తిరుపతి, ఫిబ్రవరి 21: దేశ వ్యాప్తంగా 11 కార్మిక సంఘాలు 10 డిమాండ్ల కోసం నిర్వహించిన రెండు రోజుల సార్వత్రిక సమ్మె చిత్తూరు జిల్లాలో విజయవంతమైంది. గత రెండురోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా గురువారం స్థానిక లీలామహల్ వద్ద ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి, బిఎంఎస్ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా లీలామహల్‌కు నాలుగు వైపులా కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్థంభించింది. ఈ సందర్భంగా పోలీసులు స్వల్ప లాఠీ చార్జి చేసి నేతలను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎఐటియుసి నేతలు జె రామచంద్రయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు ఎల్ రత్నకుమార్, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షురాలు అంబూరి సింధుజ, బిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సిఐటియు, ఎఐటియుసి నేతలు మురళి, నాగార్జున, వాడ గంగరాజు, ప్రసాద్‌రావు, ఎన్‌డి రవి తదితరులు మాట్లాడుతూ నిత్యావసర ధరలను అదుపు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, క్యాజువల్, అవుట్ సోర్సింగ్‌లలో పనిచేస్తున్న కార్మికులకు 240 రోజుల సర్వీస్ అనంతరం రెగ్యులైజేషన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన 10 డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ వివిధ కార్మిక సంఘాల నేతలు ఆర్ వెంకయ్య, చిన్నం పెంచలయ్య, చంద్రశేఖర్‌నాయుడు, పిఎల్ నరసింహులు, శ్రీరాములు, గురవయ్య, కాళ్లయ్య, జయచంద్ర, హేమలత, కుమారమ్మ, యశోద, విజయలక్ష్మి, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్, గజేంద్ర, రాధ, నాగభూషణమ్మ, ఉదయ్‌కుమార్, ప్రసాద్, సాయిలక్ష్మి, సాయిదీప్తి, శంకర్, లక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్‌గాంధీకి ఒక న్యాయం - జగన్‌కు మరో న్యాయమా?
* 2 ఎకరాల నుండి 2వేల ఎకరాలకు చంద్రబాబు ఎలా ఎదిగారు?
* అధికార అహంకారంతో వ్యవహరించే కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి
* ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు హెచ్చరిక
తిరుపతి, ఫిబ్రవరి 21: భారత మాజీ ప్రధాన మంత్రి, దివంగత ఇందిరాగాంధీ మరణిస్తే పశ్చిమ బెంగాల్లో వున్న రాజీవ్‌గాంధీని పిలిచి ప్రధాన మంత్రిని చేసిన కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణిస్తే జగన్‌ను సిఎం చేయాలని 150 మంది ఎమ్మెల్యేలు ఆశపడి సంతకాలు చేయడం తప్పా? రాజీవ్‌కు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా? అని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. తిరుపతిలోని పిఎల్‌ఆర్ కనె్వన్షన్ హాల్లో వైఎస్‌ఆర్‌సిపి చంద్రగిరి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ 65 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ప్రతి పేదవాని గుండెను తాకేలా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. అటువంటి మహనీయుడు మరణిస్తే ఆయన కుమారుడైన కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఆశపడి 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారన్నారు. దీన్ని తప్పుగా భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం జగన్‌పై కక్షగట్టిందన్నారు. తన తండ్రి వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక తనువు చాలించిన వారి కుటుంబాలు తన కుటుంబంగా భావించి ఓదార్చేందుకు జగన్ ప్రజల్లోకి వెళితే తమ అనుమతి తప్పనిసరి అంటూ కాంగ్రెస్ అధిష్ఠానం జగన్‌ను నానా తిప్పలు పెట్టిందన్నారు. ఇందిరాగాంధీ మరణిస్తే ఢిల్లీ నడివీధుల్లో రెండువేల మందిని ఊచకోత కోసి రాజీవ్‌గాంధీని ప్రధానిని చేసిన కాంగ్రెస్ పార్టీ జగన్ విషయంలో ఎందుకు అలా కక్ష సాధింపులకు దిగిందని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీని ఏకంగా ప్రధానిని చేసిన కాంగ్రెస్ జగన్‌కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక ఆలోచన