కడప , ఫిబ్రవరి 21 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం రాత్రి జరిగిన పేలుళ్ల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యగా ఎస్పీ మనీష్ కుమార్ సిన్హా జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పోలీసు అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణాల్లోని లాడ్జిల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అధికారులు తమ సిబ్బందితో సహా అప్రమత్తంగా ఉండాలని, నిరంతర గస్తీలతో అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమానితులను, అపరిచిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని ఆదేశించారు. ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కీలకమైన ప్రాంతాల్లో బందోబస్తును పటిష్టం చేయాలన్నారు.
దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి
* అధికార పార్టీకి వైకాపా నేతల సవాల్
కడప, ఫిబ్రవరి 21 : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి, రాష్టప్రతి పాలనలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైకాపా నేతలు మాజీ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ కె సురేష్‌బాబు మాట్లాడుతూ అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ప్రభు త్వం రాష్ట్రంలో సహకార ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో 75 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వాటిలో 22 సొసైటీలు వైకాపా మద్దతుదారులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. మిగిలిన 54 సొసైటీలకు జరిగిన ఎన్నికల్లో 28 స్థానాలు వైకాపా మద్దతుదారులు గెలుపొందారన్నారు. 6 సొసైటీలకు నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరు పది ఓట్లు వేయాల్సి ఉంది. అయితే కొందరు దురద్దేశ్యంతో వారే ఓట్లు వేశారని ఆరోపించారు. టిడిపి, కాంగ్రె స్ కుమ్మక్కై ఈ వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపించారు. 19వ తేదీనే డిసిసిబి స్థానానికి చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉండగా, పలురకాల సాకులతో వాయిదా వేయడం బాగులేదన్నారు. ఎన్నికల అధికారిని కిడ్నాప్ చేసిన విషయం ఉన్నతాధికారులకు తెలియదా?, ముందుగానే ఎన్నికల అధికారికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. మొదటగా గురువారం ఎన్నికలు నిర్వహిస్తామని నోటీసులు ఇచ్చారు. అయితే గురువారం కూడా ఎన్నికలను వాయిదా వేయడంపై ప్రభుత్వ అసమర్థత బయటపడుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎంపిటిసి, జడ్పీటిసి స్థానాలను రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం వైకాపానే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాంధీ అండబలం చూసుకునే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కిడ్నాపులు చేయడం, స్టేలు తెవడం లాంటివి చేస్తున్నారని ఆరోపించారు. 60 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవడమే తప్ప కేవలం 12 మందికి రక్షణ కల్పించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. త్వరలో ఎన్నికలు జరపకపోతే ఆందోళన తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు దుగ్గాయిపల్లె మల్లికార్జునరెడ్డి, అవినాష్‌రెడ్డి, తిరుపేల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఐదు మండలాల్లో ప్రభుత్వ మద్యం షాపులు
* ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయకుమారి
చెన్నూరు, ఫిబ్రవరి 21 : జిల్లాలో ప్రభుత్వం తరుపున ఐదు మండలాల్లో మద్యం షాపులను ప్రారంభిస్తున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయకుమారి తెలిపారు. జిల్లాలో తొలిసారిగా చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె గ్రామంలో గురువారం ప్రభుత్వ మద్యం షాపులను కమిషనర్ విజయకుమారి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శేషారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో చెన్నూరు, ఓబులవారిపల్లె మిగతా మూడు మండలాల్లో ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ మద్యం షాపులకు ధీటుగా ప్రభుత్వ మద్యం షాపులు