడుతూ ఆరుతడి వరి విధానం, దమ్ము పట్టకుండా పొడిదుక్కితో విత్తనాలు చల్లే విధానాన్ని తెలిపారు. శాస్తవ్రేత్త ఎం.ఎం.వి.శ్రీనివాసరావు, డా.విశాలాక్షిలు వేరుశెనగ సాగుపద్ధతుల గూర్చి వివరించారు.ఉత్తరకోస్తాలో రాగోలులో వరిపరిశోధనాకేంద్రం ఉందని, వరిపై రీసెర్చ్ జరుగుతుందన్నారు. ఎక్కువ నీరు పెడితే అధికదిగుబడి రాదని, తక్కువ నీటితోనే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. నేలస్వభావాన్ని బట్టి వరిని సాగుచేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
కూర్మ క్షేత్రంలో ప్రారంభమైన వేద హవనం
గార, ఫిబ్రవరి 21: మండలం శ్రీకూర్మ క్షేత్రంలో గురువారం వైభవంగా వేదహవనం ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానములకు చెందిన ఘనాపాఠి కాశీపతి సోమయాజి నేతృత్వంలో సుమారు 50 మంది రుత్వికులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చండీ యాగం, యజుర్వేద పారాయణం, సుందర కాండ పారాయణం వంటి కార్యక్రమాలు ప్రతీ రోజు నిర్వహింపజేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్ పట్నాయక్ తెలిపారు. లోక కల్యాణంతో పాటు వాతావరణంలో సంభవిస్తున్న పలు మార్పులను నిరోధించేందుకు ఈ కార్యక్రమాలు కొంత వరకు ఉపయోగ పడతాయని రుత్వికులు తెలిపారు. ఈ కార్యక్రమం 25వ తేది మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగుస్తుందన్నారు.
నేడు, రేపు రిమ్స్‌లో ఎంసిఐ బృందం పరిశీలన
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్స్ (రిమ్స్) కళాశాలలో అనుమతులు మంజూరుకు పరిశీలన నిమిత్తం శుక్ర, శనివారాల్లో భారత వైద్య మండలి పర్యటించనున్నది. ఈ మేరకు బుధవారం రాత్రి కళాశాలకు ఉత్తర్వులు అందాయి. ఆఖరి ఏడాది ఎంబిబిఎస్ కోర్సు పూర్తికావస్తున్న సందర్భంగా రిమ్స్‌కు ఎంసిఐ అనుమతులు తప్పనిసరి. ఇదిలా ఉండగా రిమ్స్ పరిశీలనకు వైద్య మండలి బృందం గత డిసెంబర్‌లోనే పర్యటించాల్సి ఉంది. అయితే అప్పటి రిమ్స్ డైరెక్టర్ డి.వి.వి.యస్.రామ్మూర్తి నిబంధనల ప్రకారం తీసిన డిడి ఢిల్లీలోని వైద్య ఆరోగ్యశాఖకు అందకపోవడంతో వారు వైద్య మండలిని పరిశీలనకు పంపించకుండా నిలుపుదల చేశారు.అనంతర పరిణామాలలో రిమ్స్ డైరెక్టర్‌గా రామ్మూర్తి రాజీనామా చేయడం, ఇన్‌చార్జి డైరెక్టర్‌గా శస్తవ్రైద్య విభాగాధిపతి విజయానంద ప్రసాద్ నియమితులు కావడం జరిగింది. విజయానంద ప్రసాద్‌కు వైద్య మండలి పరిశీలనపై అవగాహన లేకపోవడంతో బృంద పర్యటన కాస్త ఆలస్యమైంది. దీనిపై రిమ్స్ వైద్యాధికారులతో ఒక కమిటీని నియమించి వారిని హుటాహుటిన పూర్తి ఆధారాలతో ఢిల్లీ పంపించి, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఫీజుపై వివరించగా వైద్య మండలిని పరిశీలనకు పంపిస్తూ నిర్ణయంతీసుకున్నారు. ఇదిలా ఉండగా శుక్ర, శనివారాల్లో రిమ్స్‌లో పర్యటించనున్న వైద్య మండలి బృందానికి పలు తప్పిదాలు స్వాగతం పలుకనున్నాయి. ముఖ్యంగా ఆఖరి ఏడాది పూర్తయినప్పటికీ ఆసుపత్రికి కావలసిన భవన నిర్మాణాలు కొన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. మొత్తం 13 బ్లాక్‌లు కావలసి ఉండగా ఆరు బ్లాక్‌లను వినియోగంలోకి తీసుకువచ్చారు. మిగిలిన ఏడు బ్లాక్‌లను గత ఏడాది జూలై నాటికి కాంట్రాక్టర్ పూర్తిచేసి అప్పగించాల్సి ఉంది. అప్పటికి భవన నిర్మాణాలు పునాది దశకూడా దాటనందున ప్రభుత్వం మరో మూడు నెలలు గడువిస్తూ అదే కాంట్రాక్టర్‌ను కొనసాగించింది. ఈ విధంగా గత ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి భవన నిర్మాణాలు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావలసి ఉంది. అయినప్పటికీ ఇంత వరకూ భవన నిర్మాణాలు స్లాబ్ దశలలోనే నిలిచి ఉండటంతో దానిని వైద్య మండలి బృందానికి వివరించడంలో వైద్యాధికారులు ఎలా సఫలీకృతం అవుతారో వేచి చూడాల్సిందే. కిందటేడాది వైద్యుల కొరతను గుర్తించిన బృందానికి ఈ ఏడాది అదే సమస్య ఎదురుకానుంది. వైద్య సిబ్బందికి ఆట స్థలం పూర్తి విశాలంగా ఉండాలంటూ అనుమతులను నిరాకరించిన బృందం నేటి పర్యటనలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కొన్ని వార్డులు ఇరుకుగా ఉండటం కూడా సమస్యగానే పరిగణించాల్సి ఉంది. ఇవి కాకుండా రిమ్స్ డైరెక్టర్‌గా జయరాజ్ బాధ్యతలు స్వీకరించి రెండు రోజులే అయింది. ఇన్ని సమస్యలను ఎలా అధిగమించి వైద్య మండలి బృందాన్ని ఎలా ఒప్పిస్తారో వేచి చూడాల్సిందే.
