న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయంత్రం సంభవించిన జంట పేలుళ్ల సంఘటనతో నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (ఎన్‌సిటిసి) ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్‌సిటిసి ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కోరారు. శుక్రవారం పార్లమెంటు వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉగ్రవాద సవాళ్లకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం సలపటానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క తాటిపైకి రావాలని ఖుర్షీద్ పిలుపునిచ్చారు. మనల్ని వెంటాడుతున్న ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవాల్సిన ఉమ్మడి బాధ్యత రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పాలనలో భాగస్వాములైన వారందరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌సిటిసిని ఏర్పాటు చేస్తే తమ హక్కులు కేంద్రం వశమవుతాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయని మంత్రి ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. దీని వల్ల తమకేమి ప్రయోజనమనే సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి విస్తృత జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ పేలుళ్లతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపులకు సంబంధముందా? అని ప్రశ్నించగా.. దర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని, ఇలాంటి ఘటనలను ఇదివరకు కూడా చూశామని ఆయన బదులిచ్చారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న మితిమీరిన రాజకీయ వాచాలత్వం ఈ పేలుళ్లకు కారణమా? అని ప్రశ్నించగా.. ఇది మొత్తం సమాజానికి సంబంధించిన అంశమని, కేవలం రాజకీయ ప్రసంగాలకు సంబంధించింది కాదని మంత్రి బదులిచ్చారు. మన నిజమైన శతృవు మళ్లీ మళ్లీ ప్రయోజనం పొందుతున్నాడని, అయితే మనం పరస్పరం విమర్శించుకోవడం వల్ల, పరస్పరం పోట్లాడుకోవడం వల్ల నష్టపోతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాద సవాళ్లకు అదే పరిష్కారం... పార్టీలు, ప్రభుత్వాలకు ఖుర్షీద్ పిలుపు
english title:
n
Date:
Saturday, February 23, 2013