చేసినందులకే జగన్‌ను జైల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. అధికార అహంకారంతో తమను ఎవరు ఏమి చేయలేరన్న ధీమాతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపి ఉద్యమాలు చేయాల్సిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కుమ్మకై వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌ను జైల్లోపెడితే ఎవరు మనకు అడ్డే లేదనుకుంటున్న చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి పిడుగుల్లాంటి వార్తగా షర్మిల పాదయాత్ర కనిపించిందన్నారు. అందుకే షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం యాత్రను దెబ్బతీయించేందుకు బ్రదర్ అనిల్ భూకబ్జాకు పాల్పడ్డారని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వింతువులను, అనాధలను ఆదుకునేందుకు బ్రదర్ అనీల్‌కు దాతలు భూమిని ఇచ్చారన్నారు. నేడు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 2 ఎకరాల పొలం వున్న చంద్రబాబు నాయుడు 2వేల ఎకరాలకు ఎలా ఎదిగారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటండి - కరుణాకర్‌రెడ్డి
సహకార ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి తాము గెలిచామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు చెంపపెట్టులా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి సత్తా ఏమిటో చాటాలని వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కమిటీ సభ్యులు, తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పుచేతుల్లో ఉండే సహకార ఎన్నికల్లో దౌర్జన్యాలు, అక్రమాలు, అడ్డదారులు తొక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తూ నిసిగ్గుగా వ్యవహరించిందన్నారు. పంచాయతీ ఎన్నికలు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగనున్న నేపధ్యంలో వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు సైనికుల్లాగా, శ్రామికుల్లాగా శ్రమించి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారు - రోజా
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై సహకార ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో రుచి చూస్తారని వైఎస్‌ఆర్‌సిపి నేత ఆర్‌కె రోజా హెచ్చరించారు. చంద్రగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సిపికి అలుపెరుగని యోధుడులా పనిచేస్తున్నారన్నారు. ప్రజల అండదండలు ఉన్నంత వరకూ జగన్‌ను ఏ శక్తి ఏమి చేయలేదన్నారు. పులి బోన్లో ఉన్నా బయట ఉన్నా పులి పులేనని, అది జగనేనన్నారు. వైఎస్‌ఆర్‌సిపిని దెబ్బతీయాలని కాంగ్రెస్, టిడిపిలే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకమైనా ఏమి చేయలేవని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నేతలు మహేంద్రరెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ నాయకురాలు గాయత్రీదేవి, ఆదిమూలం, ముస్లిం నాయకులు షఫీ అహ్మద్ ఖాద్రీ, యుగంధర్, కేశవులు, పులుగోరు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను వేధిస్తున్న ఉపాధ్యాయునిపై ఎంపిడిఓకు ఫిర్యాదు
* డిఇఓకు నివేదిక
కలికిరి, ఫిబ్రవరి 21: విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయునిపై తల్లిదండ్రులు గురువారం ఎంపిడిఓ రాజశేఖర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలావున్నాయి. కలికిరి పట్టణంలోని చదివేవాండ్లపల్లె జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు గత రెండు మాసాలుగా 8, 9వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకు చెబితే స్కూల్ నుంచి తరిమేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులు తాళలేక విద్యార్థినులు గురువారం తల్లిదండ్రులకు తెలపడంతో ఫిర్యాదు చేశారు. దీనితో స్పందించి ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఎంపిడిఓ, ఎస్‌ఐ సోమశేఖర్‌రెడ్డి విద్యార్థినిలను విచారించారు. జరిగిన విషయంపై విచారణ నివేదికలతో జిల్లా విద్యాశాఖ అధికారికి అందించినట్లు అధికారులు తెలిపారు.