పని చేస్తాయన్నారు. ఈ షాపుల్లో ఎమ్మార్పీ రేట్లకే మద్యాన్ని విక్రయించనున్నట్లు తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎక్సైజ్ పర్యవేక్షణలో ఈ మద్యం షాపులు నడుస్తాయన్నారు. మద్యం షాపుల్లో పని చేసే వారిని ఔట్‌సోర్సింగ్ కింద నియమకం చేయనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క మద్యం షాపులో సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్లు ఉంటారన్నారు. వీరిలో సూపర్‌వైజర్లకు 12వేలు, అసిస్టెంట్ సూపర్‌వైజర్‌కు 9 వేలు, సేల్స్‌మెన్లకు 7 వేలు వంతున ప్రభుత్వం వేతనం చెల్లిస్తుందన్నారు. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులు 50 వేల నుంచి రెండున్నర లక్షల వరకు క్యాటగిరిని బట్టి డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ తిరుపతయ్య, ఎస్సై శ్రీనివాసులు ఎక్సైజ్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
మళ్లీ వాయిదా
* 28న డిసిసిబి ఎన్నికలు
కడప, ఫిబ్రవరి 21 : నాటకీయ పరిణామాలతో డిసిసిబి ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. నాలుగు రోజులుగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికలను వారం రోజులు వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 28వ తేదీ ఎన్నికలు జరపాలని సూచించింది. ఇదిలావుండగా ఈ నెల 19న జరగాల్సిన ఎన్నికలు రెండుసార్లు స్థానిక సంఘటనలతో వాయిదా పడ్డాయి. బుధవారం పరిణామాలతో ఎట్టి పరిస్థితుల్లోను గురువారం డిసిసిబి అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటించారు. దీనికి సంబంధించి కలెక్టర్ సిఫార్సు మేరకు మెప్మా అధికారి వెంకటసుబ్బయ్యను ఎన్నికల అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలో పరిస్థితిపై వచ్చిన నివేదికతో శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివెనుక అధికార పార్టీ నేతల వత్తిడి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కడప డిసిసిబి ఎన్నికలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనకు సన్నిహితంగా మెలుగుతున్న కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి డిసిసిబి అధ్యక్ష పదవిని తన కమారుడికి కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే పకడ్బందీగా పావులు కదుపుతున్నా ఫలితాలు అనుకూలంగా రావడం లేదు. ఓ పక్క మంత్రులు దూరంగా ఉండడం మరోపక్క వైకాపా వ్యూహాత్మకంగా అధికార పార్టీ ఎత్తులను తిప్పి కొట్టడంతో డిసిసిబి అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి కావాల్సిన మెజారిటీ రావడం లేదు. దీనితో ప్రస్తుతానికి ఎన్నికలు వాయిదా వేయించి నిర్ణయించిన తేదీలోగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. ఈ వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడంతోపాటు, రిజర్వు కేటగిరీలో ఉన్న డైరెక్టర్ పోస్టుల భర్తీని కూడా తమకు అనుకూలంగా ఉండేలా ముందుగానే చక్కబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ఆప్కాబ్ ఎన్నికలు తమకు అనుకూలంగా లేకపోతో కడపతో ముడిపెట్టి సాధించుకోవాలని కూడా పాచిక వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హక్కులు అడిగితే హత్యలా?
* సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య
కడప , ఫిబ్రవరి 21 : హక్కులు కావాలని అడిగితే హత్యలకు పురిగొల్పుతారా? అంటూ ప్రభుత్వంపై సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మొదటి రోజున హర్యానా రాష్ట్రంలో రోడ్డు రవాణ సంస్థ కార్మికులు చేపట్టిన ఆందోళనలో ఎఐటియుసి నాయకుడు నరేంద్రసింగ్ హత్యపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక చెన్నూరు బస్టాండు నుండి ఏడు రోడ్లకూడలి వరకు సిపిఐ, అనుబంధ సంస్థలు చేపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపిఎ నిరకుంశ పాలనకు ఈ సంఘటన ఉదాహరణ అన్ని విమర్శించారు. మన దేశం ప్రజా స్వామ్య దేశమైనప్పటికీ హక్కులు కాలరాయబడుతున్నాయని ప్రభుత్వమే హత్యలకు పాల్పడితే ఇక ప్రజా స్వామ్యాన్ని ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. ఈ సంఘటనను అభ్యుదయ వాదులు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని వారు కోరారు. ఈ దేశంలో సంపద సృష్టిస్తున్న శ్రామిక జనానికి కావాల్సిన కూడు, గూడు, గుడ్డ కరువయ్యాయని మక్కెలిరగతున్నుతామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఆదాయానికి శ్రమించే వారికి రావాల్సిన వాటా వారికి దక్కడం లేదని వాపోయారు. దేశ సంపదను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్న కార్పొరేట్ అధిపతులకు రాయితీలు కల్పించే ప్రభుత్వం శ్రామిక ప్రజలకు సంక్షేమం కాని వారి భద్రత గాని పట్టడం లేదని ఆరోపించారు. అధిక ధరలు,విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు,కనీస వేతనాలు కల్పించాలని చేపట్టిన సమ్మెను విఫలం చేయాలని పాలక ప్రభుత్వాలు విఫల యత్నం చేశారని, అయినా సమ్మె విజయవంతం అయిందంటే సమస్యల యొక్క తీవ్రతను అర్థం చేసుకోకుండా హత్యలకు పాల్పడడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలొ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య, నగర కార్యదర్శి జి చంద్ర, కార్యదర్శి టి బాలసుబ్రమణ్యం , ఏఐటియుసి నగర నాయకులు కె మల్లికార్జునరెడ్డి, జి వేణుగోపాల్, రైతు సంఘ నాయకుడు రామసుబ్బారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ గంగాసురేష్, విజయలక్ష్మీ, రమణ, బాదుల్లా వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
పోలీసు, ప్రెస్ స్టిక్కరింగ్‌లపై చర్యలు
* ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా
జమ్మలమడుగు, ఫిబ్రవరి 21 : త్వరలో పోలీసు, ప్రెస్ స్టిక్కరింగ్‌లపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మనీష్‌కుమార్ పేర్కొన్నారు. సాధారణ పరిశీలనలో భాగంగా గురువారం డిఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. జమ్మలమడుగు సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాలపై డిఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాక్షన్ నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇసుక అక్రమ రావాణా అరికట్టే విషయంపై తమ సొంతశాఖ పనులే తమకు సరిపోతున్నాయన్నారు. పోలీసు స్టిక్కరింగ్ విషయంపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మీడియాతో సంబంధం లేని వ్యక్తులు ప్రెస్ స్టిక్కరింగ్‌పై చర్యలు త్వరలో తీసుకుంటామన్నారు. 2013 అక్రిడిటేషన్ జాబితా ప్రకారం విలేఖరులకు ప్రెస్ స్టిక్కరింగ్ జారీచేసి ప్రెస్ స్టిక్కరింగ్ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ జాన్‌మనోహర్ వున్నారు.
రాజంపేట కాంగ్రెస్‌లో అనైక్యత..!
* డిసిసిబి ఎన్నికల్లో బహిర్గతమైన విభేదాలు
రాజంపేట, ఫిబ్రవరి 21 : రాజంపేట కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల మధ్య అనైక్యత నెలకొంది. నియోజకవర్గంతో రెండు దశాబ్దాల నుండి సన్నిహిత సంబంధాలు కలిగిన మంత్రి సి.రామచంద్రయ్యకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మేడా మల్లికార్జునరెడ్డిల మధ్య గత కొంతకాలంగా సయోధ్య కరవైంది. ఈ నియోజకవర్గానికి చెందిన అనేకమంది ముఖ్యనేతలతో మంత్రి సిఆర్‌సికి నేరుగా సంబంధాలున్నాయి. ఒక దశలో ఈ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఒత్తిడి కూడా సిఆర్‌సిపై ఆయన వర్గీయుల నుండి వచ్చింది. ఇకపోతే మేడా మల్లికార్జునరెడ్డికి మంత్రి సిఆర్‌సికి మధ్య ఇటీవల సంబంధాలు చెడాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపధ్యంలో డిసిసిబి ఎన్నికల్లో ఈ అంశానికి బలం చేకూరేలా స్వయంగా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి వ్యాఖ్యలు చేయడం విశేషం. నందలూరు సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడిగా గత ఎన్నికల్లో విజయం సాధించి డిసిసిబి డైరెక్టర్‌గా కూడా మేడా మల్లిఖార్జునరెడ్డి పనిచేశారు. అయితే నందలూరు సహకార సంఘం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ వాయిదా పడేందుకు మంత్రి సి.