Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

హైదరాబాద్ బాంబు పేలుళ్ల మృతుల్లో గుంతకల్లు వాసి!

$
0
0

గుంతకల్లు, ఫిబ్రవరి 21: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లతో గుంతకల్లు పట్టణం ఉలిక్కిపడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల మృతుల్లో గుంతకల్లు వాసి ఉన్నట్లు టీవీల్లో రావడంతో ఒక్కసారిగా స్థానికులు కలత చెందారు. గుంతకల్లుకు చెందిన గిరి చనిపోయినట్లు కొన్ని టివి చానళ్లలో రావడంతో స్థానిక బస్టాండ్ సమీపంలోని తిలక్‌నగర్ కాలనీకి చెందిన గిరి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మరికొద్దిసేపటికే మరో ఛానల్‌లో గిరి అలియాస్ రామాంజనేయులు, అతని వెంట ఉన్న ఈరమ్మ తీవ్రంగా గాయపడ్డారన్న వార్తలు రావడంతో గిరి తల్లి నారాయణమ్మ, ఇతర కుటుంబసభ్యులు విలపిస్తూ హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. గిరి హైదరాబాద్‌లో పనినిమిత్తం వెళ్లి అక్కడే ఉన్నట్లు సమాచారం.
బాంబుపేలుళ్ల సంఘటనతో అప్రమత్తమైన గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు స్టేషన్‌లో హై అలర్ట్‌న ప్రకటించారు. రైల్వేస్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతోపాటు గుంతకల్లు మీదుగా ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లలో బాంబు డిటెక్టర్‌లు, ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా చెన్నై- ముంబయి ఎక్స్‌ప్రెస్, బెంగళూర్- భువనేశ్వర్, యశ్వంత్‌పూర్- కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆర్‌పిఎఫ్ సిఐ బిబిఎస్ మాధవన్, జిఆర్‌పి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదే విధంగాస్టేషన్‌లో అనుమానస్పద వస్తువులతో పాటు అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి విచారించారు. రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్, జిఆర్‌పి బలగాలను మోహరింపచేసి గట్టి బందోబస్తు నిర్వహించారు.
హైదరాబాద్‌లో దిల్‌షుక్ నగర్‌లో గురువారం జరిగిన బాంబు పేలుడు సంఘటనకు నిరసనగా బిజెపి, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఐఎస్‌ఐ తీవ్ర వాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్తానిక పొట్టిశ్రీరాములు సర్కిల్ నుండి అపోలో సర్కిల్ వరకు బిజెపి, బజరంగ్‌దళ్, విహెచ్‌పిల ఆధ్వర్యంలో ఐఎస్‌ఐ తీవ్రవాదుల దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మకు చెప్పులతోకొట్టి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ఐఎస్‌ఐ తీవ్ర వాదులు హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో బాంబులు పేల్చి దాదాపు 26 మంది మృతికి కారణమయ్యారన్నారు. తీవ్రవాద చర్యలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశరక్షణ కల్పించడంలో వైఫల్యాం చెందిన యుపిఏ ప్రభుత్వం అధికారం నుండి తొలగాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు రంగన్న, కార్యదర్శి బండి మురళీ, మహేష్, బజరంగ్ దళ్ నాయకులు వెంకటేష్, సోమశేఖర్, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పురంధర్ తదితరులు పాల్గొన్నారు.