కీచక ఉపాధ్యాయుడుని సస్పెండ్ చేయాలి
విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కీచక ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు గురువారం ఉన్నత పాఠశాలలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయకార్యదర్శి వెంకటేష్, ఎంఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు చక్రధర్, ఎఎఫ్‌ఎఫ్ నాయకులు బావాజాన్, తదితరులు ఉన్నారు.
ఏసిబికి పట్టుబడిన రామసముద్రం తహశీల్దార్
పుంగనూరు రూరల్, ఫిబ్రవరి 21: చిత్తూరు జిల్లా రామసముద్రం తహశీల్దారు సి.రెడ్డెప్ప గురువారం 25 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు. తిరుపతి ఏసిబి డిఎస్పీ కృష్ణార్జున్ కథనం మేరకు రామసముద్రం మండలం కెసిపల్లి పంచాయతీ మూగవాడి గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి 8ఎకరాల పొలంలోని మామిడి, చింత చెట్లు నరకడానికి అనుమతి కోసం రామసముద్రం తహశీల్దార్ రెడ్డెప్పకు గత డిసెంబరు నెల 23న విన్నవించుకున్నాడు. అయితే మూడు నెలలవుతున్నా అనుమతి లభించలేదు. తహశీల్దార్ రైతును 40 వేలు నగదు తనకు లంచంగా ఇవ్వమనడంతో అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని, 30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రైతు చంద్రశేఖర్ అడ్వాన్సుగా రూ.5వేల నగదు తహశీల్దార్‌కు అందజేశాడు. అయినా అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది లేక ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు గురువారం పుంగనూరు పట్టణం వినాయకనగర్‌లో నివాసముంటున్న తహశీల్దార్ నివాసంలో లంచంగా 25 వేలు నగదు తీసుకుంటుండగా ఏసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఇంటిలో సోదాలు నిర్వహించి నగదు, బంగారు ఆభరణాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎసిబి సిఐలు చంద్రశేఖర్, సుధాకర్‌లు పాల్గొన్నారు.
వ్యవసాయానికి మంచి రోజులు
* వచ్చే బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట
* మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
తిరుపతి, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మంచి రోజులు రానున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు చేరుకున్న ఆయన శుక్రవారం స్వామివారి విరామ సమయంలో ఒకసారి, కల్యాణోత్సవ సేవ ద్వారా మరోమారి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రానున్న బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు క్షేమంగా వుంటే రాష్ట్రం క్షేమంగా వుంటుందని భావించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేకంగా వ్యవసాయానికి పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.
అమ్మవారి సేవలో మంత్రి ఆనం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దర్శించుకున్నారు. వీరు ఆలయం వద్దకు రాగానే డిప్యూటీ ఇఓ గోపాలకృష్ణ, ఎఇఓ వేణుగోపాల్, సూపరింటెండెంట్ శేషాద్రిగిరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారి కుంకమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గజమండపం వద్ద ఆలయ అధికారులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.