అనుమానం.. పెనుభూతమై..
ఆమదాలవలస, ఫిబ్రవరి 21: భార్యపై అనుమానంతో పథకం ప్రకారం రైలులో హత్య చేసిన సంఘటనిది. బుధవారం రాత్రి కోణార్క్‌ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన హత్య సంఘటనలో నిందితుడ్ని గురువారం జి.ఆర్.పి ఎస్పీ శ్యామ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో విచారించారు. అనంతరం ఆయన విలేఖరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం కుర్దా జిల్లా జమ్ముసాయికి చెందిన కిషోర్‌బెహరా , అదే గ్రామానికి చెందిన లలితాబెహరాతో 20 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి వికాస్ అనే 17 ఏళ్ల కుమారుడు, కుమార్తె లిఖిత ఉన్నారు. వృత్తిరీత్యా ఆటోడ్రైవరైన కిషోర్‌బెహరా ఉపాధికై భార్యతో కలిసి కొంతకాలం కిందట ముంబాయి వెళ్లి అక్కడ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై వారి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఓ పథకం ప్రకారం స్వగ్రామానికి తీసుకొస్తూ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎస్-7 బోగిలో ప్రయాణిస్తూ భార్య మరుగుదొడ్డికి వెళ్తుండగా వెనుక నుండి వెళ్లి సూట్‌కేసు చైన్‌తో గొంతునులిపి ఈ హత్యకు పాల్పడినట్లు కిషోర్‌బెహరా అంగీకరించారని రైల్వే ఎస్పీ స్పష్టంచేశారు. హత్యకు గురైన లలితాబెహరా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విశాఖపట్నం రైల్వేకోర్టులో నిందితుడిని హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
రైల్వేపోలీసు వ్యవస్థ మరింత పటిష్ఠం
రాష్ట్రంలోని తమ పరిధిలో ఉన్న ప్రకాశం జిల్లా నుండి ఇచ్ఛాపురం వరకు గల రైల్వేపోలీసు వ్యవస్థను ఆధునీకరించి మరింత పటిష్టం చేయనున్నట్లు రైల్వే ఎస్పీ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ప్రధాన రైళ్లలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రైళ్లలో నలుగురి సిబ్బందిని నియమించామని, అలాగే రైల్వేస్టేషన్‌లో నేరస్థుల కదలికలను గుర్తించి అనుమానితులను అదుపులోకి తీసుకుని నేరాల అదుపునకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఒడిశా పోలీసు వ్యవస్థ పరిధిలో అధిక నేరాలు జరుగుతున్నాయని, ఫిర్యాదులు ఇక్కడ అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం హత్యచేసిన నిందితుడు కూడా ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తేనని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ భీమారావు, సి.ఐ కె.వి.బాలకృష్ణ, ఎస్సై నవీన్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన దేవానందం
బలగ, ఫిబ్రవరి 21: జిల్లా క్రీడా ప్రాదికార సంస్థలో ఒడుదిడుగులు ఎదుర్కొంటూ సస్పెండ్‌కు గురైన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎల్.దేవానందం గురువారం ఎఫ్.ఎ.సి డి ఎస్‌డివోగా కొనసాగుతున్న డాక్టర్ కె.శ్రీ్ధర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పైకా నిధులతో క్రీడా పరికరాలు కొనుగోలు విషయంలో జాప్యం అయ్యిందని ఆరోపణతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సస్పెండ్ చేసినప్పటికీ, మిగిలిన జిల్లాల వారు ఇదే ఆరోపణ ఉందని తేలడంతో శాప్ అధికారులు మరలా వేటును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
శాప్ అధికారులు బుధవారం జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా దేవానందంను నియమిస్తూ మరలా ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ వద్దకు వెళ్లి ఉత్తర్వులను అందజేసి, జిల్లా క్రీడాప్రాదికార సంస్థకు వచ్చి ఇన్‌చార్జ్‌గా ఉన్న డాక్టర్ శ్రీ్ధర్ వద్ద నుంచి బాధ్యతలను దేవానందం స్వీకరించారు.
పార్టీ గుర్తులపై స్థానిక ఎన్నికలు జరపాలి
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 21: స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ గుర్తులపై జరపాలని మాజీ మంత్రి, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కిమిడి కళావెంకట్రావు డిమాండ్ చేశారు. ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన పార్టీ మండల స్థాయి నేతల సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పును తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. అయితే ఈ ఎన్నికలను పార్టీ గుర్తులపై జరపాలని డిమాండ్ చేశారు. జనగణన ప్రాతిపదికన బిసిలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో అన్ని వస్తువుల ధరలకు రెక్కలు వచ్చి సామాన్యుడి బతుకు దుర్భరంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్రలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇస్తే టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బల్లాడ వెంకటరమణారెడ్డి, బాన్న రాంబాబు, బెండి మల్లేశ్వరరావు, పంచిరెడ్డి కృష్ణారావు, పైడి నూకరాజు, పైడి గోవిందరావు, కొత్తకోట సురేంద్ర, మెండ రాజారావు, తంగి మల్లేశ్వరరావు, రాజు, కొత్తకోట అమ్మినాయుడు, ఎ.్భవనేశ్వరరావు, పోలీసు, ఎం.వి.పి.శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.