పాలనాభాషగా తెలుగును అమలు చేద్దాం
అనంతపురం, ఫిబ్రవరి 21 : తెలుగు భాషను పాలనాభాషగా అమలు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖామంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక డిఆర్‌డిఎ సమావేశ మందిరంలోఅంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు భాష వ్యవహారిక భాషగా మన రాష్ట్రంలో అమలులో ఉందన్నారు. అయితే పాలనాభాషగా ఎందుకు అమలు చేయలేకపోతున్నామో తమకే అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగును పాలనాభాషగా ఎందుకు అమలు చేయలేకపోతున్నామన్న దానిపై ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. అందరూ కష్టమైన ఇతర భాషలను మాట్లాడుకుంటారే కానీ తియ్యదనంతో సులభమైన తెలుగుభాషను మాట్లాడలేకపోతున్నామన్నారు. జిల్లాలో తెలుగు అమలును పై స్థాయి అధికారులు ఆచరిస్తే కిందిస్థాయి ఉద్యోగులు కూడా అమలు చేస్తారన్నారు. జిల్లాలో పాలనాభాషగా తెలుగును అమలుచేసి రాష్టస్థ్రాయిలో ప్రథమ జిల్లాగా నిలుపుటకు అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. జిల్లాలో జరగబోయే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఆకాంక్షించారు. అందుకుగానూ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సంస్థలు, ఉద్యోగులు చిత్తశుద్దితో వ్యవహరించడంవల్ల అది సాధ్యమవుతుందన్నారు. ఇటీవల కాలంలో న్యాయశాఖ ద్వారా తెలుగులో తీర్పులు వెలువడడాన్ని మంత్రి స్వాగతించారు. సభాధ్యక్షత వహించిన జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు యస్.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుతల్లి విగ్రహాన్ని తిరుపతిలోకన్నా మునుపే అనంతపురంలో ఏర్పాటు చేయడంలో మంత్రి సాకే శైలజానాథ్ చేసినకృషి మరువలేనిదన్నారు. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయని, మన దేశంలో హిందీ తరువాత అత్యధికమంది మాట్లాడే భాషగా తెలుగు భాష రెండవ స్థానంలో ఉందన్నారు. ముఖ్యంగా తెలుగును అధికార భాషగా చేయడానికి అందరూ కృషి చేయాలని, నేటి నుంచి తెలుగులోనే సంతకాలు చేపట్టే దిశగా ప్రయత్నించాలన్నారు. అదనపుజాయింట్ కలెక్టర్ బియల్ చెన్నకేశవరావు మాట్లాడుతూ నేటి కాలంలో ఇంగ్లీషు వాడకం అన్ని స్థాయిల్లో పెరిగిందన్నారు. 1989-90 కాలంలో ఇంగ్లీషు టైప్ రైటింగ్ వాడరాదని, అప్పట్లో దానిని పక్కనపెట్టి కొంతకాలం తెలుగులోనే ఫైళ్లు తయారు చేయడం జరిగిందన్నారు. బ్రిటీష్ వారు కూడా తెలుగు భాషను ఎంతగానో ప్రోత్సహించారన్నారు. నాటి రోజులను స్ఫూర్తిగా తీసుకుని తెలుగును పాలనాభాషగా అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖల్లోని కంప్యూటర్లలో తెలుగు లిపిని పొందుపరచాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అమలు పరచుటలో ఉత్తమ ప్రతిభను కనబరచినందులకుగానూ వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ప్రశంసాపత్రాలను అందచేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ బియల్ చెన్నకేశవరావు, డిఆర్‌ఓ సుదర్శనరెడ్డి, జడ్‌పి సిఇఓ సుబ్బారెడ్డి, అనంతపురం ఆర్‌డిఓ షేక్ ఇస్మాయిల్, జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషాభివృద్దికి కృషి చేసిన వివిధ ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మె విజయవంతం
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 21: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలోలో భాగంగా జిల్లాలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు సమ్మెను విజయవంతం చేశారు. నగరంలో సిఐటియు, ఎఐటియుసి, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. అన్ని బ్యాంకులు రెండవ రోజు బంద్ పాటించాయి. ఆటో కార్మికులు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజి నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భగత్‌సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులను, కార్మిక