శ్రీగురుధామ్ నుండి తిరుపతికి చేరిన సైకిల్ యాత్ర
* నైతిక విలువల పరిరక్షణ, లోక కల్యాణార్థమే సైకిల్ యాత్ర
* జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వెల్లడి
తిరుపతి, ఫిబ్రవరి 21: సమాజంలో నైతిక విలువలను పెంపొందించడం, లోక కల్యాణార్థం శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీగురుధామ్ నుండి తిరుపతికి సైకిల్ యాత్రను నిర్వహించినట్లు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని శ్రీగురుధామ్ నుండి శ్రీసద్గురు శివానందమూర్తి నేతృత్వంలోని శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 15వతేదీన ప్రారంభమైన సైకిల్‌శాంతి యాత్ర గురువారం తిరుపతిలోని అలిపిరి వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇస్కాన్ ఆలయం వద్ద ఈ సైకిల్ యాత్రకు స్వాగతం పలికిన నగరి శాసన సభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి సైకిల్ తొక్కుతూ యాత్రలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ పాలకుల్లో పవిత్రత ఏర్పడాలని, నాయకుల్లో నిస్వార్థ చింతన కలగాలని, ఉద్యోగుల్లో నిబద్ధత పెరగాలని, ప్రజలందరిలో విజ్ఞత, విధేయత ఉండాలని కోరుతూ సమాజంలో శాంతి సౌభాగ్య కుసుమాలు విరబూయాలని ఈ సైకిల్ యాత్రను చేపట్టామన్నారు. ప్రకృతి పచ్చదనం, పవిత్ర జీవనంతో శాంతి నెలకొనాలని, లోక కల్యాణార్థం, సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ యాత్రను చేపట్టామన్నారు. తాము చేపట్టిన ఈ సైకిల్ యాత్ర 6 రోజుల పాటు 522 కిలోమీటర్ల ప్రయాణించి తిరుపతికి చేరుకుందన్నారు. తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని స్వామివారికి సామూహిక ప్రార్థనలు చేసి తమ కోరికలు నెరవేర్చాలని వేడుకోనున్నట్లు తెలిపారు. నేటి సమాజంలో శాంతిని నెలకొల్పడం, మానవీయ విలువలను పెంపొందించడం అత్యవసరమన్నారు. అందుకే తమ వంతుగా ప్రజల్లో చైతన్య దీప్తిని రగిలిస్తూ సైకిల్ యాత్ర చేపట్టామన్నారు. దారి పొడవునా వివిధ కళాశాల్లో, పాఠశాలల్లో తమ యాత్ర లక్ష్యాలను విద్యార్థులకు, ప్రజలకు వివరిస్తూ వచ్చామన్నారు. ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. అనంతరం అలిపిరి నుండి కాలినడకన ఈ సైకిల్‌యాత్ర బృందంలోని 72 మంది తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యతో పాటు ఆమె సతీమణి శ్రీరామ్ శ్రీదేవి, శ్రీరామ్ ఇందిరా, అత్తులూరి నాగలక్ష్మి, పబ్బత్తిలక్ష్మి, బోటూరి సీతామహాలక్ష్మి, నకిలికంటి కృష్ణారావు, గుండా రమేష్, కొంకిమళ్ల శ్రీనివాసరావు, బండార కిరణ్, పప్పు వెంకట సుదర్శన్‌రావు, అత్తులూరి సురేష్ పాల్గొన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి అందరూ కృషి చేయాలి
* ఎజెసి వెంకటసుబ్బారెడ్డి పిలుపు