రామచంద్రయ్య కారణమని మేడా వర్గీయుల ఆరోపణ. కడప డీసీసీబి అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాల నేపధ్యంలో పోటాపోటీ వాతావరణం ఏర్పడిన నేపధ్యంలో ఈ విషయాన్ని స్వయంగా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రస్తావిస్తూ నందలూరు సొసైటీని మేడా మల్లిఖార్జునరెడ్డి వర్గం సులభంగా దక్కించుకునే అవకాశాలను ఈ ఎన్నిక వాయిదా వేయించడం ద్వారా దెబ్బతీశారని మంత్రి సిఆర్‌సిపై ఆరోపణలు గుప్పించడం జరిగింది. నందలూరు సొసైటీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకొని ఉంటే డిసిసిబి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడేయన్నది వీరశివారెడ్డి వాదన. నందలూరు లాంటి సొసైటీ సులభంగా విజయం సాధించే అవకాశాలను దెబ్బతీశారని బహిరంగంగా వీరశివారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మంత్రి సిఆర్‌సికి మేడా మల్లికార్జునరెడ్డిల మధ్య సయోధ్య కరవైందన్న ఆరోపణలకు వీరశివారెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లైంది. జిల్లా మంత్రులపై వీరశివారెడ్డి ధ్వజమెత్తిన నేపధ్యంలో నందలూరు సొసైటీ వాయిదా అంశంపై అందరి దృష్టి పడింది. మొత్తానికి డీసీసీబి ఎన్నికలను ప్రక్కనుంచితే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో సిఆర్‌సికి చెందిన సామాజికవర్గం ఓటర్ల అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిఆర్‌సి అండ లేకుండా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కడం చాలా కష్టం. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ బలిజ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేసినా కేవలం సిఆర్సీ వల్లే ఆ వర్గం ఓట్లు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. ఈ పరిస్థితుల్లో రాజంపేటలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల మధ్య నెలకొన్న విభేదాలు ఆ పార్టీకి నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌పార్టీలో ముఖ్యనేతల మధ్య సయోధ్య కుదరకపోతే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలం గా ఉండవన్నది రాజకీయ విశే్లషకుల వాదన. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి తరువాత సా థనంలో ఉండిన సి.రామచంద్రయ్యకు టిడిపిలో ఉన్నప్పటి నుండి రాజంపేట నియోజకవర్గంతో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మొత్తానికి మేడా మల్లిఖార్జునరెడ్డి, మంత్రిల మధ్య పొసగని సయోధ్య రానున్న రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంపై తీవ్ర ప్రభావానే చూపే పరిస్థితి లేకపోలేదు. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం చిరంజీవి పార్టీ పెట్టనంతవరకు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. చిరంజీవి పార్టీ రాకతో ఈ వర్గం తెలుగుదేశం పార్టీకి దూరం కావడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి అగమ్యగోచరంగా మారింది. చివరికి ఉప ఎన్నికల్లో బలిజ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల మధ్య నెలకొన్న అనైఖ్యతను తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలుగుదేశం పార్టీ, వైకాపాలు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఏర్పడకుంటే నియోజకవర్గంలో అధికార పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
అర్హులందరికీ భూములు చూపిస్తాం
* రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతీమీనా
బ్రహ్మంగారిమఠం, ఫిబ్రవరి 21: మండలంలోని నాగిశెట్టిపల్లె, పెద్దిరాజుపల్లె గ్రామ పంచాయతీల్లోని అన్ని గ్రామాల ప్రజల్లో అర్హులైన ప్రజలందరికీ డికెటి పట్టాలను ఇచ్చి సర్వే చేసిన భూములను లబ్ధిదారులకు చూపిస్తామని రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతీమీనా ప్రజలకు హామీ ఇచ్చారు. గురువారం మండలంలోని పెద్దిరాజుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయా పంచాయతీల ప్రజలందరితో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయా ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలందరే ముందే గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం లబ్దిదారులను గుర్తించేందుకోసం వారికి సంబంధించిన గుర్తింపు కార్డులు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులను చూపించాలని ఒక్కొక్కరి పేరువద్ద ఆధారాలను చూస్తూ టిక్కులు వేసుకున్నారు. వీరి విచారణలో అనేక మంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల అదీనంలో భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వీలైనంత త్వరలో అర్హులైన అందరికి భూములను చూపిస్తామని ప్రీతిమినా తెలిపారు. అర్హులైన లబ్దిదారుల నుండి ఇంత వరకు భూముల కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉంటే శుక్రవారం సాయంత్రం లోగా స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళి తహశీల్దార్‌కు దరఖాస్తులు ఇవ్వాలని ఆమె ఈసందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లవన్న, ఎడి హరికృష్ణ, తహశీల్దార్ నాగేశ్వర్‌రావుతోపాటు ఇతర రెవెన్యూ సిబ్బంది, ప్రజలు సర్వేయర్లు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
* స్పెషల్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు
చక్రాయపేట, ఫిబ్రవరి 21 : తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మండల స్పెషలాఫీసర్ వేంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం మండలంలో బాల తిమ్మయ్యగారిపల్లె, సురభిరెడ్డివారిపల్లె, గంగారపువాండ్లపల్లె, బురుజుపల్లె, గొట్లమిట్ల తదితర గ్రామాల్లో అధికారుల బృందం సుడిగాలి పర్యటన చేసింది. ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కరించడంతో భాగంగా గ్రామంలో నీరు లేకపోయినప్పటికీ పక్కన వ్యవసాయ బోరు నుండి అయినా సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రైతులు అభ్యంతరం చెప్పినట్లయితే అవసరమైతే సీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కావున ప్రస్తుతం తాగునీటి పరిష్కారం కోసం వ్యవసాయ బోరు నుండి అయినా అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ నరసింహులు, ఎపిఓ సురేంద్రనాథరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ శివప్రసాద్ పాల్గొన్నారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రాజంపేట రూరల్ ఫిబ్రవరి 21: రాజంపేట అటవీశాఖ పరిధిలోని నందలూరు చెక్‌పోస్టు వద్ద అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్టు రేంజర్ టివైఎన్ గౌడ్ తెలిపారు. అక్రమ రవాణా సమాచారం అందడంతో భువనగిరిపల్లె అర్చి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎపి 26 హెచ్ 7456 అనే నెంబర్ గల స్కార్పియో వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ వాహనంపై అనుమానం వచ్చి నందలూరు చెక్‌పోస్టుకు సమాచారం అందించారు. అక్కడకు వెంటాడి వెళ్లి వాహనంను పట్టుకుని, అందులోని 36 ఎర్రచందనం దుంగలు, ప్రొద్దుటూరుకు చెందిన నందకుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని, డ్రైవర్ రంగస్వామి పరారైనట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ఎఫ్‌ఎస్‌ఓ చంద్రకళ, ఎఫ్‌బిఓ కేశవరెడ్డి, రాజశేఖర్, ఎబిఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు : మండలంలోని బాలపల్లె అటవీశాఖ పరిధిలోని వాగేటికోన సమీపంలో గురువారం రూ. 5 లక్షల విలువ చేసే 45 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు బాలపల్లె అటవీశాఖ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అటవీ సంరక్షణకు సిబ్బంది వెళుతుండగా అనుమానస్పదంగా తిరుగుతున్న వాహనాన్ని పట్టుకోగా, అందులోని స్మగ్లర్లు పరారుకాగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఒంటిమిట్టలో...
ఒంటిమిట్ట : కడప - రాజంపేట హైవేలోని ఒంటిమిట్ట చెరువుకట్ట మలుపు వద్ద గురువారం క్వాలిస్ వాహనంతో సహ 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ అజాద్ తెలిపారు. అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లగా వాహనంలో 50 వేల విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
పోరుమామిళ్లలో...
పోరుమామిళ్ల : మల్లెపల్లె పోరుమామిళ్ళ ఫారెస్టు రేంజ్ పరిధిలోని మల్లెపల్లె బీటు ముచ్చెర్లగడ్డ వద్ద అక్రమంగా తరలివెళ్లేందుకు ఉంచిన 90 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నట్లు మల్లెపల్లె బీటు ఆఫీసర్ రవీంద్రకుమార్ తెలిపారు. కడప స్పెషల్ స్క్వాడ్ బృందంతో దాడులు నిర్వహించగా అక్రమంగా తరలి ఉంచిన దుంగలను స్వాదీనం చేసుకొని పోరుమామిళ్ళ ఫారెస్టు కార్యాలయానికి తరలించామన్నారు.