సంఘాల ప్రమేయం లేకుండా ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు నాగేంద్ర, గౌస్, ఇర్పాన్, శ్రీనివాసులు, కాశప్ప, లింగన్న, అక్బర్, ఎర్రిస్వామి పాల్గొన్నారు. జెఎన్‌టియూ హాస్టల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రవేటు హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు నేటికీ కనీస వేతనాలు ఇవ్వకుండా, పిఎఫ్, ఈఎస్‌ఐ, సౌకర్యాలు కల్పించకుండా,ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, రాజేంద్ర, రఘునాథ్, సులోచనమ్మ, సతీష్, కృపానందా, కుళ్లాయప్ప, శ్రీరాములు, రవి, రాజు, పద్మ, నాగలక్ష్మి, లలిత పాల్గొన్నారు. సిటీ హమాలీ యూనియన్ నాయకులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించ కుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదన్నారు. కార్యక్రమంలో హమాలీలు రఫీ, నరసింహులు, లక్షయ్య, రంగయ్య, నారాయణస్వామి, గంప్పన్న, సుబాన్, శీనా రాజు, బైపురెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
అందరి సహకారంతో అభివృద్ధికి కృషి
మడకశిర, ఫిబ్రవరి 21: మడకశిర నగర పంచాయతీని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు అందరి సహకారంతో తన వంతు కృషి చేస్తానని నగర పంచాయతీ నూతన కమిషనర్ సంఘం శ్రీనివాసులు పేర్కొన్నారు. నగర పంచాయతీ కమిషనర్‌గా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం కమిషనర్ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిని మర్యాద పూర్వకంగా కలసి నగర పంచాయతీ అభివృద్ధిపై చర్చించారు.
మూడంచెల విధానాన్ని అమలు చేయాలి
రొద్దం, ఫిబ్రవరి 21: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడంచెల విధానాన్ని అమలుచేయాలని, దీంతోపాటు పార్టీల గుర్తులతో ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని రొద్దంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జగదీష్ పాత్రికేయులతో మాట్లాడుతూ సహకార ఎన్నికలను పార్టీల రహితంగా నిర్వహించి అధికార పార్టీ లబ్ధిపొందిందని, అదేతరహాలో స్థానిక ఎన్నికలను సైతం నిర్వహించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ నాయకులు మల్లికార్జున, కేశవరెడ్డి, రొద్దం కార్యదర్శి రమణలు పాల్గొన్నారు.
వర్గీకరణ కోసం ఎంతటికైనా సిద్ధం
కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 21: రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయకుంటే ఎంతటికైనా తాము సిద్ధమని, వెంటనే పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లుపెట్టాలని ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో మాదిగల హక్కుల సాధన కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని మందకృష్ణమాదిగ అధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ బిసిఆర్ దాస్ తెలిపారు. పెద్ద ఓబుళేసు, గంగాధర, మల్లేశ్వరీ, ఎంఇఎఫ్ రాష్ట్ర నాయకుడు శంకర్, అమర్‌నాథ్, పోతులయ్య, స్థానిక నేతలు నాగన్న, నాగరాజు, తిమ్మరాజు, చంద్ర, రామచంద్ర పాల్గొన్నారు.
సహకార సంఘం అధ్యక్షులుగా శివలింగ
బెళుగుప్ప, ఫిబ్రవరి 21: మండల కేంద్రంలోని సహకార సంఘం అధ్యక్షులుగా బి.శివలింగ గురువారం కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కళ్యాణదుర్గం ఎడిసిసి బ్యాంక్ మేనేజర్ ఫణీంద్ర హాజరయ్యారు. అధ్యక్షులుగా శివలింగ, ఉపాధ్యక్షులుగా కౌసల్యతో పాటు 8మంది డైరెక్టర్ల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. మిగిలిన ఇద్దరు డైరెక్టర్లు గౌర్హాజరయ్యారు. అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన శివలింగను వైకాపా నాయకులు పూలమాలలు వేసి సన్మానించారు. బెళుగుప్ప సహకార సంఘంలోని రైతులకు ప్రభుత్వ సబ్సిడీ పథకాలతో పాటు రుణాలను అందించి న్యాయం చేస్తానని శివలింగ పేర్కొన్నారు.