చిత్తూరు, ఫిబ్రవరి 21: ఉత్కృష్ట సంస్కృతి, చారిత్రక నేపథ్యం ఉన్న తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ కె.వెంకటసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా సచివాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎజెసి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 18కోట్ల మంది తెలుగు భాష మాట్లాడేవారు ఉన్న భాషాభివృద్ధిపై శ్రద్ధ చూపని కారణంగా తెలుగు భాషకు మునుపటి వలే ప్రమాదం ఏర్పడిందని అంతర్జాతీయ యునెస్కోలో పేర్కొనిందన్నారు. ఏ జాతికైనా వారి మాతృభాష, సంస్కృతి పట్ల అంచెంచల గౌరవం, విశ్వాసం ఉంటే చిరకాలం ఆజాతి, భాష మనుగడ సాధిస్తాయన్నారు. భావి తరాలకు మాతృభాష మమకారాన్ని తెలిపే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషలోనే ఉత్తరప్రత్యుత్తరాలు జరపడానికి కృషి చేస్తామని తెలిపారు. మాతృభాషల్లో సంభాషించడం, రాయడం, చదవడం ద్వారా మన సంస్కృతి భాషాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. డిఆర్‌ఓ శేషయ్య మాట్లాడుతూ గత డిసెంబర్‌లో జిల్లాలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకొని తెలుగు భాష మహోన్నతను, ఔనత్యాన్ని ప్రపంచానికి తెలియ చేశామన్నారు. తెలుగును తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులందరితో ఎల్లప్పుడు మాతృభాషను గౌరవిస్తానని, దైనందిన వ్యవహారాల్లో మాతృభాషలోనే సంభాషిస్తానని, రాస్తానని మాతృభాష అభివృద్ధి కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటానని ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో డ్వామా పిడి చంద్రవౌళి, డిపిఆర్‌ఓ జయలక్ష్మి, డిఎస్‌ఓ విజయవాణి, మైనార్టీ సంక్షేమాధికారి సత్యభాస్కర్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
లాడ్జీలో యువకుని దారుణహత్య
మదనపల్లె, ఫిబ్రవరి 21: మదనపల్లె పట్టణంలోని ఒక లాడ్జీలో బుధవారం అర్ధరాత్రి యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రెండవపట్టణ పోలీస్‌స్టేషన్‌కు అతిసమీపంలో ఉన్న లాడ్జీలో గది తీసుకుని దిగిన ఇద్దరు స్నేహితుల్లో ఒకరు హత్యకు గురికాగా మరొకరు రక్తపు మరకలతో లాడ్జీలో నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన లాడ్జీ మేనేజరు సమీపంలోని రెండవ పట్టణ సిఐ సిఎం గంగయ్యకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని మదనపల్లె డిఎస్‌పి రాఘవరెడ్డి, సిఐ గంగయ్య, ఎస్‌ఐలు గంగాధర్, సూర్యనారాయణ పరిశీలించారు. డిఎస్‌పి రాఘవరెడ్డి కథనం ప్రకారం మదనపల్లె పట్టణం విజయనగర్‌కాలనీ పై భాగంలోని సిమెంట్‌రోడ్డు వీధికి చెందిన ఆకుల రమణ బెల్టుషాపు నడుపుకుని జీవనం సాగిస్తుండగా అతని కుమారుడు ఆకుల జగధీష్ అలియాస్ చిన్న(24) ఇతని స్నేహితుడు అదేప్రాంతానికి చెందిన గంగాధర్(25) వ్యాపారం చేసుకుంటుండేవారు. ఈ నేపథ్యంలో వీరిరువురు బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక లాడ్జీలో గదిని అద్దెకు తీసుకుని ఇద్దరు మద్యం సేవించారు. ఆర్థిక లావాదేవీలపై చర్చించుకుంటు వాదనకు దిగి అనంతరం ఘర్షణపడ్డారు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో జగధీష్‌ను గట్టిగా పట్టుకున్న గంగాధర్ అతని వద్ద ఉన్న కోడి పందాల కత్తెతో గొంతుకోసి హతమార్చాడు. రక్తపు మరకలతో లాడ్జీ నుంచి గంగాధర్ పరారయ్యాడు. హత్యకు గల కారణాలు విచారణలో తేలాల్సివుందని డిఎస్పీ, సిఐ తెలిపారు. కోడి కత్తులు ఇద్దరి మధ్య ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సిఎం గంగయ్య తెలిపారు.
రూ. 20 లక్షల విలువైన స్పిరిట్ లారీ పట్టివేత
ముగ్గురు అరెస్ట్
పలమనేరు, ఫిబ్రవరి 21: పలమనేరు పట్టణ సమీపంలోని నాగమంగళం వద్ద 20 లక్షల రూపాయల విలువ చేసే స్పిరిట్ లారీని, స్పిరిట్‌ను తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 2 లక్షల 80 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పలమనేరు ఇన్‌చార్జి డిఎస్పీ రాఘవారెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నైకి వెళుతున్న ఒక ట్యాంకర్ లారీని తనిఖీ చేయగా అందులో స్పిరిట్ ఉన్నట్టు కనుగొన్నామని, దీంతో లారీలో ప్రయాణిస్తున్న శివకుమార్, నాగరాజు, ఈశ్వర్‌లను అరెస్టు చేసి, వీరి వద్ద నుండి 2 లక్షల 80 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
తెలుగు భాష అమలుకు ఉద్యమ స్ఫూర్తి అవసరం
యుజిసి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయం
తిరుపతి, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో అధికార భాషగా తెలుగు అమలు చేయడానికి ఉద్యమ స్ఫూర్తి అవసరమని రాజ్యసభ మాజీ సభ్యుడు, యుజిసి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. గురువారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం, తెలుగు అమలుకు ముఖ్యమంత్రి, న్యాయ వ్యవస్థ, డిజిపి, కార్మిక శాఖ కమిషనర్ తదితరులు ఉత్సాహం, చొరవ చూపడం, తమ తమ కార్యాలయాల్లో, విభాగాల్లో తెలుగు అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అభినందనీయమన్నారు. తెలుగు అమలుకు మానసికంగా, సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందుల మాదిరిగానే జాతీయ స్థాయిలో అధికార భాష హిందీ అమలుకు అదేరకమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అధికార భాషగా తెలుగు అమలుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అధికార భాషా సంఘానికి ప్రత్యేక అధికారాలూ కల్పించాలన్నారు. తెలుగు అమలు చేయని పక్షంలో చర్యలు తీసుకోవడానికి అధికార భాషా సంఘానికి అధికారాలు ఎంతైనా అవసరమన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలలోని తెలుగు విభాగాలు నన్నయ, తిక్కన, తెలుగు వ్యాకరణం, చందస్సులకే పరిమితం కాకుండా, తెలుగు సాంకేతిక పారిభాషిక శబ్దాలను తయారు చేసే పరిశోధన కేంద్రాలుగా మారాలన్నారు. తెలుగు భాష సాంకేతిక భాషగా, ఆధునిక భాషగా మార్పు చేయడానకి గట్టి కృషి చేస్తేనే లక్ష్యాన్ని చేరగలమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో తెలుగు విభాగం లేదని, వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయమైన రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో తెలుగు విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీని వల్ల తెలుగు, సంస్కృతం తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
సిడిసిఎంఎస్ చైర్మన్ పదవి టిడిపి కైవసం
* అధ్యక్షునిగా శ్యామ్‌రాజు, ఉపాధ్యక్షునిగా వరలక్ష్మి
చిత్తూరు, ఫిబ్రవరి 21: నాటకీయ పరిణామాల మధ్య చిత్తూరు సహకార మార్కెటింగ్ సంఘం అధ్యక్ష పదవి ఎట్టకేలకు తెలుగుదేశంపార్టీ కైవసం చేసుకుంది. సిఎం సొంత జిల్లాలో సిడిసిఎంఎస్ పదవి కోసం టిడిపి, వైఎస్సార్‌సిపి, కాంగ్రెస్ పార్టీలకు హోరాహోరీ పోరు జరిగినా ఎన్నికల ముందే వైఎస్సార్‌సిపి ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించడంతో సిడిసిఎంఎస్ ఎన్నికల్లో టిడిపి మాత్రమే నామినేషన్ వేసింది. కాంగ్రెస్ పార్టీకి సిడిసిఎంఎస్‌లో పోటీ చేసేందుకు బలం లేకపోవడంతో టిడిపి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. దీంతో నామినేషన్లు వేసిన శ్యామ్‌రాజు ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఎ.వరలక్ష్మి ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షులు శ్యామ్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో రైతాంగ సమస్యలపై తక్షణం స్పందిస్తూ పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామన్నారు. సిడిసిఎంఎస్ అభివృద్ధికి తమ పాలక వర్గం కృషి చేస్తుందని తెలిపారు.