కొనకొండ్లలో ఉచిత వైద్య శిబిరం
వజ్రకరూరు, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని కొనకొండ్ల గ్రామంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈవైద్య శిబిరం రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా పథకం కింద పావని మల్టీస్పెషాల్టీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎఎన్‌ఎంలు సరస్వతి, ఆదిలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మత్సోవాలు ప్రారంభం
రాయదుర్గం రూరల్, ఫిబ్రవరి 21 : మండల పరిధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ విప్రమలై లక్ష్మీనవనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో బాగంగా గురువార ఆలయంలో ఉదయం ఐదు గంటల నుండి స్వామి నిత్యకైంకర్యసేవ, కలశస్తాపన తదితర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ద్వజా రోహణ కార్యక్రమం జరిగింది. ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు చుట్టు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ గౌరవ అధ్యక్షులు రామూర్తిస్వామి, అధ్యక్షులు బి. ఎన్. తిప్పేస్వామి హాజరయ్యరు.
బసినేపల్లి సింగిల్‌విండో పాలకవర్గం
ప్రమాణస్వీకారం
గుత్తి, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని బసినేపల్లి సింగిల్‌విండో పాలకవర్గం గురువారం ప్రమాణస్వీకారం చేసింది. ఈనెల మొదటివారంలో జరిగిన ఎన్నికల్లో బసినేపల్లి సింగిల్‌విండో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సహకార సొసైటీ సిఇఓ ఎన్.రాముడు, అధ్యక్షులుగా ఎన్నికైన జె.రామన్న, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఎస్.రాముడులతో పాటు పలువురు డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగరంగప్రసాద్, శ్రీరాములు, చెట్నేపల్లి విఆర్‌ఓ శివరంగనాయకులు పాల్గొన్నారు.
ఇన్‌పుట్ సబ్సిడీపై గ్రామ సభలు
గుత్తి, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని వివిధ గ్రామల్లో గురువారం రెవిన్యూ అధికారులు ఇన్‌పుట్ సబ్సీడీ జాబితా రూపొందించడానికై రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అబ్బేదొడ్డి, మాముడూరు, బ్రాహ్మణపల్లె, బసినేపల్లి, చెట్నేపల్లి, రజాపురం తదితర గ్రామాల్లో ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ బాలాజీరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.
యాడికిలో...
యాడికి: మండలంలో గురువారం గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ఈ గ్రామ సభలు మూడు రోజుల పాటు జరుగునున్నాయని అధికారులు తెలిపారు. 2012 సంవత్సరంలో సాగుచేసి పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి జాబితా తయారు చేయాలని అధికారుల సూచనల మేరకు రెవెన్యూ అధికారుల బృందం యాడికి, పెద్దపేట, తిమ్మేపల్లె, కత్తిమానుపల్లి తదితర గ్రామాలలో గురువారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, విఆర్‌ఓలు పాల్గొన్నారు.
తేలు కాటుకు మహిళ మృతి
డి.హీరేహాల్, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని కాజనూరు గ్రామానికి చెందిన హరిజన లక్ష్మిదేవి(30) తేలు కాటుకు గురై గురువారం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం లక్ష్మిదేవి తేలుకాటుకు గురికాగా చికిత్సకోసం రాయదుర్గంలోని బళ్లారి రోడ్డులోని వన్నూర్‌స్వామి కట్టవద్ద వున్న ఆర్‌ఎంపి వైద్యుని వద్ద చికిత్స చేయించినట్లు మృతురాలి భర్త గోవిందు తెలిపారు. ఆర్‌ఎంపి డాక్టర్ తేలు కాటుకు సంబంధించిన చికిత్స చేసిన అరగంటలోనే లక్ష్మిదేవి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. అప్పటికే మార్గమధ్యంలోనే మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆర్‌ఎంపి డాక్టర్లు చికిత్సకు సంబంధించిన ఇంజక్షన్లు, మందులు తమకు చూపించాలని వైద్యులు కోరారని వారు తెలిపారు.

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం రాత్రి జరిగిన బాంబు
english title: 
guntakal

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>